Tuesday 2 August 2016

శతకసౌరభాలు -9 పురుషోత్తమ కవి - ఆంథ్రనాయక శతకము- 5

శతకసౌరభాలు -9


కాసుల పురుషోత్తమ కవి
   

  ఆంథ్రనాయక శతకము- 5
                    






నాఁగలి రోఁక లన్నకు నిచ్చి శంఖాది
పంచాయుధము లీవు పట్టినావు
తాటి టెక్కెంబు కోల్తల పెద్ద కెత్తించి
గరుడధ్వజం బీవు గట్టినావు
వెలరాని కఱవోని వలువ జ్యేష్ఠున కిచ్చి
కనకాంబరం బీవు గట్టినావు
మద్య మగ్రజునకు మత్తిలఁ దావించి
జున్ను బాల్‌ పెరుఁ గీవు జుఱ్ఱినావు
తగువరివె యన్నదమ్ముల ధర్మ మీవె
తీర్చవలెఁ గాని మఱియొండు తీర్పఁగలఁడె
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
హత విమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ!     36

                  శ్రీకాకుళాంధ్రదేవ! అన్నదమ్ముల తగవులాటలో తీర్పరి గా నిన్నే ఎంచుకోవాలయ్యా  స్వామీ. ఎందుకంటే  నాగలిని రోకలిని అన్నయైన బలరాముడి కి చ్చి శంఖము , చక్రము మొదలైన పంచాయుధాలను నీవు ధరించావు. యుద్ధభూమి లో   తాళధ్వజాన్ని అన్నకు ఇచ్చి గరుడధ్వజాన్ని నువ్వు తీసుకున్నావు. విలువలేని నల్లని వస్త్రాన్ని అన్నయైన బలరాముని కిచ్చి  ఖరీదైన కనకాంబరాన్ని నీవు కట్టుకొన్నావు. అన్న కు  మత్తు కల్గేటట్లు మద్యాన్ని త్రాగించి  జున్నుపాలు ,పెరుగు లను నువ్వు జుఱ్ఱుకున్నావు. అన్నదమ్ములకు భాగాల పంపిణి లో నీకంటే నిష్పక్షపాతంగా చేసేవాడు ఇంకా ఎక్కడుంటాడయ్యా. అన్నదమ్ముల తగవు లో నీవే మంచి తీర్పరివి.




                                          అప్పనంబులు గొను నఖిలదిఙ్మండలే
                                                                 శ్వరులచేవేంకటాచలనివాసుఁ
                                          డరుదుగా నరువదా ఱగురసంబులు మహా
భోగంబుఁ గొను నీలభూధ్రవరుఁడు
పానకం బాని సాఁబాలు భక్తుల కిచ్చి
మెసఁగును మంగళాద్రీశ్వరుండు
పుట్టకొలంది మైపూఁతఁగాఁ గొను మంచి
గంధంబు సింహనగ ప్రభుండు
సాటి సాముల రీతి నిచ్చోట నీవు
మూర్తిమంతంబుఁ జూపక కీర్తి గలదె?
చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ !
హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!             37

                               ఆంధ్రదేవా ! ఏడుకొండల మీద కొలువుదీరిన వేంకటేశ్వరుడు  సమస్త దిక్పాలుర నుండి కానుకలను  అందుకుంటున్నాడు. నీలాచలం మీద కొలువు దీరిన జగన్నాథుడు అరవై ఆరు రుచులతో  మహాభోగాలను రుచి చూస్తున్నాడు. ( జగన్నాధుని వంటశాల ప్రపంచం లోనే అతి పెద్ద వంటశాల గా ప్రసిద్ధి కెక్కింది ) మంగళాద్రి పై కొలువు దీరిన  పానకాల నారసింహుడు భక్తులు సమర్పించు పానకం లో సగం తీసుకొని మిగిలిన సగం  తిరిగి  భక్తులకే ఇచ్చేస్తున్నాడు. సింహగిరి మీద కొలువు దీరిన వరాహనారసింహుడు పుట్ల కొలది మంచి గంధాన్ని మై పూతగా పూసుకొని, భక్తుల  సేవలందుకుంటున్నాడు. ఇటువంటి సమయం లో  నీ తోటి వారందఱి తో సమానంగా నీవు కూడ నీ ఔన్నత్యాన్ని ప్రదర్శించక పోతే నీ కీర్తి ప్రతిష్టలకు భంగం కదా స్వామీ !


                                    బొచ్చెచేఁపకు నైన మచ్చరం బున్నది
తాఁబేటి కైన సత్త్వంబు గలదు
ఢీకొన్న నడవిపందికిఁ గల్గు రోసంబు
తెరనోటినరుఁడైనఁ దెగువ సేయుఁ
బొట్టివానికి నైన దిట్టతనం బుండు
బాపని కైన దర్పంబు గలదు
చుంచురాజున కైన శూరత్వ మున్నది
ముసలికి నైనఁ జేపుష్టి గలదు
సిద్ధ మాభీరుఁడవు నీవె బుద్ధి నెంచఁ
గలికి వై యేమి సేయఁ గలవొ కాని
చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ !
హత విమతజీవ  ! శ్రీకాకుళాంధ్రదేవ!    38

                                      శ్రీకాకుళాంధ్రదేవ!     మత్స్యావతారం లో రోషాన్ని  ప్రదర్శించి వేదాలను సంరక్షించావు. కూర్మావతారం లో  నీ బలాన్ని చక్కగా ప్రదర్శించావు. వరాహావతారం లో  ప్రతాపాన్ని ప్రదర్శించి భూదేవిని కాపాడావు. నరసింహావతారం లో తెగువ ను చూపి ప్రహ్లాదుని రక్షించావు. వామనుడవై పొట్టివాడవైనా గట్టివాడనిపించావు. పరశురామావతారం లో క్షత్రియ సంహారం చేసి దర్పాన్ని ప్రదర్శించావు. శ్రీరామావతారం లో మహావీరుడుగా కీర్తి గడించావు. బలరాముడి గా నీ చేతి బలాన్ని చూపించావు  కాని ఇప్పుడు నీవు గోపాలకుని అవతారం లో ఉన్న పిరికివాడవు. ఇక  కలికి అవతారం ఎత్తి ఏమి సాధించగలవో  చూద్దాం.


                                        మును నందగోవత్సములఁ గాయునప్పుడు
ననునయించిరె కంజజాది సురలు?
విట చోరచేష్టల వ్రేపల్లెఁ దిరుగు నీ
దగుమ్రోల నచ్చర లాడినారె?
నరరథాశ్వముల సంగరవీథిఁ దోలునాఁ
డెంచి దిక్పతులు భావించినారె?
మగధేశుదాడికి మథుర వీడిననాఁడు
దేవర్షు లెల్లఁ గీర్తించినారె?
యల్పునిగ నెంచినారె లోకైకనాథ
నాథునిఁగ నెంచినారె ము న్ధరణిఁ? జెపుమ
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
                                               హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!                                39

                             శ్రీకాకుళాంధ్రదేవ!  ఇంతకు పూర్వం నీవు నందగో కులం లో ఆవులను కాసేటప్పుడు బ్రహ్మాది దేవతలు ఎవరైనా వచ్చి నిన్ను అనునయించారా ? చెడుతిరుగుళ్ళ తో , దొంగతనాలతో రేపల్లె లో తిరుగాడేటప్పుడు అప్సరస స్త్రీలు నీ ముందు నృత్యాలు చేశారా? లేదు కదా. పాండవ మథ్యముడైన అర్జునుని రధాన్ని యుద్ధభూమి లో నువ్వు తోలే టప్పుడు దిక్పతులు వచ్చి నిన్ను  సంభావించారా ? జరాసంధుని దెబ్బ కు నీవు మథుర ను  వదిలి పెట్టి పాఱిపోయే రోజున   దేవర్షులు వచ్చి నిన్ను కీర్తించారా ? అంటే భూమి పై జన్మించిన నిన్ను దేవతాగణమంతా అల్పుని గా భావించింది కాని లోకైక నాథుని గా నిన్ను గుర్తించలేదు.    దేవదేవుని గా నిన్ను గుర్తిస్తే  నిన్ను గొప్పగా గౌరవించెడి వారు కదా. !                            

                         బాలకృష్ణుని బాల్యక్రీడల్లో ఆయన చేసి సాహసకృత్యాలను మెచ్చి సుర దుందుభులు  మ్రోగినట్లు,  దేవతలు పూలవానలు కురపించినట్లు భాగవతం లో చెపుతోంది.  కాని ఈ కవి స్వామిని సాథించి తన పనిని సాధించుకోవాలని చూస్తున్నాడు కాబట్టి అటువంటి విషయాలు తెలిసి కూడ  తెలియనట్లు గా ఉంటాడు. ఇది ఈ కవి నైజం.  ఈ విషయాన్ని ఇంకా వివరంగా 42 వ పద్యం లో చూద్దాం.

                                                పూతనా కుచ కుంభపూర్ణ విషస్తన్య
పాయివై బ్రదికిన భాగ్య మేమి?
కాళియాశీవిషగ్రసన ప్రమాదంబు
గడచి జీవించిన ఘనత యేమి?
చాణూరమల్లదో: స్తంభ ఘట్టన కోర్చి
లబ్ధజయుఁడ వైన లాభ మేమి?
సాళ్వరాజామోఘ శక్తి ప్రయోగంబు
మరలించుకొనిన సామర్ధ్యమేమి?
బడుగు దాసరివలె నన్నవస్త్రములకుఁ
బరుల కాశింతు విచట నీపంత మేమి?
చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ !
హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!    40

                            శ్రీకాకుళాంధ్రదేవ!     నీ చిన్నప్పుడు  పూతన  అనే రాక్షసి  తన చనుబాల లో విషాన్ని నింపి  నిన్ను చంపడానికి  ప్రయత్నించినప్పుడు నీవు ఆమెను చంపి బ్రతికిబయటపడ్డావు కాని ఫలితం ఏముంది ? కాళీయుడనే సర్పరాజు  విషం నుంచి బతికిబయటపడిన గొప్పతనం ఏమైంది ? చాణూరుడనే మహా మల్లయోధుని ముష్టిఘాతాలనుండి  తప్పించుకొని జయాన్ని పొందిన లాభమేమి ? సాళ్వరాజు ప్రయోగించిన అమోఘమైన శక్తి అనే ఆయుధాన్ని తిప్పి అతనిమీదకే ప్రయోగించిన నీ ప్రతిభా నైపుణ్యం ఎంతటిది ?  ఇన్ని ఘనకార్యాలను చేసిన నీవు ఇప్పుడు ఒక పేద దాసరి వలే అన్నవస్త్రాలకు  ఇతరులను  ఆశ్రయిస్తున్నావు. నీకు ఈ మొండి తనం ఎందుకు. నీ చేష్టలన్నీ విచిత్రాలు గానే ఉన్నాయయ్యా.

          ఈ సందర్భం లో   కంసుని పంపు తో రేపల్లె వాడకు వచ్చిన పూతనను ఆంధ్రమహాభాగవతం లో పోతన  వర్ణంచిన రీతి కడు రమణీయం గా ఉంటుంది.  ఆమె సౌందర్యాన్ని చూసిన గోపకాంతలు మమ్మల్ని అందరినీ సంతోషపరచడానికి లక్ష్మీదేవి శృంగార వేషం తో వచ్చిందేమో నని  భ్రాతి పడి తదేకం గా పూతనను చూస్తూ ఉండిపోయారట. పూతన వర్ణన చూడండి.



