Monday, 28 December 2015

శతకసౌరభాలు-7 శేషప్ప కవి -నరసింహశతకము .6

  
 శతకసౌరభాలు-7
        
        శేషప్ప కవి  -నరసింహశతకము .6



అర్థి వాండ్రకు నీక హాని చేయుట కంటే-దెంపు తో వసనాభి దినుట మేలు
ఆడుబిడ్డల సొమ్ము నపహరించుట కంటె-బండకట్టుక నూత బడుట మేలు
పరుల కాంతల బట్టి బల్మి గూడుట కంటె- బడబాగ్ని కీలల బడుట మేలు
బ్రతుకజాలక దొంగ పనులు చేయుట కంటె- కొంగుతో ముష్టెత్తు కొనుట మేలు
జలజదళనేత్ర నీభక్తజనులతోడ- జగడమాడుట కంటెను చావుమేలు
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!

        
                ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ!.యాచకులకు దానం చేయకుండా ఉండటమే కాక దానం చేయనివ్వకుండా అడ్డంపడటం కూడ పాపమే. ఇటువంటి పాపాలు చేసినదాని కంటే ఇంత విషం తిని చావడం మేలు. నాభి అనేది విషతుల్యమైన ఒక మూలిక. దీనిని ఆయుర్వేద మందులలో ఉపయోగిస్తూ ఉంటారు.ఆడపడుచుల ఆస్తులను అపహరించిన దానికన్నా  మెడ కు ఒక బండరాయి కట్టుకొని నూతిలో దూకి చావడం మంచిది.   నూతి లోకి   చావాలని దూకినప్పుడు దూకగానే పైకి తేలితే చూసినవాళ్లెవరైనా  దూకి కాపాడే ప్రమాదం ఉంది. అదే మెడకు బండ కట్టుకొని దూకితే పైకి తేలే అవకాశం ఉండదు కాబట్టి  ఖచ్చితం గా మరణించవచ్చని ప్రజల్లో  ఒక ఆలోచన ఉంది. పర స్త్రీలను బలవంతంగా  పట్టుకొచ్చి అనుభవించిన దాని  కంటే  నిప్పుల గుండం లో దూకి చావడం మంచిది. బ్రతడానికి దొంగపనులు చేసిన దాని కంటే ఏ గుడి మెట్లమీదో కొంగు పఱుచుకొని అడుక్కోవడం, ముష్టెత్తు కోవడం మంచిది. నీ భక్తులైన  హరిదాసులతో తగవులాడుట కంటే చావడం నయం.

పసరంబు పంజైన బసులఁగాపరి తప్పు-ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు
భార్య గయ్యాళైనఁ బ్రాణనాధుని తప్పు-తనయుండు దుష్టైన తండ్రి తప్పు
సైన్యంబు చెదరిన సైన్యనాథుని తప్పు-కూతురు చెడుగైన మాత తప్పు
అశ్వంబు చెడుగైన నారోహకుని తప్పు హస్తి దుష్టైన హస్తీపకుని తప్పు
ఇట్టి తప్పు లెఱుంగక యిచ్చవచ్చి-నటుల మెలగుదు రిప్పుడీ యవని జనులు
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.

                     శ్రీ ధర్మపురి లక్ష్మీనరసింహా ! ఒక పశువు  పనికిరానిదై క్రూరం గా ప్రవర్తిస్తోందంటే అది పశువుల కాపరి తప్పు.భార్య గయ్యాళిగా మారిందంటే అది భర్త చేతకానితనం.కొడుకు చెడునడత గలవాడైతే అది తండ్రి తప్పు. యుద్ద రంగం నుండి సైన్యం  పారిపోతోందంటే అది  సైన్యాధికారి అసమర్ధత. కూతురు చెడిపోతోందంటే అది తల్లి తప్పు.గుఱ్ఱము చెడ్డదయితే రౌతు తప్పు. ఏనుగు  మొండికేస్తోందంటే తప్పు మావటి వానిదే కదా. ఇటువంటి  తప్పులు తెలుసుకోలేక లోకం లో ప్రజలు  ఏవేవో మాట్లాడుతూ ఉంటారు.


కోతికి జలతారు కుళ్ళాయి యేటికి-విరజాజి పూదండ విధవ కేల
ముక్కిడితొత్తుకు ముత్తెంపునత్తేల-అద్దమేటికి  జాత్యంధునకును
మాచకమ్మకు నేల మౌక్తికహారముల్-క్రూర చిత్తునకు సద్గోష్ఠులేల
ఱంకుబోతుకు నేల బింకంపు నిష్టలు- వావియేటికి దుష్టవర్తనునకు
మాట నిలకడ సుంకరి మోటుకేల- చెవిటి వానికి సత్కధా శ్రవణమేల
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.
           
                శ్రీ నరసింహా! కోతికి జరీ అంచు తలపాగా ఎందుకు. భర్తపోయిన స్త్రీకి విరజాజి పూల మాలలు నిష్ప్రయోజనం కదా ! చప్పిడి ముక్కు నకు ముత్యాల ముక్కెర  ప్రయోజనం లేదు కదా ! పుట్టుగ్రుడ్డి కి అద్దము, మాచకమ్మ కు ముత్యాలహారాలు, దుర్మార్గునకు  సద్గోష్టులు , వ్యభిచారి కి నియమాలు , చెడ్డవానికి వావివరసలు ,సుంకము వసూలు చేసేవాడికి మాట నిలకడ , చెవిటివానికి సత్కధా కాలక్షేపాలు ప్రయోజనారహితాలు కదా స్వామీ!

తనువులోఁ బ్రాణముల్ తరలిపోయెడి వేళ- నీ స్వరూపమును ధ్యానించునతడు
నిముషమాత్రము లోన నిను జేరును గాని-యముని చేతికి జిక్కి శ్రమల బడడు
పరమ సంతోషాన భజనఁ జేసెడి వారి - పుణ్యమేమన వచ్చు భోగి శయన
మోక్షము నీ దాసముఖ్యుల కగుఁ గాని- నరకమెక్కడిదయ్య నళిన నేత్ర
కమల నాభుని మహిమలు గానలేని- తుచ్ఛులకు ముక్తి దొరకుట దుర్లభంబు
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.
                           
