Sunday, 11 May 2014

శతక సౌరభాలు - 1 దాశరథీ శతకము - 5


శతకసౌరభాలు -1
                 
                             కంచర్ల గోపన్న  దాశరథీ శతకము

     



             అగణిత జన్మ కర్మ దురితాంబుధి లో బహుదు:ఖవీచికల్
             తెగిపడ నీదలేక  జగతీధవ నీ పద భక్తి నావ చే
             దగిలి తరింపగోరితిఁ బదంపడి నాదు భయంబు మాన్ప వే
             తగదని చిత్త మందిడక దాశరథీ ! కరుణాపయోనిధీ !
          
               శ్రీ రామా ! అనేక జన్మల యందలి కర్మల పాపములనెడి  సముద్రము లో  అనేకములైన దు:ఖములనెడి అలల దెబ్బలకు   ఈదలేక  నీ యొక్క దివ్య పాదభక్తి యనెడి ఓడను పట్టుకొని  పాపమనెడి సముద్రమును దాట దలచినాను. తగదని మనసు లో భావించక   నా భయమును పోగొట్టి  నన్ను కాపాడ వలసినది తండ్రీ !
       
          నేనొనరించు పాతకము లనేకము లైనను నాదు జిహ్వకున్
          బానకమయ్యె మీ పరమ పావన నామము   తొంటి రాచిల్కరా
          మా  నను గావుమన్నఁ దుదిమాటను సద్గతి నొందె  గావునన్
    దాని ధరింప గోరెదను దాశరథీ ! కరుణాపయోనిధీ !
      
            దశరధ రామా ! నేను చేయునట్టి పాపములు అనేకములైనను  మీ పరమ పవిత్ర నామము నా నాలుకకు మిక్కిలి మధురము గా నున్నది. పూర్వమొక చిలుక  శ్రీరామా ! నన్ను రక్షింపుమని పలికి   దాని వలన మోక్షమును పొందినది. కావున నేను కూడ నీ దివ్యనామమునే నేను స్మరించెదను.

             పరధనమున్ హరించి ,పరభామలనంటి , పరాన్నమబ్బినన్
       మురిపమ కాని ,మీఁద నగు మోస మెఱుంగదు మానసంబు దు
       స్తరమది   కాలకింకర గదాహతిఁ బాల్పడనీక మమ్ము నే
       తఱి దరిఁజేర్చి  ప్రోచెదవో? దాశరథీ ! కరుణాపయోనిధీ !

                            ఓ రామా  1 పరధనముల నపహరించుట , పరభామలను పొందుట ,  ఇతరుల తిండి తినుట , బాగానే ఉండును కాని వాని వలన  తరువాత కల్గెడి నష్టము మనస్సుకు తెలియదు . వీనినుండి తప్పించుకొనుట కష్టము . కావున రామచంద్రా  మేము యమభటుల గదాఘాతముల  బారిన పడకుండా మమ్మల్ని ఏ విధంగా కాపాడి ఒడ్డుకు చేరుస్తావో నీదయ  రామచంద్ర ప్రభూ !

           చేసితి ఘోరకృత్యములు , చేసితి భాగవతాపచారముల్
           చేసితి నన్యదైవముల జేరి భజించిన వారి పొందు నే
           చేసిన నేరముల్ దలచి చిక్కుల బెట్టకుమయ్య ; యయ్య ; నీ
           దాసుడనయ్య ; భద్రగిరి ! దాశరథీ ! కరుణాపయోనిధీ !

                 రామా !నేను భయంకరమైన పాపములను చేసితిని. భగవద్భక్తుల యెడ దోషములు . నీభక్తులు కాని వారితో  స్నేహమును చేసితిని. నేను చేసిన ఈ తప్పులన్నింటినీ  తలచి నన్ను బాధలు పెట్టవద్దు , అయ్యా ! నేను నీ భక్తుడను స్వామీ !
   
              పరులధనంబుఁ జూచి పరభామలఁజూచి హరింపగోరు ను
             ద్ధురమగు నామనస్సను దొంగను బట్టి భవత్సుదాస్య వి
             స్భురిత వివేక పాశమున జుట్టి భవచ్చరణంబనే మరు
             త్తరువునఁ గట్టివేయగదె దాశరథీ ! కరుణాపయోనిధీ !    

               శ్రీరామా ! పరధనమును ,పరస్త్రీలను , కోరునట్టి బలమైన నామనస్సనెడి దొంగను పట్టి నీ సేవ వలన ఏర్పడిన  తెలివి అనెడి  త్రాటిచే  నీయొక్క పాదమనెడి కల్పవృక్షమునకు  బంధించుము .
                     అనగా నా మనస్సును ఇతర పాప చింతనముల వైపు పోకుండా నీ పాదసేవన మనెడి భక్తి తో బంధించవలసినదని రామదాసు ప్రార్ధన

               సలలిత రామనామ జపసార మెఱుంగను గాశికాపురీ
         నిలయుడణ గాను  మీ చరణ నీరజ రేణు మహాప్రభావముల్
         దెలియ నహల్యగాను  జగదీవర నీదగు సత్యవాక్యముల్
         దలపగ రావణాసురుని తమ్ముడ గాను భవద్విలాసముల్
         దలఁచి నుతింప నాతరమె దాశరథీ ! కరుణాపయోనిధీ !    

                 శ్రీ రామచంద్రా .! నీ దివ్యనామ జప మహత్మ్యము  తెలిసికొన నేను కాశీ విశ్వేశ్వరుడను కాను . నీ పాదధూళి శక్తి  తెలియగ అహల్యను కాను. నీ సత్య వాక్యముల శక్తి ని తెలియ  విభీషణుని కాను . నీ యొక్క లీలలను వర్ణింప నాతరమా స్వామీ !

           దాసిన చుట్టమా శబరి దాని దయామతి నేలినావు నీ
           దాసుల దాసుడా గుహుడు తావక దాస్యమొసంగినావు ,నే
           జేసిన పాపమో వినుతిఁ జేసిన గానవు , గావుమయ్య నీ
           దాసులలోన నేనొకడ దాశరథీ ! కరుణాపయోనిధీ !    

                                రామయ్యా  !  నీకు శబరి దగ్గర బంధువా ? ఆమెను కరుణించావు . నీ  సేవకులకు సేవకుడనా ఆ  గుహునకు నీ సేవాభాగ్యాన్ని కలిగించావు . నేనేమి పాపం చేశానని  ప్రార్థించినా నన్ను కరుణింపకున్నావు . రామా  ! నేను కూడ నీ సేవకులలో ఒకడనే .నన్ను కాపాడవయ్యా.
   
           జలనిధు లేడు నొక్క మొగిఁ జక్కికి దెచ్చె శరంబు ఱాతి నిం
           పలరగ జేసె నాతిగఁ బదాబ్జ పరాగము నీ చరిత్రమున్
           జలజభవాది నిర్జరులు సన్నుతి సేయగ లేరు ,గావునన్
           దలప నశక్యమయ్య నిను  దాశరథీ కరుణాపయోనిధీ.

                 శ్రీరామా  ! నీబామము ఏడు సముద్రాలను లొంగదీసుకున్నది. నీపాదధూళి  ఱాతిని స్తీ గా మార్చినది. బ్రహ్మాదులు సైతం  నీ చరిత్రను పొగడలేరు. అటువంటి నిన్ను గురించి ఆలోచించుట నాతరము కాదు స్వామీ.!

          క్రోతికి శక్యమా అసుర కోటుల గెల్వగ గెల్చెఁ బో నిజం
          బాతని మేన శీతకరుండౌట  దవానలుఁడెంత వింత మా
          సీత పతివ్రతా మహిమ సేవకు భాగ్యము  మీ కటాక్షముల్
          ధాతకు శక్యమా పొగడ   దాశరథీ ! కరుణాపయోనిధీ !

