Saturday 1 June 2013

నారదుడు కలహభోజనుడా? పూజాభాజనుడా ?

              

           నారదుడు   కలహ భోజనుడా ?   పూజా భాజనుడా ?    
                
   


                    




                             నారదుడు  బ్రహ్మ దేవుని కుమారుడు. బ్రహ్మచారి. త్రిలోక సంచారి. సంసార బంథాలు లేని మహర్షి. ఎల్లప్పుడు  తన మహతి అనే వీణ పై నారాయణ నామ  గానం చేస్తూ   తాను తరిస్తూ,లోకాలను తరింప చేస్తుంటాడు. ఈ మహాను భావుడు చేసిన ఏ పనైనా లోక కళ్యాణార్థమే నని  చెపుతుంటారు.

                   
              వాల్మీకి మహర్షి కి  శ్రీరాముని సత్యపరాక్రమాన్ని గురించి , దివ్యగుణమహిమను గూర్చి  వివరించి, రామాయణాన్ని వ్రాయమని నిర్ధేశించినదీ, వ్యాకులచిత్తుడై యున్న వ్యాసుని చెంతకు వచ్చి భాగవతము వ్రాయమని ప్రేరేపించినది కూడ  నారదుడే. ఈ సందర్భం లో భాగవతం లో నారదుడు తన పూర్వ జన్మ వృత్తాంతాన్ని వ్యాసుల వారికి విన్పిస్తూ, హరిభక్తిని గూర్చి ఇలా అంటాడు.
        
                 “ ఓ వ్యాసమునీంద్రా !  హరినామ సంకీర్తనం తో ప్రకాశించే కావ్యం బంగారు కమలాలతో, కలహంస సమూహాలతో శోభాయమానమైన మానస సరోవరంలాగ మనోహరంగా ఉంటుంది. హరినామ సంకీర్తనం లేని కావ్యం చిత్ర విచిత్రాలైన అర్థాలతో కూడినదై కూడ దుర్గంధ భూయిష్టమై, కాకులు మూగిన ఎంగిలాకుల బురద గుంట వలె అసహ్యంగా ఉంటుంది. అని.   
                 
                   మరి  నేటి సమాజం లో నారదు డంటే ఇరువురి మథ్య బేధాలను కల్గించేవాడనే అర్థం  రూఢి అయిపోయింది. వీడొక నారదుడండీ, వీడొక అగ్గిపుల్లండీ వంటి  పుల్లవిరుపు మాటలు మనలో మామూలై పోయాయి.  మరి పురాణాలను పరిశీలిస్తే-
                 
               ఇతను బ్రహ్మ దేవుని ఊరువునుండి  నుండి జన్మించి నట్లు గా భాగవతం చెపుతోంది. దక్షుని కుమార్తె ప్రియ కును, బ్రహ్మ దేవునకు జన్మించిన వాడుగా బ్రహ్మ వైవర్త పురాణం లో వ్రాయబడింది.  
        
                భాగవతం లో అకంపనుడను వాడు పుత్రుని కోల్పోయి దు:ఖిస్తుంటే, అతని చెంతకు వెళ్లి మృత్యు ప్రకారాన్ని వివరించి అతనికి దుఖోపశమనాన్ని కల్గిస్తాడు. సృంజయునకు షోడశ రాజుల చరిత్రను వివరించి  మరణించిన ఆతని కుమారుణ్ణి  మరల పునరుజ్జీవితుని చేసి, ఇస్తాడు. ప్రహ్లాదుని మాతృమూర్తియైన లీలావతిని, ఇంద్రుడు అపహరించుకు పోతుంటే, వానికి గర్భస్థశిశువు  గొప్పతనాన్ని వివరించి, ఇంద్రుని నుండి ఆమెను కాపాడుతాడు.
      
               జలంధరుడనే రాక్షసుని దేవతలు జయింపలేక నారదుని సహాయ మడిగారు. నారదుడు జలంధరాసురుని దగ్గరకు వెళ్లి అశ్వరత్నాలు,గజరత్నాలు, సౌధ రత్నాలు ఉన్నాయి. కాని జాయారత్నం  లేకపోవడం నీకు పెద్దలోటు  అని కవ్వించాడు. శ్మశానం లో ఉండే శివునికి పార్వతీ దేవి ఎందుకు ?. ఆమెను తెచ్చుకొమ్మని సలహా యిచ్చాడు. తద్వారా శివుని చేతిలో  జలంధరాసురుని మరణం  సంప్రాప్తమైంది.
        
                     కాలయవనుడు బలగర్వంతో విఱ్ఱవీగుతున్నాడు.   వాని మద మణచడానికి నారదుడు కాలయవనుని చెంతకు వెళ్లాడు. శ్రీకృష్ణుడు జరాసంధు నోడించి గర్వంతో  తిరుగు తున్నాడు.  అతన్ని అలాగే వదిలేశావేమిటని కాలయవనుని రెచ్చగొట్టాడు. మధుర పై దండెత్తిన కాలయవనుడు నందనందనుని చేతిలో కాలధర్మం చెందాడు.
           
                   భాగవతం లో తన పూర్వజన్మవృత్తాంతాన్ని నారదుడే వ్యాసమహర్షికి వివరిస్తాడు. పూర్వజన్మ లో వేదవాదుల ఇంటి దాసికి జన్మించాడు. చాతుర్మాస దీక్షలో ఒకేస్థలం లో నివసించే మునులకు పరిచర్యలు చేస్తుండేవాడు. చిన్ననాటి నుండి వారినే  నుసరించి ఉండటం చేత  కొంతబ్రహ్మజ్ఞానం అలవడింది. అతని తల్లి పాలుపితకడానికి వెళ్లి పాముకాటుచే  మరణించింది. దానితో సంసారబంథము తెగిపోయిన నారదుడు ఆనందం తో  ఉత్తరాభిముఖుడై వెళ్లి, ఘోరారణ్యములో ఈశ్వరుని గూర్చి ఘోర తపస్సు చేశాడు. ఈశ్వరుడు  ప్రత్యక్షమైనా  చూడ లేకపోయాడు. అప్పుడు నారాయణుడు నీవీ శరీరమును విడిచి తరువాత జన్మమున మా ఆజ్ఞ చే జన్మించి, మా రూపమును చూడగలవని వరమిచ్చాడు. కొంతకాలానికి నారదుడు కర్మ స్వరూపమైన ఆ దేహాన్ని విడిచి, మరల బ్రహ్మ ప్రాణము వలన మరీచి మొదలగు మునిముఖ్యులతో కలసి  జన్మించినట్లు చెప్పుకున్నాడు నారదుడు.
             
                        వరాహ పురాణం లో చూస్తే -- నారదుడు మహిషాసుర వధ కు కారణ భూతుడు. మహిషాసురుని వలన లోకం లో బాధలు అధికమైనాయి. వానిని  దేవతలు కూడ ఓడించలేక పోయారు. ఆ సమయం లో నారదుడు మలయపర్వతము పై నున్న నారాయణి వద్దకువెళ్లి మహిషునకు కండకావరమెక్కి నిన్ను వివాహమాడెదనని వదరుచున్నాడు. వానిని  సంహరించమని ప్రార్థించాడు. మహిషుని చెంతకు వచ్చి నారాయణిని వివాహమాడని నీయౌవ్వనమొక యౌవ్వనమా ?  ఎటులైనను ఆమెను వివాహమాడ వలసిందనిరెచ్చగొట్టాడు. దానితో రెచ్చిపోయిన మహిషుడు తనను వివాహం చేసుకోవలసిందిగా నారాయణి కి కబురు పంపాడు.  దానితో ఉగ్రరూపిణి యైన నారాయణి చేతిలో మహిషాసురుడు మర్ధనుడైనాడు.  
            
             నారదుడు ఒక పర్యాయము  శ్వేత ద్వీపాని కెళ్ళాడు. అక్కడ అనేకమంది మన్మథ సదృశులైన వారు కన్పించగా, వారిలో శ్రీమహావిష్ణువును గుర్తించలేక  నారదుడు శ్రీమన్నారాయణుని ప్రార్థించెను. ప్రత్యక్షమైన శ్రీ మహావిష్ణువును విష్ణుమాయను చూపవల సిందిగా ప్రార్థించాడు నారదుడు. చిరునవ్వు నవ్విన   శ్రీ మహావిష్ణువు నారదమహర్షిని దగ్గరలో నున్న కొలను లో స్నానం చేసి రమ్మన్నాడు  . కొలనులో మునిగిన నారదుడు పైకి లేచే సరికి  స్త్రీ గా మారిపోయాడు. చారుమతి అనే పేరుతో కాశీరాజుకు కుమారై గా జన్మించాడు. శిబిని వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు నగ్నజిత్తు,విప్రజిత్తు, విచిత్తు, చారువక్త్రుడు, చిత్తుడు అనే ఐదుగురు కుమారులు జన్మించారు. వారు మహావీరులై తండ్రితో కలసి యుద్ధాల్లో పాల్గొంటూ, తుదకు కాశీరాజు చేతిలోనే వీరందరు  వీర మరణం పొందారు. భర్తృ, పుత్ర వియోగం తో  చారుమతి దు:ఖాన్ని భరించలేక  ఆత్మాహుతికి సిద్దపడింది.చితిలోకి ప్రవేశించబోతుండగా నారదునకు పూర్వరూపం వచ్చేసింది. అప్పుడు జరిగిన దంతా విష్ణు మాయ యని తెలుసుకొని  విస్తుపోవడం నారదుని వంతయ్య్దింది.
            
                  వరాహ పురాణం లోని మరొక కథ ననుసరించి – ఒక జన్మలో  నారదుడు సారస్వతుడను బ్రాహ్మణుడు గా జన్మించి, సంసార భారము పుత్రుని కప్పగించి, వనానికి వెళ్లి, శ్రీ మహావిష్ణువును గూర్చి ఘోర తపస్సుచేశాడు. ప్రత్యక్షమైన విష్ణువును  సాయుజ్య మివ్వ మని కోరుకున్నాడు.   కాని విష్ణువు నా తరువాత వాడు బ్రహ్మ . కావున నీవు బ్రహ్మ కు జన్మించి నా సాయుజ్యాన్ని పొందుతావని”” వరమిచ్చాడు. నారం దదాతీతి నారద : “--  నారము అంటే నీరు  అని,  నీవు ఎల్లవేళలా ఇతరులకు జ్ఞానము అనే నీటిని అందిస్తుంటావు  కాబట్టి నీవు నారదుడనే పేరుతోటి ప్రసిద్ధుడవౌతావని కూడ విష్ణువు  నారదుని  ఆశీర్వదించాడు.
            
             లింగ,  పురాణాన్ననుసరించి – నారదుడు హిమాలయాలమీద  ఘోర తపస్సు చేయసాగాడు. అతని తపస్సు ని భంగం చేయడానికి ఇంద్రుడు దేవకన్యలను పంపించాడు. కాని శివారాధన చేయడం వలన నారదుని మనస్సు చలించలేదట. కాని మన్మథుని గెలవడం, (అంటే దేవకన్యలకు లొంగక పోవడం) తన గొప్పతనమే అనుకున్నాడట నారదుడు. తపస్సును ముగించుకొని శివుని దర్శనం చేసుకొని, బ్రహ్మ,విష్ణువుల సందర్శనా నికి వచ్చాడు.విష్ణువు  శంకరుని మహాత్మ్యాన్నిగురించి చెప్పినా కూడ తన ప్రభావము వలననే కాముని గెలిచానని చెప్పుకొనసాగాడు నారదుడు. అందుచే నారదుడు వెళ్లే మార్గంలో ఒక సుందర నగరాన్ని నిర్మించి, అందులో శ్రీమతి అనే ఒక సౌందర్యరాశి ని నిలిపాడు విష్ణువు. ఆమెను చూచి మోహించిన నారదుడు ఆమె యొక్క స్వయంవరానికి వెళ్లడానికి తిరిగి విష్ణువు దగ్గరకొచ్చి  విష్ణువు రూపాన్ని తనకివ్వమని అడిగాడు నారదుడు.                        

         శివపురాణాన్ని అనుసరించి -  పర్వతుడు నారదునకు మేనల్లుడు. వీరిరువురు దేశాటనం చేస్తూ అంబరీషుని నగరానికి వచ్చారు. అంబరీషుని కుమార్తె శ్రీమతి ని చూచి ఇద్దరూ మనసు పడ్డారు. స్వయంవరం లో ఆమె ఎవరిని ఇష్టపడుతుందో వారికే ఇస్తానన్నాడు అంబరీషుడు.  అంతకు ముందే వీరిద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు విష్ణుమూర్తి దగ్గర కెళ్లి, నారదుని ముఖాన్ని కోతిముఖం చేయమని పర్వతుడు, పర్వతుని ముఖాన్ని కోతి ముఖం చేయమని నారదుడు అడిగి వచ్చారు. విష్ణుమూర్తి తథాస్తు అన్నాడు. స్వయంవరం మొదలైంది. విష్ణువు కూడ ఆ స్వయంవరానికి వచ్చాడు.  దివ్య సుందర రూపుడైన  శ్రీ మహావిష్ణువు ను శ్రీమతి వరించింది. విష్ణువు ఆమెను తీసుకెళ్ళిపోయాడు.  అంబరీషునిపై కోపించిన నారద,పర్వతులు  అతన్నితమోమయుడవు కమ్మని  శపించారు. సుదర్శన చక్రం అంబరీషునికి అండ గా నిలిచింది. భయపడి స్వర్గ లోకానికి పారిపోయిన వారిరువురికి  విష్ణువు ఇంట శ్రీమతి కన్పించింది. తమను కోతి ముఖా లను చేసి, మేము వలచిన కన్యను  తెచ్చుకున్నావు. నీవు నరుడవై వియోగ దుఖాన్ని అనుభవిస్తావు. చివరకు వానరుల సహాయం చేతనే తిరిగి నీ భార్యను పొందగలుగుతావు. అని నారద పర్వతులు విష్ణువు ను శపించారు. శివుని  ప్రభావం మూలంగానే ఇదంతా జరిగిందని చెప్పి, విష్ణువు అంతర్థానమయ్యాడు. వీరి శాప ప్రభావమే రామావతారంలో భార్యావియోగాన్ని విష్ణువు  పొందవలసి వచ్చినట్లు చెపుతోంది శివపురాణం. 
      
                     భారతం లో ఇటువంటి కథే కొద్దితేడా తో కన్పిస్తోంది.సృంజయుని కుమార్తె సుకుమారి ఈ కథలో  నాయిక.

                  దేవీభాగవతాన్ని అనుసరించి --- కొలను లో మునిగి లేచిన నారదుడు సుందరాంగి గా మారిపోయాడు. తాళధ్వజుడను రాజు ఆమెను మోహించి, రాణి గా చేసు కున్నాడు. కుమారులు కలిగారు. శతృ రాజులతో జరిగిన యుద్ధం లో వారు మరణిస్తారు. బిడ్డలకోసం విలపిస్తున్న ఆమెను విష్ణువు వృద్ధ బ్రాహ్మణుని రూపంలో వచ్చి పుత్రాదులు నిత్యం కాదని బోధించి, తన వెంట తీసుకొనివెళ్లి, కొలనులో స్నానం చెయ్యమన్నాడు. పూర్వ రూపాన్ని పొందిన నారదుడు విష్ణుమాయ ను తెలుసుకున్నాడు.  

                  బ్రహ్మ వైవర్త పురాణంలో --దక్షుడు తన కుమార్తె ప్రియ ను బ్రహ్మ దేవుని కిచ్చి వివాహం చేశాడు. ఆమెయందు నారదుడు జన్మించాడు.సృష్టిని వృద్ధి చేయమని  నారదునితో చెప్పాడు బ్రహ్మ. కాని నారదుడు సంసార బంథాలను తిరస్కరించాడు. బ్రహ్మ కోపించి, నీవు కాముకుడవై,  ...... పుట్టుమని శపించి, బ్రహ్మ జ్ఞానంచేత విష్ణుభక్తుడ వగుదువని అను గ్రహించాడు.. నారదుడు కోపించి,నీకు పూజా కవచములు లేకుండుగాక యని  బ్రహ్మకు ప్రతి శాపమిచ్చాడు.

               మనకు  పింగళి సూరన కళాపూర్ణోదయం లో  కన్పించే నారద మాత్సర్య వృత్తాంతము  కొంచెం తేడాతో  అద్భుత రామాయణం లోనిది గా కన్పిస్తుంది.  వైకుంఠంలో తుంబురునికి లభించిన సత్కారానికి ఈర్ష్యాళువైన నారదుడు శ్రీ మహావిష్ణువును ఆశ్రయించాడు. శ్రీకృష్ణావతారంలో నీ కోరికను  తీరుస్తానన్నాడు మహావిష్ణువు.  ద్వాపర యుగం లో శ్రీకృష్ణుని ఆశ్రయించాడు  మళ్లీ నారదుడు.ముందుగా తన భార్యయైన జాంబవతి దగ్గర, తరువాత మిగిలిన భార్యల దగ్గర ఒక్కొక్కరి వద్ద ఒక సంవత్సరం చొప్పున నేర్చుకొమ్మన్నాడు శ్రీకృష్ణుడు.. కాని అప్పటికీ తుంబురుని మించు గానకౌశలము పొందనేరక నారదుడు చివరకు శ్రీకృష్ణుని వద్ద  కూడ నేర్చుకొని,  అప్పటికి సంగీత కుశలుడై ,  అసూయను వీడి, సుఖముగా నున్నట్లు గా చెప్పిన కథ యిది.

                                మరి కొన్ని కథలు  కన్పిస్తున్నాయి.  పురాణము అంటేనే ఎప్పటి కప్పుడు కొత్తగా ఉండేది అని కదా అర్థం. పురా అపి నవం ఇతి పురాణం అని  ఆర్యోక్తి. అందువలన  వెదకితే ఇంకొన్ని కూడ లభించవచ్చు. కాని పిండితార్థం మాత్రం  నారదుడు కలహ భోజనుడైనా  విశ్వ శ్శ్రేయస్సును కాంక్షించే విశాల హృదయుడు. త్రిలోక సంచారి యైనా  లోకత్రయ కళ్యాణ కాంక్షి . కాబట్టి  పూజార్హుడే కాని దూషింప దగినవాడు కాదు.




 ******** लोकास्समस्ता : सुखिनो भवन्तु ****** **********************************************