Thursday 11 August 2016

శతకసౌరభాలు -9 పురుషోత్తమ కవి శ్రీకాకుళ ఆంథ్రనాయక శతకము-6

శతకసౌరభాలు -9

               కాసుల పురుషోత్తమ కవి     



 శ్రీకాకుళ ఆంథ్రనాయక శతకము-6
              
                                                శ్రీకృష్ణదేవరాయలు శ్రీకాకుళాంధ్ర  మహావిష్ణువుకు నిత్య నైవేద్యాలు , ఉత్సవాలు నిరాటంకంగా జరగడానికి కొండపల్లి సీమ , దేవరకోట లోని యార్లగడ్డ ,మేడూరి స్ధలం లోని లంకపల్లి ,కంబాలదొడ్డి , కొండవీటి సీమ లోని పెదగాడి పట్టు , వినుకొండ సీమ లోని కారుమంచి సమర్పించినట్లు  శాసనప్రమామం . ఈ శాసనం ఆలయ తూర్పుగోడ కు  అమర్చబడి ఉంది. (South Indian Inscriptions 4th  Vol.)



శ్రీకృష్ణదేవరాయలు వేయించిన శాసనము 
                                           

                                              కఠిన స్తనంబుల ఘట్టించి దట్టించి
జడలచే మోది నున్దొడల నదిమి
పలుగంట్లు చేసి గోరుల నాటి దొమ్మిగా
యువతీ  సహస్రంబు లుపరతాది
బంధనంబుల నిన్నుఁ బైకొని తమి రేచి
రమియింప నిదురింప రాక నాఁటి
బడలిక దీర నాపఁగ రాని సుఖనిద్ర
బవళించియున్నట్టి భావ మిచటఁ
దోఁచుచున్నది సంఫుల్లతోయజాక్ష!
మేల్‌ బళా! యింత జా గేమి మేలుకొనవె!
చిత్ర చిత్ర ప్రభావ !దాక్షిణ్యభావ !
                                       హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!                              46

                     ఆంధ్రదేవా ! రాత్రంతా యువతీ సహస్రము ఉపరతాది బంధనాల తో నిన్ను పైన వేసుకొని కోరికతో  క్రీడింప  అలసి పోయి నిద్రలేక , ఇప్పుడు సుఖనిద్ర పోతున్న ట్లున్నావు . లేకపోతే  మేలుకొని , నీ భక్తులను ఏలుకోవడానికి ఇంత ఆలస్యం ఎందుకు చేస్తావు స్వామీ !


నీ బొడ్డుదమ్మి లోనికిఁ జొచ్చి చూచిన
నలువకు నీలోఁతు దెలియకున్నె?
బహుసహస్రాంగనా గృహముల నినుఁ గన్న
మునిరాజు నీమాయఁ గనకయున్నె?
నీ విశ్వరూప మెన్నికఁ జేసి పొడఁగన్న
నరుఁడు నీయురువు దా నెఱుఁగకున్నె?
తన మనఃపీఠి ని న్ననిశ మారాధించు
హరుఁడు భవత్తత్త్వం బరయకున్నె?
గరువ మేటికి నీ మర్మ మెఱుఁగ రనుచుఁ
దెలిసినమహాత్ములకు నైనఁ దెలియకున్నె
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
    హత విమతజీవ  ! శ్రీకాకుళాంధ్రదేవ!                       
                                                                 
                  ఆంధ్రదేవా ! విష్ణుమాయ నెవరూ ఎఱుంగలేరు అని చెపుతూ ఉంటారు. కాని తెలసుకున్న మహాత్ములకు సమస్తము బోధ  పడుతూనే ఉంది కదా  !  నీ తత్త్వము నెవ్వరూ తెలుసు కోలేరనే గర్వమెందుకు స్వామీ  ! నీ నాభి కమలము లోనికి ప్రవేశించిన బ్రహ్మదేవునకు నీ లోతు తెలియదాఒకేమారు వేల మంది గోపికల ఇండ్ల లో నిన్ను దర్శించిన మునిశ్రేష్టుడైన నారదునకు నీ తత్త్వం బోధపడేవుంటుంది కదాకురుక్షేత్ర రంగం లో నీ విశ్వరూపాన్ని అడిగి మరీ దర్శించిన అర్జునునకు  నీ అసలు రూపము తెలియకుండా ఉంటుందా ! తన హృదయపీఠం లో నిన్ను నిలుపు కొని  ఎల్లవేళ లా పూజించే ఆ శంకరునకు  నీ తత్త్వం  తెలుసు కదా !



పురుషాకృతిగ నిన్ను గురుతుఁ బట్టఁగ రాదు
స్త్రీమూర్తి వనుచును జెప్ప రాదు
పరఁగ నపుంసకభావ మెన్నఁగ రాదు
రూపంబు గల్గు టెఱుంగ రాదు
గుణవంతుఁడ వ టంచు గణుతింపఁగా రాదు
మర్యాద దెలియ నేమతికి రాదు
కులజుఁడ వనుచు నిక్కువముఁ జెప్పఁగ రాదు
స్థల మెక్కడనొ కాని తెలియరాదు
వస్తునిర్దేశ మొనరింప వశము గాని
నిన్ను వర్ణింపరా దయా నిశ్చితముగ
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
                                      హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!                                 48

                                                   శ్రీకాకుళాంధ్రదేవ!      నీ రూపమెలాంటిదో నిక్కచ్చి గా ఎవరికీ తెలీదు. నీవు పురుషుడవో , స్త్రీ మూర్తి వో    చెప్పలేను .   నపుంసకరూపమని చెప్పరాదు. అసలు నీ రూపమెటువంటి దో తెలియడం లేదు. నీవు బుద్ధి మంతుడవని కొనియాడలేను. పోనీ అసలు రూపం తెలుసు కుందామంటే ఎవ్వరికీ సాథ్యం కావడం లేదు . అసలు నది ఏ కులమో , నివాస ప్రాంత మేదో  కూడ   తెలియడం లేదు. వస్తు నిర్ధేశమే చేయజాలని నిన్ను వర్ణించడం ఏ విధం గా సాథ్యమౌతుంది స్వామీ ! ఏ వస్తువైనా ఒక విధమైన రూపం లో ఉంటుందని చెప్పవచ్చు కాని నిన్ను ఏ విధం గా వర్ణించాలి స్వామీ !                      




నమ్ముదు రేరీతి నారదు నాత్మజు
మానిని జేసిన మాయవానిఁ?
దలఁతు రేరీతి నల్‌దలల దయ్యము నోలి
బొడ్డుదమ్మినిఁ గన్న పురుషమణిని?
భూషింతు రే రీతి పుష్పబాణవిరోధి
విషయ భ్రమితుఁ జేయు వేసగాని?
భాషింతు రేరీతి బ్రహ్మాది మశకప
ర్యంతంబు గలిగిన వింతవాని?
ని న్నెఱిఁ గెఱింగి యందఱు సన్నుతింతు
రెవ్వరికి నీవు కావలె నెంచి చూడ?
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
                             హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!               49

                                                స్వామీ ! నిన్ను తెలుసుకున్న వారు  నిన్ను చేరుతారు పొగుడుతారు కాని మిగిలిన వారికి నీతో పని  లేదు కదా  ! ఆత్మజ్ఞాని యైన నారదముని నే స్త్రీ గా మార్చి వేసిన మాయగాడివి కదా నీవు. నాలుగు తలల దైవమైన  బ్రహ్మదేవుణ్ణే నీ నాభి కమలం నుండి పుట్టించి పురుష శ్రేష్టుడవు కదా నువ్వు. మన్మధుని బూడిద చేసిన పరమశివుని యంతటి వాణ్ణి విషయ భ్రమితుని చేసిన వేషగాడివైన నిన్ను ఎవరు నమ్ముతారు చెప్పు. దోమ నుండి బ్రహ్మండ పర్యంతము వ్యాపించి ఉండెడి వింతవానిని  ఏ విధం గా స్తుతించాలి. నిన్ను తెలుసుకున్నవారే నిన్ను స్తుతిస్తారు  కాని మిగిలిన వారికి నీవేమిటో తెలియదు కదా. !


రాయల వారు  ఆముక్తమాల్యద  కావ్యానికి శ్రీకారం చుట్టిన
ఆముక్తమాల్యదా మండపం .


                                               ఎక్కడ నీకన్న దిక్కు లేనట్ల ని
న్నర్చింతు రబ్జగర్భాది సురలు
మఱి యెందు గతి లేనిమాడ్కి మహామును
ల్నీయందె లక్ష్యము ల్నిలుపు కొందు
రిలఁ దరణోపాయ మెందున లేనట్లు
సజ్జనుల్‌ నీకథల్‌ చదువుకొండ్రు
పగతుర మెయ్యెడ బ్రతికెద మన్నట్లు
దునిసిరి నీచేత దనుజు లెల్ల
దత్త్వ మరసిన శుద్ధబుద్ధస్వరూప
మింత యధికార మెన్నటి దేమి చెపుమ
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
                                    హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!                     50

                                                             శ్రీకాకుళాంధ్రదేవ!     లోకం లో ఇంకా ఇతర దేవుళ్ళు ఎవ్వరూ లేనట్లు బ్రహ్మా తో సహా సమస్త దేవత లు నిన్నే  పూజిస్తూ ఉంటారు. మరి ఎవ్వరూ గతి లేనట్లు మహర్షులందరూ  నిన్నే తమ మనస్సు లో నిల్పుకొని థ్యానిస్తూ ఉంటారు . ఈ భూమి మీద మరొక ముక్తి మార్గం లేనట్లు సజ్జనులందరూ  నీ కథ లే చదువు కొంటుంటారు. నీ శత్రువులమైన మేము   ఇంకా ఎక్కడ బ్రతుకుతామన్నట్లు  రాక్షసులందరూ నీ చేతిలోనే మరణించారు. నీ తత్త్వం తెలుసు కుంటే నీవొక శుద్దబుద్ధావతారానివి. మరి నీకు ఇంతటి అధికారం  ఏవిధం గా లభించిందో అర్దం కావడం లేదు . 
     
                                        ఆడించెదవు బొమ్మలాటవాఁడును బోలె
సర్వచరాచరజంతువులను
కనుకట్టు గట్టెదు గారడీఁడును బోలె
మిథ్యాప్రపంచంబు తథ్యముగను
వేర్వేఱఁ దోఁతువు వేషధారియుఁ బోలెఁ
బహువిధదేవతాభద్రకళలఁ
దెలివి మాన్పుదువు జక్కులవాని చందానఁ
బ్రజల సంపద్రంగవల్లిఁ జేర్చి
యిట్టివే కద నీవిద్య లెన్ని యైన
నింక నేమిట ఘనుఁడవో యెఱుఁగరాదు
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!   51

                       స్వామీ ! సమస్తమైన చరాచరప్రకృతిని తోలుబొమ్మలాడించే వాడి లాగా ఆడిస్తావు. మిథ్యా జగత్తు నంతటిని గారడీవాని వలే  తథ్యమైన దానివలే కన్పింపచేస్తావు. వేషాలు వేసే వాడి వలే  వివిధ దేవతా రూపాలతో వేరు వేరు గా కన్పిస్తూ ఉంటావు. ప్రజలనందరిని సంపద అనే ముగ్గులోకి చేర్చి మాంత్రికుని వలే వివేక హీనుల్ని  చేసి ఆడిస్తావు. నీ విద్యలన్నీ ఇలాగే  మోసపూరితాలు. ఇవి కాక ఇంకా నీకెటువంటి విద్యలొచ్చో మాకు తెలియదు కదా !