                      శ్రీరామా.!  ఒక  కోతి రాక్షసులను సంహరించిందన్నను , వానరుని శరీరంమీద అగ్నిహోత్రుడు చల్ల గా మారాడన్నను , అవి గొప్పవింతలు .  ఇదంతా కూడ మా తల్లి సీతామహాదేవి పాతివ్రత్య మహిమ , సేవకుడైన ఆంజనేయుని అదృష్టము , మీ యొక్క కృపా కటాక్షములే కారణము . నీ మహిమలను పొగడుటకు  చతుర్ముఖుడైన బ్రహ్మ కు సైతము  సాధ్యము కాదు. నేనెంతవాడను .

           భూపలలామ రామ !రఘుపుంగవ రామ !  త్రిలోకరాజ్య సం
           స్ధాపక రామ ! మోక్ష ఫలదాయక రామ !  మదీయ పాపముల్
           వాపగదయ్య రామ !  నిను ప్రస్తుతి జేసెదనయ్య రామ !  సీ
           తాపతి ! రామ ! భద్రగిరి ! దాశరథీ ! కరుణాపయోనిధీ.!

               రాజులలో శ్రేష్టుడా.!రామచంద్రా ! ముల్లోకములను పాలించువాడా. ! మోక్షదాయకుడవైన ఓ రామచంద్రా ! నిన్ను  ప్రార్థించెదను. నాపాపములను పోగొట్టి రక్షింపుము సీతాపతీ.!

            నీ సహజంబు సాత్వికము నీ విడిపట్టు సుధాపయోధి ప
            ద్మాసను డాత్మజుండు , కమలాలయ నీ ప్రియురాలు నీదు సిం
            హాసన మీ ధరిత్రి ,గొడుగాకస ,మక్షులు చంద్ర భాస్కరుల్ ,
            నీ సుమతల్ప మాది ఫణి  నీవె సమస్తమునఁ గొల్చునట్టి నీ
            దాసుని భాగ్యమెట్టిదయ దాశరథీ ! కరుణాపయోనిధీ.!

             శ్రీరామా  !నీ సహజలక్షణము సాత్వికము . నీనివాసము పాలసముద్రము. బ్రహ్మదేవుడు నీ కుమారుడు. శ్రీ మహాలక్ష్మీ దేవి నీ ఇల్లాలు . ఈ భూమండలము నీ సింహాసనము. ఆకాశము గొడుగు . సూర్యచంద్రులు నేత్రములు . ఆది శేషుడే నీకు పూలపాన్పు. నీవే సమస్తమునకు అధినాథుడవు  అటువంటి నిన్న్ను సేవించెడి ఈ దాసుని అదృష్టము సామాన్యమైనదా స్వామీ ?

            చరణము సోకినట్టి శిల జవ్వని రూపగు టొక్కవింత ,సు
       స్ధిరము గ నీటిపా గిరులు తేలిన దొక్కటి వింత ,గాని నీ
       స్మరణఁ దనర్చు మానవులు సద్గతి జెందుట యెంత వింత యీ
       ధరను ధరాత్మజా రమణ ! దాశరథీ ! కరుణాపయోనిధీ.!

         శ్రీరామా  ! సీతాపతీ!. మీ పాదములు సోకి ఱాయి స్త్రీ  గా మారడం ఒక వింతైతే , కొండలు నీటిపై తేలడం మరొక వింత.  అయితే అన్నిటి కంటే  ఈ భూమి పైన వింత ఏమిటీ అంటే నీ నామస్మరణ చేసిన మానవులు ఎంత పాపాత్ములైనా మోక్షాన్ని పొందుతున్నారు ఇది గొప్ప వింత కదా  రామా !                  

                                     చదువుతూ ఉండండి. మరి కొన్ని అందిస్తాను .





*********************************************************************************



Sunday, 4 May 2014

శతకసౌరభాలు -1 దాశరథీ శతకము - 4

శతకసౌరభాలు -1
           
                                              కంచర్ల గోపన్న     దాశరథీ శతకము -4


           

                  “ రామహరే ! కకుత్ధ్సకుల రామహరే! రఘురామరామ శ్రీ
          రామహరే ! “ యటంచు మది రంజిల భేక గళంబు లీల నీ
          నామము సంస్మరించిన జనంబు భవం బెడఁ బాసి త్వత్పరం
          ధామ నివాసులౌదురఁట దాశరథీ !  కరుణాపయోనిధీ !
                                  
                   శ్రీరామా !  కప్పలరచినట్లు ఏ వేళలో నైనను శ్రీరామ  హరే  రఘు రామహరే కకుత్థ్సకుల రామ హరే   అని భజించిన  మాత్రాన భవబంధములు తొలగిపరంధాముని వాసము చేరుదురట.    
         
          చెక్కెరలప్పకున్ మిగులజవ్వని కెంజిగురాకు మోవికిన్
           జొక్కపు జుంటితేనియకుం జొక్కిలుచుం గనలేరు గాక నే
           డక్కట రామనామ మధురామృత మానుట కంటె సౌఖ్యమా
           తక్కిన మాధురీ మహిమ ? దాశరథీ ! కరుణాపయోనిధీ !

               శ్రీరామచంద్రా !  కలకండ,కాంతల కెమ్మోవి , జుంటితేనె మొదలైన వాటియందు ఆశ తో నరులు తెలిసి కొనలేరు గాని శ్రీరామ నామ మనెడి తీయని అమృతమును త్రాగుట వలన కల్గెడి  ఆనందమున కన్న ఇతర ఏ పదార్ధములును  అంత ఆనందము కల్గదు కదా !
              
        అండజవాహా ! నిన్ను హృదయంబున నమ్మిన వారి పాపముల్
        కొండల వంటి వైన వెసఁ గూలి నశింపకయున్నె? సంతతా
        ఖండల వైభవోన్నతులు గల్గక మానునే మోక్షలక్ష్మి కై
        దండ యొసంగకయున్నె తుది ?  దాశరథీ ! కరుణాపయోనిధీ !

                ఓ శ్రీరామా  ! గరుడవాహనుడా ! నిన్ను హృదయమున నమ్మిన వారి పాపములు కొండల వంటి వైన నశించిపోతాయి.  వారికి అఖండ వైభవోన్నతులు ప్రాప్తిస్తాయి. చివరకు మోక్షలక్ష్మి  కూడ చేయూత నందించి చెంతకు చేర్చుకుంటుంది కదా !
      
          చిక్కని పాలపై మిసిమి జెందిన  మీగడ పంచదార తో
         మెక్కిన భంగి మీ విమల మేచక రూప సుధా రసంబు నా
         మక్కువ పళ్లెరంబున సమాహిత దాస్య మనేటి దోయిటన్
         దక్కె నటంచు జుఱ్ఱెదను దాశరథీ ! కరుణాపయోనిధీ !
      
         శ్రీరామా! చిక్కని పాలమీగడ ను పంచదార తో మెక్కిన రీతి గా నిర్మలమైన   మీ యొక్క సుందర రూపమనెడి అమృతమును ప్రేమ యనెడు బంగారు పళ్లెరము లో   శ్రద్ధయనెడు దోసిలి   తో తనివి తీర త్రాగెదను.
              ఈ పద్యము లో ఎంతో మధురమైన రూపకాలంకారము ఉంది. ఈ శతకం లోని  అన్ని పద్యాల్లోను ఏదో ఒక అలంకారం కన్పించడం కూడ ప్రత్యేకత గా చెప్పవచ్చు.

            సిరులిడ సీత ,పీడలెగజిమ్ముటకున్ హనుమంతుఁడార్తి సో
             దరుడు సుమిత్రసూతి , దురితంబుల మానుప రామనామమున్
             గరుణ దలిర్ప మానవులఁ గావగ బన్నిన వజ్రపంజరో
             త్కరముగదా భవన్మహిమ దాశరథీ ! కరుణాపయోనిధీ !

                                          శ్రీ రామా !  సంపద లివ్వడానికి సీతాదేవియు ,ఆపదలను తరిమివేయడానికి ఆంజనేయుడు , శ్రమ ను పోగొట్టడానికి లక్ష్మణుడు ,పాపములను పోనడప రామనామమును అనునవి కరుణ తో మానవులను కాపాడుటకు ఏర్పరచిన వజ్రపంజరము కదా నీ మహిమ మహాప్రభూ !

