Friday 19 February 2016

శతకసౌరభాలు-8 జయ జయ శ్రీనివాస-3



శతకసౌరభాలు-8
   
      జయ జయ శ్రీనివాస-3







దేవ నీ కంకితము కాని దేహమేల
స్వామి నీకర్పితము కాని స్వాంతమేల
నాథ నిన్నందుకోని మానవత యేల
స్నిగ్ధ దరహాస జయ జయ శ్రీనివాస !
                                        


               శ్రీనివాస ప్రభూ! నీకు అంకితము కాని ఈ శరీర మెందుకు ? నీకు అర్పించలేని ఈ మనస్సెందుకు? ప్రభూ ! నిన్ను అందుకోలేని ఈ మానవజన్మ మెందుకు ?  సర్వము నీవై ఉన్నప్పుడు నీవు లేని నేనెందుకు ప్రభూ!.

                                          
                                             అల్లనల్లన అమృతంపు జల్లు చల్లు
చల్ల చల్లని దివ్య హస్తములు నీవి
ఆ కరమ్ములు శుభముల కాకరములు
స్నిగ్ధ  దరహాస జయ జయ శ్రీనివాస !
                     
                            శ్రీ వేంకటేశ్వరా! మెల్ల మెల్ల గా అమృతంపు జల్లు ను చిలకరించెడి దివ్య హస్తములు నీవి. ఆ నీ దివ్య హస్తములు  సర్వ శుభములకు నిలయములు కదా ప్రభూ !. సర్వ శుభములకు  నీ  దివ్య ఆశీస్సులే  కారణములు.

మంద మారుత సంస్పర్శలందు కరగి
కమ్మతేనెలు చిందు నెత్తమ్మి లీల
తన్మయంబగు నీ స్మృతిన్ మన్మనంబు
స్నిగ్ధ దరహాస జయ జయ శ్రీనివాస !
                   
                       శ్రీనివాసా ! హే జగన్నివాసా!  మలయ మారుతములతో పులకించి, కమ్మని తేనెలను చిందించు  తామరపువ్వు వలె నా మనస్సు నీ స్మరణ తోనే పులకించి పోతోంది ప్రభూ !.

దివ్య కరుణా తరంగాల తేలిపోవు
నాదు మనమున నీ చిరునవ్వు వాన
వెల్లి విరిసెను మల్లెలు చల్లినట్లు
స్నిగ్ధ దరహాస జయ జయ శ్రీనివాస !  (57)
                        

                        హే శ్రీనివాసా! దివ్యమైన కరుణాతరంగాల తేలిపోయెడి నీ చిరునవ్వు అనెడి వాన  మల్లెలు చల్లినట్లు గా నా మనసు లో వెల్లి విరిసింది ప్రభూ !.


చిమ్మ చీకట్ల నటు నిటు చీల్చి వైచి
శాంతి సుధ చింది కాంతులు జాలువార్చె
  మధుర దరహాస రేఖ నా మానసమున
                     స్నిగ్ధ దరహాస జయ జయ శ్రీనివాస !         (60)
                                   
                            శ్రీ శ్రీనివాసా !. మధుర సుధారసాన్ని చిలకరించే నీ చిరునవ్వు నా మదిలో ఆవరించిన అజ్ఞానమనెడి కారుచీకట్లను  నలుదిక్కులకు తరిమి వేసి ప్రశాంతత అనే అమృతాన్ని ప్రవహింప చేసింది గా ప్రభూ !.

నాల్గు గడియలు చాలదా నాదు బ్రతుకు
వరద భవదీయ స్మరణమే వరము కాగ
 ప్రాప్తమయ్యెను ఆత్మ సంతృప్తి నాకు
స్నిగ్ధ దరహాస జయ జయ శ్రీనివాస !(64)
                    

                             ప్రభూ !. శ్రీనివాసా!. నిన్ను స్మరించెడి భాగ్యము కల్గిన ఈ మానవ జన్మ  నాల్గు ఘడియలైతే మాత్రం ఏమయ్యింది తండ్రీ!.  ఈ స్వల్ప సమయమే నాకు అమృత తుల్యమైన ఆత్మ సంతృప్తిని  మిగిల్చింది స్వామీ !.