                  ధర్మపురి లక్ష్మీనరసింహా! ఈ బొంది లో నుండి ప్రాణాలు పోయే సమయం లో ఎవడైతే నీ రూపాన్ని ధ్యానిస్తాడో వాడు క్షణకాలంలో నీ పాదసన్నిధి ని చేరుతాడు గాని యముని చేతికి చిక్కి బాధలను పడడు . ఆనందం తో నిన్ను భజన చేసే వారి అదృష్టమే అదృష్టము. నీ భక్త వరులకు మోక్షమే గాని నరకముండదు కదా. నీ మహిమలు తెలుసుకోలేని  మూర్ఖులకు  ముక్తి లభించుట అసాధ్యము కదా!

ఉర్వి లో నాయుష్యమున్న పర్యంతంబు-మాయ సంసారంబు మఱగి నరుడు
సకల పాపములైతె సంగ్రహించును గాని నిన్ను జేరెడి యుక్తి నేర్వలేడు
తుదకు కాలుని వద్ద దూత లిద్దరు వచ్చి -గుంజుక చని వారు కొట్టుచుండ
హింస కోర్వగ లేక యేడ్చి గంతులు వైచి- దిక్కు లేదని నాల్గు దిశలుఁ జూడ
తన్ను విడిపింప వచ్చెడి ధన్యుడేడి- ముందె నీ దాసుడై యున్న ముక్తి గలుగు
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.
                       
       శ్రీ నారసింహా! ఈ జీవుడు భూమిపై ఆయుర్దాయం ఉన్నంతకాలం సంసారమనే మాయ లో పడి సమస్త మైన పాపాల్ని మూటకట్టుకుంటూ నిన్ను చేరే మార్గాన్ని మాత్రంనేర్చుకోడు. ప్రాణావసాన సమయంలో యమ భటులిద్దరు వచ్చి ప్రాణాలను గుంజుకుపోయి,  రకరకాలుగా శిక్షిస్తుంటే  ఆ హింస భరించలేక,  కాపాడే దిక్కు లేక నాలుగు దిక్కులు చూస్తూ గంతులు వేసి ఏడుస్తూ ఉంటే  కాపాడే పుణ్యాత్ముడెవడూ ఉండడు. అలా కాకుండా ముందుగానే నీ భక్తుడై  ప్రార్ధిస్తే మోక్షం లభిస్తుంది కదా !

అవనిలో గల యాత్ర లన్ని చేయగవచ్చు- ముఖ్యమౌ నదులందు మునుగవచ్చు
ముక్కుపట్టుక సంధ్యమొనసి వార్చగ వచ్చు-దిన్నగా జపమాలఁ ద్రిప్ప వచ్చు
వేదాల కర్ధంబు విఱిచి చెప్పగవచ్చు-శ్రేష్టక్రతువు లెల్ల జేయవచ్చు
ధనము లక్షలు కోట్లు దానమీయగ వచ్చు-నైష్టికాచారముల్ నడపవచ్చు
జిత్త మన్యస్ధలంబునఁ జేరకుండ నీ పదాంభోజముల  యందు నిలుపగలమె
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.
             
             ధర్మపురి వాసా ! భూలోకం లోని యాత్రలన్నీ చేయవచ్చు.పుణ్యనదులన్నిటా స్నానం చేయవచ్చు.ముక్కుపట్టుకొని మూలకూర్చొని సంధ్యావందనం చేసుకోవచ్చు.జపమాలను తిప్పుతూ జపము నూ చేసుకోవచ్చు.వేదాలకర్ధాన్ని వివరించవచ్చు గొప్పగా యజ్ఞయాగాదులను నిర్వహించనూ వచ్చు.లక్షలు , కోట్లు గా డబ్బును దానం చేయవచ్చు. నిష్ట తో ఆచారాలను  సాగింపనూ వచ్చు. కాని మనస్సు ను ఇతర స్ధలాలకు పోకుండా నీ పాద పద్మముల యందు లగ్నం చేయడం మాత్రం అసాధ్యం గా కన్పిస్తోంది స్వామీ!

           దేహమున్నవరకు మోహసాగరమందు మునుగు చుందురు శుద్ధ మూఢజనులు
సలలితైశ్వర్యముల్ శాశ్వతంబనుకొని-షడ్బ్రమలను మాన జాలరెవరు
సర్వకాలము మాయ సంసారబద్ధులై-గురుని కారుణ్యంబుఁ గోరుకొనరు
జ్ఞాన భక్తి విరక్తులైన  పెద్దలఁ జూచి- నిందఁజేయక తాము నిలవలేరు
మత్తులైనట్టి దుర్జాతి మనుజులెల్ల నిన్ను గనలేరు మొదటికే నీరజాక్ష
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.
              

                        శ్రీ ధర్మపురి లక్ష్మీనరసింహా ! ఈ శరీరమున్నంతవరకు మోహ మనే సముద్రం లో పడి ఈ మూర్ఖులైన జనులు మునకలేస్తూ, సిరిసంపదలే స్ధిరమనుకొని , కామక్రోధలోభ మోహ మద మాత్సర్యాల మాయలో పడి సంసారబద్ధులై , జ్ఞానము నకై గురువులను ఆశ్రయించరు. అంతేకాకుండా జ్ఞానభక్తి వైరాగ్య కోవిదులైన మహాత్ములను నిందించుచూ ఆ పాపాన్ని కూడ తలకెత్తుకుంటున్నారు.  ఇటువంటి మదోన్మత్తులైన దుర్మార్గులు ఎప్పటికీ కూడ నిన్ను దర్శంచలేరు గా ప్రభూ !

              ధరణి లోపల నేను తల్లి గర్భము నందు- బుట్టి నప్పటి నుండి పుణ్యమెఱుగ
ఏకాదశీ వ్రతం బెన్నడుండగ లేదు-తీర్థయాత్రలకైనఁ దిరుగలేదు
పారమార్ధికమైన పనులు సేయగలేదు భిక్షమొక్కనికైనఁ  బెట్టలేదు
జ్ఞానవంతులకైనఁ బూని మ్రొక్కగ లేదు- ఇతర దానములైన నీయలేదు
నళినదళనేత్ర నిన్ను నే నమ్మినాను-జేరి రక్షింపవే నన్ను శీఘ్రముగను
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.
               
