Saturday, 17 May 2014

శతక సౌరభాలు - 1 దాశరథీ శతకము - 7

శతక సౌరభాలు --1
                           
                             కంచర్ల గోపన్న   దాశరథీ శతకము --7

        


         కాంచన వస్తు సంకలిత కల్మష మగ్నిబుటంబు బెట్టిఁవా
         రించిన రీతి ,నాత్మ నిగిడించిన దుష్కర దుర్మల త్రయంబు
         బంచిత భక్తి యోగ దహనార్చిఁదగుల్పక బాయునే ?  కన
         త్కాంచన కుండలాభరణ ! దాశరథీ! కరుణాపయోనిధీ !       (88 ప )
            
                 ఓ రామచంద్రా  ! ప్రకాశించెడి స్వర్ణ కుండల భూషితుడీ . బంగారు ఆభరణములందలి మలినమును అగ్ని లో పుటము వేసి పోగొట్టినట్లు , ఆత్మకు మనోవాక్కాయముల వలన కల్గిన దోషములు భక్తి యనెడి అగ్ని లో  కాల్చని యెడల పోవు కదా  !

            నీ సతి పెక్కు కల్ములిడ నేర్పరి లోక మకల్మషంబు గా
            నీ సుత చేయు భావనము నిర్మల కార్యధురీణ దక్షుడై
            నీ సుతుఁ డిచ్చునాయువులు నిన్ను భజించినఁ గల్గకుండునే
            దాసుల కీప్సితార్దములు ? దాశరథీ! కరుణాపయోనిధీ !
                           
                   ఓ దాశరథీ  ! నీ ఇల్లాలు  శ్రీ మహాలక్ష్మీ దేవి సంపదలనిచ్చు తల్లి.  నీకుమార్తె గంగాదేవి ఎల్లలోకములను పావనము చేయు నిర్మల.   దోషములు లేని పనులు చేయుటలో నేర్పరి యైన నీకుమారుడు బ్రహ్మదేవుడు  ఆయువులను ఇచ్చును . ఇటువంటి నిన్ను సేవించి భక్తుల కోరికలు తీరకుండునే  రామచంద్రా !
           
             వారిజపత్ర మందిడిన వారి విధంబున వర్తనీయమం
             దారయ రొంపిలోనఁ దనువంటని కుమ్మరిపుర్వు రీతి సం
            సారమునన్ మెలంగుచు  విచారగుఁడై పరమొందు గాదె స
            త్కార మెఱింగి మానవుడు దాశరథీ! కరుణాపయోనిధీ
                         
                               శ్రీరామచంద్రా ! తామరాకుపైన  నీటిబొట్టున్నను ఆకునకు నీరు అంటని విధంగా , బురదలో కుమ్మరిపురుగున్నను దాని ఒంటికి బురద అంటని విధం గా , మానవుడు సంసారము లో ఉన్నను  పరమాత్మ విచారణ లో నున్నచో మోక్షమును పొందగలడు .

           ఎక్కడ తల్లిఁ దండ్రి ? సుతు లెక్కడ వారు ? కళత్ర బాంధవం
          బెక్కడ ? జీవు డెట్టి ? తను వెత్తినఁ బుట్టుచుఁ బోవుచున్న వాఁ
          డొక్కడె పాపపుణ్య ఫల మొందిన నొక్కడె కానరాడు వే
          ఱొక్కడు వెంటనంటి భవమొల్ల నయా కృపజూడుమయ్య నీ
          టక్కరి మాయలం దిడక దాశరథీ! కరుణాపయోనిధీ !
                        

                                      శ్రీ రఘునాథా !  తల్లి ,తండ్రి భార్య ,బిడ్డలు చుట్టములు వీరందఱు ఎవరు . ఈ జీవుడు ఎటువంటి శరీరాన్ని ధరించిన  తానే పుడుతూ , ఒంటరిగా తానే పోతూ ఉంటాడు. పుణ్య పాప ఫలములు వాడొక్కడే పొందును కాని ఎవ్వడు తోడురాడు. ఈ మాయ అంతయు నీదే స్వామీ  ! నన్ను ఈ టక్కరి మాయ లందు వేయకయ్యా రామా ! నాకు ఈ జన్మము  ,సంసారము వద్దు స్వామీ ! 
    

          తొరసిన కాయము ల్ముదిమి తోచినఁజూచి ప్రభుత్వముల్సిరుల్
          మెఱపులు గాగఁ జూచి మరి మేదినిలోఁ దమతోడివారు ముం
          దరుగుట జూచి ; తగు నాయు వెఱుంగక మోహపాశము
          ల్తరుగని వారికేమి గతి ? దాశరథీ! కరుణాపయోనిధీ !
      
               శ్రీరామా ! .ఏర్పడిన ఈ శరీరములు ముసలి వై ,సంపదలు రాజ్యములు  మెఱుపు వలే నశించిపోవునని , ఈ భూమిమీద తనతో పుట్టిన వారెందరో  చనిపోవుచండుటను చూచి కూడ తన ఆయుష్షును  గురించి ఆలోచింపక తాము శాశ్వతమనే అజ్ఞానపాశములలో చిక్కుకున్న వారి గతి ఏమౌనో గదా !

         సిరిగల నాడు మైమఱచి  చిక్కిననాడు దలంచి పుణ్యముల్
         పొరి పొరి జేయనైతి ,నని పొక్కిన గల్గునె గాలిచిచ్చుపైఁ
         గెరలిన వేళ ,దప్పిగొని కీడ్వడు వేళ , జలంబుగోరి త
         త్తరమునఁ ద్రవ్వినం గలదె దాశరథీ! కరుణాపయోనిధీ!

                ఓ రామా !  సంపద ఉన్నప్పుడు మదముతో మైమఱచి , పేదఱికము కల్గిననాడు  పుణ్యములు చేయలేదే యని దుఖించిన ఏమి ప్రయోజనము. అగ్ని ప్రమాదము  సంభవించినపుడు, దాహము వేసినప్పుడు నీటి కోసం బావిని త్రవ్వ యత్నించిన ఫలమేమి  !
     

                 జీవనమింకఁ బంకమునఁ జిక్కిన మీను చలింప కెంతయుం
           దావున నిల్చి జీవనమె తద్దయుఁ గోరు విధంబు చొప్పుడం
           దావలమైన గానిఁ గురిఁదప్పని వాడు తరించువాడయా
           తావక భక్తియోగమున దాశరథీ! కరుణాపయోనిధీ !
   
             శ్రీరామా !  చెఱువులో నీరెండి పోయినను  బురద లో చిక్కిన చేప నీటిపైనే గురిపెట్టుకున్నట్లు ,భక్తియోగము తో నీపై మనస్సు నిల్పిన వాడు  సంసారమును  దాటగలడు..

           సరసుని మానసంబు సరసజ్ఞు డెఱుంగును ,ముష్కరాధముం
           డెఱిగి గ్రహించువాడె ?  కొలనేక నివాసము గాంగ దుర్దురం
            బరయగ నేర్చునెట్లు ? వికచాబ్జ మరంద రసైక సౌరభో
           త్కరము మిళింద మొందు క్రియ దాశరథీ! కరుణాపయోనిధీ !
         
                   శ్రీ రామచంద్రా !   యోగ్యుల మనస్సును యోగ్యులెరుంగగలరు కాని నీచుల వలన కాదు. కమలములందలి తేనె యొక్క పరిమళము తేనెటీగకు తెలియును గాని ఆ కొలనులోనే ఉండెడి కప్పకేమి తెలియును . తెలియదు కదా అని అర్ధము .
        
