Monday, 26 May 2014

శతక సౌరభాలు - 2 ధూర్జటి కాళహస్తీశ్వర శతకము - 3


శతక సౌరభాలు  - 2
           
                             ధూర్జటి  శ్రీ కాళహస్తీశ్వర శతకము  - 3

         


           రాజై దుష్కృతి చెందె చందురుడు , రారాజై కుబేరుండు దృ
           గ్రాజీవంబున గాంచె దు:ఖము , కురుక్ష్మాపాలుడా మాటనే
           యాజిం గూలె సమస్త రాజబంధువులతో ,నా రాజ శబ్దంబు ఛీ
           ఛీ జన్మాంతరమందు నొల్లను జుమీ ! శ్రీ కాళహస్తీశ్వరా !
           
                ఈశ్వరా !రాజైన చంద్రుడు కళంకితుడైనాడు .రారాజైన కుబేరుడు ధనాధిపతి అయ్యు , కుడి నేత్రమును కోల్పోయి , పింగాక్షుడు గా మిగిలిపోయాడు. ( పార్వతీదేవి హరుని   అర్ధాంగి యై ఆయన తొడపై అందంగా కూర్చొని ఉండటాన్ని చూచిన కుబేరుడు ఆమె అదృష్టానికి  ఈర్ష్యాళువై , అసూయ తో  ఆమెను కుడి కంటి తో చూశాడట. అందువలన  కుబేరుని కుడికన్ను నీరుకారి పోయి , అనంతర కాలం లో పింగాక్షుడైనాడని పురాణ గాథ ) .  రాజరాజు గా పేరొందిన దుర్యోధనుడు  ,చివరకు యుద్ధము లో  సమస్త బంధు మిత్రులతో కలసి  నేలకూలాడు . అందువలన ఓ శంకరా .ఈ రాజ శబ్దమును  నేను జన్మాంతరమందు నైనను అంగీకరించను  సుమా !

        రాజర్ధాతురుడైనచో నెచట  ధర్మంబుండు  ? నే రీతి నా
        నాజాతి క్రియలేర్పడున్ ? సుఖము మాన్యశ్రేణి కెట్లబ్బు  ? రూ
        పాజీవాళి కి నేది దిక్కు ? ధృతి నీభక్తుల్ భవత్పాద నీ
        రేజంబుల్ భజియింతురే తెరగునన్ ? శ్రీ కాళహస్తీశ్వరా !
    
                శ్రీ కాళహస్తీశ్వరా  ! రాజు ధనదాహం గలవాడైనచో ఇంకా రాజ్యం లో ధర్మం ఎలా  నిలబడుతుంది . ఏ విధంగా వర్ణాశ్రమ ధర్మాలు  కొనసాగుతాయి . గౌరవ మర్యాదలతో జీవించే వారు ఏ విధంగా  సుఖంగా ఉండగలరు .  వార కాంతలకు   ఎవరు ఆధారమౌతారు . ధైర్యం తో నీ భక్తులు  ఏ విధంగా నిన్న్ను సేవించగలుగుతారు ప్రభూ !
         
                 తరగల్ పిప్పలపత్రముల్ మెఱుగుటద్దంబుల్ మరుద్దీపముల్
                 కరికర్ణాంతము లెండమావులతతుల్ ఖద్యోత కీటప్రభల్
                 సురవీధీ లిఖితాక్షరంబు లసువుల్  జ్యోత్స్నా పయ:పిండముల్
                 సిరులందేల మదాంధు లౌదురొ జనుల్ ; శ్రీ కాళహస్తీశ్వరా !

                             ఈశ్వరా  !  ఈ ప్రాణాలు  నీటి కెరటాలు , రావి ఆకులు ,  మెరిసే అద్దాలు , గాలిలో పెట్టిన దీపాలు , ఏనుగు చెవుల చివరి వలే  చంచలాలు  , ఎండమావుల సమూహాలు , మిణుగురు పురుగు కాంతులు , ఆకాశం లో వ్రాసిన వ్రాతలు , వెన్నెల లోని  పాల కాంతిను ప్రోగు చేసినట్లు అశాశ్వతాలు.  కాని ఈ జనులు ఈ విషయాన్ని లెక్కచేయక సిరి సంపదలచే మదాంధులై ప్రవర్తించుచున్నారు .   ఎంత ఆశ్చర్యము !

           నిన్నున్నమ్మిన రీతి నమ్మ నొరులన్ , నీకన్న నాకెన్న లే
           రన్నల్దమ్ములు , తల్లిదండ్రులు  గురుండాపత్సహాయుండు , నా
           యన్నా  యెన్నడు నన్ను సంసృతి విషాదాంబోధి  దాటించి య
           చ్ఛిన్నానంద సుఖాబ్ది దేల్చెదొ కదే ! శ్రీ కాళహస్తీశ్వరా ! 
              
                             శంకరా ! నేను నిన్ను నమ్మినట్లు గా ఇతరులను ఎవ్వరినీ నమ్మను . నీకన్న నాకు తల్లిదండ్రులు , అన్నదమ్ములు , గురుడు , స్నేహితుడు  అనే వారు ఎవ్వరూ లేరు .  ఓ స్వామీ  ! నన్ను ఈ సంసార మనే దుఖ సముద్రాన్ని  దాటించి  శాశ్వతానందమయమైన సుఖ సముద్రము లో నన్ను  ఎన్నడు ఓలలాడిస్తావో కదా స్వామీ !

