Saturday 29 December 2012

శ్రీ రామ కావ్యామృతం ---3


                        శ్రీ రామ  కావ్యామృతం ---3
                  
                శ్రీ రామ నామాలు శతకోటి అన్నట్లు – శ్రీ రామ నామ ధ్యానం తో జీవితాన్ని పండించుకొని, కావ్యనిర్మాణం చేసిన భక్త కవులు ఎందరో. అటువంటి వారిలో  శ్రీమాన్ గుదిమెళ్ల రామానుజాచార్య ఒకరు. వీరు రామాయణ ఇతివృత్తమే ప్రధానంగా  ఎన్నో లఘు కావ్యాలు వ్రాశారు.ఆ కావ్యాల లో కొన్ని  ఆణిముత్యాల లాంటి పద్యాలు   రామ కావ్యాభిమానుల కోసం.

                   
                            సీతారాములను గురించి చెప్పేటప్పుడు, వ్రాసేటప్పుడు, సీతారాములు, జానకీ రాములు అనే పిలుస్తారు గానీ,రామ సీతలు, రామ జానకిలు అని ఎందుకు పిలవరు అని ప్రశ్నవేసి,    శబరి కావ్యం లో—ఈ విషయాన్ని ఎలా చమత్కరించారో ఈ భక్త కవి చూడండి.
                    
                        సీత, తనంత తా నెడమ చే నవలీలగ నెత్తు కార్ముకం
                       బాతరి నీవు లేచి కుడి హస్తము తో నది యెత్త గల్గి తీ
                       చేతుల జంటలో నెడమ చేతితో నెత్తుట గొప్పగాన,వి
                      ఖ్యాతిని గూర్చినారు జనకాత్మజకే ఋషులెల్ల రాఘవా.
             
               సీతాదేవి ఎడమ చేతితో తీసి ప్రక్కన పెట్టిన  శివధనస్సును, రామచంద్రుడు  నిండు సభ లో  కుడి చేతి  తో ఎత్తడం చూసి,   కుడి చేతి తో కంటే ఎడమ చేతితో ఎత్తడం  గొప్ప కాబట్టి  ఋషులందరు సీత పేరును ముందు చేర్చి ఆమె కే గౌరవాన్ని చేకూర్చారంటుంది  వీరి కావ్యం లో శబరి పాత్ర  రామచంద్రునితో.  అల్పాక్షరం పూర్వం అన్న  వ్యాకరణ  సూత్రాన్ని కాసేపు మర్చిపోతే, ఈ భావన అతిరమ్యంగా  సీతాధిక్యాన్ని సమర్ధిస్తుంది.
                  
        మరొకటి...... వీరి ఊర్మిళ కావ్యం నుండి   ----
              

                రాముని ఆజ్ఞానుసారం తనవారి  అనుమతి తీసుకోవడానికి, లక్ష్మణుడు అంతపురానికి వస్తాడు. దాసి  వెళ్లి ఆ వార్తను ఊర్మిళ కు చెప్పింది.
                      
                      పచ్చని మేని తో, నుబికి వచ్చెడి ప్రాయపు బాలపొంగు తో,
                       విచ్చిన తమ్మిపూల వలె వేడుక గొల్పెడు కన్నుదోయి తో
                
                   చక్కని ముక్కు , శ్రీ లొలుకు సన్నని మేను,గులాబి శోభలన్
                 బుక్కిలిపట్టు చెక్కిలియు, పుష్పశరండుల జైత్ర యాత్ర కై
                  యెక్కు రథమ్మువోలె గడు నింపుగ నున్న  నితంబము,
                
                  పచ్చని శరీరము, పాలపొంగు లాంటి ప్రాయము,విచ్చిన తమ్మిపూల వంటి కన్నుదోయి, చక్కని ముక్కు, శ్రీ లొలుకు సన్నని శరీరము, గులాబీల కాంతిని పుక్కిలి పట్టినట్లున్న చెక్కిళ్ళు, మన్మథుడు జైత్రయాత్ర కు బయలుదేరు రధము వంటి నితంబము,   ---------      ఇది  ఊర్మిళాదేవి మనోజ్ఞమైన వర్ణన లో ఒక భాగం మాత్రమే.
                         భర్త వచ్చిన విషయం దాసి చెప్ప గా, మేడ దిగి వస్తున్న ఊర్మిళా దేవిని కవి వర్ణించిన తీరు చూడండి.   ........
                 
                   గబ గబ మేడ మెట్లు దిగి కాంచి నితంబము నుండి వ్రేలగా
                    గుబ గుబ పొంగ దియ్యనగు కొన్ని తలంపులు, రాజహంసకున్
                    సొబగులు  నేర్పునట్టి గతి శోభలతో నెదురేగుదెంచె, లో
                    నుబికిన ప్రేమవాహిని మహోర్ముల నూర్మిళ నూపు చుండగన్ .
           
       
                 "మైథిలి అనే కావ్యం లో   బ్రహ్మర్షి విశ్వామిత్రుడు రాజర్షియైన జనకుని తో ప్రస్తావనా వశం గా రాముని గూర్చి చెపుతూ  ........
        
         “ ఆగమమన్న మాకు నిజమైనది రాముని యాగమమ్మె, మా
           యోగమటన్న వీడుదరి నుండుటె యోగము, దర్శనమ్మనన్
          బాగుగ వాడు మేమిటుల పార్ధివ చూచుటె  దర్శనమ్ము, మా
          కాగమయోగదర్శనము లన్నియు రాముడె చాలు – ధన్యుడన్.
  
 అంటాడు.
             
                     ఈ మాటలు విశ్వామిత్రుని లో పరకాయప్రవేశం చేసిన  భక్తకవి గుదిమెళ్ల వేనేమో అనిపిస్తుంది. ఆగమ ,యోగ, దర్శనాలన్నీ రామునిలోనే  దర్శించిన భాగ్యశాలి గుదిమెళ్ల. అహంవేద్మి మహాత్మానాం రామం సత్య పరాక్రమం అన్న  విశ్వా మిత్రుని తో కవి ఈ పల్కులు పల్కించడం ఎంతో సహజసుందరంగా ఉంది.

శ్రీ సీతారామ కళ్యాణాన్ని  కవి  వర్ణించిన  తీరు  మిక్కిలి  రమణీయం. 
           
                    పువ్వులు రాల—దుందుభులు మ్రోయ, నభస్ధలి నోరచూపులన్
                       రువ్వుచు నుండ,-గన్యలు పురోహితుడా శిషమీయ,గడ్డమున్
                        దువ్వగ మౌని-దశరధుండెన లేని ముదంబు నొంద, లే
                       నవ్వుల మోము తోడ రఘునాథుడు పెండిలి యాడె మైథిలిన్ 

చంపకోత్పలాలతో గుణాభరణాంచిత కావ్యకన్యకను రఘురామునికి సమర్పించిన ధన్యాత్ములు శ్రీ రామానుజాచార్యుల వారు.





**********************************************************