Friday 24 March 2017

నాల్గవ ప్రకరణం - పుణ్యక్షేత్రాల్లో చాగివారు




నాల్గవ ప్రకరణం


  పుణ్యక్షేత్రాల్లో            చాగివారు
                          

                     చాగి వారి పరిపాలనాపరిథి లో విలసిల్లి ఆనాటికే ప్రసిద్ధ తీర్థ స్థలాలు గా కీర్తించబడిన పుణ్యతీర్థాలు రెండు. ముక్త్యాల మొదటిది కాగా రెండవది వేదాద్రి.   ఈ ఆలయ ప్రాంగణాల్లో ఆనాటి చాగి వంశీయులు వేయించిన శాసనాల వలన ఈ  తీర్థక్షేత్రాల   ప్రాచీనత ను మనం  గమనించడానికి అవకాశం కలుగుతోంది. అంతేకాకుండా  ఆనాటి రాజులు స్వామివారికి చేసిన కైంకర్యాలను తెలుసుకోవడానికి కూడా అవకాశం ఏర్పడుతోంది. వీటిలో ముక్త్యాల శైవక్షేత్రం కాగా వేదాద్రి పంచనారసింహక్షేత్రం.   దీనినే నరసింహతీర్థమని  శాసనాల్లో  పేర్కొన్నారు. 
                 
                   ముక్త్యాల : -          పవిత్ర కృష్ణానది  ముక్త్యాల వద్ద కు వచ్చే సరికి ఉత్తర వాహిని గా మారుతుంది. అనంతరం  వేదాద్రి నారసింహుని సన్నిధానానికి చేరుతుంది. ఉత్తర వాహిని లో స్నానం చేయడం సకల పాపహరమని   భక్తుల నమ్మకం .ముక్త్యాల  లో కృష్ణానది ఉత్తర వాహిని యైన ఈ ప్రదేశం లోనే నదీగర్భం లో ఒక  శివాలయం కన్పిస్తుంది. చిత్రం 34.

   

                                                     -69-
  




                            చిత్రం లో  ఆ ఆలయం  ముఖమండపం   మాత్రమే మనకు కన్పిస్తోంది. ఇది నడి వేసవి లోని పరిస్థితి. క వరదలొచ్చే వర్షాకాలం లో అయితే ఆలయమే కన్పించదు. ఈ ఆలయం లోనిది స్పటికలింగం. సంవత్సరం లో అధిక కాలం  నీటిలోనే మునిగి ఉండే  ఈ మహాదేవునకు ఆరునెలలు దేవతాపూజ ,ఆరునెలలు మానవపూజ యని  ప్రాంతీయులు చెప్పుకుంటారు. ఈ మహాదేవునకు ఎదురుగా నందీశ్వరుడు కూడ  తన స్వామి తో పాటు నీటి లో మునిగి మోర ఎగబట్టి కన్పిస్తున్నాడు. ఒక నంది విగ్రహం ఖిలమై పోగా మరొక నంది ప్రతిష్టించారట. అందుకే మనకు నీటిలో మునిగిన రెండు నందులు కన్పిస్తున్నాయి. వర్షసాంద్రత  తగ్గి ,ప్రాజక్టుల నిర్మాణం జరిగిన ఈ కాలం లోనే ఈ విధం గా ముక్తేశ్వరుడు నీటిలో మునిగి ఉంటే అనాడు ఈ ఆలయం మూడువందల అరవై రోజులు నీటిలోనే ఉండేదేమో నంటే అతిశయోక్తి కాదు. ఈ ముక్తేశ్వరుని  బలిచక్రవర్తి  ప్రతిష్ఠంచి నట్లు గా స్థలపురాణం చెపుతోంది.
                  “పూర్వం బాణాసురుని తండ్రియైన బలిచక్రవర్తి  కైలాసవాసుడైన చంద్రశేఖరుని గూర్చి తపస్సు చేశాడు. ఆతని తపోజ్వాలలు ఎల్లలోకాలను దహించివేయ సాగాయి. దేవతలందరూ భయపడి,పరమేశ్వరుని చెంతకు చేరి రక్షించమని వేడుకున్నారు. కరుణాహృదయుడైన పశుపతి దేవతల కభయమిచ్చి ,వారి గృహాలకు సాగనంపాడు. అనంతరం తన భక్తుని భక్తి కి మెచ్చి బలిచక్రవర్తికి ప్రత్యక్షమయ్య్యాడు. బలిచక్రవర్తి వివిధ రీతులుగా పరమేశ్వరుని స్తుతించి , దేవా. నీవు కాశీక్షేత్రం లో విశ్వేశ్వరుడను పేరు తో వెలసి , సమస్త జీవజాలాన్ని కాపాడుతూ ముక్తిని ప్రసాదిస్తున్నావు. అదే విధం గా దక్షిణ కాశి గా పేరుపొందిన ఈ ముక్త్యాల క్షేత్రం లో ముక్తేశ్వరుడను పేర శక్తి తో గూడి భక్తులకు ముక్తిని ప్రసాదించమని ప్రార్థంచగా ,పరమేశ్వరుడంగీకరించి  ముక్తేశ్వరుడు గా ముక్త్యాల లో వెలిశాడు. నదీగర్భం లో స్వర్ణాలయం దని , దానిని విశ్వకర్మ సృష్టించాడని , ఈ ఆలయం లో స్పటిక లింగాన్ని బలిచక్రవర్తి  ప్రతిష్టించి  పూజించాడని  చెప్పబడుతోంది.

                                                           -70-
                  నదీగర్భం లోని ఈ ఆలయం గాక నదీతీరం లో  మరొక భవానీ ముక్తేశ్వరాలయం కన్పిస్తుంది. ఇది మహామండలేశ్వరులు శ్రీ చాగిపోతరాజుల నిర్మాణం. తన విజయరాజ్యము యెక్క ఆచంద్రతారార్క అభివృద్ధి కొఱకు , తన ప్రజల సుఖశాంతుల కొఱకు చాగి పోతరాజు వేయించిన దానశాసనం ఒకటి శ్రీ భవానీ ముక్తేశ్వర స్వామి వారి ఆలయం లో ధ్వజస్థంభానికి వెనుకగా నున్న నాగశిల పై కన్పిస్తుంది. ఈ శాసనం లో నరసింహవర్థన పోతరాజు  చేసిన అనేక పుణ్యకార్యాలు ప్రస్తావించబడ్డాయి.
                             



                          చాగిపోతరాజు  ముక్తేశ్వర  మహాదేవరకు ఆలయ  నిర్మాణాన్ని చేయించాడు. త్రిపురాంతక , కాశ్మీర మల్లేశ్వర ,విశ్వనాథ , చోడనారాయణ దేవరలకు కనక కలశాలను ఎత్తించాడు. సింహాచల నారసింహునకు   చాగి సముద్రమనే చెఱువును త్రవ్వించాడు. శ్రీశైలం లో మల్లిఖార్జునునకు ఎదురుగా నందికేశ్వరుని ప్రతిష్టించి ,దేవభోగముల కొఱకు  కంభం పాడు , ముచ్చింతాల , బోదపాడు  మొదలైన గ్రామాలను దానం చేశాడు. నతవాడి సీమ ను బెజవాడ నుండి పాలించిన రాజనీతిజ్ఞు డీయన. ( శాసనం -301/1924) ఈ శాసనం మీద తేదీలేదు. అంతేకాదు దీనిలో కొంతభాగం లభించక అసంపూర్తి గా ఉంది. నేలలో పాతివేయబడడం , అనంతర కాలం లో దేవాలయ ప్రాంగణం మెరకచేయబడటం , సిమెంటు ఫ్లోరింగు పనులు  వీటివలన కూడ శాసనం దెబ్బతింటోంది. చిత్రం 36.
             బలిచక్రవర్తి చేనిర్మించేయబడి , విశ్వకర్మ సృష్టి గా చెప్పబడుతున్నదేవాలయం నదీగర్భం లో డిపోయి ,సామాన్యుల కందుబాటులో లేదనే అభిప్రాయం తో  రెండవ పోతరాజు   ఈ ఆలయాన్ని నిర్మించి ఉండవచ్చు. ఈ తని కాలం క్రీ.శ 1230 ప్రాంతం గా చెప్పబడుతోంది.


                                             -71-
           

                     కుఱుకుర్రు స్వయంభూదేవర కు  దానం చేసిన నవాబు పేట శాసనం లో వీని ప్రస్తావన  కన్పడుతుంది. ఈ శాసన కాలం శా.శ.1152 (క్రీ.శ.1230.) చాగిపోతరాజు -2 బెజవాడ రాజధాని గా నతవాడి సీమ ను పాలించాడు.ముక్త్యాల ఆలయం లోని శాసనం వంటిదే విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి వారి ఆలయం లో కూడ కన్పిస్తోంది. విజయవాడ శాసనాలు  ప్రత్యేక విషయం గా పరిశీలనార్హాలు. కాబట్టి వాటినిక్కడ ప్రస్తావించలేదు. ముక్త్యాల లోని చెన్నకేశవాలయం అనంతర కాలం లో నిర్మాణమైంది.
                                          


                       శ్రీ ముక్తేశ్వర ఆలయ కళ్యాణమండప స్థంభం పై కన్పించే మరొక శాసనం.

                            చరిత్ర లోకి తొంగిచూస్తే ముక్త్యాల అతి ప్రాచీన చరిత్ర కల్గిన ప్రదేశం గా తెలుస్తోంది.  రెండువేల నాటి శాలివాహన సప్తశతి  లో ఈ ముక్త్యాల ప్రాంతాన్ని గూర్చిన గాథలున్నట్లు విమర్శకులు భావిస్తున్నారు. (బుద్దజయంతి మహోత్సవ సంచిక 13 వ పే.) బేతవోలు (జగ్గయ్యపేట) నుండి మక్త్యాల కు వెళ్లే మార్గం లో రోడ్డుకు డమవాపు కొండమీద బౌద్దస్తూపం కన్పిస్తుంది. అక్కడనుండు ముక్త్యాల చేరే వరకు రోడ్డు కిరువైపులా దట్టంగా మోదగు చెట్లు వ్యాపించి ఉండేవట. దీన్ని ఆధారం గా సూరన్న అనే కవి శాలివాహన సప్తశతి   లో ఒక గాథ ను సంథానించాడు. రోడ్డుకిరువైపులా రాలిన మోదుగు పూలు బౌద్దస్తూపానికి సాష్టాంగ నమస్కారం చేస్తున్న బౌద్దసన్యాసులతో  పోల్చి కవి కథ ను రచించాడు.
                                  
