Tuesday 27 May 2014

శతకసౌరభాలు - 2 ధూర్డటి శ్రీ కాళహస్తిీశ్వర శతకము - 4



శతక  సౌరభాలు  -2
                
                           ధూర్జటి   శ్రీ కాళహస్తీశ్వర శతకము - 4

    


     మదమాతంగములందలంబులు హరుల్మాణిక్యముల్పల్లకుల్
     ముదితల్ చిత్రదుకూలముల్పరిమళంబుల్మోక్ష మీ జాలునే
     మదిలో వీని నపేక్ష చేసి నృపధామ ద్వారదేశంబు గాం
     దినంబుల్  వృథ పుత్తు రజ్ఞు లకటా శ్రీ కాళహస్తీశ్వరా !
           

                   శంకరా ! ఏనుగుల ,గుఱ్ఱాలు , పల్లకీలు , రత్న మాణిక్యాలు ,పట్టువస్త్రాలు ,  స్త్రీలు అలంకారాలు మోక్షము నీయలేవు .  అజ్ఞానులు వీటినే కోరి  రాజద్వారాల వద్ద రోజుల కొద్దీ పడిగాపులు పడి వృథా గా కాలాన్ని వ్యర్దం చేసుకుంటారు . ఎంత అవివేకులు  వారు .
 
    రోసీ రోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్
    పాసీ పాయదు పుత్రమిత్ర ధన సంపద్ర్భాంతి , వాంఛా లతల్
    కోసీ కోయదు నా మనంబకట ,నీకున్ బ్రీతి సత్ర్కియల్
    చేసీ చేయదు  దీని త్రుళ్ళణచవే  ! శ్రీ కాళహస్తీశ్వరా !
           
                  శ్రీ కాళహస్తీశ్వరా  ! నా మనస్సు యౌవ్వన సుకాలను అసహ్యించుకుంటూనే అనుభవిస్తూ ఉంటుంది. పుత్ర మిత్ర ధన సంపద్భ్రాంతి  వదిలేసినట్లే ఉంటుంది కాని వదలలేదు . కోరికలనే తీగలను  తెంచి వేస్తుందే కాని పూర్తిగా కోసి పారవేయలేకపోతోంది . నామనస్సు నీకు ప్రీతి కల్గించే సత్కార్యాలను చేస్తన్నటేలే టుంది కాని చేయదు . కావున దీని పొగరును అణచి నీ మార్గానికి తెచ్చుకొమ్ము  తండ్రీ  !
      
        ఎన్నేళ్ళుండుదు నేమి గందునిక నే నెవ్వారి రక్షించెదన్
     నిన్నే నిష్ట భజించెద న్నిరుపమోన్నిద్ర ప్రమోదంబు నా
     కెన్నండబ్బెడు  నెంతకాలమిక నేనిట్లున్న నన్నియ్యెడం
     జిన్నంబుచ్చక నన్ను నేలుకొనవే శ్రీ కాళహస్తీశ్వరా !
                  
      శ్రీశంకరా !.నేనింకా ఎన్నేళ్లు బ్రతుకుతాను  ? బతికి చూడవలసిన దేముంది  ? నేనింకా ఎవ్వరిని కాపాడాలి  ? ఎటువంటి నిష్ట తో నిన్ను పూజించ గలను  ? సుషుప్త జాగ్రదవస్ధ ల్లో కూడ నీ స్మరణ నాకు ఎప్పుడు లభిస్తుందో ? ఇంకా ఎన్నాళు నేనిలా అశక్తుడు గా ఉండిపోవాలి  ? నన్ను నీవు చిన్నబుచ్చక త్వరగా నీచెంతకు చేర్చుకో స్వామీ !

                      భక్తి శతక రచన లోని ప్రధానాంశము ఆత్మ నివేదనము . కవి తన ఆవేదనను రోదనను మనసు చించి తన దైవం ముందు ఆరపోస్తాడు.  అప్పుడే కవి కి ఆత్మ తృప్తి కలుగి  ,మనసు తేలిక పడుతుంది .

    చావం కాలము చేరువౌటెరిగియుం చాలింపగా లేక ,త
    న్నే వైద్యుండు చికిత్సఁబ్రోవగలడో ,ఏ మందు రక్షించునో ,
    ఏ వేల్పుల్ కృపజూతురో యనుచు నిన్నింతైన చింతిప డా
    జీవశ్రాద్ధము చేసికొన్న యతియున్ ; శ్రీ కాళహస్తీశ్వరా !
  
         శ్రీ కాళహస్తీశ్వరా ! మానవుడు చావుకాలము దాపురించినదని తెలిసి కూడ , బ్రతుకు పై ఆశను చంపుకోలేక , తనను ఏ వైద్యుడు కాపాడతాడా ఏమందు ర7స్తుందా , ఏ దేవుడు తన ప్రాణాలను నిలబెడతాడా అని ఆలోచిస్తాడే కాని గయ వంటి ప్రదేశాల్లో జీవశ్రాద్ధము పెట్టుకున్న సన్యాసి కూడ ఆ సమయం లో నిన్ను గూర్చి కొంచెము కూడ ప్రార్ధంచడు కదా  !

   దినముం జిత్తములో సువర్ణ ముఖరీతీర ప్రదే శామ్ర కా
   నన , మధ్యోపలవేది కాగ్రమున నానందంబునం పంకజా
   సన నిష్ట న్నినుఁ జూడఁ గన్న నదివో సౌఖ్యంబు లక్ష్మీవిలా
  సిన  మాయానటనల్ సుఖంబులగునే ? శ్రీ కాళహస్తీశ్వరా !

                   ఈశ్వరా !   ప్రతి రోజు సువర్ణ ముఖీనదీ తీర మందున్న మామిడి తోట  మధ్యలో నున్న బండరాతి పై  ఆనందంగా   పద్మాసనం లో కూర్చొని నిన్ను చూడగల్గినదే సౌఖ్యము. కాని చంచలమైన సంపదలచే లభించు ఆనందములు సుఖము నీయవు కదా !
 
  ఆలంచు న్మెడగట్టి , దానికి నపత్యశ్రేణిఁ గల్పించి , త
  ద్బాలవ్రాతమునిచ్చి పుచ్చుకొను సంబంధంబు గావించి ,యా
  మాలార్కంబున బాంధవంబనెడి ప్రేమం గొందరం ద్రిప్పగా
  సీలన్సీల నమర్చినట్లొ సగితో : శ్రీ కాళహస్తీశ్వరా !

                         ఈశ్వరా  !  భార్య అనే ఒక దాన్ని మెడకు కట్టి , దానికి పిల్లలు అనే వాళ్ళను కల్పించి , వారికి పిల్లలను  వారికి  అల్లుళ్ళూ ,కోడళ్లూ   ఇచ్చి పుచ్చుకునే సంబంధాలను కల్పించి ,  ఒక దండ వలే బంధుత్వమనే ఒక మోహబంధం లో ఈ జీవిని బంధించి చోద్యము చూస్తున్నావు గా స్వామీ ! 

 తనువే నిత్యముగా నొనర్పుమది లే దా చచ్చి , జన్మింపకుం
 డు నుపాయంబు ఘటింపు , మా గతులరెంట న్నేర్పులేకున్న లే
 దని నాకిప్పుడె చెప్పు చేయగల కార్యంబున్న సంసేవ జే
  సి నినుం గాంచెదఁ గాక కాలముననో ; శ్రీ కాళహస్తీశ్వరా !

                  శంకరా ! ఈ శరీరానికి  మరమం లేకుండా చెయ్యి. లేదా మరణించిన తరువాత  తిరిగి పుట్టకుండా ఏదైనా సులువైన ఉపాయం ఏర్పాటుచెయ్. ఆ రెండు చేతకాకపోతే నాకు ఇప్పుడే చెప్పు. నా ప్రయత్నాలేవో  నేను  చేసుకొని , ఏవో పాట్లు పడి , మరణానంతరం లో నీ చెంతకు  చేరుకుంటాను .

