Friday 29 April 2016

శ్రీ నృసింహ పంచవింశతి -3 ,ఇది తొలి దేశభక్తి కావ్యం ?

                                                         శ్రీ నృసింహ పంచవింశతి -3
                                           ఇది తొలి దేశభక్తి కావ్యం ?

                                              


  అలంపురం శ్రీ బాల బ్రహ్మేశ్వరస్వామి వారి ఆలయం లో  ఈశాన్యం మూల దర్శనమిచ్చే షోడశబాహు నరసింహస్వామి




                                              గుణగణాకర ! నీ గుణము లెంచెద నింక
                  పరికించి వినవయ్య పరమ పురుష !

శబరి యెంగిలి పండ్లు సంతసంబున దేగఁ
                               దిని మెచ్చినట్టి నీ హీన గుణము,

అల కుచేలుడు నిన్ను దలచి వచ్చితె, వాని
                                       యటుకులు దిన్నట్టి యల్ప గుణము,

బాలుడవై గోప బాలురతోఁ గూడి
                                   పరభామినుల గూడు పలుచదనము ,

ఇట్టి గుణములు నీ యందు దిట్టము గను
        గలిగ యుండఁగఁ గ్రీస్తులఁ గలియు టరుదె ?
క్రీస్తుమతజులఁ జెండుమా  కినుక తోడ
                    వైరి గజసింహ ! యో బల నారసింహ!            (14)

                     
                           ఓ అహోబిల నారసింహా ! సుగుణాల ప్రోవైన నీ గుణగణాలను  లెక్కిస్తాను .చెవులు రిక్కించుకొని వివవయ్యా మహానుభావా ! ఆనాడు శబరి ఇచ్చిన ఎంగిలిపండ్ల ను తిన్నప్పుడే నీ హీన గుణము లోకానికి వెల్లడైంది. పాపం నీ స్నేహితుడు కుచేలుడు నిన్ను చూడానికి వస్తే అతని  కొంగున ఉన్న అటుకులన్నీ స్వాహా చేసినప్పుడే నీ అల్పబుద్ధి అందరికీ  అర్ధమైంది. గోప బాలుర తో కలిసి రేపల్లె లో పరస్త్రీలను కూడిన నాడే నీ పలుచ గుణం లోకానికి వెల్లడైంది. ఇటువంటి గుణాలు మొదట్నుంచీ దిట్టంగా ఉన్న నీవు ఇప్పుడు క్రీస్తులను కలవడం లో విచిత్రమేముంది ప్రభూ ! స్వామీ ! ఈ ఆంగ్లేయుల పీచమడచి మమ్మల్ని రక్షించు నారసింహా.


                                                       నా బ్రతుకు కై  గాదు  నరసింహ ! నేనిట్లు
                      ప్రస్తుతించుట నిన్ను భక్తి తోడ

నీ కీర్తి భువియందు నిల్చుటకే నేను
                విన్నవించెదయ్య ! వేదవేద్య !

నీ పేరు ధర లోన నీళ్ళపై వ్రాలౌట
                       కద్భుతాశ్చర్యమై కాన బడెను

నా తండ్రి నినుఁ గ్రీస్తు మతజులు నిందింపఁ
గొమరుండ నాకది కొఱతఁ గాదె  ?

కాన నాయందుఁ గరుణించి, ఘనత మెఱసి
 నిల్పు కొనవయ్య     నీ పేరు నీరజాక్ష
                                                క్రీస్తుమతజులఁ జెండుమా  కినుక తోడ
                                                  వైరి గజసింహ ! యో బల నారసింహ!           (15)
                     

           
    స్వామీ ! అహోబిల నారసింహా ! నేనింత గా నిన్ను ప్రాధేయపడుతోందీ , ప్రార్ధిస్తున్నదీ నా బతుకు తెఱువు కోసం కాదు ప్రభూ ! ఓ వేదవేద్య ! నీ కీర్తి ఈ భూమి మీద శాశ్వతంగా  నిలిచి పోవడానికే నేను ఇంతగా ఆరాట పడుతున్నానయ్యా. నారసింహుడనే నీ పేరు నీటి మీద వ్రాత లాగా  అదృశ్యమవడం నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది ప్రభూ ! నా తండ్రీ! అహోబిల నరసింహా ! ఈ క్రీస్తు మతజులు  నిన్ను నిందిస్తూ ఉంటే నీ కొడుకునైన నాకు అది అవమానం , చిన్నతనం కాదా ? అందుకే నన్ను కరుణించి ఈ ఆంగ్లేయుల పీచమడచి, నీ గొప్పతనాన్ని, నీ పేరు ను నిలబెట్టకో స్వామీ !