          నీ పంచబడి యుండగా గలిగిన న్భిక్షాన్నమే చాలు ని
          క్షేపం బబ్బిన రాజకీటకముల నే సేవింపగా నోప ,నా
          శాపాశంబుల జుట్టి త్రిప్పకుము సంసారార్ధమై ,బంటు గా
          చేపట్టం దయగల్గెనేని మదిలో  శ్రీ కాళహస్తీశ్వరా !
         
               ఈశ్వరా  !  నామీద దయచూపి  నన్ను నీ సేవకుడి గా  స్వీకరించు . నీ పంచ లో చోటు దొరికితే నాకు భిక్షాన్నమైనా చాలు . నిధి నిక్షేపాలిచ్చినా  హీనులైన రాజులను సేవించలేను .  సంసారం కొఱకు ఆశాపాశాలతో నన్ను త్రిప్పక  నీ బంటు గా  నన్ను స్వీకరింపుము .

         నీ పేరున్ భవదంఘ్రి తీర్ధము భవ న్నిష్ట్యూత తాంబూలమున్
         నీ పళ్లెంబు ప్రసాదమున్ గొని కదా  నే బిడ్డడైన వాడ న
         న్నీ పాటిం కరుణింపు మోప నిక నే నెవ్వారికిం బిడ్డగాన్
         చేపట్టందగు పట్టి మానదగదో ? శ్రీ కాళహస్తీశ్వరా !
         
                 పరమేశ్వరా  ! నీ పేరును స్మరిస్తూ , నీ పాదోదకమును స్వీకరిస్తూ , నీచే ఎంగిలి చేయబడిన  నీ పళ్ళెం లోని ప్రసాదాన్ని , తాంబూలాన్ని స్వీకరిస్తూ నేను నీ బిడ్డగానే పెరిగాను నేను ఇంకా ఎవ్వరికీ బిడ్డగా ఉండలేను .  చేపట్టి  తిరిగి వదిలివేయడం ధర్మం కాదు .  నన్ను నీ బిడ్డగా దగ్గరకు తీసుకోవలసింది స్వామీ !
        
         అమ్మా ! యయ్య యటంచు నెవ్వరిని నేనన్న న్శివా నిన్ను
         సుమ్మీ!   నీ మది తల్లి దండ్రులటంచు న్జూడగా బోకు నా
         కిమ్మైఁ  దల్లియుఁ దండ్రియున్ గురుడు నీవే కాగ సంసారపుం
         జిమ్మంజీకటి గప్పకుండ గనుమా ! శ్రీ కాళహస్తీశ్వరా !

                   ఓ శివా  ! నేను అమ్మా , అయ్య అని ఎవరినైనా పిలిచినను అది నిన్నే సుమీ . నీవు కాక నాకు తల్లి దండ్రులెవరున్నారు . నాకు తల్లి  ,తండ్రి , గురువు నీవే కాబట్టి  నన్ను ఈ సంసారమనే  కారు చీకటి కమ్మకుండా నీవే కాపాడవలసింది  స్వామీ !
       
         కొడుకుల్ పుట్టరటంచు నేడ్తు రవివేకుల్ జీవనభ్రాంతులై
         కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ , వారిచే నే గతుల్
         వడసెన్ ? పుత్రులు లేని యా శుకునకున్ వాటిల్లెనే దుర్గతుల్
         చెడునే మోక్షపదం బపుత్రకునకున్ ? శ్రీ కాళహస్తీశ్వరా !

                 ఓ శంకరా !.ఈ లోకంలో కొందరు అవివేకులు బ్రతుకు మీద ఆశతో కొడుకులు పుట్టలేదని  విచారిస్తుంటారు . దృతరాష్ట్రునకు వందమంది కొడుకులు పుట్టలేదా  ?  వారి వలన అతనికి ఎటువంటి సద్గతులు కల్గినవి ?  పుత్రులు లేని శుకమహర్షి కి ఏ దుర్గతులు కల్గినవి ? కావున పుత్రులు లేని వారికి మోక్షము లభంచదనుట అవివేకము కదా !
                
          గ్రహదోషంబులు  దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్ర
          త్యహమున్ బేర్కొను  నుత్తమోత్తముల బాధంబెట్టగ నోపునే
          దహనుం గప్పగజాలునే శలభ సంతానంబు ;  నీ సేవ చే
          సి హతక్లేశులు గారు గాక మనుజుల్ ; శ్రీ కాళహస్తీశ్వరా !
  
                           శ్రీ కాళహస్తీశ్వరా గ్రహదోషము వలన కలిగెడి దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామమును ఎల్లప్పుడు జపించెడి  ఉత్తములైన నీ  భక్తబృందమును  బాధపెట్టలేవు కదా . ఎట్లనగా ముడతల గుంపు  అగ్ని హోత్రుని ఆర్పలేవుకదా . అదే విధంగా నిను సేవించెడి మానవులను కష్టములు దరి చేరవు కదా  ప్రభూ !
                                   శ్రీ కాళహస్తి లో నిర్వహించే రాహు కేతు పూజలకు ఈ విశ్వాసమే ప్రేరణ యై ఉండవచ్చు.

