Saturday 29 September 2012

రామాయణము- రమణీయకథనాలు -6 మా నిషాద



         మా నిషాద  -హే లక్ష్మీనివాస

        విశ్వ సాహితీ విపంచిక  పై రామకథ ను పలికించి భారతజాతి ఆదర్శాలను, ఔన్నత్యాన్ని, ప్రపంచానికి ప్రదర్శించిన వాల్మీకి రామాయణ మహాకావ్యానికి నాందీగీతం               ఈ   మానిషాద శ్లోకం.

                          మా నిషాద ప్రతిష్ఠాంత మగమ శ్శాశ్వతీస్సమా:
                            యత్క్రౌంచ మిథునా దేక మవథీ: కామమోహితం !!

           క్రౌంచ హనన సందర్భ సంజనిత శోకమే శ్లోకమై ఋషి కవిగా మారిన కళ్యాణఘడియ లో  శోకార్తుడైన   వాల్మీకి ముఖ వినిర్గత  శ్లోకమే    ” మానిషాద .

             కావ్యావిర్భావ ప్రథమదశలో కవిలో చెలరేగే వివిధమైన అనుభూతులకు  ప్రత్యక్షోదాహరణం మానిషాద శ్లోకావిర్భావ సన్నివేశము.

             విశ్వశ్రేయస్సుని కాంక్షించే కవి లోకం కోసం తపించి  బహిర్జగత్తులో ఆత్మైక్యం పొందుతాడని, అటువంటి తాదాత్మం నుండే కవిత్వ మావిర్భవిస్తుందని లౌకిక జగత్తుకి తెలియజెప్పిన ఆదికవి కృత ప్రథమకవిత్వం మానిషాద .

       కవిలో కలిగిన ఆవేదన ఆవేశాలు అనుభూతికి దగ్గరగా అక్షరాకృతిని దాలిస్తే అది కవిత్వమౌతుందన్న ప్రాచ్య,పాశ్చాత్య కవిత్వ నిర్వచనాలకు ప్రాణం –ప్రేరణ  "మానిషాద.

       “Poetry is the spontaneous over flow of powerful feelings”—words worth                           “The thought of in which emotion spontaneously embodies it self-“ john stuart   mill                              
Poetry is a vent for over charged feeling “–john kebel        
         “Poetry Is  responsible for mankind –Even for animalsకవిసేన మానిఫెస్టో పుట -202

           నారదమహర్షి చెప్పి వెళ్లిన రామచంద్రుని గాథను మననం చేసుకుంటూ  స్నానార్ధం తమసానదీ తీరానికి చేరుకున్నారు వాల్మీకి. ఇంతలో ఒక బోయవాడు  ప్రణయపారవశ్యం తో విహరిస్తున్న క్రౌంచపక్షి జంటలో మగపక్షిని నేలకూల్చాడు. మనోహరమైన రామకథను భావించు  కుంటూ తన్మయుడై యున్న మహర్షికి   భర్తను కోల్పోయిన  ఆడపక్షి శోకం రామ చంద్రునికి దూరమై రావణునిచే బంధించబడి విలపిస్తున్న సీతమ్మ శోకం వలె థ్వనించింది.
   
    ప్రశాంత మైన హృదయం లో చెలరేగిన  బాథ కోపమై ప్రభవించింది. కోపం శాప మై వెలువడింది. శోకమే  శ్లోకమైంది. శోకార్తస్య ప్రవృత్తోమే శ్లోకోభవతు నాన్యథా అని మహర్షి ఉవాచ. లౌకిక జగత్తు కి అనుష్టుప్ ఛందం లబించింది.  మహర్షి శోకము శ్లోకమై సుశ్లోకార్హమైంది .

                  ఈ శ్లోకం కథాపరంగా చూస్తే బోయవానికి ఓ నిషాదుడా! నీవు కామమోహితమైన క్రౌంచ మిథునములోని  ఒక దానిని  కొట్టితివి కావున నీవు ప్రతిష్ఠను పొందకుందువు గాక అని  వాల్మీకి యిచ్చిన శాపం గా కన్పిస్తున్నప్పటికి, ఇది చతుర్ముఖ వరప్రసాదితుడైన  వాల్మీకి ముఖము నుండి వెలువడిన ప్రథమ శ్లోకం కాబట్టి  ఇది శాప మో శోకమో కాదని ఇది రామాయణ మహాకావ్యానికి నాందీశ్లోకం వంటి దని భావించిన   రామాయణ వ్యాఖ్యాతలు ఈశ్లోకంలో క్రొత్త అందాలను దర్శించారు.

