Saturday, 18 May 2013

భాగవతం లో రామాయణం "పలికించెడు వాడు రామభద్రుండట"



భాగవతం లో రామాయణం                  
             


               “ పలికించెడు వాడు రామభద్రుండట”               
                     
                             
                   పోతన భాగవతం తెలుగువారికి అంది వచ్చిన ఆస్తి. మల్లెపూల పరిమళాలను, మామిడిరసాల తీయదనాన్ని భక్తి రసంలో కల బోసి భాగవతం గా  ఆంధ్రజాతి కందించి, ఆ  భక్తిరసాన్ని తన్మయం గా ఆస్వాదిస్తున్న తెలుగువారిని చూస్తూ, పై లోకాల్లో ఆనందిస్తున్న  శ్రీకైవల్య పద విహారి మహాకవి పోతన.
           
           " పలికెడితి భాగవతమట, పలికించెడు వాడు రామభద్రుండట, పలికిన భవహరమగునట "అంటూ  శ్రీకైవల్యపదం చేరడానికే భాగవతాన్ని వ్రాస్తున్నానని, అంతకుమించి ఏ కోరిక తనకు  లేదని అమాయకంగా చెప్పుకున్నాడు పోతన. నందాంగనాడింభకుడైన  భాగవత నాయకుని శ్రీకృష్ణుని  స్తుతిస్తూ, భాగవతానికి శ్రీకారం చుట్టాడు.కాని మనసులో మాత్రం రామకృష్ణ అద్వైతం తిష్ఠ వేసుకొని కూర్చుంది.శ్రీ కృష్ణుడైనా, శ్రీరాముడైనా  ఆ మహాకవి దృష్ఠిలో ఒక్కరే.
                               
                           


                     " నల్లని వాడు పద్మనయనంబుల వాడు, కృపారసంబు పై జల్లెడువాడు, మౌళి పరిసర్పిత పింఛము" వాడైన  శ్రీకృష్ణుడు,-- "నల్లనివాడు పద్మనయనంబుల వాడు మహాశుగంబులున్ విల్లును" దాల్చిన శ్రీరాముడు ఒకే రకం గా కన్పిస్తారు. అందుకే వ్రాసేది రామాయణం కాదు. కృష్ణచరితం. కాని పలికించే వాడు మాత్రం రామచంద్రుడట..అటువంటి భక్తకవి కి రామకథ వ్రాసే అవకాశమే వస్తే వదులుకుంటాడా.? అందుకే భాగవతం  నవమస్కంధంలో సూర్యవంశ వర్ణనా సందర్భం లో   శ్రీ రాముని ప్రస్తావన వచ్చింది. ఇంకేముంది. కవి కలం మురిసిపోయింది. కవి హృదయం రామభక్తి తో పొంగిపోయింది. భాగవతం లో రామకథ   శ్రీరామచరిత్ర గా కుదురుకు పోయింది. ఆ కథ  ఇది.
               
                                         ఆ దశరథునకు సుర ప్రార్థితుండై పరబ్రహ్మమయుండైన హరి నాల్గు విధంబులై  శ్రీరామ లక్ష్మణభరతశతృఘ్న నామంబుల నిజాంశ సంభూతుండై జన్మించె.దచ్చరిత్రంబు వాల్మీకి ప్రముఖులైన మునుల చేత వర్ణితంబైనది ; యైననుం జెప్పెద. అంటాడు పోతన. 

                      తెలుగులో ఐనా అనే మాటకు ఎంత బలం ఉందో తెలుగు వారికి తెలుసు. వాళ్లు చెప్పినా కూడ నేను చెపుతాను. అనడం లోనే ఆ విషయం మీద ఆ వ్యక్తి కి ఎంత అభిమానం , అభినివేశం ఉందో ,చెప్పాలనే ఆరాటం, పట్టుదల ఎంత బలం గా ఉందో మనకు అర్థమౌతుంది. అందుకే 104 గద్యపద్యాలతో రామకథ ను తన శైలిలో చెప్పేశాడు పోతన.  అందుకే మనం చదవాలి.
                         
                     తూర్పు దిక్కునకు  నిండు చంద్రుడు ఉదయించినట్లు ఉత్తమ ఇల్లాలైన కౌసల్యాదేవికి  రావణ  శిర స్సంఘాత సంఛేదన క్రమణోద్దాముడైన శ్రీరామచంద్రుడు  నారాయణాంశ తో జన్మించాడు. విశ్వామిత్రునితో వెళ్లి  మార్గమథ్యం లో తాటకను పరిమార్చి, ఘోర యుద్ధం లో సుబాహుని సంహరించి, కపటుడైన మారీచుని తరిమికొట్టి యాగసంరక్షణ చేశాడు. ఒక మున్నూరు కదల్చి తెచ్చిన శివ ధనుస్సును గున్నఏనుగు చెఱకుగడను విరిచినట్లుగా విరిచి, లోకనాయకుడైన శ్రీరాముడు సుగుణాలప్రోవైన  సీతమ్మను  పెండ్లి యాడాడు.
          
