Friday, 7 October 2016

శతకసౌరభాలు -9 పురుషోత్తమ కవి - శ్రీకాకుళ ఆంథ్రనాయక శతకము-9

శతకసౌరభాలు -9

కాసుల పురుషోత్తమ కవి     
 శ్రీకాకుళ ఆంథ్రనాయక శతకము-9


                                       


                                           శ్రీకాకుళ ఆలయ రాజగోపురము


                                           మొసలిఁ బెట్టిన కస్తి మొఱ్ఱ బెట్టిన హస్తి
రక్కరించితి నన్నరమ్య మేమి?
తులువ పల్వురిలోన వలువ విప్పంగ జాన
సిగ్గుఁ గాచితి నన్నపగ్గె యేమి?
బలువు శాపముచేత బండపాఱిననాఁతి
ఱంకుఁ బాపితి నన్న బింక మేమి?
పెద్ద మోదిన భీతి బెగడి వచ్చినకోఁతి
                                                కండ జేసితి నన్న యంద మేమి?
భవభయంబున నిన్నెంత ప్రస్తుతింపఁ
గరుణఁ జేపట్ట లేని నీ ఘనత యేమి?
చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ !
                                                హత విమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ!     79

                           ఆంధ్రదేవా !         మొసలి చేత పీడించబడుతున్న గజేంద్రుని మొఱ విని రక్షించాననడం లో గొప్పతనమేముంది ?    ఒక దుర్మార్గుడు  పదుగురిలో తనను వివస్త్ర ను చేసి అవమానించబోయిన వేళ ఆమెకు వలువలిచ్చి కాపాడానని చెప్పడం లో కొత్తదనమేముంది ? శాపం వలన రాయి గా మారిన ఒక అబల జీవితాన్ని ఉద్ధరించాననడం లో పౌరుషమేముంది ? అన్న వెంటబడి తఱుమగా పాఱిపోయి వచ్చిన కోతికి రక్షణ కల్గించాననడం లో అందమేముంది ? ఇవన్నీ గొప్పపనులు గా మేము భావించడం లేదు. ఎందుకంటే   మమ్మల్ని ఈ సంసారకూపం నుండి బయటకు లాగి కాపాడమని  నిన్ను  మేమెంతగా  ప్రార్ధించినను మామీద ఏ మాత్రం దయచూపించని  నీ గొప్పతనం ఎందుకు?


                                            నీచు వాసనచేత నీటిలో నుండుట
యెక్కువప్పులను రా యెత్తుకొనుట
కడుపాఁకటికిఁ దుంగకాయలు మెక్కుట
యని నోరు దెఱచి పెల్లఱచుచుంట
సిరి గల్గి బిచ్చపుఁ జిప్పఁ జేపట్టుట
చేకత్తి పరరాజుచేతి కిడుట
పట్టణ  ప్రజకుఁ జెప్పక పాఱిపోవుట
కలు ద్రావి నిను నీవె దెలియకుంట
మ్రానువై యుంట గుఱ్ఱపుమనిసి వంట
పుడమి నాడిక సేయక విడువ నిన్ను
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !                      
                                              హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!    80

                                     శ్రీకాకుళాంధ్రదేవ!    అసలు నీ గొప్పతనమేమిటి ? నీవు చేసిన గొప్పపనులేమిటి ? నీచు కంపు కొట్టుకుంటూ నీళ్ళ లో ఉండటం ,( మత్స్యావతారం)  ఎక్కువ నీటిలో ఉన్న కొండను మోయడం (కూర్మావతారం )  అంటే నీళ్లు ఎక్కువగా ఉండటం వలన  నీళ్ల లో ఉన్న బరువైన రాయి కూడా తేలికగా అన్పిస్తుంది కదా.  అందువల్ల నీళ్ళ లో  తేలుతున్న కొండను మోయడం తేలిక యని వ్యంగ్యం. కడుపు మంట చల్లార్చుకోవడానికి తుంగముస్తెలు తిని బతకడం ,( వరాహావతారం ) యుద్ధం లో  పెద్ద  నోరేసుకొని  పెద్ద పెద్ద గా  అరవడం , ( నరసింహావతారం ) లక్ష్మి ఉండి కూడ బిచ్చమడుక్కోవడం , ( వామనావతారం ) చేతిలోని ఆయుధాన్ని శతృవుకు అందివ్వడం (పరశురామావతారం ) నువ్వే కావాలని  కోరుకుంటున్న  పుర ప్రజలకు చెప్పకుండా రాజ్యం వదిలి పారిపోవడం ( రామావతారం )  కల్లు తాగి నిన్ను నీవే మర్చిపోయేటట్లు ప్రవర్తించడం ,  (బలరామావతారం ) బోధి వృక్షం చెంత జ్ఞానాన్ని పొంది  మ్రాను లాగ  ఉండటం ,( బుద్ధావతారం) ఇటువంటి నీ వేషాలన్నీ మేము చూశాము. ఇప్పుడిక  కల్కిరూపుడవై గుఱ్ఱాన్ని ఎక్కి వస్తావంట.   ఈ భూమి మీద నిన్ను అవహేళన చేసి, నీ గుట్టు రట్టు చేయక మానను . నిన్ను ఆడిక చేయక విడిచి పెట్టను . నామాట నిజము.

