Saturday, 8 December 2012

శ్రీ చెన్నకేశవస్వామి అంటే ...........


            శ్రీ   చెన్నకేశవస్వామి   అంటే..........
                               
          
                 శ్రీ చెన్నకేశవుడు తెలుగునాట 10శతాబ్దం లో అవతరించిన దేవతా సార్వభౌముడు. పల్నాటి వీరుల కొలుపు లందు కొంటున్నవీర దైవత మూర్తి ఈయన. 
              శంఖ చక్ర గదా పద్మ ధారిణే దోషహారిణే
               పరతత్త్వ స్వరూపాయ  పంచవ్యూహాయ  మంగళమ్.!”
                    అంటూ భక్తకోటి చే మంగళాశాసనాలందుకొంటున్న ఆర్తులపాలిట ఈ కొంగుబంగారం పురాణ వాజ్ఞ్మయం లో కన్పించడంలేదనే చిన్నసందేహాన్ని విచ్ఛిత్తి  చేస్తే ఈ వ్యాసానికి రూపం వచ్చింది.
         
                  సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్ఛతి అని  చతుర్వింశతి కేశవనామాలతో నిత్యము శ్రీ మహావిష్ణువు ని  ఆరాధించే ముముక్షువులు చెన్నకేశవుని మోహనరూపాన్ని చూచి మురిసిపోతున్నారు.


                                  శ్రీకాకుళ ఆంద్రమహావిష్ణువు
                                         
                   స్వామి చేతుల్లో      శంఖ చక్రాలు తారుమారు గా ఉండటం గమనించవచ్చు             
                 
              “ 
             జితకోటి స్మరోత్తజ్ఞ సౌందర్యాజ్ఞ విలాసినే
             బ్రహ్మాండ సార్వభౌమాయ భవ్యవృత్తాయ మంగళమ్.!”
                              అంటూ కైమోడ్పు లర్పిస్తున్నారు. శంఖ చక్ర గదాధారుడై పద్మాంకిత అభయహస్తం తో ఆర్తజనులను ఆదుకొనే స్వామి చెన్నకేశవుడు. పుంసాం మోహనరూపుడైన ఆ ఆది నారాయణమూర్తి రూపమే జగన్మోహనము కాగా ఆయనయే జగన్మోహిని యైతే ఆది శంకరుడే మెత్తని చిత్తము కలవాడైనాడని భాగవతం చెపుతోంది. మగువ మరగి సగమయినమగవాడు (శంకరుడు) ఆమోహిని వయోరూపగుణవిలాసములు ఊరింప,  ఈ లీలావతిం జేరగా ఏ కాంతుండు గలండో! క్రీడలకు నాకీ యింతి సిద్ధించునే? యని వెంటబడి తుదకు ధరణి వీర్యంబు వడఁ దన్నుదానెఱింగ దేవమాయాజడత్వంబు తెలిసి కొన్నాడు హరుడు అని ఈ ఘట్టంలో పోతనామాత్యుని తెలుగుసేత.
                         
                              సుందరరూపుడైన కేశవుని సృజించడానికి మహాకవులు చేసిన ప్రయత్నమే 10 వ శతాబ్దం చివర లోనే మహాశిల్పులు చేసి నిరూపించారు.అమరశిల్పి జక్కన అద్భుతసృష్టి బేలూరు చెన్నకేశవాలయం. హోయసల రాజుల నిర్మాణంగా బేలూరు చెన్నకేశవాలయం   చరిత్ర లో ప్రసిద్ధపొందింది. వీరి పరిపాలనా కాలం 10, 11 శతాబ్దుల మధ్య భాగంగా పరిశోధకులు నిరూపించారు.
                    చెన్ను శబ్దము నిఘంటువులలో అందము,కాంతి ,విధము, సౌందర్యము అనే అర్ధాలలో చెప్పబడింది.చెన్నుడు అంటే అందగాడు అని కూడ స్పష్టంగా ఆంద్రదీపిక చెపుతోంది. కేశవుని అత్యంత సుందరరూపుని గా తీర్చిదిద్ది చెన్నకేశవుని  చేసిన ఖ్యాతి  అపూర్వమై, ,  హోయసల రాజుల    కీర్తి ని అజరామరం చేసింది.
                     
                                       శంఖ చక్రాలను కుడి ఎడమ చేతుల్లో తారుమారు గాధరించి, గదాధారుడై, అభయహస్తంలో పద్మాన్ని దాల్చిన సుందరరూపుడైన చెన్నకేశవుడు దక్షణ భారతం లో దర్శన మిస్తున్నాడు. కార్యమపూడి యుద్దరంగంలో జై చెన్నకేశవా”! నినాదం దిక్కుల పిక్కటిల్లిన కాలం శా.శ 1098-1104 మధ్యకాలంగా చరిత్ర చెపుతోంది. అంటే పల్నాటి యుద్ధం 11 వ శతాబ్దం లోనిది. కాగా చెన్నకేశవుడు పల్నాటి వీరుల ఇలవేల్పు గా కన్పిస్తాడు. అంతేకాదు చెన్నుడు అంటే మాచర్ల చెన్నుడు అని నిఘంటువులు ఘంటాపథం గా
చెపుతున్నాయి. అంటే పల్నాటి వీర చరిత్ర కు – తెలుగునాట చెన్నకేశవ ప్రాదుర్భావానికి సంబంధం ఉన్నదనేది యధార్ధం.
                                ఈ గాథ పల్నాటి వీర చరిత్ర లో అనుగు రాజు  పల్నాటి సంపాదనము అనే ఉపశీర్షిక దగ్గర ప్రస్తావించ బడింది.కనకాద్రి చెన్నకేశవుడు అనుగు రాజు ఇలవేల్పు. ఆ కథ ఇలా సాగుతుంది.
                
                            ఉత్తరహిందూదేశం లోని పాలమాచాపురి అనే పట్టణానికి పరిపాలకుడు అనుగురాజు.అతడు కార్తవీర్యార్జునుని వంశమువాడు.అతడొక రోజున తన పురాకృత పాపాలను కడిగి వేసుకోవడానికి విప్రులను పిలిచి వారికి భూరి దానాలను ఇచ్చుచుండగా, వారి ఇలవేల్పు కనకాద్రి చెన్నకేశవుడువృద్ధ బ్రాహ్మణుని రూపం లో ఆ సభ లోనికి వచ్చి ఓ రాజా !ఇంతకు  పూర్వము కార్తవీర్యార్జునుడు జమదగ్ని ని చంపిన పాపము, బ్రహ్మహత్యాదోష మై నిన్ను వెంటాడు చున్నది.నీవు ఆ వంశము వాడివి . కావున ఆదోషము పోవడానికి నల్లని   వస్రాలు ధరించి, తీర్ధయాత్రలు చేస్తూ, సకల తీర్ధాల్లోను స్నానమాడి, దివ్యక్షేత్రాలను దర్శించి సేవించ వలెననియు, ఏ తీర్ధస్నానము వలన నీ నల్లని బట్టలు తెల్లబడతాయో అప్పుడు  నీ పాపము తొలగి పోవుననియు బోధించెను.
                    
                          చెన్నకేశవుని ఆజ్ఞను శిరసావహించి తీర్ధయాత్రలకు బయలు దేరాడు అనుగు రాజు. అనేక తీర్ధక్షేత్రాలను సేవిస్తూ, బెజవాడ కృష్ణా నది లో స్నానమాడి దుర్గమ్మను కొలిచి, తరువాత  “మోటుపల్లె వద్ద సముద్ర స్నానం చేయగా అతని నల్లని వస్త్రాలు  తెల్లగా మారాయి.  అందుకు ఆనందించిన అనుగు రాజు ఆంద్రదేశాన్ని వదిలి వెళ్లలేకపోయాడు. అదే సమయంలో చందవోలు ను పాలిస్తున్న పృధ్వీశుడు తన కుమార్తె మైలమాదేవి ని అనుగు రాజు కిచ్చి బాంధవ్యం కలుపుకున్నాడు. అంతే కాకుండా తనకుమార్తె పసుపు క్రింద అరణంగా పల్నాడును అనుగు రాజు కిచ్చాడు. కొద్దికాలం గురజాల లో ఉండి తిరిగి తన నగరానికి అంటే పాలమాచాపురి కి బయలుదేరాడు అనుగు రాజు. కాని చెన్నకేశవుడు అతనికి కల లో కన్పించి, కార్తవీర్యార్జునుని పాపం తో పంకిలమైన పాలమాచాపురి కి వెళ్లవద్దని ఇక్కడే ఉండవలసిందని ఆజ్ఞాపించాడు.
                       ఇచ్చోట నిలిచెద మిద్దర మిపుడు
                         తీరుగా కట్టించు దేవళ మొకటి           
              అని కూడ ఆజ్ఞాపించాడు. అనుగురాజు వెంటనే చెన్నునికి ఆలయం కట్టించాడు.
                             చెన్నకేశవునకు చెలువ గ్గలింప
                             కోవెల గట్టించె గురజాల లోన
                  ఇది చెన్నకేశవుడు ఆంద్రదేశం లో అడుగుపెట్టిన ఇతిహాసం. ఈ చరిత్ర లో కొన్నియెడల చారిత్రకాధారాలు కథ కు అడ్డుగా నిలుస్తున్నాయన్నారు ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు.
       
                        పై కథ నుబట్టి చెన్నకేశవుడు పాలమాచాపురి నుండి అనుగురాజు ను ఆదుకోవడానికి గురజాల లో ఆవిర్భవించాడు. ఈ పాలమాచాపురి  నే జంభలాపురి ని కూడ పిలువబడుతోంది.ఇదే నేటి మధ్యప్రదే శ్ లోని  జబల్పూర్ అయి ఉండవచ్చని విమర్శకులు భావించారు. హోయసల రాజుల సృష్ఠి బేలూరు. హైహయవంశములోని వాడు అనుగురాజు. పలనాటి హైహయులు పశ్చిమ చాళుక్యుల కు సామంతులు గా ఉన్నారు.బేలూరు చెన్నకేశవుడు ప్రాచీన దైవము కాగా గురజాల చెన్నకేశవుడు పల్నాటి వీరుల ఇలవేల్పు గా రూపుదాల్చాడు.
              
                            చెన్నబసవడు వీరశైవ మత బోధకుడుగా చారిత్రక వ్యక్తి. ఈయనను కుమారస్వామి అవతారం గా వీరశైవులు భావిస్తారు.11 వశతాబ్దం ఉత్తర భాగం 12 వ శతాబ్దం  చివరి భాగం వరకు ఆంధ్రదేశచరిత్ర లో రాజకీయంగా, మతపరంగా కూడ మిక్కిలి చెడ్డకాలంగా చరిత్ర చెపుతోంది.శైవ వైష్ణవ భేదాలు తారాస్ధాయిని అందుకున్నాయి. పల్నాటి యుద్ధమే శైవ వైష్ణవ తగాదాల వలన సంభవించిందన్నంత గా ఈ పరిణామం వ్యాపించింది. నాగమ్మ శైవాన్ని సమర్ధించగా, బ్రహ్మన్న వైష్ణవాన్ని పోషించాడు. చెన్నమల్లిఖార్జునుడు చెన్నబసవడు వీరశైవులకు ఆరాధ్యదైవాలు కాగా,----వైష్ణవులు చెన్నకేశవుని దర్శించి,పూజించి ,తరించారు.
                       
                      అయితే చెన్న శబ్దం ఛన్న శబ్దానికి వికృతి యని కొందరివాదన.కేశవుడు వేరు వేరు ప్రదేశాల్లో వేరు వేరు పేర్ల తో పిలువబడు తున్నాడు. శ్రీకాకుళం లోఆంధ్ర మహా విష్ణువని ,ఆంద్రనాయకు డని, కాకు ళే శ్వరుడని, తెలుగురాయడని పిలువబడుతుండగా,పెదపులివర్రు లో వరదరాజస్వామి యనికర్లపాలెం లో జనార్దనస్వామి యని, మరికొన్నిచోట్ల  చెంగల్వరాయుడని,సుందరరాజస్వామి యని పలురీతులు గా పిలువ బడుతున్నాడు.ఈ విధంగా ప్రచ్ఛన్నరూపుడై యుండుటచే  కేశవుణ్ణి ఛన్నకేశవుడని కూడ  కొందరు పిలుస్తున్నారు.
                      


                               శ్రీ కాకుళం ఉపాలయం లో శ్రీ చెన్నకేశవస్వామి
                

                   చెన్నకేశవుని చేతిలో శంఖ చక్రాలు తారుమారు గా ఉండటానికి కారణాన్ని వెతికి, గజేంద్ర మోక్ష ఘట్టాన్ని ప్రస్తావిస్తున్నారు చెన్నుని భక్తులు. గజేంద్రుణ్ణి రక్షించడానికి హడావుడి గా బయలుదేరిన శ్రీ మహావిష్ణువు శంఖ చక్రాలను తారుమారు గా పట్టుకున్నాడని వీరివాదన. కాని భాగవతం లో గజేంద్ర మోక్ష ఘట్టం లో శ్రీ మహా విష్ణువు  ఆయుధాలే లేకుండా బయలుదేరాడని గదా మన పోతన్న చెప్పింది.కాబట్టి చెన్నకేశవుడు భాగవతం లో కన్పించడు.
                    
                          యుద్ధభూమి లో ముందుగా శంఖాన్ని పూరించి , అనంతరం యుద్ధానికి పూనుకుంటారు కాబట్టి శంఖాన్ని కుడి చేతి లో ఉంచి చక్రాన్ని ఎడమ  చేతిలోనికి  విగ్రహ స్రష్ట లు  అంటే శిల్పులు మార్చి ఉంటారని ఒక వాదన.  వాదన బాగానే ఉంది ,కాని సాక్ష్యాలు కావాలి కదా.!
                పల్నాటి వీరచరిత్ర  లో--- ఓ కలినాశా అని అనుగురాజు చెన్నకేశవుని ప్రార్ధించాడంటే నే ఈయన కలియుగ దైవంగా చెప్పకయే చెప్పినట్లైంది కదా.!
                      
                         “ నాగమ్మ కుటిలనీతి ముందు బ్రహ్మన్న రాజనీతి రక్తపుమడుగుల్లో తడిసి పోయింది. కార్యమపూడి చెన్నకేశవాలయం,”” వీరుల గుడులు”” మాచర్ల చెన్నుడు చరిత్ర లో మిగిలి పోయారు.
                           అదృష్ఠ పూర్వ వస్త్రైశ్చ చిత్రమాణిక్య భూషణై
                            దేదీప్య మాన దేహాయ దేవ దేవాయ మంగళమ్.
                              

                       *******************ఇతి శమ్**********************

Friday, 30 November 2012

ఓ అపురూపచిత్రం - శ్రీ కలిసంతరణవేంకటరమణ మూర్తి


            ఓ అపురూప చిత్రం   -  శ్రీ  కలి సంతరణ వేంకటరమణమూర్తి
                         
                      నా నృషి: కురుతే కావ్య మ్ .ఋషి కాని వాడు కవి కాలేడన్నది ఋషివాక్యం. ద్రష్ట యైన కవి తన మనోనేత్రం తో దర్శించిన దానిని జనావళి  ఆనందం కోసం కావ్యరూపం లో అందిస్తాడు. అందుకే కవిరేవ ప్రజాపతి: అన్నది శాస్త్రోక్తి. రవి  కాననిచో కవి కాంచునే గదా.! అన్నది ఆర్యోక్తి. కవయ: క్రాంతదర్శిన:”. అన్నది ఆలంకారికోక్తి. సమాజంలోని అశాంతిని,అసమానతలను చూచి చలించని వాడు  మహాకవి కాలేడు.               
                    మహాకవి తిక్కన  సోమయాజి  యై కూడ ఆనాటి సమాజ దుస్థితి ని చూచి చలించి పోయాడు.ఆనాటి సమాజాన్ని శైవ,వైష్ణవ మత విద్వేషాలనుండి రక్షించాలనే తపన,ఆలోచన, ఆవేదనలు అన్నివేళలా ఆయనను వెంటాడాయి.    సుషుప్తావస్ధ  లోను  అదే ఆలోచనతో ఉన్న  ఆయనకు స్వప్నంలో  హరిహరనాథుడు  సాక్షాత్కరించాడు.

                                హరిహర నాథుడు

                       కరుణారసము వొంగి తొరగెడు చాడ్పున
                                     శశిరేఖ నమృతంబు జాలువాఱ
                     -----------------------------                                                
                 బ్రధమాద్రి  దోతెంచు భానుబింబము నా ను
                                        రమ్మున గౌస్తుభ రత్నమొప్ప
             
              అలా  ప్రత్యక్షమైన హరిహరనాథునకు పంచమ వేదం పదిహేను పర్వాలను అంకితమిచ్చి తన ఋణం తీర్చుకున్నాడు సోమయాజి. దానితో ఆనాటి సమాజం  తేరుకోవడానికి  ఒక అవకాశం ఏర్పడినట్లైంది.
                 
              అలాగే    కళింగ జైత్రయాత్ర లో  భాగంగా విజయవాటిక లో  విడిది చేశాడు శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకాకుళ ఆంథ్రమహావిష్ణువు ను గూర్చి విన్నాడు. హరివాసరోపవాసాన్ని శ్రీకాకుళం లో చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఉపవాసధీక్ష లో నున్న సాహితీ సమరాంగణ సార్వభౌమునకు ఆంథ్రమహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఆముక్తమాల్యద  ను  రచించమని ఆజ్ఞాపించాడు.
                     


                                           శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు
          
                
               “ నీలమేఘము డాలు డీలు సేయగ జాలు
                                     మెఱుగుఁ జామన చాయ  మేనితోడ
                     నరవిందములకచ్చు  లడగించు జిగి హెచ్చు
                                   నాయతంబగు కనుదోయి తోడ
      

                         ప్రత్యక్షమైన  ఆంథ్రనాయకుని ఆజ్ఞను శిరసావహించి అప్పిన్నది రంగమందయిన పెండిలిని గూర్చి  కావ్యం నిర్మించాడు శ్రీ కృష్ణరాయలు.
                      
                
                       అదే విధంగా కలియుగ దైవమైన వేంకటేశ్వరుడు రామ కృష్ణుల అవతారమనే  విశ్వాసం పద్మనాభాచార్యుల  వారిది.హరేరామ హరేరామ రామరామ హరే హరే హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరే హరే అనేకలిసంతరణోపనిషత్తు ఉపాసన లో ఉన్న ఆయనకు శార్వరి నామ సంవత్సరం కార్తీక శుద్ధ అష్టమి గురువారం       ది .27-10-60 రాత్రి స్వప్నం లో కలిసంతరణవెంకటరమణమూర్తి  స్వప్నం లో దర్శనమిచ్చాడు. మనసు లో ఉన్న భావాలే స్వప్నంలో సాక్షాత్కరిస్తాయంటారు కదా!




                           శ్రీ కలిసంతరణ వేంకటరమణ మూర్తి

                   ఆ  వేంకటేశ్వరుని రూపం ఆయనకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని,ఆ పైన సందేహాన్ని కల్గించింది. వేంకటేశ్వరుడు అలా  సాక్షాత్కరించడానికి   గల  కారణాలకు గ్రంథ ఆధారాలను   అన్వేషించడం మొదలుపెట్టారు ఆయన. ఆ అన్వేషణ  కార్తీక బహుళ చతుర్ధశి గురువారం   అనగా ది.17.11.60 వ ఫలించింది.  త్రేతా,ద్వాపర యుగాల్లోని రామ కృష్ణు లే కలి యుగం లో వేంకటేశ్వరుని గా వచ్చి వేంకటాచలం మీద వెలసినట్లు భవిష్యోత్తరపురాణం లోని శ్రీవేంకటాచలమాహాత్మ్యం లో  వ్రాయబడిన విషయాన్ని చూచి సందేహ నివృత్తి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే  తన గ్రంథం మూలికా చిత్రగుణప్రకాశిక లో ముఖచిత్రవివరణము అనే శీర్షిక తో వ్రాసుకున్నారు. ఆ గ్రంథం లోని శ్లోకాలు ఇవి.
         
           కౌసల్యా కీటకగృహం తింత్రిణీ దశ దిగ్రధ:
           గిరిరూపో 2నుజస్సాక్షాదయోధ్యా భూదధిత్యకా.  !
            ఇత్థం రామావతారేణ సమాం క్రీడా మకల్పయత్ .  !   18 శ్లో
         
           వల్మీకం దేవకీ సాక్షాద్వసు దేవో 2ధతింత్రిణీ
           బలభద్ర శ్శేషశైలో మధురాభూ దధిత్యకా . 

                ఏవం శ్రీకృష్ణ రూపేణ క్రీడతో వేంకటాచలే  !! 
20                                              

            భవిష్యోత్తర పురాణాంతర్గత శ్రీవేంకటాచల మాహాత్మ్యే చతుర్ధో అధ్యాయ:
                  
        స్వప్నం నుండి  మేల్కొన్న వెంటనే తాను దర్శించిన రూపాన్ని తనకున్న  నైపుణ్యంతో   చిత్రంగా  గీశారు.   దాన్ని తరువాత రోజుల్లో కొద్దిగా దిద్దించి కోరుకున్న భక్తులకు అందించారు. ఆ చిత్రం ఇదే.

                రామ కృష్ణుల తో గూడిన శ్రీ వేంకటేశ్వరుని దివ్యమంగళవిగ్రహం.
   
                ఇంతకీ ఆయన ఎవరు.?    అంటే  .......            ఆయుర్వేద విద్యాపారంగత ,మంత్రశాస్త్ర విశారద  ఇత్యాది బిరుదులంది,ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేద మహామండలి ప్రధాన కార్యదర్శి గా పనిచేసి, మూలికా చిత్రగుణ ప్రకాశిక, మూలికా యోగ మాలిక, వంటి ఆయుర్వేద గ్రంథాలను, భారతసావిత్రి, విభూతి యోగ విశేషములు ,పంచసంస్కారభాస్కరమ్, విష్ణువంటే?, రాముడేడి? ,చెన్నకేశవ శతకం, వేంకటేశ్వర శతకం,  స్ర్తీలకు స్వాతంత్ర్యము లేదా? వంటి  పుస్తకాలను వ్రాసిన వారు శ్రీ ముత్తేవి అనంత పద్మనాభాచార్యులు గారు. ఈయన స్వతహాగా రామ భక్తులు.  విజయవాడ,దేవరపల్లి , రొయ్యూరు ,కురుమద్దాలి గ్రామాల్లో జీవనయాత్ర సాగించారు.
                                     
                           కీ.శే. ముత్తేవి అనంత పద్మనాభా చార్యులు గారు
                
                ఈ స్వప్నం తరువాత కలలో కన్పించిన వేంకటరమణుని మీద ప్రార్థనా శ్లోకాన్ని రచించి ఆ చిత్రంతో ముద్రించారు. ఆ రోజుల్లో ఈ చిత్రాన్ని పెద్దది చేయించి పదిపైసలకు అందించేవారని ఆ తరంలో మిగిలి ఉన్న వారు చెపుతున్నారు.
         
        ప్రార్ధనాశ్లోకం యిది.
       
          “ శంఖం చక్రం చ చాపం  వరద కటి కరౌ బాణ వేణూ కరాబ్జై:
         బిభ్రాణం శేషశైలే  రఘుకుల యదురాడ్రూప శ్రీ వేంకటేశం
         శ్రీ సాలగ్రామమాలా లసిత దురుగళం  దివ్య నవ్యాంగ రాగం
          వందే లక్ష్మీ విశిష్టం కలితరణ శ్రుతేశ్శీర్ష  మత్యక్త మూర్తిం .!!”
            
              ఈ శ్లోకాన్ని మూలం నుండి యథాతథం గా ఇవ్వడం జరిగింది. అక్షర స్కాలిత్యాలు ముద్రాపకులవి మాత్రమే. ఈయన 1975 ప్రాంతం లో  మరణించారు.   ఈయన వ్రాసిన  అన్ని పుస్తకాలమీద ఈ చిత్రమే ముఖచిత్రం గా ఉంది..
      
            దీనితో పాటు  వీరు వ్రాసిన కలి సంతరణ వెేంకటరమణ మంగళాశాసనం కూడ  వీరి పుస్తకం విభూతి యోగ విశేషములు అనే దాంట్లో  ముద్రించబడింది.. ఇవి నా దగ్గర కొచ్చి చాలకాలమైనా   వెలుగు లోకి రావడానికి ఇంతకాలం పట్టింది. దేనికైనా కాలం రావాలి కదా.!
           
         శ్రీ  కలిసంతరణ వేంకట రమణ మంగళాశాసనమ్.
    
    శ్రీ వేంకటరామ కృష్ణాయ శ్రియాధిష్టి త వక్షసే
    చక్రాబ్జ వరకట్యాత్త చతుర్హస్తాయ మంగళమ్             1  
        శ్రీ రామకృష్ణ రూపాయ వేంకటేశాయ మంగళమ్.!     2
         
        కీటగేహామ్ల జాతాయ చాప బాణ ధరాయ చ
        రామచంద్ర స్వరూపాయ వేంకటేశాయ మంగళమ్.!    3
        
         వల్మీక తింత్రిణీరూప దేవకీ వసుదేవయో:
         జాతాయ వేణు యుక్తాయ శ్రీనివాసాయ మంగళమ్.!     4
        
          హరే శ్రీ రామ కృష్ణాయ హతకిల్పిష రాశినే
         పాపాద్రి పవినే లోక పాలినే తేస్తు మంగళమ్.!               5
       
          వైఖానస ముని శ్రేష్ట వంది తాంఘ్రి యుగాయ తే
          వారిదాంభోజ వర్ణాయ వైకుంఠాయాస్తు మంగళమ్.!           6
        
          కాకాసుర మహాఖర్వ గర్వపర్వత భేదినే
         జానకీ జానయే తే2స్తు మంగళం జయ మంగళమ్.!           7
        
          నాగరాజ శిరోదేశ నర్తి తాంఘ్రి యుగాయ చ
          వల్లవీ జనతా ప్రాణ వల్లభా యాస్తు మంగళమ్.!!                   8       

             శిథిలాలలో   నశించి పోతున్న ఒక అపురూప చిత్రాన్ని అర్హులైన వారికి అందించడానికి చేసిన   చిన్న ప్రయత్నమిది. ఇలా వెలుగులోకి రాకుండా  మిగిలిపోతున్న ఎందరో భక్త కవులకు ఇది హృదయపూర్వక నివాళి.


             
                        **** నాస్తి తేషాం యశ: కాయే జరామరణజం భయమ్*

Sunday, 25 November 2012

శ్రీరామ కావ్యామృతం--2



                   
                  
                   శ్రీ రామ  కావ్యామృతం ----2


       
                              తెలుగు లో ఎందరో భక్త కవులు  రామకధను కావ్యాలుగా, తమకు నచ్చిన మెచ్చిన వచ్చిన రీతిలో  గానం చేసి, శ్రీరామ నామా మృత పానంతో ధన్యజీవుయ్యారు.   లఘు కావ్యాల లో అమృత గుళికల వంటి  కొన్నిపద్యాలను, వ్యాఖ్యానం ఆశించని వాటిని  రసజ్ఞులైన రామభక్తులతో  కలసి పంచు కోవడమే ఈ శీర్షిక ముఖ్యోద్దేశ్యం.
  
        రాముని కంటె నన్యము పరాత్పరు డొక్కడు లేడు ,సర్వశో
    భామయమైన ప్రాకృతిక భాగ్యమునుండి యనంత దైవిక
    శ్రీ మిళితంబునై రఘువరేణ్యుని మూర్తియు శక్తినొప్పు, న
    మ్మా! మఱి రామ నామ జపమంగళ గీతము  లాలపింపుమా!

          యోగులయందునన్ పరమయోగి, మహర్షులలో మహర్షియున్
            భోగుల యందునన్  బరమభోగి,యఖండతపస్వి. సర్వశా
          స్త్రాగమ వేద్యుడున్ ,రఘువరాన్వయ దివ్యమణి ప్రదీపమున్

రాముడె దిక్కు నీకు! రఘురాముడె నీకు విముక్తి నిచ్చు,శ్రీ
 రాముడె జన్మ కర్మల పరంపర లన్  దెమలించు,  జానకీ
 రాముడె సర్వధర్మ చయ రాజిత సాధుపవిత్ర మూర్తి

          రాముని దివ్యనీల రుచిరమ్ములె సుందరవారిదమ్ములై
           స్వామి సుమిత్ర సూతి తను సాంద్ర కళారుచులే తటిత్తులై
           ప్రేమను వారి భాషణము లే కలితమ్ములు మేఘగర్జలై
           ఆమని వర్షముల్ కురియు నట్లుగతోచె, -  నతండు రాముడే.

రాముని కంటి కోసల విరాజిలు కాంతులె శారదీయ పూ
ర్ణామల చంద్రికా నిభములై, యనుజన్ముని కంటి వెల్గులే
శ్రీమహితారుణారుణ మరీచి వితానములై, పవ్త్ర సం
          ధ్యా మధుమాధురీ శబలితమ్ములు తోచె – నతండు రాముడే.
        
          రాముని దివ్యమంగళ విరాజిత రూపము దగ్గఱింపగా
           నామెకు గుండెయెల్ల దడయై జడయై – ధృఢమై – నితాంత ని
             ష్కామనమై – శరీర మవశమ్మయి వ్రాలగ జేతులెత్తి శ్రీ
             రామ! నమో! నమో!  యనుచు వ్రాలె పదంబుల భక్తిమూర్తియై.
                         
                       “వాలి పోవు కనుఱెప్పలన్ పైకి తెరచి
                     చూపుతోడనె రఘుపతిం జుఱ్ఱునట్లు
                           తనివి  తీరని చూడ్కులన్ దడవి కొనుచు
                          నిలిచిపోయెను ముదుసలి – నిముసమట్లె.

    తండ్రి సగ భాగమైన సీతమ్మ లేని
       కడమ యర్ధమె యింతటి కాంతులీన
         రెండు నొకటిగ నున్న భరింపగలమె.
                     
                 చలన మెఱుగని భక్తియే చాలు గాని
                       తనువులెంతటి దూరమో మనసులంత
                        దగ్గరగ నుండి యొండొంటి తారసిలును. 

 కవి. పెమ్మరాజు వేణుగోపాలకృష్ణమూర్తి     కావ్యం. శబరి .                               తల్లిదండ్రులు  వరలక్ష్మమ్మ, సూర్యప్రకాశరావు.        జన్మస్ధలం. చిట్యాల,            జననతేది.       23.10 1912                  తిరువూరు తాలూకా




***************************శ్రీరామ జయమ్********************