చివరి ప్రకరణం
నతవాడి సీమ లో వివిధ
మతాల ప్రభావ ప్రాభవాలు.
నతవాడి సీమ లో బౌద్ధ ,జైన శైవమతాలు ఆయా కాలాల్లో తమ విశ్వరూపాన్ని ప్రదర్శించాయి. ఏటూరు లో లభించిన జైన విగ్రహం ఈ ప్రాంతం లో విశేషం గా ప్రచారమై, ప్రసిద్దికెక్కిన జైనమతానికి ప్రత్యక్ష నిదర్శనం. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు పాడు అనే పదం జైన మత ప్రభావ గ్రామాలకు చివర్లో వస్తుందని గుర్తుచేసుకుంటే చింతలపాడు ,చందర్లపాడు, బొబ్బిళ్ళపాడు, తక్కెళ్లపాడు, విభరింతలపాడు, ముండ్లపాడు,ధర్మవరప్పాడు, శనగపాడు, కాండ్రపాడు,లింగాలపాడు , ఇవన్నీ నందిగామ,చందర్లపాడు మండల పరిధి లోని గ్రామాలే. మునుల ఏరు అనేదే మునేరు అయ్యిందని విజ్ఞుల అభిభాషణ.
ఏటూరు లో లభించిన జైన విగ్రహం వర్ధమాన మహావీరుని ది గా గుర్తించబడింది. ఈ విగ్రహాన్ని బుద్దవిగ్రహం గా స్ధానికులు భావించారు . పాటిమట్టి దిబ్బల్లో శిరస్సు, మొండెము వేరు వేరు గా దొరికిన విగ్రహాన్ని ఒకటి చేసి హైస్కూలు ఆవరణ లో దిమ్మకట్టి దానిపై ప్రతిష్టించారు గ్రామస్దులు.ఐదడుగుల పదంగుళాల ఎత్తైన పీఠం మీద నాలుగడుగు
-95-
ఎత్తుగల్గి స్ధిరాసనం లో కూర్చొన్న వర్ధమాన మహా వీరుని ఈ విగ్రహాన్ని చూచి బుద్దవిగ్రహం గా భ్రాంతి పడ్డారు స్థానికులు. కాని కృష్ణాగెజిట్ లోని 235 వపేజి ఈ సందేహాలకు సమాధాన మిస్తుంది. విశాలమైన నేత్రాలతో ముంగురులు కల్గిన జుట్టుముడి, విశాలమైన వక్షస్థలాన్ని కప్పుతూ వల్లెవాటు , ఎడమ చేతి లో కుడిచేతిని అరచెయ్యి పైకి కనబడేటట్లు ఉంచి, శిరస్సు చుట్టు పరివేషము తో స్థిరాసనం లో కూర్చొన్న ఈ మూర్తి యొక్క డిచేయి బొటన వ్రేలు ,ఎడమ చేయి కొంతభాగము విరిగిపోయాయి. నల్లరాతి విగ్రహము తల ,మొండెము వేరువేరు గా లభిస్తే వాటిని ఒకచోటికి చేర్చారట గ్రామస్థులు. విగ్రహం అరచేతులు పాదాలపై చక్రాచిహ్నాలు చెక్కబడ్డాయి. ఇది జైనమత సాంప్రదాయం.
ఇక బౌద్ధమత విషయానికొస్తే – జగ్గయ్యపేట ,రామిరెడ్డిపల్లి బౌద్ధస్తూపాలు చరిత్ర ప్రసిద్ది గన్నవే. జగ్గయ్యపేట బౌద్ధస్తూపం అమరావతీ స్తూప నమూనా లో నిర్మించబడ్డ అద్భుత కట్టడం. బౌదస్తూపాలను వాటిలక్షణాలను బట్టి మూడు రకాలు గా విభజించారు.
1. శరీరక స్తూపాలు. 2.పారభోగిక స్తూపాలు. 3.ఉద్దేశిత స్తూపాలు.
శరీరక స్తూపాల్లో బుద్ధధాతువుల్ని నిక్షేపిస్తారు.పారభోగిక స్తూపాల్లో బుద్ధ సంబంధ మైన వస్తు విశేషాలను నిక్షేపిస్తారు. ఉద్దేశితస్తూపాలు బుద్ధుని ఉనికి చేత పవిత్రమైన స్థల నిర్మాణాలు. వీనిలో జగ్గయ్యపేట స్తూపం పారభోగిక స్తూపం గా చరిత్రకారులచేత గుర్తించబడింది.రామిరెడ్డిపల్లి బౌద్ధచైత్యం తవ్వకాలలో వెలుగుచూసింది. ఇది మహాచైత్యం గా గుర్తించబడింది. ఇచ్చటి తవ్వకాలలో 22కారట్లకంఠహారం లభించింది. ధర్మవరప్పాడు ,బూదవాడ , పోలంపల్లి, మునగచర్ల బౌద్ధమత శిథిలాలు లభించిన ప్రదేశాలే.
శైవమతం ఈ ప్రాంతం లో పాదూనుకొని నిల్చి అన్యమతాలను త్రోసిరాజంది.చాగిపోతరాజు ముక్త్యాల లో ముక్తేశ్వరుని ప్రతిష్టించి.ఉత్తరవాహిని యైన కృష్ణాతీరం లో శైవమతాన్ని
-96-
రక్షించాడు.శైవ వైష్ణవక్షేత్రాలైన ముక్త్యాల వేదాద్రి బౌద్దమతాన్ని ఈ ప్రాంతాన్నుంచి పారద్రోల యత్నించాయి. ఈ రెండు పుణ్యక్షేత్రాలకు కేవలం రెండు మూడు కిలోమీటర్ల దూరం లోనే ధనంబోడు గా పిలువబడే జగ్గయ్యపేట బౌద్ధస్తూపం ఉంది. గుడిమెట్ట లో విశ్వేశ్వర దేవ ప్రతిష్ట మొదటి పోతరాజుది. ఈ నాటిక ఇక్కడ కొండపైన శివాలయం పునర్నిర్మించబడి భక్తులచే సేవించబడుతోంది. అంతేకాదు .కాండ్రపాడు పాటిమట్టి దిబ్బల్లో వెలుగు చూసిన పంచముఖ శివలింగం ఈ ప్రాంతం లో పరిఢవిల్లిన శైవమతోద్యమానికి ఎగురేసిన విజయపతాక.
ఈ విధమైన విశిష్ట శివలింగం చిత్తూరు జిల్లాలోని (ఒకప్పటి మద్రాసురాష్ట్రం) గుడిమల్లం అనే గ్రామం లో కన్పిస్తోంది. ఐదడుగుల ఎత్తుగల ఈ శివలింగం మీద పరశువు ధరించిన మూర్తి చెక్కబడింది. పూర్తి వివరాలకోసం “DIVYAKSHETRALU.BLOGSPOT.COM ” గుడిమల్లం వ్యాసాన్ని చూడవచ్చు.
ఇక నతవాడి సీమ లో మున్నలూరు నుండి మునగానపల్లి వరకు ప్రతిఊరు లోను ఒక ప్రాచీన శివాలయం కన్పిస్తుంది. అంతేకాదు పంచనారసింహక్షేత్రమైన వేదాద్రి లోనే పంచ శివలింగప్రతిష్ట జరిగి పూజలు నిర్వహించబడ్డాయంటే ఇచ్చట శైవమత ప్రాబల్యాన్ని మనం గమనించవచ్చు. ఇచ్చటి ముప్పాళ రామేశ్వరుని నుండి మునగానపల్లి భీమేశ్వరుని వరకు చాగి వారిచ్చిన, వేయించిన దానశాసనాలన్నీ శివార్పణాలు గా శివాలయాలోనే ఎక్కువ కన్పిస్తాయి.. వేదాద్రి మాత్రం దీనికి కొంచెం భిన్నంగా కన్పిస్తోంది. అలాగే మాగల్లు వేణుగోపాలస్వామి మండపం లోని శాసనం. వేదాద్రి లో మనుమచాగి గణపతి దేవుడు వేయించిన దాన శాసనం లో అతను ప్రతాప నరసింహదేవరకు ఇచ్చిన భూదాన ప్రసక్తి ఉంది. శివుడైనా, చెన్నకేశవుడైనా సమానం గా ఆరాధించగల మతసామరస్యం అనంతర కాలం లో అలవడింది.
పెనుగంచి ప్రోలు నంది ఆనాటి కాకతీయుల శివభక్తి కి ప్రతీక. కాకతీయ సామంతులు గా చాగివారు నిర్మించిన
-97-
శివాలయ అవశేషమే ఈనాడు పెద్దబజారు లో కన్పించే మసీదు. చాగిరాజులు శైవులైనా వైష్ణవమతాన్ని సైతం సమానం గా గౌరవించారు. గుడిమెట్ట చోడనారాయణ ,మాగల్లు వేణుగోపాల , ముక్త్యాల చెన్నకేశవ , గుడిమెట్ట కృష్ణాతీరం లోని చెన్నకేశవ, ద్వారకగుడి శ్రీ వేంకటేశ్వర ఆలయాలు వీరికాలం లో నిర్మించబడ్డవే.
నూటొక్క శివాలయాలు నిర్మించిన రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు కట్టించిన ఆలయాల్లో నందిగామ శివాలయం కూడ ఒకటి. ఇచ్చట వేంకటాద్రి నాయుడు వ్యవసాయక్షేత్రాన్ని దున్నిస్తుంటే నాగటి కర్రు కి పెద్ద నంది విగ్రహం తగిలిందని , ఆ ప్రాంతాన్ని పూర్తి గా తవ్వించగా పెద్ద నంది విగ్రహం బయల్పడిందని, దానిని బయటకు తీయడం సాథ్యం కాకపోవడం తో ఆ ప్రాంతం లో శివాలయాన్ని నిర్మించి ,ఒక పెద్ద నంది ని ప్రతిష్ఠించారని , దాని మూలం గానే ఈ ప్రాంతానికి నందిగామ అని పేరు వచ్చిందని స్థానికుల కథనం . కాని 12 వ శతాబ్దం నాటి శాసనాల్లోనే నందిగామ ప్రస్తావన ఉంది. ఇచ్చటి ఆలయాల్లో చెన్నకేశవాలయం అతి ప్రాచీనమైంది. ఈ గుడిలోని ఘంట ప్రతాపరుద్రుని దానం గా చెప్తుంటారు. ఈ విధం గా నతవాడి సీమ త్రిమత సంగమ క్షేత్రం గా విరాజిల్లింది.
ఆధునిక చరిత్ర లోకి తొంగిచూస్తే – క్రీ.శ 1707 లో మొగలాయి చక్రవర్తి ఔరంగజేబు మరణించగానే దేశం లో హటాత్తు గా అరాచకం ప్రబలింది. ఆ సమయం లో నతవాడి సీమ లోని నందిగామ ప్రాంతం లో సర్వాయి పాపడు అనే బందిపోటు తన అనుచరగణం తో కలిసి జాతీయ రహదారి పై విచ్చలవిడిగా దోపిడీలు ప్రారంభించాడు. ఈతని అకృత్యాల వలన కొంతకాలం హైదరాబాదు- విజయవాడ జాతీయరహదారి మూసివేయబడింది. ఈ సమయం లో హైదరాబాదు నైజాం ప్రభుత్వం నుండి ముబరజఖాన్ అనే సైనికాధికారి పెద్ద సైన్యంతో వచ్చి కొంగరమల్లయ్య గట్టువద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో సర్వాయి పాపని తుదముట్టించినట్లు చరిత్ర చెపుతోంది.(కృ.గె..42 పే)
-98-
ఉపసంహారము
అనేక కాలాలుగా వివిధ సంస్కృతులను తనలో కలుపుకొని , చరిత్ర లో నిలబడ్డ రాజ్యం గుడిమెట్ట. చాగి వారు త్యాగి వారై తుదకు సాగివారు గా కొనసాగుతున్న సుదీర్ఘ చరిత్ర లో చాగి రాజ్యాన్ని శాసనాద్యాధారాల ద్వారా అక్షరాకృతి నందించడానికి చేసిన ప్రయత్నమిది.