                                కీర మహి నచ్చ హేహింరే హయి
                                     ననుహపలాస కుసుమేహిం
                                    బుద్ద సృ చరణ వందన
                                     పడియేహివ భిక్షు సంఘేహిం


                                         -72-
                             

                                      జీబుగా నేలపై రాలె జిల్కముక్కు
                                  లట్లు పువ్వులు మోదుగు చెట్ల క్రింద
                                బుద్దపాదాంబుజములకు బుడమి వ్రాలి
                            వందనము చేయు భిక్షుక  వర్గమనగ  ! (బుద్దజయంతి  మహోత్సవ సంచిక-15 వ పే)     
                   

                    ఈ ప్రాంతానికి దగ్గరలోనే భోగాలపాడు అనే ప్రాచీన గ్రామం ఉంది. ప్రాచీనత కు నెలవైన ఈ ప్రదేశం  పరిసోధకులకు పని కల్పించింది. కవి పండిత విమర్శకులైన  శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు ఈ ప్రాంతం లో పర్యటించి , పరిశోధనలు నిర్వహించి ,ఎంతో విలువైన సమాచారాన్ని సేకరించారు.  ఆయన యనంతరం 1953 మార్చి 9 నుండి 15 వరకు  శ్రీ వేటూరి శంకరశాస్త్రి గారి పర్యవేక్షణ లో కొన్ని త్రవ్వకాలు  నిర్వహించబడ్డాయి. ఇవి పైపైన కొనసాగినవే కాని లోతుగా  జరగలేదు.  ఆర్ధిక వనరుల లేమి యే అందుకు కారణమని శ్రీ శంకరశాస్త్రి గారు స్వయం గా ప్రకటించారు. కొద్దిప్రయత్నం లోనే ఈ ప్రదేశం ఎంతో విలువైన సమాచారాన్ని చరిత్ర కందించింది.
                      ఈ త్రవ్వకాలలో అనేకమైన కుండలు ,కుండపెంకులు , శాసనపు రాళ్ళు ,ఎముకలు ,లోహపు బిళ్ళలు , రేకులు ,పూసలు , ఆభరణాలు ,గాజులు ,ఆటవస్తువులు , ఇటుకలు లభించాయి. వీటి మీద లిపిని బట్టి ఇవి ఇక్ష్యాకుల నాటివి గా  గుర్తించబడింది. శిథిలావశేషాలను ,నిర్మాణ విథానాన్ని విశ్లేషించగా ఇక్ష్యాకుల నాటి బౌద్దభిక్షువులు ఈ ప్రాంతం లో విహారాన్ని నిర్మించుకొని  బౌద్దధర్మప్రచారకులు గా ఉన్నట్లు భావించబడుతోంది. ఇక్ష్యాకు వంశానికి చెందిన మాతరీపుత్రశ్రీ వీరపురుషదత్త -2 మహారాజు కు చెందిన శాసనాలు

