Tuesday 17 June 2014

శతకసౌరభాలు -3 మారన భాస్కర శతకము -1

 శతక సౌరభాలు - 3                           
                               మారన  భాస్కర శతకము - 1
                                       
                                       

                                                   
                                                   ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్


                                      తెలుగు భాషలో  ప్రసిద్ధి పొందిన నీతి శతకాల్లో  సుమతి ,వేమన శతకాల తర్వాత విస్తృత ప్రచారాన్ని పొందిన శతకం  ఈ భాస్కరశతకం.  కాని దీన్ని వ్రాసిన కవి పేరు కాని , కాలం కాని  ఇప్పటికీ   నిర్ణయం కాలేదు. కవిపేరు మారన వెంకయ్య అని తాళపత్ర ప్రతుల ఆధారంగా బ్రౌను దొర భావించారు. కవిపేరు వెంకయ్య అని , అతని తండ్రిపేరు మారన  అని  కొందరు ఊహిస్తున్నారు.         ఇది సూర్యనారాయణ వరప్రసాద లబ్ద కవితా మహత్మ్యంబున మారవి కృతం బగు భాస్కర శతకము అష్టోత్తర (శత ) వృత్తములు సంపూర్ణం  “ అనే శతకాంత గద్య మొకటి మద్రాసు ప్రాచ్య లిఖిత పుస్తక భాండారములోని  భాస్కర శతక ప్రతి లో ఉండటం వలన ఈ శతక రచయిత  సూర్య వరప్రసాదియై , ఆయన నుద్దేశించి భాస్కరా అనే మకుటం తో శతకాన్ని వ్రాశాడని కొందరు భావిస్తున్నారు. కాని  పేరు మారవి  “ అని ఉంటుందా అనేది ఒక సందేహం .  అయితే  పైన గద్యంలో    ‘మార(నక)వి అని రాయాల్సింది వ్రాయస గాని స్కాలిత్యం వలన మారవి ఏర్పడిందేమో ? అనుకుంటే.
               
                                “ భాస్కరా అనే మకుటం తో వ్రాయబడిన ఈ శతకం లో 109 పద్యాలున్నాయి.  ఈ కవి కి ఉన్నకావ్య ,పురాణ , ఇతిహాస  పరిజ్ఞానం ఈ శతకానికి ఒక ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి.  తాను చెప్ప దలచుకున్న విషయాన్ని ముందు గా   చెప్పి ,        దానిని సమర్ధిస్తూ  ఒక దృష్టాంతాన్ని కవి వివరిస్తాడు. అది కూడ ప్రసిధ్ధమైన   రామాయణ ,భారత ,భాగవతాదుల నుంచో, వివిధ పురాణాల నుంచో ,కావ్యాలనుంచో తీసుకోవడం వలన పద్యభావం సూటిగా పాఠకుని హృదయానికి హత్తుకుపోయే అవకాశముంది . పద్యరచనా శైలి కూడ ఈ శతకానికి శాశ్వతత్వాన్ని కల్గించిందని చెప్పవచ్చు. అందుకే తెలుగులో వెలసిన దృష్టాంత శతకాలలో భాస్కర శతకం విశిష్టమైంది గా విమర్శకులు భావిస్తున్నారు.

                            కవి కాలాన్ని గురించి కూడ  స్పష్టత లేదు. ఈ భాస్కర శతకం లోని ఒక పద్యం  అప్పకవీయం లో ఉదాహరించబడింది. అప్పకవి కాలం  క్రీ. శ. 1656. అంటే అప్పటికే ఈ శతకం  ఆంధ్రదేశం లో బాగా ప్రచారాన్ని పొంది ఉండాలి. అందుకు కనీసం ఒక 70 , 80 సంవత్సరాలు పడుతుంది .కాబట్టి ఇతని కాలం సుమారు  క్రీ .శ 1550- 1600 ప్రాంతం అయి ఉండవచ్చు నని విమర్శకుల భావన.

                                            కవి ఎవరో సరిగా తెలియక పోయినా    ఐదు వందల సం.లకు పైగా  ఆంథ్రదేశం  లో ఈ శతకం ప్రజల నాలుక ల పై నిలిచి ఉందంటే ఈ నీతి శతక విశిష్టతను మనం అర్ధం చేసుకోవచ్చు. ఇంతకు పూర్వం వలెనే ఈ శతకానికి కూడ తేజస్విని  పేరుతో వ్యాఖ్యానాన్ని అందిస్తున్నాను. సహృదయంతో  స్వీకరిస్తారని ఆశిస్తున్నాను.
                       