                                               ఖరు నాజిలోఁ జొచ్చి శర ముచ్చి పో నేయ
వెనుకకు లంఘించి వెఱచె ననిరి
యనిఁ బాఱునో కోఁతి యని మ్రానిమాటున
నేయ వాలినిఁ బొంచి యేసె ననిరి
గరుడధ్వజుం డన్న గురుతుఁ దెల్పుట కున్న
బలభీతి శస్త్రాహి బద్ధుఁ డనిరి
బలినిఁ జంపఁగ రాని వరమున యాచింప
వృత్తి నాతని భిక్ష మెత్తె ననిరి
యశ మదెంతొ ప్రయాస లభ్యంబె కాని
యెంతలో వచ్చు నపకీర్తి యెఱుఁగ వేమి
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
                      హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!            81
                           


                                    ఆంధ్రదేవా ! యుద్ధరంగం లో రాక్షసుడైన ఖరుని పై బాణాన్ని ప్రయోగించడానికి ఆలీఢ పాదుడ వౌచు  వెనకడుగు  వేయగా చూచిన వారు నీవు యుద్ధరంగం నుండి తప్పుకొంటున్నావని పారిపోతున్నావని భావించారు.  యుద్ధరంగంనుండి పాఱిపోతాడేమో నని చెట్టు చాటు నుండి బాణం వేసి వాలిని చంపితే దొంగచాటు గా చంపావని నిన్ను ఆడిపోసుకుంటున్నారు. నీవు గరుడధ్వజత్వాన్ని తెలియజేయడానికి   ఇంద్రజిత్తు వేసిన నాగాస్త్రానికి కట్టుబడితే నీవు నాగపాశ బద్దుడవయ్యావని చెప్పుకున్నారు.  బలిచక్రవర్తి ని సంహరించడానికి వీలు లేని వరములుండుట వలన   యాచకునిగా అతని చెంతకు వెడితే  యాచకవృత్తిని ఆశ్రయించావని నిన్ను  హేళన చేస్తున్నారు. చూశావా ! కీర్తిని సంపాదించడం  మిక్కిలి ప్రయాస తో కూడింది కాని అపకీర్తి ని పొందడానికి అరక్షణం పట్టదు కదా. ఈ మాత్రం తెలుసుకోలేక పోయావు స్వామీ !


                   ఆంజనేయుని కుడ్యశిల్పం



   ఘోర కబంధు దీర్ఘోరుదోర్దండముల్‌
 తరిగి వచ్చిన మాట తథ్య మేని
పంఙ్క్తి    కంఠాత్మజ ఫణిరాజ బంధమో
 చనుఁడ వై వచ్చుట సత్యమేని
మైరావణాభేద్య కారాగృహముఁ గూల్చి
 బ్రదికి వచ్చినపల్కు భద్రమేని
మారీచు దుస్తర మాయా భ్రమతఁ బాసి
 విజయ మొందిన సుద్ధి నిజమ యేని
కలిత రాజోపచార భోగములఁ గీర్తి
శాలి వై యిందు మెఱయుట సాక్షి జగతి
చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ !
హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!     82

                      ఓ శ్రీకాకుళాంధ్రదేవా!   ఆనాడు నీవు కబంధుని  చేతులను నఱికిన మాట నిజమైతే , ఇంద్రజిత్తు ప్రయోగించిన నాగబంధము నుండి బయటపడిన మాట యధార్ధమైతే , మైరావణుని అభేద్యమైన  కారాగృహమునుండి వ బ్రతికి బయట పడ్డమాట సత్యమైతే , మారీచుని మాయ నుండి  బయటపడి వానిని చంపిన మాట నిజమైతే , ఈ శ్రీకాకుళము నందలి నీ ఆలయం లో నీవు రాజోపచార భోగము లతో , కీర్తిశాలి వై మా సేవ లందు కొనుటయే   సాక్ష్యము . లేనిచో పై వన్నియు అబద్దాలని అనుకోవలసి వస్తుంది  స్వామీ !

