Monday 7 July 2014

శతకసౌరభాలు -3 మారన భాస్కరశతకము - 4


శతక సౌరభాలు -3
                        
                                మారన        భాస్కరశతకము - 4




భ్రష్టున కర్ధవంతులగు బాంధవు లెందరు గల్గినన్ నిజా
దృష్టము లేదు గావున దరిద్రతఁ బాపగ లేరు, సత్కృపా
దృష్టిని నిల్పి లోకుల కతి స్ధిర సంపద లిచ్చు లక్ష్మి యా
జ్యేష్ట కదేటికిం గలుగఁ జేయదు తోడనె పుట్టి భాస్కరా !
       

                      భాస్కరా ! అదృష్టము లేని వానికి  భాగ్యవంతులైన బంధువులు ఎందరున్నను వానికి భాగ్యరేఖ లేనందువల్ల వాడి దరిద్రాన్ని ఎవరూ పోగొట్టలేరు. ఎందుకంటే  ప్రజలందరకు చల్లని చూపుతో శాశ్వతమైన సంపదలనిచ్చెడి లక్ష్మీదేవి తన తోడబుట్టిన జ్యేష్టాదేవి కి మాత్రం  ఏమీ  సహాయం చేయలేకపోయింది కదా !


మదిఁ దను నాసపడ్డ యెడ మంచి గుణోన్నతుఁ డెట్టి హీనునిన్
వదలడు మేలుపట్టున నవశ్యము మున్నుగ నాదరించుగా
త్రిదశ విమాన మధ్యమునఁ దెచ్చి కృపామతి సారమేయమున్
మొదల నిడండె ధర్మజుడు మూఁగి సురావళి చూడ భాస్కరా !


                              భాస్కరా ! గుణవంతుడైన వాడు తన్ను నమ్ముకున్నవాడు ఎంత పనికి మాలిన నీచుడైనా వాడిని విడిచిపెట్టడు. అవకాశమొచ్చినప్పుడు వాడిని  పైకి తీసుకొని ఆదరిస్తాడు. ఎలాగంటే ఆనాడు ధర్మరాజు  స్వర్గానికి వెళుతూ , తన్ను నమ్మి వెంట వస్తున్న కుక్కను ముందుగా దేవతా విమానం ఎక్కించి ,  దేవతలందర్నీ ఆశ్చర్యపరిచాడు కదా !


మాటల కోర్వజాల డభిమాన సమగ్రుడు  ప్రాణహానియౌ
చోటుల నైనఁ దాఁ నెదురు చూచుచు నుండుఁ  గొలంకు లోపల
న్నీటమునింగి నప్పుడతి నీచము లాడిన రాజరాజు పో
రాటమొనర్చి నేల బడ డాయెనె భీముని చేత భాస్కరా !

                      భాస్కరా ! అభిమానధనుడైన వాడు ప్రాణాలనైనా విడుస్తాడు కాని మాట పడడు. ఎలాగంటే కురుక్షేత్ర యుద్ధం చివరలో ప్రాణభయం తో మడుగున దాగిన దుర్యోధనుడు పాండవులు పలుకుతున్న అవమానకర మాటలను సహించలేక వెలుపలికి వచ్చి , భీముని చేతిలో మరణించాడు కదా !

మానవనాథుఁ డాత్మరిపు మర్మమెరింగిన వాని నేలినం
గాని జయింపలే డరుల గార్ముకదక్షుడు రామభద్రుఁడా
దానవ నాయకున్ గెలువఁ దానెటు లోపుఁ దదీయ నాభికా
స్ధాన సుధ న్విభీషణుడు తార్కొని చెప్పకయున్న భాస్కరా !

                         భాస్కరా ! రాజు శత్రువు యొక్క రహస్యాలు తెలుసుకుంటే గాని  త్వరగా విజయాన్ని సాధించలేడు. ఎందుకంటే  గొప్పధనుర్విద్యానైపుణ్యం కల్గినప్పటికీ శ్రీ రామచంద్రుడు రావణుని సంహరించడానికి విభీషణుని నుండి రావణుని  నాభి యందలి అమృతభాండ  రహస్యాన్ని తెలుసుకోవాల్సి వచ్చింది కదా !

మును పొనరించు పాతక మమోఘము జీవులకెల్ల బూని యా
వెనుకటి జన్మమం దనుభవింపక దీరదు , రాఘవుండు వా
లిని బడవేసి తామగుడ లీల యదూద్భవుడై కిరాతుచే
వినిశిత బాణపాతమున వీడ్కొనడే తన మేను భాస్కరా !

                          భాస్కరా !  ఎంతటి వారికైనా పూర్వజన్మ  సంచిత చేసిన పాపాన్ని  తర్వాత జన్మలో అనుభవింపక తప్పదు.  శ్రీ రామచంద్రుడు వాలిని  అన్యాయం గా చంపిన పాపానికి తరువాత  కృష్ణావతారం లో కిరాతుని బాణానికి  తనప్రాణాన్ని వదిలేశాడు గదా !

మానిని చెప్పు నట్లెఱుక మానిన వాఁడటు చేసినన్ మహా
హాని ఘటించు నే ఘనుని కైన నసంశయ ముర్విపైఁ గృపా
హీనతఁ బల్కినన్ దశరధేశ్వరుఁ డంగన మాటకై గుణాం
భోనిధి రాముఁబాసి చనిపోవఁడె శోకము తోడ భాస్కరా !

                              భాస్కరా ! ఎంత గొప్పవాడైనా  ఆడదాని చెప్పుడు  మాటలను విని నడుచుకుంటే ఆపదలను పొందుతాడు . దీనిలో సందేహమే లేదు. పూర్వము దశరథుడు కైకేయి మాట విని శ్రీరాముని అడవికి  పంపి  , ఆ దుఖం తోనే మరణించాడు కదా !

రాకొమరుల్ రసజ్ఞుని దిరంబుగ  మన్నన నుంచినట్లు భూ
లోకమునందు మూఢుఁ దమ లోపల నుంపరు ,నిక్కమే కదా !
చేకొని ముద్దుగాఁ జదువు చిల్కను బెంతురు గాక పెంతురే
కాకము నెవ్వరైన,  శుభకారణ సన్ముని సేవ్య భాస్కరా !

                     శుభములకు మూలకారణమైన వాడా  ! మునీశ్వరులచే పూజించబడు భాస్కరా !  మానవులు  ముద్దుగా మాటలు చెప్పే చిలుకను పెంచుకుంటారు కాని కాకిని పెంచరు కదా. అలాగే రాజులు కూడ  రసజ్ఞుడైన కవిని తన ఆస్థానం లో   మన్నించి ,గౌరవిస్తారు కాని మూఢుని చేర దీయలేరు కదా !

                                        లోకములోన దుర్జనుల లోతు నెఱుంగక చేరరాదు సు
శ్లోకుడు జేరినం గవయఁజూతురు చేయుదు రెక్కసక్కెముల్
కోకిలఁ గన్నచోట గుమిగూడి యసహ్యపు గూతలార్చుచున్
గాకులు తన్నవే తరిమి కాయము తల్లడమంద భాస్కరా !

                          భాస్కరా ! ఈ లోకంలో మంచివాడు  దుర్మార్గుల స్వభావాన్ని తెలసుకోకుండా వారి చెంతకు వెళ్ళరాదు. అలా వెళితే దుర్మార్గులు  మూకుమ్మడిగా  సజ్జనుని పై దాడి , గేలి చేస్తారు. కోకిలను చూచిన కాకులు  కారుకూతలు కూస్తూ  , ఆ కోకిలను కమ్ముకొని,  గోళ్ళతో రక్కుతూ గాయపరుస్తాయి కదా !    

వంచన  యింత లేక యెటువంటి మహాత్ముల నాశ్రయించినన్
గొంచెమె కాని మేలు సమ గూడ డదృష్టము లేనివారికిన్
సంచితబుద్ధి బ్రహ్మ ననిశంబును వీపున మోచునట్టి రా
యంచకుఁ దమ్మితూండ్లు దిననాయె గదా ఫలమేమి భాస్కరా !

                             భాస్కరా !  గొప్పవారిని ఆశ్రయించి మనం  మనస్ఫూర్తిగా   ఎంత సేవించినా, ప్రాప్తమున్నంతవరకే ఫలం లభిస్తుంది కాని  అంతకు మించి ఆవగింజంతైనా లభించదు. లోకాలను సృష్టించే ఆ బ్రహ్మదేవునకు వాహనమైన కూడ రాజహంసకు తామరతూండ్లే ఆహారమైనాయి కదా !

వలనుగఁ గానలందుఁ బ్రతివర్షమునం బులి నాలుగైదు పి
ల్లఁలగను దూడనొక్కటి నిలం గను ధేనువు రెండు మూడునే
డుల కటులైన బెబ్బులి కుటుంబము లల్పములాయె నాలమం
దలు గడువృద్ధిఁ జెందవె యధర్మము ధర్మము దెల్ప భాస్కరా !

                              భాస్కరా ! ఎప్పుడైనా అధర్మం మీద ధర్మమే గెలుస్తుంది .నిలుస్తుంది కూడ. ఎలాగంటే అడవిలో ఉండే పెద్దపులి ప్రతి సంవత్సరం నాలుగైదు పిల్లలను కంటూ ఉంటుంది.    మనదొడ్లో ఆవు  రెండు మూడు సంవత్సరాలకు ఒక దూడను పెడుతుంది . అయినా గో వంశమే వృద్ధి చెందుతోంది గాని బెబ్బులి వంశం వృద్ధి చెందటం లేదు కదా !

వానికి విద్య చేత సిరివచ్చె నటంచును విద్య నేర్వగాఁ
బూనిన బూనుఁ గాక తన పుణ్యము చాలక భాగ్యరేఖకుం
బూనగ నెవ్వఁడోపు  సరిపో చెవి పెంచునుగా కదృష్టతా
హీనుడు కర్ణభూషణము లెట్లు గడింపగ నోపు భాస్కరా !

                    భాస్కరా ! ఒకడు బాగా చదువుకోవడం మూలంగా  బాగా సంపాదిస్తున్నాడని వేరొకరు కూడ బాగా చదువుకోవచ్చుకాని వానికి అదృష్టం చాలకపోతే డబ్బును సంపాదించలేడు. లాగంటే చెవికి రంధ్రాన్ని పెద్దదిగా చేసుకోవచ్చుకాని  కర్ణ కుండలాలను సాధించుకోవడం కష్టం కదా !

వలవదు క్రూర సంగతి యవశ్యమొకప్పుడు సేయంబడ్డచో
గొలదియె కాని యెక్కువలు గూడవు , తమ్ములపాకు లోపలం
గలసిన సున్నమించుకయ కాక మఱించుక ఎక్కువైనచో
నలుగడఁ జుఱ్ఱుజుఱ్ఱు మని నాలుక పొక్కకయున్నె భాస్కరా !

                    భాస్కరా !  చెడ్డవానితో స్నేహము ఎప్పుడూ చేయకూడదు అంతగా చేయాల్సివచ్చినా పరిమితం గా చేయాలి లేకపోతే  అపాయమే. తమలపాకు లోకి సున్నం కొంచెం రాసుకుంటే నోరు పండుతుంది కాని ఎక్కువైతే నాలుక పొక్కుతుంది కదా !

సార వివేక వర్తనల సన్నుతి కెక్కిన వారి లోపలం
జేరిన యంత మూఢులకుఁ జేపడ దానడ యెట్టులన్నఁ గా
సారములోన హంసముల సంగతి నుండెడి కొంగపిట్ట కే
తీరున గల్గనేర్చును దదీయగతుల్ దలపోయ భాస్కరా !

                      భాస్కరా ! మూర్ఖుడు మంచివారితో కలిసి తిరిగినను వాడికి మంచిలక్షణాలు రావు.  సరస్సులో హంసలతో కలిసి కొంగలు సంచరించి నంత మాత్రాన హంసల నడకలు కొంగలకు రావు కదా !

సిరి గల వాని కెయ్యెడలఁ జేసిన మేలది నిష్భలంబగున్
నెఱి గుఱి కాదు పేదలకు నేర్పునఁ జేసిన సత్ఫలంబగున్
వఱపున వచ్చి మేఘుండొక వర్షము వాడిన చేలమీదటం
గురిసినఁ గాక యంబుధుల గుర్వగ నేమి ఫలంబు భాస్కరా !

                          భాస్కరా ! ధనవంతునికి మనం ఎంత సహాయం చేసినా అది  ప్రయోజన రహితమే అవుతుంది. అదే సహాయం పేదవానికి చేస్తే ప్రయోజనం ఉంటుంది. ఎలాగంటే మేఘుడు  వచ్చి  వాడిన చేల మీద వర్షాన్ని కురిపిస్తే ప్రయోజనం ఉంటుంది కాని సముద్రం లో వాన కురవడం వలన ప్రయోజనం లేదు కదా !

స్ధిరతర ధర్మవర్తన బ్రసిద్ధికి నెక్కిన వాని నొక్క ము
ష్కరుఁ డతి నీచవాక్యములఁ గాదని పల్కిన నమ్మహాత్ముడుం
గొఁఱత వహింపడయ్యెడ, నకుంఠిత పూర్ణ సుధాపయోధిలో
నరుగుచు  గాకి రెట్ట యిడి నందున నేమి కొఱంత భాస్కరా !

                     భాస్కరా ! ఒక మంచివానిని  నీచుడొకడు అతి హీనముగా నిందించినను      ఆ  మహనీయునకు ఎటువంటి అవమానం  ఉండదు . కాకి ఆకాశం లో ఎగురుతూ  సముద్రం లో రెట్ట వేసినంత మాత్రాన  సముద్రానికి వచ్చిన కొరత ఏముంటుంది.

  ఇంచుక నేర్పుచాలక విహీనతఁ జెందిన నాకవిత్వమున్
         మించు వహించె నీకతన మిక్కిలి యెట్లనఁ దోలుబొమ్మలున్
మంచి వివేకి వాని తెర మాటున నుండి ప్రశస్తరీతి నా
                డించిన నాడవే జనుల డెందము నింపవె ప్రీతి భాస్కరా !    (109 )

                       భాస్కరా ! నేర్పరి యైన వాడు తెరచాటు నుండి తోలు బొమ్మల నాడించి , ప్రజల మనస్సులను రంజిల్ల చేసినట్టు కవిత్వం వ్రాయడం లో ఏ మాత్రం నైపుణ్యం లేని   నాకవిత్వం  నీ కారణం చేతనే ప్రసిద్ధి పొందింది. అంటూ ముగించాడు మారన  తన భాస్కర శతకాన్ని.

                                                 ఇది భాస్కర శతకము. తేజస్వినీ వ్యాఖ్యా సహితము

                                                                       సంపూర్ణము.



*********************************************************************************