శ్రీ గల భాగ్యశాలి కడఁ జేరఁగవత్తురు తారుదారె దూ
రాగమన ప్రయాసమున కాదట నోర్చియు నైన నిల్వ ను
ద్యోగము చేసి,  రత్ననిలయుండని కాదె సమస్తవాహినుల్
సాగరు జేరుటెల్ల మునిసన్నుత మద్గురుమూర్తి భాస్కరా !

                     మునీశ్వరుల చేత స్తుతించబడెడి నా గురుదేవులైన శ్రీ సూర్యభగవానుడా !   సంపన్నుని వద్దకు జనం తమంత తాము గా   ఎంతో ప్రయత్నం చేసి  వచ్చి చేరుతూ ఉంటారు. అది సహజం. ఎందుకంటే సముద్రుడు రత్ననిలయుడనే కదా నదులన్నీ వచ్చి సముద్రంలో కలుస్తున్నాయి..

అంగన నమ్మరాదు తన యంకెకు రాని మహాబలాఢ్యు వే
భంగుల మాయలొడ్డి చెఱుపం దలపెట్టు ,  వివేకి యైన సా
రంగధరు బదంబులు కరంబులు గోయగజేసెఁ దొల్లి చి
త్రాంగి యనేకముల్ నుడువరాని కుయుక్తులు పన్ని భాస్కరా !

                        భాస్కరా! ఆడవారిని నమ్మరాదు . తనకు లొంగని పురుషుడు ఎంత బలాఢ్యుడైనను  కుట్రలు పన్ని అనేకమైన మాయోపాయాల చేత  పాడుచేయడానికి  ప్రయత్నిస్తారు.  పూర్వము చిత్రాంగి యను ఒక ఆడది ,  సారంగధరుడు  వివేకవంతుడై   ఆమె ప్రేమను తిరస్కరించాడనే  కోపం చేత అనేక కుయుయక్తులు పన్ని అతని కాళ్ళు చేతులు నరికించింది కదా !

                                         చిత్రాంగి  రాజరాజనరేంద్రుని రెండవభార్య. మొదటిభార్య కుమారుడైన సారంగధరుని వలలో వేసుకొవాలని చూసింది. ఆ ఆటలు సాగక పోవడం తో  మహారాజైన రాజరాజు తో  సారంగధరుని పై పితూరీలు చెప్పి ,చివరకు అతని కాళ్ళు చేతులు నరికించిదని సారంగధర చరిత్ర

అక్కఱ పాటు వచ్చు సమయంబునఁ జుట్టము లొక్కరొక్కరి
న్మక్కువ నుద్ధరించుటలు మైత్రికిఁ జూడగ యుక్తమే సుమీ
యొక్కట ,నీటిలో మెరక నోడలుబండ్లును , బండ్లనోడలున్
దక్కక వచ్చుచుండుట నిదానము గాదె తలంప భాస్కరా !

                         భాస్కరా ! అవసరం వచ్చినప్పుడు బంధువులు ఒకరి కొకరు సహాయం చేసుకోవడం , ఇచ్చిపుచ్చుకోవడం సహజమే కదా. ఎందుకంటే అవసరమైనప్పుడు నీటిలో ఓడల మీద బండ్లను , నేలపై బండ్ల మీద ఓడలను  తరలించుకెళ్లడం చూస్తూనే ఉన్నాం కదా!

అతి గుణహీన లోభికిఁ బదార్ధము గల్గిన లేక యుండినన్
మితముగఁ గాని కల్మిగల మీదటనైన భుజింపడింపుగా
 సతమని నమ్ము  దేహమును సంపద ,నేఱులు నిండి పాఱినన్
గతుకగఁ జూచుఁ గుక్క తన కట్టడ మీఱక యెందు భాస్కరా !

                     భాస్కరా ! గుణహీనుడైన లోభివాడు పదార్ధం ఉన్నా, లేకపోయినా  కొంచమే  తింటుంటాడు.  సంపద ఉన్నా కూడ ఈ సంపద ,  ఈ శరీరము శాశ్వతమనుకొంటూ   కొంచంగానే  తింటాడు.   ఏఱు నిండుగా నీరు ప్రవహిస్తున్నా గతకటానికి అలవాటు పడిన కుక్క అలానే   నాలుకతోనే  గతుకుతూ  త్రాగుతుంది కదా ! 

అదను దలంచి కూర్చి ప్రజనాదర మొప్ప విభుండు కోరినన్
గదిసి పదార్ధ మిత్తు రటు కానక వేగమె కొట్టి తెండనన్
మొదటికి మోసమౌఁ బొదుగు మూలము గోసిన బాలు వచ్చునే
పిదికినఁ గాక భూమిఁ బశుబృందము నెవ్వరికైన భాస్కరా !