                 హలకులిశాంకుశధ్వజ శరాసన శంఖ ఱధాంగ కల్ప కో
           జ్వలజలజాత రేఖలను సాంకములై కనుపట్టుచున్న మీ
           కలిత పదాంబుజ ద్వయము గౌతమపత్ని కొసంగినట్లు నా
           తలపునఁ జేర్చి కావఁగదె ! దాశరథీ ! కరుణాపయోనిధీ !

                శ్రీదాశరథీ ! దయాసముద్రా !  నాగలి ,వజ్రాయుధము , అంకుశము ,ధ్వజము , ధనస్సు , శంఖము ,చక్రము , కల్పవృక్షము , కమలము వంటి రేఖలతో శుభలక్షణములు  కల్గిన మీ దివ్యపాదములను  గౌతమపత్ని యైన అహల్య కు అనుగ్రహించినట్లే నామనస్సు లో  కూడ  చేర్చి నన్ను రక్షింపుము .

          జలనిధిలోన దూటి , కులశైలము మీటి ,ధరిత్రి గొమ్మునం
         దలవడ మాటి ,రక్కసుని యంగము గీటి ,బలీంద్రునిన్ రసా
         తలమున మాటి ,పార్ధివ కదంబముఁ గూల్చిన మేటి రామా
         తలఁపున నాటి రాఁగదవె ? దాశరథీ ! కరుణాపయోనిధీ !

                 శ్రీ దాశరథీ ! మత్స్యమువై  సముద్రమును జొచ్చి , కూర్మము వై మందర పర్వతము నెత్తి , వరాహమవై భూమిని కోరతో ఉద్ధరించి , నరసింహుని వై  హిరణ్య కశిపుని వక్షమును చీల్చి సంహరించి , వామనుడవై బలిచక్రవర్తి ని పాతాళమునకు పంపి, భార్గవరాముడ వై రాజసమూహమును సంహరించిన  శ్రీ రామా !  నామనస్సు నందు నిశ్చలం గా  నివసింపుము .

               భండన భీముఁ డార్తజనబాంధవుఁ డుజ్వలబాణతూమ కో
          దండ కళాప్రచండ భుజతాండవ మూర్తి కి రామమూర్తికిన్
          రెండవసాటి దైవమిక లేఁడనుచున్ గడఁగట్టి భేరి కా
          దండ డడాండడాండ నినదంబు లజాండము నిండ మత్త వో
          దండము నెక్కి చాటెదను దాశరథీ ! కరుణాపయోనిధీ!  ( 34 )

                     శ్రీరామా  ! యుద్ధరంగమునందు శత్రుభయంకరుడును , ఆశ్రిత జన రక్షకుండును ,ధనుర్బాణములతో పరాక్రమ విక్రముడైన మా శ్రీరామమూర్తి కి సమానమైన దైవము మరొక్కడు లేడని , జయపతాకను చేత పట్టి మత్తగజేంద్రము  మీద ఎక్కి  దండ డడాండ డాండ యను నగారా శబ్దములతో బ్రహ్మాండము బద్దలగునట్లు గా  మ్రోగించి మరీ చాటుతాను.
                         తన స్వామి యెడల భక్తుని భక్తి పరాకాష్ట కు చేరితేనే ఇటువంటి పద్యాలు వస్తాయి. భక్త్యావేశం లో పద్యపాదం కూడ ఒకటి పెరిగి పోయింది. ఈ పద్యాన్ని భక్తరామదాసు అయిన కంచర్లగోపన్న కాకుండా  రామబంటు శ్రీ ఆంజనేయుడే చెప్పాడా అన్నంత ఆవేశం తో ఆంధ్రదేశం లో  రామ భక్తులు ఈ పద్యాన్ని గానం చేసి  ,పులకించి పోతుంటారు.

                        అవనిజ కన్నుదోయి తోగలందు వెలింగెడు సోమ జానకీ
              కువలయనేత్రగబ్బి చనుగొండలనుండు ఘనంబు ,మైధిలీ
              నవనవయౌవనంబను వనంబునకున్ మదదంతి నీవెకా
              దవిలి భజింతు నిన్నెపుడు దాశరథీ ! కరుణాపయోనిథీ !

                    శ్రీరామా ! సీతాదేవి  కన్నులనెడి కలువలకు చంద్రుని వంటి వాడవు , జానకీదేవి స్తన శైలము లందుండెడి మేఘుడవు ,  సీతాదేవి నవయౌవనమనెడి వనమునకు మదపుటేనుగు వంటివాడవు నైన నిన్ను నేను ఎల్లప్పుడు సేవించెదను.
                           ఈ పద్యం లో శ్రీ రామ చంద్రుని శృంగార రాముని గా దర్శించి  ఆనందిస్తున్నాడు కవి.  కవులకు , వాగ్గేయకారులకు తన ప్రభువును శృంగార రాయని గా సైతం వర్ణించడం ఒక సంప్రదాయం గా  వస్తోంది. పదకవితా పితామహుడు అన్నమయ్య  శ్రీవేంకటేశ్వరుని  గూర్చి ఆలపించిన శృంగార కీర్తనలు  ప్రత్యేక విభాగం క్రిందకే వస్తున్నాయి.  శ్రీ రామదాసు కూడ ఈ మార్గం లోనే ఉన్నాడని చెప్పుకోవడం కోసమే ఈ పద్యాన్ని ఉటంకించాను. ఇటువంటివి  మరికొన్ని వస్తే  ..... దాటి వెళదాం. ఈ పద్యం లో    “మైధిలీ నవయౌవనంబను వనంబుకున్ మదదంతి “ ( సీతాదేవి యొక్క   నవయవ్వనమనే వనానికి మదపుటేనుగు వంటివాడా )  అన్న పోలిక మాత్రం రామభక్తుల మనస్సు ను  చివుక్కు మనిపిస్తుంది.
          
          ఖరకర వంశజా !  వినుమఖండిత భూత పిశాచ ఢాకినీ
         జ్వర పరితాప సర్ప భయవారకమయిన భవత్పదాబ్ఝ వి
         స్భుర దురు వజ్రపంజరము  జొచ్చితి ;  నీయెడ దీనమానవో
         ద్ధర బిరుదాంక మేమఱకు దాశరథీ ! కరుణాపయోనిథీ !
                        శ్రీరామచంద్రా !. సూర్య వంశమునందు పుట్టిన వాడా!  భయంకమైన భూత పిశాచ , ఢాకినీ పీడలు ,జ్వర పాప దుఖ సర్ప భయములు తొలగించెడి నీపాదకమల సేవయనెడి గొప్ప వజ్రపంజరము నందు  నేను ప్రవేశించితిని . ఓ రామా! నీకు  దీనమానవోద్ధరణుడనెడి  బిరుదు ఉన్న సంగతి మర్చిపోకుండా , నన్ను రక్షించవలసినది.
                                                               చదువుతూ ఉండండి.  మరికొన్ని అందిస్తాను.






********************************************************************************

Saturday, 3 May 2014

శతకసౌరభాలు - 1 దాశరథీ శతకము - 3

శతకసౌరభాలు – 1
          కంచర్లగోపన్న   దాశరథీ శతకము -3



            

             పండితరక్షకుం డఖిలపాపవిమోచను డబ్జసంబవా
             ఖండలపూజితుండు దశకంఠ విలుంఠన చండకాండ కో
             దండ కళాప్రవీణు డను తావక కీర్తివధూటి కిత్తుఁబూ
             దండయుఁ గాకఁ నాకవిత దాశరథీ! కరుణాపయోనిధీ!
                   
      ఓ రామా  ! పండితులనుకాపాడువాడు , సమస్త పాపములను  వదిలించువాడు , బ్రహ్మేంద్రాదుల చేత పూజించబడువాడు ,రావణుని పరిమార్చగల్గిన భయంకరమైన  కోదండవిద్య లో నేర్పరి యైన వాడు అనెడి తమ యొక్క కీర్తికాంతకు నేను నా కవిత్వమనెడి పూలమాలను సమర్పించుచున్నాను.

