Monday 16 May 2016

శతకసౌరభాలు -9 పురుషోత్తమ కవి - శ్రీకాకుళ ఆంథ్రనాయక శతకము- 1

శతకసౌరభాలు -9


కాసుల పురుషోత్తమ కవి
                      శ్రీకాకుళ
    ఆంథ్రనాయక శతకము- 1

                         

                                                     శ్రీకాకుళాంథ్ర మహావిష్ణువు దివ్య విగ్రహం
                
                      శ్రీకాకుళ దివ్యక్షేత్రం  ఆంథ్రరాష్ట్రం లో కృష్ణాజిల్లా లోని  ఘంటశాల మండలం   దివిసీమ లో కృష్ణానదీ తీరాన ఉంది. ఇక్కడ కొలువు దీరిన దైవమే శ్రీకాకుళ ఆంథ్ర మహావిష్ణువు. శంఖ చక్రాలను తారుమారుగా ధరించి, ఎడమచేతి యందు గదను, కుడిచేతిలో అభయముద్ర తో భక్తులను ఆదుకునే ఆంథ్రదేవుడై , ఆంథ్రనాయకుని గా కొలువు తీరి యున్నాడు.
                        
                       ఆంథ్ర మహావిష్ణువు. ఆంథ్రదేవుడు.  ఎంత అందమైన పేరు. హృదయావర్జకమైన ఆ పేరు  క్రీ.శ  రెండు మూడు శతాబ్దాలకు పూర్వమే ప్రసిద్ధమైనదన్న విషయం తెలుగు హృదయాల్లో వింత పులకింత ను కల్గిస్తోంది. శాతవాహనులకు పూర్వమే ఆంధ్ర విష్ణువు తెలుగు సామ్ర్రాజ్యాన్ని ఏకచ్ఛత్రాధి పత్యం గా పాలించిన మహావీరుడని చరిత్ర చెపుతోంది. శాతవాహనసామ్రాజ్య స్థాపకుడైన శ్రీముఖుడు (క్రీ .పూ.230-205 ) ఈ శ్రీకాకుళాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించి నట్లు  చెప్పబడుతోంది. ఇక్కడ కొలువైన దేవుడు ఆంథ్ర మహావిష్ణువు > ఆంథ్రదేవుడు > ఆంథ్ర వల్లభుడు > తెలుగు వల్లభుడు.  
       
   “ఆంథ్రత్వ మాంధ్రభాషా నాన్యస్య దుర్లభా అన్నాడు మహా పండితుడు అప్పయ్య దీక్షితులు. అటువంటిది ఆంథ్ర భాష ,ఆంధ్ర జాతి పేరు మీద ఒక దేవుడు వెలిశాడంటే ఆనాటి  ఆజాతి  ఆ దైవాన్ని ఎంతగా ప్రేమించి, సేవించి , పూజించి, తరించిందో మనకు అర్ధమౌతుంది.
                       

                  శాతవాహనులకు పూర్వమే సుచంద్రుని కుమారుడైన  విష్ణువు  అనే మహా వీరుడు ఆంథ్ర సామ్రాజ్యాన్ని స్ధాపించి, మహేంద్రగిరి తో   శ్రీశైలం,  కాళేశ్వరం,భీమేశ్వరాలను కలుపుతూ గొప్పకోటను నిర్మించి. దానికి శివుని మూడు నేత్రాలకు ప్రతీకలు గా మూడు ద్వారాలను నిర్మించి, ఆంథ్ర దేశాన్ని పాలించాడు. అతని కాలం లో ప్రజాకంటకుడిగా ఉన్న నిషుంభుడనే దుర్మార్గుని  చిరకాల యుద్ధం  లో ఓడించి సువిశాల ఆంథ్ర సామ్రాజ్యాన్ని గోదావరి వరకు విస్తరింప చేసి , ప్రజారంజకుడి గా పాలన కొనసాగించాడు. ఆయనను శ్రీ మహావిష్ణువు అంశ గా ఆరాథించిన ఆనాటి ప్రజానీకం ఆయన అనంతరం ఆయనకు ఆలయాన్ని నిర్మించి , పూజించసాగారు. అదే శ్రీకాకుళ ఆంథ్ర మహావిష్ణువు దేవాలయం. ఇప్పుడు శ్రీకాకుళ ఆంథ్ర మహావిష్ణువు  కొలువు తీరిన గర్భగుడి అత్యంత ప్రాచీన నిర్మాణం గా భారతదేశం లోనే అత్యంత పురాతన కట్టడాలలో ఒకటి గా భావించ బడుతోంది.
        