                    స్వామీ నరసింహప్రభూ ! తల్లి గర్భము నుండి బయటకు వచ్చిన నాటి నుండి పుణ్యమంటే ఏమిటో తెలియకుండా పెరిగాను. ఏనాడు ఏకాదశీ ఉపవాసం ఉండలేదు. తీర్ధయాత్రలు చేయలేదు.పారమార్ధికమైన ఎటువంటి పుణ్యకార్యాలు చేయలేదు. ఒక్కడికైనా పిడికెడు ముష్టి  వేయలేదు. జ్ఞానవంతులకైనా చేతులెత్తి నమస్కరించలేదు. ఎటువంటి దానములూ  ఇవ్వలేదు. అయినా పద్మపత్రాక్షా. నిన్నే నేను నమ్ముకొన్నాను. త్వరగా వచ్చి నన్ను రక్షించు తండ్రీ !
                                           ----------    చివరిభాగం త్వరలో.




*********************************************************************************

Thursday, 17 December 2015

శతకసౌరభాలు-7 శేషప్పకవి- నరసింహశతకము -5



        శతకసౌరభాలు-7
        
               శేషప్పకవి- నరసింహశతకము -5


ధర్మపురి  శ్రీ లక్ష్మీనరసింహస్వామి        



ఫణుల పుట్టల మీదఁ బవ్వళించిన యట్లు-పులుల గుంపుల జేర బోయినట్లు
మకరి వర్గంబున్న మడుగు జొచ్చిన యట్లు-గంగ దాపున నిండ్లు గట్టినట్లు
చెదల భూమిని జాప చేర బరచియట్లు- తోలు తిత్తిని బాలు పోసినట్లు
వెఱ్ఱి వానికి బహువిత్త మిచ్చిన యట్లు-కమ్మ గుడిసె మందుఁ గాల్చినట్లు
స్వామీ నీ భక్తవరులు దుర్జనుల తోడ-జెలిమిఁ జేసిన యటులైన జేటువచ్చు
భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస!- దుష్టసంహార !నరసింహ! దురితదూర!. (80)
                      


                         ధర్మపురి లక్ష్మీనరసింహా! పాముల పుట్టల మీద పడుకున్నట్లు, పులుల గుంపులలో చేరినట్లు ,మొసళ్ల మడుగులో స్నానానికి దిగినట్లు , నది అంచున ఇళ్లు కట్టుకున్నట్లు ,చెదలున్న  చోట చాప వేసుకున్నట్లు, తోలు తిత్తి లో పాలు పోసినట్లు, వెఱ్ఱివానికి ఎక్కువగా ధనమిచ్చినట్లు , తాటి కమ్మలతో వేసిన గుడిసె లో మందు గుండు సామాను కాల్చినట్లు నీ భక్తులు చెడ్డవారితో   చేరి చెడిపోతున్నారు .వారిని కాపాడు స్వామీ!

                       అమరేంద్ర వినుత నిన్ననుసరించిన వారు-ముక్తి బొందిర వేగ ముదము తోడ
నీ పాదపద్మముల్ నెఱ నమ్మియున్నాను-నాకు మోక్షంబిమ్ము నళిన నేత్ర
కాచి రక్షించు నన్గడతేర్చు వేగమే- నీ సేవకుని జేయుశ్చయముగఁ
గాపాడినను నీకు గేంకర్యపరుఁడనే- చెలగి నీ పనులను జేయువాడ
ననుచుఁ బలుమారు వేఁడెద నబ్జనాభ- నాకు  బ్రత్యక్షమగు నిన్నె నమ్మినాను
భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస!- దుష్టసంహార !నరసింహ! దురితదూర!. (81)
                   
                    ఇంద్రుని చే పొగడ బడెడి శ్రీ లక్ష్మీ నరసింహా! నిన్ను  సేవించినవారు ఆనందంతో మోక్షాన్ని పొందారు. ఓ పద్మముల వంటి నేత్రములు కలవాడా. నేను కూడ నీ పాదపద్మములను నమ్మి సేవించుచున్నానుకదా. నాకు కూడ త్వరగా మోక్షమిమ్ము స్వామీ.నన్ను రక్షించి, నీ సేవకుని గా చేసుకొని ,త్వరగా కడతేర్చు స్వామీ! నన్ను కాపాడినను నేను నిన్ను మర్చిపోను . నీ బంటు గా నీ  సేవలను చేసు కుంటూనే ఉంటాను. ఈ విధంగా నేను  ఎన్నో సార్లు నిన్ను వేడుకుంటూనే ఉంటున్నాను పద్మనాభ. నిన్నే నమ్మిన  నాకు నీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించు ప్రభూ!

వనరుహనాభ నీ వంకఁ జేరితి నేను- గట్టిగా ననుఁ గావు కావు మనుచు
వచ్చినందుకు వేగము వరము లీయక కాని-లేవబోయిన నిన్ను లేవనియ్య
గూర్చుండ బెట్టి నీ కొంగు గట్టిగఁ బట్టి-పుచ్చుకొందును జూడు భోగిశయన
యీ వేళ  నాకడ్డ మెవరు వచ్చినఁ గాని-వారికైనను లొంగి వణకబోను
కోపగాడను నీవు  నా గుణము దెలిసి-యిప్పుడే నన్ను రక్షించి యేలు కొమ్ము
భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస!- దుష్టసంహార !నరసింహ! దురితదూర!. (84)
                                       

             శ్రీ పద్మనాభా! ధర్మపురి లక్ష్మీనృసింహా. నన్ను కాపాడమని , నను కాచే దైవం నీవేనని నీ చెంత చేరాను.నేను నీ దరి చేరినందుకు వేగంగా నాకు వరము లీయకుండా నీవు లేచి వెళ్లి పోదామనుకున్నా నిన్ను లేవనీయను. నిన్ను బలవంతంగా కూర్చోబెట్టి నీ కొంగు గట్టిగా నీవు కదలకుండా పట్టుకుంటాను.  ఈ రోజు ఎవరు అడ్డమొచ్చినా నేను అదరను. బెదరను. అసలే నేను కోపిష్టిని. కాబట్టి నా గుణము తెలుసుకొని  నన్ను ఇప్పుడే రక్షించి ,ఏలుకోవలసింది స్వామీ!