క్రాలుకన్నులు గుబ్బచన్నులుఁ గందువొందని చందురుం
బోలు మోమును గల్గు లేదన బుద్ది దూఱని  కౌను, హే
రాళమైన పిఱుందుఁ  బల్లవరాగ పాదకరంబులుం
                                    జాల దొడ్డగు కొప్పు నొప్పగ సర్వమోహన మూర్తితోన్.   (ఆం.మ.భా.10 పూ.-213 )

                                         ప్రకాశవంతమైన నేత్రాలు, పొంకమైన వక్షోజాలు ,మచ్చలేని చందమామ వంటి మోము, ఉన్నదా లేదా  అనే అనుమానానికి తావిచ్చే నడుము , విశాలమైన జఘనము ,  చిగురాకుల వంటి కాళ్లు చేతులు , ఒత్తైన కొప్పుముడి తో సర్వమోహనమూర్తి గా నందుని ఇంటికెళ్ళింది పూతన.


                                    పట్టి గొల్లది రోఁట గట్ట నోపిన నీకుఁ
రోసంబు లే దన్న నీసు గలదె?
జార చోరాది చేష్టలఁ బ్రవర్తిల్లు నీ
కపకీర్తి యన్న భయంబు గలదె?
భార్యచేఁ దన్నులుఁ బడ్డవానికి నీకు
లజ్జ లే దని యన్న లాఘవంబె?
కుండంటు లే దని కొసరి మెక్కిన నీకు
హీనత లెంచిన న్యూన మగునె?
కోరి దాసులు ని న్నెంత దూరుచున్నఁ
బంత మున్నదె నీ కిసుమంత యైన?
చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ !
                                      హత విమతజీవ !శ్రీకాకుళాంధ్రదేవ!                                  41

                               శ్రీకాకుళాంధ్రమహావిష్ణూ!   ఒక గొల్లభామయైన యశోద  నిన్ను రోటికి కట్టేస్తే   సహించిన నీకు ఏమాత్రం రోషం లేదంటే పౌరుషం పొడుచుకొచ్చిందా ? జారచోరాది చేష్టల్లో  సంచరించే నీకు అపకీర్తి అంటే భయముందా. పెళ్లాం  కాలితో తన్నించుకొన్న   నీకు సిగ్గు లేదంటే తప్పులేదు కదా.  కుండంటు లేదంటూ పరుల ఇళ్లల్లో దూరి  పాలు పెరుగులు మెక్కిన  నిన్ను ఎంత అల్పుని గా లెక్కించిన అది తక్కువే అవుతుంది గదా ! అందుకనే నీ భక్తులు నిన్ను ఎంతగా నిందిస్తున్నా నీలో  మాత్రం  ఇసుమంతైనా పౌరుషం కాన రావడం లేదు.                            

                తాను నిందాస్తుతి లో స్వామి ని ఎందుకు రెచ్చగొడుతున్నాడో కవి ఈ పద్యం లో ప్రస్తావించి , లోలోపల బాధపడుతున్నట్టున్నాడు. అతి ప్రేమ ఉన్నచోటే కోపం గా కూడ ఉంటుందంటారు . అదే ఈ విధమైన రచనకు కారణమౌతోంది. తన ప్రభువు నిత్యసేవలకు దూరమై , బికారి గా ఉంటున్నాడనే బాధ కవిలోని వేదనకు కారణ మైంది.


                                         కడు దొంగతనమునఁ గని తల్లి వైచినఁ
దనబిడ్డనిగ బెంచె నిను యశోద
జనని గర్భము దించుకొనిన వేఱొకతల్లి-
కడుపుఁ జేసికొనంగ గలిగెనన్న
తండ్రి వివాహయత్నము సేయ నొల్లక
తగులుక వచ్చె నీ ధర్మపత్ని
యన్న రారాజు కీనున్న నీ సోదరి
యింటికి జోగిరా నంటుకొనియె
నిట్టి నీ సంప్రదాయంబు గుట్టు బెట్టు
రట్టు సేయుదుఁ గనుము నా భట్టుతనము
చిత్ర చిత్ర ప్రభావ!  దాక్షిణ్యభావ !
హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!     42

