Tuesday 5 January 2016

శతకసౌరభాలు -7 శేషప్ప కవి - నరసింహశతకము .7


శతకసౌరభాలు -7

       శేషప్ప కవి  - నరసింహశతకము .7




హరి నీకు బర్యంకమైన శేషుడు చాల బవను బక్షించియు బ్రతుకుచుండు
ననువుగా నీకు వాహనమైన ఖగరాజు గొప్పపామును నోట గొఱుకుచుండు
యది గాక నీ భార్య యైన లక్ష్మీదేవి దినము పేరంటమ్ము దిరుగుచుండు
నిన్ను భక్తులు పిల్చి నిత్యపూజలు చేసి ప్రేమ పక్వాన్నముల్ బెట్టుచుండ్రు
స్వస్ధముగ నీకు గ్రాసము జరుగుచుండ గాసు నీ చేతి దొకటైన గాదు వ్యయము
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.
            

         శ్రీ ధర్మపురి లక్ష్మీనరసింహా !నీకు పాన్పు గా నున్న ఆది శేషువు గాలిని మేసి బతికేస్తున్నాడు. నీకు వాహనమైన గరుత్మంతుడు  పాములను తింటూ జీవిస్తున్నాడు. నీ ఇల్లాలైన లక్ష్మీదేవి రోజూ  పేరంటాలంటూ ఇంటింటికి తిరుగుతూ ఉంటుంది. ఇక నీ సంగతి చూస్తే నిత్యము నీ భక్తులు పిల్చి నిత్యపూజలు చేసి ప్రేమతో పంచభక్ష్య పర మాన్నాలను  వడ్డిస్తూ ఉంటారు.  నీ చేతిదొక్క పైసా అయినా ఖర్చు కాకుండా రోజులు ఇంత హాయిగా గడిచిపోతున్నాయిగా స్వామీ!

           తను  దిన గ్రాసానికి  అంటే రోజు గడవడానికి నానా బాధలు పడుతుంటే  నీవు మాత్రం హాయిగా పైసా ఖర్చులేకుండా బ్రతికేస్తున్నావని కవి భగవంతుని ఆక్షేపిస్తున్నాడు అంటే నా బతుకు ఇంత దరిద్రం చేసి నీవు మాత్రం సుఖంగా ఉన్నావా! నన్ను ఉద్ధరించు స్వామీ! అని వేడుకుంటున్నాడు.

పుండరీకాక్ష నా రెండు కన్నుల నిండ-నిన్ను జూసెడి భాగ్య మెన్నడయ్య
వాసిగా నా  మనోవాంఛ దీరెడునట్లు సొగసుగా నీరూపు జూపవయ్య
పాపకర్ముని కంట బడక పోవుద మంచుఁ-బరుషమైన బ్రతిజ్ఞ బట్టినావ
వసుధ లోఁ బతిత పావనుడ వీవంచు నేఁ బుణ్యవంతుల నోట బొగడవింటి
నేమిటికి విస్తరించె నీ కింత కీర్తి ద్రోహి నైనను నా కీవు దొరకరాదె
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.
                   
               శ్రీ ధర్మపుర నివాసా! లక్ష్మీనరసింహ !సహస్ర దళ కమలాలవంటి విశాలమైన నేత్రాలు కలిగిన మనోహర రూపా! కన్నుల నిండుగా నీ రూపాన్ని దర్శించగలిగిన భాగ్యము నా కెప్పుడు తండ్రీ! నలుగురికి నేను చెప్పుకోగలిగిన తీరులో  మనోజ్ఞమైన నీ రూపాన్ని నాకు చూపించు తండ్రీ! ఈ పాపాత్మునికి కన్పించ గూడదని కఠినమైన  ప్రతిజ్ఞ ఏమైనా  చేశావా తండ్రీ! కాని ఈ లోకం లో పతితపావనుడవు నీవే నని పుణ్యాత్ములు చెపుతుంటే నేను విని నిజమనుకున్నాను తండ్రీ! నీకీర్తి ఇంత గొప్పగా నలుచెఱగుల  వ్యాపించి ఉంటే దుర్మార్గుడనైన నాకు కూడ కన్పించ రాదా ప్రభూ!.

             నీలమేఘశ్యామ నీవె తండ్రివి మాకు-కమలవాసిని మమ్ము గన్నతల్లి
నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్-నీ కటాక్షము మా కనేకధనము
నీ కీర్తనల్ మాకు లోక ప్రపంచంబు- నీ సహాయము మాకు నిత్య సుఖము
నీ మంత్రమే మాకు నిష్కళంకపు విద్య- నీ పద ధ్యానంబు నిత్య జపము
తోయజాతాక్ష నీ పాద తులసిదళము-రోగముల కౌషధము బ్రహ్మవినుత
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.
         
                   శ్రీ ధర్మపుర నిలయా! నారసింహా!  నీలమేఘవర్ణుడా! నీవె మాకు దిక్కు. కమలాలయ యైన లక్ష్మీమాతయే మాకు తల్లి. నీ భక్తజనులంతా మాకు నిజమైన బంధువులు.  కరుణ తో నిండిన నీ చూపే మాకు అష్టైశ్వర్యాలు. నీ కీర్తనలే మాకు లోకము. నీ సహాయమే మాకు నిత్య సుఖము. నమో నారసింహాయయనెడి నీ నామ మంత్రమే మాకు నిష్కళంకమైన విద్య. నీ పాదములను జపించుట కంటే మించిన జపము వేఱొకటి లేదు. బ్రహ్మ, రుద్రాదుల చేత పొగడ బడిన నీ పాదముల చెంత ఉంచబడిన తులసి దళమే సకల రోగములను పోగొట్ట గల్గిన దివ్యౌషధము తండ్రీ!.



జందెమింపుగ వేసి సంధ్య వార్చిన నేమి- బ్రహ్మ మందక కాడు బ్రాహ్మణుండు
తిరుమణి శ్రీచూర్ణ గురు రేఖ లిడినను విష్ణునొందక కాడు వైష్ణవుండు
బూదిని నుదుటను బూసుకొనిన నేమి-శంభునొందక కాడు శైవజనుడు
కాషాయవస్త్రాలు గట్టి కప్పిననేమి-యాస పోవక కాడు యతి వరుండు
ఇట్టి లౌకికవేషాలు గట్టుకొనిన గురుని చెందక సన్ముక్తి దొరకబోదు
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.
              
            శ్రీ ధర్మపురనిలయా! మెరుస్తున్న జంధ్యాన్ని వేసుకొని , మూడు పూటలా సందెవార్చినంత మాత్రాన బ్రాహ్మణుడు కాడు. బ్రహ్మజ్ఞానము నందిన వాడే బ్రాహ్మణుడు. పెద్ద పెద్ద నామాలు ధరించి నంత మాత్రాన వైష్ణవుడు కాడు. విష్ణువు ను తెలుసుకున్న వానినే వైష్ణవుడంటారు.శంకరుని తెలిసికోకుండా ఒంటినిండా విభూతి  పూసుకున్నంత మాత్రాన శైవుడు కాజాలడు గదా.   అలాగే ఆశ లు వదిలి పెట్టని వాడు కాషాయాలు కట్టుకున్నా యతివరుడు కాలేడు కదా! కావున నరసింహ ప్రభూ! లౌకిక వేషాలు  ఎన్ని ధరించినా  గురువును ఆశ్రయించి బోధ పొందని యెడల ముక్తి లభించదని  ఎల్లరూ తెలుసుకోవాలి.

పలు రోగములకు నీ పాదతీర్ధమె కాని- వలపు మందులు నాకు వలదు వలదు
చెలిమి చేయుచు నీకు సేవచేసెద కాని నీ దాసకోటిలో నిలపవయ్య
గ్రహ భయంబునకు జక్రముఁ దలంచెదఁ గాని- ఘోర రక్షలు కట్ట గోరనయ్య
పాముకాటుకు నిన్ను భజన చేసెదఁ గాని దాని మంత్రము నేను దలపనయ్య
దొరికితివి నాకుఁ దండ్రి వైద్యుడవు నీవు-వేయికష్టాలు  వచ్చిన వెఱవనయ్య
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.
                     
                   శ్రీ నరసింహ ప్రభూ! సమస్త రోగములకు నీ  పాదతీర్ధమే కాని  ఇతర మందులు నాకు  ఏనాడూ వద్దు. నీతో సఖ్యభక్తి నెఱపి నీకు సేవ చేసుకుంటాను గాని నీ భక్తకోటిలో ఒకడి గా నన్ను కూడ  ఉండేటట్లు అనుగ్రహించు స్వామీ! భూత ప్రేత పిశాచాది గ్రహ బాధలు సంభవిస్తే సుదర్శన చక్రాన్ని తలుచుకుంటాను గాని తాయెత్తులు , రక్షరేకులు అంటూ ఆరాటపడను స్వామీ !  నన్ను పాము కాటు వేస్తే నీ నామ జపమే చేస్తాను గాని  పాము మంత్రం కోసం పాకులాడను స్వామీ ! స్వామీ !. నారసింహ ప్రభూ!. మెండైన వైద్యుడవు నీవు నాకు దొరికావు. .ఇంకపైన  ఎన్నికష్టాలు వచ్చినా నేను భయపడనయ్యా!.
                                            
                             ఈ పద్యం చదుతుంటే దొరికెను నాకు వేంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను అంటూ ఆనంద తాండవం చేసే  సంకీర్తనాచార్య అన్నమాచార్య మన ముందు ప్రత్యక్షమౌతాడు. భక్తవరుల తాదాత్య్మత కు, పారావశ్యానికి హద్దులు లేవు కదా.!

పంజరంబునఁ గాకి పట్టి యుంచిన లెస్స పలుకునే వింతైన జిలుక వలెను
గార్ధభంబును దెచ్చి కళ్ళెమింపుగ వేయఁ దిరుగునే  గుఱ్ఱంబు తీరుగాను
ఎనుపబోతును మావటీడు శిక్షించిన-నడచునే మదవారణంబు వలెను
పెద్దపిట్టను మేతఁబెట్టి పెంచినఁ గ్రొవ్వి సాగునే వేటాడు డేగ వలెను
కుజనులను దెచ్చి నీ సేవ కొఱకుఁ బెట్టి వాంఛతోఁ జేతురే భక్తవరుల వలెను
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.
                               

                      శ్రీ ధర్మపుర నివాసా! రత్నాభరణ భూషా! లక్ష్మీనరసింహా! నీ సేవకులు గా నియమించబడే వారు నీ భక్తులైతే మక్కువతో నీకు సేవ చేస్తారు గాని దుర్మార్గులను తెచ్చి నీ సేవకులు గా పెడితే వారు నీ భక్తుల వలే సేవ లందించలేరు. వారి లోని దుర్మార్గం, స్వార్ధప్రవృత్తి వారిని అవినీతి మార్గాలను పట్టిస్తుంది కదా! ఏ విధంగా నంటే కాకి ని పట్టుకొచ్చి పంజరం లో పెట్టినంత మాత్రాన అది చిలుక పలుకులు పలకలేదు . గాడిద ను పట్టుకొచ్చి అందం గా కళ్ళాన్ని తగిలించినా  అది గుఱ్ఱం వలే తిరగ లేదు కదా. ఎనుబోతు కు మావటి వాని చేత చక్కని శిక్షణ ఇప్పించినా కూడ అది మత్తగజం వలే నడవలేదు కదా. ఒక పెద్ద పిట్టను తెచ్చి పుష్టి గా మేపినా కూడ అది డేగ వలే వేటాడ గలుగు తుందా! లేదు కదా! అలాగే దుర్మార్గులను నీ ఆలయాలకు ధర్మకర్తలు గానో  , అధికారులు గానో నియమించినా వారు పూర్వపు టలవాట్ల ను మర్చిపోయి నీ భక్తులు గా నిన్ను సేవించుట అసంభవము.

నిగమాది శాస్త్రముల్ నేర్చిన ద్విజుడైన యజ్ఞకర్తగు సోమాయాజియైన
ధరణి లోపల ప్రభాత స్నాన పరుడైన- నిత్య సత్కర్మాది నిరతుడైన
నుపవాస నియమంబు నొందు సజ్జనుఁడైన గావి వస్త్రము గట్టు ఘనుడు నైన
దండి పోషక మహా దానపరుండైన సకల యాత్రలు సల్పు సరసుడైన
గర్వమునఁ గష్టపడి నిన్ను గానకున్న మోక్షసామ్రాజ్య మొందడు మోహనాంగ
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.
                          
                 శ్రీ ధర్మపుర నివాసా! మోహనరూపా! నరసింహా.వేదాధ్యయనం చేసిన బ్రాహ్మణుడైనా , యజ్ఞకర్తయైన సోమయాజియైనా , ప్రాత కాలం లో లేచి  స్నాన , సంధ్యావందనాదు లాచరించే శ్రోత్రీయుడైనా,  ఎల్లవేళలా సత్కర్మల నాచరించే ఉత్తముడైనా, ఉపవాస నియమములను పాటించు వ్రతుడైనా , కాషాయము ను ధరించు యతి యైనా, షోడశ మహాదానములను చేసిన దాతయైనా , సమస్త తీర్ధయాత్రలను సలుపు ఘనుడైనా గర్వం తో నిన్ను దర్శించకుండా ఉంటే మాత్రం ముక్తిని పొందలేడు. ఇది నిజము  .

పక్షివాహన నేను బ్రతికి నన్ని దినాలు కొండెగాండ్రను గూడి కుమతి నైతి
అన్నవస్త్రము లిచ్చి ఆదరింపుము నన్ను - కన్న తండ్రివి నీవె కమలనాభ
మరణమయ్యెడి నాడు మమతతో నీయొద్ద-బంట్ల దోలుము ముందు బ్రహ్మజనక
ఇనజ భటాళి ఈడిచి కొనిపోక- కరుణతో నాయొద్దఁ గావలుంచు
కొనకు నీ సన్నిధి కిఁ బిల్చుకొనియు నీకు-సేవకునిఁ జేసికొనవయ్య శేషశయన
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!
              
              ధర్మపుర నివాసా! గరుడవాహనా! నేను బ్రతికినన్ని రోజులు కొండెగాళ్లను చేరి దురాలోచనలతో దుర్మార్గుడనయితి. ఇప్పుడు అన్నవస్త్రముల నిచ్చి ఆదుకోవలసింది నీవే నాకు కన్నతండ్రివి కమలనాభా. నాకు మరణం సంభవించినప్పుడు యమభటులు లాక్కుపోకుండా నాపై దయఉంచి  నీ సేవకులను కాపాలా ఉంచి , చివరలో  నీ దగ్గరకు  పిలిపించుకొని నీ సేవకుడిగా చేసికొనవలసినది  శేషశయనా!.



అతిలోభులను భిక్షమడుగఁ బోవుట రోత తన ద్రవ్యమొకరింట దాచరోత
గుణహీనుడగు వాని కొలువుఁగొల్చుట రోత-యొరుల పంచలక్రింద నుంట రోత
భాగ్యవంతుని తోడఁ బంతమాడుట రోత గుఱిలేని బంధుల గూడ రోత
యాదాయములు లేక యప్పుఁ దీయుట రోత జారచోరుల గూడి చనుట రోత
యాది లక్ష్మీశ నీ బంటు నైతినయ్య యింక  నెడబాపు జన్మం బదెన్న రోత
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.

                    శ్రీ లక్ష్మీనరసింహా! పిసినారులను యాచించడం  అసహ్యం.మన డబ్బును ఒకరి దగ్గర దాచుకోవడం అసహ్యం. గుణ హీనుని వద్ద కొలువు చేయడం , పరాయి పంచన బ్రతకడం అసహ్యం. ధనవంతుని తో పంతమాడటం ,  మన మీద గౌరవం లేని బంధువులతో కలిసి తిరగడం అసహ్యమే.సంపాదన లేకుండా అప్పులు చేయడం, దొంగలు , వ్యభిచారుల తో  స్నేహం గా తిరగడం  కూడ అసహ్యకరమైన పనులే. హే లక్ష్మీనాథా! నేను నీ సేవకుడను. ఈ బతుకంటేనే అసహ్యమేస్తోంది. నన్ను కడతేర్చి కాపాడు తండ్రీ!




శేషప్ప యను కవి చెప్పిన పద్యముల్- చెవుల కానందమై చెలగు చుండు
నే మనుజుండైన నెలమి నీ శతకంబు - భక్తితో విన్న సత్ఫలము కలుగు
జెలగి  పద్యముల్ చేర్చి వ్రాసినవారు కమలాక్షు కరుణను గాంతురెపుడు
నింపుగా పుస్తకం బెపుడు పూజించిన దురిత జాలంబులు తొలగిపోవు
ఇద్ది పుణ్యకరంబని యెపుడు జనులు కష్టమనక పఠించినం గలుగు ముక్తి
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.(100)
                              
                      శ్రీ ధర్మపురి  నరసింహా ! హే లక్ష్మీనాథా! శేషప్ప అను పేరు కలిగిన ఈ కవి చెప్పిన పద్యములు చెవులకు ఆనందాన్ని  ఇస్తాయి. ఏ మానవుడైనా భక్తితో సంతోషంగా  ఈ శతకాన్ని విన్నట్లైతే మంచి ఫలితాలు ప్రాప్తిస్తాయి. ఈ పద్యాలను చూసి కుదురు గా మరల వ్రాసి నట్లైతే  వారికి ఆ కమలనాథుని అనుగ్రహం లభిస్తుంది. ఈ పుస్తకాన్ని ఎవరు ఎప్పుడు పూజించినా వారి పాపములు , బాధలు తొలగిపోతాయి. ప్రజలు ఈ కార్యము కష్టమనుకోకుండా  భావించి , పుణ్యకార్యం గా తలంచి ఈ పుస్తకాన్ని చదివినచో  ఆ ధర్మపుర నివాసుడైన లక్ష్మీనారాసింహుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడని   కవి ఆశంస.
                    

                       ఇది శేషప్ప కవి రచించిన నరసింహ శతకము నకు

                                  తేజస్వినీ వ్యాఖ్య సంపూర్ణము.
 *****************************************