                                       

                                             అహోబిల నరసింహస్వామి





                            శత్రువుల ద్రుంచు నీ చక్రాయుధము నేడు
మొక్కపోయున్నదా మోహనాంగ !

ప్రళయభైరవ రావభరితమౌ శంఖంబు
పగిలెనో  పఱియలై పంకజాక్ష !

శక్రారులను ద్రుంచు శరచాపములు నేడు
                       నడిమికిఁ దునిగెనో  నాగశయన !

పరవైరి నికరభీకరమైన ఖడ్గంబు
                                     మడువు జెందెనొ నేడు మదనజనక !

ధర యెఱుంగక నీ గదాదండ మిపుడు
 కాలె నని యూరకున్నావొ కమలనాభ !
క్రీస్తుమతజులఁ జెండుమా  కినుక తోడ
                                                  వైరి గజసింహ ! యో బల నారసింహ!           (16)
                       

                      ఉగ్రనరసింహుడు ఎంత ఉగ్రరూపుడైతే ఆయన భక్తులకు అంత అందంగా కన్పిస్తాడు. తన స్వామి అంత మహోగ్రరూపుడని చెప్పుకోవడం భక్తునకు మహదానందం. అందుకే ఈ పద్యం లో కవి గర్గలాలు శ్రీ నరసింహుని ఆయుధ విశేషాలను ప్రస్తావిస్తూ , మోహనాంగ అంటూ సంబోధిస్తున్నాడు.
                      
            
         ఓ అహోబిల నారసింహా !  ఓ మోహనరూపుడా ! చండప్రచండమై శత్రుమూకలను చెండాడెడి నా చక్రాయుధము మొక్కవోయి నదా  ఏమి !  శతృ సమూహము పై విజృంభించునప్పుడు   ప్రళయ భీకరముగా గర్జించెడి  పాంచజన్యమనెడి  నీ శంఖము పగిలిపోయినాదా  ఏమి పంకజాక్ష  ! రాక్షసులను మట్టుపెట్టెడి నీ శార్జ్ఞమనెడి  ధనుస్సు  మధ్యకు  విరిగి పోయి మూలపడినదా ఏమి నాగేంద్ర శయన  ! శతృసేనలను చీల్చి చెండాడెడి నీ ఖడ్గము వంగిపోయినదా ఏమి మన్మధ జనకా !  లోకానికంతటికీ తెలిసిన నీ గదా దండము కాలిపోయిన దని ఊరుకున్నావా కమలనాభా ! ఈ ఆంగ్లేయులను తరిమి కొట్టి మమ్మల్ని ఉద్ధరించవా మహానుభావా ?                                                 
                             
                       అందమైన సంబోధనలు చేస్తూనే, శ్రీ నరసింహుని పరాక్రమాన్ని నిందిస్తున్నట్టు గా మాట్లాడటం వ్యాజనింద గా చెప్పబడుతోంది.ఇక్కడ భక్తుడికి భగవంతుని మీద అపారమైన భక్తి విశ్వాసాలున్నాయి. కాని ఎందుకో తన ప్రభువు అవసరమైన సమయం లో స్పందించడం లేదనే కోపం ,   ఆ స్వామి పై అపారమైన భక్తి  వలన ఏర్పడిన చనువు ఇలా మాట్లాడనిస్తాయి.
                                                                     
                                                         జాతి వారలు గాల్చు జాజాయి దెబ్బకు
                                                                     భయమొందితివేమొ భక్త వరద !

రంగైన యట్టి ఫిరంగీల బారుకు
                                     వణుకు పుట్టెనొ నీకు వారిజాక్ష !

వీకమై బర్వు తుపాకీల గుండ్లకు
                                           వెఱచి యుండితివేమొ వేదవేద్య !

లీలమై జెలగు పటాలాల గని పాఱి
                                కొండెక్కి డాగితో కోమలాంగ !

ఇంత వడి వాడవౌట మున్నెఱుఁగమయ్య !
సమరభీరుడ వౌట నీ జాడ  దెలిసె
క్రీస్తుమతజులఁ జెండుమా  కినుక తోడ
                                                      వైరి గజసింహ ! యో బల నారసింహ!           (17)

                       

              ఓ అహోబిల నరసింహా  ! ఓ భక్త సంరక్షకా ! నువ్వు ఇంత సమర భీరుడ వని ఇంతకు ముందు మాకు తెలియదయ్యా ! ఈ తెల్లజాతి వారు పేలుస్తున్న జాజాయీల దెబ్బ కు భయపడిపోయావా ఏమి ప్రభూ !  (జజాయి అనగా ఒక విధమైన ఫిరంగి అని  బ్రౌను నిఘంటువు ). పద్మాక్షా ! ఠీవైన ఇంగ్లీషు వారి ఆ ఫిరంగుల  వరుసలను చూసి వణుకు పుట్టిందా ఏమిటి స్వామీ ! వేగంగా దూసుకొచ్చే ఆ తుపాకీ గుళ్ల కు భయపడి  నిశ్చేష్టుడవై  ఉండిపోయావా వేదవేద్య !  బారులు , బారులు గా వచ్చే ఆంగ్లేయుల  సైనిక సమూహాలను చూసి  పారిపోయి కొండెక్కి దాక్కున్నావా కోమల శరీరా.  (ఇచ్చటకోమలాంగ!’ప్రయోగం ఎంతో అర్ధవంతం గా కుదురుకుంది. ఎందుకంటే స్వామి కోమల శరీరుడు కాబట్టే సైనిక పటాలాలను చూసి పారిపోయి కొండెక్కి కూర్చున్నాడు.)  నువ్వు ఇంత వీరుడవన్న విషయం మాకు ఇంతకు ముందు తెలియదయ్యా ప్రభూ ! ఇప్పుడే నువ్వింత వీరుడవనే విషయం తేటతెల్లమైంది.

                                       


                                                  
                                దిగువ అహోబిల మండపం లో  చెంచులక్ష్మీనరసింహస్వామి స్ధంభశిల్పం
                                       

                                    
                                         తుంబుర నారదాదుల గీతములు నీకు
నింపౌనె తంబుర విన్న వెనుక,

సాధుసజ్జనముల సరస జేరుందువే
                         గో హింసకుల తోను గోష్ఠి మాని ,

అగ్ర జన్ముల చేత నర్చనల్ గొందువె
                         మత భేదకుల పూజ మరగి నీవు ,శ్ర

భక్తుల పైని ఆసక్తి గల్గునె నీకు
                            పాద్రీలపై హర్ష భావ ముడిగి ,

ధర్మ పదవులు ఇకనేల దలతువయ్య
ధరను ధూర్తుల కెల్లను గురుడవైతి
క్రీస్తుమతజులఁ జెండుమా  కినుక తోడ
                           వైరి గజసింహ ! యో బల నారసింహ!       (18)

                         
                              శ్రీ అహోబిల నారసింహా. నీకు వారి ప్రార్ధనా మందిరాలలో వినబడే తంబురాసంగీతం లో తుంబుర నారదాదులు ఆలపించే భక్తిగీతాలు ఆనందాన్ని కల్గించడం లేదా ? గో హింస చేసే దుర్మార్గుల గోష్టులను వదిలి సాధు సజ్జనులు చేసే సత్సంగాలకు నీ వెందుకొస్తావయ్యా ? మత వినాశకుల  పూజ లందుకొనే నువ్వు వైష్ణవ స్వాములు చేసే అర్చనల్ని ఎందుకు స్వీకరిస్తావయ్యా ? ఫాదరీల మీద  ప్రేమభావం పెరిగిన నీకు నారసింహ భక్తులమైన మాపైన ఇంకా ఆసక్తి ఎందుకుంటుంది ? ఇటువంటి సమయం లో ధర్మకర్తలమండలి  పదవుల గురించి ఏమాలోచిస్తావు ? (ఈ కవి అహోబల క్షేత్రము యొక్క రక్షణ , యాజమాన్యము ల తోడి సంబంధము గల ప్రముఖుడై ఉండవచ్చునని ఈ గ్రంథాన్ని  పరిష్కరించిన డా. కే.జే కృష్ణమూర్తి  భావించారు. తన అనుమానాననికి ఊతమిస్తూ నిన్న మొన్నటి దాకా (క్రీ.శ 1920 ప్రాంతం ) శ్రీశైల క్షేత్రానికి ఆత్మకూరు కిషన్ సింగు వంటి బొందిలీ క్షత్రియులే యాజమాన్యం వహించిన విషయాన్ని  ప్రస్తావించారు.) ఈ భూమండలం మీదున్న దుర్మార్గలందరకీ గురువువై   కూర్చున్నావు. శ్రీ యో బల నరసింహా  ! ఈ ఆంగ్లేయులను  పారద్రోలి  మమ్మల్ని రక్షించవయ్యా !
                                                                         

                                                      శ్రీ రమావర ! నారసింహ ! జనార్దన !
                       వైకుంఠ ! వామన ! వాసుదేవ !

నారాయణాచ్యుత ! నగధర ! గోవింద !
                              పద్మనాభ !  ముకుంద  ! పరమ పురుష !

పద్మాక్ష !మాధవ ! ఫణిరాజ తల్పగ !
                                       భవహర  !శుభ్రాంశు భానునేత్ర !

సర్వజ్ఞ ! సర్వేశ ! సర్వప్రదా ! హరి !
                                               హరి హర పూజిత ! యాదిదేవ !

