శతక సౌరభాలు - 2
ధూర్జటి శ్రీ కాళహస్తీశ్వర
శతకము - 2
వీడెం బబ్బినయప్పుడున్ ; దమనుతుల్
విన్నప్పుడుం ; బొట్టలో
గూడున్నప్పుడు ; శ్రీ విలాసములు పైకొన్నప్పుడుం ;
గాయకుల్
పాడంగా వినునప్పుడున్ ; చెలగు దంభ ప్రాయు నిశ్రాణనన్
క్రీడాసక్తుల నేమి చెప్పవలెనో ? శ్రీ కాళహస్తీశ్వరా
!
శ్రీ శంకరా ! తన పెద్ధరికాన్ని గౌరవించి తాంబూలమిచ్చి
నప్పుడు, తనను
గూర్చిన పొగడ్తలు విన్నప్పుడు , లోటు లేకుండా కడుపారా కూడు లభించినప్పుడు , సంపదలు
మెండుగా సమకూరి నప్పుడు , కవులు , గాయకులు తన కీర్తిని గానము చేస్తుండగా విన్నప్పుడు ,
యవ్వన మదము చేత దానము చేయుట యందు
, సంసార సుఖము లందు
ఆసక్తులై సంచరించు ఈ మనుషులను ఏమనాలి . అనగా అశాశ్వతమైన విషయాలను గూర్చి
ఆసక్తులై పరమేశ్వరుని ధ్యానింప కున్నారని విచారమును ప్రకటించు చున్నాడు కవి .
నిను సేవింపగ నాపదల్పొడమనీ
, నిత్యోత్సవంబబ్బ నీ
,
జనమాత్రుండననీ , మహాత్ముడననీ , సంసారమోహంబు పై
కొననీ ,
జ్ఞానము గల్గనీ గ్రహగతుల్ కుందింపనీ , మేలు వ
చ్చిన రానీ యవి నాకు భూషణములే ; శ్రీ కాళహస్తీశ్వరా !
శ్రీ
కాళహస్తీశ్వరా ! నిన్ను సేవించు సమయం లో నాకు కష్టములు వచ్చినా రానిమ్ము, వేడుకలు జరిగిన
జరగనిమ్ము . సమాజము నన్ను సామాన్యుని గా చూచినా , మహాత్ముని
గా పొగడినా , సంసార మోహము లో మునిగిపోయినా , దివ్యజ్ఞానము సంభవించినా ,
గ్రహగతులు తప్పినా , మేలు చేకూరినా అన్నీ నాకు ఆభరణములే శివా !
ఏ వేదంబు పఠించె లూత , భుజగం బే
శాస్త్రముల్సూచె దా
నే విద్యాభ్యసనం బొనర్చె గరి , చెంచే
మంత్ర మూహించె , బో
ధావిర్భావ నిధానముల్ చదువులయ్యా ?
కావు , మీ పాద సం
సేవాసక్తియే కాక జంతుతతికిన్ శ్రీ
కాళహస్తీశ్వరా !
ఓ ఈశ్వరా ! జ్ఞాన సముపార్జనకు ప్రాణులకు
విద్య అవసరం లేదు. నీ పాదసేవయే సమస్తజ్ఞానమును కల్గించును . ఎట్లనగా నిన్ను సేవించిన
సాలెపురుగు ఏ వేదాధ్యయనము చేసి,జ్ఞానమును సముపార్జించినది .
నిన్ను సేవించిన సర్పము ఏ శాస్త్రమును చదివినది . నిను పూజించిన ఏనుగు ఏ విద్య నభ్యసించినది . బోయవాడైన తిన్నడు ఏ మంత్రమును చదివి నిన్ను సేవించి ముక్తి పొందినాడు . కావున నీ పాదములను సేవించాలనే కుతూహలమే సమస్త
జ్ఞానమును కల్గించును ప్రభూ !