పదునాల్గేలె మహాయుగంబు లొక భూపాలుండు ,చెల్లించె న
య్యుదయాస్తాచల సంధి నొకడా యుష్మంతుడై , వీరియ
భ్యుదయం బెవ్వరు చెప్పగా వినరొ అల్పుల్మత్తులై యేల చ
చ్చెదరొ రాజులమంచు నొక్క టకటా ! శ్రీ కాళహస్తీశ్వరా !

       శ్రీ కాళహస్తీశ్వరా . ! ఒక రాజు పధ్నాలుగు వేల మహాయుగములు పరిపాలించాడు. ఒక ప్రభువు  ఆయుష్మంతుడై ఉదయాస్తమయ పర్వతముల మధ్య భాగాన్ని అనేక సంవత్సరాలు పాలించాడు . ఇటువంటి వారి చరిత్రలు  విని కూడ  నేడు అల్పబుద్ధి గల రాజులు  తమ స్ధాయిని మరచిపోయి తాము కూడ రాజుల మని విర్రవీగుచూ మరణిస్తున్నారు. ఎంత విచిత్రము .

రాజన్నంతనె బోవునా గృపయు ధర్మంబాభిజాత్యంబు వి
ద్యాజాతక్షమ ,సత్యభాషణము ,విదన్మిత్ర సంరక్షయున్,
సౌజన్యంబు ,కృతంబెరుగుటయు , విశ్వాసంబు గాకున్న దు
ర్బీజ శ్రేష్టులుగా గతంబు గలదే ? శ్రీ కాళహస్తీశ్వరా !

                         ఈశ్వరా  ! ఒక వ్యక్తి రాజైనంత మాత్రముననే అంతకు ముందు అతని లో ఉన్న దయ , ధర్మగుణము , సత్కులీనత , విద్య , క్షమ , సత్యవాక్యము , పండితులను గౌరవించుట , స్నేహితులను రక్షించుట , చేసిన మేలును గుర్తుంచు కొనుట , విశ్వాసము కల్గియుండుట  మొదలగు మంచి లక్షణములు  నశించిపొవును . లేకపోతే రాజులు ఇంత నీచులుగా మారిపోవడానికి కారణం వేరే లేదు.
                
అమరస్రీల రమించినన్జెడదు మోహంబింతయు న్ర్బహ్మప
ట్టము సిద్ధించిన నాసదీరదు ,నిరూఢ క్రోధమున్ సర్వలో
కముల న్ర్మింగిన మానదిందుగల సౌఖ్యంబొల్ల , నీ సేవ చే
సి మహాపాతక వారాశి గడుతున్ ; శ్రీ కా ళహస్తీశ్వరా !     
       
                    ఈశ్వరా  ! ఈ మానవులకు  దేవతాస్త్రీలను అనుభవించినను కోరిక  తీరదు. బ్రహ్మ పదవి లభించినను ఆశ తీరదు . సమస్త లోకములను మ్రింగివేసినను అకారణ కోపము చల్లారదు . అందువలన ఈ సుఖభోగములు నాకు అక్కరలేదు .  నీ సేవచేసి ఈ మహపాతక మనే సముద్రాన్ని దాటాలని కోరుకుంటున్నాను స్వామీ  !

  చను వారింగని ఏడ్చువారు జముడా ! సత్యంబు గా వత్తుమే
మనుమానంబిక లేదు నమ్ముమని తా రావేళ నా రేవునన్
మునుగం బోవుచు బాసజేయుట సుమీ ముమ్మాటికిం జూడగా
చెనటుల్గానరు దీని భావమిదివో  ! శ్రీ కాళహస్తీశ్వరా !    ( 42 )

           శంకరా ! మరణించిన వారిని గూర్చి ఏడ్చేవారు   ఓ యమధర్మ రాజా . ! మేముకూడ తప్పనిసరిగా మరణించి వీని వెనుకే వచ్చెదము . ఎటువంటి సందేహము లేదు అని వారు  శవ సంస్కారవేళ యందు ఆ రేవు నందు  స్నానములు చేయుచు చేయు  వాగ్దానములే . కాని  ఇది తెలివితక్కువ వారు తెలుసుకోలేక    భ్రాంతి లో ఉన్నారు  స్వామీ !

                                                  చదువుతూ .. ఉండండి . మరికొన్ని అందిస్తాను .





*********************************************************************************





.