Saturday, 3 October 2015

శతకసౌరభాలు-7 శేషప్పకవి-నరసింహశతకము .2


శతకసౌరభాలు-7

శేషప్పకవి-నరసింహశతకము -2
                      
                     

                                                    ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి


                          ఇలలోన నే జన్మమెత్తినప్పటి నుండి బహు గడించితినయ్య పాతకములు
                         తెలిసిజేసితి కొన్ని, తెలియఁజాలక చేసి- బాధ నొందితినయ్య పద్మనాభ
                         అనుభవించెడు నప్పు డతిప్రయాసంబంచుఁ-బ్రజలు చెప్పగఁ జాల భయముఁగలిగె
                         నెగిరిపోవుటకునై యే యుపాయంబైనఁ- జేసిచూతమటన్నఁ జేతకాదు
                          సూర్యశశి నేత్ర! నీచాటు జొచ్చినాడ-కలుషములు ద్రుంచి నన్నేలు కష్టమనక
                         భూషణవికాస శ్రీధర్మపుర నివాస! దుష్టసంహార !నరసింహ! దురితదూర!    (24)
                          
            వివిధములైన ఆభరణముల చే ప్రకాశించెడి శ్రీ ధర్మపుర నివాసా! మా పాపాలను దూరం చేసి, దుష్టులను శిక్షించే ఓ నారసింహా! ఈ భూమి మీద పడినప్పటినుండి  నేను చాలా సంపాదించానయ్యా పాపాలను. తెలిసి కొన్ని , తెలియక కొన్ని పాపాలను చేసి చాల వేదన పొందుతున్నాను. చేసిన పాపాలకు పై లోకం లో శిక్ష లనుభవించేటప్పుడు అవి దుస్సహాలని ప్రజలు చెప్పుకొంటుంటే విని భయమేస్తోంది. తప్పించుకొని దూరంగా ఎగిరిపోవడానికి ఏదైనా ఉపాయం ఉందా అంటే అదేమీ కన్పించడం లేదు. సూర్య చంద్రులు నేత్రములుగా గల  ఓ పద్మనాభా!నీవే దిక్కని నీ మాటుకు చేరాను. కష్టమనుకోకుండా నా పాపాలను  పోగొట్టి నన్ను కాపాడు  దేవా!నారసింహా!

                    



                      అడవి పక్షుల కెవ్వడాహార మిచ్చెను- మృగజాతి కెవ్వడు మేత పెట్టె
                           వనచరాదులకు భోజనమెవ్వ డిప్పించెఁ-జెట్ల కెవ్వడు నీరు చేఁదిపోసె
                          స్త్రీల గర్భంబున శిశువు నెవ్వడు పెంచె- ఫణుల కెవ్వడు పోసె బఁరగ పాలు
                           మధుపాళి కెవ్వడు మకరంద మొనరించె- పసుల కెవ్వఁ డొసగెఁ బచ్చిపూరి
                           జీవకోట్లను బోషింప నీవెకాని - వేఱె యొక దాత లేఁడయ్య వెదకి చూడ
                          భూషణవికాస శ్రీ ధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర.   (26)
                  
  
                    స్వామీ!నారసింహా ! ఈ ఙీవరాశులను పోషించడానికి నీవే కాని ఎంత వెదకినా ఇంకొక దాత  కన్పడడు. ఈ కడుపు నింపుకోవడానికి ఎవరెవరినో దేవురించడం ఎందుకు..అడవిలో పక్షులకు ఎవడు ఆహారం  వేస్తున్నాడో ,మృగాలకు ఎవడు మేత పెడుతున్నాడో, వనచరులకెవ్వడు భోజనమందిస్తున్నాడో, చెట్లకెవ్వడు నీరు తోడి పోస్త్తున్నాడో,తుమ్మెదల కెవ్వడు మకరందాన్ని అందిస్తున్నాడో,పశువుల కెవ్వడు పచ్చికను మొలిపిస్తున్నాడో ఆ దేవదేవుడే నన్ను కూడ ఆదుకుంటాడనే నమ్మకం నాది. అటువంటి పరమాత్మను నిన్ను విడిచి భుక్తి కై నేను ఇతరులను ప్రార్ధించను నారసింహా ప్రభూ!
                            
                  పుట్టించినవాడు పోషించక మానడు గదా. నారుపోసినవాడే నీరు పోస్తాడు.  అని సామెత.  ఈ జన్మ నిచ్చిన ప్రభువువు నీవై ఉండగా బ్రతకడానికి పలు మార్గాలు గా పలువురిని యాచించడం ఎందుకు. నిన్ను నమ్మిన నన్ను పోషించే భారం నీది కాదా. అని కవి తాను నమ్మిన తన దైవాన్ని విశ్వాసం తో  నిలేస్తున్నాడు.  ఆకలేసిన బిడ్డ అమ్మానాన్నలను అడగుతాడు కాని ఎదురింటి వాళ్ళను అడగడు కదా అంటాడు ఒక భక్తకవి.

                             పచ్చి చర్మపుఁదిత్తి పసలేదు దేహంబు-లోపల నంత రోయరోత
నరముల శల్యముల్ నవరంధ్రములు రక్త- మాంసముల్ కండలు మైలతిత్తి
బలువైన యెండవానల కోర్వదెంతైనఁ-దాళలే దాకలి దాహములకు
సకల రోగములకు సంస్ధానమయియుండు- నిలువ దస్థిరమైన నీటిబుగ్గ
బొందిలో నుండి ప్రాణముల్ పోయినంతఁ కాటికే గాని కొఱగాడు గవ్వకైన
భూషణవికాస శ్రీధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర.   (28)
                                
       ఓ నారసింహా ! ఈ శరీరంలో నుండి ప్రాణాలు పోయిన తర్వాత ఆ కట్టె శ్మశానానికే గాని ఇంకెందుకు పనికిరాదు.ఈ దేహము పచ్చితోలు సంచి వంటిది .లోపల అంతా అసహ్యం గా మాంసము ,నరాలు  ఎముకలతో కూడి మలమూత్రాలతో నిండిన మైలతిత్తి. ఎండావానలకు తట్టుకోలేదు . ఆకలి దాహాలకు ఆగలేదు. సర్వరోగాలకు నిలయమైన ఈ శరీరము నీటిబుడగ వలె అస్ధిరమైనది. కావున హే ప్రభూ! బ్రతికున్నంత వరకు నీ సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించు స్వామీ.

                                                 నరసింహ! నాతండ్రి నన్నేలు నన్నేలు
                          కామితార్ధము లిచ్చి కావు కావు
దైత్యసంహార! చాల దయయుంచు దయయుంచు
                                దీనపోషక! నీవె దిక్కు దిక్కు
రత్న భూషిత వక్ష! రక్షించు రక్షించు,
                         భువనరక్షక! నన్ను బ్రోవు బ్రోవు
మారకోటిసురూప! మన్నించు మన్నించు
                 పద్మలోచన! చేయి పట్టుఁ బట్టు
సురవినుత! నీచాటు జొచ్చినాను
నా మొఱాలించి కడతేర్చు నాగశయన!
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
              దుష్టసంహార !నరసింహ! దురితదూర!   (29)

                          ధర్మపురి నరసింహా ! నన్ను కాపాడెడి నా తండ్రీ! నా కోరికలు తీర్చి నన్ను రక్షించు ప్రభూ ! దైత్యాంతకా! నామీద  దయ ఉంచి పాలించు ప్రభూ.! నరకాంతక! నీవె  నాకు దిక్కు. రత్న భూషిత వక్ష! నన్ను రక్షించి కాపాడు. భువన రక్షక! నన్ను ఆదుకోవయ్యా. కోటి మన్మధాకర!  నాతప్పుల క్షమించు. పద్మ లోచన!  నా చేతిని విడిచిపెట్టకయ్యా. దేవతల చేత  ప్రార్ధించబడెడు ఓ నారసింహా! నేను నీవే దిక్కని ని నీ మఱుగు జొచ్చినాను. నా మొరాలించి నన్ను కడతేర్చుభారము నీదే నాగేంద్ర శయన . నన్ను ఆదుకొని ఏలుకొనే భారం నీదే స్వామీ !నన్ను మఱచి పోవద్దు.


నిగమగోచర ! నేను నీకు మెప్పగునట్లు-లెస్సగా బూజింపలేను సుమ్మీ
నాకుఁదోచిన భూషణములు పెట్టెదనన్నఁ-గౌస్తుభమణి నీకు గలదు ముందె
భక్ష్య భోజ్యములు నర్పణము జేసెదనన్న- నీవు పెట్టితి సుధ నిర్జరులకు
కలిమి కొద్దిగఁగాను కల దొసంగెదనన్న- భార్గవీదేవి నీ భార్య యయ్యె
అన్ని గలవాడ వఖిల లోకాధిపతివి-నీకు భూషాదులను బెట్ట నే నెంతవాడ
                భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్టసంహార !నరసింహ! దురితదూర!.          (32)
                   
                         వేదములచే కీర్తించబడినవాడా! రత్నాభరణ భూషిత వక్షస్ధలా! శ్రీ లక్ష్మీ నరసింహప్రభో! నువ్వు మెచ్చుకొనేటట్లు గా నేను నీకు పూజలూ చేయలేను. ఏదో నాకు తోచినరీతిలో ఆభరణాలను నీకు సమర్పిద్దామనుకుంటే అంతకు ముందే కౌస్తుభమణి నీ మెడను అలంకరించుకొని ఉంది. పోనీ !భక్ష్యభోజ్యాలను అర్పించి నిన్ను సంతృప్తి పరుద్దామనుకుంటే దేవతలకే నీవు అమృతాన్నిచ్చిన ఘనుడవయ్యే. నాకున్న కొద్ది ఆస్తిని నీకిద్దామంటే సంపదల తల్లి లక్ష్మీదేవే నీ భార్య  కదా ! అన్నీ  ఉన్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడవైన నీకు ఆభరణాలను పెట్టగా నేనెంతటి వాడిని తండ్రీ !

                                  అన్నీ ఉన్న నీకు నేనేమి ఇవ్వగలను తండ్రీ! అంటూ చేతులు జోడించి తనకు మాత్రం మోక్షం ఇవ్వమని అడిగే భక్తుణ్ణి చూసి ఆ భగవానుడు చిరునవ్వులు చిందిస్తాడు. అందుకే ఈ క్రింది పద్యం లో నరసింహుని కవి ఇలా ప్రశ్నిస్తున్నాడు.

                                                   అందఱేమైన నిన్నడుగ వచ్చెదరంచు
                                క్షీరసాగరమందు చేరినావు
నీ చుట్టు సేవకుల్ నిలువకుండుటకునై
                           భయద సర్పముమీదఁ బండినావు
భక్తబృదము వెంటఁబడి చరించెదరంచు
                               నెగసి పోయెడి పక్షి  నెక్కినావు
మౌనులు నీ ద్వార మాసింప కుంటకు
                                            మంచి యోధుల కావలి యుంచినావు
లావుగలవాడవైతి యేలాగు నేను
నిన్నుఁ జూతును. నాతండ్రి నీరజాక్ష
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
               దుష్టసంహార! నరసింహ! దురితదూర.!   (34)
                            
                                   తండ్రీ! ధర్మపురి నరసింహా!  భక్తులు  తమ కోరికలు  విన్నవించుకోవడానికి నీ దగ్గరకు వస్తారేమోనని వెళ్లి వెళ్ళి పాల సముద్రం లో చేరావు.  నీ చుట్టు సేవకులు చేరి ఏకాంతానికి భంగం కల్గించి విసిగిస్తారేమో నని భయంకర సర్పం మీద పవ్వళించావు. భక్త సమూహాలు వెంటబడతారేమో నని  పైన ఎగిరే పక్షి నెక్కి విహరిస్తున్నావు. మునులు నీ ద్వార సమీపానికి కూడ రాకుండా మంచి జమాజట్టీలైన యోధులను వాకిలికి కాపలా పెట్టుకున్నావు. స్వామీ! అన్ని విధాల అందని ఎత్తులో ఉన్న నిన్ను ఏ విధంగా నేను సేవింతును తండ్రీ !
                               

                     అధిక్షేపణ స్తుతి భక్త కవులలో కనిపించే సాధారణ లక్షణం. దీనినే నిందాస్తుతి అని కూడ అంటారు.  పలుకే బంగార మాయెనా...... అంటూ ఆర్తి తో   ఆ శ్రీ రామచంద్రుని  అర్థిస్తున్న భక్త రామదాసు ఆ డబ్బుకు లెక్కలు చెపుతూ ,సీతమ్మకు చేయిస్తీ చింతాకు పతకము రామచంద్రా. .... అంటూనే ఆ సొమ్మంతా ఎక్కడిదనుకున్నావు ? నీయబ్బ సొమ్మను కొంటివా రామచంద్రా. . కాకపోతే..... నీ మామ జనకమహరాజు చేయించెనా.. అంటూ రోదిస్తున్న ఆ మహా భక్తుని నోటివెంట వస్తున్న  మాటలు  ఈటెలై రామభక్తుల్ని కదిలించి కన్నీరు పెట్టించాయి. ఇది రామభక్తులందరికీ అనుభవైక వేద్యం.

                                             ప్రహ్లాదుఁ డేపాటిపైడి కానుకలిచ్చె
                                         మదగజం బెన్నిచ్చె మౌక్తికములు
నారదు డెన్నిచ్చె నగలు రత్నంబు ల
                                  అహల్య నీకే యగ్రహారమిచ్చె
నుడుత నీకేపాటి యూడిగంబులు చేసె
                     ఘన విభీషణుడేమి కట్న మిచ్చె
పంచపాడవులేమి లంచమిచ్చిరి నీకు
                        ద్రౌపది నీకెంత ద్రవ్య మిచ్చె
నీకు వీరందఱయినట్లు నేను గాన
యందుకని నన్ను రక్షింప విందువదన
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
             దుష్టసంహార! నరసింహ! దురితదూర!   (39)
                                                   

                           ఏమయ్యా స్వామీ! నీ భక్తులందరి లాటి వాడిని కానానేను. నీవు పొదివి ఎత్తుకున్నఆ ప్రహ్లాదుడు నీకు  ఏ మాత్రం బంగారాన్ని బహుమతిగా ఇచ్చాడు. నీవు కాపాడిన ఆ గజరాజు ఎన్ని ముత్యాలను నీకు కానుకగా ఇచ్చింది. ఆ నారదుడు ఎన్ని రత్నహారాలను నీకు అందించాడు. అహల్య నీకు ఏ అగ్రహారమిచ్చిందని ఆమె నంతగా ఆదరించావు. ఉడుత నీకు ఎంత మాత్రం  సేవలు చేసింది. విభీషణుడు నీకు ఎటువంటి బహుమానమిచ్చాడు. పంచపాండవులు నీకు ఏమి లంచమిచ్చారు.ద్రౌపది ఎంత ద్రవ్యమిచ్చిందని ఆమె ను దయ చూచి రక్షించావు. వీళ్ళందరూ అయినట్లు నేను నీ భక్తుడను కానా!నన్ను ఎందుకు రక్షించవు తండ్రీ!
                
                          ఈ పద్యం వలన ముందుగా ఆనాటికే సమాజం లో లంచమనేది చాలా బలంగా ఉన్నట్లు మనకి తెలుస్తోంది. తళ్ళికోటయుద్ధం లోనే ఈ లంచం     కరాళనృత్యం చేసి తెలుగు సామ్రాజ్యాన్ని  నేలమట్టం చేసినట్లు చరిత్ర చెపుతోంది. అది 1550 ప్రాతం. ఈ కవికాలం 1730 ప్రాంతం. ఇప్పటి కింకా అది విస్తరించి  ఉంటుంది.  పేదవాడి కోపం పెదవికి చేటు అని కదా సామెత. పేదవాడైన కవి ఆక్రోశం కట్టలు తెంచుకుని
పరమ భక్తుల భక్తిని గుర్తుచేసుకుంటూ, అధిక్షేపణ గా  మారింది.
                         
                               మందుడనని నన్ను నింద జేసిననేమి-నాదీనతను జూచి నవ్వనేమి
దూరభావము లేక తూలనాడిన నేమి-ప్రీతి సేయక వంక బెట్టనేమి
కక్కసంబులు పల్కి వెక్కిరించిననేమి- తీవ్రకోపము చేత దిట్టనేమి
హెచ్చుమాటల చేత నెమ్మెలాడిన నేమి- చేరి దాపట గేలి సేయనేమి
కల్పవృక్షంబులె నీవు కల్గనింక- బ్రజల లక్ష్యంబు నాకేల పద్మనాభ!
                       భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!   (40)
                        
             ధర్మపురి లక్ష్మీనరసింహస్వామీ . ! నేను నిన్ను ఆశ్రయించి సేవించుట చూసి ప్రజలు నన్ను మూర్ఖుడనని  నిందించినా, నా దీనత్వాన్ని చూచి వాళ్ళు నన్ను హేళన చేసినా  నేను లక్ష్య పెట్టను. మంచి చెడుల విచక్షణ మరచిపోయి ఈ ప్రజలు నన్ను నిందించినా, ప్రేమతో పల్కరించక ,సూటిపోటి మాటలతో వెక్కిరించినా, కోపముతో తిట్టినా సరే నేను వారిని లెక్కకట్టను. నాపై చాటున కొండెములు  చెప్పుకొని నన్ను అవహేళన చేసినా నాకేమిటి స్వామీ. కల్పవృక్షం లాంటి నీవు నాకు అండగా  ఉండగా ఈ ప్రజలతో నాకు లెక్కేమిటి?
          
        కవికి ఆనాటి సమాజం లో ఎదురైన  ఛీత్కార. అవమానాలు ఈ పద్య పాదాల్లో కన్పిస్తున్నాయేమో నన్పిస్తోంది.

 తల్లి గర్బము నుండి ధనముఁదేడెవ్వడు
వెళ్ళిపోయెడినాడు వెంటరాదు
లక్షాధికారైన లవణమన్నమె కాని
                            మెఱుగు బంగారంబు మ్రింగబోడు
విత్తమార్జనఁ జేసి విఱ్ఱవీగుటె కకాని
                             కూడఁ బెట్టిన సొమ్ము      గుడువఁబోడు
పొందుగా మెఱుగైన భూమి లోపలఁ బెట్టి
దానధర్మము లేక దాఁచి దాచి
తుదకు దొంగల కిత్తురో. దొరల కవునో
తేనె జుంటీఁగ లియ్యవా తెరువరులకు
భూషణవికాస !శ్రీ  ధర్మపుర నివాస!
       దుష్టసంహార! నరసింహ! దురితదూర.!   (41)
                    

        స్వామీ! ధర్మపురి వాసా!  ఈలోకం లో ఎవ్వడూ కూడ తల్లి గర్భం నుండి డబ్బు తో   బయటకు రాడు. అలాగే పోయేటప్పుడు కట్టలు కట్టుకొని తన వెంట తీసుకొనీ    పోలేడు.ఎన్ని కోట్లకు అధిపతియైనా  ఉప్పు ,అన్నం మెతుకులే కాని మేలిమి బంగారాన్ని బిస్కట్లు గా మింగలేడు. నేనింత సంపాదించానని విఱ్ఱవీగటమే కాని కూడ పెట్టిన సొమ్మును తినే యోగ్యత ఎవ్వరికీ ఉండదు.  దానధర్మాలు చేయకుండా మూలమూలల గుంటలు తవ్వి పాతి పెట్టిన సొమ్ము   దొంగల పాలో లేక ప్రభుత్వం పాలో  అవుతుంది కాని అనుభవించడానికి ఉండదు. ఎలాగంటే ఎంతో శ్రమకోర్చి తేనెటీగలు బొట్టుబొట్టు కూడ బెట్టిన తేనె బాటసారుల తీసుకెళ్ళడం చూస్తూనే ఉన్నాం కదా!
                           ఈపద్యం లోని లక్షాధికారైన లవణ మన్నమె కాని మేఱుగు బంగారంబు మ్రింగ బోడు. అన్న పాదం తెలుగునాట సామెత గా ప్రజల నాలుకల   మీద నిలిచిపోయింది. ఇక్కడ దొరలు అనే మాటకు పాలకులు అనే అర్ధం తీసుకుంటే  ఆదాయపు పన్ను ఆ రోజుల్లో ఉండేదేమో . లేకపోతే సంతు లేని వారి ఆస్థిని ప్రభుత్వ లాక్కోవడం కూడ కావచ్చు.

లోకమందెవడైన లోభి మానవుడున్న-భిక్షమర్ధికిఁ జేత  బెట్టలేడు
తాను బెట్టకయున్నఁ దగవు పుట్టదు గాని- యొరులు పెట్టఁగజూచి యోర్వలేడు
దాత దగ్గరఁ జేరి దన ముల్లె చెడినట్లు-జిహ్వతోఁ జాడీలు చెప్పుచుండు
ఫలము విఘ్నంబైనఁ బలు సంతసము నందు-మేలు కల్గినఁ జాల మిణుఁకు చుండు
శ్రీ రమానాథ! యిటువంటి క్రూరునకను- భిక్షకుల శత్రువని పేరుఁబెట్టవచ్చు
భూషణవికాస! శ్రీ  ధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!   (42)
                     
        
               శ్రీ నరసింహ ప్రభూ !ఈ లోకం లో ఉన్న పిసినారి  యాచకునికి ఒక గింజ కూడ విదిలించడు సరి కదా దానమిచ్చేవాడిని చూసి కూడ ఓర్వలేడు. తాను వేయక పోయినా పెద్ద ప్రమాదమేమీ లేదు గాని దాన గుణం గల వాని చెంతకు చేరి తన డబ్బు మూటేదో తరిగి పోతున్నట్లు దానం చేయకుండా, ఆ దాతకు కూడ  లేనిపోని చాడీలు చెప్పి, దానం చేయకుండా చూస్తాడు. తను చెప్పిన చెప్పుడు మాటలతో ఆ దాత దానం చెయ్యడం మానేస్తే మహానందపడిపోతాడు. ఒకవేళ  వీడి మాట వినక ఆ దాత తన ధర్మగుణాన్ని ప్రకటించుకొని ధర్మం చేస్తే కుమిలి కుమిలి ఏడుస్తాడు. అందువలన ఓ లక్ష్మీనాథా! ఇటువంటి దుర్మార్గునికి భిక్షుకుల శత్రువు అనే పేరు పెడితే బాగుంటుంది కదా!
                 
             కవి  యాయవారవృత్తి తో జీవించి, లక్ష్మీకటాక్షానికి  దూరమైవ వాడుగా కన్పిస్తున్నాడు.ఎంతసేపు రోజు గడవడానికి ఇబ్బంది పడిన పరిస్ధితులలోనే కవి జీవితం గడిచిందేమో. అందుకే దాతలను దానమివ్వకుండా అడ్డుపడేవారంటే కవికి అంత కోపం.  అలా అడ్డుపడే వారికి భిక్షకుల శత్రువు అనే పెద్ద బిరుదు నొకదానిని  ప్రకటించాలన్నంత  కోపం కవి లో ఉంది. ఏమైనా కవి జీవిత వివరాలు తెలిస్తే మనకు కొంత స్పష్టత రావచ్చు. లోభి అనగానే మనకు ప్రజాకవి వేమన పద్యం గుర్తు కొస్తుంది. లోభిని అడుక్కోవడమంటే గొడ్డుటావు చెంతకు పాలతీయడం కోసం కుండపట్టుకొని వెళ్ళడమే నన్నాడుగా  మన వేమన్న.

గొడ్డుటావుఁ బితుక కుండ గొంపోయిన
బండ్ల నూడదన్ను బాల నీదు
లోభివాని నడుగ లాభంబు లేదయా
విశ్వదాభిరామ వినురవేమ.

తల్లిదండ్రులు భార్య తనయు లాప్తులు బావ-మఱదులన్నలు మేనమామగారు
ఘనముగా బంధువుల్ కల్గినప్పటికైన-దాను దర్లగ వెంటఁ దరలిరారు
యముని దూతలు ప్రాణ మపహరించుక పోగ మమతతో పోరాడి మాన్ప లేరు
బలగమందఱు దు:ఖపడుట మాత్రమె కాని యించుక నాయుష్య మీయలేరు 
చుట్టముల మీది భ్రమ దీసి చూర జెక్కి-సంతతము మిమ్ము నమ్ముట సార్ధకంబు
భూషణవికాస! శ్రీ  ధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర. !  (43)

                         శ్రీ నరసింహా!నాపాలిటదైవమా!  అమ్మానాన్నలు,భార్యాపిల్లలు, ఆప్తులు, అన్నలు,బావమఱదులు, మేన మామలు, గొప్పగా బంధువర్గము ఉండి కూడ పోయేటప్పుడు ఏఒక్కరూ వెంటరారు.యమభటులు ప్రాణం తీసుకుపోతుంటే  అనురాగం తో అడ్డంపడి  పోట్లాడి ఎవరూ ఆపలేరు.ఎంతమంది బలగమున్నా ఏడవడానికే కాని ఇంచుక కూడ ఆయుష్యుని పోయలేరు. అందువలన చుట్టపక్కాల మీద భ్రమ ను తీసి లుంగచుట్టి చూరులో తోసి బ్రతికనంతకాలం మీ సేవ చేయడమే ఉత్తమ మార్గము ప్రభూ !

                                              బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పను గాని
                                              మరణ కాలమందు మఱతునేమొ
యా వేళ యమదూత లాగ్రహంబున వచ్చి
                                       ప్రాణముల్ పెకలించి పట్టునపుడు
                                            కఫవాత పైత్యముల్ కప్పఁగా భ్రమచేతఁ
గంప ముద్భవమంది, కష్టపడుచు
నా జిహ్వ తో నిన్ను నారాయణా యంచు
బిలుతునో శ్రమఁ జేరఁ బిలువలేనొ
నాటి కిప్పుడు చేసెద నామభజన
దలచెదను జేరి వినవయ్య ధైర్యముగను
భూషణవికాస! శ్రీ  ధర్మపుర నివాస!
           దుష్టసంహార! నరసింహ! దురితదూర !   (48)
                   
                              ధర్మపురి నారసింహా ! బ్రతికినంతకాలం   నీ నామస్మరణ ఏమరక చేస్తాను కాని  మరణ కాలం సమీపించినప్పుడు మరచి పోతానేమో. యమభటులు ఆగ్రహం తో వచ్చి ప్రాణాలు లాక్కుపోయేటప్పుడు, కఫ వాత పైత్యాలు కమ్ముకొని కష్టపెట్టేటప్పుడు నారాయణా అంటూ నిన్ను  పిలవ గలుగుతానో లేదో నని సందేహం కలుగుతోంది. కాబట్టి నాటి కిప్పుడే ధైర్యంగా నీ నామ స్మరణ చేస్తాను స్వామీ.
                
                  ముప్పున గాలకింకరులు ముంగిటి కొచ్చిన వేళ అనే దాశరధీ శతక పద్యం ఇక్కడ గుర్తుకొస్తోంది. ఆ పద్యం లో కఫము కుత్తుక నిండిన వేళ -- మీ స్మరణ గల్గునొ కల్గదొ...నాటి కిప్పుడే తప్పక చేతు మీ భజన  అన్నాడు కదా  మన కంచర్లగోపన్న.
     ముప్పున గాలకింకరులు ముంగిటకొచ్చినవేళ రోగముల్
            గొప్పరమైనచోఁ గఫము కుత్తుక నిండిన వేళ , బాంధవుల్
            గప్పినవేళ ,మీ స్మరణ గల్గునొ కల్గదొ నాటి కిప్పుడే
            తప్పక చేతు మీ భజన దాశరథీ ! కరుణాపయోనిథీ !
                     
                          నిజమే.ఆపదలు కమ్ముకున్న ఒక్కో సమయం లో  భక్తునికి ఆ ఆపద్భాంధవుడైన భగవంతుడు స్మరణకు రాకపోవడం కూడ ఒక శాపమే. అటువంటి దురదృష్టవంతులు కొందరు నాకు తెలుసు.నోరు కట్టేసినట్టయిపోయి, మెదడు మొద్దుబారిపోయి ఆ దైవాన్ని ప్రార్థించడం, వేడుకోవడం కూడ  ఆ సమయం లో మర్చిపోతారు. ఆ సమయం లో ఆయనను వేడుకోకపోయావా, ముడుపు కట్టకపోయావా అని తరువాత కాలం లో మనం  ఆ అభాగ్యుణ్ణి ప్రశ్నిస్తే  అతను బిక్కమొహం పెట్టి ఆ స్వామి నాకు  ఆ సమయం లో గుర్తుకురాలేదు అంటాడు. చూడండి ఎంత విచిత్రమో. అంటే అది కూడ కర్మఫలమే నన్నమాట. అనుభవించాల్సి ఉన్నప్పుడు కులదైవం కూడ   ముఖం చాటేస్తాడన్నమాట. ఎంతవాడికైనా ఆ కర్మఫలం అనుభవించక తప్పదు. అందుకే కొంతమందికి దేవుడు ఎప్పటికీ గుర్తుకు రాడు. మరికొందరికి భాగవతం లోని గజేంద్రునికి వలే ---
    కలడందురు దీనులయెడ
                       కలడందురు పరమయోగి గణములపాలన్
కలడందురన్నిదిశలను
                కలడు కలండనెడు వాడు కలడో లేడో ? 
అనే విచికిత్సకు లోనై   తుదకు  కర్మఫలం పండి ....
నీవే తప్ప నిత:పరం బెరుగ మన్నింపదగున్ దీనునిన్
రావే! ఈశ్వర కావవే! వరద సంరక్షింపు భద్రాత్మకా!
 అనే దశకు చేరతాడు.

ఇదంతా  పరీక్ష కు , పీడనకు గురైన  భక్తుని  మానసిక స్థితి.

                                                          మూడవభాగం త్వరలో.............



*************************************************************************

Saturday, 26 September 2015

శతకసౌరభాలు-7 శేషప్పకవి-నరసింహశతకము - 1



 శేషప్పకవి-నరసింహశతకము - 1
             

                                   తెలుగు నాట బహుళ ప్రాచుర్యం పొందిన భక్తి శతకాలలో శ్రీ శేషప్ప కవి రచించిన నరసింహ శతకం ఒకటి. ఇది సీసపద్య శతకం.  భక్తి శతకాలలో కన్పించే ఆర్తి , ఆత్మనివేదనం , అలగడం , మథ్య మథ్య లో స్వామివారి మీద అభిమానం పెరిగిపోయి నిందాస్తుతికి పాల్పడటం , మళ్లీ క్షమించమని ప్రాథేయపడటం వంటి వన్నీ ఈ శతకం లో కూడ కన్పడతాయి.  ఈ శతకం చదువుతుంటే భక్త కవి పోతన  భాగవతం , ధూర్జటి కాళహస్తీశ్వర శతకము , కంచెర్ల గోపన్న దాశరథీ శతకము మనకు మాటి మాటి కీ గుర్తుకొచ్చి పల్కరిస్తాయి.
                               
                                       భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
                                    దుష్టసంహార! నరసింహ! దురితదూర!
                               
                            అనేది ఈ శతక మకుటం. తనకు గణ యతి ప్రాస లక్షణాలు  తెలియవు. పంచకావ్యాలను పఠించలేదు. అమరమనే సంస్కృత  నిఘంటువును చూడనేలేదు. శాస్త్రీయ గ్రంథాలను చదువనే లేదు. కాని నీ అనుగ్రహం వలన నేను ఈ శతకాన్ని రచిస్తున్నాను. అని చెపుతూనే  తప్పు లున్నంత మాత్రాన  భక్తికి   లోటు ఏర్పడదు గదా.  వంకరగా ఉన్నంతమాత్రాన చెఱుకు గడ లో మాధుర్యం తగ్గుతుందా అంటూ ఎదురు ప్రశ్న వేస్తాడు కవి (2వ. ప ) .భక్తి కి ఛందోబంధాలెందుకు అనేది కవి వాదన. ఈ శతకం లోని కవిత్వం కూడ అదే రీతి లో కొనసాగినట్టు గుర్తించవచ్చు.
                             


                                          ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహుని దివ్యరూపం

                  
                           శ్రీ శేషప్ప కవి 1730 – 1820  మథ్య కాలం లో జీవించి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కవి నైజాం ప్రాంతం వాడయి ఉంటాడని   విమర్శకులు భావిస్తున్నారు. నరసింహుని సేవలోనే తన జీవితాన్ని కడదేర్చుకున్న కర్మయోగిగా  ఈతను కన్పిస్తున్నాడు. కేవలం భగవద్భక్తి  మాత్రమే ఈ కవి చేత ఈ శతకాన్ని వ్రాయించింది. ఇతడు నిరుపేదయై, యాయవార వృత్తి తో , భగవదారాధన లో నే జీవితాన్ని గడిపాడని భావించవచ్చు.కరీంనగర్ జిల్లా లోని ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం  ముందు  రెండు ప్రధాన ప్రవేశ ద్వారాలకు నడుమ  ఈ భక్త కవి విగ్రహం ఒకటి నెలకొల్పబడింది.  మెడలో వ్రేలాడుతున్న తంబుర ,చేతిలో చిడతలు , నెత్తిన  అక్షయపాత్ర (భిక్షాపాత్ర) తో ఆ విగ్రహం కన్పిస్తోంది.1976.సం.పు పదవతరగతి మిత్రబృందం ఈ సామాజిక సేవాకార్యాన్ని నిర్వహించారు . వారికి అభినందనలు  తెలపాలి మనమందరం.
                     
                


                ఒక్క విషయం ఇక్కడ చెప్పుకోవాలి.  తెలుగు నాట  ఇదే విధమైన సీసపద్య శతకం  మరొకటి  శ్ర్రీకాకుళ ఆంథ్ర మహావిష్ణువు మీద  శ్రీ కాసుల పురుషోత్తమకవి రచించిన ఆంథ్ర నాయక శతకం. చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ!హతవిమత జీవ! శ్రీకాకుళాంథ్రదేవ!” అనునది  దీని మకుటం.  ఈ శతకం అధిక్షేపణ శతకాలలో అగ్రభాగం లో నిలుస్తోంది. భక్తి భావన లో  ముందు వరుసలో ఉంటుంది.పోతన భాగవతం వ్రాయకపోయినా పురుషోత్తమ కవి వ్రాసేవాడని తిరుపతి వెంకటకవులే ప్రశంసించారంటే ఈ శతకం గొప్పతనాన్ని మనం ఊహించవచ్చు. సరే. ఈ శతకాన్ని గూర్చి త్వరలో   మాట్లాడుకుందాం. ఈ సమయం లో ఇటువంటి  భక్తి శతక కవులకు మరోమారు శతసహస్ర ప్రణామాలు.
                    
                        శ్రీ శేషప్ప కవి జీవిత విశేషాలకోసం  వెతుకులాట కొన సాగుతోంది.. లభిస్తే ఈ  క్రమం లోనే అందించగలను.
  
                                    శ్రీ మనోహర !సురార్చిత సింధుగంభీర!
భక్తవత్సల! కోటి భానుతేజ!
కంజనేత్ర! హిరణ్యకశిపునాశక! శూర!
సాధురక్షణ! శంఖచక్రహస్త!
ప్రహ్లాదవరద !  పాపధ్వంస!  సర్వేశ !
క్షీరసాగరశయన! కృష్ణవర్ణ!
పక్షివాహన! లసద్భ్రమర కుంతల జాల!
పల్లవారుణపాదపధ్మయుగళ!
చారు శ్రీ చందనాగరు చర్చితాంగ!
కుందకుట్మలదంత! వైకుంఠధామ!
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
                   దుష్టసంహార! నరసింహ ! దురితదూర !       (1వ. ప )
                      
                            శ్రీ ధర్మపురి  లో వెలసిన నారసింహా! శ్రీ లక్ష్మీనాథా! దేవతలచే పూజింపబడు వాడా! సముద్రము వలే  గంభీరమైన వాడా! భక్తవత్సలా! కోటిసూర్య సమప్రభా!  తామరపూవుల వంటి నేత్రములు గలవాడా! హిరణ్యకశ్యపుని సంహరించిన వాడా! వీరుడా!సాధువులను రక్షించడమే  వ్రతము గా గలవాడా! శంఖచక్రధరా! ప్రహ్లాదవరదా! పాపములను పోగొట్టువాడా ! సర్వలోకములకు ప్రభువైన వాడా! పాలసముద్రమున పవళించు వాడా! నీలవర్ణ రూపా! గరుడవాహనా!కదలాడే తుమ్మెద గుంపులవంటి అందమైన   శిరోజములు కలవాడా ! ఎఱ్ఱదామర వంటి సుందరమైన  పాదములు కలవాడా ! శ్రేష్టమైన శ్రీ గంథము, అగరు అలదిన  శరీరము కలవాడా! మల్లెమొగ్గల వంటి పంటివరుసులు కలవాడా !వివిథములైన ఆభరణము లచే ప్రకాశించెడి ఓ వైకుంఠధామా! పాపములను దూరము గా తొలగ ద్రోచి పాపులను సంహరించు వాడా! ఓ నారసింహా !శరణు !
                       
                        ఇది ఈ శతకం లోని తొలి పద్యం అవడం తో   కవి శేషప్ప  ధర్మపురి నరసింహుని లోని భక్త పరాధీనత్వాన్ని ప్రత్యేకం గా వర్ణిస్తూ ఆ స్వామి గొప్పతనాన్ని, అలాగే ఆ స్వామి ఆభరణ అలంకార వైశిష్ట్యాన్ని కన్నార చూస్తూ నోరార కీర్తిస్తున్నాడు.

                                               నరసింహ! నీదివ్యనామమంత్రము చేత
              దురిత జాలము లెల్ల దోలవచ్చు
నరసింహ! నీదివ్యనామమంత్రము చేత
                     బలువైన రోగముల్ బాపవచ్చు
నరసింహ! నీదివ్యనామమంత్రము చేత
                   రిపుసంఘముల సంహరింప వచ్చు
నరసింహ! నీదివ్యనామమంత్రము చేత
దండహస్తుని బంట్ల దఱుమవచ్చు
భళిర! నేనీ మహామంత్ర బలము చేత
దివ్యవైకుంఠపదవి సాధింపవచ్చు!
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
                                 దుష్టసంహార! నరసింహ ! దురితదూర !            (3వ.ప)
                         
                              నారసింహా ! నీ దివ్యమైన నామ మంత్రాన్ని  పారాయణ చేయడం వల్ల సమస్తమైన పాపసమూహాలను పారద్రోలవచ్చు. ఓ నారసింహా!  నీయొక్క దివ్యమైన ఓం నమో నారసింహాయ యనెడి దివ్యమంత్రాన్ని పలుమార్లు ధ్యానించడం వల్ల  భయంకరమైన రోగాలను పోగొట్టవచ్చు. నీ దివ్యనామ సంస్మరణ చేత శత్రు మూకలను పారద్రోలవచ్చు. నీ దివ్య నామ మహిమ చే యమభటులను దూరము గా తరిమి వేయవచ్చు. ఓహో. నీ నామమంత్ర మాహాత్మ్యము చే దివ్యమైన వైకుంఠ పదము నే సాధించవచ్చు. నీ నామ మహిమ ఏమని చెప్పవచ్చు ప్రభూ. !

                                         దనుజ సంహార! చక్రధర! నీకు దండంబు;
లిందిరాధిప నీకు వందనంబు,
పతితపావన! నీకు బహు నమస్కారముల్;
నీరజాతదళాక్ష! నీకు శరణు,
వాసవార్చిత! మేఘవర్ణ! నీకు శుభంబు;
మందరధర! నీకు మంగళంబు;
కంబుకంధర! శార్జ్ఞకర! నీకు భద్రంబు;
దీనరక్షక! నీకు దిగ్విజయము;
సకలవైభవములు నీకు సార్వభౌమ!
నిత్యకళ్యాణములు నగు నీకు నెపుడు;
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
                    దుష్టసంహార! నరసింహ ! దురితదూర !       (4)
                                     
                                        శ్రీ నారసింహప్రభూ! రాక్షస సంహారా!చక్రధారీ! నీకు నమస్కారము. ఇందిరానాథా! నీకు వందనము. పతితపావనా! నీకు సహస్రాధిక  కైమోడ్పులు. పద్మపత్ర దళాక్షా !నీవే నాకు రక్ష. ఇంద్రుని చేత పూజింపబడువాడా ! నీలమేఘము వంటి శరీరము కలవాడా! నీకు శుభము.మందరపర్వత ధరా! నీకు మంగళము. శంఖము వంటి సొబగైన కంఠము కలవాడా!  శార్జ్ఞము అనెడి విల్లును ధరించిన వాడా! నీకు జయమగు గాక!  దీనజన సంరక్షకా! నీకు భద్రము.  సకలలోక సార్వభౌమ! నీకు సకలవైభవములు చేకూరుగాక! నిత్యకళ్యాణములగు  నీకు  నీరజాక్ష!
                     
                           శ్రీ స్వామివారి కి జయము చెప్పడాన్నే స్తుతి  అని ప్రపత్తి  అని జోహారని అంటుంటాము. అంతే కాని ఆయనకు మంచి జరగాలని మనం కోరుకోవడమేమిటని  అనుకోకూడదు. అదే కవి ఇక్కడ మనసారా నరహరి ని ప్రార్థిస్తున్నాడు.

ఇహలోక సౌఖ్యమ్ము లిచ్చగించెదమన్న-దేహమెప్పటికిఁ దా స్ధిరత నొంద,
దాయుష్యమున్నపర్యంతంబు పటుతయు-నొక్కతీరున నుండ దుర్విలోన;
బాల్య యౌవన సుదుర్బల వార్ధకములను-మూఁటిలో మునిగెడి ముఱికి కొంప;
భ్రాంతి తో దీనిగాపాడుదమను కొన్నఁ-గాలమృత్యువు చేతఁ గోలుపోవు;
నమ్మరాదయ్య! ఇది మాయనాటకంబు-జన్మమిక నొల్ల నన్నేలు జలజనాభ!
       భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!దుష్టసంహార! నరసింహ ! దురితదూ !       (5)
                              
                                       శ్రీ నారసింహ ప్రభూ! ఇహలోక సుఖాలను కోరుకుందామంటే ఈ శరీరము అశాశ్వతమైనది. ఆయుర్ధాయమున్నంతవరకైనా శరీరం లో పటుత్వం ఒక రీతి స్ధిరంగా ఉండదు. ఈ దేహమనేది బాల్యము ,యౌవనము , వార్ధక్యమనే మూడింటి లో  మునిగిపోయే  ముఱికి కొంప. పోనీ ఈ శరీరం పై భ్రాంతి తో కాపాడుకుందామంటే కాలమనే మృత్యువు లోకి ఎప్పుడో  చెప్పకుండా జారిపోతుంది. దీనిని నమ్మకూడదు.  ఈ జీవితమంతా ఒక మహా మాయా నాటకము.అందువలన ఓపంకజనాభా! పుట్టుక అనేది నాకు వద్దు. మోక్షలక్ష్మిని ప్రసాదించు తండ్రీ !
                                                                                                          
                                              ఐశ్వర్యములకు నిన్ననుసరింపగ లేదు;
ద్రవ్యమిమ్మని వెంటఁ దగులలేదు;
కనక మిమ్మని చాలఁ గష్టపెట్టగ లేదు;
పల్లకిమ్మని నోటఁ బలుక లేదు;
సొమ్ము లిమ్మని నిన్ను నమ్మి కొల్వగలేదు
భూము లిమ్మని పేరు పొగడ  లేదు;
బలము లిమ్మని నిన్ను బ్రతిమాలగా లేదు
పసుల నిమ్మని పట్టుఁ బట్టలేదు ;
నేను గోరిన దొక్కటే నీలవర్ణ!
                      చయ్యనను మోక్షమిచ్చినఁ జాలునాకు,
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
                      దుష్టసంహార! నరసింహ ! దురితదూ !       . (8వ )
                            
              శ్రీ లక్ష్మీనాథా!! ధర్మపురి నారసింహ ప్రభూ!  నేను సంపదల కోసం నీ వెంట పడ్డం లేదు. డబ్బు లివ్వమని నేనెప్పుడూ నిన్ను అడగలేదు. బంగార మిమ్మని నేనేనాడు నిన్ను ఇబ్బంది పెట్టలేదు. పల్లకీలు ,వాహనాలు ఇవ్వమని నేను ఏనాడు నిన్ను  ప్రాధేయపడలేదు.భూములకోసమో , సొమ్ములకోసమో నేను నిన్ను సేవించడం లేదు. పశువుల మందలనో, సేవకాజనన్నో కుప్పలు తెప్పలుగా ఇవ్వమని నేను ఏనాడు నిన్ను బ్రతిమలాడలేదు. కాని ఓ నీలవర్ణా! నేను నిన్ను ఒక్కటే వేడుకుంటున్నాను. నాకు  మోక్షాన్నిమాత్రం ప్రసాదించు స్వామీ !
           కవికి పెద్దగా కోరికలేమీ లేవు . మోక్షమిస్తే చాలట. ఎంత చమత్కారమో చూడండి.

         గౌతమీ స్నానానఁ గడతేరుద మటన్న
                          మొనసి చన్నీళ్ళ లో మునుగలేను;
             దీర్ధయాత్రలచేఁ గృతార్ధుఁడౌద  మటన్న
                                బడలి నేమంబు లే నడపలేను;
దానధర్మముల సద్గతి జెందుదమన్న
                               ఘనముగా నాయొద్ద ధనము లేదు;
తపమాచరించి సార్థకము నొందుదమన్న
                       నిమిషమైన మనస్సు నిలపలేను;
కష్ఠముల కోర్వ నాచేత గాదు;నిన్ను
                స్మరణఁ జేసెద నా యథాశక్తి కొలది
      భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
                             దుష్టసంహార! నరసింహ ! దురితదూ !       .   (14 )

                         నా తండ్రీ!నారసింహా! నీ చెంత నున్న గోదావరి లో స్నానం చేసి పునీతుడ  నౌదామంటే నాకు చన్నీళ్ళ స్నానం పడదు.తీర్థయాత్రల చేత కృతార్థుడనౌదామంటే ఆ నియమ నిష్టలను నేను పాటించలేను.దానధర్మాలు చేసైనా పుణ్యం సంపాదించుకుందామంటే  అంత గొప్పగా డబ్బు కూడ నా దగ్గర లేదు.తపస్సు చేసి నిన్ను మెప్పిద్దామనుకుంటే నిమిషమైనా మనస్సు నిలకడగా ఉండదు. కష్టాలను సహించే శక్తి నాకు లేదు. కావున భక్తవరదుడవైన నిన్ను నా వోపినంత ప్రార్ధన చేస్తాను.నన్ను కరుణించు స్వామీ!
                                          
                                                 పాంచభౌతికము దుర్భరమైన కాయం బి
                    దెప్పుడో విడుచుట యెఱుక లేదు,
శతవర్షముల దాక మితముఁ జెప్పిరి కాని
  నమ్మరా    దామాట నెమ్మనమున;
బాల్యమందో  మంచిప్రాయమందో,       లేక
                         ముదిమి యందో లేక ముసలి యందో,
యూరనో , యడవినో, యుదక మథ్యమముననో,
యెప్పుడో  యేవేళ    నేక్షణంబొ
మరణమే నిశ్చయము; బుద్ధిమంతుడైన
                 దేహమున్నంతలో మిమ్ముఁ దెలియవలయు;
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
                             దుష్టసంహార! నరసింహ ! దురితదూ !        ( 15 వ )
                    
                                 శ్రీ నరసింహా! పంచభూతాత్మకమై, కశ్మలదూషితమైన ఈ శరీరము ఎప్పుడు కూలుతుందో ఎవరూ చెప్పలేరు. ఈ భూమిమీద మానవుని  ఆయష్షు వంద సంవత్సరాలని చెపుతున్నారు కాని ఆ మాట నమ్మదగింది కాదు.ఎందుకంటే  చిన్నతనం లోనో, మథ్యవయస్సులోనో, ముదిమి యందో, ముసలి తనం లోనో, ఊరిలోనో , అడవి లోనో, నీటి మథ్య నో, ఎప్పుడో, ఎక్కడో ఏదో ఒక రూపంలో మరణం తప్పదు. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు ఈ బొందిలో ప్రాణమున్నప్పుడే నిన్ను సేవించి  తరించాలి ప్రభూ!

భుజబలంబున బెద్ద పులులఁ జంపగవచ్చు-పాముకంఠముఁ  జేత బట్టగ వచ్చు,
బ్రహ్మ రాక్షస కోట్లఁ బాఱఁ ద్రోలగ వచ్చు- మనుజుల రోగముల్ మాన్ప వచ్చు,
జిహ్వ కిష్టము గాని చేదు మ్రింగఁగవచ్చు- బదను ఖడ్గము చేత నదుమ వచ్చుఁ,
గష్టమొందుచు ముండ్ల కంప లో జొరవచ్చుఁ-దిట్టుబోతుల నోళ్ళు కట్టవచ్చుఁ
బుడమి లో దుష్టులకు జ్ఞానబోధఁ దెలిపి- సజ్జనులఁ  జేయ లేడెంత చతురుడైన
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస దుష్టసంహార! నరసింహ ! దురితదూ !       (17)

శ్రీ ధర్మపురి లక్ష్మీనరసింహా!  ఈ లోకం లో అన్నింటి కంటే కష్టమైనపని ఉపదేశం చేత దుర్జనులను సజ్జనులుగా మార్చడమనేది. ఈ పని ఎంత జ్ఞాని కైనా సాథ్యమయ్యేది కాదు. ఏ విథంగా నంటే భుజబలం చేత పెద్దపులులను సంహరించవచ్చు.వాటము తెలుసుకొని మహాసర్పాన్ని సైతం చేతితో కంఠం దగ్గర పట్టుకోవచ్చు .కోట్లాది బ్రహ్మరాక్షసులను సైతం తెలివితో పార ద్రోలవచ్చు. మానవుల మాయ రోగాలను సైతం మందు తో మాన్పవచ్చు. నాలుకకు ఇష్టం లేకపొయినా అతి కష్టంగానైనా చేదును మింగవచ్చు. పదునైన కత్తిని చేత్తో అదిమి పట్టవచ్చు.  కష్టమైనా నేర్పు గా ముళ్ళ కంపలో దూకవచ్చు. కారుకూతలు కూసే వదరుబోతుల  నోళ్ళను ఏదోవిధం గా మూయించవచ్చు. కాని దుర్మార్గులను మంచి మాటలతో మాత్రం మార్చలేము ప్రభూ!
పైన చెప్పినవన్నీ అత్యంత దుస్సాథ్యము, కష్టసాథ్యము నైన పనులే అయినా   వాటినన్నింటినీ ఏదోవిధం గా సాధించవచ్చు గాని దుర్మార్గుని  సన్మార్గుని గా మాత్రం చేయలేమనేది కవి భావన.
                                        భర్తృహరి సుభాషితం   మనందరికీ తెలిసిందే . లభేత సికతాసు తైలమపి యత్నత పీడయన్ అనేది సంస్కృతశ్లోకం. తివిరి ఇసుమున తైలంబు దీయవచ్చుఅనేది తెలుగు అనువాదం.  క్లప్తంగా ఇదిఅర్థం . కష్టపడితే ఇసుక లోనుంచి నూనెను తీయవచ్చు. తిరిగి తిరిగిఎండమావి లో నీటినైనా త్రాగవచ్చు. వెదికితే కుందేటి కొమ్మునైనా సాథించవచ్చు. కాని ఖలుని మనసుని మాత్రం రంజింపచేయలేము అంటాడు మహాకవి.

భువనరక్షక నిన్ను బొగడ  నేరని నోరు ప్రజ కగోచరమైన పాడుబొంద
సురవరార్చిత నిన్నుఁ జూడగోరని కనుల్-జలములోపలి నెల్లి సరపుగుండ్లు
శ్రీ రమాధిప నీకు సేవఁ జేయని మేను కూలి కమ్ముడు వోని కొలిమి తిత్తి
వేడ్కతో నీ కథల్ వినని కర్ణములైన-గఠిన శిలాదులఁ గలుగు తొలులు
పద్మలోచన నీమీద భక్తి లేని- మానవుడు రెండు పాదాల మహిషమయ్య
భూషణవికాస! శ్రీ ధర్మపురి నివాస దుష్టసంహార! నరసింహ ! దురితదూ !      (19)
                     
                        లోకరక్షకుడవైన శ్రీధర్మపురి లక్ష్మీ నరసింహా! నిన్ను కీర్తించలేని నోరు ప్రజలకగుపించని పాడుబడ్డ బావి వంటిది.  నిన్ను చూడగోరని కన్నులు నీటి బుడగల వంటివి. ఓ లక్ష్మీనాథా. నిన్ను సేవించని ఈ శరీరము పనికి రాని తోలుతిత్తి వంటిదే కదా. నీ కథలు వినలేని ఈ చెవులు గండ్రశిలలకు ఏర్పడిన రంద్రముల వంటివే. ఓ కమలాక్షా! నీయెడ భక్తి లేని మానవుడు రెండుకాళ్ల దున్నపోతే  కదా!
                          మనం ఈ కవి పరిచయం లోనే చెప్పుకున్నాము. భక్తకవి పోతన భాగవతప్రభావం ఈ కవి మీద ఎక్కువగా ఉందని.  ఈ పద్యం చదువు తుంటే ప్రహ్లాదచరిత్ర లోని-

కంజాక్షునకుఁగాని కాయంబు కాయమే పవనగుంఫిత చర్మభస్త్రి గాక !
వైకుంఠుఁ బొగడని వక్త్రంబు వక్త్రమే ఢమ ఢమ ధ్వని తోడి ఢక్క గాక !
హరి పూజనము లేని హస్తంబుహస్తమే తరుశాఖ నిర్మిత దర్వి గాక!
కమలేశుఁ జూడని కన్నులు కన్నులే తనుకుడ్యజాల రంధ్రములు గాక!                   
చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరల సలిల బుద్బుదంబు గాక !
విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుఁడే పాదయుగము తోడి పశువు గాక ! (పో.భా. 7-170)
                              
                ఈ పద్యం వచ్చి ప్రక్కన నిలబడినట్లుంటుంది.భక్త కవుల మీద భాగవత ప్రభావం అటువంటిది.భాగవతం లోని చర్మభస్త్రి- శతకం లో కొలిమి తిత్తి గా మారింది. తనుకుడ్యజాల రంధ్రములు -  శతకం లో  కఠిన శిలాదులఁ గలుగు తొలులు  గా మారినాయి.  చివరగా మహాకవి పోతన  విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగము తోడి పశువు గాక  అంటే - శేషప్ప  ఒక అడుగు ముందు కేసి నీ మీద భక్తిలేని మానవుడు రెండు పాదాల మహిషమయ్య  అని భక్తి లేని మానవుడు ద్విపాద పశువే కాదు రెండు కాళ్ల దున్నపోతే నని స్పష్టం చేస్తాడు.

                                            ధరణి లో వెయ్యేండ్లు తనువు నిల్వగ బోదు,
ధనమెప్పటికి శాశ్వతంబు గాదు,
దార సుతాదులు తన వెంట రాలేరు,
భృత్యులు మృతిని దప్పింప లేరు,
బంధుజాలము తన్ను బ్రతికించుకొనలేరు,
బలపరాక్రమమేమి పనికిరాదు,
ఘనమైన సకల భాగ్యం బెంత గల్గియు
గోచిపాత్రంబైన గొంచుఁ బోడు,
వెఱ్రి కుక్కల భ్రమలన్ని విడిచి నిన్ను
                                                    భజన జేసె వారికి బరమ సుఖము;
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
                                                 దుష్టసంహార! నరసింహ ! దురితదూ !                            (20 వ )

                   
                          శ్రీ స్వామీ నారసింహ ప్రభూ! ఈ భూమి ఉన్నంత కాలం వేల సంవత్సరాలు  ఈ శరీరం ఉండదు కదా.!  డబ్బు అనేది శాశ్వతం కాదు. మరణించేటప్పుడు భార్య, పిల్లలు  వెంట రారు. సేవకులు చావును తప్పించలేరు.  భృత్యుడు అంటేనే భృతి (జీతం ) తీసుకొని పని చేసేవాడని అర్థం. బంధువులు ఎవ్వరు మరణమాసన్నమైనపుడు మనలను బ్రతికించలేరు. మరణకాలం లో మనకున్న బలపరాక్రమాలు ఎందుకు పనికి రావు. ఎంత సంపాదించినా పోయేటప్పుడు గోచీముక్క కూడ వెంట తీసుకెళ్లలేడు. అందు వలన ఈ పనికి మాలిన  భ్రమలనన్నింటినీ వదలి పెట్టి  నిన్ను సేవించడమే  పరమ సౌఖ్యప్రదము.
                                        
                                                                             రెండవ భాగం త్వరలో ------


******************************************************j*********************