Monday, 2 June 2014

శతకసౌరభాలు - 2 ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకము - 6


శతకసౌరభాలు - 2
          
                           ధూర్జటి  శ్రీ కాళహస్తీశ్వర శతకము - 6






అంతా సంశయమే శరీరఘటనం బంతా విచారంబె లో
నంతా దు:ఖపరంపరాన్వితమె మేనంతా భయభ్రాంతమే
యంతానంత శరీరశోషణమె దుర్వ్యాపారమే దేహికిన్
చింతన్నిన్ను దలంచి పొందరు నరుల్ శ్రీకాళహస్తీశ్వరా !
                  
                శంకరా  ! ఈ జీవికి జన్మంతా సంశయమే . శరీర ఘటనమే ఒక సంశయము . జీవుడు  ఒక దుఖం నుండి మరొక దుఖం లోకి పడిపోతూ , ఒక జన్మ నుండి మరొక జన్మలోకి  జారిపోతుంటాడు.  విచారించి చూడగా జరుగుచున్నదంతా  శరీరాన్ని శుష్కింపజేసే దుర్వ్యాపారాలే. అయినా ఈ మానవులు  తమ మనస్సులలో  నిన్ను ధ్యానించి నిన్ను చేరుకొనే ప్రయత్నం చేయడం లేదు.

సంతోషించితి చాలుచాలు రతిరాజద్వార సౌఖ్యంబులన్
శాంతింబొందితి చాలుచాలు బహురాజద్వార సౌఖ్యంబులన్
శాంతి బొందెద జూపు బ్రహ్మపదరాజద్వార సౌఖ్యంబు  ని
శ్చింతన్ శాంతుడనౌదు నీ కరుణ చే ;  శ్రీకాళహస్తీశ్వరా !
         
           స్వామీ  ! రతికేళీ విలాసముల సంతృప్తి పొందాను . ఇక ఆ సుఖాలు వద్దు . అనేక రాజ సభలలో గౌరవ సత్కారములను పొంది సంతోషించాను. అవి కూడ చాలు.  నీ దయను నాపై ప్రసరింపజేసి  పరబ్రహ్మ పద సౌఖ్యాన్ని నాకు కల్గజేయవలసింది . దానితో  ఇతర కోరికలు లేక నిశ్చింతగా  ఉంటాను స్వామీ !

స్తోత్రంబన్యుల జేయనొల్లని వ్రతస్ధుల్వోలె వేసంబుతో
బుత్రీబుత్ర కళత్ర రక్షణ కళాబుద్ధిన్ నృపాలాధమున్
బాత్రంబంచు భజించబోదు రిదియు న్భావ్యంబె యివ్వారి చా
రిత్రం బెన్నడు మెచ్చ నెంచ మదిలో   శ్రీకాళహస్తీశ్వరా !

                ఈశ్వరా !    కొందఱు నిన్ను తప్ప ఏ ఇతరులను స్తుతించుటకు ఇష్టపడని వ్రతస్ధులవలే డాంబికాలు పలుకుతూ , భార్యాపుత్రుల పోషణార్ధము  రాజులను సేవిస్తూ  ,జీవిస్తున్నారు . ఇది భావ్యం కాదు . ఇటువంటి వారి ప్రవర్తనను నే నెప్పుడు మెచ్చుకోలేను .

అకలంకస్థితి న్నిలిపి నాదమనుఘంటారవమున్ బిందు దీ
ప కళాశ్రేణి  వివేక సాధనములొప్పన్బూని యానంద తా
రక దుర్గాటవిలో  మనోమృగము గర్వస్ఫూర్తి వారించు  వా
రికిగా  వీడు భవోగ్రబంధలతికల్ ; శ్రీకాళహస్తీశ్వరా !

                ఓ శంకరా  !  నిశ్చలస్ధితిలో నిల్చి ,  ఓంకారనాదమను ఘంటారావముతో , బుద్ది యనెడు  దీపపు సామగ్రి తో ,  వివేకమనెడి  సాధనములను కూర్చుకొని ,  ఆనందమనెడి భయంకరమైన అరణ్యము లో తిరిగెడి మనస్సు అనే మృగము  యొక్క మదాన్ని అణచిన    వారికి కదా సంసారమనెడి భయంకరమైన బంధములు తెగి  నీ  దర్శనభాగ్యం  లభించేది స్వామీ  !

ఒక యర్ధంబున నిన్ను నేనడుగగా యూహింప నెట్లైన బొ
మ్ము  కవిత్వంబులు నాకు చెందవని యేమో యంటివా నాదు జి
హ్వకు  నైసర్గిక కృత్యమంతియ సుమీ  ప్రార్ధించుటే కాని కో
రికల న్నిన్నును గాన నాకు వశమా ? శ్రీకాళహస్తీశ్వరా !

                 స్వామీ  ! శంకరా ! నేను ఏవో కోరికలు మనస్సు లో పెట్టుకొని నిన్ను  ప్రార్ధించుట లేదు , అయినా ఈ కవిత్వములు అవీ నాకు చెందనివి  పొమ్ము అని నీవన్నాకూడ అలాగే కానిమ్ము. ఎందుకంటే నా నాలుక కు సహజలక్షణం గా వచ్చినది , నాకు చేతనైనదీ ఈ కవిత్వం చెప్పడమే స్వామీ  !   నిన్ను ప్రార్ధించుటే నాకు వచ్చును  కాని కోరికలున్నంత మాత్రాన   నిన్ను దర్శించుట నాకు సాధ్యమా  ప్రభూ !

శుకముంల్కింశుక పుష్పములగని ఫలస్తోమంబటంచు న్సము
త్సుకతం జేరగబోవగ నచ్చట మహాదు:ఖంబు సిద్ధించు ,క
ర్మ కళాభాషల కెల్ల ప్రాపులగు శాస్త్రంబు ల్విలోకించు వా
రికి నిత్యత్వ మనీష దూరమగు చున్ శ్రీకాళహస్తీశ్వరా !

             శంకరా  ! చిలుకలు  మోదుగ పూవులను చూచి వాటిని పండ్లను కొని భ్రాంతి తో వాని చెంతక చేరి  అక్కడ నిరాశను పొందుచున్నవి . అట్లే నిన్ను ధ్యానించక   కొందరు  కర్మ కాండల మీద కావ్య చర్చలమీద  కాలమును వెళ్లబుచ్చుచూ , శాశ్వత జ్ఞానాన్ని దూరం చేసుకుంటున్నారు కదా !

ఒకరిం జంపి పదస్ధులై బ్రతుక తామొక్కొక్క రూహింతురే
లొకొ తామెన్నడు జావరో తమకు బోవో సంపదల్ పుత్ర మి
త్ర కళత్రాదులతోడ నిత్యసుఖమందం గందురో, యున్న 
వారికి లేదో మృతి యెన్నడుం గటగటా శ్రీకాళహస్తీశ్వరా !

                       ఓ శివా ! కొందరు ఒకరిని చంపి  పదవిని పొంది  బ్రతుకుదామని ఆలోచిస్తారు . ఆశ్చర్యం గా ఉంది కదా ! వారు మాత్రం ఏదో ఒక రోజున చావరా  ? వారి సంపదలు మాత్రం పోవా ! వాళ్లేమైనా భార్యాపుత్రులతో ఎల్లకాలం  సుఖంగా ఉంటారా ? బ్రతికున్నవారికి ఎన్నడూ చావురాదా ?  ఎంత ఆశ్చర్యము ! స్వామీ ! అయ్యో !

నీ కారుణ్యము గల్గినట్టి నరుడే నీచాలయంబుం చొరం
డే కార్పణ్యపు మాటలాడనరుగం డెవ్వరితో ,వేషముల్
గైకోడే మతము ల్భజింప డిల నే కష్టప్రకారంబులన్
చీకాకై చెడిపోడు జీవనదశన్ ; శ్రీకాళహస్తీశ్వరా !

          శంకరా  ! నా అనుగ్రహం పొందిన  నరుడు  ఏ నీచుల కొలువు కు వెళ్ళడు. ఎవ్వరినీ  దీనంగా యాచించడు .   మాయవేషాలు వేయడు.  ఏ ఇతర మతములను సేవించడు.  బ్రతుకు నందు  ఎంత కష్టములు కమ్ముకున్నను  స్ధిరత్వమును కోల్పోక  నిలబడతాడు .

జ్ఞాతు ల్ద్రోహులు వారుసేయు కపటీర్ష్యాది క్రియాదోషముల్
మా తండ్రాన సహింపరాదు ,ప్రతికర్మంబించుకే జేయగా
బోతాదోషము గానమాని యతినై పోగోరినన్ సర్వదా
చేత:క్రోధము మానదెట్లు నడతున్ శ్రీకాళహస్తీశ్వరా !

          శంకరా !  దాయాదులు అపకారులు. వారు  చేసే  మోసము అసూయ తో కూడిన పనులు సహింపరానివి . మా తండ్రి గారిమీద ఒట్టు.  వారి పనులకు ప్రతీకారము చేద్దామంటే పాపమంటారు . పోనీ సన్యాసం తీసుకుందామంటే నా మనసు లోని కోపం అణగిపోవడం లేదు. ఆ కోపాన్ని ఎలా జయించాలో చెప్పు స్వామీ !.


రోసిందేఁటిది? రోతలేఁటివి ? మనోగ్రస్తుండు గా దేహి తా
పూసిందేటిది ? పూతలేఁటివి ? మదాపూతంబు లీదేహముల్
మూసిందేఁటిది ? మూఁతలేటవి ? సదా మూఢత్వమే కాని తా
జేసిందేటిది చేఁతలేటివి వృథా ! శ్రీకాళహస్తీశ్వరా !

          శ్రీ శంకరా  !ఈ దేహి  దేన్ని  అసహ్యించుకుంటున్నాడు . పిచ్చివాడివలే ప్రవర్తిస్తున్నాడు. ఒంటికి విభూతి పూసుకుంటున్నాడే కాని అది విభూతి కాదు మదమనే మైపూత . మూసివేశానంటాడు తనలో ఎటువంటి దుర్గుణాలు లేవంటాడు  మూఢత్వ ముండగా మూసిందేమిటి . ఎన్నో చేశానంటాడే కాని అన్నీ వృథా పనులే కాని సత్కార్యం ఒక్కటీ ఉండదు. ఇదీ ఈ  జీవి తాపత్రయం.

శ్రీ శైలేశు భజింతునో యభవు గాంచీనాథు సేవింతునో
కాశీవల్లభు గొల్వబోదునొ మహా కాళేశు బూజింతునో,
నాశీలం బణువైన మేరువనుచున్ రక్షింపవే నీ కృపా
శ్రీ శృంగార  విలాస హాసములచే ; శ్రీకాళహస్తీశ్వరా !
         
           శ్రీ కాళహస్తీశ్వరా ! నేను శ్రీ శైలమల్లిఖార్జునుని సేవించలేదు  కంచిలోని ఏకామ్రనాథుని పూజించలేదు . కాశీ విశ్వేశ్వరుని  భజించలేదు .  ఉజ్జయిని లోని మహా కాళేశ్వరుని సేవించలేదు.  నేను ఎవ్వరినీ  పూజించని వాడనైనప్పటికీ  దేవా ! .నా  భక్తి అణువంతైనను మేరువు వలే భావించి  నీదయ యనెడి సంపత్కరమైన చిరునవ్వులతో నన్ను రక్షింపుము . .

వెనకం జేసిన ఘోర దుర్దశలు భావింపంగ రోతయ్యెడున్
వెనుకన్ముందట వచ్చు దుర్మణముల్వీక్షింప భీతయ్యెడున్
నను నే జూడగ నా విధుల్దలచియున్నాకే భయంబయ్యెడిన్
చెనకుం జీకటి నాయె కాలమునకున్ శ్రీకాళహస్తీశ్వరా !   ( 75 )
                  
             స్వామీ ! ఇంతకు ముందు చేసిన పాపపు పనులను తలచుకుంటేనే అసహ్యం వేస్తోంది .  నా కళ్లముందు సంభవించెడి దుర్మరణాలను చూస్తుంటే భయం వేస్తోంది . నన్ను , నేను చేసే పనులను పరిశీలించుకుంటుంటే నాకే భయం వేస్తోంది . నల్లని చీకటి నా పైపైకి వచ్చి కమ్ముకుంటున్నట్లు గా కలిగే భావన నన్నుభయాందోళనలకు గురిచేస్తోంది స్వామీ రక్షించు !
                   

                    చదువుతూ ... ఉండండి . మరికొన్ని త్వరలో అందిస్తాను .



***************************************************************