Wednesday, 19 July 2017

చివరి ప్రకరణం - నతవాడి సీమ లో వివిధ మతాల ప్రభావ ప్రాభవాలు.చివరి ప్రకరణం
       

      నతవాడి సీమ లో వివిధ 
   మతాల ప్రభావ  ప్రాభవాలు.

                            నతవాడి సీమ లో బౌద్ధ ,జైన శైవమతాలు ఆయా కాలాల్లో తమ విశ్వరూపాన్ని ప్రదర్శించాయి. ఏటూరు లో లభించిన జైన విగ్రహం   ఈ ప్రాంతం లో విశేషం గా ప్రచారమై, ప్రసిద్దికెక్కిన  జైనమతానికి ప్రత్యక్ష నిదర్శనం. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు పాడు అనే పదం జైన మత ప్రభావ గ్రామాలకు చివర్లో వస్తుందని గుర్తుచేసుకుంటే చింతలపాడు ,చందర్లపాడు, బొబ్బిళ్ళపాడు, తక్కెళ్లపాడు, విభరింతలపాడు, ముండ్లపాడు,ధర్మవరప్పాడు, శనగపాడు, కాండ్రపాడు,లింగాలపాడు , ఇవన్నీ నందిగామ,చందర్లపాడు మండల పరిధి లోని గ్రామాలే. మునుల ఏరు అనేదే మునేరు అయ్యిందని విజ్ఞుల అభిభాషణ.
                                            
                           ఏటూరు లో లభించిన  జైన విగ్రహం వర్ధమాన మహావీరుని ది గా గుర్తించబడింది. ఈ విగ్రహాన్ని బుద్దవిగ్రహం గా స్ధానికులు భావించారు . పాటిమట్టి దిబ్బల్లో శిరస్సు, మొండెము వేరు వేరు గా దొరికిన విగ్రహాన్ని ఒకటి చేసి  హైస్కూలు ఆవరణ లో దిమ్మకట్టి దానిపై ప్రతిష్టించారు గ్రామస్దులు.ఐదడుగుల  పదంగుళాల ఎత్తైన పీఠం మీద నాలుగడుగు

                                             -95-

      ఎత్తుగల్గి స్ధిరాసనం లో కూర్చొన్న  వర్ధమాన మహా వీరుని ఈ విగ్రహాన్ని  చూచి బుద్దవిగ్రహం గా  భ్రాంతి పడ్డారు స్థానికులు. కాని కృష్ణాగెజిట్ లోని 235 వపేజి ఈ సందేహాలకు సమాధాన మిస్తుంది. విశాలమైన నేత్రాలతో ముంగురులు కల్గిన జుట్టుముడి, విశాలమైన వక్షస్థలాన్ని కప్పుతూ వల్లెవాటు  ,   ఎడమ చేతి లో  కుడిచేతిని అరచెయ్యి పైకి కనబడేటట్లు  ఉంచి, శిరస్సు  చుట్టు పరివేషము తో స్థిరాసనం లో కూర్చొన్న ఈ మూర్తి  యొక్క డిచేయి బొటన వ్రేలు ,ఎడమ చేయి కొంతభాగము విరిగిపోయాయి. నల్లరాతి విగ్రహము తల ,మొండెము వేరువేరు గా లభిస్తే వాటిని ఒకచోటికి చేర్చారట గ్రామస్థులు. విగ్రహం అరచేతులు పాదాలపై చక్రాచిహ్నాలు చెక్కబడ్డాయి. ఇది జైనమత సాంప్రదాయం.
ఇక బౌద్ధమత విషయానికొస్తే  జగ్గయ్యపేట ,రామిరెడ్డిపల్లి బౌద్ధస్తూపాలు  చరిత్ర ప్రసిద్ది గన్నవే. జగ్గయ్యపేట బౌద్ధస్తూపం అమరావతీ స్తూప నమూనా లో నిర్మించబడ్డ అద్భుత కట్టడం. బౌదస్తూపాలను వాటిలక్షణాలను బట్టి మూడు రకాలు గా విభజించారు.
1. శరీరక స్తూపాలు.                 2.పారభోగిక స్తూపాలు.             3.ఉద్దేశిత స్తూపాలు.
శరీరక స్తూపాల్లో బుద్ధధాతువుల్ని నిక్షేపిస్తారు.పారభోగిక స్తూపాల్లో బుద్ధ సంబంధ మైన వస్తు విశేషాలను నిక్షేపిస్తారు. ఉద్దేశితస్తూపాలు బుద్ధుని ఉనికి చేత పవిత్రమైన స్థల నిర్మాణాలు. వీనిలో జగ్గయ్యపేట స్తూపం పారభోగిక స్తూపం గా చరిత్రకారులచేత గుర్తించబడింది.రామిరెడ్డిపల్లి బౌద్ధచైత్యం తవ్వకాలలో వెలుగుచూసింది. ఇది మహాచైత్యం గా గుర్తించబడింది. ఇచ్చటి తవ్వకాలలో 22కారట్లకంఠహారం లభించింది. ధర్మవరప్పాడు ,బూదవాడ , పోలంపల్లి, మునగచర్ల బౌద్ధమత శిథిలాలు లభించిన ప్రదేశాలే.
           శైవమతం ఈ ప్రాంతం లో పాదూనుకొని నిల్చి అన్యమతాలను త్రోసిరాజంది.చాగిపోతరాజు ముక్త్యాల లో ముక్తేశ్వరుని ప్రతిష్టించి.ఉత్తరవాహిని యైన కృష్ణాతీరం లో శైవమతాన్ని

