Monday 13 January 2014

శ్రీ భాగవత కల్పద్రుమ ఫలాలు- 7 నారదుడు చెప్పిన ఆశ్రమ ధర్మాలు


 శ్రీ భాగవత  కల్పద్రుమ  ఫలాలు - 7
                     
                        నారదుడు చెప్పిన ఆశ్రమధర్మాలు
            
               



  పూర్వం బదరికావనం లో నారాయణుని వలన విన్న సనాతన ధర్మాన్ని నారదుడు ధర్మరాజు కు వివరించాడు.  ఆంధ్ర మహా భాగవతం ఏడవస్కంధం లో ఈ భాగాన్ని చూడవచ్చు.  ప్రజలందరకు ముఖ్యం గా ఉండవలసిన  లక్షణాలు ముచ్చటగా ముప్పది .
                 
               
                          సత్యం ,సంతోషం , సమదృష్టి ,సదసద్వివేకం, శౌచం , క్షమ , దయ, మార్దవం , మనోనిగ్రహం , మహాజనసేవ , మితభాషిత్వం , ఇంద్రియజయం , బ్రహ్మచర్యం , ప్రతిప్రాణి లోను పరమాత్మ ను చూచుట , దానం, అభేదబుద్ధి తో నుండుట, ఉపవాసాదికం ,  అహింస.ఆత్మావలోకనం , అన్నోదకాలను పంచి ఇవ్వడం , అసభ్య వాంఛలు, అనర్ధకమైన క్రియలు  విడిచి పెట్టడం , దేవదేవుడైన ఆ శ్రీమన్నారాయణుని చరణాలను స్మరించడం, కీర్తించడం , కథాశ్రవణం ,సేవ , ఆరాధనం , నమస్కృతి , దాస్యం ,సఖ్యం , ఆత్మ సమర్పణం అనే ముప్పది గుణాలు అలవడాలి.                                        
            
                        ఆశ్రమాలు బ్రహ్మచర్య, గృహస్థ , వానప్రస్థ ,  సన్యాసమని నాలుగు రకాలు.  
                 

           
                          బ్రహ్మచారి అనే వాడు  మౌంజీ, కౌపీనం ,యజ్ఞోపవీతం, కృష్ణాజినం , పలాసదండం , కమండలం ,దర్భ లను ధరించి ఉండాలి. కేశ సంస్కారం చేసుకోకూడదు. మౌనం గా ఉండాలి. మూడు సంధ్యల లోను బ్రహ్మ గాయత్రిని జపించాలి. ప్రాతస్సంధ్యాకాలాలలో సూర్యోపాసన , అగ్ని ఆరాధన, గురపాజ , దేవతార్చన చేస్తుండాలి.గురువు గారి ఇంటి లోనే సేవకుని వలే భక్తి వినయ సౌమనస్యాలతో మెలుగుతూ, వేదాలను వల్లె వేయాలి. వేదాధ్యయనానికి ప్రారంభం లోను, ముగింపలోను గురువు గారి పాదాలకు నమస్కరించాలి. ఉదయం, సాయంత్రాలలో  ఉత్తమమైన గృహస్దుల నుంచి భిక్షాన్నం  స్వీకరించి , ఆ భిక్ష ను గురువులకు నివేదించి , వారి అనుమతి తో భుజించాలి. నియమిత దినాలలో ఉపవాసాలుండాలి. స్త్రీలతోను , స్త్రీ లోలుర తోను అనవసరం గా మాట్లాడకూడదు. బ్రహ్మచారి గురుపత్నులతోను , పరస్త్రీల తోను తల అంటించుకోవడం , తల దువ్వించుకోవడం , శరీరమర్దనం , సపర్యలు  చేయించుకోవడం , ఏకాంతం గా ఉండటం చేయకూడదు. ఎల్లప్పుడూ ఇంటిలో ఉండక , జితేంద్రియుడై , సత్యభాషణుడై సంచరించాలి.
           
                  బ్రహ్మచారి విద్యార్జనే ప్రథమ కర్తవ్యంగా భావించి , శ్రమించాలి. నియమ నిష్ఠలతో జీవితాన్ని మలచుకోవాలి. ఈ వయసు లో స్త్రీలతో  స్నేహం మంచిది కాదు. స్త్రీ దావాగ్ని వంటిది. పురుషుడు  నేతి పాత్ర వంటివాడు. సెగ తగలగానే పాత్ర లోని ఘృతం లా కరిగి పోతాడు. బ్రహ్మ అంతటి వాడే కూతురు పై వ్యామోహం తో ఆమెను భార్య గా గ్రహించక విడువలేదు. కాబట్టి బ్రహ్మచారి కి  పడతి సాన్నిహిత్యం పనికి రాదు.

పొలతి దావహ్ని పురుషుఁడాజ్య ఘటంబు , కరఁగ కుండరాదు కదిసెనేని,
బ్రహ్మయైనఁ గూతుఁ బట్టక మానఁడు, వడుగు కింతి పొత్తు వలదు వలదు. (7.ఉ. 422)

                            ఉత్తమ గృహస్థు అభ్యంగనాది స్నానాలు , చందనభూషణాదులు కలిగి, బుతుకాలం లో మాత్రమే భార్యను పొందాలి. ఇతర కాంతలపై మోహాన్ని పొందరాదు. చక్కని మనస్థైర్యం కలిగి ,మధు మాంసాలను  వర్ఝించాలి.  సత్ప్రవర్తన తో తన ధర్మాన్ని నిర్వర్తించిన వాడ్  సద్గృహస్థుడు. బ్రాహ్మణ గృహస్థుడు గురువువల్ల ఉపనిషత్తులు , శిక్ష , వ్యాకరణం  ఛందస్సు , నిరుక్తం , జ్యోతిషం కల్పం – అనే వేదాంగాలతో పాటు, ఋగ్యజుస్సామ వేదాలను అథ్యయనం చేయాలి. అర్థవిచారణ చేయాలి. యథాశక్తి గురుదక్షిణ  సమర్పించుకోవాలి. భవనం లో ఉన్నా, వనం లో ఉన్నా నిష్ఠాగరిష్ఠుడై ఉండాలి.తదితర ప్రాణులతో సహజీవనం చేస్తూ ముఖ్యం గా గురువులో, అగ్నిలో, ఆత్మలో, సర్వభూతాలలో అచ్యుతుణ్ణి దర్శించాలి. ఇంద్రియలోలత ను వదిలి , ఆత్మజ్ఞానం తో ప్రవర్తించిన గృహస్థుడు పరబ్రహ్మను చేరుకుంటాడు. 

                      వానప్రస్థాశ్రమం  స్వీకరించిన వాడు అరణ్యాలకు వెళ్లి మునివృత్తి ని స్వీకరించాలి.  ఋషీశ్వరులు చెప్పిన నియమాలను పాటించిన పుణ్యాత్ముడు మహర్లోకం చేరి సుఖిస్తాడు. గృహస్థాశ్రమ ధర్మాలు చక్కగా నిర్వహించిన తరువాత వానప్రస్థాన్ని స్వీకరించాలి. వనాలలో నివసించాలి. అక్కడ దున్నకుండా పండే  నీవారాది ధాన్యాలను ఉడక పెట్టినవి కాని, పచ్చివి కాని , సూర్యకాంతి  తో పండి ,ఎండిన ఫలాలను కాని తింటూ , ఈశ్వరుని భజిస్తూ ఉండాలి. నిన్నటి రోజున మిగిలిన పదార్థాలను వదిలి. కొత్తవి సంపాదించు కోవాలి. చలీ ,గాలీ, ఎండా ,వానా. అగ్నీ , అన్నింటినీ సహించాలి. గోళ్లు తీసుకోవడం , గడ్డం చేసుకోవడం , క్షౌరం చేయించుకోవడం , జుట్టుదువ్వుకోవడం చేయకూడదు.జటిలుడై ఉండాలి. దండం, కమండలం , జింకచర్మాలు, నారబట్టలు కట్టుకోవాలి.పన్నెండు లేదా ఎనిమిది లేదా నాలుగు  లేదా కనీసం ఒక్క సంవత్సర మైనా ఏకాగ్రచిత్తుడై తపస్సు చేయాలి.బుద్ధి చలించకుండా మునియై జీవించాలి. కర్మకాలి వృద్ధాప్యం వల్ల కాని, రోగం వల్ల కాని  వానప్రస్థుడు తన ధర్మాలను నెరవేర్చుకొనలేకపోతే నిరశన వ్రతం పూని ఆత్మ యందు అగ్నులను ఆరోపణ చేసి సన్యసించాలి.

           మానవుడు వానప్రస్థాశ్రమం స్వీకరించి, ఆ ధర్మాలను పాటిస్తూ , ముక్తసంగుడై సన్యాసాశ్రమం తీసుకోవచ్చు. సన్యసించి , దేహమాత్రావశిష్టుడై , సర్వభూతనిరపేక్షుడై , భిక్షుకుడై , నిరాశ్రయుడై , ఆత్మారాముడై , సర్వభూతసముండును, శాంతుడును, సమచిత్తుడును , నారాయణపరాయణుడు నై ప్రవర్తించాలి. సన్న్యాసి శరీరం పై కౌపీనం మాత్రమే ధరించాలి.దండ కమండలాలను విసర్జించాలి.ఆత్మపరము కాని శాస్తాలను వదిలి వేయాలి. కుతర్కాల జోలికి పోకుండా, ఆత్మచింతనతోనే  సమాధినిష్ఠ లో గడపాలి.ఒకే ఊరి లో పెక్కు దినములు ఉండక , ఒక ఊరిలో ఒక రాత్రి మాత్రమే గడపాలి. కార్యకారణాలకు అతీతమైన పరమాత్మ లో విశ్వాన్ని దర్శిస్తూ,జాగరణ, స్వప్న,సంధి సమయాలలో  ఆత్మనిరీక్షణ చేయాలి. ఆత్మ కు బంధమోక్షణాలు మాయామాత్రాలు కాని వస్తుప్రకారంబు న లేవని , ఈ దేహమునకు జీవితం ధ్రువం కాదని , మృత్యువు మాత్రమే ధ్రువమని తెలుసుకోవాలి. భూత దేహముల  యొక్క పుట్టుక, నాశనములకు కాలమే కారణమని తెలుసుకొని , అటువంటి కాలం కోసం నిరీక్షిస్తూ ఉండాలి. జ్యోతిషాది విద్యలను ప్రదర్శించడం , బహువిద్యలలో ఆసక్తి చూపడం సన్న్యాసి చేయకూడదు.

                       ఈ విధం గా  సన్న్యాసి జ్ఞానోత్పత్తి వరకు ప్రవర్తించి , ఆ తరువాత విజ్ఞాన విశేషం  సంభవించినట్లైతే పరమహంస యై దండాది చిహ్నాలు ధరించి కాని, ధరించక గాని  అంతరంగం లో ఆత్మను అనుసంధానం చేయగలిగి, విజ్ఞాని యై  , బాహ్యానుసంధానాలవల్ల ఇతరులకు ఉన్మత్తుని వలే, బాలుని వలే ,మూగవానివలే  కన్పించాలి.

                          ఇవి చతురాశ్రమ ధర్మాలు గా చెప్పబడుతున్నాయి.




************************ఇతి శమ్ ********************************