నీలనీరద నిభగాత్ర ! నిగమ వినుత !
భక్తపోషక  !శతకోటి భానుతేజ !
క్రీస్తుమతజులఁ జెండుమా  కినుక తోడ   
                               వైరి గజసింహ ! యో బల నారసింహ!             (19)
                              

                          శ్రీ అహోబిల నారసింహా ! శ్రీ రమానాథా  ! జనార్దనా ! వైకుంఠ వాసా ! వాసుదేవా ! వామనా !  నారాయణా ! అచ్యుతా ! కేశవా !  గోవిందా ! పద్మనాభా ! ముకుందా ! పరమపురుషా ! గిరిధరా ! పద్మాక్షా !  మాధవా ! ఫణిరాజ తల్పగా ! మోక్షప్రదాతా ! వాడియైన కిరణములు గల సూర్యునితో సమానమైన  నేత్రములు గలవాడా ! సర్వజ్ఞ ! సర్వేశ ! సమస్తమును ఇచ్చువాడా ! హరీ ! హరిహర పూజితా !  దేవతాదుల చేత , శంకరుని చేత పూజింపబడెడి వాడా ! ఆదిదేవా ! నీలవర్ణపు మేఘము తో సమానమైన  దేహకాంతి గలవాడా ! వేదముల యందు కొనియాడబడినవాడా ! భక్తజన సంరక్షకా ! శతకోటి సూర్య సమాన తేజోవంతుడా ! ఈ ఆంగ్లేయుల దునుమాడి మమ్మల్ని కాపాడవలసినది స్వామీ !

                                                    నరసింహ !  శ్రీ లక్ష్మీనాయక ! నాయందు
                           గరుణించి, వేగమే కదలి వచ్చి

మతభేదకుల నెల్ల మర్ధించి,జగములో
                                 నిశ్శంక జేయుమా నిగమములను ;

ధర్మకర్తవు నీవు ధర్బు భువియందు
                                  దొఱగుట నీకది కొఱత గాదె ?

భూ భార ముడిపిన పుణ్యమూర్తివి; నీకు
ధూర్తుల జంపుట దొడ్డపనియె ?
క్రీస్తుమతజులఁ జెండుమా  కినుక తోడ
                                                            వైరి గజసింహ ! యో బల నారసింహ!                  (20)
                                                                           
                         

                          శ్రీ లక్ష్మీరమణా ! అహోబిల నారసింహా ! నా మీద దయతో వేగంగా కదలి వచ్చి ఈ మత విధ్వంసకులను మట్టుపెట్టి ,ఈ లోకం లో వేదాలకు ఇక  ప్రమాదం లేదనే విషయాన్ని లోకానికి చాటవయ్యా ! ధర్మకర్తవైన నీకు ఈ  భూమి పై  ధర్మానికి భంగం కలగడం అవమానం కాదా !  భూమాత భారాన్నే పోగొట్టిన నీకు  ఈ దుర్మార్గులను చంపడం పెద్దపని కాదు గదా !  శతృసంహారకుడవైన నీకు అసాధ్యమనేది లేదు కదా ! కాబట్టి  ఆంగ్లేయులను తుదముట్టించే ఘన కార్యాన్ని పూర్తిచేసి , ఘన కీర్తి పొందవయ్యా ప్రభూ !
                                                                          




******************************************************************


Saturday 16 April 2016

శ్రీ నృసింహ పంచవింశతి - 2 ; ఇది తొలి దేశభక్తి కావ్యం ?

                 

           శ్రీ నృసింహ పంచవింశతి -2
                                      ఇది తొలి దేశభక్తి కావ్యం ?
       






శ్రీ అహోబిల నారసింహుడు





మూడు కొయ్యల పైని మురిపెంబు పుట్టెనా ?
                        గరుడ ధ్వజంబను ఘనత రోసి,

పాద్రీల పై రక్తి భావంబు  పుట్టెనా ?
                          నంబుల  పైని ముదంబు మాని ,

అంగహీనుడవౌట కాపేక్ష గల్గెనా ?
                                 ఘనకోటి మన్మధాకార ముడిగి ,

కుమతులపైఁ జాలఁ గూరిమి బుట్టెనా ?
భక్త గణంబు పై రక్తి మాని ,

జగములో నిట్టి దుర్మార్గ జాడ దిరిగి
నట్టి నిందల గీర్తి పోఁగొట్టుకోకు
 క్రీస్తుమతజులఁ జెండుమా  కినుక తోడ
                           వైరి గజసింహ ! యో బల నారసింహ!              (6) 
                 

     ఓ అహోబిల నారసింహా ! గరుడ ధ్వజుడవనే ఘనమైన కీర్తి గల నీకు మూడుకొయ్యల(  ) పైని మోజు కల్గిందా ? నిన్ను నమ్మి సేవించే  పూజారులు ,బ్రాహ్మణుల పైని ప్రేమ తగ్గిపోయి ఫాదరీల పైన  అనురాగం  పెరిగిపోయిందా స్వామీ ! శతకోటి మన్మధాకారుడవైన నీకు ఆ రూపాన్ని వదిలి   రూపం లేకుండా పూజలందుకోవాలని ఉబలాటం  కల్గిందా? నిన్ను సేవించే  భక్తజనులను వదిలివేసి దుర్మార్గుల పైన నీకు మమకారం మెండుగా ఏర్పడిందా స్వామీ ! లోకంలో ఇటువంటి తప్పుడు పనులు చేస్తున్నావనే నిందతో నీకున్న అపూర్వమైన కీర్తిని ,పేరు ప్రతిష్ఠలను ఎందుకు పోగొట్టుకుంటావు స్వామీ! వీరిని  సంహరించి మమ్మల్ని  కాపాడు స్వామీ !.  


                                                 ధరలోనఁ    గ్రీస్తులు దైవదూషణఁ జేయ
విని డాగి యున్నట్టి వేల్పు లిరుగొ !

సింహాద్రి నరహరి సిరి దప్పి యున్నాడు ;
                                                                             వేంకటేశున కేల సంకటంబు ?
రంగేద్రుడును బల భంగమై యున్నాడు ;
వరద రాజుల ప్రజ్ఞ వరద గలిసె !
   
   జగన్నాథుడును జాల బుగులందియున్నాడు ;
కూర్మనాధుని పేరు కూలిపోయె !

వాసి జెడి వీరు మూతిపై మీసములును
లేక యున్నారు గానవ లీల నీవు
 క్రీస్తుమతజులఁ జెండుమా  కినుక తోడ
                   వైరి గజసింహ ! యో బల నారసింహ!            (7) 

                                            యో బల నారసింహా ! ఈ అన్యమతస్థులు  నీచాతినీచంగా దైవనింద కు పాల్పడుతుంటే ఇదిగో ఈ దేవుళ్ళందరు విని కూడ తమ తమ గర్భాలయాల్లో దాక్కుంటున్నారే కాని  శత్రువుల యెడ ఎటువంటి ప్రతీకారం చేయలేకపోతున్నారు. సింహాద్రి అప్పన్న చేతకాని వాడుగా కళాహీనుడై చూస్తున్నాడు.  శ్రీ వేంకటేశ్వరుడు నాకెందుకులే  ఈ సంకటమని  తప్పుకుంటున్నాడు. శ్రీరంగనాథుడు  తన ఆలయానికే ముప్పు వాటిల్ల గా బల భంగమై ఊరుకున్నాడు. చెప్పుకోవడానికి గొప్పే కాని కంచి వరదరాజుల ప్రజ్ఞ వరద కలిసి పోయింది. అంటే కొట్టుకు పోయింది. చేతకాని వాడై పోయాడు.  పూరి జగన్నాథుడు ఇప్పటికే చాల కష్టాల్లో ఉన్నాడు. శ్రీ కూర్మం  లోని కూర్మనాథుడు ఏనాడో  చరిత్ర లో కలిసి పోయాడు.  ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ఈ దేవుళ్ళందరూ వీళ్లకున్న కీర్తిని పోగొట్టుకొని  మూతి మీద మీసాలు లేకుండా ఉన్నారు అందుకే ఇలా తప్పించుకుంటూ, మూల మూలల నక్కుతున్నారు. కాని నీకు మీసాలు ఉన్నాయి కదా. కావున నీవు అవలీలగా వీరిని జయించగలుగుతావు. పూనుకొని ఆంగ్లేయులను వధించవలసింది నారసింహ ప్రభూ !.>
                                   

             ఈ పద్యం నాల్గవ పాదం లో కన్పించే బుగులు అనే పదం గుబులు అనే పదానికి రూపాంతరం. ఈ కవి రచనలో చాల చోట్ల యతిభంగాలు , గణభంగాలు కన్పిస్తున్నాయి. కాని అవన్నీ భక్త్యావేశమనే  పెనుప్రవాహం లో దొర్లి పోయే గులకరాళ్ళే. తను స్వతహాగా కవి కాదు. ఆలంకారికుల మాటల్లో చెప్పాలంటే  ఈ కవి గర్గలాలు ఆవేశకవి.  తన సమాజానికి జరుగుతున్న హానిని నివారించడానికి కత్తి తో పాటు కలం కూడ  పట్టిన థీశాలి   కాని స్వతహా గా కవి కాడు గదా !
                