     శ్రీ ఎ.డి కాంపెల్ (A.D.Campbell ) వ్రాసిన ఆంథ్రకౌముది లో ఈ విషయాలు ప్రస్తావించబడ్డాయి.
                

                      ఈ ఆలయ గోడల మీద  లభిస్తున్న 32 శాసనాలు ఈ ఆలయ ప్రాచీనతకు, ప్రసిద్ధి కి అద్దం పడు తున్నాయి. క్రీ.శ 1010 లో  అనంతచోడ భూపాలుని చేత  ఆలయం పునరుద్ధరించబడి , రాజగోపురం నిర్మించబడినట్లు శాసనాల వలన మనకు తెలుస్తోంది.
                   

                  అనంతర కాలం లో  సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు కళింగ దండయాత్రా సమయం లో విజయవాటిక లో విడిది చేసిన సమయం లో   ఈ ఆంథ్రవిష్ణువు ను గూర్చి విని , ఆయనను దర్శించడానికి  కృష్ణాతీరం వెంబడి ప్రయాణించి, శ్రీకాకుళం చేరుకొని  అక్కడ ఆలయం లోని మండపం లో  ఏకాదశీ వ్రతాన్ని ఆచరించాడు. ఆనాటి వేకువ జామున ఆంథ్ర మహావిష్ణువు  శ్రీ రాయల వారికి  కలలో కన్పించి ఆముక్తమాల్యదా వృత్తాంతాన్ని తెలుగు లో కావ్యం గా వ్రాయమని ఆజ్ఞాపించాడు. తెలుగదేల? తెలుగులోనే ఎందుకు వ్రాయాలి అని ప్రశ్నించిన రాయలకు ఆంథ్రమహావిష్ణువు ఇలా  బదులిచ్చాడు.

 ‘తెలుగదేల యన్న దేశంబు తెలుగు
ఏను తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్ల నృపులు గొలువ ఎఱుగవే బాసాడి
దేశభాషలందుఁ దెలుగు లెస్స.
                         
     దేశం తెలుగుదేశం. తాను తెలుగు వల్లభుడు. మరేమో తెనుగు భాష కలకండ వలె తియ్యనైన భాష. అయినా  ఆంథ్ర, కన్నడ కవులతో పాటు అన్ని భాషలను ఆదరిస్తున్న భువన విజయానికి అధినాయకుడవైన నీకు తెలియదా? దేశ భాషలన్నింటి లోను తెలుగుభాషే గొప్పది  అన్నాడు ఆంథ్రనాయకుడు. ఆంథ్రవల్లభుని మాటలను అంగీకరించి, అక్కడికక్కడే అప్పుడే  ఆముక్తమాల్యదా కావ్యానికి  శ్రీకారం చుట్టాడు సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీ కృష్ణదేవరాయలు. ఆ ప్రదేశమే ఈనాడు ఈ శ్రీకాకుళ ఆలయం లో  ఆముక్తమాల్యదా మండపం గా   వాసి కెక్కింది.
                     
