Thursday, 21 March 2013

భద్రగిరిపై వెలసిన రాముడు రామచంద్రుడా ? రామనారాయణుడా?


      భద్రగిరి పై వెలసిన రాముడు
                           
                      రామచంద్రుడా?   రామనారాయణుడా ?
                                      
                      భద్రగిరి పై సీతా లక్ష్మణ సమేతుడై వెలసిన శ్రీ రామచంద్రమూర్తి తన అస్తిత్వాన్ని నిరూపించు కోవాల్సిన అవసరం ఏర్పడిందా అనే సందేహం  భక్తులకు కలుగు తోంది. ఎందుకంటే ఈ మధ్య ఒక తెలుగు టీ.వీ ఛానల్లో  ఈ ఫై శీర్షికతో  ఒక చర్చ జరిగింది . దానిలో మాట్లాడిన పండిత ప్రకాండులు తమతమ అభిప్రాయాలను ప్రకటించారు. సంతోషమే.
                ఇంతకీ సారాంశ మేమిటంటే  ఈ రాముడు దశరథ నందనుడు, సీతామనోభిరాముడు, రావణ సంహారుడు, భక్తజన మందారుడు, రామాయణ కథానాయకుడు నైన అయోథ్యారాముడు కాదట.! భద్రుని కోరిక మేరకు వైకుంఠము నుండి దిగి వచ్చిన చతుర్భుజుడైన రామ నారాయణుడట.!  అందుకే శ్రీ రామనారాయణ వరాయ అని సంకల్పం చెపుతున్నారట. సరే. !”చక్రి సర్వోపగతుండన్నాడు కదా ప్రహ్లాదుడు. కాబట్టి రామచంద్రుడైనా, రామ నారాయణు డైనా ఒకటే అనుకుందాము. కాని ఆ మాట ఒప్పుకోవాల్సింది మనం కాదు. ఆనాటి శబరి ఒప్పుకోవాలి.ఎన్నో బాధలు పడి, చెరసాలలో శిక్షలననుభవించి, శ్రీ రామునకు ఆలయాన్నికట్టించి, ఆభరణాలను చేయించిన భక్త శిఖామణి భక్తరామదాసుఅంగీకరించాలి.
                భండన బీముడు,ఆర్తజనబాంధవుడు, ఉజ్వలబాణతూణకోదండ కళాప్రచండుడునైన తారకరాముణ్ణే రామభక్తులు కొలుస్తున్నారు. సేవిస్తున్నారు. ప్రార్థిస్తున్నారు.తరిస్తున్నారు.
              
                  పండితరక్షకుడు, అఖిల పాప విమోచనుడు,అబ్జసంభవాఖండల పూజితుడు, దశకంఠ విలుంఠన చండ కాండ కోదండ కళాప్రవీణుడైన మహావీరుడు మన శ్రీరాముడు. ఘోరపాతకవిరాముడు,సద్గుణకల్పవల్లి కారాముడు, షడ్వికారజయ రాముడు, సాధుజనావనవ్రతో ద్దాముడు, అవనిజ కన్నుదోయి వెలిగెడి సోముడు మన  సీతానాథుడు.  ఆయన  సత్య,ధర్మ పరాక్రమాన్ని జాతి యావత్తూ కథలుగా చెప్పుకుంటోంది.శ్రీ రాముని వంటి భర్త, శ్రీ కృష్ణుని వంటి సోదరుడు కావాలని ఫ్రతి కన్నెపిల్ల కోరుకుంటుంది. శ్రీ రాముని సంచారమే ఆయన పాత్రకు వన్నెతెచ్చింది  కాని పేరు కాదు కదా.!
                                 ప్రపంచం మొత్తం మీద శ్రీరామనవమి రోజున శ్రీ సీతారామ కళ్యాణం చేసే మహద్భాగ్యం మన తెలుగు గడ్డ కే దక్కిందని ఎక్కడో చదివినట్లు గుర్తు. భద్రాద్రి రాముని కళ్యాణోత్సవాలు తెలుగువారి ఆస్తి. అటువంటి పవిత్ర ఆలయం లో ఇటువంటి వివాదాన్ని తీసుకురావడం జాతి మొత్తానికే నష్టాన్ని కలిగించవచ్చు . ఆంథ్రుల ఆరాథ్యదైవం  శ్రీ సీతారాముని గూర్చి ఇటువంటి చర్చ రావడం  ఒక తెలుగువాడి గా జీర్ణించుకోలేక ఈ రెండు మాటలు వ్రాస్తున్నాను.   రామాయణ కథానాయకుడే శబరికి కన్పించిన శ్రీ రామచంద్రుడు.ఆయనే కంచర్ల గోపన్న ను భక్త రామదాసుని చేసి, ఆయన  చేతగుడి కట్టించుకున్నాడు.  ఆయనే తమ్ముడితో   కలిసి తానీషా కు ప్రత్యక్షమై రామదాసుని ఋణ విముక్తుని, బంధవిముక్తుని చేశాడు. 
       