కాయల్గాచె వధూ నఖాగ్రములచేఁ గాయంబు , వక్షోజముల్
రాయన్ ఱాపఢె ఱొమ్ము , మన్మధ విహార క్లేశ
విభ్రాంతి చే
బ్రాయం బాయెను , బట్ట గట్టెఁ దల , చెప్పన్ రోఁత సంసారమేఁ
చేయంజాల విరక్తుఁ జేయగదవే ! శ్రీ కాళహస్తీశ్వరా
!
భక్తవశంకరా ! శంకరా
! చెప్పడానికే రోత పుట్టించెడి ఈ సంసారమును చేయజాలను . నన్ను విరక్తుని చేయవలసినది .
ఎందుకంటే వారకాంతల గోరు గిచ్చుళ్లతో ఒళ్ళంతా కాయలు కాసింది . వారి వక్షోజాల రాపిడికి నా ఱొమ్మంతా రాయిగా మారి పోయింది . మన్మధ
క్రీడా క్లేశములతో వయసై పోయింది . తల బట్ట కట్టింది . ఈ రోత సంసారము నుండి విముక్తి కల్గించు శంకరా !
నిన్నే రూపముగా భజింతు మది లో
నీరూపు మోకాలో స్త్రీ
చన్నో కుంచమో , మేక పెంటియొ యీ
సందేహముల్మాన్పి నా
కన్నార న్భవదీయ మూర్తి సగుణాకారంబు గా జూపవే
చిన్నీరేజ విహార మత్తమధుపా !
శ్రీ కాళహస్తీశ్వరా !
స్వామీ ! చిత్స్వరూపుడా ! నీ నిజరూప దర్శనమును నాకు
ప్రసాదించుము, నీ రూపము మోకాలో. (దసరయ్య కధ – బసవ పురాణము
) స్త్రీ వక్షమో (సుందర నయనారు కధ – బసవపురాణము -
ఆచంటేశ్వరుడు ) ధాన్యమును కొలిచెడి కుంచము రూపమో. ( బల్లేశు మల్లయ్య కధ – బసవపురాణము – కుంచేశ్వరుడు )లేక మేకపెంటికా (కాటకోటయ కధ ) ఈ సందేహాలన్నింటినీ మాన్పి , నీయొక్క సగుణ రూప దర్శనమును నాకు
ఇవ్వవలసినది .
బసవపురాణము మొదలైన శైవ
వాజ్ఞ్మయ మందలి కధలను కవి ఈ పద్యం లో ప్రస్తావించాడు.
నిను నా వాకిట గావుమంటినో ? మరున్నీలాలక భ్రాంతి గుం
టెన పొమ్మంటినొ ? యెంగిలిచ్చి తిను తింటే గాని కాదంటినో ?
నిను నెమ్మిం దగ విశ్వసించు సుజనానీకంబు
రక్షింప చే
సిన నా విన్నపమేల గైకొనవయా ? శ్రీ కాళహస్తీశ్వరా
!
శంకరా ! నిన్నేమన్నా నేను బాణాసురుని వలే
నా యింటికి కాపలా కాయమన్నానా ? సుందరమూర్తి నయనారు వలే దేవతా
స్త్రీలకోసం రాయబారం వెళ్లమన్నానా ? తిన్నని వలే ఎంగిలి పెట్టి , తినమని బలవంతం చేశానా
? లేదుకదా ! నిన్ను నమ్మిన భక్తులను
రక్షింపమని వేడుకున్నాను . నా ప్రార్దనను ఎందుకు మన్నించవు స్వామీ !
ఱాలన్ రువ్వగ చేతులాడవు , కుమారా ! రమ్ము రమ్మంచు నే
చాలన్ చంపగ , నేత్రముల్దివియగా శక్తండ నేగాను , నా
శీలంబేమని చెప్పనున్నదిక నీ చిత్తంబు , నాభాగ్యమో
శ్రీ లక్ష్మీపతి సేవితాంఘ్రి యుగళా ! శ్రీ కాళహస్తీశ్వరా
!