                       
                                       -73-


                           కొన్ని నాగార్జున కొండ ,జగ్గయ్యపేట శిథిలాల్లో లభించాయి. వానిలో ఈ  రాజవంశానికి చెందిన  స్త్రీ , పురుషుల పేర్లు సుమారు ముఫ్వరకు గుర్తించడం జరిగింది. వాసిష్టపుత్ర దాంతమూల , వీని కుమారుడు వాసిష్టపుత్ర ఇక్ష్యాకుల దాంతిమూల వీరిలో ముఖ్యులు. వేరు వేరు మతావలంబులై యజ్ఞయాగాదులు చేయువారైనప్పటికిని బౌద్దమతాభిమానులై బౌద్దస్దూపాలను నిర్మించినట్లు చరిత్రకారులు వ్రాస్తున్నారు. (బుద్దజయంతి సంచిక 19వ పే.)
                            ఈ విధమైన ప్రాచీనచరిత్ర గల్గిన ఈ పుణ్యనేల పై రెండవ పోతరాజు కృష్ణానదీ తీరం లో ముక్తేశ్వరుని ప్రతిష్టించి ,హిందూసంస్కృతిని ప్రోత్సహించాడు. దానశాసనాల్ని వ్రాయించి చరిత్రకెక్కాడు. శ్రీ భవానీ ముక్తేశ్వర స్వామి కి మాఘబహుళ చతుర్దశి మహాశివరాత్రి నాడు కళ్యాణోత్సవం జరుగుతుంది.కార్తీకమాసం లో విశేషపూజలుంటాయి. పర్వదినాల్లోను ,పుష్కరాల సమయం లోను భక్తులు ఇచ్చటి కృష్ణాఉత్తరవాహిని లో స్నానం చేసి  తరించడానికి దూరప్రాంతాల నుండి కూడ తరలివస్తారు. త్రేతాయుగం లో శ్రీరామచంద్రుడు  సీతమ్మ తో గూడి  ఈ ప్రాంతానికి వచ్చినప్పుడుస్వర్ణాలయం లోని ముక్తేశ్వరుని సేవించాడని ,ద్వాపర యుగం లో ధర్మరాజు  సోదర సమేతుడై ఈ మహాదేవరను పూజించినట్లు , కలియుగం లో విక్రమార్కాది మహారాజు లెందరో ఈ దేవుని దర్శించి తరించి నట్లు శ్రీ తాతంభట్టు గురుమూర్తి శాస్త్రి గారు కృష్ణామాహాత్మ్యము అనే గ్రంథం లో వ్రాసి ,ప్రచారం చేశారు.
                 అనంతర కాలం లో జమీందారీ యుగం లో వాసిరెడ్డి వారి  వంగడం లో ముక్త్యాల సంస్థానం   రూపు   దిద్దుకుంది. ఈ సంస్థానాన్ని చింతలపాటి బంటు అని కూడ వ్యవహరిస్తారు. ఈ ముక్త్యాల   సంస్థానం లోనే ఆర్ష రసాయన శాల అనే పేరు తో ఆయుర్వేదమందుల తయారీ విభాగం ఉండేది . దీని నిర్వహణ లో భాగం గానే వేటూరి శంకరశాస్త్రి    గార్కి  ఈ  సంస్థానం తో అనుబంధ మేర్పడింది.  జంటకవులలో ఒకరైన చెళ్ళపిళ్ల వేంకటశాస్త్రి గారు , కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు సందర్శించిన సంస్థానమిది.  
                                
                              రాబోయే భాగం   లో-
                                                పుణ్యక్షేత్రాల్లో చాగివారు నృసింహతీర్థం  (వేదాద్రి ).





**********************************************

Tuesday 21 March 2017

మూడవ ప్రకరణం - 3 వెలుగుచూసిన తెలుగు శిల్పాలు--బృహత్కాంచీపురం -- (పెనుగంచిప్రోలు).



మూడవ ప్రకరణం - 3
   

             వెలుగుచూసిన తెలుగు శిల్పాలు

  బృహత్కాంచీపురం  -- (పెనుగంచిప్రోలు).
                       
       బృహత్కాంచీపురం  చాగి వారి పాలన లోని మరొక అనుబంధ రాజ్యం. దీన్నే ఇప్పుడు పెనుగంచిప్రోలు అని పిలుస్తున్నారు. జాతీయ రహదారి 9 లో విజయవాడ నుండి హైదరాబాదు వెళ్లే మార్గం లో నవాబు పేట దాటిన తర్వాత ముండ్లపాడు అడ్డరోడ్డు నుండి మూడు కిలోమీటర్లు లోపలికి వెడితే మున్నానది ఒడ్డున  వెలసిన రాజ్యమిది. చాగివారి పాలన లో ఉపకేంద్రం గా సోదర రాజ్యమై విలసిల్లిన నగరమిది.అడుగడుగున కన్పించే శిథిల శిల్పాలతో ఆశ్చర్యాన్ని కల్గించే ఒకనాటి రణభూమి యిది. ఇంటికి నిలబెట్టిన నిట్టాడి స్థంభాల నుండి చాకలి బండల వరకు, ఇంటి ముందు అరుగుల నుండి ,చట్టుబండల వరకు అన్నీ శిల్పాలతో నిండిన నల్లరాళ్లే నంటే అతిశయోక్తి కాదు. ఏటికి వరద వచ్చినప్పుడల్లా కొన్ని  శిథిల శిల్పాలు వెలుగు చూస్తాయి. వరద మునేటి లో బయల్పడే శిథిల ఆలయాలు ఇచ్చట  కోకొల్లలు. అనేక వందల శిలలు , శిల్పఖండాలు బండరాళ్ళు గా వీథుల్లో దొర్లుతుంటాయి.  

                                        -59-


   ప్రతి ఇంటి ముందు అరుగులుగా మారిన నల్ల రాతి బండలు , విరిగిన స్థంభాల అవశేషాలు కొత్తవారిని తలలెత్తి పల్కరిస్తాయి. ఎవరైనా కొత్త ఇంటికి పునాదులు తవ్వేటప్పుడు , బావులు తీయించేటప్పుడు ,పాటిమన్ను తవ్వుకునేటప్పుడు ఎన్నో శిల్పఖండాలు వెలుగులో కొచ్చాయి. కాలగర్భం లో కలిసిపోయినవి పోగా ,కొంతమంది ఉదారుల ప్రయత్నం వలన మరి కొన్ని విజయవాడ లోని విక్టోరియా మ్యూజియం కు తరలించబడి, “పెనుగంచిప్రోలు శిల్పాలు ” గా గుర్తించబడి ఒకే చోట కొలువు దీరి ,గత వైభవ చిహ్నాలు గా మిగిలి ఉన్నాయి.  పెనుగంచిప్రోలు  ఊళ్ళో ఈ నాటికీ ఏదో ఒక మూల ఏదో ఒక శిల్పం బయటపడిందని నలుగురు కలిసినప్పుడు చెప్పుకోవడం పరిపాటై పోయింది. అటువంటి ఈ వీరభూమి  ఈనాడు తిరుపతమ్మ తల్లి  పేరుతో పుణ్యభూమి ప్రసిద్ది  పొందడం స్థల మాహాత్మ్యమనే చెప్పాలి.

 మహా నందీశ్వరుడు :--    ఒక  ఇంటికి పునాదులు తవ్వుతుంటే బయట పడి ,తరలించడానికి వీలులేక ఊరి మథ్య లో నిలిచిపోయిన మహానంది ముమ్మూర్తులా ఓరుగల్లు నందికి ప్రతిరూపం . 5 ½ అడుగుల ఎత్తు,6  ½ అడుగుల పై చిలుకు పొడవు గల్గిన అపురూప శిల్పమిది.




 అందాలు చిందే ఆభరణ విన్యాసం తో, సొగసైన శరీర సౌష్టవం తో మోర ఎగపట్టి రాజసం తో ఠీవి గా కొలువు దీరిన ఈ నందీశ్వరుని సౌందర్యం కనులార గాంచవలసినదే కాని వర్ణించనలవి కానిది. ఇటువంటి సౌందర్యం ముష్కరులకు కంటగింపైంది. మురాన్ని ,ముఖాన్ని సమ్మెటల తో మోది , నాశనం చేశారు. ఇంటి పునాదులు తవ్వుతుండగా అడ్డువచ్చిన దీనిని ట్రాక్టర్ల తో బయటకు లాగించి ఇల్లు పూర్తి చేసుకున్నాడు ఆ యజమాని. గతించిన కాలానికి గుర్తుగా పేడ కుప్పల నడుమ మౌనంగా కదలలేని స్థితి లో మిగిలి పోయాడు వృషభరాజు. చీలిన కాలి గిట్టలు, కాళ్ళు మడిచి కూర్చున్న అందము ,ఎత్తైన మూపురము , మెడ పట్టెలు,

                                                     -60-

   నడుము పటకాలు  ముమ్మూర్తులా ఓరుగల్లు వేయిస్థంభాల గుడి లోని నందిశ్వరునే పోలి ఉన్నాయి.



 అచ్చంగా దీన్నే పోలివున్న ఆకారం లో చిన్నది గా ఉన్న మరొక నంది  కూడ  ఈ పరిసరాల్లోనే లభించింది. అది ఈ నాటికిీ గ్రామం మథ్య లో రామమందిరం దగ్గర నాలుగు బజారుల కూడలి లో ఉంచబడి , గ్రామస్థుల చేత  కాపాడబడింది. ఇటువంటిదే మరొక చిన్ననంది విజయవాడ కృష్ణాతీరం లో ప్రకాశం బరాజ్  దగ్గర కొలువు తీరిన కృష్ణవేణీ మాత చెంత ప్రతిష్టించిన జంటనందులలో ఒకటి గా తన స్థానాన్ని పదిలం చేసుకుందని గ్రామస్థుల ద్వారా తెలిసింది. అద్భుతమైన శిల్పమిది.
  
               స్వయంభూదేవాలయ శిల్పం : --      మా ప్రయత్నం లో వెలుగు చూసిన మరొకశిల్పం అత్యంత ప్రత్యేకమైంది. అదే వరంగల్లు కోట లోని స్వయంభూదేవాలయ శిథిలాల నుండి ఢిల్లీ కి తరలించబడిట్లు గా చెప్పబడుతున్న అపురూపశిల్పాన్ని పోలిన శిల్పం. 




  
         ఇది ఒక వ్యాపారి ఇంటి ఆవరణ లో స్నానాల దొడ్డి సమీపం లో మట్టి లో కూరుకుపోయి ఉంది .ఆ యింటి సమీపం లో అనేక శిల్పఖండాలు లభించినట్లు గా స్ధానికులు చెపుతున్నారు. ఈ నాటికీ గ్రామం లో పూజలందుకుంటున్న  శ్రీ లక్ష్మీనారాయణస్వామి విగ్రహం ఈ ఆవరణ లో దొరికిందే. అంతేకాదు ఇప్పటికి కూడ 4 1/2అడుగల త్తు , 5 అడుగుల పొడవు గల సోమసూత్రం విరిగిన శివలింగాలు ఆ ఇంటి ఆవరణ లో ఒకమూలగా నెట్టబడి ఉన్నాయి. మాకు లభించి ఈ అపురూప శిల్పం కాకతీయ శిల్పాల్లో అత్యంత విశిష్ట నిర్మాణం గా విమర్శకులచే భావించబడుతోంది. దీనిపై గల ఆభరణ విన్యాసం ,అలంకరణ నైపుణ్యం ఎన్నదగినది. ఇది 

                                           -61-

        ప్రసిద్దమైన కాకతీయశిల్పాల్లో ఒకటి. ఈ విగ్రహాన్ని పోలిన విగ్రహమే వరంగల్లు స్వయంభూ దేవాలయం నుండి తరలించి , ఢిల్లీ నేషనల్మ్యూజియం లో భద్రపరచబడినట్లు పరిశోధకుల వ్రాతలు  సాక్ష్యాలు గా నిలుస్తున్నాయి. (కాకతీయ శిల్పం -98 వ పేజి.) ముమ్మూర్తులా ఇదే విగ్రహాన్ని పోలిఉన్న ఢిల్లీ మ్యూజియం లోని విగ్రహానికి నకలు ను   ఈ క్రింది చిత్రం లో చూడవచ్చు.


                        ఈ విగ్రహానికి రెండు చేతులు , తల నరికి వేయబడగా ఢిల్లీమ్యూజియం లోని విగ్రహానికి ఎడమచేయి మోచేతి వరకు మిగిలి ఉంటమే రెండింటికి గల తేడా గా మనం గమనించవచ్చు. మిగిలిన ఆకృతి యంతా సమానమే. ఈ శిథిల శిల్పం ఎత్తు సుమారు మూడున్నర అడుగులుంది. మెరుగులు దిద్దిన నల్లరాతి శిల్పమిది. ఆనాటి ఆభరణాల సొగసు ను ప్రత్యక్షం గా  చిత్రం లో దర్శించ వచ్చు. ఇటువంటి శిల్పాలు మరెన్నో భావితరాల వారికి లభించే అవకాశం ఉంది.
                                          -62-


     ఈ ప్రాంతం లో జైన, బౌద్దమతాలు కూడ తమ నికిని చాటుకున్నట్లు సాక్ష్యాధారాలున్నాయి. తవ్వకాలలో లభించిన బుద్దవిగ్రహాన్ని ఊరిమధ్య సత్రవద్ద దిమ్మె పై ప్రతిష్టించారు. శ్రీ వేణుగోపాల ,స్వయంభూదేవర , యోగానందలక్ష్మీనరసింహస్వామి ఆలయాలే కాక ఊరికి ఎనిమిది దిక్కుల ఆంజనేయస్వామి ఆలయాలున్నట్లు గా చెపుతారు. ఆధునిక కాలం లో తిరుపతమ్మ పేరంటాలు ప్రాచుర్యాన్ని పొందింది . క్రీ.శ. 1917 సం. మార్చి8 వ తేదీన నందిగామ తహసీల్దారు మహమ్మద్ మొహియుద్దీన్ హుస్సేన్ గారు  రెండు ఎకరాల స్థలం మంజూరు చేసినట్లు ఒక శాసనం తిరుపతమ్మ ఆలయ ఆవరణ  లో ఇప్పటికీ కన్పిస్తుంది. (తిరుపతమ్మ ఆలయం పై ప్రత్యేక వ్యాసాన్నిdivyakshetralu.blogspot.com లో పెనుగంచిప్రోలు శ్రీశ్రీశ్రీ లక్ష్మీతిరుపతమ్మతల్లి ఆలయం  చూడవచ్చు)
                                    పెనుగంచిప్రోలు , ముండ్లపాడు ప్రాంతం లో జైన ,బౌద్ద ,హిందూమతాల వెల్లువలు కాలానుగుణం గా ప్రవహించి ,కాలగర్భం లో కలిసిపోయాయనడానికి  తిరుగులేని సాక్ష్యాలు ఈ ప్రాంతం లో లభిస్తున్నాయి. మునులపాడు’ అనగా జైనమునుల ఆవాస ప్రాంతమే జనుల వ్యవహారం లో  ముండ్లపాడు అయ్యింది. మునుల ఏరు ఈ ప్రాంతం లో ప్రహించే ఏరు మున్నానది గా శాసనాల్లో చెప్పబడినా జనుల వాడుకలో మునుల ఏరు > మునేరు గా ప్రసిద్దమైంది.
                    
                                                            -63-
            

                     కాండ్రపాడు పంచముఖేశ్వరుడు.  :-- ఈ ప్రాంతం లో లభించిన విగ్రహాలలో ఒక ప్రత్యేకత ను సంతరించుకున్న శివలింగం పంచముఖేశ్వరుడు. నల్లని నాలుగున్నర అడుగుల ఎత్తు గల శివలింగం పై గుండ్రం గా ఐదు ముఖాలు చెక్కబడున్నాయి.ఐదు ముఖాలు అయిదు రూపాలు గా ఉన్నాయి. ఒక దానికి ఒకటి పోలిక లేదు. దీన్ని గూర్చిన నేను వ్రాసిన ప్రత్యేక వ్యాసం 1988 మార్చి నెల భారతి సాహిత్య మాసపత్రిక లో ప్రచురించబడింది.  (భారతి – సాహిత్య మాసపత్రిక- మార్చి 1988-51 వ పేజి ) .
                                   కృష్ణాజిల్లా నందిగామ మండలం లోని కాండ్రపాడు చాగి వారి చారిత్రక నగరమైన గుడిమెట్ట కు మూడు కిలోమీటర్ల దూరం లోను , నందిగామ కు పది కిలోమీటర్ల దూరం లోను  ఉంది. దీనిని కోనాయపాలెం శివారు గ్రామం గా పిలుస్తారు. మన జాతి జీవన గమనం లో కలిసి పోయి, నూతనత్వాన్ని సంతరించుకున్న ప్రాచీన సంస్కృతుల ప్రభావానికి ప్రత్యక్ష నిదర్శనం ఇచ్చటి పంచముఖేశ్వరలింగం.
                            


