Wednesday 5 August 2015

శతకసౌరభాలు – 6 తమ్మర గోపన్న – శ్రీ జానకీ శతకము -4

                                            
          శతకసౌరభాలు  6                    
                              


             తమ్మర గోపన్న శ్రీ జానకీ శతకము  -4







అండయు దండలేక యడియాస యనందగు శత్రుకోటి నా
ర్తుండగుచుండ మీరు కృపతోడుత లెండికఁ జండకాండ కో
దండములన్ధరించి సరదామెయిఁ బ్రోవగ రండటంచు మా
ర్తాండకులప్రకాండునకు దండిగం జెప్పగదమ్మ జానకీ !.
                
   అమ్మా! సీతమ్మ తల్లీ! ఎటువంటి అండదండలు లేకుండా అరిషడ్వర్గాలనే శత్రువర్గం తో పీడించబడుతూ దుఖి:స్తున్న వీడిని దయతో ఆదుకోవడానికి మీరు చండకాండకోదండాల్ని ధరించి బయలుదేరండి. రండి వెళదామని సూర్యవంశ కులప్రకాండుడైన  శ్రీ రామచంద్రునకు నీవు గట్టిగా  నా గురించి చెప్పు   తల్లీ !

                                 ఏ సమయంబు నందయిన నెచ్చటనైనను నెవ్వడైన నా
దోసములన్ క్షమింపుమనఁ దోడనె రాముడు బ్రోచునన్న వి
శ్వాసము సుస్థిరత్వమగు భంగి నొకించుక యేని మంగళా
శాసనముం బొనర్ప రఘు సత్తము తో ననుమమ్మ జానకీ !
                 అమ్మా సీతమ్మతల్లీ! ఏ వేళలో నైనా ,ఏ ప్రదేశం లో నైనా, ఎక్కడైనా , ఎవ్వడైనా సరే   ఓ రామచంద్రా ! నా తప్పులను కాచి నన్ను ఆదుకోవయ్యా. అని వేడుకోగానే చివాలున వచ్చి కాపాడే కరుణామృతహృదయుడు మా రఘురాముడు అనే విశ్వాసం సుస్థిరం గా ఉండే విధం గా  శతకోటి మంగళాశాసనాలు అర్పించి రామచంద్రునితో  నన్ను గూర్చి చెప్పు తల్లీ!
                     
                                           దారలు నాత్మజుల్ సుతలు తమ్ములుఁ దండ్రియు మిత్రబాంధవుల్
 కూరిమిఁ జూపుటల్ ఫలము గోరియె కాని యకారణ ప్రియో
 దారత కాదు కా దఖిలదాతవు దండ్రి వహేతు మత్కృపా
వారిథి నాత్మబంధుఁ  డవపాకృత శత్రుడవీ  వొకండవే !
                     శ్రీ రామచంద్రా!   `భార్య, కొడుకులు,కూతుళ్ళు, సోదరులు , తండ్రి , మిత్రబాంధవులు, మనపై ప్రేమానురాగాలను  ప్రదర్శించడం  మన నుంచి ప్రతిఫలాన్ని ఆశించే కాని   అకారణ ప్రేమతో కాదు. కాని  అఖిలదాతవు  తండ్రివి .  అహేతుక కరుణా సముద్రుడవు. ఆత్మబంధుడవు. అపాకృత శతృడవు నీవు ఒక్కడివే కదా స్వామీ!
            ఇక్కడ తల్లిని గూర్చిన ప్రస్తావన చేయలేదు కవి. తల్లి ప్రేమ నిర్హేతుకమని , నిస్వార్ధమైనది,ప్రతిఫలాపేక్ష రహితమైనదని  చెప్పదలిచాడు గోపన్న. అందుకే తరువాత పద్యం లో తల్లివి గాన నీవు అంటూ ప్రారంభించాడు.