                                          పరమ పురుషుడవేని నే ప్రకృతి నగుదు
విశ్వరూపుడవేని నే విశ్వమగుదు
భావ గమ్యుడవేని నే భావమగుదు
స్నిగ్ధ దరహాస జయ జయ శ్రీనివాస !
                 

               శ్రీ శ్రీనివాసా!  నీవు పరాత్పరుడవైతే నేను ప్రకృతి నవుతాను ! నీవు విరాడ్రూపుడవైతే నేను విశ్వాన్ని అవుతాను . నీవు భావగమ్యుడవైతే నేను భావాన్ని అవుతాను. ఏమైనా నేను నీతోనే , నీ పాదeల చెంతే పడి  ఉంటాను స్వామీ !.


విశ్వమోహన నిన్ను సేవించు కొరకు
యెన్ని యుగముల నుండియో యీ తపస్సు
ఇంపు దళుకొత్త సాక్షాత్కరింప వేమి
స్నిగ్ధ దరహాస జయ జయ శ్రీనివాస !

                       
                     అతృప్త్యమృత రూపాయ పుణ్యశ్లోకాయ మంగళమ్ అని కదా  ఆచార్యుల వారు శ్రీనివాసుని స్తుతించారు. ఎన్ని సార్లు చూచినా తనివి తీరని దివ్యమంగళ రూపం శ్రీ వేంకటేశ్వరునిది.  ఈ అనుభవం వేంకటేశ్వరుని దర్శించిన ప్రతిభక్తునికి కలుగుతుంది. మళ్లీ మళ్లీ ఆ దివ్యమోహనాకారుని దర్శించాలనే  ఆశ అంకురిస్తూనే ఉంటుంది.
                  

                     అందుకే రచయిత్రి ఇలా ప్రార్థిస్తోంది.       విశ్వమోహన సౌందర్య రూపా ! శ్రీ శ్రీనివాసా ! నిన్ను సేవించడం కోసం  ఎన్ని యుగాల నుండో చేస్తున్న ఈ నా తపస్సు సార్థక మయ్యే టట్లు గా నా కనులకు ఒక్కసారి నీ దివ్యదర్శనాన్ని ప్రసాదించు స్వామీ !.

పాపపంకిలమగు నీ ప్రపంచమందు
పుణ్యసృష్టి నొనర్చు కారుణ్య జలధి
దుష్టుడెవడుండు నీ కృపాదృష్టి లోన
స్నిగ్ధ దరహాస జయ జయ శ్రీనివాస !
                

                   శ్రీ వేంకటేశా ! పాపం చేత కళంకితమైన ఈ లోకం లో పుణ్యాన్ని పండించగల కరుణాసముద్రుడవు నీవే కదా !  ప్రభూ ! నీ కరుణామృత దృష్టి ప్రసరించిన తావుల ఇంకా దుర్మార్గుడనేవాడు ఎవడుంటాడు స్వామీ !


                                          సుందరములైన పాదారవిందములను
కాంతు,ధ్యానింతు, సేవింతు, కాంక్షనింతు
పూజ గావింతు భావాల పూలతోడ
స్నిగ్ధ దరహాస జయ జయ శ్రీనివాస !


                          శ్రీ వేంకటేశ్వరుని నిజపాద దర్శనం  ఎన్నెన్నో జన్మల పుణ్యఫలమని భక్తులు భావించి , దర్శించి , తరిస్తున్నారు.

                             అందుకే రచయిత్రి  ఇలా అంటోంది.  శ్రీ శ్రీనివాసా !  సుందర మైన నీ పాదారవిందాలను తనివితీరా  దర్శించి, సేవించి , భావాలు అనే పుష్పాలతో పూజించి తరిస్తాను స్వామీ !.


మెట్టు మెట్టు కు నీ నామమే స్మరించి
కాసు కాసు కు వడ్డీలు కట్టి కట్టి
నిన్ను సేవింప వత్తురనేక జనులు
స్నిగ్ధ దరహాస జయ జయ శ్రీనివాస !


