Thursday, 18 April 2013

శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి


                      

                         శ్రీ   సీతారాముల కళ్యాణం చూతము  రారండి
                   
                      
                                     శ్రీ సీతారాముల కళ్యాణం  సర్వ జగత్కళ్యాణం.   శ్రీరామనవమి కి ఆంధ్ర దేశం లో వీథి వీథి న  చలువ పందిళ్ళు వేసి, శ్రీ సీతారాములకు కళ్యాణం చేసి,వడపప్పు, పానకాలను  కొసరి కొసరి పంచుకొని ఊరంతా సంబరం చేసుకోవడం  ఏనాటినుండో వస్తున్న ఆచారం. దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే అనే సామెత ఇక్కడి నుండే వచ్చింది.  శ్రీరాముడు లోకాభిరాముడైనా , భద్రాద్రి పై వెలసి , తెలుగువారికి  అయినవాడయ్యాడు.  సీతమ్మ మా అమ్మ రామయ్య మా తండ్రి అని సమస్త ఆంధ్ర జాతి మురిపెంగా చెప్పుకుంటుంది.
                       

                
                          విశ్వామిత్రుని అనుసరించి వచ్చిన రామలక్ష్మణులు మిథిలానగరం లో ప్రవేశించారు. విశ్వామిత్రుని చే అనుజ్ఞాతుడైన జనకుడు,  శివధనుస్సును తీసుకురావలసిందిగా తన మంత్రులను ఆజ్ఞాపిస్తాడు వాల్మీకం లో. ఎనిమిది చక్రాల బండి మీద ధనుస్సును పెట్టి, అయిదువేలమంది దృఢకాయులైన పురుషులు అతికష్టం మీద నెట్టుకొస్తారు. విశామిత్రుని ఆజ్ఞ తో రామచంద్రుడు పేటికను తెరచి, ధనుస్సు నెక్కుపెట్టాడు.  ఎక్కుపెట్టిన సమయం  ఎంతో తెలియదు కానీ, విరిగిన శబ్దం  మాత్రం రాజు, విశ్వామిత్రుడు, జానకి తో పాటు రామలక్ష్మణులు  మాత్రమే వినగలిగారట. మిగిలిన వారందరు మూర్ఛపోయారు.   వర్జ యిత్వా మునివరం రాజానం తౌచ రాఘవా:”(  వా.బా.67-18 ) అంటాడు వాల్మీకి . వీర్య శుల్క గా సీతమ్మ  రామ చంద్రుని చేరింది. ఇది వాల్మీకం.
                      
                వాల్మీకం లో  సీతా స్వయంవర ప్రస్తావన లేదు. ఎందరో రాజులు కోరారని, వారందరు గుంపులు కట్టుకొని మిథిలకు వచ్చి ధనస్సును ఎక్కుపెట్టలేక పడిపోయారని జనకుడు చెప్పిన మాటలే (వా.బాల. 67-18 )    అనంతర  కావ్యాల్లో సీతా స్వయంవరాన్ని ప్రకటింప చేశాయి.
                  
                           సీతా స్వయంవరానికి రావణుని రప్పించిన ఖ్యాతి కూడ అనంతర కవులదే. ఆనంద రామాయణం లో స్వయంవరమందు పరాభూతుడై తిరిగి వెళతాడు రావణుడు.

                    సీతా రాముల పరిణయానికి ముందే పుష్పవాటిక లో  జానకీ రాముల ఆకస్మిక సందర్శనాన్ని కల్పించి , పులకించిన మహాకవి  తులసీదాసు. 

                        తొరవె  అనే కన్నడ రామాయణం లో రావణుడు సీతా స్వయంవరానికి వచ్చి, ధనుస్సును ఎత్త లేక ముందుకు పడి, ఆ ధనుస్సు ను మీద వేసుకుంటే, అతని అనుచరులే ఏదో విధంగా అతన్ని బయటకు లాగి లంకకు తీసుకుపోతారు.(కన్నడం లో రామకథ. పు.14)

                 



                ఇటువంటి కథలే తెలుగు లోనికి కూడ ప్రవేశించి సీతా స్వయంవర ఘట్టాలకు తెఱ లేపాయి. 
        
                     శ్రీ సీతా కళ్యాణాన్ని కమనీయమైన కావ్యరీతిలో రమణీయమైన లఘుకావ్యాలు గా అందించిన తెలుగుకవులలో  శ్రీ కరుణశ్రీ  ఒకరు. సీతా స్వయంవరానికి రంగాన్ని ఇలా  సిద్ధం చేశారు కవి.
                     
                     “ అది మహా సభ – సీతా స్వయంవరార్ధ
                       మచట గూడెను, తళతళలాడు భూష
                       ణాలతో ఖండఖండాంతరాల దొరలు
                      శివధనుర్భంగమునకు  విచ్చేసినారు

                   ----- అంటూ ప్రారంభించారు ధనుర్భంగ ఘట్టాన్ని. బారులు తీరి భూపతులు బంగరు గద్దెల మీద కూర్చుండ, ఎదురుగ పెద్దవిల్లు,  ఆ వైపున శృంగార మధూక మాలికను పట్టుకొని తండ్రి చాటున నిలిచిన జానకి ,  ఇటు వైపు రాజఠీవి తొణికిసలాడ, వీర రసము మూర్తీభవించినట్లు, మునిరాజు వెన్క,  తమ్మునితో కలసి  నాజూకుగా నిల్చిన రఘువీరుడు.ఇదీ దృశ్యం.
                  
                         జనకుడు స్వాగత వచనాలు పలికాడు. శివధనుస్సును ఎక్కుపెట్టిన వీరుణ్ణి నా కుమార్తె వరిస్తుందని  ప్రకటించాడు. ప్రకటన పూర్తయ్యింది. కరతాళ ధ్వనులతో సభాంగణం  మారు మ్రోగింది.. నతముఖి యైన సీత ముఖపద్మము వైపు నరేంద్ర కుమారుల చూపులు పరుగులెత్తాయి. కొమ్ము టేనుగుల వంటి రాచవస్తాదులు శృంగభంగం కాగా వెనుదిరిగారు. పితృవాక్య పరిపాలకుడు, గురుజన విథేయుడు, అయిన రామచంద్రుడు మాత్రం కదలలేదు. గురుదేవుల వైపు భక్తి వినమ్రంగా చూశాడు రాముడు. శిష్యవాత్సల్యం తో రఘువీరుని చూశారు గురుదేవులు. ఆ చూపులోనే ఆజ్ఞ  పొందు బడింది. ఆశీశ్శతం అందించబడింది.
             
                   తమ్మునకు ధనుస్సునిచ్చి, రఘుముఖ్యుడు జానకీదేవి  నోరకంటి తో  చూస్తూ,
 " సింహకిశోరమట్లు ముందున కరుదెంచె నచ్చెరువుతో నృపతుల్ తలలెత్తి చూడగన్. ఆశ్చర్యం తో  రామచంద్రుని చూస్తున్నారు  రాకుమారులు.
                            
                     వాళ్ళు ఆశ్చర్యం నుండి తేరుకోక ముందే ఫెళ్ళున శబ్దం వచ్చింది. ఏం జరిగిందో తెలుసుకొనే వీలులేదు. ఆశ్చర్యం లోనే గుండె గుభిల్లుమనగా సిగ్గుతో తలలు వంచేశారు రాజులు.  ఆ సన్నివేశాన్ని కవిమాటల్లో –
                              ఫెళ్లు మనె విల్లు, గంటలు ఘల్లు మనియె, 
                         గుభిల్లు మనె గుండె నృపులకు, ఝల్లుమనియె                    
                         జానకీ దేహ మొక నిమేషమ్మునందె. 
                          నయము జయమును భయము విస్మయము గదుర
         
                    ఒక్క నిమేషం  లో ఫెళ్ళు,ఘల్లు, గుభిల్లు, ఝల్లు మనే థ్వన్యనుకరణ శబ్దాలతో   కవి నిర్వహించిన మహోత్కృష్ట కార్యం   సీతారామ కళ్యాణం. ఝల్లున కలిగిన పులకింత  జానకీ దేవి లో విస్మయాన్ని కల్గిస్తే, గుభిల్లు మన్న శబ్దం  నృపుల గుండెల్లో భయాన్ని రేకెత్తించింది. ఘల్లు మన్న గంటల  శబ్దం విజయానికి  ప్రతీక.
              
                  ఎడుత్తడు కండనర్ యిట్రదు కేట్టార్ “  రాముడు వింటిని పైకెత్తాడు. చూసారు. అది విరుగుట విన్నారు " అన్న కంబమహాకవి మాటలు ఎంత గంభీరం గా  ఆ రమణీయ దృశ్యాన్ని  వర్ణించాడో అంతకన్న గంభీర రమణీయం గా కరుణశ్రీ దర్శించారు.
                   
                   “ సిగ్గు బరువున శిరసు వంచినది ఒక్క 
                   సీత యే కాదు – సభ లోని క్షితి పతులును
                              
                    అంటారు కవి. సిగ్గుల మొగ్గయై, పెళ్లి కూతురౌనున్న జానకి సిగ్గుతో తలవంచుకోవడం  రమ్యం. ఒక్క సీతయే కాదు – సభలోని క్షితిపతులును,  “లును అంటూ సముచ్చయాన్ని వాడి సిగ్గు నింకా పొడిగించారు కవి. తలవంచుకున్న జానకి లో పెళ్లికళ కనబడితే  తలవంచిన రాజుల తెల్లని మొగాల్లో ప్రేతకళ కన్పించింది.
               
                చెల్లరే విల్లు విరచునే నల్లవాడు
                 పది పదారేండ్ల యెలరాచ పడుచు వాడు
                 సిగ్గు సిగ్గంచు లేచి గర్జించినారు
                 కనులు కుట్టిన తెల్లమొగాల వారు
       
              “నల్లవాని “  లో కన్పించిన శౌర్యం తెల్లమొగాలను ఇంకా తెల్లబడ చేసింది. లక్ష్మి వంటి సీతామహాలక్ష్మి విజయలక్ష్మి తో శ్యామలాంగునకు గృహలక్ష్మి అయింది. భరత జనయిత్రి ప్రేమ భాష్పాలలోన  సీతమ్మ పెండ్లి అతి వైభవం గా జరిగింది. 
                                
       
                 
                                 సీతమ్మపెండ్లి ని మంజరీ ద్విపద  లో  గానం చేసిన రచయిత్రి శ్రీమతి మదమంచి అనంతమ్మ. ఇది తెలుగు లోగిళ్ళ లో వివాహ సమయంలో ముత్తైదువులు పాడే పెళ్లి పాట గా ప్రసిద్ధి.                                                         
      
       “  తెల్లని డేరాలు దింపికట్టారు          పాగాల మొనగాళ్ళు బయలుదేరారు
        కళ్ళజోళ్ళ వాళ్ళు కదలివచ్చారు      ---- అంటూ కళ్ళజోళ్ల వాళ్ళని,”   బారుచొక్కాల వాళ్ళని      


                      సీతమ్మ  పెండ్లి కి తీసుకొచ్చింది ఈమె. అంతేకాదు బొణుకు బొణుకు న పునక పేర్లు మ్రోగుతుండగా  రావణుడు కూడ సీతాస్వయంవరానికి వచ్చాడు.పదితలల గదలించి, పరకాయించి చూచి  విల్లందుకున్నాడు. ఎక్కుపెట్టలేక ముందుకు పడ్డాడు. పరిషదాలయము పకపక నవ్వేసరికి మన్నుమేసిన తల ల్మరి యెత్తకుండ        చుర చుర నిప్పులు కురియ గా చూశాడట రావణుడు.
                 
               ఆనంద రామాయణం లో సీతా స్వయంవరానికి రావణుడు  వచ్చినట్లు వ్రాయబడితే మహా రామాయణం లో రావణుడు  జనకుని తో ప్రగల్భాలు పలకడం విశదం గా వర్ణించబడింది. కాని ఇందులోమాత్రం రచయిత్రి  “ మన్నుమేసిన తలలు మరి యెత్తకుండ రావణుడు—పాశు పతంబు పరమ దైవతము  విరువంగ  పాపమో వెంగళులారా అంటూ సభాభవనం నుండి తప్పుకున్నాడు.
                 
                    అనంతరం  నూనూగుమాసాల నూత్న యౌవనుడు ,పుంసాం మోహనరూపుడు నైన  శ్రీ రాముడు ప్రత్యాలీఢ పాదుడై ధనుస్సు నెక్కుపెట్టాడు.
            
                       “   వరదగూడువలె వంచి పట్టాడు  >     బాణము సంథించి  పట్టువదిలాడు
                           దిర్దిర తిరిగి భూదేవి కంపిల్లి     >       దిగ్గజంబులెల్ల  మ్రొగ్గ బడిపోయె
                            పవనుడును కాసేపు బంధించి పోయె  …………………………….
           
                ప్రకృతి చలించింది. భూమి కంపించింది. దిగ్గజాలు మొగ్గలు వేశాయి. గాలి స్థంభించి పోయింది. విల్లు విరిగి , రెండు వల్లల పడిపోయింది.పుష్ప వృష్టి కురిసింది.
              
              సర్థారు దశరథస్వామి  కొడుకనిరి    >     వీని గన్నతల్లి వీరమాతనిరి
               బంగారు బొజ్జ యీ పాపాయి దనిరి    >  సీతకు తగినట్టి చిన్నవాడనిరి
                     
             అనేకవిథాలుగా పొగడుతూ  వెళ్ళిన  ప్రజలు ఊళ్లోకి వెళ్లి ఊదేశారు. మిథిలానగరమంతా మిలమిల లాడి పోయింది.
         
            “ రత్నతోరణముల రచియించినారు    >   బంగారుటరదులు బాతించినారు
           నీలంపుటరుగులు నిర్మించినారు     >  కస్తూరి కలయంపి కలయంగ జల్లి
           ముత్యాల పొడితోడ  ముగ్గులిడినారు...........

             జానకి ముస్తాబు పూర్తయిన వెనుక, యాజ్ఞవల్క్యమహర్షి యాజమాన్యం లో,ముందుగ కత్తికి కంకణం కట్టి,తరువాత శుభలగ్నంలో మాంగల్యథారణ పూర్తి చేయించారు .
         
                   ముత్యాల తలబ్రాలు ముగుద వోసినది. >   రామయ్య వోశాడు రతనాల బ్రాలు
                  జగతి లో చూడమీ సంబరం బనగ    >  చేసినారలు నాడు సీతమ్మ పెండ్లి
         
                 పెళ్లి ముచ్చట తీరాక వథూవరులు  పొన్నవాహనమంత పల్లకీ లో ఊరేగింపుకు బయలుదేరితే మిథిలాపురమంతా మేడలెక్కి చూసింది. చూసిన వారంతా   “ తగిన మగడే దొరకె థర్మదేవతకు,  రతనాలజీబు మా రామయ్య బాబు అని మెచ్చుకున్నారట. మామగారు జనకుడు కొన్నిజాంగలాల ను  అల్లుడికి చదివించారు.  జానకికి ఏడువారాల  సొమ్ములిచ్చి, పసుపుకుంకుమ క్రింద కొన్ని పట్టణాలనిచ్చి సాగ నంపారట. తెలుగునాట సంప్రదాయాలను రచయిత్రి ఇక్కడ గొప్పగా పాటిస్తుంది. 
              
                  ఆనాడే కాదు సీతారాముల కళ్యాణాన్ని ఏ నాడైనా సంబరంగానే చేస్తారు తెలుగువారు. కోలాటాలు, చెక్కభజనలతో ఊరూరా సంబరాలు  అంబరాన్నంటుతాయి. ఈ లోకానికే మాతాపితరులు సీతారాములు.  మరి వారి కళ్యాణం లోక కళ్యాణమే కదా . లోకాస్సమస్తా స్సుఖినో భవంతు. అందుకే ..
                    
                     మైథిల్యా నగరే వివాహసమయే కళ్యాణ వేద్యాంతరే
                      సామోదే విమలేందు రత్నఖచితే పీఠే వసంతం శుభే
                      శ్రుణ్వంతౌ నిగమాంత తత్త్వవిదుషాం ఆశీర్గిర స్సాదరం
                      పాయా స్తం సు వధూవరౌ రఘుపతి శ్శ్రీ జానకీజాని2నిశం       
          
                   ----  అంటోంది  శ్రీరామ కర్ణామృతం.





No comments: