Wednesday 19 September 2012

రామాయణము --- రమణీయకధనాలు – 4 - ఊర్మిళ

                   


                   ఊ ర్మిళ               
          




  శ్రీ  మద్రామాయణ మహాకావ్యంలో ఊర్మిళ  రామానుజుని  ఇల్లాలు. లక్ష్మణుని అగ్నిసాక్షిగా వివాహమాడి అయోథ్యానగరం అంత:పురంలో అడుగుపెట్టిన దశరథుని కోడలు. జనకరాజర్షి ఔరసపుత్రిక. సీతాసాథ్వి ముద్దుల చెల్లెలు.వాల్మీకి మహర్షి చే అందమైన పేరు పెట్టించుకున్న ముగ్ధ.  ” సీతాయా: చరితం మహత్ అంటూ సీతాకథాగానం లో మునిగిన మహర్షి అంత: పురం చేరిన ఊర్మిళను మళ్లీ పల్కరించలేదు. జనకుని కుమార్తెగానే ఊర్మిళ వాల్మీకంలో ప్రస్తావించ బడింది.
                          
                       సీతాం రామాయ భద్రంతే ఊర్మిళాం లక్ష్మణాయ చ
                             వీర్యశుల్కాం మమసుతాం సీతాం సురసుతోపమాం
                        
      ద్వితీయామూర్మిళాం చైవ త్రిర్ధదామి న సంశయ : !! {బా-కాం. 71-21]
        
  అంటూ జనకమహర్షి తన రెండవ బిడ్డను విశ్వామిత్రాదులకు పరిచయం చేశాడు. అంతేకాదు.
                     
                       లక్ష్మణాగచ్ఛ భద్రంతే ఊర్మిళాముద్యతాం మయా
                          ప్రతీచ్ఛ పాణిం గృహ్ణీష్వ  మా భూత్కాలస్య పర్యయ:

అని అల్లుని చేతిలో బిడ్డ నుంచి తన బరువును దించుకున్నాడు రాజర్షి.  [బా.కాం. 73-304 ]
అయోథ్యానగరంలో గృహప్రవేశాది విథిపూర్వక క్రియాకలాపం పూర్తి చేసుకొని అత :పురంలో అడుగుపెట్టిన  ఊర్మిళ తిరిగి కనపడలేదు.ఆమెకై చూచి చూచి నిరాశచెందిన సాహితీప్రియులు, రామకథాగానతత్పరులైన జానపదులు ఊర్మిళను కావ్యనాయికను చేసి కావ్యాలు వ్రాయడానికి,  ప్రయత్నించారు.
            
     శ్రీ మైథిలీశరణ్ గుప్త వంటి ప్రసిద్ద హిందీకవులు సాకేత్, పంచవటి వంటి కావ్యల్లో ఊర్మిళ ను అపురూప క్వ్యనయికగా సృష్టించి ఉపేక్షితను అపేక్షితగా మార్చి ఆమెయే రామకథాగమనానికి ప్రధానపాత్ర అన్నంతగా ఆ పాత్రకు విశిష్టతను ఆపాదించారు.తెలుగు  నేలపై  విన్పించే ఊర్మిళాదేవి నిద్ర,”“లక్ష్మణదేవరనవ్వు వంటి జానపదగేయాలు తెలుగువారికి ఊర్మిళ పై  నున్న అభిమానాన్ని, ఆరాధనాభావాన్ని ప్రస్పుటం చేస్తున్నాయి. ఒకవైపు హిందీకవుల ప్రభావం మరొకవైపు జానపద గేయాల ప్రభావం తెలుగు కవులను ప్రేరేపించగా  తెలుగుసాహితీ జగత్తులో కూడ ఊర్మిళ కావ్యనాయికగా ఆవిర్భవించింది.
                        
