Friday, 21 November 2025

చందిప్ప - మరకతశివలింగం.

చందిప్ప- మరకతశివలింగము. శంకరపల్లి మండలము – రంగారెడ్డి జిల్లా. హైదరాబాద్.                    
                                తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం లో చందిప్ప అనే చిన్న గ్రామం ఉంది. ఈ గ్రామం లోని మరకతశివలింగం ఈ గ్రామం పేరు ను వెలుగులోకి తెచ్చింది. ఊరి బయట పొలాల్లో ఒక చిన్నగుడి లో బ్రహ్మసూత్రంతో కూడిన మరకతశివలింగం ఉందని మితృల వలన విని చూడ్డానికి వెళ్లిన నేను ఆశ్చర్యపోయాను. బ్రహ్మసూత్రంతో కూడిన అంత మరకతశివలింగం ఆలనా పాలనా లేకుండా ఒక కాపలా దారుని రక్షణ లో ఉండటం నాకు ఆశ్చర్యాన్ని కల్గించింది. మాకు మేమే స్వ హస్తాలతో స్వామికి అభిషేకం చేసుకొని ,కొబ్బరికాయ కొట్టుకొని , హారతి ఇచ్చుకొని ప్రశాంతంగా కాసేపు కూర్చొని , వెనుదిరిగాము .ఇది ఆనాటి మాట . మఱి నేను చేసిన పూజాఫలమో ఏమో గాని ఇప్పుడు ఆ గుడి భక్తుల తాకిడితో కళకళ లాడుతోందని చూసి ఆశ్చర్య పోవడం మళ్ళీ నావంతే అయ్యింది . అతి తక్కువ కాలం లో అతి ఎక్కువ మార్పు. అది ఈ మరకతశివలింగ ప్రభావం .
                                                మరకతశివలింగం - అమ్మవారు 

 ఇంతకీ ఈ ఆలయం హైదరాబాద్ కు సుమారు 40 కిలోమీటర్ల దూరంలోని శంకరపల్లి ప్రక్కనే ఉన్న చందిప్ప అనే గ్రామం లో ఉంది. ఈ మరకతశివలింగం క్రీ.శ1076-1120 మథ్య కాలం లో ఆంథ్రదేశాన్ని పాలించిన పశ్చిమచాళుక్యరాజులలో ప్రసిద్ధుడైన ఆఱవ విక్రమాదిత్యునిచే ప్రతిష్టించబడినట్లు శాసనాద్యాధారాల ద్వారా తెలుస్తోంది.
                                                       ఆఱవ విక్రమాదిత్యుని శాసనము.
                            
                                        ఈ ఆలయానికి కాలభైరవుడు క్షేత్రపాలకుడు గా ఉన్నాడు. లింగానికి వెనుకవైపున అమ్మ వారి విగ్రహం కన్పిస్తోంది. ఆలయప్రాంగణం లో చెట్టు క్రింద కాలభైరవుడు ,మరి కొన్ని శిథిలవిగ్రహాలు ఉన్నాయి. వాని కెదురుగా కన్పిస్తున్న శాసన స్థంభము 11 వ శతాబ్ధం లో ఈ ఆలయ నిర్మాణసమయం లో 6వ విక్రమాదిత్యుడు వేయించిన శాసనంగా చెప్పబడుతోంది. ఆ ప్రక్కనే కుడి చెవ్వు కొట్టివేయబడిన ఒక నంది విగ్రహం కన్పిస్తోంది . ఇదే ఈ ఆలయచరిత్ర ను మనకు చెపుతోంది. అదేమిటంటే .....
                                                             చెవ్వు విరిగిన నందీశ్వరుడు 

                                     నేను ఈ వ్యాసం లో ఇంతకుముందు చెప్పినట్లు ఇంతటి ఉన్నత విలువలుగల ఈ మరకతశివలింగం విదేశీదాడులను తట్టుకొని చెక్కుచెదరకుండా ఉందంటే ఆశ్చర్యం గానే ఉంటుంది .కాని స్థానికులు చెప్పుకునే కథనం ప్రకారం విదేశీయుల దండయాత్ర సమయం లో ఆ ముష్కరులు గుడి పై దాడి చేసి ముందుగా నందీశ్వరుని పై సమ్మెటతో ఒక్కవేటు వేశారని,వెంటనే ఒక భయంకరమైన ఆబోతు రంకె , ఆ వెనువెంటనే శివలింగం నుండి ఒక్కసారిగా భగ్గుమని మంటలు వచ్చాయని, అది చూసి భయపడిన సైన్యమంతా పారిపోయిందని చెపుతున్నారు. ఆ సమయం లోనే నందీశ్వరుని కుడిచెవ్వు దెబ్బ తింది మరకతశివలింగం మాత్రం ధ్వంసం కాకుండా ఉందని చెప్పుకుంటారు. ఇది సహజం. ఆ భగవంతున పై నమ్మకం తో ఇటువంటి కథనాలు చాల ఆలయాల విషయం లో మనకు విన్పడుతూనే ఉన్నాయి. ఏమైనా మరకతశివలింగం చెక్కుచెదరకుండా ఇప్పటికీ పూజలందుకోవడం విశేషం గానే చెప్పుకోవాలి. ఇదే ఆలయప్రాంగణం లో మరొక శివలింగం కూడ మరకతశివలింగానికి ఎదురుగా నవగ్రహ మండప సమీపం లో ప్రతిష్ఠించి,పూజిస్తున్నారు. ఈ శివలింగం కూడా ఈ ఆలయపరిసరాల్లో తవ్వకాల్లో లభించింది.దీనికి కూడ బ్రహ్మసూత్రం ఉంది. అంటే ఈ ఆవరణ లోనే రెండు బ్రహ్మసూత్రం గల శివలింగాలు పర్వదినాల్లో అభిషేకాలు చేసుకోవాడానికి భక్తులకు అందుబాటులోకి ఉండటం నిజంగా భక్తుల అదృష్టంగానే భావించాలి. ఎంతో పుణ్యం చేసుకుంటెనే గాని బ్రహ్మసూత్రం ఉన్న శివలింగ దర్శనభాగ్యం లభించదని పెద్దల మాట.

                                                              (మరకత శివలింగం 


                       అనంతర కాలంలో చెవ్వు విరిగిన నంది విగ్రహాన్ని చెట్టుక్రిందకు చేర్చి ,మరోవిగ్రహాన్ని గుడి లో ప్రతిష్టించారు. గర్భాలయం లోకి చూస్తే మరకతలింగానికి ప్రత్యేకం గా పానపట్టం కన్పించదు. అభిషేకజలం పోవడానికి సన్నని గట్టు కన్పిస్తుంది.ఇది కూడ ఈ ఆలయ ప్రాచీనత్వానికి ఒక ఉదాహరణ గా చెప్పవచ్చు.ఎందుకంటే మన దేశంలో గుప్తుల పరిపాలనా కాలం లోనే శివలింగాలకు ప్రత్యేకం గా పానపట్టాలు నిర్మించడం, ప్రకృతి,పురుషుడు అనే పరిపూర్ణ భావం తో పూజించడం ప్రారంభమైనట్లు పరిశోధకులు ధృవీకరించారని మనం గుడిమల్లం - పరశురామేశ్వర ఆలయాన్ని గురించి వ్రాసేటప్పుడు ప్రస్తావించుకున్నాం.( చూ.గుడిమల్లం- పరశురామేశ్వరాలయం .mutteviraviprasad.blogspot.com)
                                                    ఆలయప్రాంగణం లోని రెండవ శివలింగం. 

              ఈ మరకత శివలింగానికి వెనుకవైపుగా అమ్మవారి విగ్రహం ఉందని చెప్పుకున్నాం కదా. ఆ వెనుక పడమర గోడకు ఆనించి ప్రతిష్టించిన వినాయకుడు మరికొన్ని విగ్రహాలు కూడ తర్వాత కాలం లో భక్తులు,దాతల సహకారం తో ఆలయపునర్నిర్మాణ సమయం లో పెట్టినవి గా కన్పిస్తున్నాయి. అలాగే బయట ఆలయం గోడకు ఆనుకొని వీరఫలకంగా చెప్పబడే బల్లెం పట్టుకున్న వీరుని ఫలకం , అటుగా గుడికి కొంచెం ఆగ్నేయం గా ఒక పెద్ద పాడుబడిన బావిని కూడ మనం చూడవచ్చు.
                                                                         వీరఫలకం                                                         ఆలయ సమీపం లోని పాడుబడ్డ బావి

