Friday, 21 November 2025
చందిప్ప - మరకతశివలింగం.
చందిప్ప- మరకతశివలింగము.
శంకరపల్లి మండలము – రంగారెడ్డి జిల్లా.
హైదరాబాద్.
తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం లో చందిప్ప అనే చిన్న గ్రామం ఉంది. ఈ గ్రామం లోని మరకతశివలింగం ఈ గ్రామం పేరు ను వెలుగులోకి తెచ్చింది. ఊరి బయట పొలాల్లో ఒక చిన్నగుడి లో బ్రహ్మసూత్రంతో కూడిన మరకతశివలింగం ఉందని మితృల వలన విని చూడ్డానికి వెళ్లిన నేను ఆశ్చర్యపోయాను. బ్రహ్మసూత్రంతో కూడిన అంత మరకతశివలింగం ఆలనా పాలనా లేకుండా ఒక కాపలా దారుని రక్షణ లో ఉండటం నాకు ఆశ్చర్యాన్ని కల్గించింది. మాకు మేమే స్వ హస్తాలతో స్వామికి అభిషేకం చేసుకొని ,కొబ్బరికాయ కొట్టుకొని , హారతి ఇచ్చుకొని ప్రశాంతంగా కాసేపు కూర్చొని , వెనుదిరిగాము .ఇది ఆనాటి మాట . మఱి నేను చేసిన పూజాఫలమో ఏమో గాని ఇప్పుడు ఆ గుడి భక్తుల తాకిడితో కళకళ లాడుతోందని చూసి ఆశ్చర్య పోవడం మళ్ళీ నావంతే అయ్యింది . అతి తక్కువ కాలం లో అతి ఎక్కువ మార్పు. అది ఈ మరకతశివలింగ ప్రభావం .
మరకతశివలింగం - అమ్మవారు
ఇంతకీ ఈ ఆలయం హైదరాబాద్ కు సుమారు 40 కిలోమీటర్ల దూరంలోని శంకరపల్లి ప్రక్కనే ఉన్న చందిప్ప అనే గ్రామం లో ఉంది. ఈ మరకతశివలింగం క్రీ.శ1076-1120 మథ్య కాలం లో ఆంథ్రదేశాన్ని పాలించిన పశ్చిమచాళుక్యరాజులలో ప్రసిద్ధుడైన ఆఱవ విక్రమాదిత్యునిచే ప్రతిష్టించబడినట్లు శాసనాద్యాధారాల ద్వారా తెలుస్తోంది.
ఆఱవ విక్రమాదిత్యుని శాసనము
ఈ ఆలయానికి కాలభైరవుడు క్షేత్రపాలకుడు గా ఉన్నాడు. లింగానికి వెనుకవైపున అమ్మ వారి విగ్రహం కన్పిస్తోంది. ఆలయప్రాంగణం లో చెట్టు క్రింద కాలభైరవుడు ,మరి కొన్ని శిథిలవిగ్రహాలు ఉన్నాయి. వాని కెదురుగా కన్పిస్తున్న శాసన స్థంభము 11 వ శతాబ్ధం లో ఈ ఆలయ నిర్మాణసమయం లో 6వ విక్రమాదిత్యుడు వేయించిన శాసనంగా చెప్పబడుతోంది. ఆ ప్రక్కనే కుడి చెవ్వు కొట్టివేయబడిన ఒక నంది విగ్రహం కన్పిస్తోంది . ఇదే ఈ ఆలయచరిత్ర ను మనకు చెపుతోంది. అదేమిటంటే .....
చెవ్వు విరిగిన నందీశ్వరుడు
నేను ఈ వ్యాసం లో ఇంతకుముందు చెప్పినట్లు ఇంతటి ఉన్నత విలువలుగల ఈ మరకతశివలింగం విదేశీదాడులను తట్టుకొని చెక్కుచెదరకుండా ఉందంటే ఆశ్చర్యం గానే ఉంటుంది .కాని స్థానికులు చెప్పుకునే కథనం ప్రకారం విదేశీయుల దండయాత్ర సమయం లో ఆ ముష్కరులు గుడి పై దాడి చేసి ముందుగా నందీశ్వరుని పై సమ్మెటతో ఒక్కవేటు వేశారని,వెంటనే ఒక భయంకరమైన ఆబోతు రంకె , ఆ వెనువెంటనే శివలింగం నుండి ఒక్కసారిగా భగ్గుమని మంటలు వచ్చాయని, అది చూసి భయపడిన సైన్యమంతా పారిపోయిందని చెపుతున్నారు. ఆ సమయం లోనే నందీశ్వరుని కుడిచెవ్వు దెబ్బ తింది మరకతశివలింగం మాత్రం ధ్వంసం కాకుండా ఉందని చెప్పుకుంటారు. ఇది సహజం. ఆ భగవంతున పై నమ్మకం తో ఇటువంటి కథనాలు చాల ఆలయాల విషయం లో మనకు విన్పడుతూనే ఉన్నాయి. ఏమైనా మరకతశివలింగం చెక్కుచెదరకుండా ఇప్పటికీ పూజలందుకోవడం విశేషం గానే చెప్పుకోవాలి. ఇదే ఆలయప్రాంగణం లో మరొక శివలింగం కూడ మరకతశివలింగానికి ఎదురుగా నవగ్రహ మండప సమీపం లో ప్రతిష్ఠించి,పూజిస్తున్నారు. ఈ శివలింగం కూడా ఈ ఆలయపరిసరాల్లో తవ్వకాల్లో లభించింది.దీనికి కూడ బ్రహ్మసూత్రం ఉంది. అంటే ఈ ఆవరణ లోనే రెండు బ్రహ్మసూత్రం గల శివలింగాలు పర్వదినాల్లో అభిషేకాలు చేసుకోవాడానికి భక్తులకు అందుబాటులోకి ఉండటం నిజంగా భక్తుల అదృష్టంగానే భావించాలి. ఎంతో పుణ్యం చేసుకుంటెనే గాని బ్రహ్మసూత్రం ఉన్న శివలింగ దర్శనభాగ్యం లభించదని పెద్దల మాట.