    

               
                                                   ఆముక్తమాల్యదా మండపము


  హరివాసరం లో శ్రీ రాయల వారికి ఆంథ్ర మహావిష్ణువు దర్శనం లభించింది. హరివాసరం అంటే  ఏకాదశి లో చివరినాలుగు ముహూర్తాలు , ద్వాదశి లో మొదటి నాలుగు ముహూర్తాలు అనగా 6.24 నిమిషాలని కార్తాంతికుల చేత   లెక్కకట్టబడింది. ఈ వృత్తాంతం శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదా కావ్యం లో కన్పిస్తుంది. అంతేకాకుండా 1515 లో శ్రీ కృష్ణ దేవరాయలు వేయించిన అహోబిల శాసనం లోను, 30 మార్చి 1515 లోని సింహాచలం శాసనం లోను  ప్రస్తావించబడ్డాయి.
                         
                   1962 లోశ్రీ డి.ల్ నారాయణ నిర్మాత గా ఏ.కే. శేఖర్   దర్శకత్వం లో యన్.టి.రామారావు , జమున , ఎస్వీ.రంగారావు తదితర తారాగణం తో పింగళి నాగేంద్రరావు సంగీత దర్శకత్వం లో  ‘ శ్రీకాకుళ ఆంథ్రమహావిష్ణు కథ అనే చలనచిత్రం విడుదలైంది.
                        
                     


                                ముక్తమాల్యదా మండపం లో శ్రీకృష్ణదేవరాయలు కాంస్య విగ్రహం

                 
                        ఈ ఆంథ్రదేవుని గూర్చి శ్రీ కాసుల పురుషోత్తమ కవి రచించిన శతకం ఆంథ్రనాయక శతకం.  “చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్య భావ! హతవిమత జీవ ! శ్రీకాకుళాంథ్రదేవ! ” అనేది మకుటం. ఈ కవి కాలం క్రీ.శ 1798 గా చెప్పబడుతోంది. ఈ కవికి చల్లపల్లి జమీందారుల ప్రాపకం లభించింది. ఈ శతకం లో కవి  వ్యాజస్తుతి,వ్యాజనింద లను అందగా నిబద్ధించి  మహాకవుల సరసన తన స్ధానాన్ని  పదిలం చేసుకున్నాడు. పొగడ్త లో తిట్టును , తిట్టులో పొగడ్త ను అందంగా పొదగడం ఈతని కవిత లోని ప్రత్యేకత. ఒకానొక సమయం లో  కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ వారిని ఒక సభ లో  సభికుడు పోతన  భాగవతం  వ్రాసి యుండకపోతే  తరువాత కాలం లో అది ఎవరివల్ల అయ్యుండేది    అని  అడిగితే ఏముంది కాసుల పురుషోత్తమకవి ఆ లోటు తీర్చేవాడు అన్నారట. కాసుల వారి కవితాప్రౌఢిమ కు ఈ ఒక్క ఉదాహరణ చాలు. 
                 
                      ఇంతకు ముందు వలెనే   తేజస్వినీ వ్యాఖ్య తో ఈ శతక సౌరభాన్ని కూడ ఆస్వాదించండి.
                                                
                                             
                                                    శ్రీ మదనంత లక్ష్మీ యుతోరః స్థల !
                             చతురాననాండ పూరిత పిచండ !

ధర చక్ర ఖడ్గ గదా శరాసనహస్త !
                             నిఖిల వేదాంత వర్ణిత చరిత్ర !

సకల పావన నదీ జనక పాదాంభోజ !
                                రమణీయ ఖగకులోత్తమ తురంగ !
 
మణి సౌధవ త్ఫణామండ లోరగతల్ప !
                                వరకల్పకోద్యాన వన విహార !

భాను సిత !భాను నేత్ర  ! సౌభాగ్యగాత్ర !
యోగిహృద్గేయ  ! భువనైక భాగధేయ !

చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
                               హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!                      (1)             

                                           
                                        శ్రీకాకుళ ఆంధ్రదేవా ! కరుణా సముద్రుడా ! శతృమూకలను చీల్చి చెండాడెడి వాడా ! శ్రీ లక్ష్మీదేవిని                వక్షస్ధల మందు  నిలుపుకున్నవాడా !  సమస్త బ్రహ్మాండమునుఉదరమందు దాచుకొని రక్షించువాడా ! శంఖ చక్ర శరాసన ధరా ! వేదముల యందు వర్ణించబడిన పవిత్రచరిత్ర గలవాడా ! పరమ పావనమైన గంగానదికి పుట్టినిల్లయిన పాద పద్మములు గలవాడా ! గరుడవాహనా ! శేష శయనా !  కల్పతరువులతో నిండిన  ఉద్యాన వనము లందు విహరించువాడా ! సూర్య సమాన తేజస్సపన్నుడా ! సూర్యనేత్రా ! సుందర రూపా ! యోగులచేత ఎల్లవేళలా ధ్యానించ పడువాడా ! సమస్త లోకములకు సంపదల నిచ్చువాడా ! నీకు వందనము.
          
    

                                                       వైజయంతీదామ ! వర్ణిత సుత్రామ !
                    శోభననామ ! లోకాభిరామ

కువలయశ్యామ ! వికుంఠపట్టణధామ !
                                శ్రుతిహిత నామ ! దైవతలలామ !

కృత్యదైత్య సంగ్రామ ! గీతార్థ పరిణామ !
                               యదుకులాంబుధిసోమ  ! అఘవిరామ !

సంగర జిత భౌమ ! రంగద్గుణస్తోమ !
                                    త్రిభువన క్షేమ ! వర్ధిష్ణుకామ !
         
  దాసులము గామ? నీ పేరు దలఁచుకోమ?
       కొసరితిమి ప్రేమ కోరిన కోర్కు లీవ?

చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
                                                 హత విమత జీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!                                    (2)
                                            

                                  శ్రీకాకుళాంథ్రదేవా ! వైజయంతీ మాలికను ధరించువాడా ! ఇంద్రునిచే స్తుతించబడెడు వాడాదివ్యమైన పేరు గలవాడా ! అతి సుందరమైన రూపము గలవాడా ! నల్లకలువల కాంతి వంటి శరీరము గలవాడా ! వైకుంఠవాసా ! చెవులకు ఇంపు గొలుపు నామములు గలవాడా ! దేవదేవుడా ! దానవాంతకా ! భగవద్గీతను అందించిన జగద్గురువా ! యాదవ కులమనెడి సముద్రమునందుద్భవించిన  నిండు చందమామా ! పాపములను నశింపజేయువాడా !  కొనియాడబడెడి సద్గుణములు కలవాడాయుద్ధవిద్యావిశారదుడా ! ముల్లోకములను రక్షించువాడా  !  మేము నీ దాసులము కామా ! నిన్ను మేము ప్రార్ధించడం లేదా ? మేము నీ అనుగ్రహాన్ని వేడుకుంటున్నాము ! కోరిన కోర్కెలను తీర్చవయ్యా స్వామీ ! చిత్రవిచిత్రమైన ప్రభావములు కలవాడా ! దయాసముద్రుడా ! శతృ సంహార సమర్థుడా ! మమ్మల్ని రక్షించు !

                                          
                                               మానుషహర్యక్ష ! మార్తాండ సోమాక్ష !
                                  త్రిభువనాధ్యక్ష  ! కౌంతేయపక్ష !

మదనకోటివిలాస ! మంజుల దరహాస !
                                  శ్రీహృన్నివాస ! కౌశేయవాస !

శార్ఙ్గకోదండ ! పిచండ భృతాజాండ  ! 
                                 వినుతవేదండ  ! రవిప్రచండ !

దీనశరణ్య ! విద్విధ్భేద నైపుణ్య !
                                  భక్తానుగణ్య ! దిక్ప్రభువరేణ్య !
                                                      
                                                                   సిద్ధసంకల్ప! అవికల్ప ! శేషతల్ప!
                                                               నిష్కలంక ! నిరాతంక ! నిరుపమాంక !
                                                           
                                                                  చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
                                                              హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ !    (3)
                    