                 భూతలనాథుడు రాముడు ప్రీతుండై పెండ్లి యాడె బృథుగుణమణి సం
                 ఘాతన్ భాగ్యోపేతన్, సీతన్ ముఖ కాంతివిజిత  సితఖద్యోతన్ .            ( ఆం.భా.నవ.263)
            
                శ్రీరాముడు భార్గవ రాముని  గర్వం సర్వాన్ని నాశనంచేశాడు. అనంతరము  కొంతకాలానికి  కైకకు తండ్రి యిచ్చిన వరాల కారణం గా  శ్రీ రామచంద్రుడు తండ్రి యాజ్ఞ ను తలదాల్చి, అయోథ్యను విడిచి సీతాలక్ష్మణులు వెంటరాగా అడవులకు బయలుదేరాడు.
                  తాపసోత్తమ శరణ్యము నుద్దత బర్హిబర్హలావణ్యము గౌతమీ విమల వా:కణ పర్యటన ప్రభూత సాద్గుణ్యము నుల్లసత్తరు నికుంజవరేణ్యము  నైన  దండకారణ్య సౌందర్యాన్ని చూసి ముగ్థుడైన రామభద్రుడు అక్కడే తన తమ్ముడైన లక్ష్మణుడు సేవలందిస్తుండగా సీతాసాధ్వి తో కూడి పర్ణశాలలో నివసించసాగాడు.
                
                              కాముకి యైన  శూర్ఫణఖ వచ్చింది. లక్ష్మణుడు దాని ముక్కు కోశాడు. అది విని వచ్చిన ఖరదూషణాదులను పథ్నాలుగు వేలమంది రాక్షసులను  రాముడు  తన బాణాగ్ని లో దగ్థం చేశాడు. మోహపరవశు డైన రావణుడు పంపగా , బంగారులేడి రూపం లో వచ్చిన మారీచుని  వెంటాడి,సంహరించాడు  శ్రీరాముడు.అదే సమయం లో రావణుడు సీతాదేవిని అపహరించాడు.
           
             " రామనరేంద్ర కార్య దత్తాయువుఁ బక్షవేగ పరిహాసిత వాయువు నైన జటాయువు " రామచంద్రుని సేవలో వీరమరణం పొందింది. సీతాన్వేషణలో భాగం గా రామలక్ష్మణులు ఋష్యమూకం చేరారు. వాలివథ పూర్తయ్యింది. సీతమ్మను వెదకడానికి ఆంజనేయుని నియోగించాడు రామచంద్రుడు.

         రాఘవుడు పనిచె హనుమంతు నతి చ్ఛలవంతున్      మతిమంతున్,బలవంతున్,శౌర్యవంతుఁబ్రాభవవంతున్

              రామబంటు ఆంజనేయుడు సముద్రాన్ని దాటి,సీతమ్మను చూసి.తిరిగి వస్తూ అక్షయ కుమారాదులను సంహరించి, లంకను కాల్చి వచ్చాడు.
                 
                            సీతావృత్తాతం తెలుసుకున్న శ్రీరాముడు  వానరసైన్యం తో లంకకు బయలుదేరి సముద్రం చెంతకు చేరుకున్నాడు. తనకు దారి ఇవ్వమని అడిగినా కూడ మిన్నకుండిన సముద్రునిపై  కోపించి విల్లెక్కు పెట్టాడు దాశరథి. వణికిపోయిన సముద్రుడు నదులతో కలసి వచ్చి శ్రీరాముని శరణు జొచ్చి పలువిథాల స్తుతించాడు.
           
                         నీ కీర్తి ఇనుమడించేటట్లుగా సముద్రం మీద సేతువును కట్టి, రాక్షసులను తుదముట్టించి, మంగళకరంగా నీఇల్లాలిని చేపట్టమన్నాడు. అంతేకాదు.
                 