             నోచిన తల్లిఁదండ్రికి తనూభవు డొక్కడె చాలు మేటి చే
             జాచనివాడు ,వేఱొకడు చాచిన లేదనకిచ్చువాడు , నో
             రాచి నిజంబె కాని పలుకాడనివాడు , రణంబు నందు మై
             దాఁచనివాడు  భద్రగిరి ! దాశరథీ! కరుణాపయోనిధీ !
                    
                        శ్రీ రామా ! పుణ్యాత్ములైన తలిదండ్రులకు   దానమునకై చేయి చాచని వాడు , అడిగిన వారికి లేదనక ఇచ్చువాడు , అబద్ధమాడని వాడు , యుద్ధము నందు పిరికి తనము  చూపని వాడు నైన గొప్పవాడు ఒక్క కుమారుడే చాలును. అటువంటి కొడుకును కన్న ఆ తల్లిదండ్రులు ధన్యులు .

          శ్రీ యుత ! జానకీరమణ ! చిన్మయరూప ! రమేశ ! రామ ! నా
         రాయణ ! పాహి పాహి యని ప్రస్తుతి జేసితి నా మనంబునన్
         బాయక కిల్పిషవ్రజ విపాటన మందగ జేసి సత్కళా
         దాయి ఫలంబు నాకిడవె ! దాశరథీ! కరుణాపయోనిధీ !
             
                                 శ్రీరామా ! జానకీనాథా .!  జ్ఞానస్వరూపుడా !  శ్రీలక్ష్మీనాథా రామా !  నారాయణా ! రక్షింపుము రక్షింపుము అని నామనస్సు నందు స్తోత్రము చేశాను. నీవు నా మనస్సు నందు నిల్చి  నాలోని పాపాల నన్నింటిని   నశింపజేసి  నాకు  శుభకరమైన మోక్షము నీయవలసినది రామా !

       ఎంతటి పుణ్యమో ? శబరి ఎంగిలిఁ గొంటివి వింతగాదె ? నీ
      మంతనమెట్టిదో ? యుడుత మేనిఁ గరాగ్ర నఖాంకురంబులన్
      సంతసమందఁ జేసితివి; సత్కులజన్మ మదేమి లెక్క? వే
       దాంతము గాదె నీమహిమ ?  దాశరథీ! కరుణాపయోనిధీ !
                     
                                    శ్రీరామచంద్రా ! నీ చేతలలోని రహస్యమేమో కాని రామా ! ఆ శబరి ఎంగిలి తిన్నావు  ఆవిడ ఎంత పుణ్యాత్మురాలో. ! నీ చేతి వేళ్ళ తో ఉడుత శరీరమును నిమిరి  దానిని సంతోషపెట్టావు . నీ గొప్పతనము జ్ఞానమే కాని  వంశము కాదు కదా శ్రీ రామా !

          బొంకనివాడె యోగ్యుఁ డరి పుంజము లెత్తినచోట బోరికిన్
          జంకనివాడె జోదు , రభసంబున నర్ధి కరంబు సాచినం
          గొంకని వాడె దాత మిము గెల్చి భజించిన వాడె ఫో నిరా
         తంకమనస్కుడెన్నఁ గను దాశరథీ! కరుణాపయోనిధీ !
          
                         శ్రీరామా ! అసత్యము చెప్పని వాడే యోగ్యుడు. యుద్ధరంగము నందు భయపడని వాడే వీరుడు. అడిగిన వారికి లేదనక ఇచ్చువాడే దాత . నిన్ను స్మరించి సేవించిన వాడే నిజమైన భక్తుడు.
     
              భ్రమరము కీటకంబు గొని పాల్పడి ఝంకరణోపకారియై
              భ్రమరము గా నొనర్చునని పల్కుటఁ జేసి భవాది దుఖసం
              తమస మెడల్చి ,భక్తి సహితంబు గ జీవుని విశ్వరూప త
              త్త్వమును ధరించుటే మరుదు దాశరథీ! కరుణాపయోనిధీ !
            

                                      శ్రీరామా ! తుమ్మెద ఒక పురుగు ను తీసుకొచ్చి  దాని వద్ద శ్రద్ధ తో ఝంకారము చేయుచూ , దానిని తుమ్మెద గా మార్చునని ( ? ) చెప్పెడి మాటలు  వింతగా లేవు. ఎందువలనంటే నీవు జీవుల  జన్మాది సంసార దు:ఖసంబంధమైన అజ్ఞానమనెడి  చీకటిని పోగొట్టి , భక్తితో కూడిన విశ్వరూప తత్త్వము నొందించుట గొప్ప కదా స్వామీ !

             తరువులు పూచి కాయలగుఁ దత్కుసుమంబులు పూజగా భవ
             చ్చరణము సోకి  దాసులకు సారములౌ ధనధాన్యరాశులై
             కరిభట ఘోటకాంబర నికాయములై ,విరఝానదీ సము
             త్తరణ మొనర్చుఁ జిత్రమిది దాశరథీ! కరుణాపయోనిధీ !
                         

                              శ్రీరామా  !  చెట్లు పూసి , అనంతరం కాయలౌతాయి. కాని ఆ పూలనే నీకు పాదపూజ చేసినచో నీ సేవకులకు   అవి  మంచిగా పరిణామ మొంది ధనధాన్య రాశుల నిచ్చును . చిత్రము గా అవియే భటులు ,గుఱ్ఱాలు ఏనుగు లు గా గల పరివారమేర్పడి  .తుదకు విరజానది ని దాటించి వైకుంఠమును చేర్చును.
   
          పట్టితి భట్టరార్య గురు పాదములిమ్మెయి నూర్ధ్వపుండ్రముల్
          బెట్టితి , మంత్రరాజ మొడిఁ బెట్టితి ,నయ్యమకింకరాళికిన్
          గట్టితి బొమ్మ ; మీ చరణ కంజములందుఁ దలంపు బెట్టి పో
          దట్టితి పాపపుంజముల ; దాశరథీ ! కరుణాపయోనిధీ !
                   

                                       శ్రీరామచంద్రా ! శ్రీ రఘునాథ భట్టాచార్యుల వారి పాదముల నాశ్రయించి , యీ విధంగా  నామములను ధరించి , శ్రీరామ తారక మంత్రాన్ని గ్రహించి , యమ భటులను తిరస్కరించి , మీ పాదపద్మాలనే మదిలో స్మరిస్తూ , పాపసమూహాలను పారాద్రోలాను ఓ సీతాపతీ !
               
          అల్లన లింగమంత్రి సుతు డత్రిజ గోత్రజు డాదిశాఖ కం
          చెర్ల కులోద్భవుండనఁ బ్రసిద్ధుడనై భవదంకితంబు గా
          నెల్లకవుల్ నుతింప రచియించిన గోపకవీంద్రుడన్ జగ
          ద్వల్లభ ! నీదు దాసుడను ; దాశరథీ ! కరుణాపయోనిధీ !    ( 103 ప )
          
                    శ్రీ రామచంద్రా  ! దయానిథీ  !  లింగన మంత్రి కుమారుడను . ఆత్రేయసగోత్రుడను. కంచెర్ల వంశంలో పుట్టిన వాడను .  ఆదిశాఖ అనగా శుక్లయజుశ్శాఖీయుడను అయిన గోపన్న అను కవీశ్వరుడనైన  నేను  నీ దాసుడనై  రామదాసు గా లోకేశ్వరుడవైన నీకు అంకితము గా  కవులెల్లరు మెచ్చునట్లుగా  ఈ శతకాన్ని రచించాను .  
          ఇది  శ్రీ కంచెర్ల గోపన్న నామధేయ శ్రీ భక్త రామదాస విరచితమైన
             
                           శ్రీ దాశరథీ శతకము, తేజస్వినీ వ్యాఖ్యా సహితము .
                                                             
                                                                  సంపూర్ణము.






*********************************************************************