కూరిమి నల తంతెగొట్టు సన్న్యాసితో
ముచ్చటించెద వేమి పుణ్యమూర్తి
సాటిగా వెలిగొండ వీటి జంగముచెల్మిఁ
బచరింతు వేనాఁటి బాంధవుండు
వెలి పాపపాన్పుపై వేడ్కతోఁ బవళింతు
వది యేమి భోగిభోగాంతరంబు
పొరుగిండ్ల కేప్రొద్దుఁ బో రాఁ దలఁచు నింతిఁ
బాయకుండెద వేమి భాగ్యలక్ష్మి
మంచి సహవాసములు గల్గె నెంచి చూడ
నీకె తగు నట్టివారితో నెనరు నెఱప
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!  52

                        శ్రీకాకుళాంధ్రదేవ!   మహతి యనే వీణ తీగె ను మీటుకుంటూ తిరిగే సన్న్యాసి ఆ  నారదుని తో ఎంతో అభిమానం తో  ఎప్పుడూ ఏఏవో ముచ్చట లాడు తూనే ఉంటావు. ఆయన చేసిన పుణ్య విశేషమేమిటి స్వామీ ? వెండికొండ మీద నివసించే జంగమయ్య తో స్నేహం చేస్తావు. అతనేమైనా నీకు పాత చుట్టమా ? తెల్లని శేషపాన్పు మీద విలాసం గా శయనిస్తావు . అదేమైనా  నీకు విశేషభోగమా స్వామీ ?
 ఎవరి ఇంటా నిలవకుండా ఎంతసేపు  పొరుగు ఇళ్ళ కు రాకపోకలు సాగిస్తూ ఉంటుంది నీ ఇల్లాలైన  లక్ష్మీదేవి. అయినా ఆమెను  నీవు వక్షస్ధల మందు నిలుపు కొని మరీ ఏలుకొంటున్నావు. ఆలోచిస్తుంటే ఎంత మంచి స్నేహాలయ్యా నీవి. ఇటువంటి వారితో  స్నేహం చేయడం నీకే తగింది ప్రభూ.



                                         అఖిలపోషకుఁడ వ న్నాఖ్య మాత్రమె కాని
కర్తవు నీవె భోక్తవును నీవె
యక్షరుండ వను ప్రఖ్యాతి మాత్రమె కాని
చర్చింప వేఱొండు సాక్షి గలఁడె
సుగుణాబ్ధి వని నిన్ను స్తుతి యొనర్చుటె కాని
నిర్గుణుం డెవ్వఁడు నీకు మించ
విశ్వాత్ముఁడ వటంచు వినుతించుటయే కాని
చొచ్చి ని న్నెవ్వఁడు చూచినాఁడు
వినుకలులె గాని నిన్ను నీ విశ్వములను
మొద లెఱుంగుదురే నిజంబునకుఁ జెపుమ
చిత్ర చిత్ర ప్రభావ  ! దాక్షిణ్యభావ !
హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!  53
                             ఆంధ్రదేవా !   సమస్త పోషకుడవనే  పేరే కాని  కర్తవు , భోక్తవు కూడ నీవే కదా ! సృష్టించే వాడివి. అనుభవించేవాడివి నీవే కదానీకు అక్షరుండవు  అనగా నాశము లేని వాడవు అనే ప్రఖ్యాతే గాని దాని కేమీ సాక్ష్యము లేదు కదా !  నీవు సర్వ సద్గుణ సంపన్నుడవని పొగడటమే కాని నిన్ను మించిన నిర్గుణుడు ఎవరు !  విశ్వరూపుడవని నిన్ను స్తుతించడమే కాని నీలో ప్రవేశించి గమనించిన దెవరు ! నీ గురించి , నీవు సృష్టించిన ఈ సమస్త లోకాన్ని గురించి వారు వీరు చెపుతున్న, చెప్పుకుంటున్న మాటలే కాని అసలు నిజమేమిటో  ఎవరికీ తెలియదు కదా స్వామీ !


                                         ఒక గుణంబున నీవె సకల ప్రపంచంబుఁ
గల్పించితి వభూతకల్పనముగ
వేఱొకగుణముచే విశ్వవిశ్వప్రాణ
రక్షణం బొనరింతు వక్షయముగ
మఱి యొండు గుణముచే మండలంబులు గూడఁ
జెఱపివేయుదువు నిశ్శేషముగను
నిర్గుణంబున నీవె నిరవకాశంబుగాఁ
బట్టక యుందువు బయలు మెఱసి
గుణ మొకటి గాదు తెలిసినగుణము లేదు
చేరి నినుఁ గొల్వరాదు వచింపరాదు
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
హత విమతజీవ  ! శ్రీకాకుళాంధ్రదేవ!   54

                                శ్రీకాకుళాంధ్రదేవ !    ఈ సృష్టి లో సమస్తము నీవే.  నీవే సత్త్వగుణం చేత ఈ సమస్త ప్రపంచాన్ని  అశాశ్వతమైన దానినిగా  సృష్టిస్తావు. రజోగుణం తో ఈ సృష్టించబడిన సకల జీవులను  నీవే పోషిస్తున్నావు.  తమో గుణం చేత సూర్య చంద్రులతో సహా సమస్త సృష్టి ని  నీవే నిశ్శేషం గా నాశనం చేస్తావు. ఇంత చేసి కూడ నీవు నిర్గుణుండవై సమస్త వ్యాపకత్వాన్ని పొంది వీటన్నింటికి వెలుపల  నూత్న వెలుగుతో ప్రకాశిస్తూ ఉంటావు. నీవు సర్వగుణ సంపన్నుడవు కాని  మాకు తెలిసిన గుణము ఒక్కటి లేదు. నిన్ను చేరి పూజించనూ లేము . శ్లాఘించనూ లేము. చెప్పుటకు సాథ్యమూ కాదు ఏమిటిది మహానుభావా  !


జీవిని జీవి భక్షింపఁ జేసితి వింతె
కొని పెట్టినావె చేతనుల కెల్లఁ?
జేసినంత భుజింపఁ జేసినా వింతె కా
కెక్కువ లెవ్వరి కిచ్చినావు?
కర్మసూత్రంబునఁ గట్టి త్రిప్పెదవు గా
కిచ్చ నొక్కనిఁ బోవనిచ్చినావె?
వెసంబృథక్ప్రకృతుల వేఱుఁబెట్టితివి గా
కందఱి కైకమత్య మిడినావె?
తెలిసె నీరక్షకత్వంబు దేవదేవ!
వేఱె గతి లేక నిన్ను సేవింప వలసె?
చిత్ర చిత్ర ప్రభావ  దాక్షిణ్యభావ
హత విమతజీవ  శ్రీకాకుళాంధ్రదేవ!  55

                                              ఆంధ్రదేవా !    నీవు జీవరాశిని పోషించింది ఏముంది ? ఒక జీవిని మరొక జీవికి ఆహారం చేశావు కాని ప్రాణులకు నీవేమీ కొని పెట్టి పోషించలేదు కదాఎవరి శ్రమకు తగ్గట్టు వాడికి తిండి లభించేట్టు చేశావు కాని అంతకు మించి ఎవరికి ఏమి ఎక్కువ ఇచ్చావు చెప్పు ?  వాడు పూర్వ జన్మ లో చేసిన పాపపుణ్యాలను బట్టి కర్మ సూత్రం తో వారిని పట్టి ఆడించావు తప్పితే ఒక్కడినైనా వాడి ఇష్టమొచ్చినట్లు వాడిని బ్రతకనిచ్చావా ? ప్రాణులందరికి రకరకాలైన ప్రవర్తనలు కల్పించి వారినందరిని వేరు వేరు గా  చేశావు కాని అందరినీ   ఐకమత్యం తో బ్రతికేటట్లు చేసావా ? లేదే. దేవా. నీ రక్షణత్వ మేమిటో దీని మూలంగానే తెలుస్తోంది . అయినా  వేరే  గతి లేక నిన్ను  సేవిస్తున్నాము స్వామీ !


                                                                       ఏడవ భాగం త్వరలో   -----
                                




*****************************************************

Tuesday 2 August 2016

శతకసౌరభాలు -9 పురుషోత్తమ కవి - ఆంథ్రనాయక శతకము- 5

శతకసౌరభాలు -9


కాసుల పురుషోత్తమ కవి
   

  ఆంథ్రనాయక శతకము- 5
                    






నాఁగలి రోఁక లన్నకు నిచ్చి శంఖాది
పంచాయుధము లీవు పట్టినావు
తాటి టెక్కెంబు కోల్తల పెద్ద కెత్తించి
గరుడధ్వజం బీవు గట్టినావు
వెలరాని కఱవోని వలువ జ్యేష్ఠున కిచ్చి
కనకాంబరం బీవు గట్టినావు
మద్య మగ్రజునకు మత్తిలఁ దావించి
జున్ను బాల్‌ పెరుఁ గీవు జుఱ్ఱినావు
తగువరివె యన్నదమ్ముల ధర్మ మీవె
తీర్చవలెఁ గాని మఱియొండు తీర్పఁగలఁడె
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
హత విమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ!     36

                  శ్రీకాకుళాంధ్రదేవ! అన్నదమ్ముల తగవులాటలో తీర్పరి గా నిన్నే ఎంచుకోవాలయ్యా  స్వామీ. ఎందుకంటే  నాగలిని రోకలిని అన్నయైన బలరాముడి కి చ్చి శంఖము , చక్రము మొదలైన పంచాయుధాలను నీవు ధరించావు. యుద్ధభూమి లో   తాళధ్వజాన్ని అన్నకు ఇచ్చి గరుడధ్వజాన్ని నువ్వు తీసుకున్నావు. విలువలేని నల్లని వస్త్రాన్ని అన్నయైన బలరాముని కిచ్చి  ఖరీదైన కనకాంబరాన్ని నీవు కట్టుకొన్నావు. అన్న కు  మత్తు కల్గేటట్లు మద్యాన్ని త్రాగించి  జున్నుపాలు ,పెరుగు లను నువ్వు జుఱ్ఱుకున్నావు. అన్నదమ్ములకు భాగాల పంపిణి లో నీకంటే నిష్పక్షపాతంగా చేసేవాడు ఇంకా ఎక్కడుంటాడయ్యా. అన్నదమ్ముల తగవు లో నీవే మంచి తీర్పరివి.