                                            నీ శాంతి యంభోధి నిర్భరాంబువులు బా
ణముఖంబునకుఁ దెచ్చు నాఁడె తెలిసె
నీ కోప మరి రావణైకానుజన్ము నా
నగరి రాజుగఁ జేయు నాఁడె తెలిసె
నీ కీర్తి కపటదుర్నీతుఁడౌ ద్వాంక్షదా
నవు తప్పుఁ గాచిన నాఁడె తెలిసె
నీ యభిజ్ఞత యవినిందిత నీతన్వి
నగ్నినిఁ జొరు మన్న యపుడె తెలిసె
నెంచరాని గుణాఢ్యుఁడ వీవె యనుచుఁ
దెలిసి మ్రొక్కెద నితర మౌ దిక్కు లేక
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!        83

                              ఆంధ్రదేవా ! నీవు బాణమును ఎక్కుపెట్టి సముద్రాన్ని  ఇంకించినప్పుడే నీవెంత శాంతమూర్తివో మాకు అర్ధమైంది. శతృవైన రావణుని తమ్ముని లంకానగరానికి రాజుని చేసినప్పుడే నీవెంత కోపిష్టివో మాకు అవగతమైంది. దుష్ర్పవర్తకుడైన కాకాసురుని క్షమించిన నాడే నీకీర్తి తేటతెల్లమైంది. నిష్కళంక యైన మా తల్లి  సీతమ్మ ను అగ్ని లో ప్రవేశించమన్నప్పుడే నీవెంత తెలివిగలవాడవో మా కర్ధమైంది.  నీవు  పొగడదగని గుణములు కలవాడవని తెలిసి కూడ మాకు వేరు దిక్కులేక నిన్నాశ్రయించి నీకు నమస్కారాలు చేస్తున్నాము స్వామీ !


                                           జనకు వాక్యమున రాజ్యవిసర్జనమె కాని
యడరు శౌర్య మొకింత విడిచినావె?
దీక్ష నాభరణము ల్దివియు మాత్రమె కాని
వర ధనుర్బాణము ల్వదలినావె?
వ్రత మని కాంచనాంబరముఁ గట్టవు గాని
బిగువు వజ్రాంగి మై విడచినావె?
ప్రతినఁ బరార్థమే మితర మొల్లవు గాని
యభిమాన ధనముపై నలిగినావె?
నిఖిల రక్షోవిదారణ నిర్భయాంక
వేషధారివి నీ మునివృత్తి యేమి?
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !
                                       హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!                         84

                       శ్రీకాకుళాంధ్రదేవ !  తండ్రి మాటకు కట్టుబడి రాజ్యాన్ని త్యజించావు కాని  శౌర్యాన్ని   ఇసుమంత కూడ విడిచి పెట్ట లేదు కదా!  వనచర నియమానికి  కట్టుబడి ఆభరణాలను తీసివేశావు కాని ధనుర్బాణాలను వదిలి పెట్టలేదు కదా ! వనవాసదీక్ష లో నుండుటవలన పట్టుపీతాంబరాలను ధరించ లేదు కాని వజ్రమయ కవచాన్ని మాత్రం వదిలిపెట్టలేదు కదా !   ప్రతిజ్ఞానుసారం ఇతర పదార్ధములు వేటినీ అంగీకరించవు కాని అభిమాన ధనమును మాత్రము విడిచ పెట్టలేదు కదా !  సమస్త రాక్షస సంహారం కోసం మాయావేష ధారివయ్యావు  .  లేకపోతే నీకు  ముని జీవితం ఏమిటి ?               





ఆలయ ప్రాంగణం లోని ఆముక్తమాల్యదా మండపము


 వెఱపించఁ గలవొ చే విలు నీ కొసంగి తా
విగతరోషుం డైన విప్రవరునిఁ
గట్టించఁ గలవొ సాగరముపై సేతువు
మలలఁ గోఁతులమూక లలరఁ బట్టి
ఘనత నీఁ గలవొ యన్నను గొట్టి తమ్మున
కారాజ్య మా చంద్రతారకముగ
వేంచేయఁ గలవొ విన్వీథిఁ దేరగ నున్న
పుష్పకం బెక్కి నీపురికి మరల
జగతి నిటు సంతతోత్సాహచరణమునకు
యుక్తి సేయుదు వోహొ నీ శక్తి దెలిసె
చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ !
హత విమతజీవ  ! శ్రీకాకుళాంధ్రదేవ!       85