                                            తల్లివి గాన నీవు రఘుధాత్రిపు తో గడు నచ్చజెప్పి నా
తల్లడపాటు మాన్పుటకుఁ దప్పక దీక్ష వహింపుమమ్మ !న
న్నెలపు డేలుమమ్మ! హృదయేశ్వరుఁ గూడి మదీయ మానసో
త్ఫుల్ల సరోజమున్ వదలి పోక వసింప గదమ్మ జానకీ !
                      అమ్మా ! నీవు తల్లివి కాబట్టి రఘునాధుని తో నెమ్మదిగా నచ్చ చెప్పి నాలోని వేదనను ,  ఆందోళనను ( రామచంద్రుడు తనను కరుణిస్తాడో లేదో అనేది ఆందోళన) పోగొట్టడానికి నీవు పూనుకోవాలి తల్లీ ! కారణం నీవు తల్లివి కాబట్టి. తల్లి బిడ్డకోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది కాబట్టి నీవు నన్ను కాపాడటానికి  తప్పక దీక్ష వహించాలి. ఎల్లప్పుడు నీవే నన్నుకాపాడుతూ ఉండాలి. నీ నాథుడైన శ్రీరాముని తో  కలిసి నా హృదయ కమలమునందు ఎల్లప్పుడు స్ధిరంగా నివసించు తల్లీ !.
          ఈ మహానుభావుడు జీవించి ఉన్నకాలం లో ఒకసారి వీరిని కలిసి నప్పుడు పక్షవాతం వచ్చి కుడి చేయి కొద్దిగా చచ్చుపడిందని, దీని వలన సీతమ్మతల్లి కి కుంకుమపూజ సరిగా చేయలేక పోతున్నానని కన్నీరు పెట్టుకుంటూ చెప్పారు .  నాకు కూడ ఆ విషయం ఆనాడు బాధ కలిగించింది. కాని కొంతకాలం తర్వాత ఏదో ఉత్సవాల సందర్భం లో ఈ మహనీయుణ్ణి మళ్ళీ వేదాద్రి  శ్రీనృసింహుని సన్నిథి లో కలవడం జరిగింది. ఆయన నన్నుచూస్తూనే ఆత్మీయం గా పల్కరించి, తన కుడిచెయ్యి బాగానే పనిచేస్తోందని . ఒక శుక్రవారం  తమ్మర ఆలయం లో అమ్మ సీతమ్మ కు కుంకుమ పూజ చేస్తుంటే   అకస్మాత్తు గా కుడిచెయ్యి దానంతటి కదే చక్కగా పనిచెయ్యడం మొదలు పెట్టిందని ఆయన ఆనందంతో చెపుతుంటే ఆశ్చర్య పోవడం నా వంతు అయ్యింది. మూకంకరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం అన్నారు ఆది శంకరులు. దైవం తలుచుకుంటే కానిదేముంటుంది?
మనం ఏమనుకున్నా సీతమ్మ తల్లి మీద ఆయనకున్న అపారమైన విశ్వాసం అది.
                                     
                                విఖనసు సూత్రమందుఁ బ్రభవించిన యట్టి నృసింహసూరికిన్
సఖియగు నర్సమాంబికకు జన్మము నొందిన గోపదాసు నా
ర్తఖలుని బ్రోచు భార మిక దప్పదు మీకని నొక్కి చెప్పు మ
య్యఖిల నియంతయౌ  రఘుకులాగ్రణి తో దయయుంచి జానకీ !
                          అమ్మా!జానకీ దేవి!   వైఖానసాన్వయం లో  , నర్సాంబా నృసింహసూరి దంపతులకు పుట్టిన  గోపదాసు అనే  ఈ పాపాత్ముని బ్రోచే భారం  మీదేనని, అఖిల లోక నియంతయైన శ్రీరామచంద్రుని తోటి  ఇది  మీకు తప్పదని నొక్కి చెప్పు తల్లీ!.