                  హరికి మామ నగుదు; నటమీద శ్రీదేవి,తండ్రి; నూరకేల? తా గడింపఁ
                గట్టుఁగట్టి దాటు కమలాప్తకులనాథ, నీయశోలతలకు నెలవు కాగ .          (ఆం.భా.నవ.286)

            అంటూ తనను తాను పొగడుకొంటూనే, రామచంద్రుణ్ణి స్తుతించాడు. వారథి బంధనం, లంకాప్రవేశం,విభీషణ శరణాగతి జరిగిపోయాయి. యుద్ధం ప్రారంభమైంది. లక్ష్మణుడు అతికాయుణ్ణి నేలకూలిస్తే, రామచంద్రుడు కుంభకర్ణుణ్ణి సంహరించాడు.లక్ష్మణుడు మేఖనాథుని మట్టుపెట్టాడు. క్రుద్దుడైన రావణుడు యుద్ధరంగానికి వచ్చాడు.
                 

                   బలువింటన్ గుణటంకృతంబు నిగుడన్ బ్రహ్మాండ భీమంబుగా
                   ప్రళయోగ్రానల సన్నిభంబగు మహాబాణంబు సంధించి రా
                   జ లలాముండగు రాముడేసె ఖరభాషాశ్రావణున్ దేవతా
                    బలవిద్రావణు వైరిదారజనగర్భ స్రావణున్ రావణున్ .       (ఆం.భా. నవ.303)
    
                  వైరిదార జన గర్భస్రావణుడట రావణుడు.  అంటే  శతృరాజుల భార్యలకు గర్భస్రావం కలిగించేవాడట.  అటువంటి రావణునిపైకి ప్రళయాగ్ని సన్నిభమైన బాణాన్ని ప్రయోగించి నేలకూల్చాడు శ్రీరాముడు. రావణుని అంత:పురకాంతలు యుద్ధభూమికి పలువిధాలుగా రోదించారు. మండోదరి రావణుని చూచి బిట్టు విలపిస్తూ, ఇలా అంటుంది..
     
           దురితముఁదలపరు గానరు జరుగుదు రెటకైన నిమిష సౌఖ్యంబులకై
         పర వనితా సక్తులకును, పర ధనరక్తులకును నిహముఁ బరముం గలదే.?    (ఆం.భా. నవ.310)
                
              విభీషణుడు రామచంద్రుని ఆజ్ఞ తో రావణునకు దహనాది క్రియలు పూర్తిచేశాడు . శ్రీరాముడు సీతాసాధ్విని చూడటానికి అశోకవనానికి వెళ్లాడు. ఇది వాల్మీకం లో లేనిది. చిరకాలం ప్రియా వియోగం లో నున్న శ్రీరాముని ఇక వేగింప జాలక  అశోకవనం లో శింశుపా తరు సమీపం లోని సీతమ్మను చూడటానికి పంపించేశాడు  పోతన. కాని రామాయణం మూలం మరో విధంగా ఉంది.
                   
                   వాల్మీకి రామాయణం లో రావణ వథానంతరం మండోదరి విలాపం,- విభీషణ కృత కర్మకాండ,- సీతమ్మ చెంతకు హనుమంతుని రాయబారం- విభీషణుడు సాలంకృతయైన సీతాదేవి ని పల్లకిలో రాముని చెంతకు తీసుకురావడం  మొదలైనవి ఒకదాని వెంట ఒకటిగా జరిగిపోతాయి వాల్మీకంలో.  అనంత కాలవియోగానంతరం సంభవిస్తున్న  సీతారాముల కలయికకు రాత్రి-పగలు అనే ఆలోచనతో ఆలస్యం చేయలేదు ఆదికవి కూడ.      (చూ. అశోకవనిలో  రాముడు. Mutteviraviprasad.blogspot.com)
                  
                       దైతేయ ప్రమదా పరీత  నతిభీతన్  గ్రంథి బంధాలక
                       వ్రాతన్  నిశ్శ్వసనానిలాశ్రుకణ  జీవంజీవదారామ భూ
                       జాతన్ శుష్కకపోల కీలిత కరాబ్జాతం బ్రభూతం గృశీ
                       భూతం  బ్రాణసమేత  సీతఁ గనియెన్ భూమీశుఁ డా ముంగటన్.  (ఆం .భా. నవ.312.)
  
                                మధుర మోహన ముగ్థశైలి మన పోతన్న సొంతం. అందుకే   పోతన భాగవతం మొన్నమొన్నటి వరకు తెలుగునాట ప్రతియింటా పారాయణ గ్రంథం గా ఉండేది.  పోతనపద్యం రానివాడు తెలుగువాడు కాదనేది నానుడి.
                  