    కవి ఈ పద్యం లో సింహాద్రి అప్పన్న, శ్రీరంగం లోని రంగనాయకస్వామి, కంచి వరదరాజ స్వామి  పూరి జగన్నాథుడు, శ్రీ కూర్మం కూర్మనాథుని గూర్చి వాడిన పదాలు  అర్థ గాంభీర్యాన్ని సంతరించుకొని ఆనాటి భారత దేశ సార్వభౌమాధికారం పై, ముఖ్యంగా దేవాలయ వ్యవస్థ పై కమ్ముకుంటున్న  ఫిదాయీల దండయాత్ర లనెడి కారుమేఘాల  ఫెళ ఫెళార్భటులను  గుర్తుచేస్తున్నాడా అనిపిస్తోంది. అది చారిత్రకాంశం. విషయాంతరం లో చర్చించవచ్చు.
                                                                    
                                                       కనక కశ్యపుడు తాఁ గన్న పుత్రకుని హిం
                            సించి వే హరిఁ జూపుమంచు పలుక,

నుక్కు గంబము వెళ్లి యుగ్ర నృకేసరి
           రూపముం దాల్చియు, రూఢి గాను

ప్రళయకాలము నాటి భానునందనుఁ బోలె
దివిజులు వెఱఁగంద ధీరమతిని,

దానవేశ్వరు జీరి, దైత్యుల జెండాడి
ప్రహ్లాదు గావవా ప్రజ్ఞ మెఱసి

అట్టి నీ శౌర్య సంపద లెట్టు పోయె
నేడు చూపంగ రాదొకో నీరజాక్ష
క్రీస్తుమతజులఁ జెండుమా  కినుక తోడ
           వైరి గజసింహ ! యో బల నారసింహ!           (8)
                            

                   అహోబల నారసింహా ! ఆనాడు హిరణ్యకశిపుడు కన్నకుమారుడైన ప్రహ్లదుని హరిభక్తి మానుమని పలువిధాల హింసించి, చివరకు విసిగి పోయి , హరి ని చూపించమని  గద్దించగా , ఉక్కు స్ధంభము నుండి ఉగ్ర నరసింహుడవై వచ్చి, ప్రళయకాల కాలుని వలె విరుచుకు పడి , దేవతలందరు భయం తో వణికిపోతుంటే  ఆ హిరణ్య కశిపుని సంహరించి, ప్రహ్లాదుని కాపాడిన  మహానుభావుడవే. అట్టి ఆనాటి నీ శౌర్య సంపదలు ఏమై పోయాయి స్వామీ ! ఆ శౌర్య ప్రతాపాలును ఈ దుర్మార్గుల పై ప్రదర్శించి, మమ్ము  కాపాడి రక్షించలేవా ప్రభూ !

                                             
                                             మానాభిమానముల్ మాసెను భువియందు,
వర్ణాశ్రమంబుల వరుస చెడెను

వావి వర్తన దప్పి వర్తింపు చున్నారు
జనులెల్ల నీ భక్తి జాడ మాని,

పరదైవముల గొలేచి, పాటి దప్పియుఁదాము
ధర్మమార్గంబులు దలగఁ ద్రోచి,

 మత్తులై నీ నామ మంత్రంబు దలపక,
నిన్ను బూజింపక నియతి దప్పి,

ద్రవ్య మందుల నాపేక్షఁ దగిలి చాల
దుష్ట జన బాధలకు డాసి ధూర్తులైరి
క్రీస్తుమతజులఁ జెండుమా  కినుక తోడ
                 వైరి గజసింహ ! యో బల నారసింహ!           (9)
                               

                           హే నారసింహ ! ఈ భూమి మీద మానాభిమానాలు మంట కలిసి పోయాయి. వర్ణాశ్రమాలు నాశనమయ్యాయి. ప్రజలు నీ యెడల భక్తి భావాన్ని వదిలి వేసి,  వావి వరుసలు తప్పి ప్రవర్తిస్తున్నారు. ధర్మమార్గాన్ని తప్పిన జనమంతా అన్యదైవాలను సేవిస్తూ భ్రష్టులై పోతున్నారు. డబ్బు మీద ఆశ తో నియమ నిష్టలు తప్పి, నీ నామ జపాన్ని మర్చిపోయి, దుర్మార్గుల సావాసం తో దుష్టులై ప్రవర్తిస్తున్నారు. ఇదంతా కూడ మన సమాజం పై అన్యమతస్థుల ప్రభావమే స్వామీ ! అందుకే ఈ ఆంగ్లేయులను సంహరించి( మా జాతీయతను) కాపాడు ప్రభూ!