                                                                ప్రతి పున్నమి నాడు చందమామ అందంగా మరకత శివలింగం లో ప్రతిబింబించే దృశ్యం ఎంతో మనోహరంగా ఉంటుందట. అలాగే కొన్ని ఋతువులలో సూర్యోదయం కూడా మరకతలింగం లో అందం గా ప్రతి ఫలిస్తుందని ఇక్కడి వారు చెపుతున్నారు. నవగ్రహమండపాన్ని ,ధ్వజస్థంబాన్ని కూడ మనం ఆలయప్రాగణం లో చూడవచ్చు.
                                                  ఈ మరకతశివలింగాన్ని పూజిస్తే అష్టదరిద్రాలు నశించి,సంపదలు చేకూరుతాయని ,కోరుకున్నకోరికలు నెరవేరుతాయని,ఆయురారోగ్యాలు శక్తి ,యుక్తి లభిస్తాయని చెప్పబడుతోంది. అంతేకాకుండా ఈ మరకత శివలింగం భారత దేశంలోనే రెండవ అతి పెద్ద శివలింగమని, శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై ఈ మరకత శివలింగాన్ని పూజించాడని ఇలా కొన్ని కథనాలు కొల్లలుగా సోషల్ మీడియా లో ఈ శివలింగాన్ని కన్పిస్తున్నాయి. మంచిదే కాని ఆధారాలు కావాలి కదా అన్నది ప్రశ్న. ఏమైనా తప్పని సరిగా ఒకసారి చూడవలసిన దివ్యక్షేత్రం గా చందిప్ప మరకతశివలింగాన్ని గూర్చి చెప్పవచ్చు.
                                                                 మరకత శివలింగం 

                                                 ఈ మథ్య కాలం లో కార్తీకమాస ఉత్సవాలు ,నవరాత్రులు,శివరాత్రి ఉత్సవాలు వంటివి కూడ నిర్వహిస్తున్నారు. ప్రతి పౌర్ణమి నాడు దాతల సహకారం తో ఈ ఆలయం వద్ద అన్నదానం కూడ చేయబడుతోంది. కాలక్రమేణ ఇంకా మార్పులు చెందుతూ ఆలయం దినదినాభివృద్ధి చెందాలని భక్తులు మనసారా కోరుకుంటున్నారు. ---------------------------------------------------------------------------------------------------------

Saturday, 15 November 2025

శ్రీ చిత్రగుప్త దేవస్థానము ,కందికల్ గేట్ ,హైదరాబాద్.

                    శ్రీ చిత్రగుప్త దేవస్థానము . కందికల్ గేట్,రంగారెడ్డి జిల్లా, హైద్రాబాద్.   


                   చిత్రగుప్తుని పేరు తెలియని వారుండరు.యమధర్మరాజు దగ్గర పాప పుణ్యాల లెక్కలు వ్రాసే మహనీయుడే ఈ చిత్రగుప్తుడు. ఈయనకు ఒక దేవస్థానం ఉందని వింటే ఆశ్చర్యపోవడం మన వంతు అవుతోంది. మరో విశేషం ఈ మహానుభావునికి ఆసియా మొత్తం మీద మూడు ఆలయాలు మాత్రమే ఉన్నాయి.ఒకటి కాంచీపురం,రెండు అయోథ్య,మూడవది మన భాగ్యనగరమైన హైదరాబాద్ లో రంగారెడ్డి జిల్లా కందికల్ గేట్ వద్ద ఉంది.
                                          శ్రీ చిత్రగుప్తుడు, ఇలావతి ,దక్షిణావతి

