Saturday 19 March 2016

గుడిమల్లం - గుడిమెట్ట ఒక పరిశీలన

          
          గుడిమల్లం - గుడిమెట్ట
                                           
                                            ఒక పరిశీలన
                       



               భూ మండలం మీద ఎన్నెన్నో ప్రదేశాల్లో, దేశ విదేశాల్లో  ఎన్నెన్నో  శివలింగాలు వివిధ ఆకృతుల్లో మనకు  దర్శన మిస్తున్నాయి. కాని ఐదారు అడుగుల ఎత్తు ఉండి ఆ శివలింగం మీద మానవాకృతులు  చెక్కబడిన శివలింగాలు  ఎక్కడో  అతి తక్కువగా కన్పిస్తున్నాయి.  వానిలో  నాకు తెలిసినంత వరకు మొదటిది గుడిమల్లం లోని శ్రీ పరశురామేశ్వరలింగం   కాగా గుడిమెట్ట లోని శ్రీ పంచముఖేశ్వర లింగం రెండవది.
                                
           గుడిమల్లం లోని  శ్రీ పరశురామేశ్వరలింగం క్రీ.శ 1,2 శతాబ్దాల నాటిది గా చరిత్ర పరిశోధకులు నిర్ణయించారు కాని  గుడిమెట్ట  శ్రీ పంచముఖేశ్వరుని గురించి ఇంకా పరిశోధించవలసి ఉంది. నాకు చారిత్రక ప్రదేశాలు చూడటమన్నా , చరిత్ర ప్రసిద్దికెక్కిన పుణ్యక్షేత్రాలు దర్శించడమన్నా మక్కువ ఎక్కువ. వాటిని చూసిన తర్వాత వాటి విశేషాలను బ్లాగు లో కి వ్రాయడం 2012 నుండి అలవాటు చేసుకున్నాను. గుడిమల్లం గుడిమెట్ట ఈ రెండు ప్రదేశాల మీద వేర్వేరు గా రెండు వ్యాసాలు 2012,13 ల్లోనే  వ్రాయడం జరిగింది.   divyakshetralu.blogspot.com లో ఆసక్తి గల పాఠకులు ఆ వ్యాసాలను చూడవచ్చు.
                             

            కాని ఇప్పడు మళ్లీ ఈ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే- కృష్ణాజిల్లా నందిగామ కు 14 కి.మీ దూరం కృష్ణా నది ఒడ్డున  గుడిమెట్ట అనే ఒక చిన్నఊరు ఉంది. ఆ ఊరు కు ఒక కిలోమీటరు దూరం లో మసీదు దిబ్బ అని పిలువబడే ప్రదేశం లో కొన్ని శిథిలాలు , దాని పరిసరాల్లో కొన్ని పాడుపడిన ఆలయాలు ఉన్నాయని  కాలేజీ లోని నా విద్యార్థులు చెపుతుంటే చూద్దామని ఒక పర్యాయం అక్కడకు వెళ్లడం జరిగింది.   నేను చూసిన శిథిలాల్లో హంపీ తర్వాత అంతగా బాథ పడిన ప్రదేశం ఇదే నేమో  ననిపించిది. అసలు ఆ రాజ్యం ఎవరిది.? ఆ శిథిలాలు ఏంచెబుతాయి? అనే ఉత్సుకత నాలో కలిగింది. ఆ ఆవేశం లో కాండ్రపాడు పంచముఖేశ్వరుని  గూర్చిఒక వ్యాసం వ్రాసి ఆనాడు  సాహితీ పత్రిక గా బాగా  ప్రసిద్థి కెక్కిన భారతి సాహిత్య పత్రిక కు పంపించడం, అది మార్చి  1988 భారతి మాసపత్రిక లో ప్రచురించబడటం జరిగిపోయింది. ఆ ఉత్సాహం తో గుడిమెట్ట శిథిలాల్లో తెలుగు సంస్కృతి (Telugu culture in Gudimetta ruins) ” అనే  పేరు తో  ఒక Minor Research Project  ను ప్రారంభించి, U.G.C. ఆర్థిక సహాయం తో దాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇది ఆనాటి మాట .
                    
