Saturday, 15 June 2013

పైడిలేడి- అపవాదము(మొదటిభాగము)

         

              పైడిలేడి అపవాదము
                                                                                                          (మొదటి భాగము)
                              
                                 రామాయణ మహాకావ్యంలో సీతారాముల వియోగానికి కారణమైన రెండు సన్నివేశాలను తీసుకొని కావ్యంగా మలచిన మథురకవి శ్రీ నాళం కృష్ణారావు గారు. ఇది రెండు భాగాలు గా విభజించబడిన  చిరుకావ్యం.
                             

                 
                      దీనిలోని మొదటి భాగం జానకీ రామచంద్రుల   తొలి వియోగానికి కారణమైన మాయలేడి వృత్తాంతం  కాగా రెండవభాగం  నిండుగర్భిణియైన సీతామహాసాధ్విని అడవిలో వదిలి వేయడానిక కారణమైన జనాపవాదానికి సంబంధించినది. అయితే ఈ రెండింటిలోను గల సమాన లక్షణం ఇచ్చట కన్పించేవి  రెండే పాత్రలు కావడం- ఆ  రెండు పాత్రలు సీతాలక్ష్మణులు కావడం,- అందునా రెండు ఘట్టాల్లోను నష్టపోయినది సీతమ్మే కావడం గమనించదగ్గ విషయం. ఈ  సమాన లక్షణాలే కవిని ఈ కావ్య నిర్మాణానికి ప్రోత్సహించి ఉండవచ్చు. ఆకారం లో చిరుకావ్యం గా కన్పించినా   విశ్లేషణ లో మిన్నగా  గోచరిస్తుందీ కావ్యం.
                            
                               బంగారులేడి వేషం లో రాముని గికురించి దూరం గా  తీసుకుపోయాడు మారీచుడు. కోపించిన రాముడు రామబాణాన్ని సంధించాడు. మరణిస్తూ  కూడ ప్రభుభక్తి ని ప్రదర్శించుకున్నాడు మారీచుడు. పర్ణశాలలో ఉన్న సీతాలక్ష్మణులు  రాముని గొంతుకతో విన్పించిన ఆర్తనాదాన్ని విన్నారు. భర్త కంఠస్వరం విన్న సీతాదేవి రామునకు  ఏమైనా ప్రమాదం జరిగిందేమో నని   శంకించి, లక్ష్మణుని రామునకు సహాయం గా వెళ్లమని కోరడంతో  కావ్యం ప్రారంభమౌతుంది.
                            
                         ఆర్తస్వరం తు తం భర్తు ర్విజ్ఞాయ సదృశం వనే ( వాల్మీ. రా. అ. 42-1)

                  అనే  వాల్మీకాన్ని ఆధారం చేసుకొని --
                                   
                             “ అదిగో సౌమిత్రి వింటివే యార్తరవము’’
   
                       అంటూ ప్రారంభిస్తారు నాళం వారు తన కావ్యాన్ని .
                           
                      “ పెనగి మృత్యువుపైకొన్న వేళగాని కలుగదెన్నడునట్టి యాక్రందరవము అని భీతిల్లిన సీత రామునికి సహాయంగా లక్ష్మణుని వెళ్లమంటుంది.అయితే రాక్షసుల మాయలు ,రామచంద్రుని పరాక్రమము తెలిసిన లక్ష్మణుడు కదలకుండా అలాగే ఉండిపోయాడు.భయపడింది. అనుమానించింది సీత. మీ అన్న మీద కన్న నామీద ఎక్కువ గౌరవం చూపించే వాడివి. ఇప్పడేమయింది. పిలిచినా పలుకని  స్థితిలో ఉన్నావు.
                      
                    “ మున్ను నా పాదముల భక్తి మ్రొక్కి గాని అన్న మొగమైన చూడవు కన్నులెత్తి  అంటూ ఇంతకు పూర్వము లక్ష్మణునిలో ఉన్న భక్తి ప్రపత్తుల్ని గుర్తుచేసి, తుదకు లక్ష్మణుడు వెళ్లకపోతే తన భర్తను కాపాడుకోవడానికి తానే వెడతానని బయలుదేరుతుంది  సీతాదేవి.
                                   
                                               భ్రాత కాపాడ నీకంత భీతియున్న
                                   నిలిచియుండుము నీవిట నేనెపోయి
                                  శత్రువుల నెల్ల నొకపెట్టి జక్కడించి
                                   స్వామి గొను వత్తు తలపువ్వు వాడకుండ   
                 
                 -  అనడంలో శతకంఠ. సహస్రకంఠ రామాయణాల్లో దర్శనమిచ్చే   శక్తి స్వరూపిణి యైన సీతామాత ను  దర్శింప చేస్తారు కవి. తల పువ్వు వాడకుండ స్వామి గొనువత్తు నన్న  సీత నాళం వారి వీరవనిత. ఇక్కడ చక్కని తెలుగు నుడికారం పరిమళించింది.
                   ‘’  మేక వన్నె పులిలాగ ఇంతకాలం రాముని వెంటతిరిగావు. నీతత్త్వం ఇప్పుడు నా కవగతమైంది. ఎంత కుటిలాత్ముడ ‘’వంటూ నిందించడమే కాకుండా కర్ణకఠోరంగా  -
                                   వాడు చచ్చిన తోడ నా పీడ వదులు
                                  వాని భార్యను చేపట్టి వైభవంబు
                                  మించ నేలెద గాకంచు నెంచితేమొ
                                  నిలువు నీఱయి కూలవె తులువ యిపుడ
         
                     ---  అన్న మాటలు వాల్మీకి సీతమ్మవే.
                               
                        ఇచ్ఛసి త్వం వినశ్యంతం రామం లక్ష్మణ మత్కృతే
                 లోభన్మమ కృతే నూనం నానుగచ్ఛసి రాఘవం          (వాల్మీ.రా. అ 45-64).
                   