      అడుగం బోనిక నన్యమార్గ రతులం  బ్రాణావనోత్సాహినై ,
      యడుగంబోయిన బోదు నీదు పద పద్మారాధక శ్రేణియు
      న్నెడకు నిన్ను భజింపగా గనియు  నాకేలా పరాపేక్ష కో
      రెడి దింకేమి భవత్ర్పసాదమె తగున్ ! శ్రీ కాళహస్తీశ్వరా !   ( 30 )

                                శ్రీకాళహస్తీశ్వరా !  .ప్రభూ  !  నేను  ప్రాణ రక్షణ కోసం నిన్ను కాకుండా ఇతరులను సేవించువారిని  యాచించను .  అంతగా యాచించవలసివచ్చిన నీ భక్తులను మాత్రమే అర్థించెదను .  అయినా నిన్ను సేవించెడి నాకు ఇతర వాంఛలు ఏముంటాయి ?. నీ అనుగ్రహ ప్రసాదం తప్పితే నాకు ఇంకేమి  అక్కరలేదు స్వామీ !

                                     .చదువు తూ .. ఉండండి .  మరికొన్ని అందిస్తాను.



*********************************************************************************
                          
                



Saturday, 24 May 2014

శతక సౌరభాలు - 2 ధూర్జటి - కాళహస్తీశ్వరశతకము- 2


        
శతక సౌరభాలు - 2        
                                                ధూర్జటి   శ్రీ కాళహస్తీశ్వర శతకము - 2
     

     



       వీడెం బబ్బినయప్పుడున్ ; దమనుతుల్ విన్నప్పుడుం ; బొట్టలో
       గూడున్నప్పుడు ; శ్రీ విలాసములు పైకొన్నప్పుడుం ; గాయకుల్
       పాడంగా వినునప్పుడున్ ; చెలగు దంభ ప్రాయు నిశ్రాణనన్
       క్రీడాసక్తుల నేమి చెప్పవలెనో ? శ్రీ  కాళహస్తీశ్వరా !
      

                  శ్రీ శంకరా  !  తన పెద్ధరికాన్ని గౌరవించి తాంబూలమిచ్చి నప్పుడు,  తనను గూర్చిన పొగడ్తలు విన్నప్పుడు ,  లోటు లేకుండా కడుపారా  కూడు లభించినప్పుడు , సంపదలు మెండుగా సమకూరి నప్పుడు , కవులు , గాయకులు  తన కీర్తిని గానము చేస్తుండగా విన్నప్పుడు , యవ్వన మదము చేత దానము చేయుట యందు  , సంసార సుఖము లందు  ఆసక్తులై సంచరించు  ఈ మనుషులను  ఏమనాలి . అనగా అశాశ్వతమైన విషయాలను గూర్చి ఆసక్తులై పరమేశ్వరుని ధ్యానింప కున్నారని విచారమును ప్రకటించు చున్నాడు కవి .

       నిను సేవింపగ నాపదల్పొడమనీ ,  నిత్యోత్సవంబబ్బ నీ ,
       జనమాత్రుండననీ , మహాత్ముడననీ , సంసారమోహంబు పై
       కొననీ , జ్ఞానము గల్గనీ గ్రహగతుల్ కుందింపనీ , మేలు వ
       చ్చిన రానీ యవి నాకు భూషణములే ;  శ్రీ  కాళహస్తీశ్వరా !

                 శ్రీ కాళహస్తీశ్వరా ! నిన్ను సేవించు సమయం లో నాకు కష్టములు వచ్చినా  రానిమ్ము, వేడుకలు జరిగిన జరగనిమ్ము . సమాజము నన్ను సామాన్యుని గా చూచినా , మహాత్ముని గా పొగడినా , సంసార మోహము లో మునిగిపోయినా ,  దివ్యజ్ఞానము సంభవించినా , గ్రహగతులు తప్పినా , మేలు చేకూరినా అన్నీ  నాకు ఆభరణములే శివా !

      ఏ వేదంబు పఠించె లూత , భుజగం బే శాస్త్రముల్సూచె దా
      నే విద్యాభ్యసనం బొనర్చె గరి , చెంచే మంత్ర మూహించె , బో
     ధావిర్భావ నిధానముల్ చదువులయ్యా ? కావు , మీ పాద సం
     సేవాసక్తియే కాక జంతుతతికిన్ శ్రీ  కాళహస్తీశ్వరా !

                                                     ఓ ఈశ్వరా  ! జ్ఞాన సముపార్జనకు ప్రాణులకు విద్య అవసరం లేదు. నీ పాదసేవయే సమస్తజ్ఞానమును కల్గించును . ఎట్లనగా నిన్ను సేవించిన సాలెపురుగు ఏ వేదాధ్యయనము చేసి,జ్ఞానమును సముపార్జించినది . నిన్ను సేవించిన సర్పము ఏ శాస్త్రమును చదివినది . నిను పూజించిన ఏనుగు   ఏ విద్య నభ్యసించినది .  బోయవాడైన తిన్నడు  ఏ మంత్రమును చదివి   నిన్ను సేవించి ముక్తి పొందినాడు .  కావున నీ పాదములను సేవించాలనే కుతూహలమే సమస్త జ్ఞానమును కల్గించును ప్రభూ  !