శ్రీ లక్ష్మీ నాథుని చేత సేవించబడు పదపద్మములు
గలవాడా ! శంకరా ! నాకు శాక్యతొండని వలే రాళ్ళతో నిను కొట్టుటకు చేతులు రావు . సిరియాళుని వలే
కుమారా ! రా ! రమ్మని కొడుకుని ప్రేమగా పిలిచి , చంపి నీకు వండి పెట్ట లేను ( బసవ పురాణము
). కన్నప్ప వలే కళ్ళు తీసి ఇచ్చుటకు శక్తిలేదు . ఇక నా నడవడిక
ఎటువంటిదని నీ మనస్సు అనుకుంటోందో అంత మాత్రమే నన్ను అనుగ్రహించు స్వామీ !
రాజుల్మత్తులు , వారి సేవ నరక
ప్రాయంబు , వారిచ్చు నం
భోజాక్ష్ చతురంత యాన తురగీ భూషాదు
లాత్మవ్యధా
బీజంబుల్ , తదపేక్ష చాలు ,
పరితృప్తిం బొందితిన్ , జ్ఞాన ల
క్ష్మీ జాగ్రత్పరిణామ మిమ్ము దయతో శ్రీ
కాళహస్తీశ్వరా !
స్వామీ ! రాజులు మదాంధులు. వారిని సేవించుట నరక తుల్యము . వారు బహూకరించు స్త్రీలు
, పల్లకీలు ,గుఱ్ఱములు ,
ఆభరణాదులు , మానసికంగా వేదనను కల్గిస్తాయి.
వాటి మీద ఆరాటం ఇక చాలు . సంతృప్తి పొందాను .
దయతో నాకు మోక్షమును పొందు
జ్ఞానమును ప్రసాదించ వలసినది ప్రభూ !
నీ రూపంబు దలంపగా తుదమొదల్నేగాన
నీవైనచో
రారా రమ్మని యంచు చెప్పవు వృధా
రంభంబు లింకేటికిన్
నీరన్ముంపుము పాలముంపు మిక నిన్నే
నమ్మినాడం జుమీ
శ్రీ రామార్చిత పాదపద్మ యుగళా
శ్రీ కాళహస్తీశ్వరా !
శ్రీ
రామునిచే అర్చించబడిన పాదపద్మములు గలవాడా ! శంకరా
! నీ రూపము యొక్క
ఆద్యంతములను ఊహించుటకు కూడ నాకు సాధ్యము కాదు .
నీవేమో నన్ను రమ్మని పిలువవు.. నిన్ను దర్శించుటకు చేసిన నాప్రయత్నము లన్నియు వృధాప్రయత్నములే
అగుచున్నవి. స్వామీ ! నిన్నే నమ్ముకున్నాను. పాలముంచినా నీట
ముంచినా నీదే భారము తండ్రీ !
నీకున్ మాంసము వాంఛయేని కరవా నీచేత లేడుండ గా
జోకైనట్టి కుఠారముండ ననలజ్యోతుండ నీరుండ
గా
పాకంబొప్పఘటించ చేతిపునుకన్ భక్షింప కా
బోయచేఁ
జేకొంటెంగిలి మాంసమిట్లు తగునా శ్రీ కాళహస్తీశ్వరా ! (20 )
శంకరా ! వీకు మాంసము తినాలనే కోరిక కలిగితే చేతిలో
జింక ఉన్నది . ఒక చేతిలో వాడియైన గొడ్డలి ఉంది .మరొక చేతిలో అగ్ని , వేరొక చేతిలో నీరు , వంటచేసుకోవడానికి మరొక చేతి లో భిక్షాపాత్ర ఇవన్నీ ఉన్నాయి కదా . చక్కగా మాంసమును
వండుకొని భుజించక ఆ బోయవాని ఎంగిలి
మాంసాన్ని ఎందుకు తిన్నావు స్వామీ !
------------- మూడవ భాగం త్వరలో
**************************************************************