Thursday, 15 November 2012

శ్రీరామునకు శబరి ఎంగిలి విందు వాల్మీకమేనా?


             శ్రీరామునకు శబరి ఎంగిలి విందు వాల్మీకమేనా?


             

           



   శబరి మతంగమహర్షి శిష్యురాలు. సిద్ధయోగిని.శ్రీ రామచంద్రుడు లక్ష్మణునితో కలసి నీ ఆశ్రమానికి వస్తాడు అన్న గురువు ఆదేశాన్ని తలదాల్చి మతంగముని ఆశ్రమంలోనే    రాముని కోసం ఎదురు చూస్తూ ఉండి పోయిన రామ భక్తురాలు.ఎదురు చూస్తూనే వృద్ధురాలై పోయింది. రామచంద్రుడు వచ్చాడు .కుశల ప్రశ్నల అనంతరం అర్ఘ్య పాద్య ఆచమనీయాలు సమర్పించి, ఆయన కోసం ఎంతో కాలంనుంచి సేకరిస్తున్న పండ్లు ఫలాలను అందించింది.  రాముని అనుజ్ఞ తో ,యోగాగ్ని లో ప్రవేశించి, మహా యోగులు  పొందే సాయుజ్యాన్ని పొందింది శబరి.
              
                అయోధ్య రాముడు ఆంధ్రావని కి తరలివచ్చి భద్రగిరి పై కొలువు తీరి తెలుగువారి ఇలవేల్పు యైనట్లే వాల్మీకి సృష్టించిన శబరి తెలుగింటి ఆడపడుచు  వలె  తెలుగు  వారి గుండెలకు చేరువై  తెలుగునాట చిరస్ధాయిగా నిలిచి పోయింది.కిన్నెరసాని వలె శబరి కూడ కావ్యనాయికయై రసజ్ఞుల హృదయ కేదారాలనే కాదు  తెలుగు నాట వాగుగా మారి సస్య కేదారాల సైతం సారవంతం చేస్తున్నగోదావరిఉపనది. అందుకే శబరి  పాత్ర తెలుగు వారి సొంతమై పోయింది.  ఎందుకంటే – ఇక్కడొకసంగతి  చెప్పాలి. భక్త రామదాసు పుట్టినఊరు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి. అక్కడ పోలీసు శాఖ లో పనిచేసి రిటైరయిన ఒకమహాను భావుడు ప్రతి సంవత్సరం శ్రీరామదాసు ఆరాధనోత్సవాలు నిర్వహిస్తుండే వారు. ఒకసారి నన్నుఅతిథిగా పిలిస్తే వెళ్లాను.   బస్టాండు లో దిగి నేను వెళ్ల వలసిన ప్రదేశం వెతుక్కుంటూ ఉంటే  ఎదురుగా ఒకబోర్డు కన్పించింది. శబరి టీ స్టాల్ నాకు ఆశ్చర్యమేసింది. దేవుని పేర్లు, సినిమా వాళ్లపేర్లు చూశాము గాని శబరి పేరు తో  టీ స్టాల్. ఇంకొంచెం ముందుకు వెళ్లాను కోట బురుజు లాంటి  దేదో ఉంది.  దాని కెదురుగా కుడివైపున శబరి పాన్ షాపుఉంది.నాకు అనుమాన మొచ్చింది.  శబరి పుట్టినఊరు కూడ ఇదేనేమో నని. ఇది జరిగిచాలకాలమైంది  ఇప్పుడవి ఉన్నాయో లేవో తెలియదు.    శబరి తెలుగువాళ్ళకు ఎంత దగ్గరైందో చెప్పడమే నాఉద్దేశ్యం.              
                
                 తెలుగులో శబరి పేరుతో వచ్చిన కావ్యాలు కూడ ఎక్కువ భాగం గోదావరీ పరీవాహ ప్రాంతంనుంచే రావడం కూడ గమనించదగ్గ విషయం. రామభక్తులిద్దరొకచోట కలిస్తే సూర్యేదయ,సూర్యస్తమయాలు తెలియ వంటారు. శబరి మనల్ని అలాగే చేస్తున్నట్లుంది. విషయంలోకి వద్దాం. రండి.

                       రామలక్ష్మణులు వస్తున్నారని తెలిసిన శబరి వారికి ఎదురు వెళ్లి   సంప్రదాయ బద్దంగా అర్ఘ్యపాద్యాదు లందించి ,రామ లక్ష్మణులు సేద తీరిన తరువాత  మాగురువులు చెప్పినప్పటినుంచి నీ గురించి ఎదురు చూస్తున్నాను. ఇంత ఆలస్యం చేశావేమిటని చనువుగా ప్రశ్నిస్తుంది.రాముని కోసం  ఎంతో కాలం గా సంపాదించి. భద్ర పరచిన ఫల,మూలాదులను ఆయనకు అర్పించింది.

           మయాతు వివిధం వన్యం సంచితం పురుషర్షభే
            తవార్ధే పురుషవ్యాఘ్ర పంపాయాస్తీర సంభవమ్.   వా.3-74.17
             
               అని మాత్రమే వాల్మీకం. దీన్ని వ్యాఖ్యానిస్తూ  గోవిందరాజీయం లో  - వన్య శబ్దేన ఫలమూలాదికముచ్యతే. {వన్య శబ్దము వలన ఫలమూలాదికములు చెప్పబడు తున్నాయి} . సంచితమిత్యనేన రామస్య చిత్రకూటాగమనాత్ప్రభృతి సంపాదిత్వం, ఆదరేణ గుప్తత్వం చ, తత్తత్ఫల జాతీయ మాధుర్యం పరీక్ష్య స్ధాపితమితి సంప్రదాయ:”.{ సంచిత అనేమాటకు రాముడు చిత్రకూటానికి వచ్చాడని తెలిసి నప్పటినుండి సంపాదించి,దాచిపెట్టి ఆయా ఫలాల జాతిని పట్టి  తీపిని పరీక్షించి ఉంచి నట్లు గ్రహించాలి}. { చతుర్వ్యాఖ్య.  పు. 1276 .}

                        దశాబ్దాల తరబడి అదే ప్రాంతంలో జీవిస్తోంది కాబట్టి ఏజాతి పండు ఎలా ఉంటుందో, ఏచెట్టు పండు ఎటువంటిదో తెలుసుకోగల నైపుణ్యం శబరికుంది. అందుకనే మంచిపండ్లను పరీక్షించి రాముని కందించింది శబరి. ఇది వాల్మీకం. అంటే ఎంగిలి విందు ప్రస్తావన వాల్మీకం లో లేదు. కాని శబరి పేరు తో కావ్యాలు రచించిన వారందరు కూడ ఎంగిలి విందు  చేయించిన వారే కాని వాల్మీకిని అనుసరించిన వారు ఒక్కరు లేరు.
  
                 మరి ఈ ప్రస్తావన ఎక్కడనుంచి వచ్చింది.          పద్మపురాణం లో  మనకు ఈ ****  విందు ప్రస్తావన కన్పిస్తోంది.

           ప్రత్యుద్గమ్య ప్రణమ్యాథ నివేశ్య కుశవిష్టరే
            పాదప్రక్షాళనం కృత్వా తత్తోయం పాపనాశనం             
           ........................................................
         ఫలాని చ సుపక్వాని మూలాని మధురాని చ
         స్వయమాసాద్య మాధుర్యం పరీక్ష్య పరిభక్ష్య చ
          పశ్చాన్నివేదయామాస రాఘవాభ్యాం దృఢవ్రతా
            
                 పద్మపురాణ భాగంలో పరీక్ష్య, పరిభక్ష్య,పశ్చాన్నివేదయామాస అని ఉన్న భాగాన్ని  పరిశీలిస్తే శబరి కంద మూల ఫలాల మాధుర్యాన్ని పరీక్షించి భక్షించిన అనంతరమే రాఘవునికి సమర్పించిందనేది స్పష్టమౌతోంది. కాని వాసుదాసు గారు మందరం లో ఈ విషయాన్ని  గూర్చి చర్చిస్తూ,ప్రస్తుత  ముద్రిత పద్మ పురాణ ప్రతిలో ఈభాగం లేదని క్రొత్త పాఠాన్ని చూపించారు.కాని  చతుర్వాఖ్యలో మహేశ్వర తీర్ధులవారు సైతం  పై పాఠాన్నే  ఉటంకిచారు.అంటే పరీక్ష్య పరిభక్ష్య అనేదే ప్రసిద్ధపాఠం.

                      కాని దీనిలో కూడ శబరి తాను తిన్నపండునే రామున కిచ్చినట్లు ఎక్కడాలేదు. రాముడు చిత్రకూటానికి వచ్చినప్పటినుండి, రాముడు తన ఆశ్రమానికి వస్తాడనే గురువుల మాట మీద ప్రత్యయం తో అప్పటి నుండే కందమూలాలను, నిలవఉండే ఫలాలను, సంచితం-అంటే, ఏరి కోయించి సంపాదించి భద్ర పరచింది. ఇప్పుడు రాముడు వచ్చిన తరువాత వానిని బయటకు తీసి పరీక్షించి, జాతికొక దాన్ని తిని, చెడిపోలేదు అని నిర్ధారణ చేసుకొని రామునికి సమర్పించిందనేది లక్ష్యార్ధం.

                    భక్షించి అనుటకు ఠాకా వేసి కొంచెం గిల్లి  నోటవేసుకొన్నట్లు ఎంచవలయునేగాని వేరుకాదు. అంటారు మందరం లో శ్రీ వాసుదాసు.          

                     శ్రీరాముని శ్రియ:పతి గా నెరింగి ఆయన రాక కోసం ఎదురు చూస్తూ జీవితకాలాన్ని పొడిగించుకుంటున్న మహాతపస్విని శబరి. అట్టి మహానుభావునకు తాను అర్పించే విందులో మాధుర్యం కొఱవడితే  ఓర్వలేక, అపచార భయం చేత ,భక్త్యతి శయం చేత శబరి ప్రవర్తనలో మార్పు వచ్చి ఉండ వచ్చు.వృద్ధ, జ్ఞానవైరాగ్య సంపన్న,గురుశుశ్రూషా పరాయణ అయిన శబరి లో  పరమభక్తి పరాకాష్ఠకు చేరి , గోదాదేవి తాను ధరించిన మాలలను భగవంతునికి సమర్పించినట్లు, విదురుని విందు లో శ్రీ కృష్ణునకు అరటిపండు ఒలిచి పండు పారవేసి తొక్కుఅందించినట్లు, పండ్లను రుచి చూచి  స్వామికి సమర్పించిందని  భావించిన జానపదులు శబరి విందు’’ను మధురాతి మధురంగా గానం చేసుకుంటున్నారు. భక్తునికి ఇష్టమైన దాన్ని ఎంతకష్టమైనా భరించడానికి  భగవంతుడు సిద్ధంగా ఉంటాడన్నవిషయం బాణాసురుని ఇంటికి కాపలా కాయడం దగ్గరనుండి  మానవుడిగా జన్మించి బాధలు పడడం వరకు ఎన్నో విషయాల్లో ఋజువవు  తూనే ఉంది..

                            శబరి శ్రీ రామచంద్రునకే విందునందించిన పరమ భక్తురాలు. కాని శబరి వాగులోకి  పండి ఒరిగిన చెట్ల ఫలాలు శబరి నీటిచే స్పృశించబడుతున్నాయి . ఆ  పండ్లను రామలక్ష్మణులు స్వీకరించారు కాబట్టి శబరిఎంగిలి చేసిన పండ్లను రాముడుతిన్నాడని  జానపదకథలుగా పాడుకుంటున్నారని  కొందరి వాదన..

      శబరి పూర్వజన్మ వృత్తాంతం కంబరామాయణం లో కన్పిస్తోంది.
   
          శబరి పూర్వ జన్మ లో మాలిని అనే గంథర్వకన్య.గందర్వరాజైన చిత్రకవకుని ఏకైకపుత్రిక. వీతిహోత్రుని పరిణయమాడింది.భర్త యజ్ఞయాగాదులలో మునిగియుండగా మె కల్మాషుడనే బోయవానితో సంబధం పెట్టుకోగా కోపించిన వీతి హోత్రుడు మెను శబరవనిత గా జన్మించమని శపించాడు. రామచంద్రుని దర్శనానంతరం ఆ మహనీయుని ఆశీస్సులతో తిరిగి  మాలిని గా మారిపోయి  భర్తతో గంధర్వ లోకాన్ని చేరింది. అని కంబరామాయణం శబరి   పూర్వ చరిత్ర ను ప్రస్తావించింది.[puranic  encyclopedia –p.659]. తెలుగు కవులెవరూ ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. తులసీ ధాసు వాల్మీకి మార్గంలోనే పయనించాడు.


*******************శబరీ దత్త ఫలాశన రామ ***********************

Sunday, 11 November 2012

రామాయణము- రమణీయకథనాలు-13 శూర్పణఖ గంధర్వ స్త్రీ యా ?


                            శూర్పణఖ  గంధర్వ స్త్రీ యా  ?
                           

         





                      శ్రీమద్రామాయణ మహాకావ్యంలో  ప్రధాన శక్తులుగా   నిలిచి   శ్రీ రామచంద్రుని కీర్తి ప్రతిష్ఠ లు  ఇనుమడించే రీతిలో రామావతార ప్రయోజనాన్ని సాధింపజేయ నిర్మించిన   పాత్రలు మూడు. వానిలో ప్రధానపాత్ర కైకేయి కాగా, ఆవిడకు ప్రేరణ కల్గించిన మంథర ద్వితీయ.

                    మంథర ప్రేరణ కారణం గానే కైకేయి రామ పట్టాభిషేకాన్ని విఘ్నమొనర్చి,  శ్రీ రాముని అరణ్య వాసానికి ప్రయాణింపజేసి తన వంతు కర్తవ్యాన్ని పూర్తి చేసుకొంది. మూడో పాత్ర శూర్పణఖ.

                             పంచవటి లో పర్ణశాల లో తాపసవృత్తి  ని  స్వీకరించి  ఋషులతో  కలసి    వేద పురాణ శాస్త్ర సంబంధ సందేశ, సందేహ వివరణ సమాధానాల తో సత్కాలక్షేపం చేస్తూ  అనుజుడైన లక్ష్మణునితో కలసి  సంవత్సరాలను నడిపిస్తున్న శ్రీ రాముని కవ్వించి, రాక్షసవథకు ప్రేరేపించిన పాత్ర శూర్పణఖ.   దండ కారణ్య స్ధిత సమస్త రాక్షస సమూహాల చావుకు  , ఖరదూషణుల  మరణానికి కూడ కారణభూత ఈమె.  అనంతరం లంకకు  చేరి ఈ నిప్పును అక్కడ కూడ అంటించి, రావణుని లో సీతా వ్యామోహాన్ని రగిలింపజేసి, రావణుని   పంచవటికి రావింపజేసి,  సీతాపహరణాన్ని చేయించి, తుదకు పౌలస్త్యవథ కు  కూడ ఈమే కారణమైంది.
                
                   శూర్పణఖ అసలు పేరు మీనాక్షి.  ఈమె కైకసి విశ్రవసుల కుమార్తె.  ఈమెకు రావణ, కుంభకర్ణ, విభీషణులు, ఖర దూషణులు  సోదరు లౌతారు. మారీచ సుబాహులు ఈమెకు మామయ్యలు.అంటే తాటకి ఈమెకు అమ్మమ్మ. విద్యుజ్జిహ్వుడు అనే రాక్షసుణ్ణి   ఈమె వివాహం చేసుకుంది.  కొన్ని కారణాల వల్ల  తప్పని సరి  పరిస్థితుల్లో రావణాసురుడు  ఆ విద్యుజ్జిహ్వుని సంహరించవలసి వచ్చింది . అప్పటి నుండి ఒంటరియైన శూర్పణఖ  లంకానగరానికి, దండకారణ్యానికి మధ్య యధేచ్చగా తిరుగుతూ కాలం గడుపుతోంది.  ఇదంతా ఎందుకు చెప్పవలసివచ్చిందంటే – కొద్దిగా ఆలోచిస్తే -- రాముని గమనం - అంటే - రామ అయనం అంతా శూర్పణఖ   చుట్టూనే అల్లు కున్నట్టుగా మనకు కన్పిస్తుంది.

               రావణ సంహారమే రామాయణ మైతే,శ్రీ రాముడు రఘువీరుడైంది రాక్షససంహారం మూలంగానే అనుకుంటే ఆ రాక్షసులందరు శూర్పణఖ వంగడము లోనివారే అవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. తాటక , సుబాహు లు తప్పితే మిగిలిన అందరి మరణానికి ఈమే కారణంమైంది. అభివృద్దికి కూడ ఈమే కారణం. ఎందుకంటే  విభీషణస్తు ధర్మాత్మా అని మొట్టమొదటి సారి విభీషణుని పేరుని  రాముని వద్ద ప్రస్తావించి, విభీషణుని మీద రామచంద్రునికి సదభిప్రాయం  కల్గించింది కూడ శూర్పణఖే.

                దండకారణ్యం లో నరవాసన  తగిలి పరుగెత్తుకొచ్చిన ఈమె రామచంద్రుని దర్శనం తో  ఆకలిని మర్చిపోయి,కామవికార యై ఆ పుంసాం మోహనరూపుడైన  పురుషోత్తముని పరిణయాన్ని ఆశిస్తుంది.  అందుకోసం రాముని ఇల్లాలిని ఛంపడానికి కూడ సిద్ధపడుతుంది.
              

          







             శూర్పణఖ ను కామమోహిత ను చేసిన ఆ  సుందర రాముని                          సు మనోహర  రూపాన్ని వాల్మీకి వర్ణించిన  విధానం చూస్తే శూర్పణఖే కాదు. సమస్త లోకము మోహపాశబద్ధమై జగమంతా రామమయం గా మారిపోతుందనడం లో  అతిశయోక్తిలేదు . వాల్మీకి వర్ణనలోను  స్వభావోక్తే గాని అతిశయోక్తి కన్పించదు .

               దీప్తాస్యం చ మహాబాహుం పద్మపత్రాయతేక్షణమ్
                 గజవిక్రాన్త గమనం జటా మండలధారిణం
                 సుకుమారం మహాసత్త్వం పార్ధివ వ్యంజనాన్వితమ్
                 రామం ఇందీవరశ్యామం  కందర్ప సదృశప్రభమ్
                 బభూవ ఇంద్రోపమం దృష్ట్వా  రాక్షసీ కామమోహితా   3-17.7,8
        
                పరిపూర్ణ పురుషుని రూపం ఎలా ఉండాలో  మహర్షి వాల్మీకి  రామఛంద్రుని ధర్శించి మన కళ్ళముందు రూపు కట్టించాడు.  అవివాహిత లైన   ఆడపిల్లలు కలలుగనే   ఆత్మీయ పురుషుని అందమైన రూపమది. అందుకే  రామచంద్రుడు పుంసాం మోహనరూపు డయ్యాడు. రామాయణం మహాకావ్యమైంది.

         ప్రకాశవంతమైన మోము కలవాడు, ఆజానుబాహుడు,  పద్మపత్రవిశాలాక్షుడు, గజ గమనుడు, జటామండలశోభితుడు, సుకుమారుడు ,మహాబలుడు,రాజ లక్షణ లక్షితుడు, ఇందీవరశ్యాముడు, మన్మథ సదృశుడు, ఇంద్రుని తో సమానమైన వాడు నైన శ్రీ రామచంద్రుని చూచి ఆ రాక్షసి కామమోహితయైంది. ఇది పై శ్లోకానికి భావం. 

                      ఈసందర్భంలో  వాల్మీకి  రామ శూర్పణఖ లను  ఒకేశ్లోకంలో దర్శింప జేసిన తీరు కూడ కడు రమణీయంగా ఉంటుంది.

                  సుముఖం దుర్ముఖీ రామం వృత్తమథ్యం మహోదరి
                      విశాలాక్షం విరూపాక్షి సుకేశం తామ్రమూర్ధజా
                        ప్రీతిరూపం విరూపా సా సుస్వరం భైరవస్వనా
                         తరుణం దారుణా వృద్దా దక్షిణం వామభాషిణీ         3-17.9,10
                        
                 పై శ్లోకంలో ఆకుపచ్చవర్ణం శ్రీ రాముని  కి, అరుణ వర్ణం రాక్షసి కి విశేషణాలు గా   మనం గమనించవచ్చు.

            అందమైన ముఖము, సన్నని నడుము విశాలమైన నేత్రాలు, సుందరమైన కేశపాశము, ముచ్చటైన రూపము మృదువైన కంఠస్వరము,  సరళసంభాషణాచతురుడు తరుణవయస్కుడు అయిన వాడు రామఛంద్రుడు.     .                
                          కాగా – దుర్ముఖి, మహోదరి విరూపాక్షి,  ఎఱ్ఱని వెంట్రుకలు , భయంకర మైన రూపము, కఠినమైన కంఠస్వరము, వృద్దురాలై ,వక్ర సంభాషణ కలిగినది శూర్పణఖ.
             
            వాల్మీకి మహర్షి శూర్పణఖ ను అంద వికారిగాను రాక్షసరూపిణి గానే వర్ణించాడు. కాని కంబ రామాయణం లో శూర్పణఖ చాలా అందగత్తె గా కన్పిస్తుంది.
              
           ఈ ఘట్టం లో శూర్పణఖ తో రామలక్ష్మణుల  యొక్క సంభాషణావైఖరి, ఇరువురి మధ్యలో ఆమె ను అటు ఇటు పంపిస్తూ ఆటపట్టించి   అవమానించిన తీరు బాగుండలేదన్న విమర్శ ప్రాచ్య, పాశ్చాత్య విమర్శకులలో తరచు కన్పిస్తోంది.  కాని విషయవాంఛతో నున్న పశువు ను రెచ్చగొడితే ప్రాణం తీయడానికికూడ సిద్ధమౌతుంది.  అలాగే విషయస్పృహ తో నున్న ఒక ఆడదాని ని   కవ్వించి , అవమానించి పంపిస్తే , దండకారణ్యమే కదిలి వస్తుంది. ఆ తరువాత లంకలో పునాదులు కదులుతాయి. కథాగమనవేగాన్ని పెంచి , త్వరగా రామకార్యం పూర్తి కావాలంటే అంత మాత్రం అవసరమనుకున్నాడు ఆదికవి. అదే జరిగింది.
                   
               సీతను చంపఢానికి ఉద్యుక్తురాలౌతున్న శూర్పణఖను రామాజ్ఞ తో లక్ష్మణుడు ముక్కు చెవులు కోసి వదిలేశాడు. ఉద్ఖాత్య ఖడ్గం చిచ్ఛేద్య కర్ణనాసం మహాబల: 3-18.21    వాల్మీకిరామాయణంలో లక్ష్మణుడు శూర్పణఖ కు ముక్కు చెవులు  కోసినట్లు చెపితే అనంతర కాలికులు కొంతమంది స్తనాలు కూడ కోయించారు.  ఏమైతేనేం.?" చుప్పనాతి శూర్పణఖ" కు  శృంగభంగమైంది. కథ లంకకు చేర, చివరకు సుఖాంతమైంది.

              అయితే ఈశూర్పణఖ  వృత్తాంతానికి ఫూర్వ కర్మ వాసన ఏమైనా ఉందా అని యోచిస్తే ఆశ్చర్య రామాయణంలో కన్పించింది. తన పైకి దూసుకొస్తున్న  శూర్పణఖ ను  చూచి భయపడుతున్న సీతను సముదాయిస్తూ రాముడు ఆశ్చర్య రామాయణం లో పూర్వ కర్మానురూపం తు తస్మాదేవం ఫలం గతా అంటాడు. ఆ సందర్భంగా వ్యాఖ్యాతలు  శూర్పణఖ పూర్వజన్మ వృత్తాంతాన్ని ప్రస్తావించారు.

              ఈ శూర్పణఖ పూర్వమొక  గంధర్వాంగన. స్వర్గలోకంలో ఒకనాడు  శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో  శేష పాన్పు పై శయనించి యుండగా, ఈ గంధర్వాంగన  మహావిష్ణువు పైనున్న మక్కువతో ఆయనను చూడడానికి యత్నించింది.ఆది శేషుడు తన పడగలతో మహావిష్ణువు కన్పించకుండా మూసివేశాడు. కోపించిన గంధర్వకాంత శేషుని చెవులమీద, ముక్కుమీద పిడికళ్ళ తో పొడిచింది. అప్పుడు మహాలక్ష్మి శేషుని  సమర్ధిస్తూ మాట్లాడుచుండగా, ఇంతలో గంధర్వాంగన యొక్క భర్త వచ్చి లక్ష్మిదేవి తో వివాదించుచున్న తన భార్యను కోపించి భూమి యందు రాక్షసిగా జన్మింప శపించాడు. అప్పుడు క్రోధించిన గంధర్వాగన కాలాంతరమున నావలన నీభర్తతో నీకు వియోగము సంభవించగలదని శ్రీమహాలక్ష్మిని శపించెను. ఆ గంధర్వాంగనే ఈ శూర్పణఖ. ఆ శేషుడే ఈ లక్ష్మణుడు.”              { ఆశ్చర్య.రా.3-227.}
                
                 కొంతమందైతే  రావణుడు తన భర్తను చంపాడనే కోపాన్ని మనసులో పెట్టుకొని శూర్పణఖ కావాలనే  రాక్షసనాశనం చేయించిందని వ్రాశారు. అంటే భారతం లో శకుని కోపం  వంటిది ఈ శూర్పణఖ కోపమని వీరి ఉద్దేశ్యం.

                          ఈ విధంగా రామాయణంలో చిన్న పాత్ర గా కన్పించినా ప్రధానపాత్ర యై నిలిచింది శూర్పణఖ.






*******************************************************************

Thursday, 8 November 2012

అరణ్యవాసంలో ఉన్న శ్రీరామునికి అంగుళీయకం ఎక్కడిది?



          


             అరణ్య వాసంలో ఉన్న  శ్రీ రామునకు  అంగళీయకం ఎక్కడిది.?


          





                      అరణ్య వాసానికి బయలుదేరిన రామలక్ష్మణులు ఆభరణాలు పట్టువస్త్రాలు వదిలేసి, నారచీరలు ధరించారు. కాని వశిష్ఠుని ఆదేశం, దశరథుని అనుజ్ఞ తో సీతమ్మ మాత్రం  పట్టువస్త్రాలు,ఆభరణాలను ధరించింది. ఇంటికి పెద్దకోడలు  నారచీరలు ధరించడం కుటుంబానికి అనర్ధమని , దానిని నివారించమని  దశరథునకు వసిష్ఠుని నిర్ధేశం. 

                           అంటే - రామ లక్ష్మణులు   నిరాభరణులై నారవస్త్రాలు ధరించారు. కాని కిష్కింథ కాండ లో వానరసైన్యాన్ని సీతాన్వేషణకు పంపుతూ రామచంద్రుడు ఆంజనేయునికి  అంగుళీయకాన్ని  అందించాడు. సీతాదేవి  కన్పిస్తే ఆమెకి ఆ ముద్దుటుంగరాన్ని తనగుర్తుగా చూపించమని కూడ ఆదేశించాడు.

                        సుందరకాండ లో  అశోకవనం లో ఉన్న సీతాదేవి ఆ ఉంగరాన్ని చూసే ఆంజనేయుణ్ణి రామదూత గా అంగీకరించింది. తన చూడామణి ని తిరిగి అభిజ్ఞానంగా రామచంద్రుని చెంతకు పంపించింది.

            కాని ఇక్కడ రామాయణ పాఠకులలోను, రామాయణ కవుల లోను ఒకసందేహం వెంటాడుతూనే ఉంది. సమాధానం ఎక్కడుందా? అని వెతుకుతూనే ఉన్నారు.  సమాధానం ఉంటుంది.  ఎందుకంటే వాల్మీకి మహాకవి మీద వారికి అంత నమ్మకం.కాని ఆ సమాధానం ఎక్కడుందో కన్పడ్డంలేదు. కొంతమంది వెతుకు తుంటే మరికొంతమంది బయటపడిపోయారు.

                అంగుళీయకమ్ము అనిలాత్మజునకిచ్చె
                    రాముడంటి వేమి వ్రాతలయ్య
                   నగలు విడిచినాడు నార వస్త్రాలతో
                   నున్నవానికున్నెయుంగరమ్ము

            అని ప్రశ్నిస్తారు వాల్మీకి ని ఆచార్య గుదిమెళ్ల రామానుజాచార్య తన రామాయణ రహస్యాలు అనే కావ్యంలో. కాని ఇక్కడ విచిత్రమేమిటంటే  మనలాంటి సామాన్యులకే ఇటువంటి  అనుమానాలొస్తుంటే – రామాయణాన్ని  ఆద్యంతం అ వలోఢనం చేసి  వ్యాఖ్యానాలు రాసిన మహానుభావులు  వీటిని వదిలిపెడతారా.?

                     గోవింద రాజీయ వ్యాఖ్యలో కిష్కింథ ,సుందర కాండల్లో ఈ అంగుళీయక ప్రస్తావన వచ్చినప్పుడు వేరు వేరు మాటల్లో ఒకే భావాన్ని అందించారు.

      రామనామాంకిత మంగుళీయకం సీతాయా: కదాచిద్రావణాగమనాత్పూర్వం 
       ప్రణయప రత్వేన రామేణ స్వీకృతమితి బోధ్యం 1

      యద్వా-భార్యా స్నేహేన కనిష్టికాయాం సదా ముద్రికా ధార్యత ఇతి దేశాచార:”  2
        యద్వా- వివాహ కాలే  జనకేన దత్త మిదం  వరాలంకారత్వేన 3
       
                                                                   కిష్కింథ- -చతుర్వాఖ్య –పు .211
              
          అంటూ మూడు కారణాలను ఊహించారు. ఇది  కిష్కింథకాండ లోని ప్రస్తావన.
రామనామాంకితమైన  ఆ అంగుళీయకం సీతాదేవి దని, మారీచమృగం రావడానికి   ముందు  ప్రణయపరత్వం లో  రాఘవుడు సీతాదేవి  చేతి నుండి  తీసుకొని ఉంటాడని భావించారు. 1

        అలా కాకపోతే --  భార్య మీద ఉన్న అనురాగానికి నిదర్శనం గా చిటికెన వ్రేలు కి   ఎల్లప్పుడు ఉంగరాన్ని ధరించడం   దేశాచారమై ఉండవచ్చు.  2

           కాదంటే  -- వివాహసమయం లో మామగారైన  జనకుని చేత వరాలంకారంగా  ఇవ్వబడిందనే  అభిమానం తో  దానిని అలా ఉంచుకొని  ఉండవచ్చు.3

 --- అంటూ   మూడు ఉపపత్తులతో  సమర్థింప యత్నించారు వ్యాఖ్యానకారులు. అనంతర కాల కవులు, విమర్శకులు మొదటి ఉపపత్తి నే ఎక్కువగా సమర్థించినట్లు కన్పిస్తోంది.

అంతేకాకుండా – ననుత్యక్తం సకలధనస్య వన్యవృత్యా వర్తమానస్య కుతోఅంగుళీయకమితి  చేత్ ఇదమేకం  ఏతత్కార్యార్థం  రక్షితవాన్     వాల్మీ. 4.చతుర్వాఖ్య.211

 అంటూ నిర్మొహమాటం గా చెప్పేశారు. అన్ని నగలు వదిలేసి వనవాస దీక్షతీసుకున్న రామునికి ఉంగర మెందుకు అని ప్రశ్నిస్తే   -- ఈ ప్రయోజనం కోసమే నని చెప్పవచ్చు. ఇక్కడ ఆంజనేయుడి కివ్వడానికే దాన్ని రాముడు ధరించి ఉన్నాడట.

        రామాయణ మహాకావ్యంలో  యాగసంరక్షణ సమయంలో  సుబాహుని చంపి మారీచుని చంపకుండా వదిలివేయడానికి, శూర్పణఖ లాంటి  రాక్షసి కి నాసికాఖండనం మాత్రమే చేసి వదిలివేయడానికి ఉన్న  ప్రయోజనాలే --- ఇక్కడ  రాఘవుడు అంగుళీయకం థరించడానికి కూడ ఉన్నాయి. 
              


***********************************************************************

Tuesday, 6 November 2012

రామాయణము-రమణీయకథనాలు -12 గుహుడు


                              


                                  గుహుడు



                  

                 సంసారజలథిని తరింపజేయగల తారకబ్రహ్మ యైన శ్రీ రామచంద్రున కు గంగానది దాటడానికి సహాయపడిన నిషాదరాజు గుహుడు. పితృవాక్యపరిపాలకుడై సతీ, సోదర సమేతంగా అరణ్యవాసానికి బయలుదేరాడు రామచంద్రుడు. నిషాదాధిపతియైన గుహుడు  శ్రీరాముడు తన దేశంలోకి రావడం విని కులవృద్ధులు, మంత్రులతో ఎదురేగి రామచంద్రుని కౌగిలించు కొని, కుశలప్రశ్నలతో సంభాషిస్తాడు. ఈ గుహుడు రామునకు  ప్రియస్నేహితుని గా ఆదికవి పరిచయం చేశాడు.

                          తతో రాజా గుహో నామ రామస్యా 2త్మ సమస్సఖా

         వనవాసానికి బయలుదేరిన  రఘువీరుని చూచి మిక్కిలి పరితాపం పొందుతాడు గుహుడు. భార్యా సమేతుడై నేలపై పరుండిన రాజకుమారుడైన  శ్రీరామునకు కాపలా కాస్తూ ,    తెల్లవారేవరకు  లక్ష్మణునకు తోడుగా  ఉండిపోతాడు. లక్ష్మణుడు చెప్పిన  రామగాథను విని మిక్కిలిగా దుఖించాడు.

    నరేన్ద్ర పుత్రే గురు సౌహృదా ద్గుహ: ముమోద బాష్పం వ్యసనాబి పీడితో:” 2.51.27
        
        రాముని పై నున్నభక్తి గౌరవాలు గుహుని లోని దుఖాన్ని అతిశయింప జేశాయి.  రాత్రంతా నిద్రా ముద్రితు లైన  ఆ ఆదర్శదంపతులు  సీతారాములకు కాపలా కాస్తున్నాననే భ్రాంతి లో వారి దర్శనం చేసుకుంటూ ఉండిపోయాడు లక్ష్మణునితో పాటు గుహుడు కూడ.   
                 
            రామచంద్రుని  కోరిక మేరకు తపోజన సామాన్యమైన జటాధారణ కొరకు మఱ్ఱిపాలను తెప్పించి గుహుడే స్వయంగా రాముని కందించాడు. రామలక్ష్మణులు ఇరువురు మాత్రమే జటాధారణం చేశారు. వాల్మీకి రామాయణం లో ఇలా  ఉంది.
         
             లక్ష్మణస్యా2 త్మనశ్చైవ రామస్యే నా2కరో జ్జటా;”      వా. 2.51-69
     
           గుహుడు     సుమంత్రుని తో కలసి ఈవలి ఒడ్డునే ఉండి రాముడెక్కిన పడవను నడపవలసిందిగా  బంధువులను ఆజ్ఞాపించాడు. ఆత్మసఖుడైన గుహుడు రాముని ఆవలి ఒడ్డుకు చేర్చలేదు.  సహకరించాడు  అంతే. తతో నిషాదాధిపతి ర్గుహోజ్ఞాతీ నచోదయత్  {2.51.80 }  పడవ నడపవలసిందిగా జ్ఞాతులను  గుహుడు ఆదేశించాడు. బందువర్గము , పరివారంతో ఉన్న  గుహుని,   సుమంత్రులను   వీడ్కొని  సతీ సోదరులతో రాముడు  నౌక నధిరోహించాడు.

                       కాని లోకంలో గుహుని పాత్ర ప్రస్తావనకు రాగానే గుర్తొచ్చేవి గుహుడు పడవ నడపడం, కాళ్లు కడగటం, అనేవి

                     రాముడు గుహుని స్నేహితుని గా  భావిస్తే గుహుడు రాముని స్వామి గా సేవించాడు. ప్రేమించి, పూజించాడు. నిషధదేశంలో, శృంగిబేరపురంలే హింసాత్మక జీవనం గడుపుతున్న గుహుడు రామచంద్రుని  కౌగిలిని పొందిన భాగ్యశాలి.

                           భుజాభ్యాం సాధు పీనాభ్యాం పీడయన్   అన్నపల్కులు వాల్మీకి వి. ఆత్మీయులను దగ్గరకు తీసుకున్నట్లు   రాముడు గుహుడ్ని  భుజాలు ఒత్తుతూ దగ్గరకు తీసుకొని గాఢంగా కౌగిలించు కున్నాడట. సీతా మనోనాధుని గాఢపరిష్వంగాన్ని మించిన కానుక  ఏముంటుంది.? అంతటి అదృష్టవంతుడు గుహుడు.

                అంతేకాదు. వాల్మీకి వాడిన ఆత్మసమస్సఖా అన్న పద బంధాన్ని ఆదారం చేసుకొని రామునకు గుహునకు ఇంతకు పూర్వమే పరిచయం ఉన్నట్లు ఇతర               రామాయణాలు  చెపు తున్నాయి. రామలక్ష్మణులు విశ్వామిత్రుని తో కలిసి  మిథిలా నగరానికి వెళుతూ గంగాతరణం చేసినప్పుడు నదిని ధాటించిన గుహుడు ఇతడేనని, ఇతనికి అహల్యా వృత్తాంతాదిగాథలు తెలుసునని – అందువలననే" రామస్యాత్మ సమస్సఖా" అని వాల్మీకి వ్రాశాడని వీరి వాదన.                     {  ఆశ్చర్య.రా.2.34.}

                       మొల్ల రామాయణం లో కన్పించే సుడిగొని రామపాదము ను .......... వంటి పద్యాల్లో కన్పించే రాతిని నాతిని చేసిన కథ, అధ్యాత్మ రామాయణం లో కన్పించే మానుషీకరణ చూర్ణమస్తి వంటి సందర్భాలను పరిశీలిస్తే – అధ్యాత్మ రామాయణం లో విశ్వామిత్రుని వెంటనున్న బాలరాముని ఛూచి ఒక నావికుడన్న పల్కులుగా మనం గుర్తించవచ్చు. ఆమాటలే మొల్ల ఉల్లానికెక్కి గుహుని పల్కులుగా పేర్కొంది.

               


                అసలు గుహ శబ్దమే బోయవారికి పర్యాయపదంగా వాడబడుతోంది. గుహ శబ్దానికి వ్యాకరణ రీత్యా గుహతీ వంచయతీ పరస్వమితి వ్యుత్పత్యా వంచకత్వేన జాతితో వృత్తితో గుణతశ్చ హీనస్య ఇత్యాదిగా పూర్వపక్షం చేసి గుహుని హీన జాతీయుని గాను , నీచుని గాను నిరూపింప యత్నిస్తే  - గుహ రక్షణే ఇత్యస్మాద్దాతో గుహతీ గోపాయతీతి గుహ భగవత్కైంకర్య  జన్యాత్మ విజ్ఞానేన ఆత్మానం రక్షతీతి అనే అర్ధాలతో గుహుని యొక్కఉన్నతత్త్వాన్ని సిద్ధాంతీకరించారు పండితులు.    ఆశ్చర్య.రా.2.34

          తులసీరామాయణం లో సైతం  నావికుని మాటల్లోనే మానుషీకరణచూర్ణ “  ప్రస్తావన కన్పిస్తుంటే తెలుగు కవులు మాత్రం  గుహునికే శ్రీరాముని పాద ప్రక్షాళనా భాగ్యాన్నికల్గించారు.
                         
          
                                                                                                     ఆలుబిడ్డలయాకలికాదరువుగ                                                                                 
                    నడుపుకొనుచుంటి  రాముని నమ్మి పడవ
                    పున్నెముండును బాబు నామొఱ వినండి
                      కాళ్లు గబగబ గడుగంగ గదుమ కండి
                
                అంటాడు  బృందావనం రంగాచార్యుల వారి గుహుడు అనే తెలుగు కావ్యంలో గుహుడు. దాశరథీ ధ్యాన వివేకమే గుహునికి రామ సాన్నిథ్యాన్ని ప్రాప్తింపజేసింది.

           నాయమాత్మా ప్రవచనేన లభ్యో న మేధయా న బహునా శ్రుతేన , యమై వైష్ణ వృణుతే  తేనలభ్య స్త స్యైష ఆత్మా వివృణుతే తనూంస్వామ్. అని ముండకోపనిషత్తు.
భగవానుడెవ్వని ప్రేమిస్తున్నాడో అతడే ఆ భగవానుని చేరుటకు అర్హుడగుచున్నాడు కాని మహామేథాశక్తి కలిగి చక్కగా వేదశాస్త్రాథ్యయనం చేస్తూ కూర్చుండేవారు కాదని చెపు    తున్నాయి పై ఉపనిషద్వాక్యాలు.

                  విభీషణ శంణాగతి సమయంలో రాముడు సుగ్రీవుని తో చెప్పిన మిత్రభావేన సంప్రాప్తం అన్న వాల్మీకి పల్కులే ఆత్మసమస్సఖా అనడంలో గుహునికి కూడతోడ్పడ్డాయి.  శృంగిబేర పురం లో   నిషాదుడై జీవించినా రామనామ ప్రభావం , రామపాద సేవ అతన్ని జీవన్ముక్తుణ్ణి చేసింది.      

                             ముముక్షూణాం విరక్తానాం తథా చాశ్రమ వాసినాం
                                         రామమన్ర్తార్థ విజ్ఞాని  జీవన్ముక్తో న సంశయ:  
అని రామానందలహరి చెపుతోంది. రామనామ మంత్రమే మోక్షప్రాప్తికి ఆలంబనం.  రామ పాద సేవా నిరతుడై గుహుడు ధన్యుడైనాడు.భరతునితో సమానంగా శ్రీ రామచంద్రుడు అభిమానించి, ఆదరించి ,  అక్కున చేర్చుకున్న  అదృష్టవంతుడు గుహుడు.



****************************************************************