                        భావాలు మూలానుసరణమే అయినా తేటతెనుగు మాటల్లో  రూపుదిద్దుకున్న పై పద్యం  కాఠిన్యతను సంతరించుకొని ,చటుక్కున  గుండెకు గుచ్చుకుంటుంది. వినశ్యంతం రామం అన్న పదాలకు వాడు చచ్చినతోడ అని ప్రారభించి, ఆ పీడ వదలు అంటూ పలికి లోభాన్మమ అన్నపదాన్ని ఆథారం చేసుకొని వానిభార్యను చేపట్టి వైభవము మించ నేలెద గాక అంటూ పలకడం, నిలువు నీఱయి కూలవె తులువ అన్న  చోట నిలువునా బూడిదై పోతావు అన్న తెలుగువారి తిట్టును గుర్తుచేస్తూ గాంభీర్యాన్ని సంతరించుకొంది.          
                          
                           తమ్ముడొక్కండు రాజ్యంబు తస్కరించె
                         బలిమి నొక్కడు భార్యఁ జేపట్టనెంచె
              
                      రాముని తమ్ముళ్ల లో ఒకడు రాజ్యాన్ని కాజేస్తే,వేరొకడు భార్యనే కాజేద్దామని కూర్చున్నాడు. ఏమి కావింప నుండెనో యింకనొకడు.”?           ఇక మూడో వాడు ఏమి చేయబోతాడో అంటూ మంచితమ్ముల కూర్చెరా  . బ్రహ్మ అనేస్తుంది నాళం వారి సీత.
              
                           పిడుగులు కురిపిస్తున్న   జానకి పలుకులు వినలేక పోయాడు లక్ష్ణణుడు హరిహరీ! తల్లీ ! ఎంతమాటాడినావు అంటూ గిజగిజ లాడిపోయాడు.శాంత హృదయయైన సీత ఇంత నిష్టూరంగా మాట్లాడటం మంచు ముద్దనుండి ప్రచండాగ్ని పుట్టినంత ఆశ్చర్యాన్ని కల్గించింది లక్ష్మణునికి. కలత చెందాడు .
           
                     రాక్షస మాయలను భేదించడం రాముని కసాథ్యంకాదని, ముల్లోకాలెత్తి వచ్చినా రాముని కపజయం తటస్థించదని అంటాడు లక్ష్మణుడు మూలంలో .  త్రిభుర్లోకై  స్సముద్యుక్తై  సైశ్వరైరపి సామరై:’’  (వాల్మీ.అ.45-161). దీన్ని ఆథారం చేసుకొని --
                  
               “   రాముడెన్నగ నాది నారాయణుండు
                    కాని కేవల సామాన్య మానవుండె
                    అవని భారంబు హరియింప నవతరించె
                    ననుచు మౌనులు వచియింప వినవె తల్లి ‘’
        
         - అని రాముని పరమాత్మగా స్తుతించిన మునుల వాక్యాలను గుర్తుచేస్తాడు.ఎల్లలోకాలు ఎవని సహాయం లేకపోతే నిముషం కూడ నిలబడలేవో ఆమహనీయునకు నేను సహాయం గా వెళ్లడమా అంటూ ఆశ్చర్యపోయిన లక్ష్మణుడు వాల్మీకి సృష్టి కాదు. ఒంటరిగా నిన్ను వదలి వచ్చినందుకు అన్నగారు కోపించి నావంక చూస్తే ఏమి చెప్పుకోవాలి అన్న ప్రశ్న నాళం వారి లక్ష్మణునిది.
                 
                   నిన్ను కాపాడమని యన్న నిలిపె నన్ను
                   అన్న కాపాడ బొమ్మని యనిపెదీవు
                    ఏది కర్తవ్యమో నిర్ణయింప జాల
                   ముందు జన నూయి వెనుక గోయి’’
          
                  - ఎవరి ఆజ్ఞను పాటించాలో తెలియని డోలాయమాన స్థితి లో లక్ష్మణుడు కర్ణ కఠోరమైన సీతమ్మ మాటలు వినుటకంటె  అన్న కోపాగ్ని కి ఆహుతి అగుటయే మేలు  అని నిర్ణయించుకొని  వెళ్లపోతానంటాడు.  ఈ సందర్భం లో లక్ష్మణుడు ఆడవారి  ప్రవర్తనను వివరిస్తూ,--
                       
                          వాక్యమప్రతిరూపంతు నచిత్ర స్త్రీషు మైథిలీ
                         స్వభావస్త్వేషు నారీణా మేవం లోకేషు దృశ్యతే
               విముక్త ధర్మా శ్చపలా  స్తీక్ష్ణా భేదకరా స్త్రియ: ‘( వా.రా.అ 45- 284-294)
   
                        అంటాడు .ఈ మూలాన్ని ఆధారం చేసుకొని,
                       
                      తమ హితము తామెఱుగరు తమ హితంబు
                          గోరి యొరులాడు పల్కుల చేరి గొనరు
                          తాము చెప్పన మాటలె తథ్యమనుచు
                          పెనగెదరు చాన లెంత వెడగులౌర !”
                      
                 -  అన్న మాటలు ఆథునిక లక్ష్మణునివి. ఆడవారి కోపం వలన వచ్చే అనర్థాలు, వానిని అవగాహన చేసుకోగలిగిన పరిపక్వత ఈ లక్ష్మణుని లో కన్పిస్తాయి. సీత ఆజ్ఞను శిరసావహించి, అన్న కోసం  వెడుతున్న లక్ష్మణుడు వాల్మీకం లో-
          
                 ‘'  స్వస్తి తే2స్తు వరాననే ,రక్షంతు త్వాం విశాలక్షి  సమగ్రా వనదేవతా: ‘’(వా.రా.అ.45-331)
   
                                     “తల్లీ! నీకు శుభమగు గాక,! వనదేవతలు నిన్ను రక్షింతురుగాక!” అంటూ ప్రార్థిస్తాడు లక్ష్మణుడు.
                           