                      శ్రీకాకుళాంధ్రదేవ!     కన్నతల్లి  దేవకీదేవి నిన్ను చాటుమాటు గా కని పారవేస్తే యశోదాదేవి నిన్ను కన్నబిడ్డ గా పెంచి పెద్ద చేసింది. నీ తల్లి ఏడవ గర్భం పోగా మరొక తల్లి రోహిణి తన గర్భాన మోసి నీ అన్నను కన్నది **. నీ ధర్మపత్ని రుక్మిణి ఆమె  తండ్రి వివాహప్రయత్నాలు చేస్తుంటే  కాదని పుట్టింటిని వదిలి, నిన్ను తగులుకొని వచ్చేసింది. నీ అన్న బలరాముడు  దుర్యోధనునికి ఇచ్చి వివాహం చేయదలబెట్టిన నీ సోదరి సుభద్ర, ఇంటికి సన్యాసి వేషం లో వచ్చిన  పాండవ మథ్యముడైన అర్జునుని జంట కుదుర్చుకుంది. ఇదేగా నీ కుటుంబ సంప్రదాయము.  ఇదేవిధంగా నీ రహస్యాలను బట్టబయలు చేస్తాను . నా బట్టుతనపు  ప్రతిభా విశేషాలేమిటో తెలియ చేస్తాను.చూస్తూండు స్వామీ.

                              అందుకే  నోరున్నవాడికి ఊరప్పజెప్పమని సామెత వచ్చింది. బట్టుకవి పొగడటం మానేసి తెగడడం మొదలు పెట్టాడంటే  శ్రీమన్నారాయణుడంతటి వాడు కూడా భయపడిపోయే రీతి లో చెలరేగి పోతున్నాడు పురుషోత్తమ కవి.  సాధారణమైన విషయమైనా చెప్పేరీతిని బట్టి పరమ రంకు కథ లాగా దాన్ని చిత్రీకరించడం  వాక్చమత్కారం. అందుకే గయ్యాళి నోటికి దూరం గా ఉండమంటుంటారు జానపదులు.

              ** బలరాముడు రోహిణీ వసుదేవుల కుమారుడు. శ్రీమహావిష్ణువు కృష్ణావతారం ధరించేటప్పుడు ఆదిశేషుడు భూలోకమున అవతరించుటకై దేవకీదేవి సప్తమ గర్భము న పెరుగుచుండెను.  కాని కంసుడు దేవకీ పుత్రులనందఱిని సంహరించదలచి యుండుటచే ఈ పిండమును దీసి రోహిణీ గర్భమునందుంచుమని హరి యోగమాయ  ను ఆజ్ఞాపించెను. యోగమాయ అట్లు చేయుట వలన రోహిణి యందు ఆది శేషుడే బలరాముడు గా జన్మించెను. గదుడ ,సారణుడు ,దుర్మదుడు, విపులుడు అనే వారు ఇతని తమ్ములు.
                                        


                                     పక్షంబు గల దండ్రు పాండుపుత్రులయందు
పాండవుల్‌ పడినట్టి పాటులేమి!
పూర్వజన్మమునందుఁ బూజించె గజ మండ్రు
గజరాజు పొందిన గాసి యేమి!
యల కుచేలునకు బాల్యస్నేహితుఁడ వండ్రు
నెఱిఁ గుచేలుఁడు పడ్డనెవ్వ లేమి!
ప్రహ్లాదుఁ డాజన్మభక్తియుక్తుం డండ్రు
ప్రహ్లాదుఁ డొందిన బాధ లేమి!
యెంతయాలస్యమున వారి నేలినాఁడ
విట్టిదే నీ దయారసం బెంచి చూడ
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
                       హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!                43

                       ఆంధ్రదేవా ! నీవు పాండవ పక్షపాతి వంటారు మరి పాండవులు అన్ని కష్టాలు పడ్డారేమిటి  ప్రభూ ? పూర్వజన్మలో గజరాజు చాల పుణ్యంచేసిందంటారు మరి ఆ గజేంద్రుడు పొందిన కష్టమెలాంటిదో ఎవరికి తెలీదు ?.. కుచేలుడు నీ బాల్యస్నేహితుడని చెప్పుకుంటారే కాని ఆతను పడ్డ బాధలెన్ని ? ప్రహ్లాదుడు ఆజన్మ భక్తి యుక్తుడంటారే ఆ పరమభక్తుడు ఎన్నిబాధలనుభవించాడు. ? నీవు దీనదయాళుడవని ,ఆర్తత్రాణపరాయణుడవని చెప్పుకుంటారు కాని ఎంత ఆలస్యం గా భక్తులను  నీవు కాపాడుతావో, భక్తుల యెడ నీకెంత ప్రేమ ఉందో దీన్ని బట్టి అర్ధమౌతోంది .
                                            

                                          అనఘ మౌ విప్రసత్రాన్న మెంగిలిఁ జేసి
తీవె మున్‌ క్రతుభోక్త నేనే యనుచు
సవతి కొమాళ్ళ సమయించి తందఱిఁ
దరుగని రాక్షసాంతకుఁడ ననుచు
బంధువు లన్యోన్య వైరానుహతులుగా
నడచితి భూభారహారి ననుచు
బలిమి నన్య స్త్రీలఁ బట్టితి వెందఱి
నస్ఖలద్బ్రహ్మచర్యమతి ననుచు
లోకమున నడ్డ మెవ్వరు లేక యునికి
హద్దు లే కిట్లు నడచితి వళుకు మాలి
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
                                 హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!                      44

                  శ్రీకాకుళాంధ్రదేవ!    నేనే క్రతుభోక్త నని పవిత్ర విప్రయజ్ఞ  హవిర్భాగాన్ని ఎంగిలి చేశావు.  రాక్షస సంహారకుడనని పేరుపెట్టుకొని సవతితల్లి యైన దితి సంతానాన్ని నిర్విశేషం గా వధించావు. బంధువులు యుద్ధం లో ఒకరినొకరు చంపుకొని మరణించగా భూభారం తగ్గించానని ప్రకటించుకున్నావు. అస్ఖలిత బ్రహ్మచారినని చెప్పుకుంటూనేబలవంతంగా అనేకమంది పరస్త్రీలను వశపర్చుకున్నావు.    లోకం లో నీ కెవరు ఎదురులేకపోవడం మూలం గా భయం వదిలి  ఈవిధం గా హద్దు పద్దు లేకుండా   ప్రవర్తించావు.       

అది యోగ్యంతరం గాలానబంధంబు
వదలించుకొన నీకు వశము గాదొ!
వేదాంత సకృద చుంబితల మంత్రావర్ణ
నల గుహలుండి రా నలవి గాదొ!
నిమి షార్ధ నిమిషాది నిత్యవేళాచక్ర
గతి నిరోధించి రాఁ గ్రమము గాదొ!
వక్రకంటక పంకవత్క్రూరజనమనః
కాపథంబులను గా ల్మోపరాదొ!
యేమి యాలస్య మిది నీకు నేల సకల
జంతుసంతాన రక్షావిచక్షణునకు
చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ!
                                   హత విమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ!                        45

                        శ్రీకాకుళాంధ్రదేవ!    మేము ఇంతగా ప్రార్ధిస్తున్నా  నీవు రావడం లేదు ? మహర్షులు తమ యోగశక్తి తో నిన్ను తమ మనస్సు లలో బంధించుకున్నారా దానినుండి విడిపించుకోవడం నీకు సాథ్యం కావడం లేదా వేద వేదాంతములలో చెప్పబడినట్లు  రహస్యమంత్రముల  చేత  కప్పివేయబడిన గుహలనుండి వెలుపలికి వచ్చుటకు  నీకు చేతకావడం లేదా ? నిమిషము అర్ధనిమేషము మొదలైన  కాలచక్రము లోని వేళాచక్ర  గతిన నిరోధించి బయటకు వచ్చుటకు  నీకు వీలు కాకున్నదా ?  లేక వంకర తిరిగిన ముళ్ళు, బురద తో నిండిన క్రూరజనుల మనస్సులనెడి మార్గము లో  కాలు పెట్టులకు నీమనస్సంగీకరించుట లేదా.   సర్వప్రాణ సంరక్షకుడవైన నీకు మమ్మల్ని రక్షించడానికి ఇంత ఆలస్యం ఎందుకు ?          

                                                                                               ఆరవ భాగం త్వరలో-----






**********************************************************