                                                           తిరుమల కొండకు నడిచి వెళ్ళడం శ్రీ వేంకటేశ్వరుని భక్తులకు కొండంత ఆనందాన్నిచ్చే విషయం. అందులోనూ వెన్నెల రాత్రుల్లో, చల్లని గాలులు ఆ వేంకటేశ్వరుని దివ్యమైన పరామర్శ లాగ శరీరాన్ని తాకి పలకరిస్తుంటే , పగలంతా ఒకటికి రెండు సార్లు క్యూలైన్ల లో వెళ్లి శ్రీ వారిని  మళ్లీ మళ్లీ దర్శించు కొని , అతి మధురం గా ఉండే  స్వామి వారి ప్రసాదమైన తిరుపతి లడ్డూని కొసరి కొసరి పంచుకొని , మధుర మదురంగా సేవించి , స్నేహితులతో కలిసి కబుర్లాడుతూ మెట్లమార్గం లో  నడిచి వచ్చిన రోజులు జీవితం లో మరువ లేనివి కదా.


                                      ఏడుకొండల   వందల మెట్లు ఎక్కడానికి  భక్తునికి ఇచ్చే బలం  గోవింద నామం. గోవిందా అని ఒక్కసారి అంటే చాలు పసి వాడైనా పరుగున పదిమెట్లు ఎక్కేస్తాడు. అది  ఆ దివ్యనామ స్మరణ లో ఉన్న  గొప్పతనం.   అందుకే మెట్టు మెట్టుకూ గోవిందా అంటూ కొండ చేరుకొని, కాసు కాసు కు  వడ్డీలు కట్టి వడ్డి కాసులవానిని సేవించుకొని ధన్యులౌతారు భక్తులు.


                                       నమ్ముకొన్నాను నిన్ను నా నెమ్మనమున
అమ్ముకొన్నాను నీకు నా అంతరాత్మ
రమ్ము రమ్ము ప్రభూ దర్శనమ్ము నిమ్ము
స్నిగ్ధ దరహాస జయ జయ శ్రీనివాస !


                    శ్రీ శ్రీనివాసా !.  నిన్ను నేను మనసారా నమ్ముకొని , నా మనసు ని నీకు అమ్ముకొని, ఎద నిండా నిన్నే నింపుకున్నాను స్వామీ ! .  నీవే  కదలి వచ్చి నన్ను కరుణించి  నీ దర్శనాన్ని ప్రసాదించు ప్రభూ !. తన ఇష్ఠదైవాన్ని తన చెంతకే కదిలి రమ్మనడం  పరమ భక్తునిలో కలిగే భక్తి పారవశ్యమేమో. ఒక భక్తురాలి ప్రార్థన చూడండి.


                                         

                                            కొండదేవర నిను చేరి దండమిడగ
చేదుకొని ఆదుకొందువు వేదవేద్య
అండగా నిల్వు స్వామి కైదండ నిచ్చి
స్నిగ్ధ దరహాస జయ జయ శ్రీనివాస !

                          స్వామీ !   శ్రీ శ్రీనివాసా ! ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట. గోవిందా  అనగానే నేనున్నానని భక్తులకు అండగా నిలుస్తావట. ఓ కొండదేవరా !  నిన్నే నమ్ముకొని అడుగడుగున దండాలు పెట్టుకుంటూ  నీ కొండకు చేరిన భక్తులకు  నీవే కొండంత అండవై నిల్చి కైదండ నిచ్చి ఆదుకొనే ఏడుకొండలవాడా!. శరణు శరణు.


వడ్డి కాసులతో మమ్ము నొడ్డు చేర్చి
కష్టముల దీర్చి రక్షించి కావుమయ్య
కలియుగస్వామి నిను వేడ కాంచవేమి
స్నిగ్ధ దరహాస జయ జయ శ్రీనివాస !

                      
   కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరా !. కష్టకాలం లోఉన్న మేము  నిన్ను తలచుకుంటే వడ్డి కాసులతో మమ్మల్ని ఒడ్డుకు చేర్చి ఆదుకొనే పర దైవమా !. ఒక్కసారి నీ చిరుదర హాస భాసురమైన సుందర రూపాన్ని  తనవి దీరా దర్శించే భాగ్యాన్ని నాకు ప్రసాదించవయ్యా !.


                                          పాహిమాం దేవదేవ! దివ్యప్రభావ!
                                        పాహిమాం వేంకటేశ! భవ్యప్రకాశ!
                                          పాహిమాం వేణులోల! గోపాలబాల!
స్నిగ్ధ దరహాస జయ జయ శ్రీనివాస !

                       దేవదేవా ! దివ్యప్రభావ ! శ్రీ వేంకటేశ్వరా ! పాహిమాం !  భవ్యప్రకాశా ! సుందరాతి సుందర రూపా ! నీవే నాకు రక్ష.  గోపాల బాల ! శ్రీ వేణుగోపాల నీవే నాకు శరణు.