మరకత శివలింగం
అనంతర కాలంలో చెవ్వు విరిగిన నంది విగ్రహాన్ని చెట్టుక్రిందకు చేర్చి ,మరోవిగ్రహాన్ని గుడి లో ప్రతిష్టించారు. గర్భాలయం లోకి చూస్తే మరకతలింగానికి ప్రత్యేకం గా పానపట్టం కన్పించదు. అభిషేకజలం పోవడానికి సన్నని గట్టు కన్పస్తుంది.ఇది కూడ ఈ ఆలయ ప్రాచీనత్వానికి ఒక ఉదాహరణ గా చెప్పవచ్చు.ఎందుకంటే మన దేశంలో గుప్తుల పరిపాలనా కాలం లోనే శివలింగాలకు ప్రత్యేకం గా పానపట్టాలు నిర్మించడం, ప్రకృతి,పురుషుడు అనే పరిపూర్ణ భావం తో పూజించడం ప్రారంభమైనట్లు పరిశోధకులు ధృవీకరించారని మనం గుడిమల్లం - పరశురామేశ్వర ఆలయాన్ని గురించి వ్రాసేటప్పుడు ప్రస్తావించుకున్నాం. చూ.గుడిమల్లం- పరశురామేశ్వరాలయం.
ఆలయప్రాంగణం లోని రెండవ శివలింగం.
ఈ మరకత శివలింగానికి వెనుకవైపుగా అమ్మవారి విగ్రహం ఉందని చెప్పుకున్నాం కదా. ఆ వెనుక పడమర గోడకు ఆనించి ప్రతిష్టించిన వినాయకుడు మరికొన్ని విగ్రహాలు కూడ తర్వాత కాలం లో భక్తులు,దాతల సహకారం తో ఆలయపునర్నిర్మాణ సమయం లో పెట్టినవి గా కన్పిస్తున్నాయి. అలాగే బయట ఆలయం గోడకు ఆనుకొని వీరఫలకంగా చెప్పబడే బల్లెం పట్టుకున్న వీరుని ఫలకం , అటుగా గుడికి కొంచెం ఆగ్నేయం గా ఒక పెద్ద పాడుబడిన బావిని కూడ మనం చూడవచ్చు.
వీరఫలకం
ఆలయ సమీపం లోని పాడుబడ్డ బావి
ప్రతి పున్నమి నాడు చందమామ అందంగా మరకత శివలింగం లో ప్రతిబింబించే దృశ్యం ఎంతో మనోహరంగా ఉంటుందట. అలాగే కొన్ని ఋతువులలో సూర్యోదయం కూడా మరకతలింగం లో అందం గా ప్రతి ఫలిస్తుందని ఇక్కడి వారు చెపుతున్నారు. నవగ్రహమండపాన్ని ,ధ్వజస్థంబాన్ని కూడ మనం ఆలయప్రాగణం లో చూడవచ్చు.
ఈ మరకతశివలింగాన్ని పూజిస్తే అష్టదరిద్రాలు నశించి,సంపదలు చేకూరుతాయని ,కోరుకున్నకోరికలు నెరవేరుతాయని,ఆయురారోగ్యాలు శక్తి ,యుక్తి లభిస్తాయని చెప్పబడుతోంది. అంతేకాకుండా ఈ మరకత శివలింగం భారత దేశంలోనే రెండవ అతి పెద్ద శివలింగమని, శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై ఈ మరకత శివలింగాన్ని పూజించాడని ఇలా కొన్ని కథనాలు కొల్లలుగా సోషల్ మీడియా లో ఈ శివలింగాన్ని కన్పిస్తున్నాయి. మంచిదే కాని ఆధారాలు కావాలి కదా అన్నది ప్రశ్న. ఏమైనా తప్పని సరిగా ఒకసారి చూడవలసిన దివ్యక్షేత్రం గా చందిప్ప మరకతశివలింగాన్ని గూర్చి చెప్పవచ్చు.
మరకత శివలింగం
ఈ మథ్య కాలం లో కార్తీకమాస ఉత్సవాలు ,నవరాత్రులు,శివరాత్రి ఉత్సవాలు వంటివి కూడ నిర్వహిస్తున్నారు. ప్రతి పౌర్ణమి నాడు దాతల సహకారం తో ఈ ఆలయం వద్ద అన్నదానం కూడ చేయబడుతోంది. కాలక్రమేణ ఇంకా మార్పులు చెందుతూ ఆలయం దినదినాభివృద్ధి చెందాలని భక్తులు మనసారా కోరుకుంటున్నారు.
---------------------------------------------------------------------------------------------------------
Subscribe to:
Comments (Atom)








