శ్రీ నృసింహ పంచవింశతి
ఇది తొలి
దేశభక్తి కావ్యం ?
శ్రీనృసింహ పంచవింశతి ఇరవై ఐదు సీస పద్యాలతో
వ్రాయబడిన లఘుకృతి. ఇది ఒక అముద్రిత గ్రంథము.
తిరుపతి శ్రీ వేంకటేశ్వర ప్రాచ్యలిఖిత భాండాగారము (O.R.I) నందు తాళపత్రాలను సంస్కరించే దశ లో లభించిన ఈ తాళపత్ర గ్రంథం ఆనాడు ఆ సంస్థ కు డైరెక్టరు గా ఉన్న
డా.కే.జె.కృష్ణమూర్తి గారిచే సంస్కరించబడి, ఒక చిరు పొత్తముగా (Hand book) ముద్రించబడి , పరిశోధక విద్యార్థులకు అందుబాటులో ఉంచబడింది.
1996 అనుకుంటాను.
నేను U.G.C .Refresher course కి మా
కాలేజి ద్వారా శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి వెళ్లినప్పుడు శ్రీ కృష్ణమూర్తి
గారు వారి పరిశోధనా గ్రంథం “తరిగొండ వెంగమాంబ కృతులు” అనే
గ్రంథం తో పాటు తో పాటు దీన్ని కూడ ఆనాటి R.C సభ్యులందరికీ
అందచేశారు. ఆ విధం
గా ఈ పుస్తకం నా గ్రంథాలయం లోకి చేరింది.
ఇంతకాలానికి ఇప్పుడు ఈ విథం గా
వెలుగు చూస్తోంది.
ఈ లఘుకావ్య మందలి విషయం చారిత్రకమైనది. అంతేకాదు
ఇది పేరుని బట్టి భక్తి కావ్యం గా
కన్పిస్తున్నా దీనిలో అంతర్లీనం గా
ప్రజ్వరిల్లుతున్నది మాత్రం దేశభక్తి. క్రీ.శ 19 వ శతాబ్దం పూర్వభాగం లో మన దేశాన్ని
ఏలిన ఈస్టిండియా కంపెనీ అండదండలతో కొంతమంది ఆంగ్లదొరలు హిందూధర్మానికి , హైందవ
సంఘానికి కల్గిస్తున్న ఇబ్బందులను, ఇక్కట్లను కన్నులార చూసిన గర్గలాలు అనే పేరు గల కవి తన ఇష్టదైవమైన అహోబిల నరసింహస్వామి
ని , కినుక బూని వచ్చి ఈ ఆంగ్లేయులందరిని
సంహరించి హిందూధర్మాన్ని, సమాజాన్ని, కాపాడమని వ్యాజోక్తి రూపం లో వేడుకోవడం ఈ కావ్యం లో ప్రధానాంశం.
“
క్రీస్తుమతజులఁ జెండుమా కినుక తోడ
వైరి గజసింహ! యో బల
నారసింహ! ”
అనేది ఈ పద్యము లందలి మకుటము. ఇక్కడ
కన్పిస్తున్న “ క్రీస్తుమతజులు” ఆనాడు ఆంథ్రదేశాన్ని
నిరంకుశాధికారం తో పీడిస్తున్న ఈస్టిండియా కంపెనీ వారే కాని వేరు
కాదు. కవి ఇంతగా వేదన చెందడానికి కారణమైన
ఆనాటి పరిస్థితులను కవి తన కావ్యం లో విస్పష్టం గా ప్రకటిస్తాడు.
“ఆంగ్లేయులు
తాము భూమీశులైన భూమి నేలుకొనవచ్చును గాని మా కులాచారాలను అడ్డుకొనవచ్చునా.
ముక్తిమార్గములను కనిపెట్టియున్నచో మురియుచుండగవచ్చు గాని, మా శాస్త్రములను
అధిక్షేపించవచ్చునా. వారు మతభేదాలను సృష్టిస్తూ, అన్యమతాలను అవహేళన చేస్తూ ,
గోవులను , ద్విజులను బాధించుచూ, నీ భక్తులను పట్టి హింసిస్తూ, కత్తులతో పొడిచి చంపుతున్నారు. వారు దైవదూషణ చేస్తుంటే వింటూ
కూడ, సింహాద్రిఅప్పన్న, తిరుపతి వెంకన్న, శ్రీరంగేశుడు, కంచి వరదరాజులు , పూరి
జగన్నాధుడు, కూర్మనాధుడు మొదలైన దేవుళ్ళందరు మూతి మీద మీసాలు లేని వారవడం చేత ఆ
తెల్లవారిని ఏమి చేయలేక మూల మూలల దాక్కొంటున్నారు. మూతిమీద మీసాలున్న నువ్వు కూడ
వారి ఆర్భాటాలకు భయపడి కొండెక్కి
కూర్చున్నావా. నీవైనా ఈ ముష్కరులను పరిమార్చి మమ్మల్ని కాపాడకపోతే మాకు ఎవరు
దిక్కు” అని
పలురీతులుగా ఆ ఆంగ్లేయుల దురాగతాలను ఏకరువు పెడుతూ, అహోబిల నారసింహుని వేడుకుంటాడు కవి.
ఒక్కమాట లో చెప్పాలంటే- అణువణువునా
స్వాతంత్య్ర భావాలు పరుగులెత్తుతుంటే పరాయి వాడి పాలన లోని పీడన లో నించి, ‘ ఇలా ఎందుకు బ్రతకాలి’ అనే ఆవేశం ఈ యుద్ధవీరునిలో కలిగి ఈ కావ్యం ఆవిర్భవించింది. స్వాతంత్య
పోరాట దీప్తిని తరువాత తరానికి అందించిన తొలి కావ్యం గా దీన్ని మనం
ఆదరించవచ్చు. ఆంగ్లేయులకు అధికారం ఉంటే
పాలించుకోవచ్చు . అంతేకాని మా సంస్కృతీ సంప్రదాయాల మీద , ఆచార వ్యవహారాల మీద,
మా ఋషి ప్రోక్తమైన సంప్రదాయ సాహిత్యం మీద
దాడి చేసి వాటిని అవహేళన చేసే అధికారం మీ కెవరిచ్చారని ప్రశ్నించడం ఖచ్చితం
గా స్వాతంత్ర్య పోరాటపు తొలి నినాదమే.
ఆ నినాదమే తరువాత
రోజుల్లో సిపాయిల తిరుగుబాటుకు దారితీసింది. సంస్థానాధీశులు తమ స్వయంప్రతిపత్తిని
కాపాడుకోవడానికి పోరాడాల్సి వచ్చింది. “స్వాతంత్య్రం నా జన్మహక్కు”అని గర్జించింది. అయితే ఈ
కవి తనలో కలిగిన ఆవేశాన్ని, బాధను ఎవరికి చెప్పు కోవాలో తెలియక తన ఇష్ట దైవం ,
తాను నమ్మిన స్వామి యైన ఆ అహోబిల
నారసింహుని వేడుకున్నాడు. ఈ ఆంగ్లేయులను
నాశనం చేయమన్నాడు. నీవు కాకపోతే ఈ పని ఎవరు చేయగలుగుతారని ప్రశ్నిస్తాడు .
అందుకే ఇటువంటి
స్వాతంత్య్ర భావాలు కలిగిన తొలితరం కవులలో ఇతను ఆద్యుడు కావచ్చునేమో ననిపిస్తోంది.
అయితే ఈ కవి
చేసిన ఈ స్వాతంత్ర్య నినాదం అనతి కాలం
లోనే సమీప ప్రాంతం లోని మరి కొంతమంది
వీరులపైన ఆ ప్రభావాన్ని చూపింది. ఈ కవి
సాహిత్యం ద్వారా తన తిరుగుబాటు ను ప్రకటిస్తే—ఈ
కవి ప్రార్థన మన్నించి అహోబిల నరసింహుడే
పంపించాడా అన్నట్లు--
ఈ ప్రాంతం నుంచే మరొక వీరుడు ఏకం గా
కత్తి పట్టి ఈస్టిండియా ప్రభుత్వ
సేనలతో పోరాడి తన ప్రతాపాన్ని ప్రదర్శించాడు.
అతనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈ విప్లవ
వీరుడు ఈ అహోబిలప్రాంతం లోని కోవెలకుంట్ల తాలూకా నొస్సంకోట జమీందారు. ఈయనే
అనంతర కాలం లో ‘ రేనాటి విప్లవ వీరుడు’ గా
ప్రజల చేత జోహారు లందుకున్నాడు.ఈయనకు అహోబిల నారసింహుడు ఇష్టదైవము. ఈతని పేరు
నరసింహారెడ్డి. ఈయన కోట పేరు నొస్సం. అంటే “నృసింహం” (నొస్సం అనే గ్రామ నామం నృసింహం అనే శబ్దానికి తద్భవ రూపం గా
చెప్పబడింది). అంతా నారసింహమే.
తిరుమణి ధారియైన ఈ
రేనాటి వీరుడు 1846-47 సంవత్సరాలలో ఈస్టిండియా ప్రభుత్వ సేనలతో పోరాడిన అపూర్వ
సంఘటన చరిత్ర లో నిలిచి పోయింది.
( శ్రీ వేంకటేశ్వరరెడ్డి అనే మిత్రులు ఈ ఫోటోను Face book లో పెట్టారు. కాకతాళీయం గా అది నా కంటపడింది. నా పాఠకుల కోసం దాన్ని ఇక్కడ అందిస్తున్నాను. మిత్రులు వేంకటేశ్వరరెడ్డి గార్కి కృతజ్ఞతలు.)
1857 లో ప్రారంభమైన తొలి స్వాతంత్ర్య సంగ్రామానికి పది,పదిహేను సంవత్సరాల ముందుగా అంటుకున్న ఈ పోరాటం స్వాతంత్య పోరాటం లో భాగం కాదని ఎలా అనగలం.. ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జానపద వీరుడుగా ప్రజలచేత కొనియాడబడుతున్నాడు. డా.తంగిరాల వెంకట సుబ్బారావు గారి సిద్ధాంత వ్యాసం “ తెలుగు వీరగాథా కవిత్వము ”రెండవ భాగం లో (పేజి 820 ,821) ఈ నరసింహారెడ్డి ప్రస్తావన ను మనం చూడవచ్చు.
అయితే ఆ కాలం లో పాశ్చాత్యుల
దురాగతాలు భరింపరానివిగా ఉన్నాయన డానికి చారిత్రక ఆథారాలు కొన్ని గ్రంథాల్లో మనకు లభిస్తున్నాయి.భారతీయ
విద్యాభవన్ ,బొంబయి వారు 1970 లో ప్రచురించిన The History and culture of the Indian
people,Vol.9,Part.1 . అనే గ్రంథం లో 417-422 వ పేజి వరకు చరిత్ర కారులు వ్రాసిన విషయాలను ఇక్కడ పరిశోధకులు ఉటంకించడం జరిగింది.
ఉదాహరణ కు --
“ ..........The
Indiscriminate assault on Indians by Englishmen was by no means uncommon
incident; there were serious cases of bodily injury, sometimes culminating in
death.(page 417).1
“But a far more serious cause of discontent was the vague dread, which
seized the minds of all classes of people, that the British government was
determined to convert the Indians into Christianity. (page.
418).
ఈ లఘుకావ్య రచయిత పేరు గర్గలాలు అని ఇంతకు
ముందే చెప్పుకున్నాం ఈతని తండ్రి లక్ష్మణసింగు. ధనసింగు , మకరసింగు అనే వారు ఈయన తాత, ముత్తాత
లు. హైమవతీ దేవి వర ప్రభావం తో తాను
జన్మించినట్లు ఈ కావ్యం లోని 25 వ పద్యం లో ఈ కవి చెప్పుకున్నాడు . “క్షత్రియ వంశాబ్దిచంద్రుడు” అని తాతను వర్ణిస్తూ చెప్పుకోవడం వలన వీరి పేర్ల చివర ‘ సింగు ‘, ‘లాలు” అని ఉండటం వలన ఈ కవి బొందిలీ జాతికి చెందిన వాడుగా భావించబడుతున్నాడు.
బొందిలీ వారు ఉత్తర భారతదేశం లోని బుందేల్ఖం డ్ ప్రాంతం నుండి కొన్ని శతాబ్దాల
క్రితమే సైనికోద్యోగాల కోసం తెలుగుప్రాంతానికి వచ్చి స్ధిరపడినట్లు చెప్పబడుతోంది.
శ్రీనాథుని చాటుపద్యాలలో బొందిలీ యువతి వర్ణన మనం చూడవచ్చు. శ్రీ సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్రుల సాంఘిక
చరిత్ర 164 వ పేజీలో ఈ ప్రస్తావన
కన్పిస్తుంది. శ్రీనాథుడు 14-15 శతాబ్దాల
మథ్య కాలం వాడు.