                                 ప్రభుని తోడ్కొని మగుడ నేవచ్చుదాక
                                ఎవ్వడైనను నిను ముట్టెనేని , తోన
                          పుడమి పై గూలు గావుత బూది యగుచు
                        
          -అని శాపం పెట్టి వెళ్లాడు నాళం వారి లక్ష్మణుడు. లక్ష్మణుడు అటు వెళ్లగానే  సీతమ్మకు దు:ఖం  పెల్లుబికింది. అనేక దుశ్శకునాలు  గోచరించాయి. ఏ ప్రమాదం ముంచుకొస్తుందో నని భయ పడుతూనే, ఎన్ని ఇబ్బందులొచ్చినా భయపడను కాని  -
                     
                             ‘’ చారుగుణ శీలు, సన్నుతాచారలోలు,
                                    మఱది తిట్టితి, దానికి మ్రగ్గుదాన’’   
                                    
                           - అని మఱది ని తిట్టినందుకు పశ్చాత్తాపపడిన జానకి తెలుగుకవి సృష్టి. వాల్మీకి సీతలో ఈ విధమైన పశ్చాత్తాపం  రావణాపహరణం తరువాత కన్పిస్తుంది. కానీ ఈ కావ్యంలో ఈ ప్రదేశం లోనే  తన మాటల్లోని  తొందరపాటు ను వెంటనే సీత గుర్తించినట్లు వ్రాయడం  మైథిలీ పాత్రకు మరింత ఉన్నతిని కల్గిస్తుందని  కవి భావించి ఉండవచ్చు.
                          
                ఆత్మ సుఖము ను వర్జించి యన్న కొఱకు
                    అడవులం బడి ఇడుముల గడుచుచున్న
                    దురిత దూఱుని లక్ష్మణు దూఱి యుంటి
                   కట్టి కుడుపక యున్నే యీ కర్మఫలము.’’
                          
                     -    అని విచారిస్తున్న సీతమ్మ పల్కులు    భవిష్య సూచకాలు గా  థ్వనిస్తాయి.    రామాయణ కథ అందరికీ తెలిసిందే అయినా తెలుగు సామెతలు, జాతీయాలు అందంగా రచనలో చోటుచేసుకొని కావ్యానికి స్వతంత్రపత్తిని కల్గించాయి.
                              
                                    ఇక ఈ కావ్యం లో రెండవభాగం  అపవాదము. 
                                                                                                                                   
                                                                  (తరువాయి భాగంలో)


                

******************************************************************************************

                            

Saturday, 1 June 2013

నారదుడు కలహభోజనుడా? పూజాభాజనుడా ?

              

           నారదుడు   కలహ భోజనుడా ?   పూజా భాజనుడా ?    
                
   


                    




                             నారదుడు  బ్రహ్మ దేవుని కుమారుడు. బ్రహ్మచారి. త్రిలోక సంచారి. సంసార బంథాలు లేని మహర్షి. ఎల్లప్పుడు  తన మహతి అనే వీణ పై నారాయణ నామ  గానం చేస్తూ   తాను తరిస్తూ,లోకాలను తరింప చేస్తుంటాడు. ఈ మహాను భావుడు చేసిన ఏ పనైనా లోక కళ్యాణార్థమే నని  చెపుతుంటారు.

                   
              వాల్మీకి మహర్షి కి  శ్రీరాముని సత్యపరాక్రమాన్ని గురించి , దివ్యగుణమహిమను గూర్చి  వివరించి, రామాయణాన్ని వ్రాయమని నిర్ధేశించినదీ, వ్యాకులచిత్తుడై యున్న వ్యాసుని చెంతకు వచ్చి భాగవతము వ్రాయమని ప్రేరేపించినది కూడ  నారదుడే. ఈ సందర్భం లో భాగవతం లో నారదుడు తన పూర్వ జన్మ వృత్తాంతాన్ని వ్యాసుల వారికి విన్పిస్తూ, హరిభక్తిని గూర్చి ఇలా అంటాడు.
        
                 “ ఓ వ్యాసమునీంద్రా !  హరినామ సంకీర్తనం తో ప్రకాశించే కావ్యం బంగారు కమలాలతో, కలహంస సమూహాలతో శోభాయమానమైన మానస సరోవరంలాగ మనోహరంగా ఉంటుంది. హరినామ సంకీర్తనం లేని కావ్యం చిత్ర విచిత్రాలైన అర్థాలతో కూడినదై కూడ దుర్గంధ భూయిష్టమై, కాకులు మూగిన ఎంగిలాకుల బురద గుంట వలె అసహ్యంగా ఉంటుంది. అని.   
                 
                   మరి  నేటి సమాజం లో నారదు డంటే ఇరువురి మథ్య బేధాలను కల్గించేవాడనే అర్థం  రూఢి అయిపోయింది. వీడొక నారదుడండీ, వీడొక అగ్గిపుల్లండీ వంటి  పుల్లవిరుపు మాటలు మనలో మామూలై పోయాయి.  మరి పురాణాలను పరిశీలిస్తే-
                 
               ఇతను బ్రహ్మ దేవుని ఊరువునుండి  నుండి జన్మించి నట్లు గా భాగవతం చెపుతోంది. దక్షుని కుమార్తె ప్రియ కును, బ్రహ్మ దేవునకు జన్మించిన వాడుగా బ్రహ్మ వైవర్త పురాణం లో వ్రాయబడింది.  
        
                భాగవతం లో అకంపనుడను వాడు పుత్రుని కోల్పోయి దు:ఖిస్తుంటే, అతని చెంతకు వెళ్లి మృత్యు ప్రకారాన్ని వివరించి అతనికి దుఖోపశమనాన్ని కల్గిస్తాడు. సృంజయునకు షోడశ రాజుల చరిత్రను వివరించి  మరణించిన ఆతని కుమారుణ్ణి  మరల పునరుజ్జీవితుని చేసి, ఇస్తాడు. ప్రహ్లాదుని మాతృమూర్తియైన లీలావతిని, ఇంద్రుడు అపహరించుకు పోతుంటే, వానికి గర్భస్థశిశువు  గొప్పతనాన్ని వివరించి, ఇంద్రుని నుండి ఆమెను కాపాడుతాడు.
      
               జలంధరుడనే రాక్షసుని దేవతలు జయింపలేక నారదుని సహాయ మడిగారు. నారదుడు జలంధరాసురుని దగ్గరకు వెళ్లి అశ్వరత్నాలు,గజరత్నాలు, సౌధ రత్నాలు ఉన్నాయి. కాని జాయారత్నం  లేకపోవడం నీకు పెద్దలోటు  అని కవ్వించాడు. శ్మశానం లో ఉండే శివునికి పార్వతీ దేవి ఎందుకు ?. ఆమెను తెచ్చుకొమ్మని సలహా యిచ్చాడు. తద్వారా శివుని చేతిలో  జలంధరాసురుని మరణం  సంప్రాప్తమైంది.
        
                     కాలయవనుడు బలగర్వంతో విఱ్ఱవీగుతున్నాడు.   వాని మద మణచడానికి నారదుడు కాలయవనుని చెంతకు వెళ్లాడు. శ్రీకృష్ణుడు జరాసంధు నోడించి గర్వంతో  తిరుగు తున్నాడు.  అతన్ని అలాగే వదిలేశావేమిటని కాలయవనుని రెచ్చగొట్టాడు. మధుర పై దండెత్తిన కాలయవనుడు నందనందనుని చేతిలో కాలధర్మం చెందాడు.
           
                   భాగవతం లో తన పూర్వజన్మవృత్తాంతాన్ని నారదుడే వ్యాసమహర్షికి వివరిస్తాడు. పూర్వజన్మ లో వేదవాదుల ఇంటి దాసికి జన్మించాడు. చాతుర్మాస దీక్షలో ఒకేస్థలం లో నివసించే మునులకు పరిచర్యలు చేస్తుండేవాడు. చిన్ననాటి నుండి వారినే  నుసరించి ఉండటం చేత  కొంతబ్రహ్మజ్ఞానం అలవడింది. అతని తల్లి పాలుపితకడానికి వెళ్లి పాముకాటుచే  మరణించింది. దానితో సంసారబంథము తెగిపోయిన నారదుడు ఆనందం తో  ఉత్తరాభిముఖుడై వెళ్లి, ఘోరారణ్యములో ఈశ్వరుని గూర్చి ఘోర తపస్సు చేశాడు. ఈశ్వరుడు  ప్రత్యక్షమైనా  చూడ లేకపోయాడు. అప్పుడు నారాయణుడు నీవీ శరీరమును విడిచి తరువాత జన్మమున మా ఆజ్ఞ చే జన్మించి, మా రూపమును చూడగలవని వరమిచ్చాడు. కొంతకాలానికి నారదుడు కర్మ స్వరూపమైన ఆ దేహాన్ని విడిచి, మరల బ్రహ్మ ప్రాణము వలన మరీచి మొదలగు మునిముఖ్యులతో కలసి  జన్మించినట్లు చెప్పుకున్నాడు నారదుడు.
             
                        వరాహ పురాణం లో చూస్తే -- నారదుడు మహిషాసుర వధ కు కారణ భూతుడు. మహిషాసురుని వలన లోకం లో బాధలు అధికమైనాయి. వానిని  దేవతలు కూడ ఓడించలేక పోయారు. ఆ సమయం లో నారదుడు మలయపర్వతము పై నున్న నారాయణి వద్దకువెళ్లి మహిషునకు కండకావరమెక్కి నిన్ను వివాహమాడెదనని వదరుచున్నాడు. వానిని  సంహరించమని ప్రార్థించాడు. మహిషుని చెంతకు వచ్చి నారాయణిని వివాహమాడని నీయౌవ్వనమొక యౌవ్వనమా ?  ఎటులైనను ఆమెను వివాహమాడ వలసిందనిరెచ్చగొట్టాడు. దానితో రెచ్చిపోయిన మహిషుడు తనను వివాహం చేసుకోవలసిందిగా నారాయణి కి కబురు పంపాడు.  దానితో ఉగ్రరూపిణి యైన నారాయణి చేతిలో మహిషాసురుడు మర్ధనుడైనాడు.  
            
             నారదుడు ఒక పర్యాయము  శ్వేత ద్వీపాని కెళ్ళాడు. అక్కడ అనేకమంది మన్మథ సదృశులైన వారు కన్పించగా, వారిలో శ్రీమహావిష్ణువును గుర్తించలేక  నారదుడు శ్రీమన్నారాయణుని ప్రార్థించెను. ప్రత్యక్షమైన శ్రీ మహావిష్ణువును విష్ణుమాయను చూపవల సిందిగా ప్రార్థించాడు నారదుడు. చిరునవ్వు నవ్విన   శ్రీ మహావిష్ణువు నారదమహర్షిని దగ్గరలో నున్న కొలను లో స్నానం చేసి రమ్మన్నాడు  . కొలనులో మునిగిన నారదుడు పైకి లేచే సరికి  స్త్రీ గా మారిపోయాడు. చారుమతి అనే పేరుతో కాశీరాజుకు కుమారై గా జన్మించాడు. శిబిని వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు నగ్నజిత్తు,విప్రజిత్తు, విచిత్తు, చారువక్త్రుడు, చిత్తుడు అనే ఐదుగురు కుమారులు జన్మించారు. వారు మహావీరులై తండ్రితో కలసి యుద్ధాల్లో పాల్గొంటూ, తుదకు కాశీరాజు చేతిలోనే వీరందరు  వీర మరణం పొందారు. భర్తృ, పుత్ర వియోగం తో  చారుమతి దు:ఖాన్ని భరించలేక  ఆత్మాహుతికి సిద్దపడింది.చితిలోకి ప్రవేశించబోతుండగా నారదునకు పూర్వరూపం వచ్చేసింది. అప్పుడు జరిగిన దంతా విష్ణు మాయ యని తెలుసుకొని  విస్తుపోవడం నారదుని వంతయ్య్దింది.
            
                  వరాహ పురాణం లోని మరొక కథ ననుసరించి – ఒక జన్మలో  నారదుడు సారస్వతుడను బ్రాహ్మణుడు గా జన్మించి, సంసార భారము పుత్రుని కప్పగించి, వనానికి వెళ్లి, శ్రీ మహావిష్ణువును గూర్చి ఘోర తపస్సుచేశాడు. ప్రత్యక్షమైన విష్ణువును  సాయుజ్య మివ్వ మని కోరుకున్నాడు.   కాని విష్ణువు నా తరువాత వాడు బ్రహ్మ . కావున నీవు బ్రహ్మ కు జన్మించి నా సాయుజ్యాన్ని పొందుతావని”” వరమిచ్చాడు. నారం దదాతీతి నారద : “--  నారము అంటే నీరు  అని,  నీవు ఎల్లవేళలా ఇతరులకు జ్ఞానము అనే నీటిని అందిస్తుంటావు  కాబట్టి నీవు నారదుడనే పేరుతోటి ప్రసిద్ధుడవౌతావని కూడ విష్ణువు  నారదుని  ఆశీర్వదించాడు.
            
             లింగ,  పురాణాన్ననుసరించి – నారదుడు హిమాలయాలమీద  ఘోర తపస్సు చేయసాగాడు. అతని తపస్సు ని భంగం చేయడానికి ఇంద్రుడు దేవకన్యలను పంపించాడు. కాని శివారాధన చేయడం వలన నారదుని మనస్సు చలించలేదట. కాని మన్మథుని గెలవడం, (అంటే దేవకన్యలకు లొంగక పోవడం) తన గొప్పతనమే అనుకున్నాడట నారదుడు. తపస్సును ముగించుకొని శివుని దర్శనం చేసుకొని, బ్రహ్మ,విష్ణువుల సందర్శనా నికి వచ్చాడు.విష్ణువు  శంకరుని మహాత్మ్యాన్నిగురించి చెప్పినా కూడ తన ప్రభావము వలననే కాముని గెలిచానని చెప్పుకొనసాగాడు నారదుడు. అందుచే నారదుడు వెళ్లే మార్గంలో ఒక సుందర నగరాన్ని నిర్మించి, అందులో శ్రీమతి అనే ఒక సౌందర్యరాశి ని నిలిపాడు విష్ణువు. ఆమెను చూచి మోహించిన నారదుడు ఆమె యొక్క స్వయంవరానికి వెళ్లడానికి తిరిగి విష్ణువు దగ్గరకొచ్చి  విష్ణువు రూపాన్ని తనకివ్వమని అడిగాడు నారదుడు.                        

         శివపురాణాన్ని అనుసరించి -  పర్వతుడు నారదునకు మేనల్లుడు. వీరిరువురు దేశాటనం చేస్తూ అంబరీషుని నగరానికి వచ్చారు. అంబరీషుని కుమార్తె శ్రీమతి ని చూచి ఇద్దరూ మనసు పడ్డారు. స్వయంవరం లో ఆమె ఎవరిని ఇష్టపడుతుందో వారికే ఇస్తానన్నాడు అంబరీషుడు.  అంతకు ముందే వీరిద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు విష్ణుమూర్తి దగ్గర కెళ్లి, నారదుని ముఖాన్ని కోతిముఖం చేయమని పర్వతుడు, పర్వతుని ముఖాన్ని కోతి ముఖం చేయమని నారదుడు అడిగి వచ్చారు. విష్ణుమూర్తి తథాస్తు అన్నాడు. స్వయంవరం మొదలైంది. విష్ణువు కూడ ఆ స్వయంవరానికి వచ్చాడు.  దివ్య సుందర రూపుడైన  శ్రీ మహావిష్ణువు ను శ్రీమతి వరించింది. విష్ణువు ఆమెను తీసుకెళ్ళిపోయాడు.  అంబరీషునిపై కోపించిన నారద,పర్వతులు  అతన్నితమోమయుడవు కమ్మని  శపించారు. సుదర్శన చక్రం అంబరీషునికి అండ గా నిలిచింది. భయపడి స్వర్గ లోకానికి పారిపోయిన వారిరువురికి  విష్ణువు ఇంట శ్రీమతి కన్పించింది. తమను కోతి ముఖా లను చేసి, మేము వలచిన కన్యను  తెచ్చుకున్నావు. నీవు నరుడవై వియోగ దుఖాన్ని అనుభవిస్తావు. చివరకు వానరుల సహాయం చేతనే తిరిగి నీ భార్యను పొందగలుగుతావు. అని నారద పర్వతులు విష్ణువు ను శపించారు. శివుని  ప్రభావం మూలంగానే ఇదంతా జరిగిందని చెప్పి, విష్ణువు అంతర్థానమయ్యాడు. వీరి శాప ప్రభావమే రామావతారంలో భార్యావియోగాన్ని విష్ణువు  పొందవలసి వచ్చినట్లు చెపుతోంది శివపురాణం. 
      
                     భారతం లో ఇటువంటి కథే కొద్దితేడా తో కన్పిస్తోంది.సృంజయుని కుమార్తె సుకుమారి ఈ కథలో  నాయిక.

                  దేవీభాగవతాన్ని అనుసరించి --- కొలను లో మునిగి లేచిన నారదుడు సుందరాంగి గా మారిపోయాడు. తాళధ్వజుడను రాజు ఆమెను మోహించి, రాణి గా చేసు కున్నాడు. కుమారులు కలిగారు. శతృ రాజులతో జరిగిన యుద్ధం లో వారు మరణిస్తారు. బిడ్డలకోసం విలపిస్తున్న ఆమెను విష్ణువు వృద్ధ బ్రాహ్మణుని రూపంలో వచ్చి పుత్రాదులు నిత్యం కాదని బోధించి, తన వెంట తీసుకొనివెళ్లి, కొలనులో స్నానం చెయ్యమన్నాడు. పూర్వ రూపాన్ని పొందిన నారదుడు విష్ణుమాయ ను తెలుసుకున్నాడు.  

                  బ్రహ్మ వైవర్త పురాణంలో --దక్షుడు తన కుమార్తె ప్రియ ను బ్రహ్మ దేవుని కిచ్చి వివాహం చేశాడు. ఆమెయందు నారదుడు జన్మించాడు.సృష్టిని వృద్ధి చేయమని  నారదునితో చెప్పాడు బ్రహ్మ. కాని నారదుడు సంసార బంథాలను తిరస్కరించాడు. బ్రహ్మ కోపించి, నీవు కాముకుడవై,  ...... పుట్టుమని శపించి, బ్రహ్మ జ్ఞానంచేత విష్ణుభక్తుడ వగుదువని అను గ్రహించాడు.. నారదుడు కోపించి,నీకు పూజా కవచములు లేకుండుగాక యని  బ్రహ్మకు ప్రతి శాపమిచ్చాడు.

               మనకు  పింగళి సూరన కళాపూర్ణోదయం లో  కన్పించే నారద మాత్సర్య వృత్తాంతము  కొంచెం తేడాతో  అద్భుత రామాయణం లోనిది గా కన్పిస్తుంది.  వైకుంఠంలో తుంబురునికి లభించిన సత్కారానికి ఈర్ష్యాళువైన నారదుడు శ్రీ మహావిష్ణువును ఆశ్రయించాడు. శ్రీకృష్ణావతారంలో నీ కోరికను  తీరుస్తానన్నాడు మహావిష్ణువు.  ద్వాపర యుగం లో శ్రీకృష్ణుని ఆశ్రయించాడు  మళ్లీ నారదుడు.ముందుగా తన భార్యయైన జాంబవతి దగ్గర, తరువాత మిగిలిన భార్యల దగ్గర ఒక్కొక్కరి వద్ద ఒక సంవత్సరం చొప్పున నేర్చుకొమ్మన్నాడు శ్రీకృష్ణుడు.. కాని అప్పటికీ తుంబురుని మించు గానకౌశలము పొందనేరక నారదుడు చివరకు శ్రీకృష్ణుని వద్ద  కూడ నేర్చుకొని,  అప్పటికి సంగీత కుశలుడై ,  అసూయను వీడి, సుఖముగా నున్నట్లు గా చెప్పిన కథ యిది.

                                మరి కొన్ని కథలు  కన్పిస్తున్నాయి.  పురాణము అంటేనే ఎప్పటి కప్పుడు కొత్తగా ఉండేది అని కదా అర్థం. పురా అపి నవం ఇతి పురాణం అని  ఆర్యోక్తి. అందువలన  వెదకితే ఇంకొన్ని కూడ లభించవచ్చు. కాని పిండితార్థం మాత్రం  నారదుడు కలహ భోజనుడైనా  విశ్వ శ్శ్రేయస్సును కాంక్షించే విశాల హృదయుడు. త్రిలోక సంచారి యైనా  లోకత్రయ కళ్యాణ కాంక్షి . కాబట్టి  పూజార్హుడే కాని దూషింప దగినవాడు కాదు.




 ******** लोकास्समस्ता : सुखिनो भवन्तु ****** **********************************************

Tuesday, 28 May 2013

శ్రీ రామ కావ్యామృతం -5 రామానుజుల వారి పర్ణశాల


 శ్రీరామ కావ్యామృతం  -5
                             

                   రామానుజుల  వారి  పర్ణశాల
                   

             శ్రీరామచంద్రుని   అనుమతి తో  రామానుజుడైన లక్ష్మణుడు పరవానస్మి కాకుత్థ్స  అంటూ పర్ణశాల ను నిర్మించాడు.    ఎక్కడెక్కడ శ్రీరామ నామ గానం  వినబడుతుందో అక్కడక్కడ  ఆంజనేయుడు భాష్పాకులిత నేత్రాలతో నత మస్తకాంజలుడై   నర్తిసాడని పెద్దలు  చెపుతుంటే  ఆ రోజుల్లో ఆశ్చర్యం వేసేది నాకు.
                               

                 కాని రామాయణం మీద పరిశోథన మొదలుపెట్టిన తరువాత అవన్నీ అనుభవం లోకి వచ్చేసరికి  మళ్లీ ఆశ్చర్యం వేసింది. శ్రీరామ చంద్రుని   నామ స్మరణ మాత్రాన పులకించిన శరీరం తో రామకథ ను  అనర్గళంగా ప్రస్తావించేవారు,  సీతమ్మతల్లి పడ్డ కష్టాలను తలచుకొని,తన ఒక్కగానొక్క బిడ్డకు కలిగిన  కష్టా ల్లాగ, కన్నీళ్లు పెట్టుకుంటూ,  వివరించే వాళ్లను  ఇప్పుడు  తలుచుకుంటే ఎందుకో అనిర్వచనీయ ఆనందం కలుగుతుంది. అటువంటి వారిలో శ్రీమాన్ గుదిమెళ్ల రామానుజాచార్యులు ఒకరు. వీరు శ్రీరామ నామామృత జీవి. వీరి కావ్యాలన్నీ రామకథాత్మకాలే. అటువంటి  కావ్యాలలో పర్ణశాల ఒకటి.
                              
             

   
                      ఖరదూషణ వథ పూర్తయ్యింది. విరూపియై  శూర్పణఖ లంకారాజ్యం చేరింది. పంచవటి లో శూర్పణఖా ప్రవేశం లేకపోతే రామాయణ గమనమే లేదు రామకథా విన్యాసం లో  శూర్పణఖా వృత్తం ప్రథానాథారం..
                     
                       కన్నులు పుండరీకముల కన్న  విశాలము లొక్కచూపుతో
                      నన్ను గదల్చినాడు,చిఱు నవ్వులు గుట్టలు పోసినాడు నే
                      విన్న  కొలంది వాని నుడి వీనుల విందుగ జేసినాడు, నా
                      కున్నది మన్న దెల్ల దన కోసముగా నెరవేసినానురా .

                          కంబరామాయణం  లో శూర్పణఖ మిక్కిలి అందగత్తె. సుముఖీ దుర్మఖీ ..... అన్న శ్లోకం లో వాల్మీకి శూర్పణఖ వికృత రూప గా రాముని చేరగా – కంబరామాయణం లో ఈమె పేరు కామవల్లి.  పేరుకు తగ్గట్టుగానే ఆమె నడక కూడ అందం గా వర్ణిస్తాడు కవి.
                
              
                 “ పల్లవమ్ము ఎర్రప్రత్తి సిగ్గుగొనగ
                  హంస యనగ,కేకియనగ,గరళ
                  మనగ, తీగయనగ, అడుగు దమ్ములు వైచి
                  ఆ పలుకల కొలికి యరుగుదెంచె         (రా. సర్వస్వము – 164.)

           కన్నడ రామాయణమైన రామచంద్రచరిత్ర పురాణం లో శూర్పణఖ పేరు చంద్రనఖ గా కన్పిస్తుంది.
               
                 తెల్లని  పూవులన్నియును దియ్యని శ్యామలమైన శోభతో
                 నల్లగ మారిపోయినవి నా కనుమానము గల్గె రావణా! 
                 చల్లని కల్వపూల సిరి జాలెడు వాడెవడో యొకండు, మా
                పల్లెకు వచ్చినాడనుచు బాటలు పట్టితి జాడతీయగన్.

                            అంటుంది రావణునితో రామానుజుల వారి శూర్పణఖ. రేపల్లె లో నల్లవానికై వెదకిన గోపికయై జాడలు తీసింది. కొండలు కోనలు  వెతుక్కుంటూ సాయంత్రానికి ఏటి దరికి  చేరింది .అక్కడ మహాత్ముని పాదముద్రలను  గమనించింది. కులిశాబ్జరేఖల ఎవరో మహానుభావుడని ఎఱుక తెచ్చుకుంది. దేముడే  యై ఉంటాడని  ఊహించింది గుదిమెళ్ళ వారి శూర్పణఖ. రామ పాదాలను సైకతాలలో దర్శించి  వెదకుతూ శూర్పణఖ బయలుదేరడం అవాల్మీకం.
                            
                      ఏకదా గౌతమీ తీరే పంచవట్యా సమీపత:
                     పద్మ వజ్రాజ్కుశాజ్కాని పదాని జగతీపతే:
                     దృష్ట్వా కామపరీతాత్మా పాదా  సౌన్దర్య మోహితా ( అ. రా .5 -1)
    
             అని అథ్యాత్మ రామాయణం. కామపరీతాత్మయైన  శూర్పణఖ సౌన్దర్య మోహిత యై పంచవటీ సమీపం లో  గోదావరీ తీరమంతా వెతికింది.
             
                    తత్త్ర్రవం  విచరంతీ సా కంజాంకుశ ముఖాంకితాన్
                    రామపాదాంస్తు పశ్యంతీ సైకతే హృద్యచింతయత్
                    అత్ర కశ్చిన్మహాంస్తి ష్టే త్పూరుషం స్తం వృణోమ్యహమ్  (ఆశ్చర్య. రా.అ.- 8.20)
              
                  అంటుంది ఆశ్చర్య రామాయణం.
           
                            హలికులిశాబ్జ రేఖలు తదంఘ్రుల ఛాయల యందు జక్కగా
                            గలకల లాడుచున్న కన్నులకద్దితి మంచి సౌరభ
                            మ్మొలుకుచు నుండెరా ............................
        
    “రామ సౌరభం చేత ఆకృష్ట మానసయైంది శూర్పణఖ. కావ్యం పేరు పర్ణశాల గాని కవి మాత్రం  శూర్పణఖ పాత్ర నాథారం చేసుకొని  రామ నామ ఔన్నత్యాన్ని, పరాత్పర తత్వ్తాన్ని  దర్శించారు కవి.  రాముని  చేత రాక్షస సంహారం చేయించి , రాముని కీర్తిరమాభిరాముని చేయడానికే  జనని కైక –  రామని అరణ్య వాసం కోరిందని కవి భావన. వీరి శూర్పణఖ ఆలోచన కూడ ఇదే.
                         
                   ఈతడతండటన్న కథ నిప్పుడెరింగితి వీడెరా ! పరం
                   జ్యోతి పరాత్పరుం డిచట చూపెను దానవి కా స్వరూపమున్
                   లోతుకు పోక వాని వలలో పడిపోతి, నన్ను గీరి నా
                   చేత సురారి జాతి హతి సేయగ వేసిన యెత్తు రావణా!

              రాక్షస సంహారానికి నాంది గా సూర్పణఖ నాసికాఖండన జరిగింది దండక లో.—రామచంద్రుడు తాను చేయబోయే దనుజ సంహరణానికి ఇక్కడ బీజం వేసుకున్నాడు.         నన్ను గీరి నాచేత సురారి జాతి హతి చేయగ అన్న శూర్పణఖ మాటల్లోని అంతరార్థ మిదే.
                         
                       శూర్పణఖ మాటలు విన్న రావణుడు ఘల్లున నవ్వాడట. ఎంతకాలానికి కోరికలు ఫలించాయి. సనత్కుమారుని పల్కులు నేటికి నిజమయ్యా యన్నాడు. శేషిదంపతుల సేవ ఇంతకాలానికి  లభించిందని సంబరపడ్డాడు వీరి రావణుడు. ఆ ఆనందం అతని మాటల్లో లా పెల్లుబుకుతోందో చూడండి.
               
                    రాముడు వచ్చెనా యటకు రాముని తోడ సుమిత్ర పట్టియున్
                   భూమిజ వచ్చెనా చెవికి బోసితివే యమృతమ్ము చెల్లెలా!
                   నామది వాని కోసమయి నాటికి నేటికి జూచుచుండగా
                   స్వామికి నేటిరోజునకు జ్ఞప్తికి వచ్చితి నేను గావలెన్.
          
                  ఈ మాటలు వాల్మీకి రావణునివి కావు. రామవిభుడు నాకొఱకై వచ్చాడా అన్న ఆర్తి పౌలస్త్యహృదయం లోని రావణునిది. వీరికి మార్గదర్శి అథ్యాత్మ రామాయణము.
                 
                       వథ్యోయది స్యాం పరమాత్మనా2హం
                         వైకుంఠరాజ్యం పరిపాలయే2హం
                         నో చేదిదం రాక్షస రాజ్యమేవ భోక్ష్యే
                         చిరం రామ మతో వ్రజామి        ( అ.రా.అరణ్య-6-40)

                     ఎంతోకాలంగా రాముని కొరకై వెతుకుతున్నాను. భగవంతుడైతే మరణించి వైకుంఠాన్ని పాలిస్తాను – కాకుంటే  రాక్షస రాజ్యమే ఉందన్న  రావణుడు వాల్మీకేతర రామాయణాల్లోనే కన్పిస్తాడు.
            
                         శూర్పణఖ మాటలు విన్న ఈ కావ్యం లోని రావణుడు పులకితస్వాంతుడౌతాడు.       “నా రాముని నవ్వును దర్శించగల నీ జన్మ థన్యమైందని చెల్లెలిని మెచ్చుకొని, కులాన్ని రక్షించడానికి విభీషణుడొక్కడు చాలు.! రాముని ప్రేమించి నీవు తరించావు.  అమ్మను అపహరించి, నాజీవితాన్ని బలిచేసి  నేను తరించాలి. రాముని చేతిలో చావడానికి ఎన్నో సాములు చేశాను. చివరికి అమ్మనే అపహరించవలసి వస్తోంది.  అంటూ వాపోతాడు రావణుడు.  
                         
                   ఎన్నడు వచ్చునాతడను చెన్నటి కెన్నటి కెన్నడింక నిం
                   కెన్నటి కెన్నడింక నికనెన్నటి కెన్నటి కెన్నడింక నిం
                   కెన్నటి కంచు చూచి విసుగెత్తి కడాపట వాని రాకకై
                   తన్నగ సాగితిన్ సురల దాపసులన్ సతుల్ ద్విజాదులన్.
   
                        తనకై బయలుదేరిన ప్రభువు మథ్యలో ఆగిపోయాడేమో ననే సందేహం  రావణునిలో బయలుదేరింది. అందుకే విశ్వామిత్రుని  యజ్ఞాన్ని నాశనం చేయించి శ్వామిని కదలించాను. దానితో  ధరాకుమారిని పెండ్లి చేసుకున్నాడు. అయినా దర్శనం కాలేదు. అందుకే కోపమొచ్చింది.
              .......................................................క్రోధమున్
           బూని నిశాచరాంశమున బుట్టిన పుండు భరించలేక శ్రీ
          జానకినే హరించుటకు సాహసమూనితి, సీత నెన్నియో
         నేననరాని మాటలను నేరము సేయగ నుంటి చెల్లెలా !
            
          అంటూ బాథపడతాడు రావణుడు. శ్రీరామచంద్రుని పరమాత్మ తత్త్వాన్ని  పదినోళ్ల పొగిడి, లక్ష్మణుని స్పర్శను పొందిన శూర్ఫణఖ అదృష్టాన్ని మరొక్కసారి కొనియాడి, పర్ణ శాలకు నమస్కరించి వెళ్లిపోతాడు.
                  
                                   విచిత్రమేమిటంటే --    ఈ కావ్యం పేరుకు పర్ణశాల కాని  దీనిలో సీతారామలక్ష్మణులు ముగ్గురు కన్పించరు. శ్రీరామ  కథాగానం చేత తరించాలన్న జీవితాశయాన్ని  సాథించిన పరమ భక్తులు శ్రీ ఆచార్యుల వారు.  అందుకే వీరి కావ్యం లోని రావణుడు శ్రీరాముని పరమాత్మ తత్వ్తాన్ని విశదీకరిస్తాడు. శూర్పణఖ శ్రీ రామచంద్రుని రూపవర్ణనలో  లీనమై,పరమ భక్తురాలిగా  రామనామ గానం చేస్తుంది.
               
                              ఇందులోని చాలా పద్యాలు శ్రీరామచంద్రుని దివ్యమంగళ రూపాన్ని  వర్ణించినవే  అవ్వడం శ్రీ రామభక్తులకు ఆనందాన్ని కల్గించే విషయం.



*****************************************************************************