మంగళమబ్జనేత్ర ! శుభమంగళ మంబుదగాత్ర! ప్రోల్ల స
న్మంగళ మార్యమిత్ర ! తవ మంగళమస్త !ని సన్నుతించు దీ
నుం గృప నేలుడం చెటులనో విభుతో నని, నన్ను క్షేమదృ
ష్టిం గనుమమ్మ యమ్మ నతజీవన దాత్రివి గమ్మ జానకీ !  (110)
                  
                         అమ్మా!  వేడిన వారిని కాపాడే చల్లని తల్లీ సీతమ్మా! వికసించిన తామరపూల వంటి నేత్రములు కలవాడా! మంగళకరమైన నీలమేఘశ్యాముడా! నీకు శుభమగుగాక! అని ప్రార్థించే ఈ దీనుని దయతో కాపాడమని , ఏదోవిధం గా  ప్రభువైన రామచంద్రుని తో చెప్పి , నన్ను నీ చల్లని చూపులతో రక్షించవమ్మా తల్లీ జానకీ దేవీ ! మీకు శుభమగుగాక! 

నేనొకరుండగాను దయనీయుడ నాదుకుటుంబమంతయున్
నా నిఖిలాత్మబంధువులు నాప్రియమిత్రులు నాసుహృత్తుల
న్యూనరఘూత్తమోత్తమ కృపోచితులై సుఖియింప భద్రసం
ధాన మొనర్చి బ్రోవు మిక తల్లికృపా2మృతవల్లి జానకీ !

                ఈ పద్యం ఈ శతకం లో చివరిది. శతకమంతా తనను కాపాడమనీ ,రక్షించమనీ , ఏలుకోమని పరిపరి విధాల ప్రార్థించిన కవి ఈ పద్యం లో   తన కుటుంబాన్ని , సమస్తమైన ఆత్మ బంధువులను , ప్రియ మిత్రులను , స్నేహితులను  అపారమైన శ్రీరామచంద్రుని దివ్యానుగ్రహానికి పాత్రులయ్యేటట్లు   స్వామి తో చెప్పి రక్షించవలసిందని దయామృతవల్లి యైన సీతమ్మతల్లిని వేడుకుంటున్నాడు కవి.
          
               తనతో పాటు తన వారినందరిని బ్రోచే భారం సీతమ్మ తల్లి పై వేశాడు కవి . అంటే తనకు లభించే ఫలితం తనవారికి కూడ కలగాలనే  తాపత్రయం, తనను ఎలాగూ అమ్మలగన్న సీతమ్మతల్లి కాపాడుతుంది కాబట్టి తనతో వారిని కూడ తరింప చేయాలని కవి తపన.  మహాత్మానాం వసుధైక కుటుంబకమ్ అని కదా ఆర్యోక్తి.
             
                             ఆది శంకరుల కనకధారాస్తవమ్ లోని ఒక శ్లోకం ఈ సమయం లో గుర్తుకొస్తోంది.
                                    
                                     కమలాసన పాణినా లలాటే
                                     లిఖితా మక్షరపంక్తి మస్య జన్తో:
                                     పరిమార్జయ మాతరంఘ్రిణా తే
                                      ధనికద్వార నివాస దు:ఖ దోగ్ధ్రీమ్ !!
       అమ్మా ! కలుముల జవరాలా  !  ఆ బ్రహ్మదేవుని చేత ఈ జీవుల నుదుటమీద   ధనవంతుల వాకిట్లో దు:ఖ భాగులై  జీవించండని వ్రాసిన అక్షర సమూహాలను నీ కాలి తో తుడిచివేయవలసింది (ఊడ్చివేయవలసింది)  తల్లీ !
                   ఈ భూమి పై డబ్బున్న వాడి పంచన బ్రతికే బ్రతుకు ఎవ్వరికీ ఉండగూడదనే ఉదార భావన మహర్షులది. అందుకే వారు జగద్గురువులు. జగదేకపూజ్యులు లోకారాధ్యులు, ప్రాతస్మరణీయులు అయ్యారు.
                          తన వారందరు తను చెసే  రామనామధ్యాన, స్మరణ, రచనా వ్యవసాయానికి సహకరించక పోతే తాను ఈ  రామ ధ్యాన, రామ కావ్య రచనా ప్రక్రియలను కొనసాగించగలిగే వాడిని కాదని, అందువలన  తన వాళ్ళని కూడ తనతో  పాటు కాపాడమని కవి విన్నపం.
                              

                                ఇది తమ్మరగోపన్న రచించిన జానకీ శతకమునకు
                                                 తేజస్వినీ వ్యాఖ్య సంపూర్ణము.



*****************************************************************************