                  

                  

                               ప్రస్తుతం నిర్మాణం లో ఉన్న ఆంధ్రరాష్ట్ర రాజధాని అమరావతి కి చేరువలో  కృష్ణానది కి ఈవల వైపు ఈ గుడిమెట్ట ఉండటం వల్ల ఈ  విశేషాలన్నీ మళ్లీ  ఇప్పడు వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది నా  ఈ పరిశోథనా గ్రంథాన్ని వందల కొద్ది ఫోటోస్టాట్ కాపీలు తీసుకొని  పంచుకుంటుంటే, మరి కొద్దిమంది మాటి మాటికి  రావడం ఒకటి రెండు కాపీల కోసం ఆ బైండు ని ఫోటోస్టాట్ కోసం వెనక్కి మడిచి విరగ్గొట్టడం  జరిగిపోతోంది. చివరికి ఆ పుస్తకం మూలమే లేకుండా పోతుందేమో ననే భయం పట్టుకొని , దాని లోని వ్యాసాలను ఈ బ్లాగు  లో భద్రపరచాలని ఈ ప్రయత్నం ప్రారంభించాను.
                   
                ఈ పుస్తకాన్ని అచ్చొత్తించవచ్చు కదా! అని కొంతమంది అడుగుతున్నారు. కాని రామాయణం లఘుకావ్యాల మీద  పరిశోథన చేసి , డాక్టరేట్ పొందిన నా పరిశోథనా  గ్రంథమే ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి 1996 లో ప్రింటు చేస్తే అమ్ముకున్నవి , అంట కట్టినవి పోగా ఇంకా సగం కాపీలు ఇంట్లో బీరువాల్లో నల్లబడిపోతున్నాయి. ఈ రోజుల్లో పుస్తకాలు కొని చదివే వాళ్లు తక్కువ. ఏ ఆథ్యాత్మిక ఉపన్యాసానికో వెళ్లినప్పుడు అక్కడున్న పెద్దలు అనుకున్నవాళ్లకి  నా రామాయణ పుస్తకాన్ని బహుమతి గా ఇస్తే , కార్యక్రమం అయిపోయిన తర్వాత చివర్లో ఆ  కార్యక్రమ కార్యకర్త ఎవరో ఒకరు వచ్చి మీ పుస్తకాన్ని అక్కడ మర్చిపోయారండీ అని నేను ఆ పెద్దమనిషి అనుకున్నాయనకు నేనిచ్చిన పుస్తకాన్ని తిరిగి నాకిచ్చిన ఘటనలు కూడ కొన్ని ఉన్నాయి. అందుకని పుస్తకాన్ని ముద్రించి ఇబ్బంది పడటం నా కిష్టం లేదు.
                               
                    ఇక ప్రస్తుతం లోకి వద్దాం.
    
                     









 శ్రీ పరశురామేశ్వరుడు

                                                                                                                    శ్రీ పంచముఖేశ్వరుడు
                            

                           గుడిమల్లం- గుడిమెట్ట  ఈ రెండింటిని ఏకకాలం లో పరిశీలిస్తే ---
           
               పల్లంలో  అనగా ముఖమండపానికి ,అంత్రాలయానికంటే గర్భాలయం అంటే శివలింగం ఉన్న ప్రదేశం ఐదడుగుల లోతుగా పల్లం లో ఉన్న గుడి  గుడిమల్లం కాగా , మెట్టమీద అంటే చిన్నకొండ మీద ఉన్న గుడి గుడిమెట్ట. దీన్నే ఇప్పుడు మసీదు దిబ్బ అని పిలుస్తున్నారు.

   గుడిమెట్ట  లో నున్న పంచముఖేశ్వరుడే ముష్కరుల దండయాత్రలు, విధ్వంసాలకు గురై, స్థాన భ్రష్టం చెంది    కాండ్రపాడు పాటిమట్టి దిబ్బలలో   వెలుగు చూసి ఉండవచ్చు.

 ఈ రెండింటికి  ఉన్న  కొన్ని పోలికలు

 గుడిమల్లం శివలింగం క్రీ.శ. 1,2 శతాబ్దాల నాటిది.

గుడిమెట్టరాజ్యం 10 వ శతాబ్దం నాటిది. మరి శివలింగం ఎప్పటిదో ఎటువంటి సాక్ష్యాలు లేవు.

రెండు లింగాల మీద మానవాకృతులు చెక్కబడ్డాయి.

 రెండు శివలింగాలకు పానమట్టాలు లేవు.

గుడిమల్లం గుడి  మొత్తం తవ్వకాల్లో బయటపడింది.

 గుడిమెట్ట శివలింగం పాటిమన్నుదిబ్బ ల్లో వెలుగు చూసింది.