                          నేనెంత వేడిన నీకేల దయరాదు -పలుమాఱు పిలచిన బలుకవేమి
పలికిన నీకున్న పదవేమి పోవును-మోమైన బొడ చూపవేమి నాకు
శరణు జొచ్చిన వాని సవరించవలె గాక-పరిహరించుట నీకు బిరుదు గాదు
నీ దాసులను నీవు నిర్వహింపక యున్న-బరులెవ్వ రగుదురు పంకజాక్ష
దాత దైవంబు తల్లియు దండ్రి వీవె-నమ్మి యున్నాను నీ పాద నలినములను
భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస!- దుష్టసంహార !నరసింహ! దురితదూర!. (85)
    
                                   స్వామీ ధర్మపురి నరసింహ !ప్రభూ! నేను ఎంతగా ప్రార్ధించినా నామీద నీకెందుకు దయ కలగడంలేదు. ఎన్నిసార్లు పిలిచినా పలుకవేమి తండ్రీ! పలికితే నీ గొప్పతనానికి భంగం ఏర్పడుతుందని భయమా! నీ ముఖారవిందాన్ని  నాకు చూపించకుండా పెడమరులుగా తిప్పుకుంటావేమిటి స్వామీ! నీకు శరణన్న వాడిని రక్షించాలి గాని నిర్లక్ష్యం చేయడం నీకు  గౌరవం కాదు. నీ సేవకులను నీవు కాపాడకపోతే ఇతరులెవ్వరు కాపాడతారు పంకజాక్షా! నాకు తల్లి,తండ్రి, దాత, దైవము  అన్నీ నీవే నని నీ పాదపద్మములను సేవించుచున్నాను స్వామీ ! నన్ను రక్షించు ప్రభూ!.
                

                     నా తండ్రి ! నా దాత! నా యిష్ట దైవమా!-నన్ను మన్నన సేయు నారసింహ!
దయయుంచు నామీద దప్పులన్ని క్షమించి- నిగమ గోచర నాకు నీవె దిక్కు,
 నే దురాత్ముడనంచు నీ మనంబున గోప-గింపబోకుము స్వామి కేవలముగ,
ముక్తిదాయక నీకు మ్రొక్కినందుకు నన్ను-గరుణించి రక్షించు కమలనయన
దండి దొర వంచు నీ వెంట దగిలినాను-నేడు ప్రత్యక్షమై నన్ను నిర్వహింపు
భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస!- దుష్టసంహార !నరసింహ! దురితదూర!. (86)

                         
                    శ్రీ ధర్మపురి నరసింహా! నా దాత, నా తండ్రి నా యిష్టదైవము సర్వము నీవే ప్రభూ ! నన్ను మన్నించి కాపాడు నరసింహ దేవా!ఓ నిగమగోచరా నా తప్పులు మన్నించి నన్నేలు కోవయ్యా   నారసింహా !నేను దుర్మార్గుడనని నీ మనస్సు లో నాపై కోపముంచకు ప్రభూ.కేవలము నీకు మ్రొక్కినందుక మాత్రమే నాకు మోక్షమియ్య వయ్యా ప్రభూ  నీవు గొప్ప దైవానివని నమ్మి నిన్ను ఆశ్రయించి ,అర్ధిస్తున్నాను ప్రభూ !నాకు ప్రత్యక్షమై నన్ను కరుణించు ప్రభో నారసింహా!

                      
                             కూటి కోసరము నేఁ గొఱగాని జనులచే-బలు గద్దరింపులు పడగ వలసె
దార సుత భ్రమఁ దగిలి యుండగ గదా- దేశదేశము లెల్లఁదిరుగ వలసె
బెను దరిద్రత పైనిఁ బెనగి యుండగ గదా-చేరి నీచుల సేవఁ జేయవలసె
నభిమానములు మది నంటి యుండగ గదా-పరుల జూచిన భీతిఁ బడగ వలసె
నిటుల సంసారవారిధి నీదలేక- వేయి విధముల నిన్ను నే వేడుకొంటి
భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస!- దుష్టసంహార !నరసింహ! దురితదూర!. (87)
                            

                  ప్రభూ!నరసింహదేవా ! పిడికెడు మెతుకుల కోసమే కదా పనికిమాలిన  వాళ్ల గద్దింపులు భరించవలసి వస్తోంది.  భార్య పుత్రులు అనే భ్రమలో చిక్కుకొనే గదా వారి పోషణ కై దేశదేశాలు తిరగవలసి వస్తోంది. దరిద్రం నెత్తిన కూర్చోబట్టే కదా  బతుకు తెరువు కోసం నీచులను సేవించవలసి వస్తోంది.ఇంకా అభిమానం అంతో ఇంతో మదిలో మిగిలి యుండబట్టే కదా నేను చేస్తున్న పనులు ఇతరులు  చూస్తున్నారేమో నని పరులను చూసి  భయపడవలసి వస్తోంది. ఇటువంటి సంసార సముద్రాన్ని ఈద లేకే స్వామీ నిన్ను వేయి విధాల వేడుకుంటున్నాను. నన్ను కాపాడి రక్షించు ప్రభూ!

                           తాపసార్చిత! నేను పాపకర్ముడనంచు- నాకు వంకలుఁ బెట్టబోకు సుమ్మి
నాటికి శిక్షలు నన్నుఁ జేయుటకంటె-నేడు సేయుము నీవు నేస్త మనక
అతి భయంకరులైన యమదూతలకు నన్ను-నొప్పగింపకు మయ్య యురగశయన
నీ దాసులను బట్టి నీవు దండింపంగ -వద్దు వద్దన రెంత పెద్దలైన
తండ్రివై నీవు పరపీడఁ దగులఁ జేయ-వాసిగల పేరు కపకీర్తి వచ్చునయ్య
భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస!- దుష్టసంహార !నరసింహ! దురితదూర!. (88)
                           

              మునులచే పూజించబడే శ్రీ ధర్మపురి లక్ష్మీనరసింహా! పాపములు చేసితినని నాకు వంకలు పెట్టకు స్వామీ! నన్ను మన్నించి నాడు ఎప్పుడో విధించే శిక్షలు నాకు ఇప్పుడే విధించు. స్వామీ! నాగశయనా! అతి భయంకరమైన ఆ యమభటులకు నన్ను అప్పగించకు స్వామీ!నీ దాసులను నీవే దండించిన వద్దనే పెద్దలెవ్వరుంటారు. అంతే కాదు నీవంటి వాడు తండ్రియై ఉండగా  నీబిడ్డ  ఇతరులచే పీడించబడుట ప్రసిద్ధుడవైన  నీకు కూడ అపకీర్తి కదా ప్రభూ! అందుకే నేను చేసిన నేరాలకు నాకిక్కడే నీవే శిక్ష విధించు ప్రభూ!
                 
                            కాయమెంత భయానఁ గాపాడినం గాని- ధాత్రిలో నది చూడ దక్కబోదు,
ఏ వేళ నేరోగ మేమరించునొ-సత్వ మొందగఁ జేయు మే చందమునను,
 ఔషధంబులు మంచి వనుభవించినఁ గాని-కర్మ క్షీణంబైన గాని విడదు,
కోటి వైద్యుల గుంపు కూడి వచ్చినఁ గాని-మరణ మయ్యెడు వ్యాధి మాన్ప లేరు,
జీవుని ప్రయాణ కాలంబు సిద్ధమైన-నిలుచునా  దేహమిందొక్క నిమిషమైన,
భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస!- దుష్టసంహార !నరసింహ! దురితదూర!. (89)
                   
                         ప్రభూ! ఈ శరీరాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నా అది శాశ్వతం కాదు .ఏదో ఒక రోజున మట్టిలో కలిసిపోయేదే. ఏ రోజు ఏక్షణం లో  ఏ రోగమొస్తుందో  తెలియదు. కర్మబంధం తీరి పాపం నశించే వరకూ వచ్చిన ఆ రోగం ఎంత మంచి మంచి మందులు వాడినా  తగ్గదు. ప్రపంచం లోని వైద్యులు కోట్లమంది  కట్టకట్టుకు వచ్చి చికిత్స చేసినా మరణం ఖాయమైన వ్యాధిని మాన్పలేరు. ఈ జీవునికి ప్రయాణకాల మాసన్నమైన తరువాత ఒక్క నిమేషం కూడ ఈ శరీరం లో  నిలువడు కదా!.
                
                    పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే అన్నది ఆయుర్వేదోక్తి. పూర్వ జన్మలో చేసిన పాపమే ఈ జన్మలో వ్యాధి రూపం లో బాధిస్తుంది. వైద్యుడు ఆయుష్షు ఉన్నవాడికి చికిత్స చేయగలడు కాని ఆయుర్దాయం లేనివాడికి వైద్యుని మందు పనిచేయదు. వందల కొద్ది వైద్యులు వచ్చి చికిత్స చేసినా చావు వచ్చెడివాని వ్యాధిని మాన్పలేరు.ఈ జీవునికి ప్రయాణకాల మాసన్నమైనప్పుడు ఒక్కక్షణం కూడ ఇంకా ఈ దేహం లో నిలువడు కదా.

 అంత్య కాలము నందు నాయాసమున నిన్ను-దలతునొ తలపనో తలతు నిపుడె
నరసింహ!  నరసింహ!  నరసింహ! లక్ష్మీశ! దానవాంతక!  కోటి భానుతేజ!
గోవింద! గోవింద! గోవింద! సర్వేశ!-పన్నగాధిప శాయి! పద్మనాభ!
మధువైరి! మధువైరి!మధువైరి! లోకేశ!-నీలమేఘ! శరీర నిగమ వినుత!
                    ఈ విధంబున నీ నామ మిష్టము గను-భజన సేయుచు నుందు నా భావమందు
                    భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస!- దుష్టసంహార !నరసింహ! దురితదూర!. (90)

                 
                             వివిధాభరణ భూషిత శరీరా ధర్మపురి నారసింహా ! మరణమాసన్నమైనపుడు ఆయాసము తో నిన్ను ప్రార్ధించగలనో లేదో నని ఇప్పుడే నిన్ను వేడుకొంటున్నాను.నరసింహ! నరసింహ!నరసింహ! లక్ష్మీనాథా !దానవాంతక! కోటి సూర్యప్రకాశా! గోవింద! గోవింద! గోవింద! సర్వేశ!  పన్నగ శయన! శ్రీ పద్మనాభ! !మధువైరి! మధువైరి! మధువైరి! లోకేశ! నీలమేఘ శరీర! వేద వినుత!   అంటూ నీ భజన చేస్తాను ప్రభూ!

                  ఈ పద్యం వ్రాసేటప్పుడు శేషప్ప కు  కంచర్ల గోపన్న దాశరథీ శతకం లోని  ముప్పున గాల కింకరులు ముంగిటకొచ్చిన వేళ అనే పద్యం చెంగటి కొచ్చి నిలిచే వుంటుంది.

     ముప్పున గాలకింకరులు ముంగిటకొచ్చినవేళ రోగముల్
            గొప్పరమైనచోఁ గఫము కుత్తుక నిండిన వేళ , బాంధవుల్
            గప్పినవేళ ,మీ స్మరణ గల్గునొ కల్గదొ నాటి కిప్పుడే
            తప్పక చేతు మీ భజన దాశరథీ ! కరుణాపయోనిథీ !

                                      
                                                                ------------   ఆరవ భాగం త్వరలో





****************************************************************

Thursday, 10 December 2015

శతకసౌరభాలు-7 శేషప్పకవి- నరసింహశతకము-4

      
          శతకసౌరభాలు-7 శేషప్పకవి – నరసింహశతకము-4
           

                     శేషప్ప కవి- నరసింహ శతకము -4






శ్రీ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి 



సర్వేశ ! నీ పాద సరసిద్వయమందు- జిత్తముంచగలేను జెదరకుండ
నీవైన దయయుంచి నిలచి యుండెడు నట్లు చేసి- నన్నిపుడేలు ,సేవకుడను
వనజలోచన! నేను వట్టి మూర్ఖుడ జుమ్మి- నీ స్వరూపము జూడ నేర్పు వేగ
తన కుమారుల కుగ్గు తల్లి పోసినయట్లు- భక్తి మార్గంబను  పాలు పోసి
ప్రేమతో నన్ను బోషించి పెంచుకొనుము- ఘనత కెక్కించు నీ దాస గణము  లోన
భూషణవికాస !శ్రీధర్మపుర నివాస!- దుష్టసంహార! నరసింహ! దురితదూర!.   (70)
                             
                 శ్రీ ధర్మపురినివాసా!నీపాదపద్మముల యందు నా మనసు నిలవకున్నది.నాపై దయయుంచి  మనసు నీపై నుండి చెదరకుండ చేసి నీ సేవకునిగా  నన్ను   ఏలుకో స్వామీ!  పద్మములవంటి నేత్రములు కలవాడా!నేను వట్టి మూర్ఖుడను. నీ దివ్య సుందరరూపమును  దర్శించెడి జ్ఞానమును నాకు ప్రసాదించు స్వామీ! తన బిడ్డలకు తల్లి  ఉగ్గుపోసినట్లు నీవు  నాకు భక్తి మార్గమనే  ఉగ్గుపాలు పోసి  ప్రేమతో నన్ను పోషించి , నీ  భక్తులలో శ్రేష్ఠునిగా చేయవయ్యా స్వామీ!.

                   

                     


                              హరిదాసులను నింద లాడ కుండిన జాలు- సకల గ్రంథమ్ములు  చదివినట్లు
భిక్షమియ్యంగఁ దప్పింప కుండిన జాలు- జేముట్టి దానంబు చేసినట్లు
మించి సజ్జనుల వంచించకుండిన జాలు-నింపుగా బహుమాన మిచ్చినట్లు
దేవాగ్రహారముల్ దీయకుండిన జాలు-గనక కంబపు గుళ్లు గట్టినట్లు
ఒకరి వర్షాశనము ముంచకున్నఁజాలు-బేరు కీర్తిగ సత్రముల్ పెట్టినట్లు
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!- దుష్టసంహార! నరసింహ! దురితదూర!.   (72)
                            
                         శ్రీ నారసింహా! గొప్పవారమనిపించుకోవడానికి  ఏవేవో గొప్పగొప్ప పనులు చేయాల్సిన పనిలేదు. విష్ణుభక్తులను, హరిదాసులను  నిందించకుండా వుంటే సకల గ్రంథములు చదివనట్లే .బిచ్చము వేసేవారిని ఆటంకపరచి భిక్ష వేసేటప్పుడు అడ్డుపడకుండా ఉంటే చాలు దానం చేసినట్లే. మంచి వారిని మోసగించకుండా ఉంటే చాలు పదిమందికి బహుమానాలు పంచినట్లే. దేవుడి కిచ్చిన మాన్యాలను,అగ్రహారాలను  స్వాహా చేయకుంటే చాలు బంగారు స్థంభాలతో పెద్దపెద్ద దేవాలయాలు కట్టించినంత పుణ్యం లభిస్తుంది. ఒకరి నోటి కందే సంవత్సరం పంటను కాజేయకుంటే చాలు ధర్మసత్రాలు కట్టించి , అన్నదానాలు చేసినంత పుణ్యం ప్రాప్తిస్తుంది.
                       

                 కవి ఆనాటి సమాజాన్ని  మన ముందు ఉంచుతున్నాడు.  ఈ రోజుల్లో లాగానే  ఆ రోజుల్లో కూడ పాపభీతి  లేకుండా దేవుడి మాన్యాలను దోచుకొనేవారు , సాగుచేసుకొనే వారు, ఆక్రమించుకొని అమ్ముకొనేవారు , దేవుని పేరు చెప్పి చందాలు పోగుచేసి స్వాహా చేసేవారు ,   దేవుడికి నోరులేదు కదా. మనలనేమి చేస్తాడులే అని అగ్రహారాలను అమ్ముకునేవారు ఆనాడే ఉన్నారని కవి మనకు చెపుతున్నాడు.  ఎవరో  మహానుభావులు దేవుని కిచ్చిన  ఆస్తులపై, ఆభరణాలపై అధికారం చెలాయిస్తూ,కనీసం ఆ దేవుడంటే  ఆసక్తి ,భక్తి కూడ లేని అజమాయిషీదారులు పెద్దపెద్ద ఆలయాల్లోనే ఇప్పడు కన్పిస్తున్నారు కదా. ఈ పాపాలు చేయవద్దని , చేస్తే  ఆ పాపఫలం పరలోకం లోనైనా  అనుభవించవలసి వస్తుందని  కవి నివేదన.


 భావంబు నీనామ భజన గోరుచు నుండు జిహ్వ నీకీర్తనల్ చేయగోరు
హస్తయుగ్మంబు నిన్నర్చించ గోరును గర్ణముల్ నీ మీద కథను గోరు
దనువు  నీ సేవయే  ఘనముగా గోరును- నయనముల్ నీ దర్శనంబుఁ గోరు
మూర్థమ్ము నీ పదంబుల మ్రొక్కగాఁ గోరు నాత్మ నీదై యుండు నరసి చూడ
స్వప్నములనైన  నేవేళ సంతతమును- బుద్ధి నీ పాదములయందుఁ బూనియుండు
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!- దుష్టసంహార! నరసింహ! దురితదూర!.   (73)
                               

              శ్రీ ధర్మపురి లక్ష్మీనరసింహ ప్రభూ! నీ మనస్సెప్పుడూ నీ భజన చేయాలనే కోరుకుంటూ టుంది. నా నాలుక నీకీర్తనలను గానంచేయాలని , చేతులు  నిన్ను అర్చించాలనీ , చెవులు ఎల్లప్పుడూ నీ కథలను వినాలనీ , ఈ శరీరం  నీకు ఘనంగా సేవచేయాలనీ సదా కోరుకుంటూ ఉంటాయి. ఎల్లప్పుడూ నీ దివ్యమంగళరూపాన్ని దర్శించాలని ఈ కన్నులు ఆరాటపడుతుంటాయి.  నా తల నీ పాదాలకు తాకించి పదే పదే నమస్కరించాలని తహతహ లాడుతోంది. లోతుగా ఆలోచిస్తే నా ఆత్మ ఏనాడో నీదై ఉంది. కలలో కూడ నిన్నే సేవించాలని నా  బుద్ధి కోరుకుంటూ ఉంది. కావున నరసింహా నన్ను కావుము తండ్రీ.!

             
                    పద్మాక్ష! మమత చేఁ బరము నందెదమంచు విఱ్ఱవీగెదమయ్య వెఱ్ఱి పట్టి
మా స్వతంత్రంబైన మదము కళ్ళకు గప్పి మొగము పట్టదు కామమోహమునను
బ్రహ్మదేవుండైనఁ బైడి దేహము గల్గఁ- జేసి వేయక మమ్ము జెఱిచె నతడు
తుచ్ఛమైనటువంటి తో లెమ్ముకల తోడ- మురికి చెత్తలు చేర్చి మూటగట్టె
నీశరీరాలు పడిపోవు టెఱుగ కేము-కాముకులమైతి మిక మిమ్ము గానలేము
భూషణవికాస !శ్రీధర్మపుర నివాస!- దుష్టసంహార !నరసింహ! దురితదూర!   (74)
                   

          పద్మముల వంటి నేత్రములు గల్గిన ఓ నారసింహా.మేము వెఱ్ఱి వాళ్ళమై,నీ మీద భక్తితోనో ,ప్రేమతోనో మోక్షాన్ని పొంద గలమని విర్రవీగుతున్నాము. మా లోని మదము మా కళ్లకు గప్పి కామమోహములచేత నిన్ను చూడలేకపోతున్నాము. ఆ బ్రహ్మదేవుడైన మాకు బంగారం లాంటి శరీరాన్నివ్వకుండా మమ్మల్ని చెడగొట్టాడు.  తుచ్ఛమైన ఎముకలు ,మాంసము చర్మము తో కూడిన మురికిని చేర్చి మూట కట్టాడు. ఈ శరీరాలు  అశాశ్వతాలు ,పడిపోతాయని తెలియక  కాముకులమై మిమ్ము చూడలేకపోతున్నాము. స్వామీ. నీ దర్శన భాగ్యాన్ని మాకు కల్గించు ప్రభూ!

                  
                   గరుడవాహన ! దివ్యకౌస్తుభాలంకార! రవికోటితేజ! సారంగవదన!
మణిగణాన్విత హేమ మకుటాభరణ! చారు- మకరకుండల! లసన్మందహాస!
కాంచనాంబర! రత్నకాంచీ విభూషిత!- సురవరార్చిత! చంద్ర సూర్యనయన!
కమలనాభ! ముకుంద! గంగాధరస్తుత!- రాక్షసాంతక! నాగరాజశయన!
పతిత పావన! లక్ష్మీశ !బ్రహ్మజనక! భక్తవత్సల! సర్వేశ! పరమపురుష!
భూషణవికాస !శ్రీధర్మపుర నివాస!- దుష్టసంహార! నరసింహ! దురితదూర!   (75)

                    
                  శ్రీ ధర్మపురి లక్ష్మీనరసింహా! గరుడవాహనా! దివ్యమైన కౌస్తుభమణిని ధరించినవాడా!కోటిసూర్య సమాన తేజోవంతుడా! చంద్రబింబము వంటి మోము గల సుందరుడా! వివిధమణులు పొదిగిన బంగారపు కిరీటమును ధరించిన వాడా! అందమైన మకర కుండలములను ధరించినవాడా ! మనోహరమైన మందహాసము గలవాడా! అందమైన చిరునవ్వు గలవాడా! బంగారుమయమైన వస్త్రమును ధరించినవాడా.! రత్నములతో పొదిగిన మొలనూలుచే ప్రకాశించుచున్న వాడా! సకల దేవతాపూజితుడా! చంద్ర సూర్యులు నేత్రములు గా గలవాడా! కమలనాభా.! ముకుందా!మోక్షమును ప్రసాదించేవాడా ఈశ్వరుని చే స్తుతించబడెడి వాడా!రాక్షస సంహారా! నాగేంద్రుని పై శయనించెడివాడా! పాపములను నశింపచేయువాడా!శ్రీలక్ష్మీనాథా! బ్రహ్మకు తండ్రియైన వాడా! భక్తులయందు వాత్సల్యము గలవాడా!.సర్వేశ! పరమపురుషా! నారసింహా!పాహి!పాహి.
             

             తాను పూజిస్తున్న ,ప్రార్థిస్తున్న లేక ఉపాశిస్తున్న దైవం యొక్క ఔన్నత్యాన్ని వివరించడానికి భక్తుడు ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శిస్తాడు. ఎందుకంటే అటువంటి ఇలవేల్పు తనకు  అండగా  ఉన్నాడని భావించడమే ఆ భక్తునికి కొండంత దైర్యం. తన దైవం ఇంత గొప్ప యని చెప్పుకోవడం ఆ భక్తునికి  ఎంతో ఆనందాన్ని కల్గించే విషయం. ఈ ప్రపత్తే భగవంతుని చెంతకు భక్తుని చేరువ చేస్తుంది. గజేంద్రుడు  కలడు కలండనెడు వాడు కలడో లేడో అనే సందేహం నుంచి నీవే తప్ప నిత: పరం బెరుగను అనే దశకు వచ్చి భగవంతుని వేడుకొనే సందర్భం లో  ఆంద్రమహాభాగవతం లో పోతన మహాకవి  గజేంద్రుని  నోట  ఇలా ప్రార్థించారు.

ఓ కమలాప్త! యో వరద! యో ప్రతిపక్ష విపక్షదూర! కు
య్యో! కవియోగివంద్య! సుగుణోత్తమ!యో శరణాగతామరా
నోకహ!  యో మునీశ్వర మనోహర! యో విమల ప్రభావ! రా
                   వే! కరుణింపవే! తలపవే! శరణార్థిని నన్నుఁ గావవే!. (ఆం.మ భా 8-92)

వేంకటేశ్వర సుప్రభాతం మనం నిత్యం స్మరించేదే కదా.

కమలాకుచ చూచుక కుంకుమతో
నియతారుణితాతుల నీలతనో
కమలాయతలోచన లోకపతే
విజయీభవ వేంకట శైలపతే .
            
                 ఈ మధురమైన శ్లోకం లో భక్తుడికి శృంగారం కనపడదు .తన ప్రభువు యొక్క లక్ష్మీపతిత్వాన్ని గొప్పగా ప్రకటించి, ప్రశంసించి  తన్మయత్వంతో ప్రార్థించడమే భక్తునికి తెలుసు.
          

               శతకసాహిత్యం లో ఇటువంటి పద్యాలే ఎక్కువగా ఉంటాయి  ఈ శతకం లో 79 వ పద్యం కూడ ఇటువంటిదే.
                                             
                                         
                                            భువనేశ! గోవింద! రవికోటి సంకాశ!
                                                             పక్షివాహన! భక్తపారిజాత!
అంభోజ భవరుద్ర జంభారి సన్నుత!
సామగానవిలోల !సారసాక్ష!
                                                  వనధిగంభీర! శ్రీవత్సకౌస్తుభవక్ష!
శంఖచక్రగదాసి శార్ఞహస్త!
దీనరక్షక ! వాసుదేవ! దైత్యవినాశ!
                         నారదార్చిత! దివ్యనాగశయన!
చారునవరత్నకుండల శ్రవణయుగళ!
విబుధ వందిత పాదాబ్జ! విశ్వరూప!
భూషణవికాస !శ్రీధర్మపుర నివాస!-
 దుష్టసంహార! నరసింహ! దురితదూర   (79)
          
                   ఈ పద్యం లో కూడ కవి తన స్వామి దివ్యరూపాన్ని  తనవితీర దర్శిస్తున్నాడు.              
                   
                             పలుమాఱు దశరూపములు ధరించితివేల నేకరూపము బొంద వేల నీవు
 నయమున క్షీరాబ్ధి నడుమఁ జేరితివేల రత్నకాంచన మందిరములు లేవె
పన్నగేంద్రుని మీద  బవ్వళించితి వేల-జలతారు పట్టె మంచములు లేవె
ఱెక్కలు గల పక్షి నెక్క సాగితి వేల గజతురంగాందోళికములు లేవె
వనజలోచన యిటువంటి వైభవములు- సొగసుగా నీకు దోచెనో సుందరాంగ
భూషణవికాస శ్రీధర్మపుర నివాస- దుష్టసంహార నరసింహ దురితదూర   (76)
                  

                     ప్రభూ! నారసింహా! నీవు అనేకసార్లు దశావతారాలను ఎందుకు ధరిస్తున్నావు. ఒకే రూపంతో మా కన్నులకు ఆనందాన్నియ్యలేవా? బంగారుమయమైన సౌధాగ్రముల యందు నివసించక పాలసముద్రంమధ్య లో పాము మీద  పడక వేసితివేమి ప్రభూ?జలతారు పట్టె మంచములు ,గుఱ్ఱములు, ఏనుగులు, పల్లకీల వంటి భోగములను వదిలి వేసి ఱెక్కల పక్షి నెక్కి విహరింతువేమయ్యా? ఇటువంటి వైభవములే నీకు సొగసుగా తోచినవా స్వామీ?
                   
                            తార్ఘ్యవాహన! నీవు దండి దాత వటంచుఁ- గోరి వేడుక నిన్నుఁగొల్వ వచ్చి
యర్థి మార్గమును నే ననుసరించితి నయ్య-లా  వెనుబదినాల్గు లక్షలైన
వేషముల్ వేసి నా విద్యా ప్రగల్ఫతఁ-జూపసాగితి నీకు సుందరాంగ
యానందమైన నే నడుగ వచ్చిన దిచ్చి వాంఛ దీర్చుము నీలవర్ణ వేగ
నీకు నా విద్య హర్షంబు గాక యున్న-తేపతేపకు వేషముల్ దేను సుమ్మీ
భూషణవికాస !శ్రీధర్మపుర నివాస!- దుష్టసంహార! నరసింహ! దురితదూర!.   (77)
                

                    ఓ గరుడ గమనా! నీవు గొప్పదాతవని తెలిసి  కోరికతో నిన్ను సేవించు కుందామని వచ్చాను.  యాచకుడి గా ఎనభైనాల్గు లక్షల వేషాలు వేసి నా విద్యా ప్రాగల్బ్యాన్ని నీకు చూపించడానికి ప్రయత్నించాను. ఓ నీలవర్ణ శరీరా! నేనడిగేటటువంటి నాకు ఆనందాన్ని కల్గించే నా కోరికలను తీర్చు స్వామీ! ఎందుకంటే నేను వేసే వేషాలు నీకు  ఆనందాన్ని కల్గించక పోతే నేను మాటి మాటికీ వేషాలు మార్చను లేను స్వామీ!
          
                                  కవి హరిదాసు గా అక్షయపాత్ర ధరించి యాయవారంతో జీవిస్తూ,ఆలయమే విడిదిగా భగవత్సన్నిధిలోనేకాలం గడిపినట్టు భావించబడుతోంది. ఈ పద్యాన్ని బట్టి చూస్తే పగటివేషాలు వేయడం కూడ  భగవత్సేవ లో భాగం గా భావించేవారు ఇప్పటికీ ఉన్నారు. ఆంజనేయుడు, గయుడు లాంటి వేషాలు ధరించి  వీధుల్లో  తిరిగే వారు ఇప్పటికీ కన్పిస్తూనే ఉంటారు. అలాగే కవి  ఎనభై నాలుగు వేషాలు వేశాననడం అందులో భాగమై ఉండవచ్చు. శేషప్ప జీవితం గురించి పూర్తి వివరాలు తెలిస్తే మన ఆలోచనలకు ఒక ఆకారం  రావచ్చు.

                        
                                 తిరుపతి స్థలమందుఁ దిన్నగా నేనున్న-వేంకటేశుడు మేత వేయలేడే?
పురుషోత్తమునకుఁ బోయినఁజాలుజ-గన్నాథు డన్నంబు గడపలేడె?
శ్రీరంగమునకు నేఁజేరబోయిన జాలు-స్వామి గ్రాసము పెట్టి సాకలేడె ?
కాంచీపురము లోన గదిసి నే  కొలువున్నఁ-గరివరదుడు పొట్ట గడపలేడె ?
యెందుఁ బోవక నేను నీ మందిరమున నిలిచితిని నీకు నా మీద నెనరు లేదు.
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!- దుష్టసంహార! నరసింహ! దురితదూర!.   (78)
           
               
                              శ్రీ నరసింహా! నేను తినే   ఈ నాలుగుమెతుకులు ఎక్కడ ఏ స్వామిని సేవించినా వాళ్లు నా పాత్రలో వేస్తారు. అయినా నేను నిన్ను నమ్ముకునే నీ ముంగిట పడి ఉన్నాను  గాని నీకు నా మీద దయలేదు. నేను తిరుమల వెళ్లి వేంకటేశ్వరుని సన్నిధిలో దేవిరస్తే ఆ ప్రభువు నాకు మేత వేసి నన్ను పోషించలేడా?పూరీ జగన్నాధుడు నాకింత అన్నము పెట్టలేడా? శ్రీరంగానికి నేను వెడితే చాలు. ఆ స్వామియే ఆదరించి అన్నము పెడతాడు. కంచికి వెడితే ఆ వరదరాజులు నన్నునా పొట్ట నింపలేడా ! ఇన్ని అవకాశాలు ఉండి కూడ నేను నిన్నే నమ్ముకొని నీ చెంగట పడి ఉన్నానే .అయినా కాని నీవు నాపై దయ చూపడం లేదు ప్రభూ !
                   
                వైష్ణవ క్షేత్రాలలో భగవద్భక్తులకు ప్రసాదం కొరత ఉండదు కదా. కవి కాలం నాటికే తిరుమల లో హాథీరాం జీ మఠం ఆధ్వర్యంలో భక్తులకు వివిధ ప్రసాదాలను దండిగా అందిస్తున్నట్లు తిరుమల చరిత్ర చెపుతోంది. అందుకే కవి అంత ధైర్యంగా తిరుమల ను గూర్చి ప్రస్తావించాడేమో.

                                                                       
                                                                          ------ ఐదవ భాగం త్వరలో



 ***************************************************************