                              ఈ రామునకే ప్రపంచమంతా జేజేలు కొడుతూ,నివాళు లర్పిస్తొంది.  ఆయనే భద్రగిరిపై ఉన్నాడని పూజిస్తోంది. అంతేకాని  భద్రగిరి పై వెలసిన రాముడు వేరని, ఇతడు భద్రుని కోరిక మేరకు వెలిశాడని,  ఇతను రామనారాయణుడని,-- ఇటువంటి మాటలు చెప్పి ,రామభక్తుల గుండెలను గాయం చేయవద్దని, విశ్వాసాలను దెబ్బతీయవద్దని పండితోత్తములను  చేతులెత్తి వేడుకుంటోంది ముందుగా తెలుగు జాతి. ఆ తరువాత భారతజాతి. మనకున్న అనర్ఘరత్నం భద్రాద్రి పుణ్యక్షేత్రం . దాని పవిత్రతను, ప్రాచీనతను కాపాడవలసిన బాథ్యత ప్రతి ఒక్కరిది అనుకుంటున్నా!
    
              దురితలతా లవిత్రుడు,ఖరదూషణ కానన వీతిహోత్రుడు, భూభరణ కళా విచిత్రుడు, భవబంధ విమోచన సూత్రుడు, చారు విస్ఫుర దరవింద నేత్రుడు, ఘనపుణ్య చరిత్రుడు , సీతామనోభిరాముడై  - భద్రగిరి పై వెలసిన  దశరథరాముడే తమ  రాముడని భక్తుల విశ్వాసం. రామదాసు వేడుకొన్నది కూడ ఈ  దయాశరథి యైన దాశరథి నే కదా! దాశరథి ని కరుణాపయోనిథి  గా దర్శించిన  మహద్భాగ్యం మన రామదాసు ది.
                ఎంత వేడిన నీకు  సుంతైన దయ రాదు
                 పంతము సేయగ నే నెంత వాడను తండ్రి
             అంటూ వేడుకుంటున్న ఆ పరమ భక్తుని  ఆక్రందన  ఇప్పటకీ మన చెవుల్లో మార్మోగుతూనే ఉంది. అందుకనే మన రాముడు భద్రాద్రి శ్రీ రామచంద్రుడే కాని  వైకుంఠం నుండి  దిగి వచ్చిన శ్రీ రామనారాయణుఢు కాదు.  శ్రీ రామచంద్రుడు  శ్రీ రామనారాణుడైతే--- కొంతకాలానికి శ్రీ వేంకటేశ్వరుడు శ్రీ వేంకట నారాయణుడై పోయే ప్రమాదముందేమో నని భక్తులు భయపడుతున్నారు. సంకల్పం లో మాత్రమే ఛెపుతున్నామంటారేమో   కాని అది మాత్రం ఎందుకు అనేది సామాన్యుని ప్రశ్న. ?   
                   ఈవిధంగా నైన మరొక్కసారి శ్రీరామ నామస్మరణ చేసుకొనే మహద్భాగ్యాన్ని  కల్గించిన ప్రతి  ఒక్కరికి కృతజ్ఞతా పూర్వక వందనాలు.


******************************************************************************************

Friday, 18 January 2013

శ్రీరామ నామామృత జీవనుడు- తమ్మర గోపన్న

                                       



                                    శ్రీ రామ నామామృత జీవనుడు
                                                     
తమ్మర గోపన్న


                                                 
                  
               
       కవి పొందే తాదాత్య్మతే కవిత్వానికి మూలం. అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి: అంటుంది అలంకారశాస్త్రం . ఏ తాదాత్య్మంలో కదిలి వాల్మీకి ఆదికావ్యాన్ని రచించాడో, మన పోతన్న ఏ భక్తి పారవశ్యానికి లోనై రామభద్రుని చేత భాగవతాన్ని పలికించుకున్నాడో,  ఏ ఆవేశ ఆవేదనలకు గురై  కంచర్ల గోపన్న ప్రజాధనాన్ని రామునికి నివేదన చేశాడో, ఆ ఆవేశమే ఈ గోపన్నను నడిపించింది.కదిలితే పద్యం, మెదిలితే శ్లోకం , కల మెత్తితే రామ నామం, గళ మెత్తితే రామగానం గా జీవించిన భక్త కవి  తమ్మర గోపన్న.
                            
                            నల్గొండ జిల్లా కోదాడ మండలం లోని తమ్మర గ్రామం  ఈ కవి జన్మస్ధలం. ఆ గ్రామం లోని సువిశాలమైన రామాలయ ప్రాంగణం లో నిండైన రూపం తో,ఊర్ధ్వపుండ్రధారియై, కౌపీనాన్నిమాత్రము ధరించి, నెరిసిన పొడవైన గడ్డము,,జడలు కట్టిన శిరోజాలతో  సంచరించిన మూర్తి ఈ గోపన్న. రామ నామము వింటే గాద్గద్యమైన గొంతు ఆదికవి ని స్మరించి,శ్రీమద్రామాయణ శ్లోకాలను మధురంగా గానం చేస్తుంది. ఆ వెంటనే ఆ సందర్భం లోని ఆంద్ర వాల్మీకి  వాసుదాసు పద్యాలను అలవోకగా ఆలాపిస్తుంది. సమయానుగుణంగా గోవిన్ద రాజీయ వ్యాఖ్యాన పాఠాలు  ఆ గొంతు లో  మృదువు గా ధ్వనించేవి. అమ్మ  సీతమ్మ రాఘవుని తో కలసి సంచరించిన పంచవటీ ఘట్టాలు పులకితదేహులై గానం చేస్తారు. వీరు రచించిన గ్రంధాలు డెభ్భైకి పైగా ఉన్నాయి.  

                                                 వీరి గ్రంధాలన్నీ రామాంకితాలే. రామ భక్తి పరమైన  వీరి కావ్యాలలో రాముడు, కృష్ణుడు, నారసింహుడు ,  ఎవరైనా వీరి దృష్టి లో రామునకు మారు రూపులే.  ఈ కావ్యాలలో మొదటి మూడు పద్యాలు శ్రీ  -రా  -మ అనే అక్షరాలే మొదటిఅక్షరాలు గా కలిగి ఉంటాయి. ఇది వీరి  కావ్యాల ప్రత్యేకత.  వారి  కావ్యాలలో  ఎక్కువ గా నలభై పాదాలు,లేక  ఏభై పాదాలు కలిగిన ఉత్పలమాలిక  గాని, చంపక మాలిక గాని ఉండటం ఒక విశేషం . స్తుతి శతకాలు, ప్రార్ధనలు,నక్షత్ర మాలికలు, రామాయణేతివృత్త కావ్యాలు, గుణరత్న కోశము వంటి సంస్కృత కావ్యాలకు అనువాదాలు, భావతరంగిణి పేరు తో నిత్యజీవితం లో తనలో కలిగే భావ సంచలనాలకు అక్షరాకృతులు పన్నెండు భాగాలు.  ఇలా ఎన్నో, ఎన్నెన్నో వీరి కావ్యాలు.
                   
               ఈ భక్తకవి ముద్రించిన ప్రతి పుస్తకము అమూల్యమే. ధర ఉండదు. నలభై కావ్యాలు ముద్రితాలు కాగా, ముఫ్ఫై కి పైగా కావ్యాలు  వ్రాతప్రతులు గా మిగిలి పోయాయి. ముద్రితములైనవన్నీ కవిమిత్ర బాంధవులచేత ముద్రించబడి,అమూల్యములై సాహితీ మిత్రులకు  అందజేయ బడ్డాయి. ఆ రామచంద్రుని అనుగ్రహం చేత వెలుగు చూచిన పుస్తకాలకు సర్వాధి కారి గా రామునే చేసి  సర్వస్వామ్యములు ఆయనకే అర్పించిన అదృష్ట శాలి  ఈయన. 
              
                                  నేను  రామాయణము మీద పరిశోధన చేసే రోజుల్లో  ఈ మహాను భావుని తో  కొన్ని రోజులు గడిపే అవకాశం నాకు లభించింది .  ఈయనకు జానకీ ధవుని పేరు చెపితే ఫ్రేమాను రాగాలు పెల్లుబికి కంఠం గద్గదమై కన్నులు అశ్రుపూరితాలౌ తాయి. సీతమ్మ పడిన కష్టాలను గురించి,  రామయ్య సత్యపరాక్రమాన్ని గురించి  ఆయన చెప్పుకు పోతుంటే  ఎన్నోరాత్రులు అలానే గడిచి పోయి, సూర్యోదయమై పోయిన రోజులు నేను ఎప్పటికీ మరచిపోలేను.  మన ఇంట్లో ఒక స్వంత వ్యక్తి  కి కష్టం వచ్చినట్లు ఆ మహాను భావుడు సీతా రాములను గూర్చి , వారి కొచ్చిన కష్టాలను గురించి ఆవేదన, ఆవేశాల తో చెపుతుంటే, పరిశోధనా వ్యాపకం లో ఉన్న నాకు ఆనాడు అది విచిత్రంగా అనిపించేది . కాని పదిహేనేళ్ల తర్వాత   ఇప్పుడు ఆలోచిస్తుంటే ఆయన లోని ఆ ఆవేశానికి అర్ధం తెలిసి, ఆయన ఎంత అదృష్ట వంతుడా ! అని పిస్తోంది.
         
                                శతావధాని ముడుంబి సింగరాచార్యుల వారి అంతేవాసులు ఈ కవి. ఆశుకవితాధురీణులు. సంస్కృతాంధ్రాల లో సమానం గా కవిత్వం చెప్పగల్గిన ప్రజ్ఞాశాలి. సాహితీ మిత్రుల తోను, అబిమానుల తోను ఉత్తర ప్రత్యుత్తరాలను  పద్యాలలోనే నిర్వహించే వారంటే వీరికి పద్యవిద్య పై నున్న పట్టు ను, అభి మానాన్ని మనం అర్ధం చేసుకోవచ్చు
                    
                      . ఈ కవి వ్రాసిన స్తుతి శతకాలు, జానకీవర”!, జానకీ నాయక,! జానకీ,! భార్గవ,! శ్రీకృష్ణ,! నారాయణ,! లక్ష్మీనృసింహ,! విఖనసార్య! వంటి మకుటాలతో విలసిల్లుతుంటే, సంస్కృతమున పరాశరభట్టర్   వ్రాసిన గుణరత్నకోశము, క్షమాషోడశి, రంగ రాజ స్తవము వంటి   కావ్యాలకు భావాను వాదాలు  వీరి పాండిత్యానికి  దర్పణాలై నిలిచి, పండిత కవుల ప్రశంసలకు పాత్రమైనాయి. ముకుందమాల అనువాదము అత్యంత రమణీయము. శ్రీరంగ రాజ ప్రియా!”  అనే మకుటం తో తమిళం లోని తిరుప్పావై  పాశురాలకు  చేసిన అనువాదము వైష్ణవులకు ఎంతో ప్రీతి పాత్రమైనది. వీరి కావ్యము అమృతసిద్ధి క్షీరసాగర మథన వృత్తాంతము  కాగా, పరవానస్మి లక్ష్మణ పాత్ర ప్రధానమైన రామాయణేతి వృత్త కావ్యము.
                       
                                         అప్పకవి ,వాసుదాసాదుల ప్రభావానికి లోనైన ఈ కవి 1949 ప్రాంతం లో పుష్పమాలికా బంధాది బంధ కవిత్వాలను, గర్భస్రగ్విణీ వృత్తాది గర్బకవిత్వాలను,కూడ వ్రాసి విద్వత్కవుల సరసన తన స్ధానాన్ని పదిల పరచుకున్నారు.
          
                భవభవనా వవా! విభవభద్ర భవామర వారతారకా
             సువిధ విభా విభాసశుభ శుభ్ర శుభాస్పదమోదసాదరా!
             యవన వధా వధ స్మయ మయ ప్రయ తారసు శూర మారకార
             సవన వరా వనాఢ్య శరశస్త శరాస నదీన మానసా!
             
                ఇది పుష్పమాలికా బంధము. ఈ గృహ మొక సత్రమందలి సఖీ సఖబంధు సుతాదులెల్లరు న్గృహమున కొచ్చి పోవగల పాంథులని నమ్మిన కవి ఈ గోపన్న.
          
             కవి యొక మాలికుండతని గ్రంథ చయంబు మనోజ్ఞ
             మాలికా నివహ యలంక్రియా వితతి నిర్మల సౌరభమెల్ల        పద్దెముల్                                             


అని కవి మాలికా కారుడై, గ్రంథ సమూహము లనెడి పూమాలలను పద్యములనెడి పరిమళ భరిత కుసుమాల తో గ్రుచ్చి,సమాజానికందించగా, భృంగరాజములవంటి పండితశ్రేష్టులు తన్నవ కవితా సుధారసమునం బ్రియ మందెదురని భావించి సుగంధ భరిత పద్య రాశి చే కావ్యరచన సాగించారు.
                
                “  నీతో ముచ్చట లచ్చటల్ ప్రణతులున్ నీతోడ సల్లాపముల్
                   నీతో నవ్వులు బువ్వులున్ బ్రణయముల్ నాతో పరీ హాసముల్
                  నీతో విన్నపముల్ వివాదములునున్ నీతోడనే  సర్వమున్

      ----- అని రామునే సర్వము గా భావించి, రామనామము చేత  పవిత్రీకృత గాత్రుడై, ఆయనే ఒక రామనామ క్షేత్రం గా మారిపోయాడు.
               
                  సీతారామ కళ్యాణం జగత్కళ్యాణ కారకము. తెలుగు గడ్డ మీద భద్రాద్రి  రామన్న   పెళ్లయితే గాని తమ బిడ్డలకు పెళ్లి లగ్నాలు పెట్టుకోని  ఆచారం ఉంది. అటువంటి రామచంద్రుడు సీతా మనోభిరాముడయ్యే మనోజ్ఞ  కళ్యాణ దృశ్యాన్ని  మధుర మనోహరం గా వర్ణించారు కవి.
                
                  పరిణయవేళ సీత తలబ్రాలిడు నప్డు తదీయ బాహు మూ
                   ల రుచుల పైన, దన్ముఖవిలాసము పైన,చిరత్న ర్తన భా
                  స్వర గళలగ్నహారములపైన నటించు కటాక్షము -----
                
            మాపై కూడ చూపమని కోరిన ఈ కవి –    “ ఆదిన్ శ్రీ సతి కొప్పుపై, తనువు పై,  పాదాబ్జంబుల పై, కపోల తటి పై, పాలిండ్ల పై , నూత్న మర్యాదం చెందు  కరంబు అని వ్రాసిన  పోతన మధుర భక్తి ని  గుర్తుకు  తెచ్చి  రసిక హృదయాలను రంజింప జేస్తారు.
                            