అజ్ఞానినా మయా దోషానశేషాన్విహితాన్ హరే
క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైల శిఖామణే !


                        శేషశైలవాసా ! శ్రీనివాసా ! అజ్ఞాని నైన నాచేత అనేకమైన పాపాలు చేయబడ్డాయి. హే ప్రభూ ! నన్ను క్షమించు. నన్ను క్షమించి రక్షించు ప్రభూ!. అని కదా మనం స్వామి చెంత చేతులుమోడ్చి వేడుకుంటాము.అదే సంప్రదాయాన్ని  శతకము యొక్క చివరలో రచయిత్రి అనుసరించింది.


నందనందన గోవింద వందనములు
వందితాఖిల సురబృంద వందనములు
కందళిత సచ్చిదానంద వందనములు
స్నిగ్ధ దరహాస జయ జయ శ్రీనివాస !

                       శ్రీ శ్రీనివాసా ! నందకుమారా ! నమస్కారములు. గోవిందా ! వందనాలు.సమస్త దేవతా సమూహము చేత పూజించ బడెడి దేవదేవా ! నీకు వందనములు. ఎల్లప్పుడు చిరునవ్వులను చిందించెడి సచ్చిదానంద రూపా !. నీకు శతకోటి వందనాలు.
                    
                                 కలియుగ దైవాన్ని  ప్రార్థించి తరించాలని ప్రతి జీవి కోరుకుంటుంది. ఒక భక్తి శతకాన్ని స్నిగ్ధదరహాస భాసురుడైన శ్రీనివాసునిపై వ్రాసి ధన్యురాలైంది రచయిత్రి. ఒకరోజు నా  ఇంటి గ్రంథాలయాన్ని సర్దుకుంటుంటే  ఈ గ్రంథం నా కంటపడి పడేటట్లు చేసి ,  ఇంత దాక  తీసుకొచ్చిన ఆ తిరుమలగిరి రాయనికి  మరొక్క శతకోటి వందనాలు.
                      
                    ఒక్క విషయం.  త్రేతాయుగం లోని శ్రీరాముడు , ద్వాపర యుగం లోని శ్రీకృష్ణుడు కలియుగం లో వేంకటాద్రి పై  శ్రీ వేంకటేశ్వరుడుగా  వెలిశాడని శ్రీ వేంకటాచల మహాత్మ్యం లో చెప్పబడింది.
             
                
                 కౌసల్యా కీటకగృహం తింత్రిణీ దశ దిగ్రధ:
           గిరిరూపో 2నుజస్సాక్షాదయోధ్యా భూదధిత్యకా.  !
            ఇత్థం రామావతారేణ సమాం క్రీడా మకల్పయత్ .  !   (18 శ్లో)
            
            వల్మీకం దేవకీ సాక్షాద్వసుదేవో 2ధతింత్రిణీ
           బలభద్ర శ్శేషశైలో మధురా2భూ దధిత్యకా .
             ఏవం శ్రీకృష్ణ రూపేణ క్రీడతో వేంకటాచలే  !!  ( 20)                                              
                భవిష్యోత్తర పురాణాంతర్గత శ్రీవేంకటాచల మాహాత్మ్యే చతుర్ధో అధ్యాయ:

                
               అందుకే  శ్రీ రామకృష్ణ రూపాత్మకుడి గా శ్రీ వేంకటేశ్వరుని భక్తులు కీర్తిస్తారు. అంతేకాదు . తిరుమల శ్రీ వేంకటేశ్వరుని గర్భగుడి లో శ్రీ స్వామి వారి ఉత్సవ మూర్తులతో పాటు  శ్రీరామ శ్రీ కృష్ణుల ఉత్సవ విగ్రహాలు  కూడ పూజలందుకొంటున్నాయి . ఈ ఉత్సవ మూర్తులు ఏ కాలం లో ఏ కారణం గా శ్రీస్వామి వారి గర్భగుడి ఉంచబడ్డాయో చెప్పడానికి సరైన ఆధారాలు లేవని తిరుమల చరిత్రకారులు భావిస్తున్నారు.

                   తిరుమలనంబి తన కాలములోనే శ్రీరామ శ్రీకృష్ణ విగ్రహాలను, అంతకు పూర్వం నెలకొల్పబడనప్పటికిని శ్రీవారి గర్భగృహము లో అర్చకస్వాముల యనుమతి తో సమర్పించెనని  నిర్ణయమునకు రావచ్చును. (తిరుపతి చరిత్రము. 253 వ పేజి.)

                  ఆయన అదృష్టమేమో గాని  ఒక భక్తుని కైతే శ్రీ వేంకటేశ్వరుడు రామకృష్ణరూత్మకుడై స్వప్నం లో సాక్షాత్కరించాడు. ఇదిగో ఆ రూపం ఇది.


                                      
                  ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వ్యాసం  ఇదే blogger లో  ఓ అపురూపచిత్రం-కలిసంతరణ వేంకటరమణ మూర్తి అనే వ్యాసం లో చూడవచ్చు.


                                  రచయిత్రి  ఈ శతకం లోని 107 వ పద్యం లో నందనందనునకు వందనాలు సమర్పించడం తో  శ్రీ రామకృష్ణుల ప్రశంస ఇక్కడ మనకు ప్రస్తావన  కొచ్చింది. మరొక్కసారి గోవిందుని స్మరించుకొనే మహద్భాగ్యం మనకు లభించింది. హరే రామ హరే రామ రామ రామ హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే అంటుంది కలి సంతరణోపనిషత్తు.

                           ఇది జయజయశ్రీనివాస శతకానికి తేజస్వినీ వ్యాఖ్య సంపూర్ణము. 


  ******** ओं नमो वेंकटेशाय *********

Friday 5 February 2016

శతకసౌరభాలు -8 జయజయ శ్రీనివాస- శ్రీవల్లి -2


శతకసౌరభాలు -8

  జయ జయ శ్రీనివాస- శ్రీవల్లి -2

                              




                                      శిల్పి వీవు నీ సురుచిర శిల్పమేను

                                    ద్రష్ట వీవు నీ సులలిత దృష్టి నేను
                                   స్రష్ట వీవు నీ సుమధుర సృష్టి నేను
                                    స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!


                  
                   ఆనంద నిలయ వాసా  ! శ్రీ శ్రీనివాసా ! నీవు శిల్పివి.  నీవు చెక్కిన   అందమైన శిల్పాన్ని నేను. నీవు ద్రష్టవు. నేను నీ సులలితమైన దృష్టిని. నీవు స్రష్టవు . నేను నీవు సృష్టించిన మనోహరమైన సృష్టిని. నీకు జయమగు గాక !.

అల్పజీవియు మంచి సంకల్పమున్న
గొప్పవారి గౌరవము గైకొన గలండు
ఉడుత బుడత రాముని ప్రేమ నొంద లేదె
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!
            
                        శ్రీ శ్రీనివాసా!  అల్పుడైన వాడు కూడ సంకల్పబలముంటే  గొప్పవారి చేత సైతం గౌరవించబడతాడు. సేతు నిర్మాణ సమయం లో  అల్పజీవియైన ఉడుత  శ్రీరామచంద్రుని చేత  మన్నించబడింది కదా !
                   
                                        భక్తి  పరవశులైన  సద్భక్త వరుల
గుణమె గణనీయమగు వారి కులము కాదు
శబరి బదరీ ఫలాలు దాశరథి తినడె
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!
            
                 తిరుమల గిరి వాసా !  శ్రీ వేంకటేశా ! మహా భక్తుల సద్గుణములే వారిని గొప్పవారిగా  చేస్తాయి కాని  వారు పుట్టిన కులము వలన వారు  ఉన్నతులు గా కీర్తించ బడరు. శబరి కాంత అందించిన పండ్లను రామచంద్రుడు ప్రేమతో స్వీకరించడం లోని  నీతి ఇదే కదా! .

కాని పనులకు జని హాని గనుట కంటె
ఉన్నదాననె సంతృప్తి నొంద మేలు
వాలి జోలికి పోయి రావణుడు చెడడె
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!
            
                శ్రీ శ్రీనివాసా ! కొఱగాని పనులకు వెళ్లి ప్రాణహాని తెచ్చుకున్న దాని కంటే ఉన్న దాని తో తృప్తిచెంది జీవించడం మేలు . ఎందుకంటే రావణుడంతటి వాడు ఉన్న చోట ఉండకుండా వాలి చెంతకు వెళ్లి పరాభవము ను పొందాడు కదా!.

సిరులు చేకూర తను దాను మరచునేని
స్నేహమా అది మిత్ర విద్రోహ మగును
మాధవుండు కుచేలుని మరచినాడె
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!
            
                  శ్రీ శ్రీనివాసా ! చిరుదరహాసా ! సంపదలు కూడగానే కన్నుమిన్ను కానక ప్రవర్తించడం అది స్నేహమనిపించుకోదు. మిత్ర ద్రోహ మనిపించుకుంటుంది.  భారతం లో ద్రుపదుడు తన సహాధ్యాయి , మిత్రుడు నైన ద్రోణుని అవమానించి ముప్పు తెచ్చుకున్నాడు. కాని భాగవతం లో శ్రీకృష్ణుడు తన చిన్ననాటి మిత్రుడు, పరమ దరిద్రుడు నైన కుచేలుని ఆదరించి మన్నించి స్నేహానికి అర్ధాన్ని తెలియచెప్పాడు.                   

 ఎంతవాడైన నితరుల చెంత చేరి
చేయి జాచుట యన చాల చిన్న బోవు
బలి నడుగ వామనులు గారొ ప్రభువు గారు
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!   (29)
                 
             శ్రీ  శ్రీనివాసా ! చిద్విలాస భాసా ! ఎంత గొప్పవాడైన  పరుల వద్దకు యాచనకు వెళ్ళితే ఎంత చిన్నపోతాడో  నీవు బలి వద్దకు వామనుడి గా వెళ్లి లోకానికి తెలిపావు గా స్వామీ. విశ్వవ్యాపి వై, విరాడ్రూపుడవైన నీవు వామనుడవైన వైనం యాచనావృత్తి లోని చిన్నతనాన్ని (వామనత్వాన్ని) లోకానికి ఎఱుక చేసింది ప్రభూ!.

ధర్మపథము వీడని మహోదారమతికి
సాయమగు చుండు జంతు సంచయము కూడ
రామకార్యము దీర్చె మర్కటము లెల్ల
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!  (28 )
         
                  ఆపద మొక్కులవాడా! అనాథ రక్షకా ! ధర్మ మార్గం లో నడిచే మహాను భావులకు లోకం లో జంతుసంతతి  కూడ సహాయం చేస్తాయి. రామకార్యానికి కోతులు చేసిన సాయం  లోకానికి తెలియనిది కాదు గదా ! .

దుష్టకర్ము దురాచారు ధూర్తమతిని
 అనుజులైన త్యజించెద రంత మందు
విడిచి రాడె రావణుని  విభీషణుండు
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!  (29 )
         
              శ్రీ వేంకటేశ్వరా ! దురాచార పరాయణుడు , ధూర్తుడు , దుర్మార్గుడు నైన వాడిని చివరి సమయం లో సోదరులు కూడ వదిలి వేస్తారు. విభీషణుడు రావణుని వదిలివేసిన వృత్తాతం లోక విదితమే కదా ! .
                     ఈ గ్రంథరచనా విధానం భక్త్యావేశం లోను ఒక ప్రణాళికా బద్ధం గా కొనసాగిందని మనం భావింపవచ్చు. ఎందుకంటే 21 వ పద్యం నుండి30 వ పద్యం వరకు రామాయణ కధాఘట్టాలను ప్రస్తావించిన రచయిత్రి 32 వ పద్యం  40 వరకు  శ్రీ ఆది నారాయణ మూర్తి ధరించిన దశావతార వైభవాన్ని వర్ణించి తరించింది. 
సోమకుని వ్రచ్చి బ్రహ్మకు శ్రుతుల నిచ్చి
విశ్వ సాహిత్యలక్ష్మి కి వెలుగు దెచ్చి
పేరు గాంచిన మత్స్యావతార మీవ
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!  (31)
                శ్రీ శ్రీనివాసా ! సోమకాసురుని సంహరించి  వేదాలను పరిరక్షించి విశ్వ సాహిత్య లక్ష్మి కి వెలుగు లందించిన  మత్స్యావతార మూర్తివి నీవే కదా ప్రభూ !. నీకు జయమగు గాక ! .

పాలమున్నీట మందర పర్వతమ్ము
మునిగిపోకుండ జొచ్చి వీపున ధరించి
కీర్తి గాంచిన శ్రీ కూర్మమూర్తి వీవ
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!
          
         శ్రీ  వేంకటేశా !  క్షీరసాగర మథన సమయం లో మందర పర్వతం మునిగిపోకుండా కూర్మమూర్తివై,  మందర పర్వతాన్ని వీపున భరించి  అమృతోద్బవానికి కారణమైన కీర్తిమంతుడవు, దివ్య రూపుడవు నీవే కదా ! .

సకల ధాత్రీ తలంబును చాప చుట్టి
పరువు లెత్తు హిరణ్యాక్షు పట్టి చీల్చి
ధరణి నేలు వరాహవతార మీవ
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!(33) 
                     
                     శ్రీ శ్రీనివాసా ! సురుచిర దరహాసా ! మా పాలిటదైవమా ! సమస్త భూ మండలాన్ని చాప చుట్టగా చుట్టి పట్టుకు పోతున్న హిరణ్యాక్షుడిని పట్టి   సంహరించి  ధరణి ని   ఏలిన పరంధాముడవు నీవే కదా! .
                                 విల్లు చేజార కర్తవ్య విముఖుడైన
పార్ధు గీతాప్రబోధఁ గృతార్థు చేయు
విజయసారథి నీవ గోవింద దేవ
స్నిగ్ధ దరహాస! జయ జయ శ్రీనివాస!   (38)
               
                శ్రీ పద్మావతీ  వల్లభా ! శ్రీ శ్రీనివాసా ! కురుక్షేత్ర సంగ్రామం లో కౌరవసేనను చూసి యుద్ధ పరాఙ్ముఖుడైన అర్జునునికి  గీతోపదేశం చేసి జగద్గురువైన విజయసారథివి నీవే కదా! తిరుమల వాసా !గోవిందా ! నీకు జయమగు గాక !
క్రూర ధూర్త స్వభావుల బారి నుండి
భారతావని స్వాతంత్ర్య భావమంద
ఖడ్గ మూనెడు కళ్యాణ కల్కి వీవ
                   స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!        (40)
           
   శ్రీ శ్రీనివాసా! పాపపంకిలమైన కలియుగాంతమునందు  దుష్టుల బారి నుండి ఖడ్గధారివై భారతావనిని  రక్షించెడి  కళ్యాణకల్కి రూపుడవు నీవే కదా వేంకటేశా !
సత్యరూపుడ నీవు నే సత్యమగుదు
సాధ్యుడవు నీవు నే సాధనమును
శ్రుతివి నీవు నిన్నంటిన స్మృతిని నేను
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస! 

                         శ్రీ ఏడుకొండల వేంకటేశ్వరా !  నీవు సత్యరూపుడవైనచో నేను సత్యము ను. నీవు సాథ్యుడవైనచో నేను సాధనమును. నీవు వేదమువైనచో నేను వేదాంగమునౌతాను.

                 మళ్లీ 43 వ పద్యం  నుండి 51 వ పద్యం వరకు  నారద భక్తి సూత్రాలలో చెప్పబడిన దశ విధ భక్తి మార్గాలను ప్రస్తావిస్తూ వాని ద్వారా ముక్తి పొందిన  భక్తులను  గుర్తుచేసుకొని పులకించి పోతుంది రచయిత్రి.
శ్రవణం కీర్తనం విష్ణో :స్మరణం పాదసేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనమ్ !!.

భాగవత గాథ దివస సప్తకము విన్న
అల పరీక్షిత్తు కైవల్య మందుకొనియె
స్వామి ఇట్టిది నీ కథా శ్రవణ మహిమ
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస! 

                     శ్రీ శ్రీనివాసా !  ఆనాడు మరణ మాసన్నమైన పరీక్షిత్తు కోవలం ఏడు రోజులు భాగవతాన్ని విన్నంత మాత్రానే మోక్షాన్ని పొందాడు . నీ దివ్య కథాశ్రవణ మహిమ ఎంత గొప్పదో కదా ప్రభూ !
మహతి చేబూని నారద మౌని నీదు
నామ సంకీర్తనమున ధన్యతను గాంచె
ఆర్తి హరియించు స్వామి నీకీర్తనంబు
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!    (44)

                      శ్రీ శ్రీనివాసా ! నారద మహర్షి మహతి అనే  పేరు గల వీణ ను నారాయణ నారాయణ అనే నీ నామ సంకీర్తన చేయుచూ ధన్యతను గాంచాడు. స్వామీ . నీ నామ సంకీర్తనము ఆర్తిని హరించెడి పరమౌషధము కదా స్వామీ !.