వసుధ లో విప్రుల వర్తనల్ వినవయ్య
                        పద్మాక్ష నీ చెవుల్ పండువు గను

ద్రవ్యాభిలాషులై  ధరలోన వేదముల్
కుజనుల కమ్మిరి కూర్మి తోడ,

బరభాషఁ నెప్పుడు బఠన జేయుచు నుండి
జప తప హోమాది జాడ మాని,

భక్తి తో నీ నామ భజన చేయుట దప్పి,
 నరుల గీర్తింపుచు నయము దూలి

కామినీ సక్తులై ధర్మక్రమమ దప్పి
బ్రాహ్మ లెల్లను భువి లోన భ్రష్టులైరి
క్రీస్తుమతజులఁ జెండుమా  కినుక తోడ
                     వైరి గజసింహ ! యో బల నారసింహ!           (10)
                      



                        హే నారసింహ ప్రభూ !  పద్మపత్రాక్షా !  విప్రుల ఆగడాలను  నీ చెవుల పండువు గా చెపుతాను . వినవయ్యా స్వామీ ! డబ్బు కు ఆశ పడి  బ్రాహ్మణులు వేదాలను ఆ దుర్మార్గులకు అమ్మేస్తున్నారు. జప తప హోమాది వైదిక క్రియలను మాని వేసి, పర భాష ను బట్టీ పట్టడం ప్రారంభించారు.  పవిత్రమైన  నీ నామాన్ని  భక్తి తో  గానం చేయడం మానివేసి నీతి మాలి తెల్లదొరలను కీర్తించసాగారు! ఈ బ్రాహ్మణులందరూ స్త్రీలోలురై, ధర్మమార్గం తప్పి, భ్రష్టులై  సంచరిస్తున్నారు ప్రభూ ! ఆంగ్లేయులను సంహరించి మమ్మల్ని కాపాడు ప్రభూ !
                      

                 ఇక్కడ కవికి బ్రాహ్మణుల మీద ద్వేషం లేదు కాని  స్వామిని సేవించవలసిన వారే వక్రమార్గం లో సంచరిస్తుంటే, వారిని చూసి మిగిలిన జనం కూడ పాడైపోతున్నారనే వేదన ఇక్కడ మనకు కన్పిస్తోంది. తరువాత పద్యం లో కూడ ఇదే భావాన్ని   మరొకరీతి గా చెప్పాడు కవి.


                                                    ఎన్నని నీ తోడ విన్నవింతును దేవ
          విప్రులు చేసెడి విధము లన్ని ,

గాయత్రి మొదలుగాఁ గల్గు మంత్రము లెల్లఁ
గట్ట గట్టమ్మిరి పొట్ట కొఱకు ,

 నీదు సత్కథలపై నిపుణత విడనాడి
           జాతి చదువే తాము జపము చేసి,

దేవ మీ శ్రీ పాద దివ్య పూజలు మాని
                  దొరల సేవింపంగ దొణగి రిట్లు

క్రీస్తు మతజుల తో గూడి శాస్త్రములను
దబ్బఱని పల్కెదరు నీదు దెబ్బఁ జూపి
క్రీస్తుమతజులఁ జెండుమా  కినుక తోడ
                         వైరి గజసింహ ! యో బల నారసింహ!           (11)
                         

                           ఓ అహోబిల వాసా ! శ్రీ నారసింహ ప్రభూ ! ఈ బ్రాహ్మణులు చేస్తున్న పనులను గూర్చి ఏమి చెప్పమంటావు స్వామీ ! గాయత్రీ మంత్రం మొదలైన మంత్రాలన్నింటినీ పొట్టకూటికి కక్కుర్తి పడి , కట్టగట్టి గుత్తగా ఈ పరాయి పాలకులకు అమ్మివేస్తున్నారు.   నీకు సంబంధించిన పురాణ గాధలను చెప్పడం లో తమ కున్న నైపుణ్యాన్ని వదిలివేసి, హూణ విద్య ను అవపోశనం పట్టసాగారు. అంతేకాదు. స్వామీ! మీ దివ్యశ్రీ చరణారవిందాలను  సేవించడం మానేసి, ఆ తెల్లదొరల పాదాలను పట్టుకొని ప్రాకులాడతూ ,  వారితో కలిసి  మన శాస్త్రాలన్నీ అబద్ధాలనీ, కల్పితాలనీ నోటికొచ్చినట్లు వాగుతున్నారు. ఒక్కసారి నీ దెబ్బచూపి,ఈ ఆంగ్లేయుల ఆట కట్టించు స్వామీ!



పద్మాక్ష !జగదీశ ! పక్షివాహ  ! ముకుంద !
                 నాగేంద్రశయన ! పున్నాగ వినుత !

 క్షీరసాగరవిహార !శృంగార చారిత్ర !
                        మార కోటి సురూప ! మదన జనక !
  
మందరోద్ధర ! భక్తమందార ! గోవింద !
                        కుందేందు సుందర మందహాస !

పుండరీకాక్ష  ! యాఖండలామరవంద్య !
                  కుండలాంచిత చారు గండయుగళ ! 