గుడిమల్లం శివలింగం మీద ముందు వైపు  మానవరూపం  చెక్కబడి ఉంది.

గుడిమెట్ట శివలింగం మీద  ఐదు వైపు లా ఐదు మానవ ముఖాలు, ముందు వైపు ప్రత్యేకంగా మానవముఖానికి క్రిందు గా  కత్తి మొన వంటి ఒక గుర్తు చెక్క బడ్డాయి.
   
             గుడిమల్లం  --:         చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తి మండలం లోని గుడిమల్లం  గ్రామ మందలి  శ్రీ పరశురామేశ్వరాలయం లోని శివలింగం  ఇప్పటివరకు లభించిన శివలింగాల్లో అతి ప్రాచీనమైంది గా భారతీయపురాతత్త్వ శాఖ నిర్ణయించింది.
                  పరశు రామేశ్వరుడుగా పిలువ బడుతున్న ఈ శివలింగానికి అనేక ప్రత్యేకత లున్నాయి.ఈ శివలింగం  1, 2 శతాబ్దాల నాటిది గా చరిత్రకారులు నిర్ధారించారు.
                         శివునకు పానమట్టం తొలినాళ్ల లో ఉండేది కాదని, స్త్రీ పురుష అవయవాలను వేరు వేరు గా పూజించడం గుప్తుల ముందు యుగం లో ఉండేదని, రిలిజియన్  ఆర్ట్ అండ్ ఆర్కియాలజీ అనే  పుస్తకం లో ఆర్.కే. బెనర్జీ వ్రాశారు.

                    
                                                   
                    
                                                                  శ్రీ పరశురామేశ్వరుడు



                         ఎన్నో శాసనాలు ఈ గుడి గోడల మీద ,ఆలయప్రాంగణం లోను మనకు కన్పిస్తాయి. కాని దీన్ని నిర్మించిందెవరో ఒక్క శాసనం లోను ప్రస్తావించబడలేదు. కాని స్వామి వారికి నిత్య ధూప దీప నైవేద్యాల కోసం  ధనాన్ని,  భూములను, అఖండ దీపారాధనకు ఆవులను కొల్లలుగా దానం చేసినట్లు శాసనాద్యాధారాలు లభిస్తున్నాయి.
            
           


                         భా.పు. శాఖ . క్రీ,శ. 1973 లో జరిగిన త్రవ్వకాలలో  ఈ ఆలయాన్ని జాతీయసంపద గా గుర్తించింది. ఈ ఆలయనిర్మాణానికి వాడిన రాతి ఇటుకలు   42+21+6  సెంటీమీటర్ల సైజులో  ఉండటం వలన దీన్ని ఆంధ్ర శాతవాహనుల కాలం లోని   అనగా 1,2 శతాబ్దాల నాటి నిర్మాణం గా గుర్తించడం జరిగింది.

  
  శాసన ఆధారాలు.:-----      దేవాలయ గోడలమీద పల్లవ ,గంగపల్లవ. బాణ ,చోళ రాజుల శాసనాలు కన్పిస్తున్నాయి. ఇవి ఎక్కువగా తమిళ భాషలో ఉన్నట్లు శాసన పరిశోధకులు గుర్తించారు. అందరూ స్వామికి విశేష దానాలు  సమర్పించిన వాళ్లే. వానిలో  అర్వాచీనమైనది క్రీ.శ 802 లో  పల్లవరాజు నందివర్మ వ్రాయించిన శాసనం .కాని ఇన్ని శాసనాల్లో వేటి లోను గుడిమల్లం పేరు ప్రస్తావించబడలేదు. ఈ గ్రామం పేరు ను విప్రపిట( బ్రాహ్మణ అగ్రహారం) అని మాత్రమే  శాసనాల్లో పేర్కొనడం జరిగింది.
  
  
               


                    లింగ దర్శనం.:-----        ముఖమండప,అంత్రాలయాల కంటే గర్భగుడి ఐదడుగులు లోతు గా ఉంటుంది.  ఈ గర్భగుడి లో పరశురామేశ్వర   లింగము  ముదురు ఎరుపు, నలుపు రంగు కలసిన కాఫీరంగు లో ప్రకాశించే దృఢమైన రాతిపై చెక్కబడి ఉంటుంది. ఈ లింగము ఎత్తు ఐదడుగులు,అడుగు మందము కలిగి ఉంది. లింగము ముందు భాగము లో శివుడు స్ధానక ఆకృతి లో, అపస్మార పురుషుని భుజాలపై ఎక్కి నిలబడి ఉన్నాడు. ఈ శివుని  కుడిచేతి లో  వెనక కాళ్లు పట్టుకోవడం వలన తలక్రిందు గా వ్రేలాడు తున్న గొఱ్ఱె ,ఎడమ చేతిలో పానపాత్ర,   ఉంది. ఎడమభుజానికి పరశుగొడ్డలి వ్రేలాడుతోంది. చెవులకు  ఏడు అంచెలు గలిగిన రింగు లు వ్రేలాడుతున్నాయి. జడలు ముడివేసి  తలచుట్టు చక్రాకారంగా ముడివేయబడి ఉన్నాయి. మెడలో కంఠహారం ప్రకాశిస్తోంది.మోకాళ్ల పైకి  ధోవతీ ని  గోచీ పెట్టి  బిగించి ,  నడుము చుట్టు వస్త్రమేఖల ను  కట్టి అంచులను  వదిలి పెట్టాడు. వస్త్రాన్ని ధరించినా శరీరం లోని లోపలి భాగాలు స్పష్టంగా కన్పిస్తూనే ఉన్నాయి. ఈ రూపాన్ని సమష్టి గా చూస్తుంటే శివుని వలే కాకుండా  ఒక మహావీరుడైన వేటగాని వలె కన్పిస్తున్నాడు.  ఇతనికి యజ్ఞోపవీతం లేకపోవడం గమనించవలసిన ప్రత్యేకత.   ఈ శివలింగానికి పానమట్టం లేదు.

                       ఉజ్జయిని లో 3వ శతాబ్దం లో లభించిన కొన్ని రాగి నాణేలపై ఈ లింగాన్ని పోలిన చిత్రం ఉన్నట్లు చరిత్ర చెపుతోంది. మధుర మ్యూజియం లో     1 వ శతాబ్దానికి చెందిన ఒక శిల్పం గుడిమల్లం  శిల్పాన్ని పోలి వుంది. చంద్రగిరి రాజమహల్ లోని మ్యూజియం లో ఈ లింగానికి ప్రతి కృతిని మనం చూడవచ్చు.
                         

                                

                             ఈ ఆలయశిల్ప నిర్మాణం బౌద్ధ, జైన శిల్పకళకు దగ్గరగా ఉంటుంది.      ఈ త్రవ్వకాలను పర్యవేక్షించిన భారతీయ పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్  డా.ఐ. కె శర్మ గారు ఈ విగ్రహము అగ్నిరుద్ర శివుడని, పరశురాముడు కాదని , స్వామి కళ్లు ఆయన నుదుటి పైకి కేంద్రీకరించబడి ఉండటం వలన  ఈయనను విరూపాక్షు డని కాని, యోగ దక్షిణామూర్తి యని గాని చెప్పవచ్చని అభిప్రాయ పడ్డారు.  
              గుడిమెట్ట --:    అనంత రూపుడైన ఆ పరమేశ్వరుడు ఎక్కడ, ఎవరికి  ఏ రూపం లో దర్శనమిస్తాడో తెలిసిన వాడు  ఎవడు లేడు. ఆదిమధ్యాంతరహితుడైన ఆ  పరబ్రహ్మ తత్త్వాన్ని తెలుసు కోవడానికే  యోగులు, మునులు,ఋషులు  సాధకులు గా మారుతున్నారు. యుగ యుగాలుగా   ఆ పరమాత్మను దర్శించి ముక్త సంగులౌతున్నారు. అటువంటి రూపాల్లో ఒకటి ఈ పంచముఖేశ్వర శివలింగం.  
                   

                       


                                    శ్రీ  పంచముఖేశ్వరుడు

                      కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం కాండ్రపాడు గ్రామం  చాగి పోతరాజు  పాలన  వలన చారిత్రక ప్రాధాన్యం   సంతరించుకొనిన గుడిమెట్ల కు మూడు  కిలోమీటర్ల దూరం లో ఉంది. ఈ  గ్రామం లో  ఒక అపురూప శివలింగం ( ? ) లభించింది. నాలుగున్నర అడుగుల ఎత్తు,మూడున్నర అడుగుల చుట్టుకొలత కలిగిన నల్లని లింగానికి  అగ్ర భాగాన చుట్టు అయిదు ముఖాలు  కన్పిస్తున్నాయి. కొంతభాగం పానమట్టం లోకి దించారు లేకపోతే ఐదడుగుల పైనే ఎత్తు ఉంటుంది .సుమారు ఎనభై  సంవత్సరాలకు పూర్వం ఊళ్లో  పాటిమన్ను తవ్వుతుంటే  ఈ పంచముఖ  శివలింగం       1937 ఈశ్వర నామ సంవత్సరం చైత్రశుద్ధ పంచమి రోహిణనక్షత్రం గురువారం ఉదయం 10 గం.లకుఈ శివలింగం బయటపడిందని ఇక్కడి  వృద్ధులు చెపుతున్నారు.


          
                లింగంమీదనున్న ముఖాల్లో ఒకటి


                 

                                       వెనుకవైపు ఉన్నముఖం
      దొరికినప్పుడు  ప్రధాన లింగానికి పానమట్టం లేకపోవడం తో గ్రామస్తులు స్ధానికంగా దొరికే రాయినే పానమట్టం గా చెక్కించి,  దానిలో లింగాన్ని దిగేసి, దాని చుట్టు  నాలుగు లింగాలను ప్రతిష్టించి  పూజాపునస్కారాలు నిర్వహించారు కొంతకాలం. ఇది 1990 దశకం లో విషయం.
                   
                        చారిత్రక నేపథ్యం :-----    ఈ లింగాన్ని చూడగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది జైనశిల్పం.లింగానికి పురోభాగం లో మనకు ఒక విచిత్ర చిత్రాకృతి   కన్పిస్తోంది. పాడు అనే పేరు జైన గ్రామాలకు చివర ఉంటుందని పరి శోధకుల మాట.  ఈ నందిగామ ప్రాంతం జైన తీర్ధంకరుల ఆవాసంగా  వెలిగిందనడానికి ఎన్నో సాక్ష్యాధారాలున్నాయి.  నందిగామ ప్రక్కగా ప్రవహించే   మునులఏరు >  మునేరు గా  మారిందట. మునులపాడు > ముండ్లపాడు  అయ్యింది.   ఈ గ్రామం పెనుగంచి ప్రోలు ప్రక్కనే ఉంది. కాండ్రపాడు వంటివే లింగాలపాడు, తక్కెళ్ళపాడు,   బొబ్బిళ్ళపాడు, చింతలపాడు, చందర్లపాడు, బోడపాడు, అనిగండ్లపాడు  ఇవన్నీ నందిగామ పరిసర గ్రామాలు.  ఇవన్నీ జైన ప్రభావిత గ్రామాలే . ఈ దగ్గర్లో   ఏటూరు గ్రామం  లో లభించిన  వర్ధమాన మహావీరుని విగ్రహం కూడ ప్రాంతం పై  జైన మత ప్రభావానికి  ప్రబల సాక్ష్యంగా నిలుస్తోంది.
                                       


                            లింగంమీద ఉన్న ఆకృతులలో మరొకటి
                     
                 ఈ శివలింగానికి ఐదు వైపులా ఉన్న ఐదు  ముఖాలు దేనికైనా ప్రతీకలా అనేది ప్రశ్న.? చక్రవర్తులు తమ సామంతుల బొమ్మలను కాలికున్న కున్న కడియం పై బొమ్మ వేయించుకున్నట్లు,  ఈ శివలింగంమీద ఉన్న  బొమ్మలు ఆ విధంగా  ఎవరైనా తీర్ధంకరుల బొమ్మలేమో  ననే  మార్గం లో  కూడ పరిశోథించాల్సిఉంది.  ఇటువంటి సంప్రదాయం ఎక్కడైనా ఉందా.? ఆ ఐదు ముఖాలు ఒకే రకంగా  కన్పిస్తున్నాయి.
                    
                          


                         


                      లింగం ముందు వైపు, కన్పిస్తున్న కత్తి మొనవంటి గుర్తు

              


                                                  లింగం మీదనున్న ముఖాల్లో ఒకటి

   ఇంతకు పూర్వం ఈ ప్రదేశాలను గురించి వేరువేరు గా వ్యాసాలు వ్రాసినా , ఇప్పుడు జిజ్ఞాసువులైన పాఠకుల కోసం, వారి నుంచి ఏమైనా కొత్త సమాచారం అందుతుందేమో ననే ఆశతో మరో రూపం లో ఈ వ్యాసాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇటువంటి శివలింగాలు ఎక్కడైనా ఉంటే  ఆ వివరాలను పాఠకులతో పంచుకుంటారని ఆశిస్తున్నాను.




************       కాలోహ్యయం నిరవథీ విపులాచ పృథ్వీ  **************