                                                  -96-
రక్షించాడు.శైవ వైష్ణవక్షేత్రాలైన ముక్త్యాల వేదాద్రి బౌద్దమతాన్ని ఈ ప్రాంతాన్నుంచి పారద్రోల యత్నించాయి. ఈ రెండు పుణ్యక్షేత్రాలకు కేవలం రెండు మూడు కిలోమీటర్ల దూరం లోనే ధనంబోడు గా పిలువబడే జగ్గయ్యపేట బౌద్ధస్తూపం ఉంది. గుడిమెట్ట లో విశ్వేశ్వర దేవ ప్రతిష్ట మొదటి పోతరాజుది. ఈ నాటిక ఇక్కడ కొండపైన  శివాలయం పునర్నిర్మించబడి భక్తులచే సేవించబడుతోంది. అంతేకాదు .కాండ్రపాడు పాటిమట్టి దిబ్బల్లో వెలుగు చూసిన పంచముఖ శివలింగం ఈ ప్రాంతం లో పరిఢవిల్లిన శైవమతోద్యమానికి ఎగురేసిన విజయపతాక. ఈ విధమైన విశిష్ట  శివలింగం  చిత్తూరు జిల్లాలోని  (ఒకప్పటి మద్రాసురాష్ట్రం) గుడిమల్లం అనే గ్రామం లో కన్పిస్తోంది. ఐదడుగుల ఎత్తుగల ఈ శివలింగం మీద పరశువు ధరించిన మూర్తి చెక్కబడింది. పూర్తి వివరాలకోసం “DIVYAKSHETRALU.BLOGSPOT.COM ” గుడిమల్లం వ్యాసాన్ని చూడవచ్చు.
                                      ఇక నతవాడి సీమ లో మున్నలూరు నుండి మునగానపల్లి వరకు ప్రతిఊరు లోను ఒక ప్రాచీన శివాలయం కన్పిస్తుంది. అంతేకాదు పంచనారసింహక్షేత్రమైన వేదాద్రి లోనే పంచ శివలింగప్రతిష్ట జరిగి పూజలు నిర్వహించబడ్డాయంటే ఇచ్చట శైవమత ప్రాబల్యాన్ని మనం  గమనించవచ్చు. ఇచ్చటి  ముప్పాళ రామేశ్వరుని నుండి మునగానపల్లి భీమేశ్వరుని వరకు చాగి వారిచ్చిన, వేయించిన దానశాసనాలన్నీ శివార్పణాలు గా శివాలయాలోనే ఎక్కువ కన్పిస్తాయి.. వేదాద్రి మాత్రం  దీనికి కొంచెం భిన్నంగా కన్పిస్తోంది.  అలాగే మాగల్లు వేణుగోపాలస్వామి మండపం లోని శాసనం. వేదాద్రి లో మనుమచాగి గణపతి దేవుడు వేయించిన దాన శాసనం లో అతను  ప్రతాప నరసింహదేవరకు ఇచ్చిన భూదాన ప్రసక్తి ఉంది. శివుడైనా, చెన్నకేశవుడైనా  సమానం గా ఆరాధించగల మతసామరస్యం అనంతర కాలం లో  అలవడింది.
పెనుగంచి ప్రోలు నంది ఆనాటి కాకతీయుల  శివభక్తి కి ప్రతీక. కాకతీయ సామంతులు గా చాగివారు నిర్మించిన

                                        -97-
శివాలయ అవశేషమే ఈనాడు పెద్దబజారు లో కన్పించే మసీదు. చాగిరాజులు శైవులైనా వైష్ణవమతాన్ని సైతం సమానం గా గౌరవించారు.  గుడిమెట్ట చోడనారాయణ ,మాగల్లు వేణుగోపాల ,  ముక్త్యాల చెన్నకేశవ , గుడిమెట్ట కృష్ణాతీరం లోని చెన్నకేశవ, ద్వారకగుడి శ్రీ వేంకటేశ్వర ఆలయాలు వీరికాలం లో  నిర్మించబడ్డవే.
                      


                 నూటొక్క శివాలయాలు నిర్మించిన రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు కట్టించిన ఆలయాల్లో నందిగామ శివాలయం కూడ ఒకటి. ఇచ్చట వేంకటాద్రి నాయుడు వ్యవసాయక్షేత్రాన్ని దున్నిస్తుంటే నాగటి కర్రు కి పెద్ద నంది విగ్రహం తగిలిందని , ఆ ప్రాంతాన్ని పూర్తి గా తవ్వించగా పెద్ద నంది విగ్రహం బయల్పడిందని, దానిని బయటకు తీయడం సాథ్యం కాకపోవడం తో  ఆ ప్రాంతం లో శివాలయాన్ని నిర్మించి ,ఒక పెద్ద నంది ని ప్రతిష్ఠించారని , దాని మూలం గానే  ఈ ప్రాంతానికి నందిగామ అని పేరు వచ్చిందని స్థానికుల కథనం . కాని 12 వ శతాబ్దం నాటి శాసనాల్లోనే నందిగామ ప్రస్తావన ఉంది. ఇచ్చటి ఆలయాల్లో చెన్నకేశవాలయం అతి ప్రాచీనమైంది. ఈ గుడిలోని ఘంట  ప్రతాపరుద్రుని  దానం గా చెప్తుంటారు. ఈ విధం గా నతవాడి సీమ త్రిమత సంగమ క్షేత్రం గా విరాజిల్లింది.
                     ఆధునిక  చరిత్ర లోకి తొంగిచూస్తే  క్రీ.శ 1707 లో మొగలాయి చక్రవర్తి ఔరంగజేబు మరణించగానే దేశం లో హటాత్తు గా అరాచకం ప్రబలింది. ఆ సమయం లో నతవాడి సీమ లోని  నందిగామ ప్రాంతం లో సర్వాయి పాపడు అనే బందిపోటు  తన  అనుచరగణం తో కలిసి జాతీయ రహదారి పై విచ్చలవిడిగా దోపిడీలు ప్రారంభించాడు. ఈతని అకృత్యాల వలన కొంతకాలం హైదరాబాదు- విజయవాడ జాతీయరహదారి మూసివేయబడింది.  ఈ సమయం లో  హైదరాబాదు నైజాం ప్రభుత్వం నుండి ముబరజఖాన్ అనే సైనికాధికారి పెద్ద సైన్యంతో వచ్చి కొంగరమల్లయ్య గట్టువద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో సర్వాయి పాపని తుదముట్టించినట్లు చరిత్ర చెపుతోంది.(కృ.గె..42 పే)

                                                 -98-
                     ఉపసంహారము
  అనేక కాలాలుగా వివిధ సంస్కృతులను తనలో  కలుపుకొని , చరిత్ర లో నిలబడ్డ రాజ్యం గుడిమెట్ట. చాగి వారు త్యాగి వారై తుదకు సాగివారు గా కొనసాగుతున్న   సుదీర్ఘ చరిత్ర లో చాగి రాజ్యాన్ని శాసనాద్యాధారాల ద్వారా అక్షరాకృతి నందించడానికి చేసిన ప్రయత్నమిది.
            ఈ విషయం లో ఇది తొలి ప్రయత్నమే కాబట్టి రాబోయే  పరిశోధకులకు ఎంతో అవకాశం ఉంటుంది. 
                   ఈ గ్రంథాన్ని  ముద్రించకపోవడానికి కారణాన్ని   తొలిపలుకు లోనే చెప్పుకున్నాను. ఆ ఆలోచన కూడ చేయడం లేదు. గడిచిన రెండు  కృష్ణాపుష్కరాల్లోనూ ఈ పరిశోధనా గ్రంథం ఎంతోమందికి  సహాయకారి గా ఉండి , కొంత  ఆర్థిక , చారిత్రక ప్రయోజనాన్ని ఆ ప్రాంతానికి చేకూర్చింది. ఈ విషయాన్ని ఆ రంగం లో పనిచేసిన వారే చెబితే విని సంతోషించాను. ఇప్పటి వరకు  వందలాది Xerox కాపీలు ప్రజాసేవకుల ,పత్రికావిలేఖరుల  చరిత్ర అభిమానుల,పుస్తక ప్రియుల వద్ద కు చేరి అలరిస్తూనే ఉన్నాయి. కాని  కొంతమంది పరిశోధక విద్యార్థులు దూర ప్రాంతాలనుండి ఆ పుస్తకం కాపీ కావాలని ఫోనుచెయ్యడం ,నేను  ముద్రించలేదని చెప్పడం వారు నిరాశ కు లోనై , కనీసం బ్లాగు లో నైనా పెట్టమని ప్రాథేయపడటం ఈ మథ్య తరచుగా జరుగుతోంది.  నా పూర్వ విద్యార్థి ఒకరు తన  పరిశోధనా వ్యాసం లో ఈ పుస్తకాన్ని గురించి ఉటంకించాడని, అప్పటి నుండి తాను  గ్రంథం కోసం ప్రయత్నిస్తూ ,చివరకు నా ఫోన్ నెంబరు పట్టుకొని సంప్రదించారు  శ్రీశైలం నుండి ఒక సాహిత్యాభిమాని.  ఆనాడు ఆ ఫోను వచ్చినప్పుడు నేను చెపుతున్న రొటీన్ సమాథానం వింటున్న నాప్రక్కనే ఉన్న ఒక ఆత్మీయుడు పోనీ . ముద్రించక పోయినా బ్లాగు లో  


                                             -99-
నైనా పెట్టవచ్చు కదా అంటూ ఒక మాట అంటించారు. వయసు తో పాటు కొన్ని అవలక్షణాలు కూడ వస్తాయి కదా. లౌకిక విషయాల మీద అనాసక్తి , నిస్పృహ వానిలో కొన్ని.  అప్పుడు ఏ మూడ్ లో ఉన్నానో గాని  ఆ ప్రయత్నం మొదలు పెట్టి... ఇప్పటికి పూర్తిచేసాను. ఇది ఏ కొద్ది మందికి ఉపయోగ పడ్డా సంతోషమే కదా. ఈ పేరా లో కొంతమంది పేర్లు ప్రస్తావించే  అవసరం వచ్చినా దాన్ని  దాటేశాను కారణం సహృదయులకు తెలుసు. కాలం అనంతమైంది.భూమండలం విశాలమైంది అన్నాడు మహాకవి భవభూతి. మహాకవులు,  మంచి గ్రంథాలు ఈ భూమి పై నిరంతరంగా వస్తూనే  ఉంటాయి.**********************************************

Saturday, 20 May 2017

పంచమ ప్రకరణం .- నతవాడి సీమ లో చాగి వారి శాసనాలు - పరిశీలన

 పంచమ ప్రకరణం

                                     నతవాడి సీమ లో
                             


              చాగి వారి శాసనాలు    -       పరిశీలన                                       
                                      నతవాటిసీమ  అని నాథవాటి సీమ అని పిలువబడ్డ కృష్ణాజిల్లా నందిగామ ప్రాంతం శాసనాల్లో మాత్రం విశాలార్థకంగానే వాడబడినట్లు కన్పిస్తోంది.  పెన్నాతవాడి  “కొండ నతవాడి  అనే పదాలు నతవాటి సీమ కు పర్యాయపదాలు గానే గా పిలువబడ్డాయి.  నతనాడు గా పిలవబడు ఈ ప్రాంతం ప్రాచీన శాసనాల్లోనత్రవటి విషయము ” గా పిలువబడుతున్నట్లు రెండవ విష్ణు కుండిన చిక్కుళ్ళ శాసనం వలన తెలుస్తోంది. ఈనతవాడి సీమ యే కాకతీయుల శాసనాల్లో  నాథవాడి సీమ  గా పిలువబడింది.
                                
                                                   -82 -
                          తస్మిన్ కుర్వతి రాజ్యమిత్యతులం త్యాగాంక పోతాథిపే
                              ధనధాన్య సంపూర్ణే నాతవాటి మహీతలే
                             శ్రీమాన్పోత నృపాత్మజో నృపవరో శ్రీ నాతనాటో మదో
                              ....................................................................
                                తత్పుత్ర త్యాగి దోర క్షితిపతి రకరో దూర్జితం
                                 ...................        ..............నాద్ధనాటీ రాజ్యం ” ( ప్రాచీ. భూగోళం .184 పే)
...........................ఇత్యాది గా  చాగి వారి శాసనాలన్నీ నాతనాటి ” ని ప్రస్తావిస్తూనే ఉన్నాయి. ఈ నాద్ధనాటి సీమ లో క్షీరనది ప్రవహిస్తున్నట్లు అనుమంచిపల్లి శాసనం ప్రకటిస్తోంది.
                     “ధన ధాన్యాది సంపూర్ణే  నాతనాటి మహీతలే
                                   ............................................
                                  తుల్యాం క్షీరనదీ కుల్యాం కాలేరాకృత వాససౌ
                        పోతపురాఖ్యం ప్రథితాగ్రహారం................. ”. (ప్రాచీ. భూగోళం- 185పే).


                                                      -83 -


           ఈ క్షీరనది యే ఇప్పడు మనం పిలుస్తున్న పాలేరు. పాలు+ఏరుపాలేరు <  క్షీర నది.
                          మొదటి అమ్మరాజు  వేయించిన మచిలీపట్నం శాసనం లో  పెన్నాతవాడి  విషయము లోని  దుజ్జూరు గ్రామాన్ని  దానం చేసినట్లు చెప్పబడుతోంది. ఈ గ్రామ సరిహద్దులుగా గొట్టిప్రోలు ,మల్కాపురము , తాళగుమ్మి , గా చెప్పబడింది. ఆ గ్రామాలే  నేటి నందిగామ  కంచికచర్ల మండలాల్లో కన్పించే  జుజ్జూరు ,మలకాపురం, తాటిగుమ్మి, గొట్టుముక్కల  మొదలైన గ్రామాలు. దీన్నిబట్టి చూస్తే అనేక శాసనాల్లో నాతనాడి, పెన్నాడనాడి  పదాలు సమానార్ధకాలుగా వాడబడ్డాయి.  పోతరాజు అల్లుడు వేయించిన జుజ్జూరు  శాసనం లో  నాతనాడి సీమ అని చెప్పబడింది.
                      కొన్నాతవాడి నే కొండనతవాడి  అని , కొన్నతవాడి  యని పిలిచేవారు. ఇది గుంటూరు జిల్లా లోని సత్తెనపల్లి తాలూకా పశ్చిమ ప్రాంతం . గింజుపాడు  ( గింజుపల్లి), తాడినాడ (తాడువాయి), చల్లగర (చల్లగరిగె )   గ్రామాలు శాసనాల్లో కన్పిస్తున్నాయి.  బ్రాకెట్టు లోని పేర్లు  ప్రస్తుత గ్రామ నామాలు . ఆనాడు కొండపడమటి దేశం గా చెప్పబడిన ప్రాంతం కూడ  కొంతకాలం నతవాడి సీమ లోనిది గానే ఉండేది. గిరి పశ్చిమ దేశం గా చెప్పబడే ఈ ప్రాంతానికి బుద్ధరాజు  ప్రభువు గా చెప్పబడ్డాడు.
             గిరౌ పశ్చిమ శాసన ........... శ్రీ మన్మహామండలేశ్వర కొండ పడ్మటి బుద్దరాజు
(ప్రా. భూ-103 పే)
                    జననావతంస: బుద్దావర్మ కృత పుణ్యకర్మా ....... ( ప్రా.భూ . 105 పే).

                                              -84-

               ఇటువంటి శాసనాధారాలు పై వాదనను బల పరుస్తున్నాయి. ఈ బుద్దరాజు కుమారుడే రుద్రరాజు. ఈతనికే కాకతీయప్రభువు  మహాదేవుడు తమ కుమార్తెలైన తులాంబిక , కుందాంబికలను  ఇచ్చి వివాహం చేశాడు. దీనితో కొండపడమటి సీమ వారితో కాకతీయులకు బాంధవ్యం బలపడింది.
                                                నాధవాటిసీమ లేక నతవాటి సీమ గా నున్న భాగమే అనంతర కాలం లో కొండపడమటి సీమ విడిపోయి , వేరే రాజుల పాలన లోనికి వెళ్లింది. నతవాటి సీమ లో కాకతీయుల బంధుత్వాలు బలపడటానికి ఈ సంబంధమే ప్రధానకారణము. ఈ బుద్దరాజు తండ్రి దుర్గరాజు. బుద్దరాజు కుమారుడు మొదటి రుద్రుడు గా  ప్రసిద్ది
పొందాడు. ఇతనికి ముగ్గురు కుమారులు , ఒక కుమార్తె. కుమారులు వరుసగా రెండవరుద్రుడు , మహాదేవుడు , మరియు ముమ్మడి గణపతి గా  పిలువ బడ్డారు. కుమార్తె పేరు బయ్యాంబ.

 వీరి వంశవృక్షం ఇలా ఉంటుంది.                    
                                        
                                            దుర్గరాజు
                                                ]
                                               బుద్దరాజు
                                                     [
                                                   రుద్రరాజు 1
                 
                                                        -85-
                                                       [
                        ___________________________
                           [                           [                                     [                 [
                      రుద్ర 2                     మహాదేవ                                                                                                                                                       ముమ్మడిగణప                          
                                                                                                                  [
                                                                                     బయ్యాంబ - కోటకేతరాజు    
         

           రుద్రరాజు   తన యొక్క కుమార్తెను  ధరణి కోట పాలకుడైన  కోటకేతరాజు న కిచ్చి వివాహం చేశాడు. నతవాటి సీమ నేలిన రాజులు కాకతీయులకు సామంతులుగానే కన్పిస్తున్నారు.
                రెడ్డిరాజుల పాలన లో అన్నమరెడ్డి వంటి వారు వేయించి శాసనాలు అక్కడక్కడా లభంచినా అవి అంత ప్రాముఖ్యత ను   పొందలేదు.  కారణం అవి మాండలిక శాసనాలు. అనగా మాండలికుల పాలన లో  సేనానాయకుల వంటివారు వేయించినవి. నతవాటి సీమపై రెడ్డిరాజుల ప్రభావాన్ని   తెలిపే శాసనాలు ప్రత్యేకం గా లేవు. రెడ్డిరాజుల యనంతరం   ఈ ప్రాంతాన్ని ఎక్కువగా ప్రభావితం చేసింది. బహమనీ సుల్తానులు , గోల్కొండ నవాబులు. సుల్తానుల కాలం లో  ఈ నతవాడి సీమలో రెడ్డిరాజులకు సామంతులు గా నతవాడి ప్రభువులు   అమరావతి లోను , వేదాద్రి లోను శాసనాలు వేయించారు.                       
             
                                          -86-


              బహమనీసుల్తాను  ఫిరోజ్ షా రాజమహేంద్రవర  రెడ్డిరాజ్యాన్ని   ఆక్రమించుకొని , ఆ విజయోత్సాహం తో పానగల్లు కోట  ముట్టడికై  వెడుతూ , మార్గమధ్యం లో వేదాద్రి లో   రెండు శాసనాలు వేయించాడు.( కృష్ణాగెజిట్-46 పే ). 
పానగల్లు కోట ముట్టడి విఫలమై తిరిగి  వెడుతున్న  సమయం లో ఈ శాసనాలు వ్రాయించాడేమో నని  శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు  భావించారు. (విజ్ఞాన సర్వస్వం 350 పే).కాని  ఇది సమంజసం గా లేదు. రాజమహేంద్రవర విజయానంతరమే ఈ శాసనాలు వేయబడ్డాయి. దీనిలో షరాన మాలుక్ జైనాడి వోడేయ అనే వ్యక్తి    వాడపల్లి  (వజీరాబాద్) లో ఉన్న తన చిన్నతమ్ముడు మసాన్డ  అలీ అబ్దుల్ నిజాముల్ మాలిక్     పేరున ఒక చెఱువును  నిర్మించినట్లు గా వ్రాయబడింది.  ఇది ఇప్పటికీ వేదాద్రి ఆలయం లోకి  ప్రవేశిస్తుంటే ఆలయ ప్రాంగణం లో గాలిగోపురానికి   ఎడమ వైపు గా  పాతిపెట్టబడి ఉంది.                  One Records the construction of a tank by Sarakhy  Maluka  Jainadi Vodeya, the younger brother  of Masanda Ali  Abdul Nidamalu  maluka  who was at Vadapalli .(Wazirabad )    Krishna Gazetteer (46pp.) . 
                          అనంతరం గోల్కొండ నవాబు   కులీకుతుబ్ షా విజయ నగర సార్వభౌముడుశ్రీకృష్ణ దేవరాయల మరణానంతరం ( క్రీ.శ. 1530) విజయనగర రాజవంశం  లో ఏర్పడిన  అంత: కలహాలను అవకాశం గా మలచుకొని తీరాంథ్ర పై దండయాత్రలు ప్రారంభించాడు. ఈ దండయాత్రలు  క్రీ.శ . 1531 -32 లో ప్రారంభమై నాలుగు పర్యాయాలు గా జరిగాయి. ఈ సమయం లో  హైందవరాజులకున్న  సహజలక్షణ మైన అనైక్యత కారణం గా ఆంథ్రదేశం లోని సామంతరాజ్యాలన్నీ కులీ కి లొంగిపోయాయి.

                                        -87 -

                    మొదటి దండయాత్ర లో రాచకొండ , దేవరకొండ , పానగల్లు ,ఘనాపూర్ దుర్గాలను , రెండవ దండయాత్ర లో ఎల్లెందుల,మలంగూరు ,  దుర్గాలను ఆక్రమించాడు. మూడవ దండయాత్ర లో  ప్రతాపరుద్ర గజపతి సామంతుడు, వరంగల్లు పాలకుడు నైన షితాబ్ఖాన్ అనబడే సీతాపతి తోనుకొండపల్లి ని పాలిస్తున్న  ప్రతాపరుద్రుని కుమారుని తోను పోరాడి వరంగల్లు ,ఖమ్మంమెట్టు దుర్గాలను  వశపర్చుకున్నాడు  కులీకుతుబ్ షా. ఈ  యుద్ధం మునేటి ఒడ్డున  పెనుగంచిప్రోలు వద్ద జరిగింది.  షితాబ్ఖాన్  అనబడే  సీతాపతి నాయకత్వం లో హిందూరాజులు మూడు లక్షల కాల్బలాన్ని , ముఫై వేల ఆశ్వికబలం ,  ఏడువందల  ఏనుగులను సమకూర్చుకొని యుద్ధానికి దిగారు. కాని తసైన్యాన్ని మహమ్మదీయ నవాబు తన మెరుపు యుద్ధపు జిత్తులతో  కేవలం ఐదువేల సైన్యం తో ఓడించాడు. అత్యధికం గా  ఉన్న  హిందూ సైన్యం అవగాహనా సామర్ధ్యం లోపించి , కాలుచేతులాడక  అహం భావం తో  చావుదెబ్బ  తిన్నదని  విమర్శకులు  భావించారు. (విజ్ఞాన సర్వస్వం  351  పే.).
                                       ఈ యుద్ధం వలన  అధికం గా నష్టపోయింది గజపతులు కాగా- పరోక్షం గా   పెనుగంచిప్రోలు చెప్పబడుతున్న బృహత్కాంచీపురం  అనే ఒక అందమైన ఆంధ్ర నగరం మట్టి లో కలిసిపోయింది. దాన్ని ఏలుతున్న చాగి వారి చివరితరం. ఆ శిథిల జాడలు ఇప్పటికీ  పెనుగంచిప్రోలు  అడుగడుగునా   కన్పిస్తూనే ఉంటాయి. నూటొక్క శివాలయాలుండేవని గ్రామస్తులు చెప్పుకుంటున్న ఈ బృహత్కాంచీపురం  ఆంధ్రదేశ చరిత్ర లో ఒక శిథిల నగరం గా మిగిలి పోయింది.
                                

                                             - 88 -
 దీనికి కొంచెం ఎగువగా  ఉన్న చారిత్రక గ్రామం  కొనకంచి.  కొండకంచి కొణకంచి  అత్యంత ప్రాచీన పట్టణం. ఈ కొనకంచి లోని నరేంద్రస్వామి ఆలయం అత్యంతప్రాచీన మైనది.. రాజేంద్రచోళుడు  క్రీ.శ. 1069 లో వేయించిన శాసనం ఇక్కడ హనుమదాలయం లో కన్పిస్తోంది. ఇది కొంత సంస్కృతం , మరి కొంత తెలుగు లో వేయబడింది. ఈ కొండకంచీ స్ధిత శ్రీకంఠేశ్వరునకు అరవై  యవర్తనాల భూమిని దానం చేసిన శాసనమిది. (ఆర్కి-269/1924 ).
                                ఈ శాసనం రెండవవైపు చాగిపోతరాజు మహామండలేశ్వరులు గా నున్న కాలం లో వేయించిన శాసనం ఉంది. చాగిపోతరాజు వేయించిన శాసనాల్లో ఎక్కువభాగం  తేదీలు లేనివి కన్పిస్తున్నాయి.  కారణము విచారణీయము. ఈ శాసనం కూడ తేదీలేనిది. ఇది ప్రభువు పక్షాన వేయబడిన శాసనం.
                                “  శ్రీమన్మహమండలేశ్వర  పోతరాజులు
                                 గుడిమెట్ట రాజధాని గా రాజ్యంబు
                                నాధవాడం జేయుచుండగా.......... ” (270/1024 )
 అంటూ ఈ శాసనం ప్రారంభమౌతుంది. దీనికి  పూర్వభాగము  స్వస్తి  సమథిగత పంచమహాశబ్ద మహామండలేశ్వర పదవీ విరాజమాన  ............................... ఇత్యాదిగా స్తోత్రగద్య కన్పిస్తుంది.  చాగివారు  సర్వతంత్ర స్వతంత్రులు  గానే రాజ్యపాలన కొనసాగించినట్లు ఇంతకు పూర్వమే చెప్పుకున్నాం. కాకతీయులే తాము వేయించిన శాసనాల్లో  మహామండలేశ్వర బిరుదనామం తోనే సరిపెట్టుకున్నారు. సార్వభౌమాధికారం

                                     - 89 -
వారి శాసనగద్యల్లో కన్పడదు. దానిక్కారణం ఆలోచిస్తే పరిసరాల్లోని  కోట , నతవాడి , చాళుక్య చోడాది రాజ్యన్యులు స్వతంత్రులై ఉండటమే ప్రధాన కారణం . అయితే రుద్రమ దేవి కాలం నాటికి ఈ వంశాలు క్షీణించి , నాయంకర విధానం అమలు కావడం , కాకతీయ సామ్రాజ్యం  పుంజుకోవడం  జరిగింది.  క్రీ.శ 1268 లో గుడిమెట్ట లో రుద్రమదేవి  కట్టసాహిణి గోన గన్నారెడ్డి వేయించిన శాసనమే ఇందుకు సాక్ష్యం . మహాశివరాత్రి నాడు గుడిమెట్ట  శ్రీ విశ్వనాథ మహాదేవరకు  బేతవోలు గ్రామాన్ని దానం చేసిన శాసనమిది.(ఆర్కి -314/1924). విశ్వనాథుని ఆలయం థ్వంసమై పోగా ,బేతవోలు అనంతర కాలం లో దొంగల బేతవోలు గా మారి,  రాజావాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు కాలం లో  జగ్గయ్యపెట గా రూపుదిద్దుకుంది. సామంతుల అధికారాలు పెరగడం వల్ల  కేంద్రాధికారం బలహీనం గా ఉండేది. దీనివల్లే తఱచుగా యుద్ధాలు సంభవిస్తూ ఉండేవి.
                               ప్రస్తుతం లోకి వస్తే  చాగిపోతరాజు  సర్వతంత్ర స్వతంత్రుడై గుడిమెట్ట రాజధాని గా పాలించుచున్న రోజుల్లో  తెలికి (1000)  కులమునకు చెందిన అప్పిశెట్టి కుమారుడైన కుప్పిశెట్టి , నరేంద్ర స్వామి గుడికి వెల్లవేయించి , భూదానములనిచ్చి, రెండు దీపమాలలను చేయించినట్లు కొనకంచి శాసనం చెపుతోంది. ( 270/1924). ఈ శాసనం  మూడోవాపు పూర్తిగా శిథిలమైంది. ఇది తూర్పుచాళుక్యరాజైన రెండవ మృగయాదిత్యుని కాలము నాటిదని శాసనవిశ్లేషకులు భావించారు. ఇదే హనుమదాలయానికి దీపస్థంభము దానము నిచ్చినట్లుగా  చెప్పే దానశాసనమొకటి ,


                                            -90 -
శివాలయానికి ఎదురుగా నున్న మండప సమీపం లో కన్పిస్తోంది. దీనిపై దాత పేరు స్పష్టం గా లేదు. పై శాసనాల్లో ప్రస్తావించిన నారాయణ దేవుని ఆలయం ఇప్పుడు నామరూపాలు లేకుండా కాలగర్భంలో కలసిపోయింది.  ఇది కొనకంచి కి సంబంధించి  లభించిన విషయం.
                          పెనుగంచి, కొనకంచి  అనేవి  నతవాడి సీమ కు రెండు దరులైతే కంచికిచేరువ గ్రామం కంచికచర్ల గా రూపాంతరం చెంది ఉండవచ్చు.  సత్తెమ్మతల్లి  కొలువు తీరిన  అమ్మ వారి పేట సాధారణ ప్రజల  వాడుకలో అమ్మోరిపేట అంబోరిపేట >  అంబారుపేట గా మారుండవచ్చు. కంచల లో ప్రాచీన కోట , కొన్నిశాసనాలు ఉన్నట్లు మెకంజీ దొర కృష్ణాజిల్లా మాన్యువల్ లో ప్రస్తావించారు. నవాబు పేట (276/1924 ), మాగల్లు (265/1924), నడిగూడెం (296/1924) , జుజ్జూరు ( 325 నుండి 327/1924) , మునగానపల్లి (259/1924 ),తాడువాయి (292/1924), ముప్పాళ్ళ(257/1924) గ్రామాల్లో   చాగివారి శాసనాలు కన్పిస్తున్నాయి.
                    నవాబు పేట శాసనం చాగిపోతరాజు  స్వయం భూదేవరకు ఇచ్చిన దానాన్ని ప్రస్తావిస్తుంది. కురుకుర్రు లోని ఈ దైవానికి చాగిపోతరాజు యనంతరం  అనేకులు చేసిన దానాలక్రమం చాలానిడివిగా కన్పిస్తుంది. దీనిలో పెనుగంచిప్రోలు చాగిగణపయరాజు ప్రస్తావన కూడ ఉంది. ఈ శాసనకాలం  క్రీ.శ.1230.
                        మాగల్లు శాసనం ఆ గ్రామం లో    వేంచేసి ఉన్న శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ స్ధంభం పై కన్పిస్తుంది. కాకతి గణపతి దేవుని శ్రేయస్సు ని ఆకాంక్షించి , బచ్చు

                                                 -91 -
సూరయ్య కుమారులు వేయించిన శాసనం ఇది. దీనిలో పూర్వభాగం , ఉత్తరభాగం కూడ శిథిలమయ్యాయి.
                       నడిగూడెం ,తాడువాయి  శాసనాలు కాకతీయుల కాలం నాటివి. ప్రతాప రుద్ర దేవ ,రుద్రమదేవుల కాలం నాటి దానశాసనాలివి.
                  జుజ్జూరు శాసనం  అసమగ్రం గా లభిస్తోంది. ఇది చాగిపోతరాజుల  అల్లుడు వేయించిన శాసనం. దీనిలో  పోతరాజు  బిరుదుగద్య  ప్రస్తావించబడింది.
                                 స్వస్తి సమస్త సేనాగణాలంకృ
                                   త శ్రీ యోగానంద నరసిం
                                    హ దేవ దివ్య శ్రీ పాదప
                                 ద్మా  రాధక చతుర్విధ పు (రు)
                                 షార్ధ సాధక దుష్ట రిపు
                                 జనమర్ధన   శ్రీనరసిం
                                  హవర్ధన    నామాది సమ
                                   స్త  ప్రశస్తి  సహితం   శ్రీమ
                                  న్మహామండలేశ్వర చాగి
                             
                                         -92-
                                    పోతరాజుల  అల్లురు స్వ
                                  (స్తి స) మన్త ప్రశస్తి సహితం ..”        (325/1924).
                           ఈ విధం గా సాగిన ఈ శాసనం లోని విషయం  లభించలేదు. ఛిద్రమైపోయింది. కాని బిరుదుగద్య వలన చారిత్రక ప్రాధాన్యాన్ని పొందిన శాసనాల్లో ఒకటి గా  గుర్తింపు పొందింది. జుజ్జూరు లో లభించిన మరి రెండు శాసనాలు కూడ  పగలకొట్టబడి , నాశనం చేయబడ్డాయి.  
                         మునగానపల్లి శాసనం  (259/1924)  మనుమ చాగిరాజు  వేయించిన శాసనం .  శాసనం కాలం శా.శ 1190 .( క్రీ.శ. 1268). ఇది భీమేశ్వర మహాదేవరకు   సమర్పించిన దాన శాసనం .  దీనిలో మనుమ చాగిరాజు  తమ తాతగారు  త్యాగి పోతరాజు  1 ను , తన మామ పెద్దయ్య ను , తండ్రి భీమరాజు ను తల్లి పార్వతీ దేవిని స్మరించాడు.  ఈ శాసనం లో నందిగామ , ముప్పాళ్ళ గ్రామాల పొలాలు ప్రస్తావించబడి ,  హద్దులు నిర్దేశించబడ్డాయి.  “ ముప్పాళ్ల   పోత సముద్రము వెనుక మత్సుతులు 3 అనసపాటి తోంట .............ఇత్యాది గా కొనసాగిన దాన శాసన మిది. ఇది చాగి మనుమరాజు  తల్లిదండ్రులు, మామ గారి ప్రస్తావన వలన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే విధం గా జుజ్జూరు శాసనం పోతరాజు బిరుదు గద్య వలన గుర్తింపు పొందిందని ఇంతకు ముందే చెప్పుకున్నాం.
                          


                                            -93 -
                             

                      ముప్పాళ్ల రెండు శాసనాలు వివాదగాస్పదం గానే ఉన్నాయి.  క్రీ.శ 1277 నాటి త్యాగి మనుమ పోతరాజు కాలం నాటి  ఈ శాసనం లో అతని చమూపతి మాక అనువాడు ముప్పాళ్ల రామేశ్వర దేవునకు  25 గోవులను అఖండ దీపారాధన నిమిత్తం  దానం చేసిన శాసనమిది.  రెండవ శాసనం తేదీ లేనిది. ఇది కూడ మాక  ” వేయించినదే. చాగి వంశాభివృద్ధి గా శాసనం వ్రాయబడింది. ముప్పాళ్ళ భీమేశ్వర దేవరకు 65 గొఱ్ఱెలను (?) అఖండ దీపమునకై దానం చేశాడు. గొఱ్ఱెలను ఈ శాసనం లో  వీనినివెల్లెడు అని ప్రయోగించారు.  శాసన విశ్లేషకులు  వానిని గొర్రెలు గా భావించారు. అఖండదీపానికి ఇచ్చేది ఆవులే కాని గొఱ్రెలు కాదు గదా. ఇదే విధం గా ముక్త్యాల క్ల్యామ మండపం లో శా.శ 1129  నాటి కండ్రవాట్యధిపతి శ్రీ కేశవోర్వీపతి వేయించిన శాసనం ఒకటి కన్పిస్తోంది. ఇచ్చట కూడా కేశవోర్వీపతి  ముక్తేశ  మహేశ్వరునకు  25 ఆవులను దానం చేసినట్లు వ్రాయబడింది. ఇది ఈనాటి ఆచారాల్లో ఒకటి గా రెండవ ప్రకరణంలో చర్చించబడింది.
                                     
                                                           ----  చివరి భాగం లో         
                                                
                                  
                      నతవాటి సీమ లో వివిధ మతాల ప్రభావ ప్రాభవాలు.


**********************************************************