                          భాస్కరా ! ప్రజారంజకుడైన రాజు అవసర సమయంలో  ప్రజలను ధనమడిగినా కూడ  ఇస్తారు. అట్లా కాకుండా వారిని పీడించి , శాసిస్తే మొదటికే మోసం వస్తుంది. ఏ విధంగా నంటే  పాలకోసం పశువుల పొదుగు పిదికితే పాలు వస్తాయి కాని పొదుగు కోస్తే రావు కదా !

అలఘు గుణ ప్రసిద్ధుడగు నట్టి ఘనుడొకఁ డిష్టుడై తనున్
వలచి యొకించు కేమిడిన వానికి మిక్కిలి మేలు చేయుగా
తెలిసి కుచేలుఁ డొక్క కొణిదెం డటుకుల్ దన కిచ్చినన్ మహా
ఫలదుఁడు కృష్ణుఁ డత్యధిక భాగ్యము నాతని కీఁడె భాస్కరా !

                  భాస్కరా !  గుణవంతుడు ఎప్పుడు తనను మెచ్చి వచ్చిన స్నేహితుడు ఏమిచ్చినను అతనికి గొప్పప్రయోజనమే చేకూరుస్తాడు. ఏవిధంగా నంటే   మహానుభావుడైన శ్రీకృష్ణ భగవానుడు  తనకు చారెడు అటుకుల నిచ్చిన సుదాముడనే కుచేలునికి గొప్పభాగ్యముల నందించాడు కదా !

అవని విభుండు నేరుపరియై  చరియించిన గొల్చువార లె
ట్లవగుణులైన నేమి , పనులన్నియు జేకుఱు వారిచేతనే 
ప్రవిమల నీతి శాలియగు రాముని కార్యము మర్కటంబులే
తవిలి యొనర్పవే  జలధి దాటి సురారుల ద్రుంచి భాస్కరా !

                    భాస్కరా  ! ఈ భూమి మీద రాజు నేర్పరి యైతే సేవకులు చేతకాని వాళ్లైనా ఆ పనులన్నీ  చక్కగా సమకూరుతూనే ఉంటాయి. ఎలాగంటే గొప్ప రాజనీతిజ్ఞుడైన శ్రీరామచంద్రుని కార్యాన్ని , వానరులే పూనుకొని , సముద్రాన్ని దాటి  , రాక్షసుల చంపి , ఘనకార్యాన్ని సాధించారు కదా !

 ఆదరమింత లేక నరుఁ డాత్మ బలోన్నతి మంచివారికిన్
ఖేదము చేయుటం దగదు పేర్మికిఁ గీడగు మూలమెట్ల మ
ర్యాద హిరణ్యపూర్వకశిపన్ దనుజుండు గుణాఢ్యుడైన ప్ర
హ్లాదున కెగ్గు జేసి ప్రళయంబును బొందడె మున్ను భాస్కరా  !

                భాస్కరా  !మానవుడు ఏ మాత్రం ప్రేమ లేకుండా తనకు బలముంది కదా అని మంచి వారిని బాధిస్తే తప్పక అతనికి చేటు కలుగు తుంది. పూర్వము హిరణ్యకశిపుడను రాక్షసుడు సద్గుణుడైన తన కుమారుడు ప్రహ్లాదునకు హాని తలపెట్టి నశించిన విషయం తెలిసిందే కదా !

    ఈ జగమందు దా మనుజుడెంత మహాత్మకుడైన దైవమా
   తేజముతప్పఁ జూచునెడఁ ద్రిమ్మరికోల్పడు  నెట్లన న్మహా
   రాజకుమారుడైన రఘురాముడు గాల్నడఁ గాయలాకులున్
   భోజనమై తగన్వనికిఁ బోయి చరింపడె మున్ను భాస్కరా !

                           భాస్కరా  !  ఈ లోకం లో మానవుడు ఎంతగొప్పవాడైనను దైవమతనికి అనుకూలం గా లేనప్పుడు ,  గొప్పతనమంతా పోయి , దేశ సంచారియై తిరగవలసి వస్తుంది. ఏ విధంగా నంటే పూర్వం మహారాజకుమారుడైన శ్రీ రామచంద్రుడు దైవము కూడ  తప్పచూచుటచేతనే  కదా అడవికి పోయి , కాయలు,  ఆకులు తింటూ అడవిలో తిరగవలసి వచ్చింది .

ఉరు కరుణాయుతుండు సమయోచిత మాత్మ దలంచి యుగ్ర వా
క్పరుషత జూపినన్ ఫలము గల్గుట తథ్యము గాదె యంబుదం
బురిమిన యంతనే కురియకుండునె వర్షము లోకరక్షణ
స్ధిరతర పౌరుషంబున నశేష జనంబు  లెఱుంగ భాస్కరా !

                      భాస్కరా! గొప్పకరుణాహృదయుడైన వాడు సమయానుకూలముగా వాక్పారుష్యము ప్రదర్శించినను అది సత్ఫలితాన్నే అందిస్తుంది. ఏ విధంగా నంటే మేఘుడు భయంకరంగా ఉరిమినా వెనువెంటనే జనులను రక్షించాలనే దీక్షతో ఆనందము కల్గునట్లు వర్షించును గదా. !

ఉరుగుణవంతుడొర్లు తనకొండపకారము సేయునప్పుడుం
బరహితమే యొనర్చు నొకపట్టున నైనను గీడుఁ జేయగా
నెఱుఁగడు నిక్కమే కద యదెట్లన గవ్వముఁబట్టి యెంతయున్
దరువగ జొచ్చినం బెరుగు తాలిమి నీయదె వెన్న భాస్కరా !

                   భాస్కరా ! గుణవంతుడు ఇతరులు తనకు హాని చేయ ప్రయత్నించి నప్పటికి  ఓర్పువహించి  వారికి ఉపకారమే చేస్తాడు కాని కీడు తలపెట్టడు. పెరుగును చిలికెడి కవ్వము ఎంతగా పెరుగును చిలికినా అది వెన్నను ఇస్తుంది కదా !       

ఉరు బలశాలి నంచుఁ దను నొల్లని యన్య పతివ్రతాంగనా
సురతము గోరెనేని  కడసుమ్మది భూతికిఁ బ్రాణహానియౌ
శిరములు గూల రాఘవుని చే దశకంఠుడు ద్రుంగి పోవఁడే
యెఱుగక సీత కాసపడి యిష్టుల భృత్యులఁ గూడి భాస్కరా !

                 భాస్కరా !       మిక్కిలి బలవంతుడనని భావించి పురుషుడు తన యెడల ఇష్టములేని పతివ్రత ను బలవంతంగా పొందాలని ప్రయత్నిస్తే, ఆస్తి కి , తుదకు ప్రాణానికి కూడ చేటు వాటిల్లుతుంది.  రావణుడు సీతమ్మను కోరినందున నే కదా బంధు మిత్రులతో సహా యుద్ధరంగం లో శ్రీ రాముని చేతిలో తలలు తెగిపడి , సర్వనాశనమై పోయాడు. 


ఊరక వచ్చు బాటు పడకుండిన నైన ఫలం బదృష్ట మే
పారగ గల్గువానికిఁ ; బ్రయాసము నొందిన దేవదానవుల్
వార లటుండగా నడుమ వచ్చిన శౌరికిఁ గల్గెగాదె శృం
గారపుఁ బ్రోవు లక్ష్మియును గౌస్తుభ రత్నము రెండు భాస్కరా !

              భాస్కరా !  అదృష్టవంతుడు కి ఏమాత్రం కష్టపడకుండానే  అన్నీ కలిసొస్తుంటాయి. ఎందుకంటే  నానాబాధలు పడి దేవతలు రాక్షసులు కలసి పాల సముద్రాన్ని మధిస్తే , మధ్యలో వచ్చిన శ్రీ మహావిష్ణువునకు అందాలరాశి శ్రీమహాలక్ష్మి ,కౌస్తుభమణి లభించాయి కదా.!

ఊరక సజ్జనుం డొదిగి యుండిన నైన దురాత్మకుండు ని
ష్కారణ మోర్వలేక యపకారముఁ జేయుట వాని విద్యగా
చీరెలు నూఱుటంకములు చేసెడి వైనను బెట్టె నుండగా
జేరి చినింగి పోఁ గొఱుకు చిమ్మట కేమి ఫలంబు ? భాస్కరా !

                 భాస్కరా ! మంచివాడు ఒద్దికగా ఎంతగా సర్దుకుపోదామనుకున్నా చెడ్డవాడు తనకు ఎటువంటి లాభం లేకపోయినా మంచివాడికి  అపకారం చేస్తూనే ఉంటాడు .అది వాడి నైజం. ఏవిధంగా నంటే వందలరూపాయలు  విలువ చేసే చీరలు పెట్టెలో ఉంటే తనకు  ఏ లాభం లేకపోయినా చిమ్మటపురుగు పెట్టెలో చేరి ఆ చీరలన్నింటినీ చినిగిపోయేటట్లు కొఱికేస్తుంది కదా ! 

                                                            చదువుతూ ......... ఉండండి . మరికొన్ని  త్వరలో...


*********************************************************************************


No comments: