Friday, 26 October 2012

రామాయణము-రమణీయకథనాలు-9 విశ్వనాథ వారి మాండవి


                              కవిసామ్రాట్ విశ్వనాథ వారి  మాండవి { వాసంతిక}

                మాండవి  భరత రాజేంద్రుని ఇల్లాలు. అయోధ్యానగర సార్వభౌముని  ధర్మపత్ని గా వాల్మీకిమహర్షి చేతనే కాదు అనంతర కాలికులు ఎవ్వరి చేతను దర్శించబడని సౌందర్యం ఈమెది. కుశధ్వజుని కొమార్తె గా, భరతుని పాణిని గ్రహించి , అయోధ్యా నగర రాజప్రాసాదంలోకి  అడుగుపెట్టింది. మిథిలానగరం నుండి వచ్చి  దేవతాపూజాదికాలు పూర్తిచేసుకొని అంతపురం లో అడుగు పెట్టిన ఈమె తిరిగి కనబడదు వాల్మీకంలో.
              
          మాండవి పాంచ జన్యశక్తి గా మార్కండేయ పురాణంలో చెప్పబడింది. వాసన్తిక అను కన్యతో శ్రీమహాలక్ష్మి ప్రస్తావన పరంగా....
                               అయం మమపతి శ్ర్శీమాన్ శేషేణ చ  దరేణ చ
                               సుదర్శనేన సాకేత గృహే దశరథస్య చ
                                           ****************************
             
                                      శక్తి స్తు పాంచజన్యస్య మాండవీ తి ప్రకీర్తితా            మార్కం.పు. ఉత్త. 1వ.అ

                          అని పాంచజన్యశక్తి యే   మాండవి గా  చెప్పబడింది. కవిసామ్రాట్  విశ్వనాథ సత్యనారాయణ గారు మాండవి ని  ఉత్తమ కావ్య నాయికగా  దర్శించారు. ఈ లఘుకావ్యం వాసంతిక అనేపేరుతో కృష్ణాపత్రిక  స్వర్ణసంక్రాతి   సంచిక లో ప్రచురితమైంది. మృదుమధుర వ్యంగ్యవైఖరీ ఫ్రాభవం తో  కావ్య ప్రయోజనాన్ని  అలవోకగా సాథించారు మహాకవి   విశ్వనాథ.

                     తెల్లవారితే శ్రీ రామచంద్రుని పట్టాబిషేకం. భరతుడు  మాండవీ సిత సౌథమండలి కి బయలు దేరి   వెళ్లాడు. రంగవల్లికలు దిద్దబడిన వితర్ధిక మీద కోమలి కోసం ఎదురు చూస్తూ  కూర్చున్నాడు. ఇల్లాలు వచ్చింది. అసంస్కృత శిరోజాలతో కాషాయాంబరధారణియై వచ్చి కేలుమోడ్చి నిల్చిన ఇల్లాలిని చూచిన భరతుని ఎదలో  వేదనాజలథులు పొంగులు వారాయి.

                                  యింతి గనుగొంచు భరతుని హృదయ పద్మ
                                  కేసరంబులు విడజారె భాసురములు

                             అన్న మాటలు మహాకవి విశ్వనాథ వి.  ఎంతోకాలం  తర్వాత  ధర్మపత్ని మాండవీ మందిరానికి వచ్చిన భరతునకు ఆమెయొక్క ఆహార్యాన్ని  చూసేసరికే   మనసు లోని ఉత్సాహం ఆవిరై పోయింది. అందుకే భరతుని హృదయమనెడి పద్మమునందలి కేసరములు భాసురాలను వదిలి వేశాయి అన్నారు విశ్వనాథ. యోగిని గా నిలబడిన ఇల్లాలిని ఏదోవిధంగా పల్కరించి మాటల్లోకి దించాలన్నది రామానుజుని ఆలోచన. చెంతనే వాసంతిక  “{  మొల్లవంటి పూలతీగ} కన్పించింది. అది నాటి చాలాకాలమైంది. కానిఇంతవరకు మొగ్గ తొడగలేదు.  భార్యకు ఆ తీగ పై గల అభిమానాన్ని ఆధారం చేసుకొని సంభాషణలోనికి దిగుతాడు భరతుడు. ఇదిచూలెంతయు గాదా- అన్నపల్కులు  భరతునివి. ఆమాటలు విన్న మాండవి నెమ్మదిగా ఇలాఅంది.

                         నే నింటి లోన నెక్కడో
                          పూని మహావ్రతము,బూమొక్కలకున్
                           దానెవరు నీరువోసిరి
                           చాన యదుపు తోటమాలి శ్రద్ధయు గలదే

                        భార్ర్య్డ్య మాటలకు ఆశ్చర్యపోయాడు". ఈ మహావ్రతము ఎవరికోసమన్నా"డు భరతుడు. భర్తయొల్లని సతి ఇంతకంటె ఏంచేయగలదు. చెడిపోయిన గృహసంస్కృతులకై తానీవ్రతాన్ని అవలంబించాను కాని ఆ దైవానికి  మాత్రం అనుగ్రహం కలుగలేదు.

                                    నా భర్త యొక్కడున్నా డన్నగారితో
                                     బాటు జటాధారి పట్టణమున
                                    నతని భార్యను నేన, యపకీర్తి పాలైన
                                    యత్తగారును సుఖమఱిన నేను
                                     కుమలి పోవుచు నాదుకొంచుంటి మొక రొక
                                     రీమాత్ర వాసంతి యొదిగెనేని
                                     ఆ యత్తగారు దయాక్షీరపాదోధి
                                       శ్రీమతి యాయమ చేతి చలవ.


                       మాండవి మాటల్లో భర్త తో చెప్పలేని , చెప్పాలనుకున్న ఎన్నో భావాలు సుళ్లు తిరిగాయి . కళ్లముందు కమ్ముకొన్న  మంచుపొరలు తొలగిపోయాయి భరతునికి. శ్రీరామ కీర్తి పతాకాభిరామ యష్టి మూర్తియైన  మాతృ మూర్తి కన్నులముందు కన్పట్టింది భరతునికి. వాసంతి ఈ మాత్రం నిలిచిందంటే దానికి కారణం...... దయా క్షీరపాదోధి”   యైన అత్తగారి చలువ అన్న మాండవి మాటల్లో విన్పించిన ధ్వని భరతుని లోని విజ్ఞతను మేల్కొలిపింది. వెంటనే రక్షోరాట్పరోక్షారి  సత్పదముల్ ఝారి క్షమింప వేడెదన యీవాసంతియున్ విచ్చునే కద తానప్పటికంచు లేచాడు. చేసిన తప్పు తెలుసుకున్నాడు కాబట్టి వెంటనే దిద్దుకొవాలనే తపన భరతునిది.  ఎంతోకాలంగా మదిలో గూడుకట్టుకొన్న వేదన తీరే రోజు ఆసన్నమైంది. ఇన్నేళ్లుగా కన్నతల్లికి దూరంగా ఉంటూ, ఆమెను నిందిస్తూ  ఆమె ప్రవర్తనను  దూషించాడు.


                       కాని తన కన్నతల్లి కైకేయి పై తాను పెంచుకున్న ఏహ్యభావం తప్పని , ఆమె యే  శ్రీ రామ చంద్రుని  కీర్తి పతాకకు  ఆధారపు కొయ్య వంటిదని, ఆవిడ దయా క్షీర పాదోధి అని , రావణసంహారము, ఇంత రాక్షససంహారం జరగటానికి  ఫరోక్షంగా కైకయే కారణమనే విషయం  మాండవి మాటల్లో ధ్వనించింది భరతునికి.  ఆమె రక్షోరాట్పరోక్షారి. అంటే  కైకేయి  రాక్షసరాజైన రావణునకు పరోక్షశత్రువట. ఎంత అద్భుతమైన  ఫ్రయోగమో మహాకవిది.  మరొక్కసారి ఆ మహనీయుని  కవితా సరస్వతి కి వేవేల వందనాలు.

                  ఒక్క సారిగా  భరతుని లో తల్లి కైకయి పై నున్నకోప. వ్యతిరేక, ఏహ్య భావాల స్థానంలో  గౌరవము , ప్రేమ , అంతకు మించి   ఆమెకు బిడ్డయై నందుకు  తొలిసారిగా గర్వము చోటుచేసుకున్నాయి. వేగంగా  కైకేయీ భవనానికి చేరుకున్నాడు భరతుడు.. తనపాపాన్ని ప్రక్షాళన చేసుకోని కాంతిచంద్రుడై మరలి మాండవీ మందిరానికి వచ్చాడు.

                         ఆ సాయంతటి కైకేయీ పద సపర్యా ధుర్యు డై వచ్చుచున్     
                        వాసంతీ లత చిన్నిపూవిదులు శోభం గాంచె  రామానుజుం
                        సీమంత మధూళికా రచిత నూత్నారుణ్య కాశ్మీర రే
                        ఖా సంపన్నిధి మాండవీ ముఖ  లసత్కంజాత సంజాతమున్.


          మాండవీ ముఖవినిర్గత దరహాస చంద్రికలు భరత రాజేంద్రునిపై ప్రతిఫలించి, పులకించాయి. వాసంతిక   చిరునవ్వు చిందించింది.


               మాండవి భరతుని లో కరడుగట్టిన మాతృవైముఖ్యాన్ని కరిగించి వేసింది. శ్రీరాముని కీర్తి పతాకకు ఆధారపు కొయ్య గా కైకమ్మను నినదించిందిమాండవి. ఉపదేశికయై కావ్యంలో  తన పాత్రను శాశ్వతీకరించుకొంది   కాంత గా మాండవి. ఇది విశ్వ నాథవారి అపూర్వ సృష్ఠి. కాంతా సమ్మితమైన కావ్యంలో    కావ్య ప్రయోజనాలలో ఒకటైన ఉపదేశాన్ని నాయకునకు  నాయిక చేత నే  ధ్వన్యాత్మకంగా ఇప్పించి, కావ్యానికి , కావ్యనాయికకు కూడ ఉన్నత గౌరవాన్ని  కల్పించిన  మహాస్రష్ట  శ్రమద్రామాయణ కల్పవృక్ష సృష్టికర్తలు . 
  

  ********   కాలోహ్యయం నిరవధీ     విపులాచ పృధ్వీ******************                          

Tuesday, 23 October 2012

రామాయణము- రమణీయకథనాలు -8 సీతాయాశ్చరితం


                  

                 
                 .....  సీతాయాశ్చరితం



          






                       శ్రీమద్రామాయణం ఆది కావ్యం. అనాది ఆది యైన పురుషోత్తముని దివ్యగానం. నాన్యతో దర్శనీయమైన అపురూప పాత్రల అపూర్వ సంయోజనం రామాయణం. ఇది  రామస్య> అయనం రామాయణం. అయనం అనగా గమనము లేక ప్రయాణము. రాముని యొక్క  జీవన గమనాన్ని తెలిపేది కాబట్టి రామాయణం అయ్యింది .  దీనిలోనే సీతాయనం కూడా  ఉంది. సీతాయా :అయనం  సీతాయనం అనవచ్చు కదా!.   మరి  ఎందుకు పిలవడంలేదు?.  వాల్మీకి కూడ సీతాయా: చరితం అనే అన్నాడు  కాని  సీతాయనం అనలేదు. ఎందుకని?.

      చంద్రుడు లేనిదే  చంద్రిక అంటే వెన్నెల లేదు. వాక్కు లేనిదే అర్థము లేదు. రాముడు లేనిదే సీత లేదు. రాముడు సీతతో కలిసి నడిచినదే రామాయణం.  రామునితో కలిసి తిరిగిన సీతాగమనమే సీతాయా: చరితం అవుతుంది. స్త్రీ పురుష యోగమే శక్తి. స్త్రీ శక్తి విరహిత పురుషుడు  పరిపూర్ణుడు కాలేడు. నిస్తేజు డౌతాడు. నిర్వీర్యుడౌతాడు.  పురుష యోగము లేని  స్త్రీ మూర్తి  పరిపూర్ణత పొంద లేదు. విరాగిని గా ఉండి పోతుంది లేదా క్షుద్ర రూపిణి గా మారిపోతుంది. అందు కే  మాతృత్వము పరిపూర్ణత కు ప్రతీక. అంబ,అమ్మ   తల్లి, జనని, మాతా ఇవన్నీ పర దేవత ను మనం ఆర్తి గా ఆరా థించే పేర్లు . ప్రేమ గా పిలుచుకునే పేర్లు.  అందుకే మహాకవి కాళిదాసు  ----
                               వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థ: ప్రతిపత్తయే
                                 జగత: పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ !! “  
  
           వాక్కు,  అర్థముల వలే కలసిన ఆది దంపతులు  ఈ లోకానికే తల్లి దండ్రులు అన్నాడు. దంపతులకున్న గౌరవం మనసంస్కృతిలో ఒంటరి జీవికి లేదు.  మన భారతీయసంస్కృతి  దంపతీపూజ కు ఉన్నత స్థానాన్ని కల్పించింది. భర్త చాటు భార్య అనడం తప్పు. భర్త కు తగ్గ భార్య గా  ఉండాలి  .ప్రకృతి పురుషుల కలయికయే శక్తి. అష్టాదశ పురాణాల్లోను వ్యాసభగవానుడు స్థాపించింది అదే వాల్మీకి చెప్పింది . భార్యలేని భర్తకు పరిపూర్ణతలేదు. భర్త లేని భార్యకు చరిత లేదు. శ్రీ శ్రీశ యో స్తు    సంబంధశ్చంద్ర చంద్రికయో  రివ అన్నారు పౌరాణికులు.   లక్ష్మీ నారాణుల సంబంధం చంద్ర చంద్రికల వంటిదని  అంటారు పౌరాణికులు. శివపార్వతులు, సీతారాములు. గౌరీశంకరులు, లక్ష్మీనారాయణులు,  ఉమా శంకరులు  అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలు గా చెప్పుకుంటాము. స్త్రీ  పురుషుల ఎక్కువ తక్కువ ల ప్రసక్తే లేదు   . స్త్రీ  పురుషుల కలయికే జీవితం .  జీవితాలు చెప్పేదే చరిత్ర. కలసి జీవించడమే మన కావ్యాలు మనకిచ్చే సందేశం. కావుననే సీతాయనం కాదు సీతాయాశ్చరితం మహత్.
     
                   జానకి లేని రామచంద్రుడు చంద్రిక లేని  చంద్రుని వలె కాంతి హీను డయ్యాడు. సీతలేని  రాముడు శక్తి ని కోల్పోయి, కష్టాల పాలయ్యాడు. సీత చెంత నుండగా గడ్డిపరక సైతం రామబాణమై తుంటరుల పీచమడిస్తే,సీతాపహరణం తరువాత రాముడు సమస్తశక్తుల్ని కోల్పోయినవాడై, బేలయై విలపిస్తూ, కొండల్ని, కోనల్ని కలయ తిరుగుతూ, గ్రద్దల్ని, కోతుల్ని సహాయమడుక్కోవలసివచ్చింది.    నలభై వేలమంది  ఖర దూషణాది రాక్షసులను ఒక్కడుగా మట్టుపెట్టిన అసహాయ శూరుడైన రామచంద్రుడు   సీతాపహరణం జరిగిన తరువాత  ఎదుటివాడ్ని నమ్మించడానికి తన బలాన్ని ప్రదర్శించి చూపించవలసిన దుస్థితి కి  వచ్చాడంటే అందుకు కారణం రాముడ  శ్రీ   -రాముడు కాకపోవడమే. శ్రీ విరహితుడైన-సీత లేని - రాముడు నిస్తేజుడైపోయాడు.

             శ్రీ   అనేది   లక్ష్మీ బీజం. సర్వశక్తి సమన్వితంగా ఆ బీజాక్షరం భాసిస్తుంది.
                      మహాలక్ష్మర్థకశ్చస్యాత్ ధనార్థ రేఫ ఉచ్యతే.
                      {} తుష్యత్యర్ధో2పరో నాదో బిందు: దు:ఖ హారార్ధక:      మం .పు.18
                          
          సర్వసంపత్కరము, సర్వదుఖ హరమునైన శ్రీలేని రాముడు వియోగవ్వధా దుఖితుడై విలపించాడు. క్రోథించాడు .తపించాడు .పోరాడి తుదకు శ్రీకరమైన సీతను పొంది  సీతారాముడు గా కీర్తి నందాడు.మైథిలీ పాణిగ్రహణం రాముని శ్రీరాముని   చేసి గృహస్థుగా మార్చి పట్టాభి షేకానికి సిద్ధం చేసింది. కాని కైకేయీరూప కాలవాహిని  రాముని గమనాన్ని మార్చి, రణంయలోని మునులచెంతకు చేర్చి, రాక్షససంహారం  చేయించింది. క్షత్రియవీరుడుగా, యువరాజు గా జైత్రయాత్ర పూర్తి చేసుకొని ,సర్వ శక్తి సంపన్నుడై రాజ్యలక్ష్మి ని పరిగ్రహించి, రామచంద్రుడు లోకారాధ్యుడై  ఆదర్శప్రాయుడైనాడు.సీతామహా సాధ్వి సీతామాత యై    జగదారాథ్య యైంది.
        
          రామాయణాన్ని రామ అయనం, రామా అయనం అని  రెండు విధాలుగా విభజిస్తే సీతారాములిద్దరికి  సమప్రాధాన్యాన్ని చేకూర్చవచ్చు.


                           బాలేవ రమతే సీతా బాలచంద్ర నిభాననా
                           రామా రామేవ్యాదీనాత్మా వజానే2పి వనేసతీ “      వా.2.60-10

                మైథిలీ దాశరధులు సత్యస్వరూపానికి ప్రతినిధులన్న భావం రామా  రామ  శబ్దాలలో మహాకవి వ్యంజితం చేశారు. అశోకవనం లో సీతామాతను చూచిన  ఆంజనేయుడు  ఆమెలో రాముని పోలికలుండటం చూచి ఆశ్చర్యపోతాడు . తల్లీకూతుళ్ల మధ్య,అక్కాచెల్లెళ్ల మధ్య, రక్తసంబంధీకులమధ్య   పోలికలుండవచ్చునేమో గాని భార్యాభర్తలమధ్య ఒకే పోలికలుండటం ఆశ్చర్యం కలిగస్తుంది.- అందుకే ఇలా అనుకుంటాడు హనుమ.
              
               అస్యా దేవ్యా యధారూపం అంగ ప్రత్యంగ సౌష్టవం
                 రామస్య యధా రూపం   తస్యేయ మసితేక్షణా”         వా.5.15-51
              
       ఈ పోలికల్లో దాగి వున్న రహస్యాన్ని " దేవమాయేవ నిర్మితా " అన్న పదంతో ఛేదించారు మహాకవి వాల్మీకి.
                     
          


                 సీతారాముల దాంపత్యం జగతికి ఆరాథ్యం. శ్రీరామునకు తగిన ఇల్లాలు మైథిలి. పంకజముఖి సీత వంటి భామమామణియున్ అన్నఅభిమానం ప్రజల్లో నిలిచిపోయింది. మహావీరుడై, శివధనుష్కండనుడైన రఘుకులాన్వయుని పరిణయమాడిన వధువువమైథిలి.కష్టాల్లో భర్తకు తోడునీడగా నిలిచి అనుకూలవతి,అనురాగవతి, పుత్రవతియునై అభిమానవతిగా భూప్రవేశం చేసేవరకు సీతాపాత్ర అత్యుత్తమమైన , అత్యుత్కృష్టమైన రీతిలో మలచబడి" సీతాయా: చరితం మహత్" అని మహర్షి చేతనే  కొనియాడబడిన పవిత్రశీల. జానకీ మాత సకల సద్గుణ సముపేత. తనకు కీడు చేసిన వారికైన హాని చేయ నంగీకరించని కరుణామృత  మాతృహృదయమామెది.
                                  ప్రణిపాత ప్రపన్నాహి మైథిలీ జనకాత్మజా
                                  పాపానాం వా శుభానాం వా వధార్హాణాం ప్లవంగమ
                                  కార్యం కరుణ మాత్రేణ నకశ్చి న్నాపరాధ్యతి  --  “        6. 119-44
                                   
                  పలుకే బంగారంగా బాలకాండలో అసలు మాట్లాడక దర్శనమాత్రం చేతనే అలరించిన జానకీదేవి సుందరకాండలో అతిమాత్రంగా సంభాషిస్తుంది. సీతారాముల కళ్యాణం లోకకళ్యాణంగా భావించే భారతజాతి సీతారాముల దాంపత్యాన్ని ఆదర్శదాంపత్యం గా ఆరాధిస్తోంది. సీతమ్మ లోకారాధ్య. మాతృస్వరూపిణి. శ్రీరాముని సైతం తన కాంతివలయం లో కప్పివేయగల కాంతిచ్ఛట. ఏదేశ వాజ్ఞ్మయమునందైనా శ్రీరామచంద్రుని వంటి పురుషోత్తముడు లభించినా లభించవచ్చునేమో గాని సీతవంటి ఆదర్శచరిత్ర యగు పతివ్రతాతిలకము లభించుట దుర్లభమని “ { శ్రీమద్రా.వైభ. పు.523}  పలికిన వివేకానందుని పల్కులు అక్షరసత్యాలు.
                     
                  ఎన్ని ఇడుముల నెదుర్కొన్నా భర్తా హి మమదైవతం” {2.16.89} అని ప్రకటించిన నిశ్చల నిర్మల హృదయ యీమె. లోకం కోసం అగ్నిప్రవేశం చేయించినా, అరణ్యంలో వదిలేసినా, ఓర్పుతో సహనంతో భర్తగౌరవాన్ని కాపాడి  రామచంద్రుని లోకారాథ్యుని గా నిలిపిన ఉత్తమ ఇల్లాలు. రాముడు లోకం కోసం ప్రవర్తించినా నేదానీం త్వదృతే సీతే స్వర్గో 2పి  మమరోచతే. {2.42.30 ]నీవు లేక స్వర్గమును కూడ అంగీకరించనన్న మధురభావనను భర్తలో కల్పించిన మహాసాథ్వి.
               
               త్వద్వియోగేన మేరామత్యక్తవ్యమిహ జీవితమ్”     { 2.5.29} అన్న  పల్కులు రామవియోగాన్ని సహింపలే మరణిస్తానంటున్న సీతవి. వారి వైవాహిక ప్రణయం  జగదారాథ్యం కావడానికి ప్రథానకారణం వారిలోని ఆరాథనా భావమే. అది వాల్మీకి  అపూర్వ పాత్ర చిత్ర కల్పనా చాతుర్యం.

                       ప్రియా తు సీతా రామస్య  దారా పితృకృతా యితి
                      గుణాద్రూపా  గుణాచ్ఛాసి ప్రీతి ర్భూయో2భి వర్థతే.      వా.1-77-27    
                        
          తండ్రిచే అంగీకరించబడిన భార్యగా సీతను స్వీకరించినను  అనురూప గుణాన్విత, సౌందర్య సముపేత అగుటచే  ఆమె యందు అనురాగము వృద్ధిఛెందుచున్నది. మరి  జానకీదేవి విషయం చూస్తే------
                            
                                   తస్యాశ్చ భర్తా ద్విగుణం హృదయే పరివర్తతే
                                 అన్తర్గత మపివ్యక్త మాఖ్యాతి హృదయం హృదా           వా.1.77.29
                                      
                          సీతాహృదయంలో రామచంద్రుడు ద్విగుణుడై వర్తిస్తున్నాడు. ఆమె హృదయాతర్గతమైన ప్రేమను ఆమె హృదయం  అతని హృదయానికి చెప్పుచుండెను.--- అని  వ్రాయడంలోనే సీతారాముల అన్యోన్యతను వర్ణించడం లో వాల్మీకి లేఖిని పరవశించింది.  అంతేకాక-—“మనస్వీ తద్గతమనా స్తస్యాహృది సమర్పిత: అంటాడు మహర్షి. సీతమ్మకు  మహర్షి వాడిన విశేషణం మనస్వీ ఎంత తియ్యనిమాటో చూడండి.అమ్మ మనస్వి. నిండైన మనస్సుగలది.   ఆమె నిండుమనసులో భర్త కు ఎంత ప్రేమను పంచగలదో బిడ్డలకు అంత ప్రేమను అందించ గలదు. అందుకే మహాకవి లేఖిని ఆ కరుణాలవల్లి  సీతమ్మ కు మనస్వి పదాన్ని వాడింది. వారిరువురి దాంపత్యం  అటువంటిది. అందువల్లనే  అశోకవనంలో సీతాదేవి ని చూచిన హనుమంతుడు-  -- యుక్తా రామస్య భవతీ ధర్మపత్నీ గుణాన్వితా అంటూ మెచ్చుకుంటాడు.
                           
           ప్రకృతి ప్రేమస్వరూపిణి. కాని కోపగిస్తే ప్రళయాన్ని సృష్టిస్తుంది. అలాగే సీతామాత రాముని చెంత ప్రేమస్వరూపిణి  గా గోచరిస్తుందే కాని,  శత్రువుల చెంత, రావణాదులను  తిరస్కరించి    అబిశంసించే టప్పుడు మహా శక్తి గా రూపుదాలుస్తుంది . ఆ శక్తి పాతివ్రత్య ప్రభావమే. పతివ్రతాసాధ్వి శోక సంతాపాలు కార్చిచ్చులై కాలకూట విషం గా   మారి కాముకుల్ని కాల్చి వేస్తాయన్న యదార్ధం రావణాదులు తెలుసుకోవడానికి ఆలస్యం పట్టింది. త్రిలోకవిజేతయైన  రావణుడు సైతం మహాశక్తి ముందు కంపించి పోయాడు.   శక్తిస్వరూపిణి గాథలు కోకొల్లలు. విజయగాథలు ఎప్పుడు మథురంగానే ఉంటాయి.   




*******************************నందన నామ విజయ దశమి శుభాకాంక్షలతో  ********* 
           

       



Sunday, 14 October 2012

పయనించే.......... రెండుగీతాలు


 L`

      పయనించే -------- రెండు  గీతాలు
పయనించే మన వలపుల బంగరునావ   
శయనించవె హాయిగ జీవనతార  నా జీవనతార
నెలబాలుని   చిరునవ్వుల తెలివెన్నెల సోనలలో                                   
       చెలరేగే అలల మీద  ఊయల లూగి
వికసించే విరజాజులు వెదచల్లగ పరిమళాలు
                    రవళించే వేణుగీతి రమ్మని పిలువ
 { బావ మరదళ్లు  చిత్రం}                          ______________________ ____________________                    ______________________                                                                                                 

                                                        పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయెను గూడు
                                                        పుల్లాపుడక ముక్కున కఱచిగూడునుకట్టతివోయి
                                                      తీరెను రోజులు నీ కీ కొమ్మకు పొమ్మా  ఈ చోటు వదలి
                                                        ఎవరికి వారే ఏదో నాటికి ఎరుగము ఎట కో ఈ బదిలీ
                                                        మూడుదినాల ముచ్చట యే ఈ లోకము లో మన మజిలీ    
                 నిజాయితీ గా ధర్మపథాన చనుమా థైర్యమెతోడు                                                                                                                               
               మరవాలీ నీ కులుకుల నడలేమదిలో నయగారాలే

                తీరని వేదన తీయని ముసుగే శిరసున సింగారాలే
                ఓర్వలేని ఈ జగతికి నీ పై లేవే కనికారాలె
            కరిగీ కరిగీ కన్నీరై కడతేరుటె  నీ తలవ్రాలె
                                           బోరుమని విలపించేరే నీ గుణము తెలిసిన వారు
                                            తోడుగ నీతో ఆడిపాడి కూరుము లాడినవారు
                                               ఏరులయే కన్నీరులతోమనసార దీవించేరే
{కులదైవం చిత్రం }                                    ఎన్నడో తిరిగి ఇటు నీ రాక ఎవడే తెలిసిన వాడు                              
  ___________________________________________!_______________________________________
                            ఇవి రెండు తెలుగు చిత్ర గీతాలు .సుమారు 1950 ప్రాంతం లోనివి. ఎందుకో ఈ రెండు పాటల్నివింటుంటే  ప్రక్కప్రక్కగా పెట్టి  చూస్తే మానవుని జీవితంలోని రెండు దశలకు ప్రతీకలు గా విన్పిస్తుంటాయి.  ఎన్ని సార్లు కాదను కున్నా  ఆ భావాన్ని పోగొట్టుకోలేక  ఈవిధంగా  నాలోని బావాల్ని     మీతో పంచుకుంటున్నాను.  కాని  ఈ విధమైన స్పందనలే మీలో కలగాలని లేదు కదా! .ప్రయత్నిచండి.                                                                                                                                          
                     
     జీవితంలో నాలుగు దశలు ఉంటాయి. బాల్య, యౌవన,కౌమార వార్థక్యాలు. ఇక్కడ  మొదటి గీతం   యవ్వనదశ  లోని అనిర్వచనీయ ఆనందానికి ప్రతీక అయితే రెండవగీతం వార్థక్యానికి   ఒక పరిపక్వ  జీవితానికి, అనుభవం నేర్పిన గుణపాఠాలకు  ప్రతీక. అందరి జీవితాల్లోను ఈ రెండు దశలు తప్పని సరిగా వచ్చేవే. అక్కడున్నది శృంగార రసమైతే  ఇక్కడ ఉన్నది శాంతరసం. ఆథ్యాత్మికత లేక వేదాంతం ఇక్కడ ప్రథాన భూమికను పోషిస్తాయి. అక్కడున్నది ఆవేశంతో కూడిన ఆనందం. అందమె ఆనందం. ఆనందమె జీవితమకరందం అనే కాలమది.ఇక్కడుండేది అనుభవం నేర్పిన ఆలోచన. మనసు మూగదే కాని బాధుంది దానికి  అనే వయసు  రెండవది.  అందుకే యవ్వనంలో పయనించే పడవ వలపుల బంగరు నావ లాగా కన్పిస్తోంది. .యవ్వనం లో  అన్నీ అందంగానే కన్పిస్తాయి.   వయసులో  గాడిద పిల్ల కూడ అందం గా ఉంటుంది అన్నారు మన జంటకవులు. ఇది యౌవన దశ  సహజ లక్షణం.  

                          ప్రియురాలు జీవనతార , అంటే LIFE STAR. ఎంత మథురమైన భావన.ఆరోజులు ఆలోచించు కుంటే ఎంత హాయి....  అనిపించక మానదు ఎవరికైనా. అందుకే నెలబాలుని చిఱునవ్వుల తెలివెన్నెల సోనలలో చెలరేగే  అలలమీద ఊయల లూగుతోంది ప్రేయసి. సహజ సుందరమైన సన్నివేశం. ఈజగతిన ఉన్నది మనమిద్దరమే అనుకొనే వయసుకదా అది. వికసించే విరజాజులు పరిమళాలు వెదజల్లుతుంటే,రమ్యమైన వేణుగీతి  రమ్మని పిలుస్తోందంటున్నాడు నాయకుడు .అది తిరిగి రాని కాలం.
                    
                కాలము ఆగదు. దానితో  పాటే వయసు ఆగదు .యౌవనంలో పయనించడ మంటే పరుగులు పెట్టడమే. కాని వార్థక్యంలో పయనించడ మంటే ప్రయాణం కట్టడం. రెండవగీతం లో పయనించడం ప్రయాణమే. అది చివరి ప్రయాణంకూడ కావచ్చు. ఇక్కడ చిలక  బొంది లోని ప్రాణం.  ఇక్కడ పాడైపోయిన గూడు ఛిద్రమైన శరీరమే. రోగాలతో నాశనమైన శరీరమే. వయసులో పుల్లా పుడకా“  పోగుచేసి అంటే అప్పులు సప్పులు చేసి  నీ వారి కోసం గూడు కట్టావు .కాని – కానికాలం - వచ్చేసింది. ఈ కొమ్మ- అంటే- ఈ  ప్రదేశంతో - నీకు రోజులు తీరి పోయాయి. రోజులు నిండితే ఒక్క క్షణం కూడ  ఉండే పనిలేదు. అందుకేపొమ్మా ఈచోటు వదలి........  ఇది ఆదేశం. దేవుని ఆజ్ఞ. ఇపుడు జరిగేది కేవలం బదిలీ.అంటే మారడమే {Transfer} ఈచోటు వదిలి ఇంకొక చోటుకి వెళ్లడమే.ఆత్మకు మరణం లేదు. అందుకే వాసాంసి జీర్ణాని యథా విహాయ.... అంటుంది భగవద్గీత. మాసిన బట్టలు వదిలి కొత్తబట్టలు వేసుకున్నట్లు ఆత్మ పాడైపోయిన ఈ బొందిని వదిలి ఇంకో దాంట్లోకి ప్రవేశిస్తుంది .అదే బదిలీ
.
                          అయితే ఎవరికి వారు పోయినవాళ్లను వింతగా చూస్తూ ఉంటారు తామేదో శాశ్వతమైనట్లు అన్నాడొక కవి.అలాగే నీవు పోతున్నావని  నీవే పోతున్నానని బాధ పడవద్దు. ఎవరికివారే  ఏదో నాటికి పోయే వాళ్లమే. ఎరుగము ఎటకో ఈ బదిలీ .ఎక్కడకు పోతామో కూడ తెలియదు. మళ్లీఎక్కడ ఏ జీవిగా పుడతామో కూడ తెలియని బదిలీ యిది . జాతస్య హి థృవో మృత్యు ధృవం జన్మ మృతస్య అని కదా మన గీతాచార్యుని సందేశం.పునరపి జననం పునరపి మరణం అన్నారు ఆదిశంకరులు. అందుకే  ఈ లోకంలో మనం  ఉండేకాలం  --- సుదూరప్రయాణం మధ్యలో    వసతి గృహాల్లో, సత్రాల్లో ,చేసే మజిలీ వంటిదే.  అది  శాశ్వతం కాదు . మూడు దినాల ముచ్చటే. అంటే మూణ్ణాళ్ల ముచ్టటే. ఇది చక్కని తెలుగు పలుకుబడి. అందమైన నుడికారం. మూణ్ణాళ్ల ముచ్చటకు మురిసేవు కులికేవు ముందుగతి కానవే చిలకా  అంటాడు ఇంటి ముందు బైరాగి. ఈ జీవితం మూడురోజుల ముచ్చటే కాబట్టి   ఉన్న మూడు రోజులు అన్యాయాలు అక్రమాలు  అరాచకాలు చేయకుండా నిజాయితీగా  ధర్మమార్గలో థైర్యంగా  మంచివాడు గా జీవించాలి. అక్రమాలు అన్యాయాలు చేస్తూ  పిరికివాడిలా  రోజూ చస్తూ బ్రతికేకంటే నిజాయితీగా  జీవిస్తూ థైర్యవంతుడి గా ఒకేసారి  మరణించాలి.
                   మరణించిన వారి మరపు రాని మధురజ్ఞాపకాలు మరచిపోవాల్సిందే. కాని మరచిపోవడం సాథ్యం కాని మరువ లేని, మరపురాని జ్ఞాపకాలవి. కాని మరచి పోవాల్సందే. మరవాలీ ఎంత బరువైన పదమో చూడండి. శబ్దానికి రంగురుచి వాసన ఉంటాయన్నారు  మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి.  అలాగే పదానికే గనుక బరువుంటే మరవాలీ అన్న పదం వందటన్నుల బరువైంది. మోయలేనిది. మోయలేని ఈ హాయిని మోయనీ ఒక్కక్షణం అంటుంది  దేవులపల్లి వారి నాయిక. హాయినే మోయలేని మానవ హృదయం టన్నుల కొద్దీ  బాథను ఎలా మోస్తుంది. అసాథ్యం. కాని మరవక తప్పదు అందుకే మరవాలీ. పోయిన వాళ్లతో మనం పోలేము గనుక మరచిపోవాలి అని తనకు తాను సర్ధి చెప్పకొనే పదమది..

              కాని బాధలో ఉన్న వారిని చూచి జాలి పడి ఓదార్చే గుణాన్ని  ఈ లోకం నెమ్మదిగా మర్చి పోతోంది.  ఎదుట ఏదో సానుభూతికి మెఱ మెచ్చపు మాటలు మాట్లాడినా  వెనక్కి వెళ్లి మెటికలు విరవడం మూతులు తిప్పడం సహజమై పోయింది. వీళ్లు సుఖంగా ఉన్నప్పుడు ఓర్వలేక కళ్లల్లో నిప్పులు పోసు కున్నవాళ్లు  ఇప్పుడు చాటుకు పోయి ఆనంద పడతారే తప్పితే  వచ్చిన కష్టానికి కనికరం ఇసుమంత కూడ చూపించరు .అంతేకాదు.ఎదుటి వాడి కష్టాల్ని చూసి లోలోన ఆనందపడే రాక్షస గుణం లోకంలో పెరిగి పోతోంది.అందుకే మనకొచ్చిన కష్టానికి ఎవరో రావాలని ఏదోచేయాలని ఎదురు చూడటం మూర్ఖుడి లక్షణం .  మనసుఖాలు మనవే అయినప్పుడు మనకష్టాలు కూడ మనవే కదా. అది   మన తలరాత అని సర్ధుకు పోవడమే మనం చేయ కలిగంది. అందుకే     కరిగీ ..........కరగీ...........కన్నీరై  ...ఏరై    ..పోవడమే  ఉపశమనం.    ఏడిస్తే గుండెబరువు తీరి తేలికపడుతుంది . గుండె మంటలారిపే చన్నీళ్లు కన్నీళ్లు.ఉండమన్న ఉండవమ్మ చాన్నాళ్లు అన్నాడు మహాకవి.

             అయితే లోకమంతా  ఒకే రకంగా ఉండదు కదా. నీతో తిరిగినవాళ్లు, నీ మంచితనం తెలిసినవాళ్లు, నీ ప్రేమ అనురాగాలను పంచుకున్నవాళ్లు, నీ స్నేహంలోని మాధుర్యాన్ని మరచి పోలేనివాళ్లు ,  నీతో పాడుకుంటూ, ఆడుకుంటూ తిరిగిన వాళ్లు, నీ బాల్యస్నేహితులు నీకోసం బోరున విలపిస్తారు. గుండెలు  పగిలేలా రోదిస్తారు. వెళ్లిరా మిత్రమా అంటూ దీవెన లిస్తూనే మళ్లీ ఎప్పుడువస్తావంటూ  ఆశగా  అమాయకంగా అరుస్తూ ఏడుస్తూ  అడుగుతారు. కాని విచిత్రమేమిటో తెలుసా !మళ్లీ మన మెప్పుడు ఇక్కడకొస్తామో మనకే కాదు ఎవడికీ తెలియదు. చెప్పగలిగినవాడు ఎవడున్నాడు. ప్రాక్తన జన్మ పుణ్యఫలాన్ని అను భవించిన తరువాత  మళ్లీ జన్మిస్తారని మన పెద్దలు చెపుతుంటారు. అందుకే కన్ను తెఱిస్తే జననం కన్ను మూస్తే మరణం   రెప్పపాటే గదా ఈ ప్రయాణం అన్నారొక ఆథునిక కవి. రాలుతున్న పండుటాకుల్నిచూచి చిగురు టాకులు నవ్వు కోవడం  సహజం కదా!


******  ఎన్నడో తిరిగి నీ విటురాక ఎవడే తెలిసినవాడు..........  ఎవ్వరికి తెలియదు
                                                                  
           ****************************************