Tuesday 2 October 2012

రామాయణము - రమణీయకథనాలు -7 - భరతుడు

                
                    
                     భ ర తు డు 
      
          

                      శ్రీ మద్రామాయణం లో రామచంద్రుని  కీర్తి చంద్రికలను ఒరుసుకొని నిలబడగల్గిన గుణభద్రుడు కైకేయీపుత్రుడు భరతుడు. ఏ అధికారం కోసం  ,రాజ్యభోగాలకోసం భారతం లో రక్తపుటేరులు పారాయో, దేనికోసం వాలి సుగ్రీవులు , రావణాదులు తమలో తాము సంఘర్షించుకున్నారో అటువంటి రాజ్యలక్ష్మి కోరి వచ్చినా వలదని తృణీకరించాడు.           

                           భ్రాతృసేవాపరాయణుడై, దాసాను దాసుడుగా మారి, సభామథ్యంలో రాజ్యం  చాహం చ రామస్య అంటూ దోసిలి యొగ్గి,రామచంద్రుని తీసుకొనిరావడం కోసం చిత్రకూటానికి వెళ్లి, ఆయన మాటలను త్రోసిపుచ్చలేక, పాదుకలతో మరలి, రాముని పేరనే పదునాలుగేండ్లు నిష్కాముడై రామప్రతినిథిగా రాజ్యమేలిన సుగుణోదాత్తుడు, రాజయోగిగా,యోగిరాజుగా కీర్తి శిఖరాలనథిష్టించిన ఉదాత్తగుణోపేతుడు  భరతుడు.

                         పదునాలుగేండ్లు రాజ్యాన్ని పాలించి అన్నరామచంద్రుని  రాక ఆలస్యమైతే అగ్నిప్రవేశానికి సిద్ధపడిన నిష్కాముడితడు. ఈ మహనీయుని కన్నతల్లి కైకేయి   ఏదైనా పాపం చేసి ఉంటే --   అది ఈ పుత్రుని పుణ్యవారాశి లో  ప్రక్షాళనం గావించబడి పవిత్రీకృతమైంది. భరతుని దృఢభక్తి , తృష్ణాపరాఙ్ముఖత మాతృమూర్తి కల్మషాన్ని సైతం కడిగివేసింది. అన్నాడు మహాకవి కాళిదాసు.    

                                                                                                          
                             దృఢభక్తి రితి జ్యేష్టే రాజ్యతృష్ణా పరాఙ్ముఖ:
                              మాతు: పాపస్య భరత: ప్రాయశ్చిత్త మివాకరోత్

                భ్రాతృ ప్రేమలో రామభరతులిద్దరూ పోటీపడతారు.చిత్రకూటానికి వస్తున్న భరతుణ్ణి చూసి. యుద్దానికొస్తున్నాడని సందేహించి క్రోధించిన లక్ష్మణునితో శ్రీరాముడు  --
  
   వక్ష్యామి భరతం దృష్ట్వా రాజ్య మస్మై ప్రదీయతామ్ “{ వాల్మీకం-అరణ్య-97-17]
అంటాడు. నీకు రాజ్యం కావాలంటే భరతునిక్ చెప్పి యిప్పిస్తానన్న రామునితో రామానుజుడు ఇంకేమనగలడు. రాజ్యభోగాల్ని భార్యా బంధువుల్ని వదలి అన్నవెంట అడవులకొచ్చిన తమ్మునికి అప్పుడర్థమైంది భరతుని ఔన్నత్యం.

               భరత లక్ష్మణులకు రామునియందున్న ప్రేమ అపూర్వమే.ఇరువురకు రాముడంటే ప్రాణం. ఇరువురు రాముని సుఖాన్నే గాఢంగా కాంక్షించారు.రాముని సేవనే వాంఛించారు.కాని ప్రవృత్తి లో తేడా ఉంది. లక్ష్మణునకు రాముని చెంతనే ఉండి ఆయన్ని దర్శించు కుంటూ సేవించుకోవడమే కోరిక. ధర్మాధర్మ విచక్షణ అతనికి అవసరం లేదు. రామచంద్రునికి సుఖం కల్గించడానికి ఎవరిని సంహరించడాని కైనా వెనుకాడని తత్త్వం అతనిది . లక్ష్మణునికి రామచంద్రుని యొక్క సుఖ సంతోషాలే ముఖ్యం
.
                 కాని భరతునకు  రాముని చెంత లేకపోయినా రాముని కొఱకు , ధర్మ బద్ధమయిన ఆతని ఆజ్ఞ కొఱకు శిర సొగ్గటం --  తాను ధర్మమని తలచిన దానిని రాముడు చెప్పినా అంగీకరించని స్థైర్య సంపద అతని కున్నాయి. రాజ్య స్వీకార నిరాకరణమే అందుకు ప్రబల  నిదర్శనం.తల్లికోరికలు , తండ్రివాగ్దానాలు అంగీకరించబడలేదు. జ్యేష్టుడే రాజు కావాలన్న   క్షత్రియధర్మం ప్రబలమైందక్కడ. అందుకే తాను రాముణ్ణి అంగీకరింపజేశాడు. రామ ప్రతినిథి గా మాత్రమే అయోథ్యను పరిపాలిస్తానన్నాడు. అదే చేసి చూపాడు. 
      
     రామునికి   భరతుని పైనున్న ప్రేమాధిక్యత ఎన్నోపర్యాయాలు వేరువేరు ప్రదేశాల్లో ప్రస్పుటమౌతుంది.దోహదక్రియలచే పెంచబడిన ఉద్యానలత వలె లక్ష్మణుని ప్రేమ రాముని చెంత రమణీయంగా పెరిగితే – భరతుని ప్రేమ  ప్రకృతిలో పెంపారు అరణ్యలతిక వలె గుబాళించినది. అడవిపూల పరిమళాలు వనలత లకు చెందవు కదా. అందుకే గుహుడు భరతునితో   ---   “ అయత్నా దాగతం రాజ్యం యత్త్యక్తు మిహేచ్చసి
      
      ధన్య స్త్వం న త్వయా తుల్యం పశ్యామి జగతీ తలే “ { వాల్మీకం-2-85-21}

లోకంలో నీవంటి వారిని చూడలేదన్న గుహుని పల్కులు అక్షర సత్యాలు. భరతుని    పాత్ర బారతీయ సాహిత్యానికి మణిమకుటం. కాని రామచంద్రుని పాదాల చెంత శిరసు వాల్చిన ఆ మహాభక్తుని తన కాంతిలో లీనం చేసుకున్న శ్రీరాముడు – ఏకరూపుడుగా విరాజిల్లాడని   పిస్తుంది.          
                  అయాచితంగా వస్తున్న రాజ్యాన్ని వదిలి వేసి, భూశయనం ,జటావల్కల థారణం వ్రతంగా స్వీకరించి, పాదుకాపూజలో పథ్నాగేళ్లు గడిపిన రామభక్తుడు  భరతుడు . కర్మిష్ఠి. రాజయోగి. అందుకే వేదాంత దేశికులు –తన యుపజ్ఞామహిమచే సమస్త భూమియందును రామపాదుకా ప్రభావాన్ని సమారూఢ మొనర్చిన భక్తవరులలో భరతుడు ప్రధాను డంటారు.

         భరతాయ పరం నమో2స్తు నిత్యం ప్రధమోదాహరణాయ
          భక్తిభాజాం యదుపజ్ఞ మశేషత: పృధివ్యాం ప్రథితో రామపాదుక ప్రభావ:
                 





                               వేదనతో క్రుంగేటప్పుడు ,ఆనందంతో పొంగేటప్పుడు శ్రీరామునకు భరతుడే 
గుర్తుకొచ్చేవాడు. వారి ప్రేమ అటువంటిది.  ఆనందంలోను ,వేదనలోను, అయినవారే కదా మనకు గుర్తు   కొచ్చేది. భరతుని లోని భ్రాతృభక్తి  కన్నా త్యాగభావనే అతను రాముని వద్దకు చేరడానికి తోడ్పడింది.అతని విశుద్ధ ప్రేమ వర్తనం మానవ ప్రపంచంలో భ్రాతృప్రేమకొక పవిత్రోదాహరణ గా నిలిచిపోయింది.   
        
               న సర్వే భ్రాతరస్తాతే భవంతి భరతోపమా:” {వా.6-14,15 } అన్న రాముని పల్కుల్లోనే భరతుని ఔత్కృష్ట్యం విరాడ్రూపంగా భాసిస్తుంది. అహమేవ నివత్స్యామి చతుర్ధశ వనే సమా:” అని అరణ్యం లో పిత్రాజ్ఞ కు లోబడి  పథ్నాలుగు సంవత్సరాలు నిలుస్తానని భరతుడు సిద్ధపడితే – జానామి భరతం క్షాంతం గురు త్కార కారణమ్ అని మెచ్చుకొని –
             అనేన ధర్మశీలేన వ్రతాత్ ప్రత్యాగత: పున:
              భ్రాత్రాసహ భవిష్యామి పృధివ్యా: పతిరుత్తమ:”       {వా.2-62-12}

      తమ్ముని    ప్రార్థనను మన్నించి, పథ్నాలుగేళ్ల తర్వాత అతనితో కలిసి రాజ్యాన్ని పంచుకుంటానంటాడు జ్యేష్టుడు. రాముని చెంతనుండి రామసేవలో ఆనందాన్నిపొందిన తమ్ముడు లక్ష్మణుడు కాగా, అన్నగారికై అయోథ్య నే అరణ్యంగా భావించి జీవించిన మహనీయుడు భరతుడు.ఒక్కమాటలో చెప్పాలంటే---ఇంతటి త్యాగమూర్తి ,ఋజువర్తి ,భ్రాతృవత్సలుడు, ప్రజాశ్రేయ కాముడు నిష్కామకర్ముడైన ఉత్తమపాత్ర  నాన్యతోదర్శనీయం.
                
             రామాదపి హితం మన్యే ధర్మతో బలవత్తరం  అన్న దశరథుని పల్కుల్లోను ,దిష్ట్యాన చలితో ధర్మాదాత్మతే శుభలక్షణ అని కౌసల్య --- సత్యసంధే మహాత్మని --- అనేన ధర్మశీలేన భరత: ఖలు ధర్మాత్మా” “ భరత స్సత్యవిక్రమ:” అన్న సముదాత్త ప్రశంసలు వాల్మీకివి . వాల్మీకి  రామునివి.{ వా. రా.2-61,62,}

                  వాల్మీకంలో చిత్రకూట సమాగమం అత్యంత కరుణరససంభరితమైన సన్నివేశం కాగా రామచరితమానస్ లో భరతుని పాత్ర మరింత రమ్యత
నాపాదించు కొంది.చిత్రకూట వాతావరణమంతా ఆ సౌభ్రాత్ర సౌరభం తో నిండిపోతుంది.ఈ ఘట్టం వేయి ప్రయాగల కన్నా పవిత్రమైనదని  రామాయణ విమర్శకులు భావించారు.
      
                  భరతుడు చిత్రకూటానికి తరలి వస్తున్నాడనితెలిసి , ఉత్తేజితుడైన లక్ష్మణునితో రాముడు ఇలా అంటాడు.
      కహేతాత్ తుమ్హసీతి సుహా ఈ  …………………….
         ……………………….               భారసింథు బినసాఇ “{ రా.మానస్-అ.దో.230.-3,4}
             నాయనా లక్ష్మణా నీవు చక్కని నీతి వాక్యాన్ని  చెప్పావయ్యా  నిజమే రాజ్యధికారం వల్ల కలిగే అహంకారం అన్నింటికన్నా ప్రమాదభూయిష్టమైంది. కాని భరతుని వంటి వ్యక్తి ఈ బ్రహ్మ సృష్ఠిలో ఉన్నాడని వినలేదు .కంటితో చూడలేదు.బ్రహ్మ విష్ణు మహేశ్వర పదవులు లభించినా భరతునకు అహంకారం కలుగదు. ఈ అయోథ్య ఒక లెక్కా. ఒక గంజి బొట్టు పడినందు వల్ల క్షీరసాగరం మలినమవుతుందా.? ఈ ఒక్క ఉదాహరణ చాలు. రామభక్తులకు భరతుని పై నున్న  ప్రతిపత్తి ఎటువంటిదో తెలుసుకోవడానికి . 
     
           ఈ సందర్భంగా ఒక  తెలుగు కావ్యం లోని చక్కని సన్నివేశం గుర్తుకొస్తోంది.రామ పరిష్వంగ భాగ్యాన్ని పొందిన అదృష్టశాలి మన పవనసుతుడు. ఇతనికే భరతుని కౌగిలి కూడ లభిస్తే ఇక  ఆనందానికి అవధులుండవు కదా. అదే ఇక్కడ జరిగింది.

                రావణ వథానంతరం అయోథ్య బయలుదేరిన రాముడు వాయుసుతుని పిల్చి ముందుగా అయోథ్య కు వెళ్లి  భరతుని చూచి  క్షేమసమాచారాలు అందించి,వివరాలు తెలుసుకొని రావలసిందిగా పంపిస్తాడు. అయోథ్య కు వెళ్లి జడలు కట్టిన శిరోజాలతో, చిక్కిన శరీరంతో , మునివృత్తిలో  ఉన్న వాణ్ణి ,కటికనేల మీద పడుకోవడం వలన కాయలు కాసిన వెన్ను ,ప్రక్క  భాగాలు కల్గిన  భరతుని దర్శించి, అతని మనోభావాలు తెలుసుకొని, తిరిగివచ్చి, భరద్వాజాశ్రమంలో ఉన్న రామునకు విన్నవించుకున్నాడు.

              రామ  వార్తను చెప్పితి రమ్యచరిత   నీ ఋణమ్మును చెల్లింప నేర ననుచు 
   అలముకొనె నన్ను- అదియేమి యద్భుతమ్మొ నీ పరీరంభ గతి నిల్చె నెమ్మనమున
                                                {  భారతం-  రా.వసునందన్ -608.612 ప}
           రామచంద్రుని ఆగమన వార్తను  తెల్పిన ఆంజనేయునకు  నీ ఋణం
 నేను తీర్చలేనంటూనే  కౌగిలి ని కానుకగా ఇచ్చాడు భరతుడు. భరతుని కౌగిలి లో     "రాముని కౌగిలి అనుభూతి ని పొందానని చెపుతున్నాడు ఆంజనేయుడు. మరువలేని అనుభూతి మైథిలీ నాథుని పరిష్వంగమని రామ భక్తులను ఊరిస్తున్నాడు. ఇక్కడ రామ భరత అభేద ప్రతిపాదనే కవి లక్ష్యం . ఇటువంటి ఘట్టాలు రామ కావ్యాల్లో కొల్లలు గా కన్పిస్తాయి.
                 కైకేయి దుశ్చర్య వల్ల ఛిన్నాభిన్నం కాబోతున్న ఉమ్మడి కుటుంబవ్యవస్థ ను,దాని గౌరవ మర్యాదల్నికాపాడటమే కాకుండా ఉమ్మడి కుటుంబం లో జ్యేష్టుని కివ్వాల్సిన  స్ధానమేమిటో ప్రపంచానికి తెలియపర్చిన మహోన్నత పాత్ర భరతుడు .లేకపోతే 10,000 సంవత్సరాలకు పూర్వమే భారత జాతి గర్వంగా చెప్పుకుంటున్న ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్ధ      మటుమాయమై పోయేది.  ఆంజనేయుని తర్వాత రామభక్తులు పూజించే భక్తాగ్రగణ్యుడు భరతుడే ! రామ పాదుకాశ్రిత భక్త శేఖరుడు  భరతుడు. అందుకే భరతునికి గుడికట్టి పూజలు  కూడ చేస్తున్నారు రామభక్తులు.                                                                                  

                    The Koodalmanikyam Temple in the state of Kerala is the only temple of Bharata in India.                  {wiki pedia –bharata]



**************** శ్రీ రామ రామ భరతాగ్రజ  రామ రామ  *********9441056609**