                              కాయస్ధుల కులదైవమైన ఈ చిత్రగుప్తుని ఆలయాన్ని నైజాం నవాబు వద్ద మంత్రి గా చేసిన రాజా కిషన్ ప్రసాద్ నిర్మించినట్లు స్థానికులు చెపుతున్నారు. ఈ చిత్రగుప్తుడు బ్రహ్మ మానసపుత్రుడు గా గరుడపురాణం చెపుతోంది. బ్రహ్మదేవుడు సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభించిన తరువాత నరకలోకాధిపతిగా యమధర్మరాజు ను నియమించాడు కాని కాలం గడుస్తున్నకొద్ది పాపులు పెరిగి నరకలోకం లో పని ఒత్తిడి పెరిగింది.ఆ విషయాన్ని యమథర్మరాజు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి తనకు పని ఎక్కువయ్యిందని పాపుల రాక ఇబ్బడి ముబ్బడి గా పెరిగిందని , తనకు సహాయకుడు కావాలని మొఱపెట్టుకున్నాడు. బ్రహ్మదేవుడు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. యమధర్మరాజు కు సహాయకుని సృజించడానికి ఉజ్జయినీ రాజ్యం లోని క్షిప్రానదీ తీరంలో వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. తత్ఫలితంగా మానసపుత్రుడు గా జన్మించిన చిత్రగుప్తుని యమథర్మరాజు కు సహాయకునిగా నియమించినట్లు గరుడపురాణం చెపుతోంది. జీవులను సృష్టించిన విథాత వారి మనస్సు లో కలిగే పాపపుణ్యాలకు సాక్ష్యం గా వారి లోనే ఒక జీవి ని సృష్ఠించాడని అతడే చిత్రగుప్తుడని గరుడపురాణ కథనం. కాయస్థుల కులదైవంగా చిత్రగుప్తుడు పూజించ బడుతున్నాడు. మనం పైన చెప్పుకున్నట్లుగా అయోథ్యలోను ,కాంచీపురం లోను మరో రెండు చిత్రగుప్తుని ఆలయాలున్నాయి. అయోథ్య లోని ఆలయం లో ని చిత్రగుప్తుని శ్రీరామచంద్రుడు కూడ పూజచేసినట్లు పురాణాలు చెపుతున్నాయి. మనం చూస్తున్న హైదరాబాద్ కందికల్ గేటు వద్ద ఉన్న ఈ ఆలయం 18 వశతాబ్దం లో నిర్మించబడినట్లు స్థానికులు చెపుతున్నారు. చిత్రగుప్తునకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య పేరు ఇలావతి. ఈమె కు నలుగురు కుమారులు .రెండవభార్య పేరు దక్షిణావతి. ఈమె కు ఎనిమిది మంది కుమారులు. అంటే చిత్రగుప్తునకు పన్నెండు మంది కుమారులన్నమాట. గుడిలోని చిత్రగుప్తుని మూలవిరాట్టు పైన చిత్రంలో ఆ పన్నెండు మంది పిల్లలు కూడ ఉన్నారని అర్చకస్వామి చెపుతున్నారు. ఈ చిత్రగుప్తుడు కేతుగ్రహానికి అదిష్టానదేవత కాబట్టి ఈయనకు ప్రీతికరమైన రోజు బుధవారం. ఇష్టమైన సంఖ్య ఏడు. ఈయన వాహనం తాబేలు . అందుకే ఈయన గర్భాలయానికి ఎదురుగా ముఖమండపంలో కూర్మమండపం ఉంటుంది . మండపం మద్యలో తాబేలు ఆకారం ప్రతిష్టించబడి ఉంటుంది.భక్తులు ప్రతి బుధవారం ఈ మండపం లోనే ఏడు మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకుంటారు . ఆలయం చుట్టు ఏడు ప్రదక్షిణాలు చేయాలనేది కూడ నియమం. రాహు ,కేతు దోషాలు ఉన్నవారు , అపమృత్యువు,అనపత్యత, దాంపత్యదోషాలతో బాధించబడేవారు ఈ ఆలయం లో ఏడు బుధవారాలు గుడి చుట్టు ఏడు ప్రదక్షిణా లు చేసి,ఏడు దీపాలు మండపం లో వెలిగించి మనసు లో కోరికలను చెప్పుకుంటే తీరతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 
 






                   
       

                                  ఇక్కడి కొచ్చే భక్తులు కూడ ఇదే మాటలు చెపుతున్నారు. ప్రతి బుదవారం బ్రాహ్మి ముహూర్తం నుంచి ఏడింటి లోపల మూడు మార్లు స్వామికి అభిషేకాలు జరుగుతాయి. దీపావళి వెళ్ళిన రెండవరోజు యమద్వితీయ అంటారు .ఆరోజు చిత్రగుప్తుని పుట్టినరోజు ను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.దసరా నవరాత్రులు కూడ గొప్పగా నిర్వహిస్తారని అర్చకులు చెపుతున్నారు. అయితే చిత్రగుప్తుని ఆలయం ప్రాచీనమైందే కాని ఈ ప్రాంగణంలో కన్పించే మిగిలిన ఆలయాలు మాత్రం అర్వాచీనమైనవే. ఇదే ప్రాంగణం లో చిత్రగుప్తుని ఆలయానికి కుడి వైపు గా శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం ఉంది. విదేశీయుల దారుణ మారణ కాండల యనంతరం ధైర్యం కూడకట్టుకొని ఈ మిగిలిన ఆలయనిర్మాణాలు కొనసాగినట్లు కన్పిస్తున్నాయి. మరొక విశేషం ఏమిటంటే ఈ ఆలయాల్లో విగ్రహాలన్నీ అన్ కూడ అతి చిన్నగా కుదమట్టంగా ఉంటాయి. చిత్రగుప్తుని .వారి దేవేరుల విగ్రహాలు చిన్నవిగా ఉండటం తో మిగిలిన దైవాలు కూడ అలాగే సర్దుకుపోయినట్లున్నారు. సీతారామచంద్రుల పాదాలవద్ద ఆంజనేయుడు కన్పించడు. ఎదురుగా ఉన్న చిన్న ఉపాలయం లో భక్తాంజనేయుడు కొలువు తీరాడు. ఒంటిమిట్ట కోదండరామాలయం లో కూడ ఇదే సంప్రదాయం కొనసాగిందని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము.                   (చూ.youtube/c/raviprasadmuttevi.)
                                                            శ్రీసీతారామచంద్రస్వామి .   

ఈ ఆలయానికి కుడివైపున ఉన్నది శివాలయం .దీనిలో శివపంచాయతనం కొలువు తీరి ఉంది .
  
శివపంచాయతనము. 
.


                                                         సాయిబాబా మందిరము

                              ఈ ఉపాలయాలకు ఎడమవైపు కి కటకటాలను దాటి వెల్తే మొదటగా ఒక ఉపాలయం లో శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామి దాని ప్రక్కనే మరొక ఆలయం లో అయ్యప్పస్వామి,
                                                        శివుని సేవించుకుంటున్న భక్తులు.

                                 ఆయనకు ఎడమవైపు ఉపాలయంలో విఘ్నేశ్వరుడు కొలువు దీరి కన్పిస్తారు. వినాయకుడికి ఎదురుగా కొద్దిదూరం లో శివలింగం, నందీశ్వరుడు కూడ ఉన్నారు. ఈ ప్రాంగణం అంతా శివుని పరివారానికి కేటాయించినట్లు కన్పిస్తోంది.  







                                            శ్రీ సుబ్రమణ్యేస్వర స్వామి                                      శ్రీ అయ్యప్పస్వామి

                                  ఈ ప్రాంగణానికి కుడి ఎడమల నాగదేవతలు ప్రతిష్టించ బడ్డారు.
      పుట్ట ,పాలముంత నాగదేవతలు

 ఒకమూల నాగేంద్రస్వామి పుట్ట , నాగులచవితి కి భక్తులు పెట్టిన పాలముంత కూడ మనం చూడవచ్చు. ఆ ప్రక్కనే ఉన్న ఉపాలయంలో లలితాంబికా దేవి సుందరమైన రూపం దర్శనమిస్తుంది.
                                        
                                                                 శ్రీ లలితాంబికా దేవి

              శ్రీ అభయాంజనేయస్వామి రావిచెట్టు,అరుగు ఆలయమండపం దాటి బయటకొస్తే ఒక ప్రక్కగా అభయాంజనేయస్వామి ఎత్తైన 18 అడుగుల విగ్రహం కన్పిస్తుంది.ఆ పీఠము చెంతనే థ్యానాంజనేయుని కూడ దర్శించుకోవచ్చు.
                              
                          కొంచెము ముందుకు వెళితే పెద్ద రావిచెట్టు దాని చుట్టు అరుగు దాని వివిధ ప్రతిమలు మనకు కన్ఫిస్తాయి.
                                                         
                                                       భక్తాంజనేయస్వామి
                            
                          దానికి ఎదురుగా భక్తాంజనేయస్వామి ఆలయం కన్పిస్తోంది. ఆ ప్రక్కనే కన్పిస్తున్నది ననగ్రహమండపం.
                               
                                                         అభయాంజనేయస్వామి
                     
                               ఈ ఆలయప్రాంగణం విశాలంగా కన్పిస్తోంది .ఈ ఆలయ ప్రాంగణంలోనే ఒకవైపు సరస్వతీవిద్యాపీఠం హైస్కూల్ ను కూడ మనం చూడవచ్చు.