ఈ కవి కాలం 19
వశతాబ్దం పూర్వభాగం. ఎందుకంటే ఈ
కావ్యాన్ని క్రోధినామ సంవత్సర పుష్యశుద్ధ
అష్టమీ బుధవారం నాడు పూర్తి చేసినట్లు కావ్యం చివర్లో కవి వ్రాసుకున్న గద్యను
బట్టి తెలుస్తోంది. ఇది క్రీ.శ 1875 జనవరి 15 వతేదీ కి సరి పోతోంది.
పరికించి చూస్తే ప్రాచీన సాహిత్యం లో బొందిలీ క్షత్రియ వంశానికి
చెందిన కవులు కన్పించడం లేదు. ఈ విషయం లో
ఈ కవి అద్వితీయుడే. అంతే కాదు స్వధర్మము
యెడల అచంచలమైన విశ్వాసం, ఇష్టదైవమైన ఆ అహోబిల నరసింహుని యెడల అపరిమితమైన
భక్తి ఈ కవి చేత ఈ కావ్యాన్ని
వ్రాయించాయి. యుద్ధవీరుల కుటుంబానికి
చెందిన వాడవడం వలన మీసాలున్న దేవుణ్ణి
ప్రార్ధించడమే కాకుండా, ఆ నారసింహుని మీసాలను
ప్రత్యేకించి ప్రస్తావించి, కు జనులను సంహరించవేమని స్వామిని నిలేసి , ప్రశ్నిస్తాడు.
ఇటువంటి వ్యాజస్తుతి శతకాలు తెలుగులో 18
వశతాబ్దం లో వచ్చిన సింహాద్రి నారసింహ శతకం , శ్రీకాకుళ ఆంధ్ర నాయక శతకం ప్రసిద్ధం గా కన్పిస్తున్నాయి. వీటి కోవలో తన కావ్యాన్ని కూడ చేర్చడానికి కవి శ్రీ
గర్గలాలు ప్రయత్నించి , సఫలీకృతుడయ్యాడనే చెప్పవచ్చు.
శ్రీ రమాలోల ! యాశ్రిత జన మందార !
లోకేశ ! సద్భక్త లోక పోష !
బాలార్క జిత
నేత్ర
! భావజాహిత వంద్య!
దంభోళి సమ
ధగద్ధగిత దంష్ట్ర!
వజ్రాయుధ ప్రభా
విజిత నఖాంకుర !
ధవళ ధరాధరోదార
దేహ
!
సంపూర్ణ
విక్రమ సంయుత భుజదండ !
ప్రళయ కాలాంతక
ప్రతిమ కోప!
కుమత జన శిక్ష ! మాధవాక్రూర వరద!
దానవాంతక ! వల్లవీ ధైర్య చోర!
క్రీస్తు మతజులఁ
జెండుమా కినుక తోడ
వైరి గజ సింహ ! యో బల నారసింహ
!
ఇది ఈ కావ్యం లో మొదటి
పద్యం. శ్రీ కారం తో కావ్యాన్ని సంప్రదాయ బద్ధం గా ప్రారంభించాడు కవి గర్గలాలు .
తన యిష్టదైవమైన అహోబిల నారసింహు ని అమేయ గుణ గణాలను అత్యంత
భక్తి ప్రపత్తులతో వర్ణిస్తున్నాడు.
ఓ అహోబిల నారసింహా ! శత్రువులనే ఏనుగులకు సింహము వంటివాడా ! శ్రీ లక్ష్మీ నాథా! ఆశ్రిత జన మందారమా ! సర్వలోక రక్షకా ! సద్భక్త సమూహమును పోషించి
రక్షించే వాడా! ఉదయ కాల సూర్యకాంతిని తిరస్కరింపగల్గిన నేత్రములు గలవాడా ! శంకరునిచే పూజించబడేవాడా ! వజ్రాయుధము తో సమాన మైన ధగధగలాడే వాడియైన కోరలు గలవాడా!
వజ్రాయుధ కాంతిని జయించిన నఖాంకురములు గలవాడా! ధవళ పర్వత సమున్నత
దేహుడా ! సంపూర్ణ
పరాక్రమము గల్గిన దండముల వంటి భుజములు
గలవాడా! ప్రళయ కాలాంతక సమానమైన కోపము గలవాడా! కు మత జనులను శిక్షించువాడా! కుమతులు అంటే చెడ్డవారని ఒక
అర్ధం. చెడ్డమతమును అనుసరిస్తున్న
ఆంగ్లేయులనేది గూఢార్ధం. మతము అంటే అభిప్రాయమని కదా సామాన్యార్ధం. రమా నాథా
! అక్రూరుని కాపాడిన వాడా! దానవాంతకా ! వల్లవీ జన ధైర్యాన్ని అపహరించిన
వాడా! ఉగ్రుడవై , ఈ ఆంగ్లేయులను చీల్చి, చెండాడ వలసింది.
ఈ విశేషాణాలన్నీ కూడ తాను కోరబోయే
కోర్కెను తీర్చగల్గిన అసమాన తేజస్సంపన్నుడు, అప్రమేయుడు, అవ్యయుడు, అజేయుడు నైన తన ఇలవేల్పు లో దండిగా ఉన్నాయని, అందుకే ఆయన ఆంగ్లేయులను
తుదముట్టించగలడని కవి యొక్క దృఢమైన విశ్వాసం.
భూమీశులై
తాము భూమినేలగ రాదె ?
మా కులాచారముల్ మాపదగునె ?
నీతి కోవిదులైతె నియతి నుండగ రాదె ?
దైవ దూషణఁ జేయ ధర్మమగునె ?
ముక్తి మార్గముఁ
గంటె మురియు చుండగ రాదె ?
శాస్త్ర మాక్షేపణ చేయదగునె
?
అది గాక భువి నెన్న నథికులు గారాదె ?
నీ
కథల్ విని నవ్వ నియతి యగునె ?
అధిపులంచును నెవ్వరేమనగ లేరు;
వీరి పరిమార్ప నీవెగా
కితరు లెవరు ?
క్రీస్తు మతజులఁ జెండుమా కినుక తోడ
వైరి గజ సింహ ! యో బల నారసింహ !
ప్రభూ ! అహోబిల నారసింహా
! ఈ ఆంగ్లేయులు తాము పాలకులైతే భూమిని పరిపాలించుకోవచ్చు గాని
మా కులాచారాలను రూపు మాపడమెందుకు ? వారు నీతికోవిదులైతే
నియమం తో మెలగవచ్చు గాని దైవ దూషణ చేయడం ధర్మం కాదు గదా! ముక్తి మార్గాన్ని వారు కనిపెట్టియున్నచో
ఆనందించవచ్చు గాని మా శాస్త్రాలను ఆక్షేపించడం ఎందుకు ? వారు ఈ భూమి లో
గొప్పవారవ్వచ్చు గాని నీ కథలను విని హేళన చేయడం ధర్మమా?
వాళ్లు పాలకులనే భయం తో ఎవరూ ఏమీ అనలేక పోతున్నారు వీరిని సంహరించడానికి నీవు గాక ఇంకెవరు సమర్థులవుతారు.
కాబట్టి అహోబిల నారసింహా ! నీవు వచ్చి వీరిని పరిమార్చి నా దేశాన్ని, సమాజాన్ని కాపాడు స్వామీ!
ఈ కాలం
లో అహోబిల క్షేత్ర పరిసరాలలో పాశ్చాత్య క్రైస్తవ మిషనరీల మత ప్రచార కార్యక్రమాలు అత్యంత చురుకుగా ఉన్నట్లు ఆ రోజుల్లో
కర్నూలు డిప్యూటి కలెక్టర్ గా ఉన్న శ్రీ
నరహరి గోపాలకృష్ణమ చెట్టి గారిచే సంకలించబడిన The manual
of The Kurnool District (1886) 147, 148
పేజీలలో మనం చూడవచ్చు.
“Sometime previous to the year 1840 the LONDON Missionaries were in the habit of visiting cuddapah jail and preaching Gospel to the prisoners confined there in.”(page 147)
“ In the latter of the eighteenth century a Christian Mission established at satiapuram near poddutur. From satiapuram it extended its operation to Onteddupalli in Koilkuntla Taluk …….. (page 148).
మధు మాంసములు మెక్కి, మత్తెక్కి విప్రులు
బుట్టలు నెత్తిపై బూనునపుడు,
సత్క్రియా శూన్యులై
క్షత్రియు లెల్లను
గోమాంస మాదిగా గుడుచు నపుడు,
వసుధ మానవులంత వర్ణముల్ చెడి తాము
ధూర్తులై కోవెలల్
దున్ను నపుడు,
నీ భక్తులను బట్టి నిందించి , కత్తులఁ
జలముల
బడవైచి చంపు నపుడు
ధర్మ మార్గంబు లెల్లను దలగు నపుడు
నీదు శౌర్యంబు
కాల్పనా ? నేడు వేగ
క్రీస్తు మతజులఁ జెండుమా కినుక తోడ
వైరి గజ సింహ ! యో బల నారసింహ ! (3)
సంఘం లో
అగ్రవర్ణులు గా చెప్పబడే బ్రాహ్మణులు తమ కుల వృత్తులను మంటగలిపి, మతం పుచ్చుకొని
మద్యమాంసాలకు బానిసలై బుట్టలు నెత్తిన
పెట్టుకుంటున్నప్పుడు, క్షత్రియులు క్రియా శూన్యులై, గోమాంసాది నిషిద్ధ
మాంసములను భక్షించేటప్పుడు, సంఘం లోని మిగిలిన జనులంతా తమ తమ వర్ణ ధర్మాలను మంట గలిపి
దుర్మార్గులై అన్య మతస్థులతో కూడి ఆలయాలను
నాశనం చేస్తున్నప్పుడు, నీ భక్తులను నిందిస్తూ, కత్తులతో పొడిచి, నీళ్ళ
ల్లోకి నెట్టి చంపేటప్పుడు , ధర్మానికి
హాని జరిగేటప్పుడు కూడ నీవు రాకపోతే నీ పరాక్రమ మెందుకు. తగలబెట్టడానికా? కాబట్టి నీవు వెంటనే వచ్చి ఈ దుర్మార్గులను
సంహరించవలసింది ప్రభూ !
ఈ పద్యం లో కవి వాడిన బుట్టలు అనే పదం hats అనే ఆంగ్లపదానికి ఆంధ్రీకరణ గా గుర్తించాలి.
జలరాశి జొచ్చిన శౌర్యంబు దప్పెనో ?
పర్వతం బెత్తిన పటిమ దప్ప ,
ధర నుద్ధరించిన ధైర్యంబు దూలెనో ?
రక్కసు జీరిన రంహ చెడగ,
బలి మెట్టినట్టి నీ బల మెందు బోయెనో ?
నృపతుల జంపిన కో పమణగ
రావణు జంపు నీ రాజసం బుడిగెనో ?
ధరఁ గాచినట్టి నీ ధర్మ మెడల
బుద్ధ కలికావతారముల్ పూను టెల్ల
మాయమయ్యెన ? క్రీస్తుల మఱచి పోవ
క్రీస్తు మతజులఁ జెండుమా కినుక తోడ
వైరి గజ సింహ ! యో బల నారసింహ ! (4)
అహోబిల నారసింహ ప్రభూ ! మత్స్యావతారివై సోమకాసురుని చంపి వేదముల కాపాడిన
నాటి పరాక్రమం ఏమయ్యింది ? కూర్మరూపధారివై మంధరాద్రి నెత్తిన
బల సంపద ఎటు పోయింది ? వరాహావతార మెత్తి భూమి ని బ్రోచిన శౌర్యమేమయింది ? నరసింహుడై హిరణ్య కశిపుని చీల్చి చెండాడిన తేజస్సు ఏ దారిన పోయింది ? వామనుడవై బలి చక్రవర్తి ని పాతాళానికి పంపిన నీ పరాక్రమం ఏమయ్యింది ? పరశురాముడ
వై రాజులను తుదముట్టించిన ఆనాటి పౌరుషం ఏ
మంట కలిసింది ? శ్రీ రాముడవై రావణాసురుని తుదముట్టించిన నీ రాజసం ఏ మైపోయింది ? వాసుదేవుడవై ఇలలో ధర్మాన్ని
నిలిపిన నీ తేజస్సు ఏమయ్యింది ? ఈ ఆంగ్లేయులను చూడగానే భయం
తో బుద్ధ , కల్కి అవతారాలు దాల్చాలన్న
విషయాన్నే మర్చిపోయావా ? ఈ దుర్మార్గులను సంహరించు ప్రభూ
!
రమ తోడ గూడుండి భ్రమ జెందియో క్రీస్తు
మతజులఁ
బరిమార్ప మఱచుటెల్ల ?
శేషుని పై నిద్ర జెందిన వేడ్కయో
గో
ద్విజ పాలనల్ గోరకుంట ?
క్షీర సాగరమందు జేరిన మురిపమో
సాధుల కభయంబు చాటకునికి ?
పది రూపములు దాల్చు బడలిక చేతనో
వైరుల వధియించు వైళముడిగి ?
ఎందు నున్నావొ ? నీ పుట్టుకెంచ,నీదు
చక్ర శర సాధనంబులు మొక్కవడెనొ ?
క్రీస్తు మతజులఁ జెండుమా కినుక తోడ
వైరి గజ సింహ ! యో బల నారసింహ ! (5)
హే అహోబిల నారసింహ ప్రభూ ! మా అమ్మ లక్ష్మీదేవి తో కులుకుతూ ఈ దుర్మార్గులను
సంహరించడం మర్చిపొయావా ప్రబూ. ఆది శేషునిపై హాయిగా నిద్రించిన మత్తులో గో ద్విజ
రక్షణ మర్చిపోయావు. పాల సముద్రంలో పానుపు వేసుకున్న ఆనందం లో నీ భక్తులను
రక్షించడం లో ఏమరుపాటు పొందావా. దశావతారాలను దాల్చడం మూలంగా కలిగిన అలసట లో ఈ శత్రువులను సంహరించడం లో తాత్సారం చేస్తున్నావా స్వామీ. ఎక్కడున్నావో
కాని నీ పుట్టుక బంగారం కాను. నీ చక్రము ,
బాణము మొదలైన ఆయుధాలన్నీ మొక్కవొయినా ఏమి. అంటే పదును కోల్పోయినాయా ఏమిటయ్యా
స్వామీ.
ఈ
పద్యం లో ఒక అపురూమైన జాతీయం అత్యంత
అందంగా ఒదిగిపోయింది. స్వామిని గురించి
దెప్పి పొడుస్తూ చివర్లో ‘ నీ పుట్టు కెంచ “ అంటాడు
కవి . తెలుగునాట ఉన్న తిట్ల లో ఒకటి నీ పుటక బంగారం
కాను అని.
మనకు
అత్యంత ప్రీతిపాత్రుడైన వ్యక్తి మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాడనుకోండి.
ఉదాహరణ కు నాయనమ్మ ను చిన్ని మనవడు
ఆడిస్తూ,అటు ఇటూ పరుగెత్తిస్తూ ఎక్కువగా విసిగిస్తున్నాడనుకోండి . ఆవిడ
నోరార తిట్టే తిట్లు. ఓరి నీ పుట్టుక బంగారం కాను. నీ కడుపులో వరహలు పండ . నన్ను ఇబ్బంది పెట్టి చంపకురా అంటుంది.. అంటే ఆ బిడ్డ మీద మమకారం
తిట్టనియ్యదు. కాని వాడు మాట వినకుండా పరుగెత్తుతూ విసిగిస్తుంటే ముత్తవ గుండెల్లో దాగున్న
మమకారం అలా ప్రేమ గా బైటకొస్తుంది.
ఇక్కడ కవి కూడ తనఇష్టదైవమైన నారసింహుని నమ్ముకున్నాడు. వదులుకోలేడు. కాని
ఆయన తిన్నగా సరైన సమయంలో శత్రువును మర్ధించడం లేదనే వేదన ఉంది .అదే నీ పుట్టుకెంచ.
గా గుండెల్లోంచి దూసుకొచ్చింది.
“ఏం
పుటకరా నీది” అనే వెటకారం జానపదుల్లో వింటూ ఉంటాం.
ఇక్కడ కూడ ఆ పదాన్ని ఉచ్చరించే విధానం
లోనే, అంటే ఊనిక లోనే పొగడ్త , తిట్టు రెండు ధ్వనిస్తాయి. “నీ
పుటకెన్న” అనే మాట కూడ కవి కలం నుంచి అలవోకగా జాలువారిందే
గాని కావాలని వ్రాసి ఉండడు. ఆయన లోని
ఆవేశం , అహోబిలేశుని పైన కవి కున్న
అపారమైన అభిమానం వలన కల్గిన చనువు మెత్తగా ఆ మాటను అనిపించాయి. పుట్టుకే లేని ఆ
పరమాత్మ పుట్టుక ను గూర్చి నేనేం మాట్లాడతాను అన్నాడు కవి.
------- రెండవ భాగం త్వరలో
**************************************************