                                          అప్పనంబులు గొను నఖిలదిఙ్మండలే
                                                                 శ్వరులచేవేంకటాచలనివాసుఁ
                                          డరుదుగా నరువదా ఱగురసంబులు మహా
భోగంబుఁ గొను నీలభూధ్రవరుఁడు
పానకం బాని సాఁబాలు భక్తుల కిచ్చి
మెసఁగును మంగళాద్రీశ్వరుండు
పుట్టకొలంది మైపూఁతఁగాఁ గొను మంచి
గంధంబు సింహనగ ప్రభుండు
సాటి సాముల రీతి నిచ్చోట నీవు
మూర్తిమంతంబుఁ జూపక కీర్తి గలదె?
చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ !
హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!             37

                               ఆంధ్రదేవా ! ఏడుకొండల మీద కొలువుదీరిన వేంకటేశ్వరుడు  సమస్త దిక్పాలుర నుండి కానుకలను  అందుకుంటున్నాడు. నీలాచలం మీద కొలువు దీరిన జగన్నాథుడు అరవై ఆరు రుచులతో  మహాభోగాలను రుచి చూస్తున్నాడు. ( జగన్నాధుని వంటశాల ప్రపంచం లోనే అతి పెద్ద వంటశాల గా ప్రసిద్ధి కెక్కింది ) మంగళాద్రి పై కొలువు దీరిన  పానకాల నారసింహుడు భక్తులు సమర్పించు పానకం లో సగం తీసుకొని మిగిలిన సగం  తిరిగి  భక్తులకే ఇచ్చేస్తున్నాడు. సింహగిరి మీద కొలువు దీరిన వరాహనారసింహుడు పుట్ల కొలది మంచి గంధాన్ని మై పూతగా పూసుకొని, భక్తుల  సేవలందుకుంటున్నాడు. ఇటువంటి సమయం లో  నీ తోటి వారందఱి తో సమానంగా నీవు కూడ నీ ఔన్నత్యాన్ని ప్రదర్శించక పోతే నీ కీర్తి ప్రతిష్టలకు భంగం కదా స్వామీ !


                                    బొచ్చెచేఁపకు నైన మచ్చరం బున్నది
తాఁబేటి కైన సత్త్వంబు గలదు
ఢీకొన్న నడవిపందికిఁ గల్గు రోసంబు
తెరనోటినరుఁడైనఁ దెగువ సేయుఁ
బొట్టివానికి నైన దిట్టతనం బుండు
బాపని కైన దర్పంబు గలదు
చుంచురాజున కైన శూరత్వ మున్నది
ముసలికి నైనఁ జేపుష్టి గలదు
సిద్ధ మాభీరుఁడవు నీవె బుద్ధి నెంచఁ
గలికి వై యేమి సేయఁ గలవొ కాని
చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ !
హత విమతజీవ  ! శ్రీకాకుళాంధ్రదేవ!    38

                                      శ్రీకాకుళాంధ్రదేవ!     మత్స్యావతారం లో రోషాన్ని  ప్రదర్శించి వేదాలను సంరక్షించావు. కూర్మావతారం లో  నీ బలాన్ని చక్కగా ప్రదర్శించావు. వరాహావతారం లో  ప్రతాపాన్ని ప్రదర్శించి భూదేవిని కాపాడావు. నరసింహావతారం లో తెగువ ను చూపి ప్రహ్లాదుని రక్షించావు. వామనుడవై పొట్టివాడవైనా గట్టివాడనిపించావు. పరశురామావతారం లో క్షత్రియ సంహారం చేసి దర్పాన్ని ప్రదర్శించావు. శ్రీరామావతారం లో మహావీరుడుగా కీర్తి గడించావు. బలరాముడి గా నీ చేతి బలాన్ని చూపించావు  కాని ఇప్పుడు నీవు గోపాలకుని అవతారం లో ఉన్న పిరికివాడవు. ఇక  కలికి అవతారం ఎత్తి ఏమి సాధించగలవో  చూద్దాం.


                                        మును నందగోవత్సములఁ గాయునప్పుడు
ననునయించిరె కంజజాది సురలు?
విట చోరచేష్టల వ్రేపల్లెఁ దిరుగు నీ
దగుమ్రోల నచ్చర లాడినారె?
నరరథాశ్వముల సంగరవీథిఁ దోలునాఁ
డెంచి దిక్పతులు భావించినారె?
మగధేశుదాడికి మథుర వీడిననాఁడు
దేవర్షు లెల్లఁ గీర్తించినారె?
యల్పునిగ నెంచినారె లోకైకనాథ
నాథునిఁగ నెంచినారె ము న్ధరణిఁ? జెపుమ
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
                                               హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!                                39

                             శ్రీకాకుళాంధ్రదేవ!  ఇంతకు పూర్వం నీవు నందగో కులం లో ఆవులను కాసేటప్పుడు బ్రహ్మాది దేవతలు ఎవరైనా వచ్చి నిన్ను అనునయించారా ? చెడుతిరుగుళ్ళ తో , దొంగతనాలతో రేపల్లె లో తిరుగాడేటప్పుడు అప్సరస స్త్రీలు నీ ముందు నృత్యాలు చేశారా? లేదు కదా. పాండవ మథ్యముడైన అర్జునుని రధాన్ని యుద్ధభూమి లో నువ్వు తోలే టప్పుడు దిక్పతులు వచ్చి నిన్ను  సంభావించారా ? జరాసంధుని దెబ్బ కు నీవు మథుర ను  వదిలి పెట్టి పాఱిపోయే రోజున   దేవర్షులు వచ్చి నిన్ను కీర్తించారా ? అంటే భూమి పై జన్మించిన నిన్ను దేవతాగణమంతా అల్పుని గా భావించింది కాని లోకైక నాథుని గా నిన్ను గుర్తించలేదు.    దేవదేవుని గా నిన్ను గుర్తిస్తే  నిన్ను గొప్పగా గౌరవించెడి వారు కదా. !                            

                         బాలకృష్ణుని బాల్యక్రీడల్లో ఆయన చేసి సాహసకృత్యాలను మెచ్చి సుర దుందుభులు  మ్రోగినట్లు,  దేవతలు పూలవానలు కురపించినట్లు భాగవతం లో చెపుతోంది.  కాని ఈ కవి స్వామిని సాథించి తన పనిని సాధించుకోవాలని చూస్తున్నాడు కాబట్టి అటువంటి విషయాలు తెలిసి కూడ  తెలియనట్లు గా ఉంటాడు. ఇది ఈ కవి నైజం.  ఈ విషయాన్ని ఇంకా వివరంగా 42 వ పద్యం లో చూద్దాం.

                                                పూతనా కుచ కుంభపూర్ణ విషస్తన్య
పాయివై బ్రదికిన భాగ్య మేమి?
కాళియాశీవిషగ్రసన ప్రమాదంబు
గడచి జీవించిన ఘనత యేమి?
చాణూరమల్లదో: స్తంభ ఘట్టన కోర్చి
లబ్ధజయుఁడ వైన లాభ మేమి?
సాళ్వరాజామోఘ శక్తి ప్రయోగంబు
మరలించుకొనిన సామర్ధ్యమేమి?
బడుగు దాసరివలె నన్నవస్త్రములకుఁ
బరుల కాశింతు విచట నీపంత మేమి?
చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ !
హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!    40

                            శ్రీకాకుళాంధ్రదేవ!     నీ చిన్నప్పుడు  పూతన  అనే రాక్షసి  తన చనుబాల లో విషాన్ని నింపి  నిన్ను చంపడానికి  ప్రయత్నించినప్పుడు నీవు ఆమెను చంపి బ్రతికిబయటపడ్డావు కాని ఫలితం ఏముంది ? కాళీయుడనే సర్పరాజు  విషం నుంచి బతికిబయటపడిన గొప్పతనం ఏమైంది ? చాణూరుడనే మహా మల్లయోధుని ముష్టిఘాతాలనుండి  తప్పించుకొని జయాన్ని పొందిన లాభమేమి ? సాళ్వరాజు ప్రయోగించిన అమోఘమైన శక్తి అనే ఆయుధాన్ని తిప్పి అతనిమీదకే ప్రయోగించిన నీ ప్రతిభా నైపుణ్యం ఎంతటిది ?  ఇన్ని ఘనకార్యాలను చేసిన నీవు ఇప్పుడు ఒక పేద దాసరి వలే అన్నవస్త్రాలకు  ఇతరులను  ఆశ్రయిస్తున్నావు. నీకు ఈ మొండి తనం ఎందుకు. నీ చేష్టలన్నీ విచిత్రాలు గానే ఉన్నాయయ్యా.

          ఈ సందర్భం లో   కంసుని పంపు తో రేపల్లె వాడకు వచ్చిన పూతనను ఆంధ్రమహాభాగవతం లో పోతన  వర్ణంచిన రీతి కడు రమణీయం గా ఉంటుంది.  ఆమె సౌందర్యాన్ని చూసిన గోపకాంతలు మమ్మల్ని అందరినీ సంతోషపరచడానికి లక్ష్మీదేవి శృంగార వేషం తో వచ్చిందేమో నని  భ్రాతి పడి తదేకం గా పూతనను చూస్తూ ఉండిపోయారట. పూతన వర్ణన చూడండి.



క్రాలుకన్నులు గుబ్బచన్నులుఁ గందువొందని చందురుం
బోలు మోమును గల్గు లేదన బుద్ది దూఱని  కౌను, హే
రాళమైన పిఱుందుఁ  బల్లవరాగ పాదకరంబులుం
                                    జాల దొడ్డగు కొప్పు నొప్పగ సర్వమోహన మూర్తితోన్.   (ఆం.మ.భా.10 పూ.-213 )

                                         ప్రకాశవంతమైన నేత్రాలు, పొంకమైన వక్షోజాలు ,మచ్చలేని చందమామ వంటి మోము, ఉన్నదా లేదా  అనే అనుమానానికి తావిచ్చే నడుము , విశాలమైన జఘనము ,  చిగురాకుల వంటి కాళ్లు చేతులు , ఒత్తైన కొప్పుముడి తో సర్వమోహనమూర్తి గా నందుని ఇంటికెళ్ళింది పూతన.


                                    పట్టి గొల్లది రోఁట గట్ట నోపిన నీకుఁ
రోసంబు లే దన్న నీసు గలదె?
జార చోరాది చేష్టలఁ బ్రవర్తిల్లు నీ
కపకీర్తి యన్న భయంబు గలదె?
భార్యచేఁ దన్నులుఁ బడ్డవానికి నీకు
లజ్జ లే దని యన్న లాఘవంబె?
కుండంటు లే దని కొసరి మెక్కిన నీకు
హీనత లెంచిన న్యూన మగునె?
కోరి దాసులు ని న్నెంత దూరుచున్నఁ
బంత మున్నదె నీ కిసుమంత యైన?
చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ !
                                      హత విమతజీవ !శ్రీకాకుళాంధ్రదేవ!                                  41

                               శ్రీకాకుళాంధ్రమహావిష్ణూ!   ఒక గొల్లభామయైన యశోద  నిన్ను రోటికి కట్టేస్తే   సహించిన నీకు ఏమాత్రం రోషం లేదంటే పౌరుషం పొడుచుకొచ్చిందా ? జారచోరాది చేష్టల్లో  సంచరించే నీకు అపకీర్తి అంటే భయముందా. పెళ్లాం  కాలితో తన్నించుకొన్న   నీకు సిగ్గు లేదంటే తప్పులేదు కదా.  కుండంటు లేదంటూ పరుల ఇళ్లల్లో దూరి  పాలు పెరుగులు మెక్కిన  నిన్ను ఎంత అల్పుని గా లెక్కించిన అది తక్కువే అవుతుంది గదా ! అందుకనే నీ భక్తులు నిన్ను ఎంతగా నిందిస్తున్నా నీలో  మాత్రం  ఇసుమంతైనా పౌరుషం కాన రావడం లేదు.                            

                తాను నిందాస్తుతి లో స్వామి ని ఎందుకు రెచ్చగొడుతున్నాడో కవి ఈ పద్యం లో ప్రస్తావించి , లోలోపల బాధపడుతున్నట్టున్నాడు. అతి ప్రేమ ఉన్నచోటే కోపం గా కూడ ఉంటుందంటారు . అదే ఈ విధమైన రచనకు కారణమౌతోంది. తన ప్రభువు నిత్యసేవలకు దూరమై , బికారి గా ఉంటున్నాడనే బాధ కవిలోని వేదనకు కారణ మైంది.


                                         కడు దొంగతనమునఁ గని తల్లి వైచినఁ
దనబిడ్డనిగ బెంచె నిను యశోద
జనని గర్భము దించుకొనిన వేఱొకతల్లి-
కడుపుఁ జేసికొనంగ గలిగెనన్న
తండ్రి వివాహయత్నము సేయ నొల్లక
తగులుక వచ్చె నీ ధర్మపత్ని
యన్న రారాజు కీనున్న నీ సోదరి
యింటికి జోగిరా నంటుకొనియె
నిట్టి నీ సంప్రదాయంబు గుట్టు బెట్టు
రట్టు సేయుదుఁ గనుము నా భట్టుతనము
చిత్ర చిత్ర ప్రభావ!  దాక్షిణ్యభావ !
హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!     42

                      శ్రీకాకుళాంధ్రదేవ!     కన్నతల్లి  దేవకీదేవి నిన్ను చాటుమాటు గా కని పారవేస్తే యశోదాదేవి నిన్ను కన్నబిడ్డ గా పెంచి పెద్ద చేసింది. నీ తల్లి ఏడవ గర్భం పోగా మరొక తల్లి రోహిణి తన గర్భాన మోసి నీ అన్నను కన్నది **. నీ ధర్మపత్ని రుక్మిణి ఆమె  తండ్రి వివాహప్రయత్నాలు చేస్తుంటే  కాదని పుట్టింటిని వదిలి, నిన్ను తగులుకొని వచ్చేసింది. నీ అన్న బలరాముడు  దుర్యోధనునికి ఇచ్చి వివాహం చేయదలబెట్టిన నీ సోదరి సుభద్ర, ఇంటికి సన్యాసి వేషం లో వచ్చిన  పాండవ మథ్యముడైన అర్జునుని జంట కుదుర్చుకుంది. ఇదేగా నీ కుటుంబ సంప్రదాయము.  ఇదేవిధంగా నీ రహస్యాలను బట్టబయలు చేస్తాను . నా బట్టుతనపు  ప్రతిభా విశేషాలేమిటో తెలియ చేస్తాను.చూస్తూండు స్వామీ.

                              అందుకే  నోరున్నవాడికి ఊరప్పజెప్పమని సామెత వచ్చింది. బట్టుకవి పొగడటం మానేసి తెగడడం మొదలు పెట్టాడంటే  శ్రీమన్నారాయణుడంతటి వాడు కూడా భయపడిపోయే రీతి లో చెలరేగి పోతున్నాడు పురుషోత్తమ కవి.  సాధారణమైన విషయమైనా చెప్పేరీతిని బట్టి పరమ రంకు కథ లాగా దాన్ని చిత్రీకరించడం  వాక్చమత్కారం. అందుకే గయ్యాళి నోటికి దూరం గా ఉండమంటుంటారు జానపదులు.

              ** బలరాముడు రోహిణీ వసుదేవుల కుమారుడు. శ్రీమహావిష్ణువు కృష్ణావతారం ధరించేటప్పుడు ఆదిశేషుడు భూలోకమున అవతరించుటకై దేవకీదేవి సప్తమ గర్భము న పెరుగుచుండెను.  కాని కంసుడు దేవకీ పుత్రులనందఱిని సంహరించదలచి యుండుటచే ఈ పిండమును దీసి రోహిణీ గర్భమునందుంచుమని హరి యోగమాయ  ను ఆజ్ఞాపించెను. యోగమాయ అట్లు చేయుట వలన రోహిణి యందు ఆది శేషుడే బలరాముడు గా జన్మించెను. గదుడ ,సారణుడు ,దుర్మదుడు, విపులుడు అనే వారు ఇతని తమ్ములు.
                                        