            కాయల్గాచె వధూ నఖాగ్రములచేఁ గాయంబు ,  వక్షోజముల్
            రాయన్ ఱాపఢె ఱొమ్ము ,  మన్మధ విహార క్లేశ విభ్రాంతి చే
            బ్రాయం బాయెను , బట్ట గట్టెఁ దల , చెప్పన్ రోఁత  సంసారమేఁ
            చేయంజాల విరక్తుఁ జేయగదవే ! శ్రీ  కాళహస్తీశ్వరా !

                భక్తవశంకరా  ! శంకరా !  చెప్పడానికే  రోత పుట్టించెడి ఈ సంసారమును  చేయజాలను . నన్ను విరక్తుని చేయవలసినది . ఎందుకంటే   వారకాంతల గోరు గిచ్చుళ్లతో  ఒళ్ళంతా కాయలు కాసింది . వారి వక్షోజాల రాపిడికి  నా ఱొమ్మంతా రాయిగా మారి పోయింది . మన్మధ క్రీడా క్లేశములతో వయసై పోయింది . తల బట్ట కట్టింది .  ఈ రోత సంసారము నుండి  విముక్తి కల్గించు శంకరా !

     నిన్నే రూపముగా భజింతు మది లో  నీరూపు మోకాలో స్త్రీ
     చన్నో కుంచమో , మేక పెంటియొ యీ సందేహముల్మాన్పి నా
     కన్నార న్భవదీయ మూర్తి సగుణాకారంబు గా జూపవే
     చిన్నీరేజ విహార మత్తమధుపా ! శ్రీ  కాళహస్తీశ్వరా !

         స్వామీ ! చిత్స్వరూపుడా  ! నీ నిజరూప దర్శనమును నాకు ప్రసాదించుము, నీ రూపము మోకాలో.  (దసరయ్య కధ బసవ పురాణము )  స్త్రీ వక్షమో (సుందర  నయనారు కధ బసవపురాణము - ఆచంటేశ్వరుడు ) ధాన్యమును కొలిచెడి కుంచము రూపమో. ( బల్లేశు మల్లయ్య కధ బసవపురాణము కుంచేశ్వరుడు )లేక  మేకపెంటికా (కాటకోటయ కధ )  ఈ సందేహాలన్నింటినీ మాన్పి , నీయొక్క సగుణ రూప దర్శనమును  నాకు ఇవ్వవలసినది .

                  బసవపురాణము మొదలైన శైవ వాజ్ఞ్మయ మందలి కధలను కవి ఈ పద్యం లో ప్రస్తావించాడు.    
      
       నిను నా వాకిట గావుమంటినో ? మరున్నీలాలక భ్రాంతి గుం
       టెన పొమ్మంటినొ ? యెంగిలిచ్చి తిను తింటే గాని కాదంటినో ?
       నిను నెమ్మిం దగ విశ్వసించు సుజనానీకంబు రక్షింప చే
       సిన నా విన్నపమేల గైకొనవయా ? శ్రీ  కాళహస్తీశ్వరా !

                           శంకరా ! నిన్నేమన్నా నేను బాణాసురుని వలే నా యింటికి కాపలా కాయమన్నానా  ?  సుందరమూర్తి నయనారు వలే దేవతా స్త్రీలకోసం  రాయబారం వెళ్లమన్నానా ? తిన్నని వలే ఎంగిలి పెట్టి , తినమని బలవంతం చేశానా ? లేదుకదా  ! నిన్ను నమ్మిన భక్తులను  రక్షింపమని వేడుకున్నాను . నా ప్రార్దనను ఎందుకు మన్నించవు స్వామీ !
      
       ఱాలన్ రువ్వగ చేతులాడవు , కుమారా ! రమ్ము రమ్మంచు నే
       చాలన్ చంపగ , నేత్రముల్దివియగా శక్తండ నేగాను , నా
       శీలంబేమని  చెప్పనున్నదిక నీ చిత్తంబు , నాభాగ్యమో
       శ్రీ లక్ష్మీపతి సేవితాంఘ్రి యుగళా ! శ్రీ  కాళహస్తీశ్వరా !

                       శ్రీ లక్ష్మీ నాథుని చేత సేవించబడు పదపద్మములు గలవాడా  ! శంకరా  ! నాకు శాక్యతొండని వలే రాళ్ళతో  నిను కొట్టుటకు చేతులు రావు . సిరియాళుని వలే కుమారా ! రా ! రమ్మని కొడుకుని  ప్రేమగా పిలిచి ,  చంపి నీకు వండి పెట్ట లేను ( బసవ పురాణము ).  కన్నప్ప వలే  కళ్ళు తీసి ఇచ్చుటకు శక్తిలేదు . ఇక నా నడవడిక ఎటువంటిదని నీ మనస్సు అనుకుంటోందో అంత మాత్రమే నన్ను అనుగ్రహించు స్వామీ  !

      రాజుల్మత్తులు , వారి సేవ నరక ప్రాయంబు , వారిచ్చు నం
      భోజాక్ష్ చతురంత యాన తురగీ  భూషాదు లాత్మవ్యధా
      బీజంబుల్ , తదపేక్ష చాలు , పరితృప్తిం బొందితిన్ , జ్ఞాన ల
     క్ష్మీ జాగ్రత్పరిణామ మిమ్ము దయతో శ్రీ  కాళహస్తీశ్వరా !

                స్వామీ  !  రాజులు మదాంధులు. వారిని సేవించుట  నరక తుల్యము . వారు బహూకరించు  స్త్రీలు  , పల్లకీలు ,గుఱ్ఱములు , ఆభరణాదులు , మానసికంగా వేదనను కల్గిస్తాయి. వాటి మీద ఆరాటం ఇక చాలు . సంతృప్తి పొందాను .  దయతో  నాకు మోక్షమును పొందు జ్ఞానమును ప్రసాదించ వలసినది ప్రభూ !

                నీ రూపంబు దలంపగా తుదమొదల్నేగాన నీవైనచో
                రారా రమ్మని యంచు చెప్పవు వృధా రంభంబు లింకేటికిన్
                నీరన్ముంపుము పాలముంపు మిక నిన్నే నమ్మినాడం జుమీ
                శ్రీ రామార్చిత పాదపద్మ యుగళా శ్రీ  కాళహస్తీశ్వరా !
   
                    శ్రీ రామునిచే అర్చించబడిన పాదపద్మములు గలవాడా  ! శంకరా !  నీ రూపము యొక్క ఆద్యంతములను ఊహించుటకు కూడ నాకు సాధ్యము కాదు .  నీవేమో నన్ను రమ్మని పిలువవు.. నిన్ను దర్శించుటకు చేసిన  నాప్రయత్నము లన్నియు వృధాప్రయత్నములే అగుచున్నవి. స్వామీ ! నిన్నే నమ్ముకున్నాను. పాలముంచినా నీట ముంచినా నీదే భారము తండ్రీ !
                     
       నీకున్ మాంసము వాంఛయేని  కరవా నీచేత లేడుండ గా
       జోకైనట్టి కుఠారముండ ననలజ్యోతుండ నీరుండ గా   
       పాకంబొప్పఘటించ చేతిపునుకన్ భక్షింప కా బోయచేఁ
       జేకొంటెంగిలి మాంసమిట్లు తగునా శ్రీ  కాళహస్తీశ్వరా ! (20 )
   
                    శంకరా ! వీకు మాంసము తినాలనే కోరిక కలిగితే చేతిలో జింక ఉన్నది . ఒక చేతిలో వాడియైన గొడ్డలి ఉంది .మరొక చేతిలో అగ్ని , వేరొక చేతిలో  నీరు , వంటచేసుకోవడానికి మరొక చేతి లో భిక్షాపాత్ర   ఇవన్నీ ఉన్నాయి కదా . చక్కగా మాంసమును వండుకొని భుజించక ఆ బోయవాని  ఎంగిలి మాంసాన్ని ఎందుకు తిన్నావు స్వామీ !
                                                          


                                                           -------------                మూడవ భాగం  త్వరలో




   **************************************************************
                  

             
     




Friday, 23 May 2014

శతకసౌరభాలు - 2 ధూర్జటి కాళహస్తీశ్వర శతకము - 1

       
శతక సౌరభాలు - 2
                                                       ధూర్జటి   శ్రీ కాళహస్తీశ్వర శతకము -1
                                        


                       మహాకవి ధూర్జటి   పాకనాటి నియోగి బ్రాహ్మణుడు. షట్కాల శివపూజా దురంధరుడు. శ్రీకాళహస్తీశ్వరునకు పరమభక్తుడు. సాహితీ సమరాంగణ  సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయల వారి  ఆస్ధానములోని అష్టదిగ్గజ కవులలో ఒకరు. అంతేకాదు .ఆ అష్టదిగ్గజాలలో ఈయన ఒక్కడే ఏకైక శైవకవి. శ్రీ వైష్ణవాన్ని స్వీకరించి , ఆదరించి , ఆముక్తమాల్యద వంటి ఆళ్వారు వృత్తాంత ప్రబంధాన్ని  రచించిన  శ్రీకృష్ణదేవరాయలు  తన ఆస్ధానం లో  వీరశైవ సంప్రదాయానుసారి  యైన ఈయనను ఆదరించడానికి కారణం  ఈయన కవిత్వం లోని మాధుర్యమే నని కొందరు  పరిశీలకులు భావిస్తున్నారు. అందుకు ఆధారంగా ఒక చాటువు ప్రసిద్ధంగా  లభిస్తోంది. 
      
       “  స్తుతమతి యైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల గల్గె నీ
        యతులిత మాధురీ మహిమ ..................................
       
                 అని ఒకనాడు శ్రీ రాయల వారు ధూర్జటి కవిత్వాన్ని కొనియాడుతూ సమస్య నివ్వగానే  , వెంటనే సభలో ఉన్న శ్రీ తెనాలి రామకృష్ణుడు లేచి .. ఇట్లు పూరించాడట.

           “..................................... హా తెలిసెన్  భువనైక మోహనో
        ద్ధత సుకుమార వారవనితాజనతాఘన తాపహార సం
        తత మధురాధరోదిత సుధారస ధారలఁ  గ్రోలుటం జుమీ ! “

                         ఇది యథార్ధ కధనమే యనడానికి ధూర్జటి మనుమడు కుమారధూర్జటి తన కృష్ణరాయవిజయము అనే కావ్యం లో  పద్యాన్ని ఉటంకించడమే సాక్ష్యము.