ఈ విషయం లో ఇది తొలి ప్రయత్నమే కాబట్టి రాబోయే పరిశోధకులకు ఎంతో అవకాశం ఉంటుంది.
ఈ గ్రంథాన్ని ముద్రించకపోవడానికి కారణాన్ని తొలిపలుకు లోనే చెప్పుకున్నాను. ఆ ఆలోచన కూడ చేయడం లేదు. గడిచిన రెండు కృష్ణాపుష్కరాల్లోనూ ఈ పరిశోధనా గ్రంథం ఎంతోమందికి సహాయకారి గా ఉండి , కొంత ఆర్థిక , చారిత్రక ప్రయోజనాన్ని ఆ ప్రాంతానికి చేకూర్చింది. ఈ విషయాన్ని ఆ రంగం లో పనిచేసిన వారే చెబితే విని సంతోషించాను. ఇప్పటి వరకు వందలాది Xerox కాపీలు ప్రజాసేవకుల ,పత్రికావిలేఖరుల చరిత్ర అభిమానుల,పుస్తక ప్రియుల వద్ద కు చేరి అలరిస్తూనే ఉన్నాయి. కాని కొంతమంది పరిశోధక విద్యార్థులు దూర ప్రాంతాలనుండి ఆ పుస్తకం కాపీ కావాలని ఫోనుచెయ్యడం ,నేను ముద్రించలేదని చెప్పడం వారు నిరాశ కు లోనై , కనీసం బ్లాగు లో నైనా పెట్టమని ప్రాథేయపడటం ఈ మథ్య తరచుగా జరుగుతోంది. నా పూర్వ విద్యార్థి ఒకరు తన పరిశోధనా వ్యాసం లో ఈ పుస్తకాన్ని గురించి ఉటంకించాడని, అప్పటి నుండి తాను గ్రంథం కోసం ప్రయత్నిస్తూ ,చివరకు నా ఫోన్ నెంబరు పట్టుకొని సంప్రదించారు శ్రీశైలం నుండి ఒక సాహిత్యాభిమాని. ఆనాడు ఆ ఫోను వచ్చినప్పుడు నేను చెపుతున్న రొటీన్ సమాథానం వింటున్న నాప్రక్కనే ఉన్న ఒక ఆత్మీయుడు పోనీ . ముద్రించక పోయినా బ్లాగు లో
-99-
నైనా పెట్టవచ్చు కదా అంటూ ఒక మాట అంటించారు. వయసు తో పాటు కొన్ని అవలక్షణాలు కూడ వస్తాయి కదా. లౌకిక విషయాల మీద అనాసక్తి , నిస్పృహ వానిలో కొన్ని. అప్పుడు ఏ మూడ్ లో ఉన్నానో గాని ఆ ప్రయత్నం మొదలు పెట్టి... ఇప్పటికి పూర్తిచేసాను. ఇది ఏ కొద్ది మందికి ఉపయోగ పడ్డా సంతోషమే కదా. ఈ పేరా లో కొంతమంది పేర్లు ప్రస్తావించే అవసరం వచ్చినా దాన్ని దాటేశాను కారణం సహృదయులకు తెలుసు. కాలం అనంతమైంది.భూమండలం విశాలమైంది అన్నాడు మహాకవి భవభూతి. మహాకవులు, మంచి గ్రంథాలు ఈ భూమి పై నిరంతరంగా వస్తూనే ఉంటాయి.
**********************************************