                    పుష్పకవిమాన మెక్కి నందిగ్రామం చేరిన రామచంద్రునకు పురజనులు వెంటరాగా పాదుకలతో ఎదురువచ్చి అంజలి ఘటించాడు భరతుడు. అందరితో కలసి అయోథ్యకు చేరుకున్నాడు శ్రీరామచంద్రుడు. మంగళవాద్యాలతో నగర పౌరులు  శ్రీరామునకు ఘన స్వాగతం పలికారు. రాజవీథి లో వెళుతున్న రామచంద్రుని చూచిన పౌర కాంతలు  ----ిఇలా అనుకుంటున్నారు.
               
                 ఇతడే రామనరేంద్రుఁ డీ యబల కాయింద్రారి ఖండించె న
                ల్లతడే లక్ష్మణుఁ డాతడే కపివరుండా పొంతవాఁడేమరు
                త్సుతుఁడా చెంగట నా విభీషణుఁడటంచుం జేతులంచూపుచున్
                సతులెల్లన్  బరికించి చూచిరి పురీసౌధాగ్ర భాగంబులన్.        ( ఆం. భా. నవ.325)
              
                           మేడల పైభాగాల కెక్కి  సీతారామ లక్ష్మణ సుగ్రీవ హనుమంత విభీషణాదులను చేతులతో చూపుతూ ఆనందంగా పరికించారు.  అయోథ్య లో ప్రవేశించిన రామచంద్రుడు తల్లులకు నమస్కరించి, తమ్ములను  చెలికాండ్ర ను ఆశ్వాసించి, మంత్రులను సేవకులను మన్నించి, గురుదేవులకు ప్రణామాలు చేశాడు. 
              
                       అయోథ్యాసింహాసనం మీద అభిషిక్తుడైన శ్రీరామచంద్రుడు ప్రజలను కన్నబిడ్డల వలే కాపాడుతూ, లోకం మెచ్చుకొనేటట్లుగా రాజ్యపాలన చేయసాగాడు.

                      ఆ రామచంద్రుని పాలనలో చాంచల్య మనేది స్త్రీల వాలు చూపుల్లోను, పేదరికం ఆందగత్తెల నడుమల్లోను,కుటిలత్వం సుందరీమణుల కేశాల్లోను, మాంద్యమనేది ఆడవారి నడకల్లోను, పీడనమనేది స్త్రీల కౌగిళ్లల్లో  మాత్రమే ఉండేదట. 
               
                          తన రాజ్యంలోని విశేషాలను  స్వయంగా తెలుసుకోవడానికి  శ్రీరాముడు మారువేషం లో తిరుగుతూ, ఒకనాడు ఒకడు భార్యతో పోట్లాడుతూ, పరాయి వాడింట్లో  కాపురంచేసిన చంచలురాలిని ఏలుకోవడానికి  నేనేమన్నా వెఱ్ఱి రాముడనా ? అని కేక లేయడం విన్నాడు. లోకమంతా కూడ ఆ విషయాన్నే చెప్పుకుంటోందని చారుల వలన తెలుసుకున్న శ్రీరాముడు నిద్రపోతున్న సీతమ్మను వాల్మీకి ఆశ్రమం లో విడిచి రావలసిందిగా ఆజ్ఞాపించాడు.     
            
                              వాల్మీకి  ఆశ్రమంలో సీతమ్మ కుశలవులను కన్నది. వాల్మీకి మహర్షి వారికి జాత కర్మలు చేశాడు.  కుశలవులిద్దరు వాల్మీకి వలన వేదాది విద్యలలో నేర్పరులై, పెక్కు సభలలో  స్వర సహితంగా రామకథాగానం చేస్తూ ఒక్కరోజు శ్రీరామచంద్రుని  యజ్ఞశాలకు వచ్చారు. శ్రీ రామచంద్రుడు, అక్కడున్న ప్రజలు ఆనందాంబుథిలో ఓలలాడునట్లు  రామకథాగానం చేశారు కుశలవులు. వారిని చూసి మురిసిపోయిన శ్రీరాముడు  మహి మీద నెవ్వరు, తల్లి దండ్రి మీకు ధన్యులార!” అని అడిగాడు. మేము వాల్మీకి మహర్షి పౌత్రులము. శ్రీ రాఘవేంద్రుని యాగం చూడటానికి వచ్చాము అన్నారు వాళ్లు. చిరునవ్వు నవ్విన రాముడు రేపు మీ తండ్రి ఎవరో తెలుసుకుందురు గాని ఈ పూటకు ఇక్కడే ఉండండి. అని వారిని విడిది గృహానికి పంపించాడు. 
             