                 కొనియాడదగిన ఆంద్రకవి ధూర్జటి  పల్కులకు కవిత్వానికి ఇంతటి మాధుర్యం ఎలావచ్చింది అన్నది  శ్రీ రాయల వారి ప్రశ్న.

                         హా !  నాకు తెలిసింది. భువనైక మోహనులైన  వారకాంతల యొక్క తాపమును తీరుస్తూ , ఎల్లప్పుడు  వారి  మధురాధరములనుండి జాలువారు తీయని అధరామృతాన్ని   గ్రోలడం వలనే ధూర్జటి మహకవి కవిత్వం అంత మధురం గా ఉంది  “ అని చమత్కరించాడట శ్రీ తెనాలి రామకృష్ణుడు. ధూర్జటి కి వారకాంతల సంగతి ఉన్నట్లు , దానితో తాను విసిగిపోయినట్లు ఈ శతకం లో మనకు చాలాచోట్ల  కవి ప్రస్తావిస్తాడు.

                     శివపూజాతత్పరుడు , యోగశాస్త్ర విశారదుడు , పండిత కవి యైన శ్రీ ధూర్జటి  శ్రీ కాళహస్తి మహాత్మ్యము అనే కావ్యాన్ని , శ్రీ కాళహస్తీశ్వర శతకాన్ని రచించాడు.  శ్రీ కృష్ణరాయల వారి ఆస్ధానం లో, అష్టదిగ్గజాలలో ఒకడి గా  ఉండి కూడ ఈ రెండు  గ్రంథాలను శ్రీ కృష్ణదేవరాయలు వారికి అంకితం ఇవ్వకుండా శ్రీ కాళహస్తీశ్వరుని కే అంకితం చేశాడు.  ఇటువంటి  వీరశైవకవి ని ఆదరించడం శ్రీ రాయల వారి పరమత సహనానికి ఉదాహరణ గా భావించవచ్చు.
                           
            ధూర్జటి  మనుమడైన కుమారధూర్జటి యొక్క కుమారుడు లింగరాజు  అనే కవి వ్రాసిన పెద కాళహస్తి మాహాత్మ్యాన్ని బట్టి ధూర్జటి శ్రీకృష్ణరాయల వారి ఆస్ధానం లో సత్కారాలు పొందినట్లు తెలుస్తోంది. అనగా ఇతని కాలము  క్రీ.శ 1480 -1530 . గా భావించ వచ్చు. శ్రీ రాయల మరణానంతరం కూడ ఈ జీవించి ఉండవచ్చు నని కొందరి భావన.   శ్రీ ధూర్జటి శ్రీ కాళహస్తి గ్రామం లోనే నివసించే వాడని , ఆయన అభ్యర్ధన మేరకే     వైష్ణవ మతాన్ని స్వీకరించిన శ్రీ కృష్ణదేవరాయలు ఒకటి , రెండు మారులు శ్రీ కాళహస్తీశ్వరుని దర్శనం చేసుకొని ఉండవచ్చని కొందరు పరిశోధకులు భావిస్తున్నారు. 
        
                ఈ శతకము లో ఎక్కడా ధూర్జటి పేరు లేకపోయినను క్రీ.శ  1740  ప్రాంతము వాడైన ప్రసిద్ధ లాక్షణికుడు శ్రీ కస్తూరి రంగకవి తన ఆనంద రంగ రాట్చందము నందు ఈ శతకము లోని పద్యము నుదాహరించి ఇది ధూర్జటి  కాళహస్తీశ్వర మహాత్మ్యము లోనిది గా పేర్కొనుట   ఈ శతకము ధూర్జటి ది గా చెపుతోంది.
  
                ఈ శతకము లో శివభక్త్యనుభవము , ఆత్మనివేదనమే కాకుండా  రాజనింద , వార వనితా  తిరస్కారం  , భవపరాజ్ముఖత స్పష్టంగా కన్పిస్తాయి. ప్రౌఢమైన శైలి  శతకానికి అందాన్నిచ్చింది.  కవి  శివుని తో మాట్లాడు తున్నట్టు గానే పద్య రచన సాగుతుంది. శివుడు గజ చర్మాంబర ధారి , వ్యాఘ్రాజిన ధారి  కాబట్టి ధూర్జటి ఈ శతకం లో మత్తేభ , శార్ధూల వృత్తాలను మాత్రమే వాడాడు.    తెలుగు భక్తి శతకాలలో శ్రీ కాళహస్తీశ్వర శతకానికి ఒక ప్రత్యేకత ఉంది.  ఈ శతకం లో కూడ  అవసరమైన తావుల తేజస్వినీ పేరుతో వ్యాఖ్యానాన్ని అందించాను . సహృదయంతో స్వీకరిస్తారని ఆశిస్తున్నా.

  
           శ్రీవిద్యుత్కలితాజవంజన మహా జీమూత పాపాంబుధా
       రా వేగంబున మన్మనోజ్ఞసముదీర్ణత్వంబు కోల్పోయితిన్
           దేవా మీ కరుణా శరత్సమయమింతే చాలు , చిద్భావనా
       సేవం దామరతంపరై మనియెదన్ ; శ్రీ కాళహస్తీశ్వరా !

