Sunday 11 May 2014

శతక సౌరభాలు - 1 దాశరథీ శతకము - 5


శతకసౌరభాలు -1
                 
                             కంచర్ల గోపన్న  దాశరథీ శతకము

     



             అగణిత జన్మ కర్మ దురితాంబుధి లో బహుదు:ఖవీచికల్
             తెగిపడ నీదలేక  జగతీధవ నీ పద భక్తి నావ చే
             దగిలి తరింపగోరితిఁ బదంపడి నాదు భయంబు మాన్ప వే
             తగదని చిత్త మందిడక దాశరథీ ! కరుణాపయోనిధీ !
          
               శ్రీ రామా ! అనేక జన్మల యందలి కర్మల పాపములనెడి  సముద్రము లో  అనేకములైన దు:ఖములనెడి అలల దెబ్బలకు   ఈదలేక  నీ యొక్క దివ్య పాదభక్తి యనెడి ఓడను పట్టుకొని  పాపమనెడి సముద్రమును దాట దలచినాను. తగదని మనసు లో భావించక   నా భయమును పోగొట్టి  నన్ను కాపాడ వలసినది తండ్రీ !
       
          నేనొనరించు పాతకము లనేకము లైనను నాదు జిహ్వకున్
          బానకమయ్యె మీ పరమ పావన నామము   తొంటి రాచిల్కరా
          మా  నను గావుమన్నఁ దుదిమాటను సద్గతి నొందె  గావునన్
    దాని ధరింప గోరెదను దాశరథీ ! కరుణాపయోనిధీ !
      
            దశరధ రామా ! నేను చేయునట్టి పాపములు అనేకములైనను  మీ పరమ పవిత్ర నామము నా నాలుకకు మిక్కిలి మధురము గా నున్నది. పూర్వమొక చిలుక  శ్రీరామా ! నన్ను రక్షింపుమని పలికి   దాని వలన మోక్షమును పొందినది. కావున నేను కూడ నీ దివ్యనామమునే నేను స్మరించెదను.

             పరధనమున్ హరించి ,పరభామలనంటి , పరాన్నమబ్బినన్
       మురిపమ కాని ,మీఁద నగు మోస మెఱుంగదు మానసంబు దు
       స్తరమది   కాలకింకర గదాహతిఁ బాల్పడనీక మమ్ము నే
       తఱి దరిఁజేర్చి  ప్రోచెదవో? దాశరథీ ! కరుణాపయోనిధీ !

                            ఓ రామా  1 పరధనముల నపహరించుట , పరభామలను పొందుట ,  ఇతరుల తిండి తినుట , బాగానే ఉండును కాని వాని వలన  తరువాత కల్గెడి నష్టము మనస్సుకు తెలియదు . వీనినుండి తప్పించుకొనుట కష్టము . కావున రామచంద్రా  మేము యమభటుల గదాఘాతముల  బారిన పడకుండా మమ్మల్ని ఏ విధంగా కాపాడి ఒడ్డుకు చేరుస్తావో నీదయ  రామచంద్ర ప్రభూ !

           చేసితి ఘోరకృత్యములు , చేసితి భాగవతాపచారముల్
           చేసితి నన్యదైవముల జేరి భజించిన వారి పొందు నే
           చేసిన నేరముల్ దలచి చిక్కుల బెట్టకుమయ్య ; యయ్య ; నీ
           దాసుడనయ్య ; భద్రగిరి ! దాశరథీ ! కరుణాపయోనిధీ !

                 రామా !నేను భయంకరమైన పాపములను చేసితిని. భగవద్భక్తుల యెడ దోషములు . నీభక్తులు కాని వారితో  స్నేహమును చేసితిని. నేను చేసిన ఈ తప్పులన్నింటినీ  తలచి నన్ను బాధలు పెట్టవద్దు , అయ్యా ! నేను నీ భక్తుడను స్వామీ !
   
              పరులధనంబుఁ జూచి పరభామలఁజూచి హరింపగోరు ను
             ద్ధురమగు నామనస్సను దొంగను బట్టి భవత్సుదాస్య వి
             స్భురిత వివేక పాశమున జుట్టి భవచ్చరణంబనే మరు
             త్తరువునఁ గట్టివేయగదె దాశరథీ ! కరుణాపయోనిధీ !    

               శ్రీరామా ! పరధనమును ,పరస్త్రీలను , కోరునట్టి బలమైన నామనస్సనెడి దొంగను పట్టి నీ సేవ వలన ఏర్పడిన  తెలివి అనెడి  త్రాటిచే  నీయొక్క పాదమనెడి కల్పవృక్షమునకు  బంధించుము .
                     అనగా నా మనస్సును ఇతర పాప చింతనముల వైపు పోకుండా నీ పాదసేవన మనెడి భక్తి తో బంధించవలసినదని రామదాసు ప్రార్ధన

               సలలిత రామనామ జపసార మెఱుంగను గాశికాపురీ
         నిలయుడణ గాను  మీ చరణ నీరజ రేణు మహాప్రభావముల్
         దెలియ నహల్యగాను  జగదీవర నీదగు సత్యవాక్యముల్
         దలపగ రావణాసురుని తమ్ముడ గాను భవద్విలాసముల్
         దలఁచి నుతింప నాతరమె దాశరథీ ! కరుణాపయోనిధీ !    

                 శ్రీ రామచంద్రా .! నీ దివ్యనామ జప మహత్మ్యము  తెలిసికొన నేను కాశీ విశ్వేశ్వరుడను కాను . నీ పాదధూళి శక్తి  తెలియగ అహల్యను కాను. నీ సత్య వాక్యముల శక్తి ని తెలియ  విభీషణుని కాను . నీ యొక్క లీలలను వర్ణింప నాతరమా స్వామీ !

           దాసిన చుట్టమా శబరి దాని దయామతి నేలినావు నీ
           దాసుల దాసుడా గుహుడు తావక దాస్యమొసంగినావు ,నే
           జేసిన పాపమో వినుతిఁ జేసిన గానవు , గావుమయ్య నీ
           దాసులలోన నేనొకడ దాశరథీ ! కరుణాపయోనిధీ !    

                                రామయ్యా  !  నీకు శబరి దగ్గర బంధువా ? ఆమెను కరుణించావు . నీ  సేవకులకు సేవకుడనా ఆ  గుహునకు నీ సేవాభాగ్యాన్ని కలిగించావు . నేనేమి పాపం చేశానని  ప్రార్థించినా నన్ను కరుణింపకున్నావు . రామా  ! నేను కూడ నీ సేవకులలో ఒకడనే .నన్ను కాపాడవయ్యా.
   
           జలనిధు లేడు నొక్క మొగిఁ జక్కికి దెచ్చె శరంబు ఱాతి నిం
           పలరగ జేసె నాతిగఁ బదాబ్జ పరాగము నీ చరిత్రమున్
           జలజభవాది నిర్జరులు సన్నుతి సేయగ లేరు ,గావునన్
           దలప నశక్యమయ్య నిను  దాశరథీ కరుణాపయోనిధీ.

                 శ్రీరామా  ! నీబామము ఏడు సముద్రాలను లొంగదీసుకున్నది. నీపాదధూళి  ఱాతిని స్తీ గా మార్చినది. బ్రహ్మాదులు సైతం  నీ చరిత్రను పొగడలేరు. అటువంటి నిన్ను గురించి ఆలోచించుట నాతరము కాదు స్వామీ.!

          క్రోతికి శక్యమా అసుర కోటుల గెల్వగ గెల్చెఁ బో నిజం
          బాతని మేన శీతకరుండౌట  దవానలుఁడెంత వింత మా
          సీత పతివ్రతా మహిమ సేవకు భాగ్యము  మీ కటాక్షముల్
          ధాతకు శక్యమా పొగడ   దాశరథీ ! కరుణాపయోనిధీ !

                      శ్రీరామా.!  ఒక  కోతి రాక్షసులను సంహరించిందన్నను , వానరుని శరీరంమీద అగ్నిహోత్రుడు చల్ల గా మారాడన్నను , అవి గొప్పవింతలు .  ఇదంతా కూడ మా తల్లి సీతామహాదేవి పాతివ్రత్య మహిమ , సేవకుడైన ఆంజనేయుని అదృష్టము , మీ యొక్క కృపా కటాక్షములే కారణము . నీ మహిమలను పొగడుటకు  చతుర్ముఖుడైన బ్రహ్మ కు సైతము  సాధ్యము కాదు. నేనెంతవాడను .

           భూపలలామ రామ !రఘుపుంగవ రామ !  త్రిలోకరాజ్య సం
           స్ధాపక రామ ! మోక్ష ఫలదాయక రామ !  మదీయ పాపముల్
           వాపగదయ్య రామ !  నిను ప్రస్తుతి జేసెదనయ్య రామ !  సీ
           తాపతి ! రామ ! భద్రగిరి ! దాశరథీ ! కరుణాపయోనిధీ.!

               రాజులలో శ్రేష్టుడా.!రామచంద్రా ! ముల్లోకములను పాలించువాడా. ! మోక్షదాయకుడవైన ఓ రామచంద్రా ! నిన్ను  ప్రార్థించెదను. నాపాపములను పోగొట్టి రక్షింపుము సీతాపతీ.!

            నీ సహజంబు సాత్వికము నీ విడిపట్టు సుధాపయోధి ప
            ద్మాసను డాత్మజుండు , కమలాలయ నీ ప్రియురాలు నీదు సిం
            హాసన మీ ధరిత్రి ,గొడుగాకస ,మక్షులు చంద్ర భాస్కరుల్ ,
            నీ సుమతల్ప మాది ఫణి  నీవె సమస్తమునఁ గొల్చునట్టి నీ
            దాసుని భాగ్యమెట్టిదయ దాశరథీ ! కరుణాపయోనిధీ.!

             శ్రీరామా  !నీ సహజలక్షణము సాత్వికము . నీనివాసము పాలసముద్రము. బ్రహ్మదేవుడు నీ కుమారుడు. శ్రీ మహాలక్ష్మీ దేవి నీ ఇల్లాలు . ఈ భూమండలము నీ సింహాసనము. ఆకాశము గొడుగు . సూర్యచంద్రులు నేత్రములు . ఆది శేషుడే నీకు పూలపాన్పు. నీవే సమస్తమునకు అధినాథుడవు  అటువంటి నిన్న్ను సేవించెడి ఈ దాసుని అదృష్టము సామాన్యమైనదా స్వామీ ?

            చరణము సోకినట్టి శిల జవ్వని రూపగు టొక్కవింత ,సు
       స్ధిరము గ నీటిపా గిరులు తేలిన దొక్కటి వింత ,గాని నీ
       స్మరణఁ దనర్చు మానవులు సద్గతి జెందుట యెంత వింత యీ
       ధరను ధరాత్మజా రమణ ! దాశరథీ ! కరుణాపయోనిధీ.!

         శ్రీరామా  ! సీతాపతీ!. మీ పాదములు సోకి ఱాయి స్త్రీ  గా మారడం ఒక వింతైతే , కొండలు నీటిపై తేలడం మరొక వింత.  అయితే అన్నిటి కంటే  ఈ భూమి పైన వింత ఏమిటీ అంటే నీ నామస్మరణ చేసిన మానవులు ఎంత పాపాత్ములైనా మోక్షాన్ని పొందుతున్నారు ఇది గొప్ప వింత కదా  రామా !                  

                                     చదువుతూ ఉండండి. మరి కొన్ని అందిస్తాను .





*********************************************************************************