         అర్థతశ్శబ్ధతోవా2పి  మనాక్కావ్యార్ధసూచనం అన్నఆలంకారికోక్తి ననుసరించి మానిషాద శ్లోకంలో పౌలస్త్య వథ { కామమోహిత మవధీ రిత్యనేన – పౌలస్త్యవథ మిత్యేవేతి విరోథి రావణ నిర్థేశ:”  శ్రీ.మద్రా. గోవిందరా.వ్యాఖ్య-137 }నిరూపించబడిందని, రామాయణ గాథ యావత్తూ దీనిలో ప్రస్తావించబడిందని వ్యాఖ్యానకర్తలు వివరిం చారు. 
                                                                               
                                .....దేవర్షిగణం.... అవసాదయతీతి పీడయతీతి నిషాద తస్య సంబుద్ది: హే నిషాద ! రావణ – యద్యస్మాత్ క్రౌంచమిథునాత్ ..... క్రౌంచం- రాజ్యక్షయ వనవాసాది దుఖేన పరమకార్శం గతం  యన్మిథునం సీతారామ  రూపం  తస్మాదేకం సీతా రూపం.....ఈవిధంగా  మహేశ్వరతీర్థుల వ్యాఖ్యానం కన్పిస్తోంది. దేవతలను, ,ఋషులను పీడించిన రావణుడే నిషాదుడు  కాగా భర్తృవియోగాన్ని పొంది విలపిస్తున్న  క్రౌంచిని సీతాదేవి గా భావించి రామకథను సమన్వయించారు మహేశ్వర తీర్థులు. 
                                                                                “                                   “మానిషాద శ్లోకంలోని ప్రతిపదాన్ని రామాయణంలోని కథ తోను , కాండల పరంగాను విభజించి వ్యాఖ్యానకారులు చేసిన సమన్వయాన్ని  చూస్తే ఆ మహానుభావులకు మరొక్కసారి చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది.

                        మా నిషాద –  ఇత్యనేన  సీతాపరిణయ పర్యవసానే బాలకాండ కథా   ---- ఇచ్చట మా అనే మాటకువద్దు ,కూడదు , అనే నిషేధార్ధం కాకుండా మా అంటే లక్ష్మీఅనే అర్ధం తో సమన్వయం సాధించారు. ఇందిరా లోకమాతా మా అని అమరకోశం .                
         
           మా  లక్ష్మీ  : తస్యా: నిషాద : మానిషాద:   శ్రీనివాస: తత్రసంబుద్ధి  హే     శ్రీనివాస ! అని గోవిందరాజీయం.   లక్ష్మీ –నివాస ఇతి మా లక్ష్మీ నిషీదత్యస్మిన్నితి మా నిషాద తత్సంబోధనం హే మా నిషాద  విష్ణో: అని తత్త్వ దీపికా వ్యాఖ్యానం.  

                                  అదేవిదంగా    .........           ప్రతిష్ఠాం త్వ మగమ        అన్న రెండవ పదానికి     పితృవచన పరిపాలనా ప్రతిష్ఠాభిధాయిన్యయోథ్యకాండ కథా--- . అని పితృ వాక్యపరి పాలన  పూర్వక అయోథ్య కాండ ను,


           శాశ్వతీ స్సమా ---- అన్న మూడవ పదానికి ……    శాశ్వతీ స్సమా ఇత్యనేన  ఋషిగణ విషమ ప్రతిజ్ఞా నిర్వహణేన ప్రతిష్ఠానువృత్తి మభిదధ త్యరణ్యకాండ కధా సూచితా  ----  అని ఋషి సంరక్షణ ప్రతిజ్ఞా పరిపూర్తి  యనెడు -అరణ్య కాండ ను ,

         కామమోహితం ---  అన్న  పదానికి ....... కామమోహితం సుగ్రీవ భార్యాపహర్తారం వాలిన మవధీరితి కిష్కింధకాండ కథా అభిహితా ......అని   సుగ్రీవుని భార్యను అపహరించిన  కాముకుడైన వాలి వధ ను పూర్తి చేసిన కిష్కంధ కాండను,

