శతకసౌరభాలు -5
సుమతీ శతకము -4
దుర్మార్గుడు
పాలను గలసిన జలమును
పాలను గలసిన జలమును
బాల విధంబుననే యుండుం బరికింపంగాఁ
బాల చవిఁ జెఱచుఁ
గావున
బాలసుడగు వాని పొందు వలదుర సుమతీ !
ఓ సుమతీ ! పాలలో కలిసిన నీరు పాల వలే కన్పిస్తాయి కాని కాని పరిశీలించి చూస్తే పాల రుచిని
చెడగొట్టినట్లు మనం గమనించగలం. అలాగే దుర్మార్గుని తో స్నేహం
మన కున్న గౌరవాన్ని కూడ పోగొడుతుంది కాబట్టి చెడ్డవాని తో
స్నేహం చేయకూడదు.
పాలసున కైన యాపద
జాలింబడి తీర్ప దగదు సర్వజ్ఞునకున్
దేలగ్నిఁ బడగఁ బట్టిన
మేలెఱుగునె మీటు గాక మేదిని సుమతీ !
ఓ సుమతీ ! ఒక దుర్మార్గునికి ఆపద సంభవిస్తే చూచిన
బుద్ధిమంతుడైన వాడెవడూ కూడ వానిని చూసి జాలిపడి ఆదుకోకూడదు. వాని ఆపద గడవడానికి మనం సహాయం చేయకూడదు. ఎందుకంటే తేలు నిప్పులో పడితే చూసిన మనం దానిని కాపాడు
దామని పట్టుకున్నామనుకోండి. అది మనల్ని కుట్టకుండా ఊరుకోదు గదా. అదే విధంగా దుర్మార్గుని ప్రవర్తనా ఉంటుందని
తెలుసుకోవాలి.
పురికిని బ్రాణము కోమటి
వరికిని బ్రాణంబు నీరు వసుమతి లోనం
గరికిని బ్రాణము
తొండము
సిరికిని బ్రాణంబు మగువ సిద్ధము సుమతీ !
ఓ సుమతీ ! ఊరికి వ్యాపారి గుండెకాయ వంటి వాడు. వరి
పంట కు నీరే ప్రాణాధారం. ఏనుగు నకు తొండమే
ప్రధానము . ఇంటను సిరిసంపదలు
వర్ధిల్లాలంటే ఇల్లాలే ప్రధాన కారణ మౌతోంది.
అందుకే ఇల్లాలు ని గృహలక్ష్మి అంటారు.
పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు , జనులా
పుత్రుని గనుగొని
పొగడగ ,
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ !
ఓ సుమతీ ! ఒక తండ్రికి కుమారుడు కలిగి నంత మాత్రాన కలిగే
సంతోషం గొప్పది కాదు. ఆ కుమారుడు చేసే
గొప్ప పనులను లోకం మెచ్చుకొని పొగిడే
టప్పుడు కలిగే ఆనందమే అసలైన ఆనందం.
దానినే పుత్రోత్సాహమనాలి కాని మగబిడ్డ కల్గినంత మాత్రాన కలిగే ఆనందం పుత్రోత్సాహం
కాదు.
పెట్టిన దినముల లోపల
నట్టడవుల కైన వచ్చు నానార్ధంబుల్
బెట్టని దినములఁ గనకపు
గట్టెక్కిన నేమిలేదు గదరా సుమతీ !
ఓ సుమతీ ! కలిసొచ్చేరోజు వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడని సామెత. అలాగే
అదృష్టం కలిసొస్తే అడవిలో కూర్చున్నా అన్ని వసతులు సమకూరుతాయి.
ఆ అదృష్టమే ముఖం చాటు చేస్తే
బంగారుకొండైన మేరుపర్వతం మీద కూర్చున్నా ఏమీ దొరక్కపోవచ్చు .
పొరుగున పగవాడుండిన
నిరవొందగ వ్రాతగాడె
ఏలికయైనన్
ధరఁ గాపు కొండె మాడిన
గరణాలకు బ్రతుకు లేదు గదరా సుమతీ !
ఓ సుమతీ ! ఇంటి ప్రక్కనే శత్రువు ఉన్నా,
పరిపాలించే అధికారే వ్రాయసకాడైనా , గ్రామ పెత్తందారు డే చాడీలు చెప్పేవాడు
ఐతే ఇక అక్కడ కరణాల బ్రతుకు దుర్భరమే ఔతుంది.
బంగారు కుదువబెట్టకు
సంగరమునఁ బాఱిపోకు
సరసుడవగుచో
నంగడి వెచ్చము లాడకు
వెంగలితోఁ జెలిమి
వలదు వినరా సుమతీ !
ఓ సుమతీ !
ఎంత అవసరం వచ్చినా బంగారాన్ని
తాకట్టు పెట్టవద్దు. యుద్ధరంగం నుంచి పారిపోవడం
వీరలక్షణం కాదు. అంగడి నుండి వస్తువులను అరువు తెచ్చుకోవద్దు. మూర్ఖుని తో స్నేహం చేయడం మంచిది కాదు.
బలవంతుడ నాకే మని
పలువురి తో నిగ్రహించి పలుకుట మేలా
బలవంతమైన సర్పము
చలిచీమల చేతఁ జిక్కి చావదె సుమతీ !
ఓ సుమతీ ! నేను బలం కలవాడిననే అహం తో అందరి
తోటి విరోధము పెట్టుకొంటే ప్రాణాంతకమే
అవుతుంది . . ఎందుకంటే అతి ఘోరమైన పాము కూడ చలి చీమల బారి నపడి చస్తోంది కదా.
!
మంత్రి
మండలపతి సముఖంబున
మెండైన ప్రధాని లేక మెలగుట యెల్లన్
గొండంత మదపు టేనుగు
తొండము లేకుండినట్లు తోచుర సుమతీ !
ఓ సుమతీ ! మండలాధిపతి యైన రాజు దగ్గర సమర్ధుడైన మంత్రి లేకపోతే పెద్దగా
నడచి వచ్చే కొండ లాగ ఉన్న మదపుటేనుగు కు
తొండము లేనట్టు వికృతం గా ఉంటుంది.
ఎందుకంటే కరికిని తొండము ప్రాణము అని ఈ
కవే ఇంతకు ముందు చెప్పాడు. అట్లే ప్రాణ
సమానమైన తొండము లేని ఏనుగు ఏ విధం గా పనికి
రానిదవుతుందో సమర్ధుడైన మంత్రి లేని రాజు
, అతని రాజ్యము కూడ సమర్ధం గా రాణించలేవని అర్థము.
ఇదే విషయాన్ని..తరువాత పద్యం
లో వివరిస్తున్నాడు.
మంత్రి గల వాని రాజ్యము
తంత్రము సెడకుండ నిలుచుఁ దఱచుగ ధరలో
మంత్రి విహీనుని రాజ్యము
జంత్రపుఁ గీలూడినట్లు జరుగదు సుమతీ !
ఓసుమతీ ! సమర్ధుడైన మంత్రి గల రాజ్యము పరిపాలనా
తంత్రము చెడకుండా చక్కగా పాలించబడుతుంది. మంత్రిలేని రాజ్యము ప్రధానమైన సీల
ఊడిపోయిన యంత్రము వలే ముందుకు కదలక
నిలిచిపోతుంది. సమర్ధుడైన మంత్రుల వల్లనే
ఎందరో చక్రవర్తులు , రాజులు గొప్ప కీర్తి మంతులయ్యారు..
మాటకు బ్రాణము సత్యము
కోటకుఁ బ్రాణంబు సుభట కోటి, ధరిత్రిన్
బోటికిఁ బ్రాణము మానము
చీటికిఁ బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ !
ఓ సుమతీ ! ఈ భూమి మీద సత్యవాక్యము మాత్రమే సదా
నిలిచి ఉండేది. ఎందుకంటే మాటకు సత్యమే ప్రాణము . మహాదుర్గ రక్షణ కు సుశిక్షుతులైన
సైన్యమే ప్రాణము. అనగా అదే ప్రధానమైనది. స్త్రీలకు అభిమానమే మూలధనము . ప్రాణ
సమానమైనది. లేఖకు చేవ్రాలు ప్రాణము సంతకము లేని ఉత్తరము విలువ లేనిదే కదా !.
మాన ఘనుఁ డాత్మ
ధృతిఁ జెడి
హీనుండగు వాని నాశ్రయించుట యెల్లన్
మానెడు జలముల లోపల
నేనుగు మెయి
దాచినట్టు లెఱుగుము సుమతీ !
ఓ సుమతీ ! అభిమాన వంతుడైన మనుజుడు కర్మవశాన తన స్థాయిని కోల్పోయి , ఒక అల్పుని ఆశ్రయించడం ఎలా వుంటుందంటే మదపుటేనుగు శరీరాన్నితీసుకెళ్లి
ఒక మానెడు నీటిలో దాచడానికి ప్రయత్నించడమే కదా.!
రాజు
వేసరపు జాతి కానీ
వీసముఁ దా
జేయనట్టి వ్యర్ధుడు కానీ
దాసి కొడుకైన గానీ
కాసులు గలవాడె రాజు గదరా సుమతీ !
ఓ సుమతీ ! రాజు కావాలంటే క్షత్రియుడే కానవసరం లేదు . వాడు ఏ కులానికి
చెందిన వాడైనా, వీసమెత్తు విలువ కూడ చేయని నిష్ర్పయోజకుడైనా , దాసీ పుత్రుడైనా
కూడ ధనమున్న వాడే పాలకుడు గా
, రాజు గా గౌరవించబడుతున్నాడు.
రా పొమ్మని పిలువని
యా
భూపాలునిఁ గొల్వ
భుక్తి ముక్తులు గలవే
దీపంబు లేని యింటను
చే పుణికీళ్ళాడినట్లు సిద్ధము సుమతీ !
ఓ సుమతీ !
దీపము లేని ఇంటిలో సరసాలు ఏ విధంగా రక్తి కట్టవో అదే విధంగా రమ్మని ,
పొమ్మని కాని పిలిచి పనులు చెప్పని రాజు వద్ద సేవ చేయడం కూడ ఇహపరములను
రెండింటిని సాధించలేక నిష్ఫలమౌతుంది.
రూపించి పలికి బొంకకు
ప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు మదిలోఁ
గోపించు రాజుఁ గొల్వకు
పాపపుదేశంబు సొరకు పదిలము సుమతీ !
ఓ సుమతీ ! ఒకరికి ఖచ్చితం గా సహాయం చేస్తానని గట్టిగా చెప్పి అవసరం వచ్చి
నప్పుడు నేను ఆ మాట అనలేదని అబద్దమాడ
వద్దు. అన్ని సమయాల్లో ఆదుకుంటూ మనకు
అండగా ఉండే చుట్టాన్ని ఎప్పుడూ తక్కువ
చేసి చులకనగా మాట్లాడవద్దు. కోప స్వభావము
గల రాజు ను సేవించవద్దు. దుర్మార్గులు నివసించే ప్రదేశం లో నివసించరాదు. ఇవి బుద్ధిమంతుడు ఆచరించవలసిన ధర్మాలు.
లావు గల వాని కంటెను
భావింపగ నీతిపరుడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటి వాడెక్కినట్లు మహిలో సుమతీ !
ఓ సుమతీ !
ఈ లోకం లో దేహబలమున్నవాని కంటే
బుద్ధిబలమున్న వాడే బలవంతుడు.
ఎందువలనంటే పర్వతమంత శరీరం గల ఏనుగు ను సైతం ఒక
మావటివాడు అంకుశం తో దాన్ని లొంగదీసుకొని దానిపై ఎక్కి కూర్చుంటున్నాడు కదా !.
వఱదైన చేను దున్నకు
కఱవైనను బంధుజనుల కడ కేగకుమీ
పరులకు మర్మము సెప్పకు
పిఱికికి దళవాయి తనముఁ బెట్టకు సుమతీ !
ఓ సుమతీ !
వరద వచ్చే పొలం లో వ్యవసాయం చేయడం వలన ప్రయోజనం లేదుకఱువు
సంభవించినప్పుడు బంధువుల ఇళ్లకు వెళ్ళవద్దు. ఇతరులకు
మన రహస్యాలు చెప్పకూడదు. పిరికి వాడికి
సర్వ సేనాథిపత్యాన్ని అప్పగించకూడదు.
.ఎందుకంటే
పంట ఏదో ఒక దశ లో ఉండగా ప్రతి
సంవత్సరం వరద రావడం ఖాయం . మనం అప్పుల ఊబి
లో మునగటం ఖాయం .అందుకే వరదవచ్చే పొలం లో వ్యవసాయం కూడదన్నారు పెద్దలు. ఇల్లు
పడిపోతుందని తెలిసీ గృహప్రవేశం చెయ్యడం మూర్ఖత్వం
కదా.!
వరి పంట లేని యూరును
దొర యుండని యూరు తోడు దొరకని తెరువున్
ధరను బతిలేని గృహమును
అరయంగా రుద్రభూమి యన
దగు సుమతీ !
ఓ సుమతీ !
లోతుగా ఆలోచిస్తే వరి పంట లేని
ఊరు , అజమాయిషీ చేసే అధికారి లేదా ప్రభువు లేని ఊరు , సహాయం దొరకని ఊరు , యజమాని లేని ఇల్లు ఈ నాలుగు శ్మశానం తో సమానాలు.
వినదగు నెవ్వరు చెప్పిన
విని నంతనె వేగి
పడక వివరింప దగున్
కని కల్ల నిజము దెలిసిన
మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతీ !
ఓ సుమతీ !
ఈ భూమి మీద ఎవరు ఏమాట
చెప్పినా వినాలి. కాని విన్నంతనే తొందర
పడక వివేచన తో ఆలోచించాలి. ఆలోచించి నిజానిజాలను నిర్ణయించు కోగలవాడే నీతిని తెలుసుకున్నవాడు,
అనగా నీతిపరుడు అవుతున్నాడు.
వీడెము సేయని నోరును
చేడెల యధరామృతంబు జేయని నోరున్
బాడంగ రాని నోరును
బూడిద కిరవైన పాడు బొందర సుమతీ !
ఓ
సుమతీ ! తాంబూలము వేసుకోని
నోరును , స్త్రీల అధరామృత పానము చేయని నోరును , పాట పాడని నోరు కూడ బూడిద మన్ను పోసే గుంట వలే
పనికి రానివి.
తొలిరోజుల్లో తెలుగు నాట
తాంబూలచర్వణము ఒక సంప్రదాయం గా ఉండేది. ప్రతి ఇంట
తాంబూల పేటిక లు . ముఖ్యంగా వక్కను కత్తిరించే పోక కత్తెరలు ఉండేవి.
భోజనానంతరం తాంబూల సేవనం సంప్రదాయం
గా ఉండేది. ఇంటికి వచ్చిన అతిథులకు తాంబూలమివ్వడం ఒక మర్యాద.
ఆధునిక కాలం లో
వేడుకలు , వివాహాలలో మాత్రం ఇది
రూపాంతరంగా కిళ్లీల రూపంలో కన్పిస్తోంది. వివాహ నిర్ణయం లో తాంబూలాలు పుచ్చుకోవడమనే తంతు ఇప్పటికీ
కన్పిస్తూనే ఉంది. రాజ ఆస్థానాల్లో ఒక కావ్య ప్రారంభానికి ముందు మహారాజు నిండు సభ
లో మహాకవిని ఆహ్వానించి
పచ్చకర్పూరం తో కూడిన తాంబూలాన్ని , బహుమతులతో నింపిన బంగారు పళ్ళెరం లో
పెట్టి బహుకరించి , ఆ కవి గారి
కావ్యకన్యకను తనకు అంకితమివ్వమని
అర్థించేవాడు . ఇదొక గొప్ప వేడుక గా జరిగే సంబరం.
అల్లసాని పెద్దన మనుచరిత్ర లో ప్రవరుని వృత్తాంతం లో తాంబూల పరిమళాన్ని
బట్టి ఆ తాంబూలం వేసుకున్నవారు వివాహితులా ,అవివాహితులా? స్త్రీ లా?
పురుషులా ? తెలుసుకోవచ్చా అనే విషయం పై ఆసక్తి కరమైన చర్చ కన్పిస్తుంది.
వెలయాలు
వెలయాలి వలనఁ గూరిమి
గలుగదు మఱిఁ గలిగినేని కడతేఱదు గా
పదుగరు నడిచెడి తెఱువున
బులు మొలవదు మొలిచెనేని బొదలదు సుమతీ !
ఓ సుమతీ ! పదిమంది నడిచే దారిలో గడ్డి మొలవదు . ఒకవేళ మొలిచినా అది పెరగదు. అలాగే వెలయాలి వలన ప్రేమ లభించదు . ఒకవేళ ప్రేమ కలిగినా అది చివరి వరకూ కొనసాగదు. భోగం స్త్రీ
ప్రేమ స్థిరమైనది కాదని భావం .
పులి పాలు దెచ్చి యిచ్చిన
నలవడ గా గుండె కోసి యఱచే నిడినన్
దల పొడుగు ధనముఁ బోసిన
వెలయాలికిఁ గూర్మిలేదు వినరా సుమతీ !
ఓ బుద్ధిమంతుడా !
ఎన్ని గొంతెమ్మ కోరికలు తీర్చినా, అసాథ్యమైనవి ఎన్నో సాధించుకొచ్చి
సమర్పించినా వెలయాలి కి ప్రేమ కలగదు. పులిపాలు తీసుకొచ్చి ఇచ్చినా , నీ గుండెను
కోసి దాని అఱచేతిలో పెట్టినా , నిలువెత్తు ధనం లో దాన్ని ముంచినా , ఎప్పటికీ
వెలయాలి లో ప్రేమ కన్పడదు. అందువలన వెలయాలి కి దూరం గా ఉండాలి. అది చూపించే ప్రేమ
నిజ మని నమ్మవద్దు.
వెలయాలు సేయు బాసలు
వెలయగ నగసాలి పొందు
,వెలమల చెలిమిన్
గల లోనఁ గన్న
కలిమియు
విలసితముగ నమ్మరాదు వినరా సుమతీ !
ఓ సుమతీ ! వెలయాలు
చేసే ప్రమాణాలు , కంసాలి వానితో స్నేహం , వెలమ దొరలతో సహవాసం , కలలో కన్పించిన సంపద. ఇవి
ఏవీ కూడ నిజాలు కావు. నమ్మదగినవి కావు .
సరసము విరసము కొఱకే
పరిపూర్ణ సుఖంబు లధిక బాధల కొఱకే
పెరుగుట విఱుగుట కొఱకే
ధర తగ్గుట హెచ్చు కొఱ కు తథ్యము సుమతీ !
ఓ సుమతీ !
ఎక్కువగా ఎవరతోనైనా పరిహాసాలాడటం అది ముందు ముందు విరోధానికే దారి తీస్తుంది. పరి పూర్ణ సుఖాల అనంతరం వచ్చే కష్టాలు
భరించలేనివే అవుతాయి. ఏదైనా మనం సాధించిన
ఒక అభివృద్ధి అనంతర కాలంలో నాశనానికి కారణం
కావచ్చు. ఒక వస్తువు ధర తగ్గుతోందంటే మల్ళీ పెరిగే అవకాశం మున్న దనేది ప్రజల్లోని
మాట.
సిరి దా వచ్చిన
వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరి దాఁ బోయిన బోవును
కరి మ్రింగిన వెలగ పండు
కరణిని సుమతీ !
ఓ సుమతీ !
సంపద యొక్క రాకడ పోకడ రెండూ కూడ అద్ఫుతంగానే ఉంటాయి. కొబ్బరి కాయలోకి నీరు ఎలా వచ్చాయో ఆ విధంగానే డబ్బు రావడం మొదలు పెడితే తెలియకుండానే కుప్పలు
తెప్పలు గా వచ్చిపడుతుంది. ఆ సమయం లో తెలివైన వాడు విచక్షణ తో జాగ్రత్త పడి దాచుకుంటాడు. అలాగే డబ్బు పోవడం మొదలు పెడితే ఏనుగు మ్రింగిన
వెలగ పండు లోని గుజ్జు లాగ మాయమై పోతుంది.
కాబట్టి బుద్ధిమంతుడు సరైన సమయం లో జాగ్రత్త పడి పొదుపు చేయాలి.
‘ కరి మ్రింగిన వెలగపండు’ అనగా ‘ఏనుగు తిన్న వెలగ పండు’ అని , ఏనుగు యొక్క గొప్పదైన
జీర్ణశక్తి వలన అది మ్రింగిన వెలగ పండు
అలాగే ఉండి దాని లోని గుజ్జు మాయ మౌతుందని తెలుగు కవులు వ్రాశారు . కాని సంస్కృతం లో ‘గజ భుక్త
కపిత్థవత్ ’ అని గలదు. దీనికి “గజ క్రిమి రూపేణ ” అని వ్యాఖ్య. కంటికి కనపడని క్రిమి వెలగ కాయ లోనికి ప్రవేశించి
గుజ్జు నంతటిని నల్లగా మార్చి
వేస్తుందని , ‘కరి అనగా నలుపు ’అని, “
కరి మ్రింగిన ”అంటే “నల్లగా
మారిన ” అని అర్థం
చెపుతున్నారు. ఆంధ్రుల సాంఘీక చరత్ర లో శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు ఈ విషయాన్ని చర్చించారు. ( చూ. 352 పే )
స్త్రీల యెడ వాదు లాడకు
బాలురతోఁ జెలిమి చేసి భాషింపకుమీ
మేలైన గుణము విడువకు
ఏలిన పతి నింద సేయ కెన్నడు
సుమతీ
!
ఓ సుమతీ ! ఎట్టి
పరిస్థితుల్లోను ఆడవారి తో వాదానికి దిగవద్దు. చిన్న పిల్లలతో స్నేహం చేసి , చనువు గా
మాట్లాడవద్దు. మంచి గుణాలను ఎంత కష్టమొచ్చినా వదిలి పెట్టవద్దు. జీవనభృతి కల్పించి , బ్రతుకు తెఱువు చూపించిన
యజమానిని ఏనాడు నిందించవద్దు.
ఇతి
శమ్*
**************************
ఇది సుమతీ శతకం తేజస్వినీ వ్యాఖ్య సంపూర్ణమ్ ************
No comments:
Post a Comment