                                     శ్రీకాకుళాంథ్రదేవా ! నరమృగ శరీరా ! సూర్యచంద్రనేత్రుడా ! ముల్లోకములను పరి పాలించువాడా ! పాండవ పక్షపాతి. కోటి మన్మథ విలాసా ! సుందర దరహాసా !.శ్రీ లక్ష్మీహృదయ నివాసా ! పీతాంబర ధరా ! శార్జ్ఞమనెడి ధనుస్సును ధరించిన వాడా ! సకల లోకములను గర్భమున నిల్పుకున్న వాడా ! గజేంద్ర రక్షకా ! సూర్య సమాన తేజస్సంపన్నుడా ! దీనశరణ్యా ! శతృసంహార నైపుణ్యా ! భక్తపాలన కళా సంరంభకా !  దేవతా శ్రేష్ఠుడా ! సిద్ధ సంకల్పా !  అవికల్పా ! శేషతల్పా ! కళంకము లేనివాడా ! ఎదురులేని పరాక్రమవంతుడా!  అకలంక కీర్తి సంపన్నుడా ! విచిత్రమైన ప్రభావములను ప్రదర్శించిన దేవా ! దాక్షిణ్య గుణ శోభితుడా ! శతృవులను సంహరించు వాడా ! మమ్మల్ని రక్షించవయ్యా ! శ్రీకాకుళాంథ్ర మహావిష్ణు. నీవే శరణు




 శ్రీకాకుళ  దివ్యక్షేత్రాన్ని గూర్చి సచిత్ర  వ్యాసాన్ని divyakshetralu.blogspot.com లో చూడవచ్చు.



గోవింద  ! ముచికుంద సేవిత పాదార
                                     వింద! నిత్యానంద ! విశ్వతుంద !

శ్రీమంత ! విజయలక్ష్మీకాంత నిర్మల
                         స్వాంత భక్తోద్యాన వనవసంత !

అఘనాశ ! కోటిసూర్యప్రకాశ ! వరేశ  !
                                        విజితాశ  ! సన్మనోంబుజ నివేశ !

  సద్గుణ గేహ ! వాసవనీల సమదేహ !
                                     బంధురోత్సాహ ! సువర్ణవాహ !

పండిత స్తోత్ర చారిత్ర ! పద్మనేత్ర !
మధుర మంజులభాష! సమస్తపోష !

 చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
                                                హత విమతజీవ !శ్రీకాకుళాంధ్రదేవ!                                    (4)
                           

                               గోవిందాముచికుందుని చేత సేవించబడు పాదపద్మములు గలవాడా !  నిత్యానందా !  సమస్త విశ్వమును ఉదరము నందు నిల్పుకొన్నవాడా !  శ్రీమంతుడా ! విజయలక్ష్మీదేవి  యొక్క నిర్మలమైన అంతరంగమనెడి భక్తి ఉద్యాన వనమునకు వసంతము వంటి వాడా ! పాపములను నశింపజేయువాడా. ! కోటిసూర్య సమానమైన తేజస్సు కలవాడా ! దేవదేవా ! కోరికలను ఈడేర్చువాడా ! మంచివారి మనస్సులనెడి పద్మములయందు నివసించెడివాడా ! సద్గుణ నిలయా.! ఇంద్రనీలమణి తో సమానమైన  దేహకాంతి కలవాడా ! ఉత్సాహవంతుడా ! స్వర్ణవాహనారూఢా ! పండితులచేత స్తుతించబడెడి చరిత్ర కలవాడా.పద్మనయనా ! మధురమైన వాక్చాతుర్యము కలవాడా ! సమస్త లోక పోషకా.చిత్రవిచిత్రమైన ప్రభావములు కలవాడా ! దయాసముద్రుడా !  శతృవులను సంహరించెడి వాడా ! శ్రీకాకుళాంథ్ర మహావిష్ణు శరణు.

                               పై నాలుగు పద్యాలలో కవి  శ్రీకాకుళాంథ్ర దేవుని ఔన్నత్యాన్ని , ఔదార్యాన్ని , విశ్వ సార్వభౌమత్వాన్ని వైభవ ప్రాభవాలను తనవి తీర వర్ణించాడు. కావ్యాద్యవస్ధ లో భాగం గా శ్రీ కారం తో శతకాన్ని ప్రారంభించి, పలువిథాలు ఆంథ్రదేవుని ప్రార్ధించాడు. తరువాత పద్యం లో శ్రీకాకుళం యొక్క గొప్పదనాన్ని చెప్పబోతున్నాడు.
                          
                 అయితే      ఈ శతకం లో కాసుల కవి వాడిన విశేషాలు కొన్నింటికి వ్యాఖ్యానం చెప్పేటప్పుడు  ఆ పదాల్ని యధాతథం గా వాడటం జరిగింది. ఆ పదాలను విడదీసి అర్థం చెపితే ఆ పద సౌందర్యం ,శబ్ద గాంభీర్యం దెబ్బతిని. సంపెంగ పువ్వు రేకలను విడదీసి వాసన చూసినట్టువుతుందనే ఉద్దేశం తో  వాటి రమ్యత చెడకుండా అలానే వాడాను .ఉదాహరణ కు  “గోవిందా ! నిత్యానందా ! ముకుందా ! శ్రీమంతా!  దీనరక్షా  ! లోకాభిరామా !  దీనశరణ్యా ! శేషతల్పా!  అవికల్పా !  నిష్కలంకా !”వంటివి.  సహృదయులు  ఆ పదాల సౌగంధ్యాన్ని  అలాగే ఆస్వాదించగలరని నా ఆశ.
                       

                 ఇక అసలు విషయాని కొద్దాం.   కవి ఈ శతక మకుటం లో  చిత్ర చిత్ర ప్రభావ.........హతవిమత జీవ అనే  రెండు విశేషణాలను వాడాడు.ఇవి సాధారణం గా  భక్త్యావేశం లో వాడిన పదాలు కావు. ఎంతో భావగాంభీర్యాన్ని నింపుకున్న పదబంధాలు ఇవి. చిత్ర విచిత్ర మైన ప్రభావములు గలవాడా అని మాత్రమే అర్ధం కాదు. మనం ఈ వ్యాసం తొలి పేరా ల్లో చెప్పుకున్న దాని కంటే ఎక్కువ గా ఆంథ్రదేవుని గూర్చిన ఎన్నో కథలు , గాథలు కొల్లలు గా కవి కాలం నాటికి ఆంథ్రదేశం లో ప్రచారం   లో ఉండుంటాయి. అవన్నీ విని ఆనందానికి , ఆవేశానికి లోనైన కవి హృదయం  తన స్వామిని  చిత్రచిత్ర ప్రభావ అంటూ కొనియాడాడు.   అంతే కాదు. తరువాత పద్యం లో ఆంథ్రనాయక నీవె శ్రీహరి వి నిజము. అంటాడు కవి. అంటే ఆంథ్రనాయకుని శ్రీహరి అంశ యని ఆనాటికి ప్రచారం లో ఉన్న విషయాన్ని  మళ్లీ ఒక్కసారి ప్రకటిస్తున్నాడు కవి.
                  
                              ఇక  రెండవ విశేషణం. హతవిమత జీవ...... శతృవులను సంహరించువాడా  అనే అర్థం రావడానికి ఆ పదాలనే కూర్చాల్సిన అవసరం లేదు.ఈ శతకం వ్రాసే సమయానికి కవి హృదయం బుగులు తున్న అగ్ని పర్వతంలా ఉంది.  ఆ సెగలే  వ్యాజస్తుతి , వ్యాజనింద రూపం లో శతక మంతా వ్యాపించి వేడిని పుట్టించాయి. కవి కాలం 1798 అని ఇంతకు ముందే చెప్పుకున్నాం.  మనం ఇంతకు ముందు ప్రకటించిన  వ్యాసం గర్గలాలు రచించిన నృసింహ పంచవింశతి-1 (mutteviraviprasad.blogspot.com) లో ప్రస్తావించిన  కాలమాన పరిస్థితులే ఇక్కడ కొనసాగుతున్నాయి. ఈస్ఠిండియా కంపెనీ పాలనే ఇక్కడా సాగుతోంది. మత మార్పిడుల తో హిందూమతం పై అరాచక శక్తులు దాడి చేస్తూనే ఉన్నాయి.
                       