                          ఆంధ్రదేవా ! ఆ  బ్రాహ్మణుడు కోపాన్ని వదిలి  తన ధనస్సు ను నీ చేతికివ్వకపోతే పరశురాముని నీవు ఓడించగలిగే వాడివేనా ? ఆ కోతిమూకలు నీకు  సేవకులు కాకపోతే బండరాళ్ళ సముద్రం మీద వారధి ని నిర్మించగలిగేవాడవా ? చెట్టుచాటునుండి అన్నను చంపకపోతే సుగ్రీవునకు రాజ్యాన్ని ఇవ్వగలిగేవాడివేనా ? తేరగా పుష్పక విమానం లభించింది కాబట్టి ఆకాశమార్గం లో అయోథ్యా నగరానికి చేరుకున్నావు కాని లేకపోతే ఆకాశ గమనం నీకు సాథ్యమయ్యేది కాదు గదా ? ఇదంతా చూస్తుంటే ఎల్లప్పుడు నీ ప్రయత్నాలు ఫలించడానికి ఏదో ఒక ఉపాయం తో నెట్టుకొస్తావనిపిస్తోంది. నీ శక్తి  ఎంతటిదో మాకు తెలిసిందిలే స్వామీ !


ని న్నెదుర్కొన రాని నెపమునఁ గోపించి
గోపిత హితు సూతుఁ గొట్టవలెనె?
సంబంధి నోటఁ గొంచెపు మాట రా వాని
కరిపురం బలుకఁ బెకల్పవలెనె?
నిను జూచి వేడ్క నొందిన గర్వముగ నెంచి
నిండి పాఱెడు నీరు నిలుపవలెనె?
చెలికానివలె నొద్దఁ చేరి యెత్తుకొనంగఁ
గినుకఁ ప్రలంబునిఁ దునుమవలెనె?
ఎంతరోసంబు గలవాఁడ వేమి నీవు
తెలివికాఁడవె బలరామ! తెలిసె నిందు
చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ !
                                      హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!                                       86


                            శ్రీకాకుళాంధ్రదేవ!     బలరామ రూపా ! నిన్ను సేవించడానికి ఎదురు రానంత మాత్రాన  సూతమహర్షిని  కుశాగ్రము చేత చంపేస్తావా ?  దుర్యోధనుడు  నోరు జారి  సాంబుని వివాహసమయం లో కొంచెం పరుషంగా మాట్లాడగానే  బంధువని కూడ చూడకుండా అతని రాజధానియైన హస్తినాపురాన్ని గంగలో కలపడానికి పూనుకుంటావా నిన్ను చూసిన ఆనందం లో పొంగి పొర్లుతున్న్న యమునానదిని   చూచి , గర్వించి ప్రవర్తిస్తోందని భావించి  నిరోధిస్తావా ?     స్నేహితుని వలే భావించి  చెంత చేరి నిన్ను భుజాలపై కెత్తుకున్న ప్రలంబాసురుని కోపంతో చంపివేశావు కదా ?    వీటి వలన  నీవెంత రోషగాడివో మాకు అర్ధమౌతోంది. నీవేమైనా తెలివి గలవాడ ననుకుంటున్నావా బలరామా !                 

                    పై పద్యాలలో  రామ కృష్ణ అవతార విశేషాలను ప్రస్తావిస్తూ వచ్చిన కవి ఈ పద్యం లో  బలరామా! అని సంబోధించి మరీ ఆయన చేసిన  వీరోచిత కార్యాలను ప్రస్తావిస్తున్నాడు.

                     మొదటిది సూత సంహారము  ఇవి మహాభాగవతం లోని వృత్తాంతములు.
                                          తీర్థయాత్రలు చేస్తూ బలరాముడు నైమిశారణ్యానికి చేరుకున్నాడు. అక్కడున్న మునులందరూ ఈతనిని చూచి , గౌరవం తో ఎదురొచ్చి  ఆదరించారు. సూతమహర్షి మాత్రం కూర్చున్నచోటు నుంచి లేవలేదు. కోపించిన బలరాముడు అతనిని దర్భతో కొట్టగానే అతను మరణించాడు.

                      రెండవది హస్తినను గంగలో కలుపుట.

               దుర్యోధనుని కుమార్తె యైన లక్ష్మణ ను సాంబుడు తన రథము పై ఉంచుకొని తీసుకు పోతుంటే కౌరవవీరులు అతన్ని అడ్డగించి ,బంధించి , హస్తినాపురం లో ఉంచారు. అది తెలుసుకున్న బలరాముడు వచ్చి సాంబుని విడువమని చెప్పగా , దుర్యోధనుడు బలరామాదుల తోడి సంబంధము పాదుకలు తీసి తలపై నుంచుకొన్నట్లున్నదని పలికెను . దానితో కోపించిన బలరాముడు హస్తినను గంగ లో కలిపెదనని తన ఆయుధమైన నాగలి తో నేలను దట్టించాడు. ఒక్కసారిగ్  నగరమంతా  పడవ వలే అల్లల్లాడి పోయినది . ఇది తెలుసుకున్న భీష్మాదులు బలరాముని శాంతింప జేసి  లక్ష్మణ , సాంబులను విడిపించి పంపిస్తారు.

                            మూడవది యమునా నది ని నిరోధించుట.

                    ఇది కూడ భాగవతపురాణము లోనిదే. కొద్దిగా మార్పుంది.

                          ఒకమారు బలరాముడు  గోపికలతో కలసి యమునానదికి స్నానానికి వెళ్లాడు.  బలరాముని చూచి  ఆనందం తో పొంగిపోయిన యమునానదిని చూచి గర్వం తో పొంగుతోందని భావించి ఆమెను  తన హలము తో నిరోధించాడు. యమున స్త్రీ రూపం లో వచ్చి  వినీల వస్త్రాది కానుకలను సమర్పించి బలరాముని  ప్రసన్నుని చేసుకొంది.

                      నాల్గవది ప్రలంబాసుర వథ. భాగవతం లోను, విష్ణుపురాణం లోను ఈ వృత్తాంతం కన్పిస్తుంది.
                  బలరామకృష్ణు లిరువురు రేపల్లె లో గోపాలుర తో కలసి గోవులను మేపుతూ విహరించే సమయం లో ప్రలంబాసురుడనే రాక్షసుడు గోపబాలుని వేషం లో  మందలో కలిసి , బలరాముని తన భుజాలపై మోసుకొని  ఆకాశం లోకి ఎగిరాడు. అప్పుడు బలరాముడు తన బరువుచే  వానిని  భూమిపై పడవేసి , తలను బ్రద్దలు చేసి వానిని సంహరించాడు. 

                           అంత బలశాలి కాబట్టే ఈతనిని బలరాముడు అని పిలుస్తారు. తేడా తెలీయడం కోసం పరశువు ధరించిన వాడు పరశు రాముడు అని, కోదండాన్ని ధరించిన వాడు కోదండరామముడు  అని పిలుస్తున్నారు.


                                              
                                         సకల వర్ణంబులు సంకరంబులు జేసి
యఖిల ధర్మములు శూన్యములు సేసి
భూతలంబును బాప భూయిష్ఠముగఁ సేసి
పరగఁ బ్రపంచంబు భ్రష్టు సేసి
కలి విజృంభించిన కడపటనా నీవు
తురగవాహనుఁడ వై దోర్విరాజి
ఖడ్గచంచద్ధారఁ గలుషాత్ముల వధించి
శిష్టసంరక్షణ సేయు టెల్ల
ననిశము చరాచరాది జీవావనైక
జాగరూకుండవా నీవు జాగు దెలిసె
చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ!
హత విమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ!   87

                       


                               ఆంధ్రదేవా ! సకల కులాలు సంకరం జరిగి ,సర్వధర్మాలు నాశనమై పోయి , భూలోకమంతా పాపభూయిష్టం చేసి, లోకాన్నంతటినీ భ్రష్టుపట్టించి  కలి పురుషుడు విజృభించిన తరువాత  నీవు కత్తి పట్టుకొని గుఱ్ఱాన్ని ఎక్కి వచ్చి దుష్టసంహారం చేసి , సజ్జనులను సంరక్షిస్తావా ? రాత్రింబగళ్ళు సమస్త చరాచర జీవరాశులను  అత్యత జాగరూకతతో కాపాడటమంటే ఇదేనా. నీ జాగు ( ఆలస్యము) మాకు తెలిసిందిలే.  సకలము నాశనమైన తర్వాత , సర్వము భ్రష్టమైన తరువాత  నీవొచ్చి ఉద్ధరించేదేమిటి? సంరక్షించేదేమిటి?

   
                                                                                                               -----        పదవభాగం త్వరలో





  *************   ******       **************************************