                  శ్రీ కాళహస్తి పట్టణ మందు వెలసిన ఈశ్వరా   మెరుపు తీగవలే చంచలమై చావు పుట్టుకలతో కూడిన సంసారమనెడి కారు మేఘముచే ధారాపాతముగా కురిసెడి  పాపములనెడి వర్షధారల వలన  నామనస్సనెడి పద్మము  వికాసమును కోల్పోయినది. ఓ పరమేశ్వరా  ! మీ కరుణ యనెడి  శరత్సమయాన్ని నాపై కొంచెం గా ప్రసరింపచేయ  వేడుకొనుచున్నాను.  నీవు కరుణ చూపిన యెడల నామనస్సు ను తిరిగి పదిలపరచుకొని  నీ సేవకు పునరంకితమౌతాను దేవా  !

       వాణీవల్లభ దుర్లభంబగు భవద్వారంబున న్నిల్చి,ని
      ర్వాణశ్రీ  చెరపట్టచూచిన  విచారద్రోహమో ,నిత్య క
      ళ్యాణ క్రీడల బాసి , దురదశల పాలై , రాజలోకాధమ
       శ్రేణీ ద్వారము దూరజేసి దిపుడో ! శ్రీ కాళహస్తీశ్వరా !

                   దేవా !     బ్రహ్మదేవునకు అసాధ్యమైన నీ వాకిటి లో నిలబడి , మోక్షలక్ష్మి ని  కోరుకోవడమే  నేను చేసిన నేరమా స్వామీ ?    లేకపోతే  నీకు యొనర్చెడి నిత్య కళ్యాణ అర్చనలకు దూరమై , దుర్దశల పాలై , ఇప్పుడు  నీచులైన రాజుల ముంగిళ్లలో   బతుకు సాగింప చేయుచున్నావు. 
     
       అంతా మిధ్య తలంచి చిన నరుండట్లౌ టెరంగిన్ సదా
       కాంతల్పుత్రులు నర్థముల్ తనువు నిక్కంబంచు  మోహార్ణవ
       భ్రాంతిం జెంది చరించు గాని పరమార్ధంబైన నీయందు దా
       చింతాకంతయు చింతనిల్పడు  కదా ! శ్రీ కాళహస్తీశ్వరా !
                          
               ఈశ్వరా !  ఈ లోకమంతా మిథ్య అని తెలిసి కూడ మానవుడు  భార్యా బిడ్డలు , ధనము దేహము అనే భ్రాంతిలో  పడి ప్రవర్తించునే కాని ముక్తి నిచ్చెడి నీయందు చింతాకంత యైనను మనస్సు ను లగ్నము చేయడు కదా స్వామీ ! 
     
     నీ నా సందొడబాటు మాట వినుమా  నీచేత జీతంబు నే
      గానిం బట్టక , సంతతంబు  మది వేడ్కన్గొల్తు , నంతస్సప
      త్నానీకంబున కొప్పగింపకుము నన్నా పాటియే చాలు , తే
      జీనొల్లం గరినొల్ల నొల్ల సిరులన్ శ్రీ కాళహస్తీశ్వరా !
  
                     ఓ దేవా ! మనిద్దరి మథ్య  ఒక ఒప్పందము చేసుకుందాము . విను.  నేను నీ నుండి దమ్మిడీ కూడ జీతం తీసుకోకుండా    నేను నిన్ను సేవిస్తాను.  అందుకు ప్రతిఫలంగా నీవు నన్ను ఆలుబిడ్డలు , రాగద్వేషములనే అంతశ్సత్రువులకు అప్పగించకుండా నన్ను కాపాడు.  ఇంతమాత్రం చాలు . గుఱ్ఱాలు , ఏనుగుల , సిరి సంపదలు నాకు వద్దు. నీ భక్తి యే చాలు  స్వామీ  !            

     భవకేళీ మదిరామదంబున మహాపాపాత్ముడై వీడు న
     న్ను వివేకింపడటంచు , నేను నరకార్ణోరాశిపాలైన బ
     ట్టవు , బాలుండొక చోట నాటతమితోడ న్నూతగూలంగ దం
     డ్రి విచారింపక యుండునా ? కటకటా  ! శ్రీ కాళహస్తీశ్వరా !

                                    ఓ శంకరా !   సంసారమనే మద్యపానపు మత్తులో ఈ మానవుడు  పాపాత్ముడై నన్ను తలంచడం లేదనే ఊహ తో నీవు  నేను నరకమనే సముద్రంలో పడిపోయినా పట్టనట్లు ఊరుకుంటున్నావు . కొడుకు  ఆడుకుంటూ  నూతిలో పడిపోతే తండ్రి పట్టించుకోకుండా ఊరుకుంటాడా ?

     స్వామి ద్రోహము చేసి ,వేరొకని కొల్వన్ బోతినే? కాక నే
     నీమాటల్విన నొల్లకుండితినో ? నిన్నే దిక్కుగా జూడనో ?
     యేమీ యిట్టి వృధాపరాధి నగు నన్నీ దు;ఖ వారాశి వీ
     చీ మధ్యంబున  ముంచి యుంపదగునా ? శ్రీ కాళహస్తీశ్వరా !