                        గర్గలాలు ఉన్నది అహోబిలం. ఈ కవి ఉన్నది దివిసీమ. ప్రాంతాలు వేరైనా రాజకీయ పరిస్థితులు ఒక్కటే. నృసింహ పంచవింశతి రచించిన గర్గలాలు క్షత్రియుడు కాబట్టి క్రీస్తు మతజుల చెండుమా కినుక బూని అని ధైర్యం గా అహోబిల నారసింహాన్ని ప్రార్ధించాడు. కాని కాసుల పురుషోత్తమ కవి భట్టు కులజుడు. అందునా జమీందారు ప్రాపకం లో ఉన్న వాడు. అందువలన హత విమత జీవ అంటూ ఆంథ్రదేవుని స్తుతిస్తున్నాడు పురుషోత్తమ కవి. ఈ పదానికి అర్ధాన్ని చంపబడిన విమత జీవులు కలవాడాఅని  చెప్పుకుంటే మల్లెపువ్వు ను రెక్కలు విఱిచి వాసన చూసినట్లే ఉంటుంది  కాని కవి హృదయం తెలుసుకోకుండా కావ్య పఠనం చేస్తే రసానందం లభించదు కదా.  ఈ విషయం మీద ఇంకా ముందు ముందు పద్యాలలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అందుకే పదపరిమళాలను ఆస్వాదించడానికి సహృదయత్వం కావాలంటుంది అలంకార శాస్త్రం.

                                         
                                              శ్రీకాకుళము భక్తలోక చింతామణి ,
                         శ్రీకాకుళము సుకృతాకరంబు ,

శ్రీకాకుళము ధరాలోక వైకుంఠంబు ,
                                                             శ్రీకాకుళము మర్త్యసేవితంబు ,
                                   
                                                    శ్రీకాకుళము వేదసిద్ధాంత మహిమంబు ,
 శ్రీకాకుళము హతవ్యాకులంబు ,
                                   
                                                  శ్రీకాకుళము మహాక్షేత్రావతంసంబు,
 శ్రీకాకుళము సర్వసిద్ధికరము ,

తెలియ శ్రీకాకుళంబు నీ దివ్యదేశ
మాంధ్రనాయక నీవె శ్రీహరివి నిజము
  చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
                                          హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!                                     (5)
                         

                             శ్రీకాకుళాంథ్రదేవా !. శ్రీకాకుళము భక్త జనులకు  కోర్కెలను తీర్చు చింతామణి వంటిది. శ్రీకాకుళము పుణ్యముల ప్రోవు. శ్రీకాకుళము భూలోక వైకుంఠము. శ్రీకాకుళము సర్వజన సేవితము. శ్రీకాకుళము సమస్త వేదాంత సిద్ధాంత సభలచే ప్రసిద్ధమైనది. శ్రీకాకుళము మనసు లోని ఆందోళనలను  మటుమాయం చేసే ప్రశాంత  ప్రదేశము . శ్రీకాకుళము మహా పుణ్యక్షేత్ర రాజము. శ్రీకాకుళము సమస్త కోర్కెలను సిద్ధింప చేయునది. శ్రీకాకుళము నీ నివాసముచే పవిత్ర ప్రదేశము.  ఆంథ్రనాయకా ! నీవు నిజం గా  శ్రీహరివే  ! ఇది నిజము.  చిత్ర విచిత్ర ప్రభావములు కలవాడా ! దయా సముద్రుడా ! శతృవులను నిర్జించువాడా ! శ్రీకాకుళాంథ్రదేవా ! శరణు.                              