                                     పక్షంబు గల దండ్రు పాండుపుత్రులయందు
పాండవుల్‌ పడినట్టి పాటులేమి!
పూర్వజన్మమునందుఁ బూజించె గజ మండ్రు
గజరాజు పొందిన గాసి యేమి!
యల కుచేలునకు బాల్యస్నేహితుఁడ వండ్రు
నెఱిఁ గుచేలుఁడు పడ్డనెవ్వ లేమి!
ప్రహ్లాదుఁ డాజన్మభక్తియుక్తుం డండ్రు
ప్రహ్లాదుఁ డొందిన బాధ లేమి!
యెంతయాలస్యమున వారి నేలినాఁడ
విట్టిదే నీ దయారసం బెంచి చూడ
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
                       హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!                43

                       ఆంధ్రదేవా ! నీవు పాండవ పక్షపాతి వంటారు మరి పాండవులు అన్ని కష్టాలు పడ్డారేమిటి  ప్రభూ ? పూర్వజన్మలో గజరాజు చాల పుణ్యంచేసిందంటారు మరి ఆ గజేంద్రుడు పొందిన కష్టమెలాంటిదో ఎవరికి తెలీదు ?.. కుచేలుడు నీ బాల్యస్నేహితుడని చెప్పుకుంటారే కాని ఆతను పడ్డ బాధలెన్ని ? ప్రహ్లాదుడు ఆజన్మ భక్తి యుక్తుడంటారే ఆ పరమభక్తుడు ఎన్నిబాధలనుభవించాడు. ? నీవు దీనదయాళుడవని ,ఆర్తత్రాణపరాయణుడవని చెప్పుకుంటారు కాని ఎంత ఆలస్యం గా భక్తులను  నీవు కాపాడుతావో, భక్తుల యెడ నీకెంత ప్రేమ ఉందో దీన్ని బట్టి అర్ధమౌతోంది .
                                            

                                          అనఘ మౌ విప్రసత్రాన్న మెంగిలిఁ జేసి
తీవె మున్‌ క్రతుభోక్త నేనే యనుచు
సవతి కొమాళ్ళ సమయించి తందఱిఁ
దరుగని రాక్షసాంతకుఁడ ననుచు
బంధువు లన్యోన్య వైరానుహతులుగా
నడచితి భూభారహారి ననుచు
బలిమి నన్య స్త్రీలఁ బట్టితి వెందఱి
నస్ఖలద్బ్రహ్మచర్యమతి ననుచు
లోకమున నడ్డ మెవ్వరు లేక యునికి
హద్దు లే కిట్లు నడచితి వళుకు మాలి
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
                                 హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!                      44

                  శ్రీకాకుళాంధ్రదేవ!    నేనే క్రతుభోక్త నని పవిత్ర విప్రయజ్ఞ  హవిర్భాగాన్ని ఎంగిలి చేశావు.  రాక్షస సంహారకుడనని పేరుపెట్టుకొని సవతితల్లి యైన దితి సంతానాన్ని నిర్విశేషం గా వధించావు. బంధువులు యుద్ధం లో ఒకరినొకరు చంపుకొని మరణించగా భూభారం తగ్గించానని ప్రకటించుకున్నావు. అస్ఖలిత బ్రహ్మచారినని చెప్పుకుంటూనేబలవంతంగా అనేకమంది పరస్త్రీలను వశపర్చుకున్నావు.    లోకం లో నీ కెవరు ఎదురులేకపోవడం మూలం గా భయం వదిలి  ఈవిధం గా హద్దు పద్దు లేకుండా   ప్రవర్తించావు.       

అది యోగ్యంతరం గాలానబంధంబు
వదలించుకొన నీకు వశము గాదొ!
వేదాంత సకృద చుంబితల మంత్రావర్ణ
నల గుహలుండి రా నలవి గాదొ!
నిమి షార్ధ నిమిషాది నిత్యవేళాచక్ర
గతి నిరోధించి రాఁ గ్రమము గాదొ!
వక్రకంటక పంకవత్క్రూరజనమనః
కాపథంబులను గా ల్మోపరాదొ!
యేమి యాలస్య మిది నీకు నేల సకల
జంతుసంతాన రక్షావిచక్షణునకు
చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ!
                                   హత విమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ!                        45

                        శ్రీకాకుళాంధ్రదేవ!    మేము ఇంతగా ప్రార్ధిస్తున్నా  నీవు రావడం లేదు ? మహర్షులు తమ యోగశక్తి తో నిన్ను తమ మనస్సు లలో బంధించుకున్నారా దానినుండి విడిపించుకోవడం నీకు సాథ్యం కావడం లేదా వేద వేదాంతములలో చెప్పబడినట్లు  రహస్యమంత్రముల  చేత  కప్పివేయబడిన గుహలనుండి వెలుపలికి వచ్చుటకు  నీకు చేతకావడం లేదా ? నిమిషము అర్ధనిమేషము మొదలైన  కాలచక్రము లోని వేళాచక్ర  గతిన నిరోధించి బయటకు వచ్చుటకు  నీకు వీలు కాకున్నదా ?  లేక వంకర తిరిగిన ముళ్ళు, బురద తో నిండిన క్రూరజనుల మనస్సులనెడి మార్గము లో  కాలు పెట్టులకు నీమనస్సంగీకరించుట లేదా.   సర్వప్రాణ సంరక్షకుడవైన నీకు మమ్మల్ని రక్షించడానికి ఇంత ఆలస్యం ఎందుకు ?          

                                                                                               ఆరవ భాగం త్వరలో-----






**********************************************************