            అజునకుఁ దండ్రివయ్యు సనకాదులకుం బరతత్త్వమయ్యు ,స            
           ద్విజమునికోటికెల్లఁ గులదేవతవయ్యు దినేశవంశ భూ
           భుజులకు మేటివయ్యుఁ బరిపూర్ణుడవై వెలుగొందు పక్షి రా
           డ్ఢ్వజ  మిముఁ బ్రస్తుతించెదను దాశరథీ ! కరుణాపయోనిధీ !

             శ్రీ దాశరథీ  ! నీవు బ్రహ్మదేవునకు తండ్రివి.సనకాది మహర్షులకు పరబ్రహ్మమూర్తివి. ముని ద్విజ శ్రేష్ఠులకు ఇలవేల్పువు వయ్యు సూర్యవంశపు రాజులలో మేటివయ్యు  పరిపూర్ణుడవై ప్రకాశించెడి గరుడ ధ్వజుడవని  కీర్తించుచున్నాను.

   శ్రీ రమ సీతగాఁగ నిజసేవకబృందము వీరవైష్ణవా
         చార జనంబు గాఁగ విరజానది గౌతమి గా,వికుంఠ ము
         న్నారయ భద్ర శైల శిఖరాగ్రము గాఁగ , వసించు చేతనో
         ద్ధారకుఁడైన విష్ణువవు దాశరథీ! కరుణాపయోనిధీ !      

                   శ్రీరామచంద్రా ! కరుణాసముద్రా !  శ్రీమహాలక్ష్మీదేవియే  సీతాదేవి. నీసేవకబృందమే వీరవైష్ణవాచార్య సమూహము. విరజానదియే గోదావరి.  శ్రీ వైకుంఠమే భద్రశైలశిఖరము. కాగా భూలోకమునందలి జీవుల నుద్దరించుటకు ఆవిర్భవించిన శ్రీ మహావిష్ణవవు నీవు.

              కంటి నదీతటంబుఁ బొడగంటిని భద్రనగాధివాసమున్
        గంటి నిలాతనూజ ,నురుకార్మక మార్గణ శంఖచక్రముల్
       గంటిని ,మిమ్ము లక్ష్మణుని గంటి , గృతార్ధుడనైతి , నో జగ
       త్కంటక దైత్యనిర్ధళన !  దాశరథీ! కరుణాపయోనిధీ!      

                   శ్రీరామా ! గోదావరీ తీరమును ,భద్రగిరి యందలి తమ నివాసమును , శ్రీ  సీతాదేవి ని , మీయొక్క విల్లు ,బాణమును ,శంఖ చక్రములను , మిమ్ము ,లక్ష్మ ణుని చూచి ధన్యుడనైతిని .లోకములను బాధించు రాక్షసులను సంహరించిన ప్రభూ !

           హలికునకున్ హలాగ్రమున నర్ధముసేకురుభంగి , దప్పి చే
           నలమట నొందు వానికి సురాపగ లో జలమబ్బినట్లు , దు
            ర్మలిన మనోవికారినగు మర్త్యు నను  దయ జూచి నీపయిన్
           దలపు ఘటిల్లఁ జేసితివి దాశరథీ ! కరుణాపయోనిధీ !      

            శ్రీరామా ! దయాసముద్రా !  పొలము దున్నుకొను వానికి నాగలి కొనను  ధనము లభించనట్లు , దప్పిక తో పీడించబడేవాడికి గంగాజలం లభించినట్లు ,దుర్మార్గుడనైన నాపై దయచూపి నీయెడల భక్తిని కల్గచేశావు .

            కొంజక తర్కవాదమను గుద్దలి చేఁ బరతత్త్వ భూస్ధలిన్
            రంజిలఁ ద్రవ్వి కన్గొనిన రామనిధానము నేడు భక్తి సి
            ద్ధాంజనమందు హస్తగతమయ్యె బళీ యనగా మదీయ హృ
             త్కంజమునన్ వసింపుమిక  దాశరథీ! కరుణాపయోనిధీ !      

                      శ్రీరామచంద్రా ! కారణవాదమనెడి గుద్దలి చే వేదాంతమనెడి నేలను త్రవ్వగా భక్తియనెడి సిద్ధాంజనము వలన శ్రీరామ యనెడి నిధి లభించినది .ఎంత సంతోషము .ఇక  నాహృదయమనెడి కమలము నందు ఎల్లప్పుడు నివసింపుము స్వామీ !

               రాముడు ఘోరపాతక విరాముడు , సద్గుణకల్పవల్లికా
               రాముడు , షడ్వికారజయరాముడు ,సాధుజనావనవ్రతో
                                                   ద్దాముడు రాముడే పరమదైవము మాకని మీ యడుంగు
                                                    దామరలే భజించెదము దాశరథీ! కరుణాపయోనిధీ !   
                        శ్రీరామా  ! భయంకరమైన పాపములను తొలగించువాడు , సద్గుణముల ప్రోవు కామక్రోధాది అరి
షడ్వర్గములను జయించు లీల కలవాడు సజ్జన రక్షణయే వ్రతము గా గలవాడు నైన శ్రీరామచంద్రుడే మా కులదైవమని ప్రకటించి నీ పదపద్మములను సేవించెదము .

                                              చెక్కెరమాని చేదు దినజాలిన కైవడి మానవాధముల్
                                              పెక్కులు బక్క దైవముల వేమఱు గొల్చెద రట్లకాదయా !
                                            మ్రొక్కిన నీకు మ్రొక్కవలె మోక్షమొసంగిన నీవె యీవలెన్
             దక్కినమాట లేమిటికి ? దాశరథీ! కరుణాపయోనిధీ !             


                 శ్రీరామా  ! భయంకరమైన పాపములను తొలగించువాడు , సద్గుణముల ప్రోవు , కామక్రోధాది అరి

              శ్రీ రామచంద్రా !చెక్కెరను మాని చేదు వస్తువును  తిన్నట్లు గా  కొందఱు తెలివి లేని వారు నిన్ను మాని చిల్లర దేవతలను సేవింతురు. అది తప్పు కదా. సేవిస్తే నిన్నే సేవించాలి . మోక్షమిస్తే నీవే వ్వాలి. తరమైన మాటలు ఎందులకు దేవా !.       
                      ఈ పద్యం లో శ్రీ రామదాసు  శ్రీ రామసేవాప్రాశస్త్యం తో పాటు కులదైవం పై భక్తునకుండే అనిర్వచనీయమైన నమ్మకాన్ని ,విశ్వాసాన్ని ప్రకటించాడు. ఉంటే నీవే.  లేకపోతే లేదు . నీవే తప్ప నిత: పరంబెరుగనన్నదే భక్తుని ఆర్తి. అదే భక్తుని నమ్మకం. ఆ  నమ్మకానికే భగవంతుడు బందీ అవుతాడు.  భక్తపరాధీనుడౌతున్నాడు.

               రా కలుషంబులెల్ల బయలంబడఁ ద్రోసిన మా కవాటమై
           ఢీకొని ప్రోచు , నిక్కమని థీయుతులెన్నం దదీయవర్ణముల్
           గైకొని భక్తిచే నుడువ గానరు గాక ! విపత్పరంపరల్
           దాకొను నే జగజ్జనుల దాశరథీ ! కరుణాపయోనిధీ. !      
          
                             శ్రీరామా ! రా అనెడి  అక్షరము మనలోని పాపములన్నింటినీ  నోటినుండి బయటకు పడత్రోయగా మా అనే అక్షరం కవాటమై  ఢీకొని మరల వానిని లోనికి రాకుండా నిరోధిస్తుందని పండితులు చెప్పిన మాటను ఈ మానవులు  అంగీకరించి రామనామ స్మరణ చేయరు. అట్లు చేసినచో కష్టములు కలుగవు కదా.!
                                                                  చదువుతూ ఉండండి. మరికొన్ని అందిస్తా.




*********************************************************************************