             శ్రీ కాళహస్తీశ్వరా!  నా ప్రభువు వైన నిన్ను కాదని నేను వేరే దైవాలను పూజించానా ? లేదు కదా ! పోనీ నేను నీ మాటలను ఎప్పుడైన వినలేదా? లేదు కదా ! నీవే నాకు దిక్కని ప్రార్ధిస్తూనే ఉన్నాను కదా ! మరి అటువంటప్పుడు ఏ నేరమూ చేయని నన్ను ఈ దు:ఖసముద్రం మధ్య లో  ముంచి వేయడం  న్యాయమా ప్రభూ  !
     దివిక్ష్మారుహ ధేనురత్న ఘనభూతిన్ ప్రస్ఫురద్రత్న సా
     నువు నీ విల్లు ,నిధీశ్వరుండు సఖుఁడర్ణోరాశి కన్యావిభుం
     డు విశేషార్చకుఁడింక నీకెన ఘనుండున్  గల్గునే ? నీవు చూ
     చి విచారింపవు లేమి నెవ్వడుఁడుపున్ ? శ్రీ కాళహస్తీశ్వరా !

              ఓ దేవా ! కోరికలను తీర్చు కల్పవృక్షము , కామధేనువు , చింతామణి వంటి సంపదలతో ప్రకాశించు  మేరుపర్వతము నీ ధనుస్సు. కుబేరుడు నీకు స్నేహితుడు . లక్ష్మీదేవి భర్తయైన శ్రీ మహా విష్ణువు నీకు  విశేష భక్తుడు.  నీ సాటి దైవము లేడు కాని నీవు మాత్రం  దారిద్ర్యంలో మునిగిన మా బాధలను పోగొట్టడానికి యత్నించడం లేదు . నీవు కాక మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు  ప్రభూ ! 

     నీతో యుద్ధము చేయనోప , గవితానిర్మాణ శక్తిన్నిన్నుం
     బ్రీతుం చేయగలేను , నీకొరకు తండ్రిన్ చంపగాజాల నా
     చేతన్ రోకట నిన్ను మొత్తవెరతుం చీకాకు నా భక్తి యే
     రీతి న్నాకిక నిన్ను చూడగనగున్ ? శ్రీ కాళహస్తీశ్వరా !

                          శ్రీ కాళహస్తీశ్వరా ! అర్జునునిన వలే నేను నీతో యుద్దం చేయలేను . నత్కీరుని వలే నీపై కవిత్వం చెప్పి నిన్ను మెప్పించలేను. కాటకోటుని వలే  నీ కోసం తండ్రిని చంపలేను. బాలలింగన్న వలే నిన్ను రోకటి తో కొట్టలేను. నీ యెడల నాకున్న  భక్తియే నన్ను బాధల పాలు చేస్తోంది. మరి ఏ విధంగా నిన్ను చూడగలను స్వామీ  !

    ఆలున్ బిడ్డలు తల్లిదండ్రులు ధనంబంచు న్మహాబంధనం
    బేలా నామెడ గట్టినాడ విక నిన్నేవేళ జింతింతు ,ని
    ర్మూలంబైన  మనంబులో నెగడు దుర్మోహాబ్ది లో గ్రుంకి యీ
    శీలామాలపు జింత నెట్లుడిపెదో ? శ్రీ కాళహస్తీశ్వరా !

                      శ్రీ శంకరా ! భార్యాబిడ్డలు , తల్లిదండ్రులు , ధనము అనే ఈ బంధాలన్నింటినీ నామెడ కెందుకు కట్టావు . ఇక నేను నిన్ను ఏ విధంగా  స్మరించగలను .  నీ యెడల నశించి పోయిన మనస్సు లో  పెరుగుతున్న  మోహమనే సముద్రం లో మునిగిన  ఈ దుఖాన్ని ఎలా పోగొడతావో కదా ?
   
     నిప్పై పాతకఁదూలశైల మడచున్ నీ నామము న్మానవుల్
     దాపున్ దవ్వుల విన్ననంతక భుజాదర్పోద్ధత క్లేశముల్
     తప్పుం దీరును ముక్తలౌదురని శాస్త్రంబు ల్మహాపండితుల్
     చెప్పంగా దమకింక శంకలుండవలెనా ? శ్రీ కాళహస్తీశ్వరా !  ( 10 )

                                 శ్రీ కాళహస్తీశ్వరా !  పవిత్రమైన నీ నామమును మానవులు దగ్గరనుండైనా , దూరమునుండైనా విన్నంతనే   పుణ్యమనే అగ్ని పాపాలనే ప్రత్తి కొండలను  భస్మం చేస్తుందని , యమ ధర్మరాజు భుజ గర్వముచే  ఉత్పన్నమయ్యే చిక్కులన్నీ తొలగి పోయి ముక్తులౌతారని శాస్త్రాలు , మహా పండితులు చెపుతుంటే , ఈ మానవులకు ఇంకా  నీనామ మహాత్మ్యము పై అనుమాన మెందుకు శంకరా ?

                               -------------------------------------------------     రెండవభాగము        త్వరలో 


    ----- *********************************************************************************