  కంథి తనయా మన: పద్మకలిత భృంగ !
నంది వాహన వందిత ! నాగ పోష  !
క్రీస్తుమతజులఁ జెండుమా  కినుక తోడ
                     వైరి గజసింహ ! యో బల నారసింహ!           (12)

                                           
                                      శత్రువులనెడి ఏనుగుల పాలిట సింహము వంటి వాడా ! అహోబల నారసింహా! పద్మాక్షా లోకనాయకా! గరుడవాహనా ! ముకుందా !!! నాగేంద్ర శయన !  సర్వదేవపూజితా ! క్షీరసాగర విహారా ! శృంగార చారిత్రా ! కోటి మన్మధాకారా ! మదన జనకా ! మందరోద్ధర ! భక్తజన కల్ప వృక్షమా ! గోవిందా ! మల్లెల వంటి నిండు చంద్రుని వంటి మనోహారమైన చిరునవ్వుల వాడా ! ఫుండరీక దళ పత్రాక్షా ! ఇంద్రాది దేవతల చేత పూజింప బడువాడా! కుండలముల కాంతి చే ప్రకాశించెడి చెక్కిళ్లు గలవాడా! లక్ష్మీదేవి హృదయమనెడి పద్మమునందు చరించెడి గండు తుమ్మెదా! శంకరుని చేత ఫూజించబడెడి వాడా! ఓ నారసింహ ప్రభూ! ఈ పరాయి పాలకులను పారద్రోలి, మమ్ములు కాపాడవలసింది స్వామీ!                   

                            ఈ పద్యం లో  కవి సహజసిద్ధ మైన శతక సంప్రదాయాన్ని పాటిస్తూ,   వివిధమైన సంబోధనలతో నరసింహుని  గొప్పతనాన్ని పొగిడి చివర లో తనలోని కోరికను మళ్లీ బలంగా వినిపిస్తున్నాడు. అంతేకాదు  సాథారణం గా ఒక  శతక కర్త తనకు ముక్తి నివ్వమనో , మోక్షం  ఇవ్వమనో ప్రార్థిస్తాడు. కాని ఇక్కడ కవి సమాజం కోసం , తన తోటి జనం కోసం , తన దేశం కోసం  స్వామిని ప్రార్థిస్తున్నాడు.  ఇంతకు మించిన త్యాగనిరతి , దేశభక్తి ఉంటుందా అనిపిస్తుంది.   


జనవరి పండుగల్ ఘన మయ్యె మది నీకు
నిత్యోత్సవం బేల ? నీరజాక్ష !

మూడు కఱ్ఱల జెండా ముచ్చటాయెను నీకు
గరుడ ధ్వజంబేల ? ఘన నిభాంగ !

శూన్యగృహంబుల నుండ షోకు బుట్టెను నీకు
దేవాలయం బేల ? దేవ దేవ !

కుమతుల పూజకై కూర్మిఁజెందెడు నీకు
 మా పూజ లెక్కునె ? మదన జనక !

క్రీస్తు కూటికి నీ విట్టు లాస్తఁ జెంద
యాగ భుక్తంబు నీకేల ? నాగశయన !
 క్రీస్తుమతజులఁ జెండుమా  కినుక తోడ
                    వైరి గజసింహ ! యో బల నారసింహ!           (13)
                             

                               అహోబిల నారసింహా ! నీకు జనవరి ఒకటిన వచ్చే ఆంగ్ల సంవత్సరాది వేడుకల మీద మోజు పెరిగింది.ఇంకా నీకు నిత్యోత్సవాలు ఎందుకయ్యా స్వామీ ! మూడు కర్రల జెండా మీద నీకు ముచ్చట పెరిగింది ఇంకా నీకు గరుడధ్వజ మెందుకయ్యా ! శూన్యగృహం లో ఉండాలనే కోరిక పెరిగిన నీకు ఇంకా దేవాలయాలెందుకు దేవదేవా ! దుర్మతులు  చేసే సేవల మీద ప్రీతి గల్గిన నీకు మా సేవలు రుచిస్తాయా మదనజనకా !  పరాయి కూటికి ఈ విధం గా నీవు వెంపర్లాడుతుంటే మేమిచ్చే యాగఫలం  నీకెందుకు నచ్చుతుందయ్యా దేవా ! నా ప్రార్థన మన్నించి, ఈ ముష్కరుల సంహరించి , నా జాతిని కాపాడు స్వామీ !
                               

   పై పద్యం లో తనను పొగుడుతున్నాడులే అని  మురిసిపోతున్న అహోబిల నాథునికి ఈ పద్యం లో మళ్లీ మిరియాల కారాన్ని రుచి చూపించాడు కవి. 

                                                                             మూడో భాగం త్వరలో-------



**************************************************