                        రామచంద్రుని వెంట అడవికి బయలుదేరిన జానకి –కడుంగడు  మోహనంగా కన్పించింది ఈ కవికి. సుశ్యామల కోమలాంబుదము నంటి వెలుంగు తటిల్లతం బలెన్ ---- అని నల్లని కారుమేఘం వెనుక వెలిగిన మెరుపు తీగ వలె  రాముని వెంట సీత కదిలింది. భాస్కర రామాయణ వర్ణన పాఠకుల హృదయాల్లో మెదులుతుంది. శ్రీరామ నామానికి కొత్త అర్ధాన్ని ఆవిష్కరించారు కవి. శ్రీ –యనగా సీత –అని,  రా – యనగా- రామచంద్రుడని, మ –యనగా- భక్త్యాయుతుడైన లక్ష్మణుడని –కవి విశ్లేషణ.
     
           మండుటెండలో రాఘవుని అనుసరించే సీతమ్మను  కవి చూడలేక పోయాడు. రవి కిరణాళి కందిన సీత ను చెట్టునీడన నిలబెట్టాడు. ఆ చెట్టు గొడుగు లాంటి  కొమ్మల తో ఆవిడకు నీడ నిచ్చింది. దానికి కారణం ------
         
             అవనిజముల్  కడుం గొడుగు లట్టులు శాఖల బట్టుచున్నవి
           య్యవనిజ కిట్టులుండ వలదా నిజసోదర సాదర క్రియల్ ....
     

               చెల్లెలు వస్తుంటే  ఆప్యాయంగా చేతులు చాచి అబిమానించి ఆదరిస్తాడు అన్న. అది సోదర సోదరీ ప్రేమ. సీత   అవనిజ. వృక్షాలు అవనిజ లు. అనగా వీరు సహోదరులు. కాబట్టే  చెట్లు కొమ్మల వంటి చేతులు చాచి  సీతకు నీడనిచ్చాయి. చెల్లెలు వచ్చిందని  అన్నలు చూపిన ఆదరణ అది.  ఇటువంటి భావాలు పండిత జన ప్రమోదాలు  . రసిక హృదయ రంజకాలు అనడం లో  అతిశయోక్తి లేదు.
    
              అరణ్య వాసానికి బయలు దేరిన    రామ – సీత - లక్ష్మణుల లో ప్రణవమైన ఓంకారమే గోచరించింది కవికి. రాఘవుండు ముందుగ వెన్కను సీత లక్ష్మణుండే యెడ వీడిపోక వొకరే యనగా జని రా ఉమా -క్ష రాలే యెడ వీడకుండి యొకటి యగు సత్ప్రణవాక్షరంబనన్ --- అని – ఆ++అమ్  అన్న ( ఓం )  అక్షరాల్లోనే రామ – సీత- లక్ష్మణులను దర్శించిన ధన్యజీవి  తమ్మర పోతన్న. ఆచార్య దివాకర్ల వెంకటావధాని వీరి కవిత్వాన్ని గూర్చి వ్రాస్తూ వీరు భక్తి కవితా సంపద లతో పోతనకు థీటైన వారు. వారైహిక ధనలాభమునకు  గాని, కీర్తిని గాని వాంఛింపరు అన్నారు.
              
          
                         వేకువ జామున కాకులు కావు కావు మని అరవడం సైతం   రాముని కావుమని ప్రార్ధించినట్లే  ఈ కవి కి విన్పిస్తోంది.  --- కాకులు  గూడ వేకువన కావు హరే మము గావు మంచేక ముఖంబుగా నఱచు చెంతయు నిన్ను నుతించు చుండ గా మందులమై మేము  వేకువ నిద్ర లేచి నీనామము చేయలేక కాకుల  కంటె నీచులమని పల్కిన కవి మాటలు కొందరికి  ఎద లోతులలో ఎక్కడో గ్రుచ్చుకొని  బాధని కలిగించవచ్చు. కాని కవి మాటలు మాత్రం నిజం. ఇక్కడ ప్రాత: కాలపు వాయసంబు పణినా పత్యోక్త శాస్రంబు లో కాకుల చేత పాణిని  వ్యాకరణాన్ని ప్రస్తావింప జేసి,  కోకిలల చేత సమాధాన మిప్పించిన శ్రీనాథుడు  మన కవి హృదయం లోకి ప్రవేశించాడనిపిస్తుంది . ఆ కవి సార్వభౌముడు ఉద్ధండ పండితుడు కాగా, మన గోపన్న భక్తి కవితా నిర్మగ్నుడు. అందుకే   కాకులు  కావుకావు మని  రామచంద్రుని తెలుగు లో వేడుకున్నాయి.
         
                 గీతగీచి నిన్ను గీతలోపల నిల్పి
                   ప్రీతి చేత నీకు జోత సల్పి .......

  అని గీతలలో రామకోటి రాయడాన్ని రమ్యం గా చమత్కరిస్తాడు ఈ కవి.

  

                            రామచంద్రుని గీతగీసి తన మానసపంజరం లో నిలుపు కున్న  ఈ కవి చంద్రుని పూర్తిపేరు  నరహరి గోపాలా చార్యులు. బొమ్మకు పెళ్లియా యని నవ్వు వారలకు బ్రహ్మ కు వికృతి బొమ్మ యని, మాధవ కళ్యాణమే మానవ కళ్యాణము కాగలదని సున్నితంగా  సూచించిన ఈ కవి సాహిత్యము శాశ్వతమై విలసిల్లుగాక !




 **************************************************************************************

Saturday, 29 December 2012

శ్రీ రామ కావ్యామృతం ---3


                        శ్రీ రామ  కావ్యామృతం ---3
                  
                శ్రీ రామ నామాలు శతకోటి అన్నట్లు – శ్రీ రామ నామ ధ్యానం తో జీవితాన్ని పండించుకొని, కావ్యనిర్మాణం చేసిన భక్త కవులు ఎందరో. అటువంటి వారిలో  శ్రీమాన్ గుదిమెళ్ల రామానుజాచార్య ఒకరు. వీరు రామాయణ ఇతివృత్తమే ప్రధానంగా  ఎన్నో లఘు కావ్యాలు వ్రాశారు.ఆ కావ్యాల లో కొన్ని  ఆణిముత్యాల లాంటి పద్యాలు   రామ కావ్యాభిమానుల కోసం.

                   
                            సీతారాములను గురించి చెప్పేటప్పుడు, వ్రాసేటప్పుడు, సీతారాములు, జానకీ రాములు అనే పిలుస్తారు గానీ,రామ సీతలు, రామ జానకిలు అని ఎందుకు పిలవరు అని ప్రశ్నవేసి,    శబరి కావ్యం లో—ఈ విషయాన్ని ఎలా చమత్కరించారో ఈ భక్త కవి చూడండి.
                    
                        సీత, తనంత తా నెడమ చే నవలీలగ నెత్తు కార్ముకం
                       బాతరి నీవు లేచి కుడి హస్తము తో నది యెత్త గల్గి తీ
                       చేతుల జంటలో నెడమ చేతితో నెత్తుట గొప్పగాన,వి
                      ఖ్యాతిని గూర్చినారు జనకాత్మజకే ఋషులెల్ల రాఘవా.
             
               సీతాదేవి ఎడమ చేతితో తీసి ప్రక్కన పెట్టిన  శివధనస్సును, రామచంద్రుడు  నిండు సభ లో  కుడి చేతి  తో ఎత్తడం చూసి,   కుడి చేతి తో కంటే ఎడమ చేతితో ఎత్తడం  గొప్ప కాబట్టి  ఋషులందరు సీత పేరును ముందు చేర్చి ఆమె కే గౌరవాన్ని చేకూర్చారంటుంది  వీరి కావ్యం లో శబరి పాత్ర  రామచంద్రునితో.  అల్పాక్షరం పూర్వం అన్న  వ్యాకరణ  సూత్రాన్ని కాసేపు మర్చిపోతే, ఈ భావన అతిరమ్యంగా  సీతాధిక్యాన్ని సమర్ధిస్తుంది.
                  
        మరొకటి...... వీరి ఊర్మిళ కావ్యం నుండి   ----
              

                రాముని ఆజ్ఞానుసారం తనవారి  అనుమతి తీసుకోవడానికి, లక్ష్మణుడు అంతపురానికి వస్తాడు. దాసి  వెళ్లి ఆ వార్తను ఊర్మిళ కు చెప్పింది.
                      
                      పచ్చని మేని తో, నుబికి వచ్చెడి ప్రాయపు బాలపొంగు తో,
                       విచ్చిన తమ్మిపూల వలె వేడుక గొల్పెడు కన్నుదోయి తో
                
                   చక్కని ముక్కు , శ్రీ లొలుకు సన్నని మేను,గులాబి శోభలన్
                 బుక్కిలిపట్టు చెక్కిలియు, పుష్పశరండుల జైత్ర యాత్ర కై
                  యెక్కు రథమ్మువోలె గడు నింపుగ నున్న  నితంబము,
                
                  పచ్చని శరీరము, పాలపొంగు లాంటి ప్రాయము,విచ్చిన తమ్మిపూల వంటి కన్నుదోయి, చక్కని ముక్కు, శ్రీ లొలుకు సన్నని శరీరము, గులాబీల కాంతిని పుక్కిలి పట్టినట్లున్న చెక్కిళ్ళు, మన్మథుడు జైత్రయాత్ర కు బయలుదేరు రధము వంటి నితంబము,   ---------      ఇది  ఊర్మిళాదేవి మనోజ్ఞమైన వర్ణన లో ఒక భాగం మాత్రమే.
                         భర్త వచ్చిన విషయం దాసి చెప్ప గా, మేడ దిగి వస్తున్న ఊర్మిళా దేవిని కవి వర్ణించిన తీరు చూడండి.   ........
                 
                   గబ గబ మేడ మెట్లు దిగి కాంచి నితంబము నుండి వ్రేలగా
                    గుబ గుబ పొంగ దియ్యనగు కొన్ని తలంపులు, రాజహంసకున్
                    సొబగులు  నేర్పునట్టి గతి శోభలతో నెదురేగుదెంచె, లో
                    నుబికిన ప్రేమవాహిని మహోర్ముల నూర్మిళ నూపు చుండగన్ .
           
       
                 "మైథిలి అనే కావ్యం లో   బ్రహ్మర్షి విశ్వామిత్రుడు రాజర్షియైన జనకుని తో ప్రస్తావనా వశం గా రాముని గూర్చి చెపుతూ  ........
        
         “ ఆగమమన్న మాకు నిజమైనది రాముని యాగమమ్మె, మా
           యోగమటన్న వీడుదరి నుండుటె యోగము, దర్శనమ్మనన్
          బాగుగ వాడు మేమిటుల పార్ధివ చూచుటె  దర్శనమ్ము, మా
          కాగమయోగదర్శనము లన్నియు రాముడె చాలు – ధన్యుడన్.
  
 అంటాడు.
             
                     ఈ మాటలు విశ్వామిత్రుని లో పరకాయప్రవేశం చేసిన  భక్తకవి గుదిమెళ్ల వేనేమో అనిపిస్తుంది. ఆగమ ,యోగ, దర్శనాలన్నీ రామునిలోనే  దర్శించిన భాగ్యశాలి గుదిమెళ్ల. అహంవేద్మి మహాత్మానాం రామం సత్య పరాక్రమం అన్న  విశ్వా మిత్రుని తో కవి ఈ పల్కులు పల్కించడం ఎంతో సహజసుందరంగా ఉంది.

శ్రీ సీతారామ కళ్యాణాన్ని  కవి  వర్ణించిన  తీరు  మిక్కిలి  రమణీయం. 
           
                    పువ్వులు రాల—దుందుభులు మ్రోయ, నభస్ధలి నోరచూపులన్
                       రువ్వుచు నుండ,-గన్యలు పురోహితుడా శిషమీయ,గడ్డమున్
                        దువ్వగ మౌని-దశరధుండెన లేని ముదంబు నొంద, లే
                       నవ్వుల మోము తోడ రఘునాథుడు పెండిలి యాడె మైథిలిన్ 

చంపకోత్పలాలతో గుణాభరణాంచిత కావ్యకన్యకను రఘురామునికి సమర్పించిన ధన్యాత్ములు శ్రీ రామానుజాచార్యుల వారు.





**********************************************************