   ఊర్మిళా శేష శక్తి  ర్హి జనకస్యౌ రసీసుతా అని ఊర్మిళాదేవి ఆది శేషుని శక్తిగా పురాణాలు ప్రస్తావిస్తున్నాయి.{రామా.సా.-బాల-12-39 ] .  వాల్మీకి , తులసీదాసాదులే కాదు.కరుణా రసైక మూర్తిభవభూతి సైతం ఉత్తర రామచరిత్రలో ఊర్మిళావృత్తాంతాన్ని మాటమాత్రంగా వదిలివేయడం ఊర్మిళా దురదృష్టమే.
                    
    మిథిలానగరంలో ఆ కళ్యాణ ముహూర్తబలం ఎట్టిదోగాని ఆ ఆక్కచెల్లెండ్రు నల్గురు కష్టాల కడలిని యీదవలసిన వారయ్యారు. వారిలోను జనకపుత్రికలకే  కష్టాలు ఎక్కువగా కన్పిస్తాయి. అందులోనూ ఊర్మిళా లక్ష్మణుల జీవనగమనంలో రాముని కైంకర్యసమయమే ఎక్కువ. సీతాసాథ్వి భర్తృవియోగాన్ని సహించలేక ఆయనతో పాటు అడవులకు అడుగులు వేయడానికి సాహసిస్తే  --అన్నను అనుసరించాడు లక్ష్మణుడు. ఆసమయంలో భర్త వెంట ఊర్మిళ కూడా వస్తానందో అసలు లక్ష్మణుడు తను అన్న వెంట వెడుతున్నట్లు ఊర్మిళతో చెప్పాడో లేదో కూడ వాల్మీకి లేఖిని వ్రాయలేదు.
.                           
     తనవెంట అడవులకు వస్తానన్న తమ్మునితో  శ్రీరాముడు  “పృచ్చస్వ సౌమిత్రే సర్వమేవ సుహృజ్జనం “[ వా.రా.అ.కాం. 31-26 }అని-అంటాడు. ఇచ్చట సర్వమేవఅన్న సముచ్చయంలోనే ఊర్మిళ కూడ ఉండి ఉండవచ్చు.
                     

                     సీతారాములతో లక్ష్మణుడు అడవులకుపోగా ఏకాంతంగా అంతపురంలో పదునాల్గు వసంతాల్ని గడపటం ఊర్మిళ వంతయ్యింది. మాండవీ శ్రుతకీర్తులకు కనీసం భర్తల సాహచర్య భాగ్యమన్నా లభించింది కానీ ఊర్మిళకు నాథుని నిరీక్షణలోనే నిండువేసవులు, గండు శీతులు నిండు గ్రీష్మాలు గానే మిగిలిపోయాయి. రాజపుత్రికగా సామాన్యమైన ఆలోచనలకు అతీతంగా ఆవిడ ఎలా ఉండగలిగిందన్న ఆలోచన  కవుల కలాలకు కొత్త ఊపిరినిచ్చింది. భాషాబేధం లేని  రీతిలో ఉత్తర, దక్షిణ భారతదేశ కవుల హృదయాలలో కొత్త కొత్త భావాలకు పరదాలు తీసిన ఊర్మిళ పాత్ర  ఉత్తమ కావ్యసృష్టికి కారణభూతమైంది.
                         
    శ్రీ మైథిలీ శరణ్ గుప్త పంచవటి కావ్యంలో పర్ణశాలకు వెలుపల శిలాతలంపై కూర్చొని దీర్ఘాలోచనల్లో మునిగిపోయిన లక్ష్మణుని ఊహల్లోకి ఊర్మిళను రప్పించారు. ప్రణయదేవత ఊర్మిళా మధుర స్మృతులు ఊహల్లో ఊరట కల్గిస్తుండగా శూర్పణఖాగమనం సంభవిస్తుంది. ఊర్మిళా మనోనాథుడు శూర్పణఖను చూసే సమయానికి అతని మనస్సులో ఊర్మిళయే నిండి ఉన్న సన్నివేశం ఔచితీ సంభరితం.
                       
  సాకేత్ కావ్యంలో రాముని తీసుకురావడానికి చిత్రకూటానికి బయలుదేరిన భరతుని వెంటవున్న అంత:పురజనంలో ఊర్మిళను కూడ పంపించి, అక్కడ పర్ణశాల లో ఒంటరిగా ఊర్మిళా లక్ష్మణులను కలిపి తృప్తిగా నవ్వుకొన్నారు  శ్రీ మైథిలీ శరణ్ గుప్త.
                 
     ఊర్మిళ సమాథి లోనే ఉండి ఆ నిద్ర లోనే పధ్నాలుగు సంవత్సరాలు గడపడం జానపదుల సృష్టి. కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది అనేది జనపదాల్లో వాడుకలో ఉంది. అందుకే ఆవిడ బాథ వీళ్ల భాధగా భావించి  ఊర్మిళను సమాథి లోకి పంపించారు జానపదులు. అదేమార్గంలో కొంతమంది తెలుగు కవులు కూడ తమకావ్యాల్లో ఊర్మిళను సమాథి లోకి పంపించి ,యోగ ప్రభావంతో ఆవిడ భర్తను ప్రత్యక్షంగా దర్శిస్తూ, సంభాషిస్తున్నట్లు ,తుదకు రామాదులు అయోథ్యకు తిరిగి రావడాన్ని కూడా తన యోగవిద్యాప్రభావం తో  తెలుసుకొని ఊర్మిళ యే ముందుగా అంత: పురంలో అందరికీ తెలియజేసినట్లుగా  కూడ వ్రాసేశారు.
                               
      పతంజలి యోగశాస్త్రం లో  సమాథిని గురించి    ఇదేవాత్మ మాత్మవిర్భాసం స్వరూప శూన్యమివ సమాథి: { ప.యో.శా.-3.2, 3.3]అని చెప్పబడింది.

తాను థ్యానించే వస్తువుని మాత్రమే భావించడం థ్యానమనబడుతుంటే, థ్యానం థ్యానించే వస్తువు        యొుక్క స్వరూపంగా పరిణమించి థ్యానిస్తున్నాననే   బాహ్యస్మృతి లేకపోవడమే సమాథి.
అటువంటి సమాథి స్థితిలోనే  ఊర్మిళ ఫధ్నాలుగు వసంతాలు గడిపిందని కొందరు కవులు యోగశాస్త్ర ప్రసక్తి ని కూడా తమ కావ్యాల్లోకి తీసుకొచ్చారు. ఊర్మిళ ను ఉత్తమ నాయికగా తీర్చి దిద్దారు.ా
                            
    ఊర్మి అంటే తరంగం. రామాయణ కథావేగాన్ని పెంచడానికి ఈ ఊర్మి ఉపయోగపడి,వేగంగా కథను గమ్యానికి చేర్చి, రామకథాబంథాన్ని ఏకసూత్రంగా  మలచిందని  చెప్పవచ్చు.రాముని వెంట లక్ష్మణుడు వెళ్లకపోతే రామకథకు పరిపూర్ణతే లేదు గదా! అందుకు పరోక్ష సహకారి ఊర్మిళ.
              
    భజ్యతే స్వయమేవ భంగ: అన్న నిర్వచనాన్ని అంగీకరిస్తే తనంత తాను నశించునది అనే అర్థంలో రాముని సేవకై పతిదేవుని పంపి పథ్నాలుగువసంతాలు నిద్రామూర్తిగా,నిశ్చైతన్యగా, యోగినిగా తన్నుతాను కృశింప చేసుకొని తపస్వినిగా రూపొందిన ఊర్మిళ కు వాల్మీకి చేసిన నామకరణం సార్థకమేననిపిస్తుంది.







-- వందే రామం దూర్వాదళశ్యామం సీతాపతిం సుందరం -