                                       

                                            ఇంద్ర  నీలచ్ఛాయ లీను నెమ్మేనిపైఁ
గనకాంబర ప్రభ గ్రందుకొనఁగ,

బర్వసుధాంశు శోభ సముజ్జ్వలవక్త్ర
                                 మున నూర్ధ్వపుండ్రము ముద్దు గుల్క,

నెగుభుజంబుల ధగద్ధగితాంగద ద్యుతుల్‌
             మూర్ధ రత్నకిరీటమునఁ జరింప,

వర్ణితోరస్థలి వైయంతిక కౌస్తు
                                         భాంతర శ్రీదేవి యంద మమర ,
                                                
                                                  రమ్ము దర్శన మిమ్ము ఘోరములఁ జిమ్ము
                                                 మభయ మిమ్ము భవత్తత్త్వ మానతిమ్ము 
                                                 చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
                                                     హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!                        (6)
                                          
                   శ్రీకాకుళాంథ్రదేవా ! ఇంద్రనీలమణి కాంతులు  వెదజల్లెడి  శరీరము పై కనకాంబరవర్ణపు పట్టువస్త్రము  ప్రకాశించుచుండగా ,చంద్రబింబపు కాంతులీను నెన్నుదిటి పై  ఊర్ధ్యపుండ్రము ముద్దులొలుకు చుండగా, ఎగు భుజంబుల యందు అలంకరించిన భుజ కీర్తుల ధగద్ధగిత కాంతులు శిరస్సున ధరించిన రత్నకిరీటమునందు  ప్రతిఫలించు చుండగా,  వక్షస్థలమున వ్రేలాడు చున్న వైజయంతీ మాలిక తో కూడిన కౌస్తుభమణి లో  ప్రతి బింబించెడి లక్ష్మీదేవి అందము లొలుకుచుండగా వచ్చి నాకు నీ దర్శన భాగ్యా న్ని ప్రసాదించవయ్యా స్వామీ ! ఈ ఘోరాలను మట్టు పెట్టి, నీ తత్త్వాన్ని లోకానికి తెలియ చెప్పి, మమ్మల్ని రక్షించు ప్రభూ !  శతృవులను సంహరించువాడా  ! నీవే మాకు రక్ష.

                                           
                                         కలిగినప్పుడె కన్న తలిదండ్రు లెన్న నే
నిసువు మాటాడంగ నేర్చె జగతి ,

బయలిజగంబు లంబకు నిజోదరమునం
దేబిడ్డ చూపించె నిద్ధరిత్రిఁ ,

దొడలపై ముద్దుగా నిడుకొన్న జనని కే
పసిపిల్ల కొండంత బరువు దోఁచెఁ ,

దల్లి చెంగటనుండి యిల్లిల్లుఁ జొచ్చి యే
కుఱ్ఱఁ డింతుల బల్మిఁ గూడ నేర్చె ,

నాబుడత వీవెరా యబ్బ! యబ్బురంపు
కతలమారివి ! నీ వెఱుంగనివి గలవె?
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
                                     హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!                                     7
                                
                                                       శ్రీకాకుళాంథ్రదేవా ! ఈ లోకం లో  ఏ పసికూన పుట్టగానే తలిదండ్రులు ఆశ్చర్య పోయేటట్లు మాట్లాడా డో,  ఈ భూమిమీద  ఏ పసిబిడ్డ తన తల్లికి పధ్నాలుగు లోకాలను తన కడుపు లోనే చూపించాడో,   తల్లి కాళ్ళ మీద ముద్దుగా పడుకోబెట్టుకున్న  ఏ పసిబిడ్డ ఆ తల్లికి కొండంత బరువు గా తోచాడో, ఏ బుడతడు తల్లి చెంత ఉంటూనే రేపల్లె లో ఇంటింటా తిరుగుతూ, గోపకాంతలతో ఇచ్చకాలాడాడో, ఆ పసివాడి వి నీవే కదా !  దేవా ! ఎంత ఆశ్చర్యము ! ఓ యబ్బ ! నీవెంత మాయలమారివి ! నీకు తెలియనివి లేవు కదా ! దయాగుణ సంపన్నా !  శతృవులను నిర్జించి, మమ్మల్ని రక్షించు !

                                                                                             ------       రెండవ భాగం త్వరలో



********************************************