          క్రౌంచా...... తయోరన్యోన్య విరహ క్లేశ కృశీయశో సీతారామయోరేక మవయవం సీతా రూప మవథీ భృశం పీడితవానసీతి  సీతా విరహ వర్ణన పరా సుందర కాండ కథా స్పోరితా .... అని సుందరి యైన సీతా విరహ వర్ణన పరంగా సుందర కాండ ను ,

   “...... క్రౌంచౌ కుటిలౌ రాక్షసాత్త న్మిథునాదేకం కామమోహితం రావణమ వథీరితి యుద్ధకాండ కథా సూచితా..... కామమోహితుడై  మోసంతో  ఒక జంటను  విడదీసిన రావణుని వథను   చెప్పే యుద్దకాండ తోను,   ........... సమన్వయించారు. 
                                                                    
        శ్రీమద్రామాయణ మహాకావ్యానికి నాందీగీతమైన ఈ శ్లోక ప్రాథాన్యాన్ని  ఒక్కసారి విజ్ఞులతో కలిసి పంచుకొని, రామాయణ ఔన్నత్యాన్ని, దాన్ని అందించిన మహనీయుల  మహదౌన్నత్యాన్ని మరొక్కసారి గర్వంగా స్మరించుకోవడానికి  చేసిన  చిన్న ప్రయత్నం   ఇది.

 ########  జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి  #########
                                                                                                                               

Tuesday 25 September 2012

రామాయణము-రమణీయ కధనాలు--5 అహల్య--2

               


                అ హ ల్య       
                                             రెండవ భాగము
                      
                     











                     అహల్యా శాప విమోచనానంతరం మిధిల లో ప్రవేశించిన విశ్వామిత్రుడు శతానందుని తో రేణుక జమదగ్నిని కలిసినట్లు నీ మాతృమూర్తి అహల్య నీ తండ్రిని కలిసింది అంటాడు. ఇచ్చట రేణుకా జమదగ్నుల ప్రస్తావన రాబోయే పరశురాముని ఆగమనాన్ని సూచిస్తోంది .
             
   
                                          సీతా – అహల్య ల వృత్తాంత్తాల్ని  ఏకముఖంగా పరిశీలిస్తే రెండు విషయాల్ని మనం గుర్తించవచ్చు.అహల్యా గౌతముల పున స్సమాగమం తర్వాతే  సీతారామ కళ్యాణం జరగాలన్నది ఆది కవి నిర్ధేశం. శ్రీ సీతారామ కళ్యాణానంతరం  భార్గవ రాముని ఆగమనం అనివార్యం .ఆ విషయం తెలియజేయడానికే రేణుక జమదగ్ని ని  కలిసినట్లు అహల్య గౌతముని కలిసింది అని చెప్పడం జరిగింది. ఆ మాట చెప్పింది అహల్యా గౌతముల కుమారుని తో విశ్వామిత్రుడు. రేణుకా జమదగ్నుల కుమారుడు ముందు రాబోతున్నాడు. రామచంద్రుణ్ణి  శ్రీ – రామునిగా, కళ్యాణ రామునిగా , శతానందుడు చేస్తే - రానున్న భార్గవుడు రాముణ్ణి కోదండరాముణ్ణి చేస్తాడు. ఇది ఒకతరం[ అవతారం} వేరొకతరానికి అథికారాన్ని బదలాయించే  సంధియుగం .  ఇది మహర్షి భావన.
                
              యాగ సంరక్షణ లో విజయులై  విశ్వామిత్ర ద్వితీయులుగా  మిథిలానగరానికి బయలుదేరారు రామలక్ష్మణులు.

                                విశ్వామిత్రుని గాథలతోను, రామలక్ష్మణుల ప్రశ్నలతోను దారి తరిగి పోతూ కాలం కరిగి పోతూ ఉంటే మిథిలోపవన ప్రాంతానికి చేరారు ముగ్గురు. వన్నెతరిగిన బంగారంలా, మేఘావృతమైన చంద్రబింబంలా  మాసిన అద్దంలోని ప్రతిబింబం లా అణగారిన కాంతితో ప్రకాశిస్తున్న గౌతమాశ్రమాన్ని చూచి, ప్రశ్నించాడు   శ్రీరామచంద్రుడు. వెంటనే హంత! తే కథయిష్యామి’” అంటూ నిట్టూర్పు విడిచాడు విశ్వామిత్రుడు. భక్తులకొఱకు కదలివచ్చిన కరుణాథాముడు  శ్రీరాముడు. భర్తృసాన్నిథ్యానికి దూరమై తపిస్తున్న సాథ్వీమతల్లి అహల్య.ఆమెకు శాపమోక్షాన్ని కల్గించఢాని కై రాముడు ప్రశ్నించాడు. రాముని ప్రశ్న వినగానే  
హంత అన్నాడు విశ్వామిత్రుడు.

                 ఆ నిట్టూర్పు లో ఎంతో ఆనందం. ---    ఒక మహర్షి దంపతులను ఏకం చేసే శుభసమయం  ఆసన్నమైందనే ఆనందం. ఆ ఆనందానికి తాను ఆథారమౌతున్నాననే ఉద్వేగం.  ఎంతోకాలంగా కొనసాగుతున్న అహల్యాదేవి తపస్సు  సఫలీకృతం కాబోతోందన్న  ఉత్సాహం విశ్వామిత్రుని చేత హంతఅనిపించింది.  ఎంతో బరువు  దిగిపోయినప్పుడు మనలో నుండి వచ్చే దీర్ఘ నిశ్వాసకు ప్రతిపదమే  ఈహంత అనేది.

             శ్రీ రాముని పాదథూళి సోకి, అదృశ్య , నిరాహారయై తపిస్తున్న అహల్యకు అసలు రూపం వచ్చింది . గౌతమాశ్రమం లో కలకూజితాలు థ్వనించాయి.   ఫలవృక్షాలు చిగిర్చి పుష్పించి , ఫలవంతాలు కాగా            పూ బాలలు  శిరసు లూపి అతిథులను ఆహ్వానిస్తున్నాయి.     ఉగ్ర తేజ స్సంపన్నుడైన గౌతమ మహర్షి ఆశ్రమం లోకి ప్రవేశించాడు.        ఆపుణ్యదంపతులకు పాదాభివందనం చేసి , వారి ఆశీస్సులను పొంది, మిథిలకు ప్రయాణమయ్యారు కుశికసుత దాశరథులు.

                               మిథిలలో ప్రవేశించిన రాముడు    శ్రీ రాముడై     కళ్యాణ రాముడైనాడు. గౌతమాశ్రమంలో  దంపతీ పూజ చేయించి పెళ్లికొడుకుగా రాముని మిథిలానగరంలోకి  ప్రవేశింపజేశారు వాల్మీకి.    ఇది ధర్మయుత ఆర్షసంస్కృతికి చిహ్నంగా భాసించింది. ....... తన తల్లిని తండ్రితో కలిపిన  పరంథాముడగు    శ్రీ రాముని పూజించాడు శతానందుడు . సీతను రామున కిచ్చునట్లుగా ఏర్పరచి దైవఋణం తీర్చుకున్నాడు. రఘురాముడు సీతారాముడు    కాగా లక్ష్మణు   డు ఊర్మిళో పేతుడైనాడు . ఆ యదృష్టం అహల్యా గౌతముల  ఆశీ: ప్రభావమే నని భావించవచ్చు. ఇది వాల్మీకి మహర్షి కల్పన.

                ఈ ఘట్టంలో  విశ్వామిత్రుడు  చెప్పిన వృత్తాంతంలో అహల్య దోషిగా  “దేవరాజ కుతూహలాత్ అనే పదం వలన ముద్ర  వేయబడింది. బ్రహ్మ మానస పుత్రి,  మహర్షి పత్ని  దేవరాజ కుతూహలయై జార యైంది.   సురకార్యార్థమిద మని ఇంద్రుడు    తప్పించుకున్నా మగవారి రాచకార్యాలకు ఆడది గా అహల్య బలైంది. జారగా మిగిలింది. అందుకే  ఉత్తరకాండ లో   ఇంద్రుని   గౌతముని గా భావించి {–త్వద్రూపేణ దివౌకసా- } అహల్య ఏకశయ్య అయినట్లు చెప్పి, బాలకాండలోని మాలిన్యాన్ని కొంత  ప్ర క్షాళన  చేయఢానికి ప్రయత్నించినట్లు  కన్పిస్తుంది. కాని ఆడదాని మీద పడిన అపవాదు గాయం మానినా మానిపోని మచ్చలాగా శాశ్వతంగా మిగిలిపోతుంది. అహల్య విషయంలో అదే జరిగింది .         వేదాలలో    ప్రతీకాత్మకంగా    వాడిన  అహల్యాయైజార శబ్ధం అనంతర కాలికుల కావ్యాల్లో, కల్పనల్లో రెక్కలు విదిల్చి విహరించి తుదకు  అశ్లీలార్థ కథలకు  అలవాలమైంది.


             వాల్మీకి మహర్షి నైతికవర్తనను , ధానిపై సమాజానికున్న బాథ్యతను తెలియజెప్పడానికి థర్మ ప్రబోధాత్మకంగా అహల్యా వృత్తాంతాన్ని వ్రాశారు.  బ్రహ్మమానసపుత్రికయైనా ,మహర్షిపత్ని యైనా  తప్పుచేస్తే  శిక్ష తప్పదన్న హెచ్చరిక , థర్మ ప్రకటనం మహర్షి ఉద్దేశ్యం. అయితే పసివారికి నిప్పు కాలుతుందని తెలియజేయడానికి సెగ చూపిస్తే సరిపోతుంది కాని అంగవైకల్యం సంభవించేటంతగా కాల్చలేము గదా. అహల్య విషయంలో రెండవదే జరిగింది .అస్తిత్వానికే లోపం ఏర్పడింది. బాలకాండ – ఉత్తరకాండ కథల నడుమనున్న అంతరాన్ని పరిశీలిస్తే అహల్యా శీల  సంరక్షణకు మహర్షి చేసిన ప్రయత్నం మనకు అర్థమౌతుంది  .
      
       అహల్యాజారుడైన ఇంద్రుని శపించి, అహల్యను సైతం వాయుభక్షా నిరాహారా తప్యంతీ భస్మశాయినీ   అంటూ అదృశ్యగా పెక్కేండ్లు తపించి రామచంద్రుని పాద స్పర్సచే ఫవిత్రీకృత గాత్ర కావలసిందని వాల్మీకంలో గౌతముని ఆజ్ఞ. కాని – అథ్యాత్మరామాయణం లో అహల్య రాయిగా మారినట్లు చెప్ప బడింది.

                  దుష్టే త్వం తిష్ట దుర్వృతే శిలయా2శ్రమే మమ
                 నిరాహారా దివారాత్రం తప: పరమమాస్థితా!!                  { అ.రా. బాల.5   ]

     అదేవిథంగా ఆనంద రామాయణ ,సత్యోపాఖ్యానాలయందు సైతం అహల్య కు శిలా రూపమైన శాపమే కన్పిస్తుంది. తులసీదాసు కూడ అహల్య ను శిలారూపంగానే ధర్శించారు. బ్రహ్మపురాణంలో—

                          తామప్యాహముని: కోపాత్ త్వం చ శుష్కనదీ భవ
                          నదీభూత్వా పునారూపం ప్రాప్య్ససే ప్రియ కృన్మమ!!

    అంటాడు గౌతముడు.ఎండిపోయిన నదిగా శాపం.గౌతమీనదితో కలిసి నప్పుడు విమోచనం చెప్పబడింది. పధ్మపురాణం లో ---

                 అస్థి చర్మ సమావిష్టా నిర్మాంసా నఖవర్జితా....... చిరంస్థాస్యసి--  {  ప.పురా.సృ. 158-43]

ఎముకలు చర్మము తోను మిగిలి మాంసము గోళ్లు లేని దానివై నలుగురు చూచుచుండగా చిరకాల ముండవలసినది గా శాపం అహల్య కు కన్పిస్తుంది .            

                       . అస్యా దోషో న చైవాస్తి  దోషో2యం పాకశాసనే “ {సృ.158.38] అని పద్మపురాణం లో రామచంద్రుడు అహల్యను సమర్థించడం సైతం మనకు కన్పిస్తుంది.    ఇక    విచిత్ర రామాయణాదుల్లో కన్పించే కథలు మరీ అశ్లీల ద్యోతకాలు.  

                   ఈవిథంగా  వేదవాజ్ఞ్మయం నుండి లౌకిక వాజ్ఞ్మయం మీదుగా ఆథునిక వాజ్ఞ్మయం వరకు 
అహల్యా వృత్తాంతం  పలువిథాలుగా మనకు కన్పిస్తుంది .   




*****************************************************************************








Friday 21 September 2012

రామాయణము -- రమణీయకధనాలు –5 - అ హ ల్య-1


                 అ హ ల్య                  ప్రథమ భాగము

                          



   శ్రీ   బ్రహ్మ మానస  పుత్రిక యై మహర్షి, మంత్రద్రష్ట, న్యాయసూత్ర ప్రణేత, అక్షపాదుడు నైన గౌతమ మహర్షిని పరిణయ మాడి పంచకన్యలలో ప్రథమతాంబూలం అందుకుంటున్న పతివ్రతా శిరోమణి అహల్య.
       

    హలం నామేకహా వైరూప్యం హల్యం తత్ప్రభవం భవేత్
          యస్యా నవిద్యతే హల్యం తేనాహల్యేతి విశ్రుతా !!   {వా. ఉ.-30.29 ]

హల్య మనగా వైరూప్యం. అది లేనిది అహల్య. సర్వాంగసుందరి గా సృష్టికర్త చేతనే ప్రశంసించబడిన సౌందర్యం అహల్య ది. కాని- ఈమె పై చెలరేగినంత దుమారం సాహిత్యలో మరే పాత్ర మీద లేదంటే అతిశయోక్తి కాదు. వేదవాజ్ఞ్మయం నుండి దక్షిణాంథ్ర సాహిత్యం మీదుగా ఆధునిక సాహిత్యం వరకు అహల్య అనేక రూపాల్లో మనకు దర్శనమిస్తోంది. తైత్తిరీయారణ్యకంలో ఇంద్రుణ్ణి యాగానికి ఆహ్వానించే సందర్భంలో  ---
                    
                              ఇంద్రాగచ్ఛ హరివ ఆగచ్ఛమేథాతిథే :
                           మేషవృషణశ్వస్య మేనే గౌరావస్కంది న్నహల్యాయై జార                                                                                                                  
                           కౌశిక  బ్రాహ్మణ గౌతమ బ్రువాణ “  { కృ.య.తై.ఆరణ్యకం—2-70}
 గౌతమ- అహల్య- ఇంద్ర- కౌశిక  అనునవి రామాయణ పాత్రలు. శ్రీరామచంద్రుడు ఆ పాత్రలను పునీతం చేశాడు. పైమంత్రానికి విద్యారణ్యుల వారి భాష్యాన్ని పరిశీలిస్తే –-  హే ఇన్ద్ర పరమైశ్వర్యయుక్త : ఇహ 
కర్మణ్యాగచ్ఛ హరివ- హరినామక అశ్వౌ అస్య విద్యతే  ...  ...     ..... తస్మిన్నర్థే వృషణశ్వస్య మేనే
ఈరీతిగా వైదికపరంగా కొనసాగిన వ్యాఖ్యానంలో అహల్యాయై జార అన్న పదానికి—అహల్యా గౌతమస్య భార్యా తస్యా ఇంద్రే జార ఇతి పురాణే ప్రసిద్థం అని వదిలి వేయడం మనం గమనించవచ్చు.
                   
     శ్రీ కుమారిలభట్టు తన తంత్రవార్తికంలో వేదములందలి ఇంద్రాహల్యల ప్రస్తావన ను  వివరిస్తూ --  చంద్రుడే గౌతముడు. గో శబ్దమునకు ఉత్తమ కిరణములని యర్థము.

{ సర్వేపి రశ్మయ: గావ ఇత్యుచ్యంతే . చంద్రుని యొక్క భార్య యగు రాత్రియే అహల్య.
అహ: లీయతే యస్యాం సా అహల్య—పగలు దేనియందు ముగియునో అది అహల్య – అనగా రాత్రియే అహల్య. ఇంద్రుడనగా పరమైశ్వర్యసంపన్నుడగు సూర్యుడు అని అర్థము.
             
      కనుక ఇంద్రశబ్దవాచ్యుడగు సూర్యుడు ఉదయింపగానే అహల్య అనగా రాత్రి  నశించిపోతోంది. కావుననే ఇంద్రుడు అహల్యాయై జార --అని సంబోథించ బడుచున్నాడు. 
                      
        నిరుక్తంలో  ” అహల్యా యై జార అను శ్రుతివాక్యాన్ని  వ్యాఖ్యానిస్తూ—ఆదిత్యో2త్ర జార ఉచ్యతే రాత్రే ర్జరయితా “-- అనగా సూర్యుడే ఇంద్రుడు . రాత్రిని ఫోగొట్టుటచే అతడు అహల్యాయై జార అని సంబోధించబడుచున్నాడు.
        భట్ట భాస్కరులు అహల్యాజారుడనగా వాక్పరిణామకారకుడగు ఇంద్రుడని, గౌరావస్కంది....అన్న  మంత్రంలోని గౌర శబ్దమునకు ఆద్యంత గ్రహణం చేత  గౌతమ దార అని  వ్యాఖ్యానించారు.
          
     ఈ వివరణల్ని పరిశీలిస్తే   గౌతమ-అహల్య- ఇంద్ర శబ్దాలు వేదంలో ప్రతీకాత్మకంగా ప్రయోగించ బడ్డాయని తెలుస్తుంది . కాని – వేదాలకన్న భిన్నంగా రామాయణాది కావ్యాల్లో రమణీయేతివృత్తంగా అహల్య కథ రూపు దాల్చింది. రామాయణంలో అహల్యా వృత్తాంతం రెండు ప్రదేశాల్లో కన్పిస్తుంది. బాలకాండ లోని వృత్తాంతంలో అహల్య దోషిగా కన్పిస్తుంటే –ఉత్తరకాండ లోని వృత్తాంతం ఆ దోష పరిహారార్థం చెప్పబడినట్లు కన్పిస్తుంది.  బాలకాండ కథలో ఇంద్రుడు గౌతమమహర్షి వేషంలో వచ్చినట్లు తెలిసి కూడ అహల్య- ఇంద్రునిపై మక్కువతో ---
          
               ముని వేషం సహస్రాక్షం  విజ్ఞాయ రఘునందన
             మతిం చకార దుర్మేథా దేవరాజ కుతూహలాత్ !!  { వా.బాల.48-19}                                                                              

ఇంద్రునకు తనను తానుగా అర్పించుకున్నట్లు వ్రాయబడగా, ఉత్తరకాండలో ఆమె తెలియకపోవుటచే తన భర్త యే ననుకొని అతని కోరిక తీర్చినట్లు వ్రాయబడింది.
                   అజ్ఞానాత్ ధర్షితా విప్ర  త్వద్రూపేణ దివౌకసా                                                                                                        
           న కామకారాత్ విప్రర్షే ప్రసాదం కర్తు మర్హసి  వా-ఉ.కాం.30-44}
      
  --- అని ప్రార్థిస్తుంది అహల్య. బాలకాండ కథలో అహల్య పాపనిష్కృతిని పొందగా ఉత్తరకాండలో ఇంద్రుడు పాప పరిహారాన్ని పొందాడు. గౌతమ మహర్షి శాపాన్ని పొందిన ఇంద్రుడు ---- 
     

        కుర్వతా తపసో విఘ్నం గౌతమస్య మహాత్మన  :
       క్రోధ ముత్పాజ్య హి మయా సుర కార్య మిదం కృతం  {వా.ఉ .కాం.49-2}

సురకార్యాన్ని నిర్వహించ గలిగానన్న తృప్తితో దేవలోకానికి వెళ్లి పోతాడు. ఇది క్లుప్తంగా  అహల్యా వృత్తాంతం.
      
   రావణుడు సీతను అపహరించాడు. రాముడుద్థరించాడు. అక్కడ సీత ఏఅపచారం చేయలేదు. కాని రాముడాగ్రహించాడు. సీత అగ్నిప్రవేశం చేసింది. అగ్నిపునీతయైన సీత దీప్తామగ్నిశిఖామివ అన్నట్లు ప్రకాశించింది వాల్మీకంలో.
                  
      దేవకార్యం కోసం ఇంద్రుడు అహల్యను చేరాడు. గౌతముడు కోపించాడు -శపించాడు . రామచంద్రుడుద్థరించాడు. తపించిన అహల్య దీప్తామగ్నిశిఖామివ వలె ప్రజ్వరిల్లింది.    పునీతలైన  సీత- అహల్య లిద్దరికి ఒకే విశేషణం వాడటంలోని మహర్షి అంతర్యం అత్యంత నిగూఢము. అతి పవిత్రము కూడా.
               

   హల మనగా నాగలి .  సీత – నాగేటి చాలు. అనగా నాగలి చే ఏర్పడింది.
                             
   ఇది       అహల్య       మొదటి భాగము


***********************************************************