         నాలుగన్నర అడుగుల ఎత్తు మూడన్నర అడుగుల చుట్టుకొలత కలిగిన నల్లని గ్రానైటు శివలింగం  పై నుండి ఒక ఆడుగున్నర అడుగు దిగువలో దర్శన మిచ్చే వివధ ఆకృతులు గల ఐదు ముఖాలు చూపరులకు ఆస్చర్యాన్ని , భక్తలకు ఆనందాన్ని కల్గిస్తున్నాయి. సుమారు గా తొంభై సంవత్సరాల క్రితం గ్రామం లో పాటిమన్ను తవ్వుతుంటే   ఈ లింగరూపుడు బయల్పడినట్లు వృద్ధులైన గ్రామస్తులు చెపుతారు. ఊరినిండా పాటిదిబ్బలే.


                                                    -64-


చుట్టుప్రక్కల మూడు నాలుగు గ్రామాల వారు పాటిమన్ను ను ఈ ప్రాంతం నుండే త్రవ్వుకెడుతుంటారు.  అటువంటిసమయం లో విలువ తెలియని నాణాలు , చిన్నిచిన్ని వెండివస్తువులు , దీపపు సెమ్మెలు, గింజల పాతర్లు , పెద్ద పూసలు, కుండపెంకులు మొదలైన ప్రాచీన అవశేషాలు లభిస్తున్నట్లు గ్రామస్తులు చెపుతున్నారు.
                  


                  ఈ అపురూప శివలింగం బయల్పడిన ప్రదేశం లో మరికొంత మేర తవ్వి చూడగా మరి నాలుగు చిన్న శివలింగాలు ఒక చతురస్రాకారపు ఫలకం, ముగురక్కల శిల్పం , మరికొన్ని చిన్నచిన్న విగ్రహాలు లభించాయి. అయితే ప్రధాన లింగానికి మాత్రం పానమట్టం లేదు.   శివునకు పానమట్టం తొలినాళ్ల లో ఉండేది కాదని, స్త్రీ పురుష అవయవాలను వేరు వేరు గా పూజించడం గుప్తుల ముందు యుగం లో ఉండేదని, రిలిజియన్  ఆర్ట్ అండ్ ఆర్కియాలజీ అనే  పుస్తకం లో ఆర్.కేబెనర్జీ వ్రాశారు.
                               ఇక్కడే లభించిన మిగిలిన నాలుగు శివలింగాలకు పానమట్టాలున్నాయి. అంతేకాకుండా ఇక్కడే లభించిన చతురస్రాకారపు రాతిఫలకం మీద ఒక ప్రత్యేకమైన చెక్కడం కన్పిస్తుంది. దీన్ని పరిశీలిస్తే ఈ ఐదు శివలింగాలకు ,ప్రదాన శివలింగం పై నున్న ఐదు ముఖాలకు  ,  ఈ ఫలకానికి ఏదో ఒక ప్రత్యేక సంబంధం కలదేమోనన్నఅనుమానం దృఢమోతోంది. ఎందువలనంటే ఈ రాతిఫలకం నాలుగుమూలలా నాలుగు, మధ్య లో ఒకటి మొత్తం ఐదు గుంటలు వృత్తాకారం లో చెక్కబడ్డాయి.వాని నడుమ వచ్చే ఖాళీ ప్రదేశం లో ఎదురెదురు గా రెండు పూర్ణకుంభాలను , అదే విధం గా మరి రెండు దిక్కులలో ఒకవైపు
                                   -65-
మీనముల జంట ,రెండవ వైపు శంఖము చెక్కబడ్డాయి.పూర్ణ కలశం అమరావతీ స్థూపం లోని కలశాన్ని పోలి ఉంది. ఇది దేవాలయ నిర్మాణం లో, ముఖ్యం గా విగ్రహ ప్రతిష్టా సమయం లో వేయబడిన యంత్రం గా భావించబడుతోంది. రెండు చేపల జంట ,శంఖము ,పూర్ణ కలశాలు శాంతి యంత్ర మని ఈనాడు భవన నిర్మాణ సమయం లో వాస్తుకారుడు వేసే యంత్రాన్ని గుర్తు చేస్తున్నాయి. దీన్నేమత్స్యయంత్ర మంటారు.
                               



                     దొరికిన ప్రధాన లింగానికి పానమట్టం లేకపోవడం తో స్ధానికులు ప్రాంతీయం గా దొరికే రాయి తో పానమట్టం చెక్కించి , లింగాన్ని దానిలో దిగేసి , దాని చుట్టు మిగిలిన నాలుగు లింగాలను ఉంచి , పూజాపునస్కారాలను జరిపిస్తున్నారు. ప్రధానలింగం నల్లని శిల తో చేయబడి , ప్రత్యేకత ను సంతరించుకోగా , మిగిలిన నాలుగు లింగాలు ప్రాంతీయం గా దొరికే లభించే  రాయి తో చేయబడినట్లు మనం గమనించవచ్చు. షట్కోణాకృ తిలో ఆలయాన్ని నిర్మించి చుట్టు కిటికీలను నిర్మించి , ప్రతి శివరాత్రి కి కళ్యాణ  జరిపిస్తున్నారు గ్రామస్తులు .   మనం యంత్రం గా భావించిన రాతిఫలకం కూడ ఇదే ప్రదేశం లో ఉంచి  పూజలు చేస్తున్నారు. గర్భాలయానికి రెండు కిటికీలు ఉండటం మూలంగా భక్తులు స్వామి వారి పంచ ముఖాలను దర్శించడానికి అత్యంత వీలు కలుగుతోంది.


                                 -66-
  
           చారిత్రక నేపథ్యం  :- అయితే ఈ లింగాన్ని చూడగానే మనకు జైన శిల్పం గుర్తుకొస్తుంది. లింగానికి ముందు భాగం లో కన్పించే ముఖం సైతం దీన్నే బలపరుస్తోంది. చిత్రం     లో స్పష్టం గా చూడవచ్చుపాడు అనే పేరు జైన గ్రామాలకు చివర ఉంటుందని , ప్రోలు బౌద్ద గ్రామాలకు చివర ఉంటుందని చరిత్ర పరిశోధకులు చెపుతున్న మాట .కాండ్రపాడు , లింగాలపాడు ,తక్కెళ్ళ పాడు , బొబ్బిళ్ళ పాడు ,చింతలపాడు , చందర్లపాడు , అనిగంఢ్లపాడు ,ముండ్లపాడు , మొదలైన గ్రామాలన్నీ  ఈ పరిసరాల్లోనివే. ఇవి ఈ ప్రాంతం లోని జైన మత ప్రాభవాన్ని గుర్తుచేస్తున్నాయి.
                       
         




         అంతేకాకుండా బౌద్ధమత ప్రభావం సైతం ఈ ప్రాంతం లో అధికం గానే ఉందనడానికి మునగచర్ల , రామిరెడ్డిపల్లి, వేల్లగిరి (జగ్గయ్యపేట) గ్రామాల యందలి చరిత్ర ప్రసిద్ధి కెక్కిన బౌద్దస్తూపాలే తార్కాణాలు. కాండ్రపాడు దగ్గర లోని గుడిమెట్ట  ను చాగి రాజులు పరిపాలించినట్లు,క్రీ.శ 1155 నాటి గుడిమెట్ట శాసనాల మూలం గా తెలుస్తోంది. కాకతీయ ,రెడ్డిరాజులు పరిపాలన లో సైతం కొనసాగినట్లు కృష్ణా గెజిట్ చెపుతోంది.
                            
              



                     తిట్టుకవి గా పేరుపొందిన వేములవాడ భీమకవి పద్యం – అప్పకవీయం లో ఉదాహరించింది అయిన –
               
        హయమది  సీత , పోత వసుధాధిపుడారయ రావణుండు ---’  అనే పద్యం లోని గుడిమెట్ట లంక అన్న పదం లోని గుడిమెట్ట ఇదేనని, ఆ పోతవసుధాధిపుడు


                             -67-

        త్యాగి పోతరాజే నని ఆరుద్ర అంగీకరించగా ,  ఆ సాగిపోతరాజు  ప్రతిరోజు  వచ్చి ఈ పంచముఖేశ్వరుని  పూజించుకొని వెడుతుండేవాడని , భీమకవి చెప్పిన పద్యం వలన శాపం తగిలి , ఈ రెండు గ్రామాలకు మధ్యనున్న  వాగువద్ద గుఱ్ఱం మీద వెడుతుండగా శత్రువులు చేసిన దాడి లో పోతరాజు మరణించాడని ఈ ప్రాంతం లోని వృద్దులు అనూచానం గా వస్తున్న కథ ను తమ తరువాత తరం వారికి చెపుతున్నారు. ఈ విధం గా ఈ కథ ఈ ప్రాంతం లో మిక్కిలి ప్రాచుర్యాన్ని పొందింది. భీమన కవి కాలం కూడ క్రీ.శ 1150 -70 మధ్య అవుతోందని పరిశోధకుల అభిప్రాయం .ఇది కొంత చర్చ కు దారి తీసే అంశం.
                      



             ముఖ్యం గా త్యాగి వారు ,కాకతీయ, రెడ్డి రాజులు సైతం శైవమతాన్ని ఎక్కువగా ఆదరించిన వారే కాబట్టి ఈ పంచముఖేశ్వరుడు చారిత్రక ప్రాథాన్యాన్ని సంతరించుకుంటున్నాడు. జైన ,బౌద్ద ,శైవ సంస్కృతుల సమ్మేళన శిల్పమే ఈ శివలింగం లో ద్యోతకమౌతోందని మన అంగీకరించాలి.
                          
                              తరువాయి భాగం  త్వరలో --------
                                            నాల్గవ ప్రకరణం – పుణ్యక్షేత్రాల్లో  చాగి వారు.

********************************************************************