 కర్కశ కరాళ మకర వక్త్రమున జిక్కి
భక్తి స్మరించు కరిని కాపాడినావు
సరసిజాతాక్ష యిదియె నీ స్మరణ మహిమ
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస! 

                    శ్రీ శ్రీనివాసా ! అతి కర్కశమైన మొసలి కోరలలో చిక్కుకొని , వేరు గతిలేక భక్తి తో  నిన్ను స్మరించిన గజరాజు ను కాపాడినావు. సరసిజాక్షా. ఇది నీ  నామ స్మరణ మహిమ యే కదా !
                                గంధ మాల్యాంబరమ్ముల కాన్కలిచ్చి
నిన్ను సమర్చించి మోక్షమందినది కుబ్జ
యుష్మదర్చన సర్వ సౌఖ్యోదయంబు
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస! (47)

                శ్రీ వేంకటేశ్వరా ! నిన్ను అర్చించడం వలన కలుగు ఫలితాన్ని కుబ్జ వృత్తాతం లోకానికి తెలియ    చెప్పింది.  మధురా పుర వీధులలో పరిమళ భరితమైన  శరీరానికి పూసుకొనే గంధాన్ని ,అందంగా అల్లిన పూలమాలలను , పట్టువస్త్రాలను నీకు కానుక గా యిచ్చిన కుబ్జ తన వికార రూపాన్ని పోగొట్టుకొని, సుందర రూపాన్ని పొందింది. నిన్ను అర్చించడం వలన ప్రయోజనం  ఆమెకు వెంటనే లభించింది కదా స్వామీ !  

                                   గోపబాలురు నీ తోడ కూడియాడి
ధన్యులైరి త్రిలోకైక మాన్యు లైరి
సఖ్యభావంబు లోని ప్రాముఖ్య మేమొ
            స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!      (50)

                   శ్రీ శ్రీనివాసా! అనాడు రేపల్లె లో గోప బాలురు నీతోడ  ఆడి పాడి నీ స్నేహము తో  గొప్పవారు గా కొనియాడ బడు తున్నారు. సఖ్యభక్తి లోని గొప్పతనమదియే కదా !
ఆత్మలకు ఆత్మయౌ పరమాత్మ వీవు
అందుకొన్నావు రాధ ఆత్మార్పణంబు
 మహిత మోక్షానురక్తి నీ మధుర భక్తి
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!  (51)

                 శ్రీ శ్రీనివాసా ! ఆత్మలకు ఆత్మయైన పరమాత్మవు నీవే కదా. అందుకే రాధాదేవి యొక్క సర్వ సమర్పణాన్ని అందుకొన్నావు.  మధురభక్తి మార్గము మోక్ష ద్వారానికి  దగ్గర దారి  కదా ! .
                రాధాదేవి గుర్తుకు రాగానే ఇక్కడ నుండి రచయిత్రి మధుర భక్తి భావనా నిమగ్నయై  ఇరవై ఆరు పద్యాల వరకు ప్రయాణం చేస్తుంది. మధ్య మధ్య లో దేవులపల్లి  వారి భావ కవితా  పరిమళాలను విరియింప చేస్తూ  చిరునవ్వుల వానలు , మల్లెల జల్లులు , మలయ మారుతాలు , కల కూజితాలు, కమ్మతేనెల విందులు  సందడి చేస్తాయి. ఆ ఆనందపు టావేశం లోని  చివరి పద్య మిది.

చల్ల చల్లగ నా మనశ్శయ్య మీద
సుంత శయనించి సేద తీర్చు కొనుమయ్య
విశ్వ సంసారమున నెంత విసిగినావొ
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!  (76)
       
     ఎంత మధుర భావనో చూడండి.   విశ్వ సంసార సంవీక్షణ లో అలసి పోయిన తన స్వామిని చల్ల చల్ల గా తన మనశ్శయ్య మీద సుంత అంటే కొంచెం సేపు శయనించి సేద తీర్చుకొనమని  తియ్య తియ్యగా  మధురాతి మధురంగా వేడుకొంటోంది  శ్రీ నివాస మహాప్రభు ని రచయిత్రి.

                                                    మూడవ భాగం త్వరలో.......................

*******************************************