                   



                    మరుసటిరోజు  సీతమ్మను వెంటబెట్టుకొని,కుశలవులను ముందుపెట్టుకొని వాల్మీకి మహర్షి శ్రీరాముని చెంతకు వచ్చాడు. సీతమ్మ పతివ్రత. పరిశుద్ధమైన నడవడికలది. పుణ్యాత్మురాలు. దూరం చేసుకోవద్దు. అని హితవు పలికాడు. కాని రామచంద్రుండు  పుత్రార్థియై విచారింపఁ గుశలవులను వాల్మీకికి నొప్పగించి, రామచంద్ర చరణ థ్యానంబు సేయుచు, నిరాశయై సీత భూవివరంబు సొచ్చె. శ్రీరాముడు కొడుకుల్ని కావాలనుకున్నాడట.  భర్త భావాన్ని అర్థం చేసుకున్న తల్లి సీతమ్మ బిడ్డలను వాల్మీకికి అప్పగించి, రామపద థ్యానం చేస్తూ, నిరాశయై  భూప్రవేశం చేసింది. ఇది ఉత్తర కాండ కథ. పోతన చెప్పింది. ప్రియురాలి నిర్ణయానికి దు:ఖించాడు  దాశరథి.
                 
                             అనంతరం బ్రహ్మచర్యాన్ని  అవలంబించి,  పదమూడువేల సంవత్సరాలు అవిచ్చిన్నంగా అగ్నిహోత్రాలను ప్రవర్తిల్ల చేసి, దేవుడైన శ్రీరాముడు తన  మొదటి స్థానమైన పరమపదానికి వెళ్లిపోయాడు.
                    
                    


                        నల్లనివాడు పద్మనయనంబుల వాడు మహాశుగంబులన్
                      విల్లును దాల్చువాడు గడు విప్పగు వక్షమువాడు మేలు పైఁ
                      జల్లెడు వాడు నిక్కిన భుజంబుల వాడు యశంబు దిక్కుల                                                            జల్లెడు వాడునాన రఘుసత్తముఁ డీవుత  మా కభీష్టముల్.      (ఆం.భా.నవ.361)       

                        అటువంటి   రామచంద్రుడు మన కోరికలను  తీర్చుగాక అన్నది మంగళాశాసనం.  
     
                   ముఖే ముఖే సరస్వతి అని కదా  సూక్తి. భక్తకవి యైన పోతన చేత రామచంద్రుడు పలికించిన రామకథ లో ఉత్తర రామాయణం చాల క్లుప్తంగా ప్రస్తావించబడింది.
          
                    వాల్మీకి చెప్పిన హితవాక్యాలను విన్న  శ్రీరామచంద్రుడు  పుత్రార్థియై   విచారించాడు. అంటే  సూర్య వంశక్షేమాన్ని , వంశాభివృద్ధి ని  కోరుకున్నాడే కాని ఇల్లాలి క్షేమాన్ని గురించి  ఆలోచించలేదు. ఇక నైనా  భర్త సాన్నిథ్యం లో బిడ్డలను చూసుకుంటూ, కష్టాల్ని మరచి పోదామనుకున్న మైథిలి ఆశలు నిరాశలైనాయి.అందుకే ఆమె నిరాశయై భూమి లోకి ప్రవేశించింది.

                      అవును. ఆడపిల్లకు కష్టమొచ్చినప్పుడు ,అయినవాడు కాదన్నప్పుడు, అవమానం జరిగినప్పుడు, పిల్లలు దూరమైనప్పుడు  పుట్టింటికే వెడుతుంది. అమ్మకే చెప్పుకుంటుంది. ఓదార్పును కోరుకుంటుంది.  సీతమ్మతల్లి కూడ అదే చేసింది.   అప్పటికింకా ఆమెకు అమ్మ ఉంది కాబట్టి. పోతన  సీతమ్మ కు వాడిన  నిరాశయై అన్న పదం లోని బరువైన భావం అదే. ఆ తల్లి కష్టాలు ఇంకా తీరలేదని ఒక రామభక్తునిగా పోతన లోని వేదనే ఆ నిరాశ  గా బయటకొచ్చింది .   ఇది పోతన రామాయణం.
             
               మంతనములు సద్గతులకు, పొంతనములు ఘనములైన పుణ్యముల కిదా
               నీంతనపూర్వమహాఘ ని, కృంతనములు రామనామకృతి చింతనముల్.   (ఆం.భా.నవ.363)    

                      శ్రీరామ నామ సంస్మరణలు అనేవి  - సద్గతులకు ఏకాంతమార్గాలు.గొప్ప పుణ్యాలకు ఆటపట్టులు. ఇంతకుముందు, ఇప్పుడు చేసిన గొప్పపాపాలను  పోగొట్టేవి – అన్నాడు పోతన.










**************************************************************************************************





No comments: