విస్మృతాంధ్ర కవిచంద్రుడు - శ్రీ దిట్టకవి రామచంద్ర కవి.
శ్రీ దిట్టకవి రామచంద్రకవి విస్మృతాంధ్ర కవిచంద్రుడు. ఈయన శతకాలు 1926 లో తొలిముద్రణ కు నోచుకున్నాయి. ఆ శతకాలను అనుసరించి ఈ కవిచంద్రుని కవితాసరస్వతిని దర్శించుకొనే ప్రయత్నం ఇది.
ఇతను నేటి ఆంధ్ర రాష్ట్రం లోని కృష్ణాజిల్లా
నందిగామ తాలూకా కంచికచర్ల మండలం లోని
గొట్టుముక్కల గ్రామ నివాసి. కాశ్యపగోత్రుడు. నియోగి బ్రాహ్మణుడు. వీరి తండ్రి ,తాతలు మహాకవులుగా పేరెన్నిక
గన్నవారు రంగరాయచరిత్రము ను రచించిన దిట్టకవి నారాయణకవి కుమారుడు. శ్రీ నారాయణ
కవి అచ్చనామాత్య పౌత్రులని , పాపరాయకవి వర్యుల పుత్రులని, శ్రీ రామచంద్ర
చరణారవింద ధ్యాన పరాయణులని రంగరాయచరిత్ర ఆశ్వాసాంత గద్యము వలన తెలుస్తోంది. శ్రీ నారాయణ కవి శ్రీ రామచంద్రునిపై నున్న
భక్త్యభిమానములతోనే తన కుమారునకు రామచంద్రుడని పేరుపెట్టుకొని
ఉంటాడు. ఆయనే ఈ దిట్టకవి రామచంద్రకవి.
అంతేకాదు .ఈ దిట్టకవి రామచంద్రకవి తాతగారు
సేతు మహాత్మ్యము, శకుంతలా పరిణయము, రామకథాసారము అను గ్రంథాలను రచించిన
దిట్టకవి పాపరాజు . రామచంద్రకవి శ్రీ వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు వారి ఆస్థానకవి గా
బహు సమ్మానము లందుకొన్నట్టు శ్రీ శేషాద్రి రమణ కవులు వ్రాశారు. ఆ సమయం లోనే అమరావతి పట్టణం లో వెలసిన
మహిషాసుర మర్ధని పై ఈ కవి శతకం వ్రాసి
ఉంటాడని భావించవచ్చు. వావిళ్ళ రామస్వామి శాస్త్రులు
అండ్ సన్సు ప్రచురించిన ఈ మహిషాసురమర్ధని
శతకము తొలిముద్రణ కు వ్రాసిన పీఠిక లో(20-4-25)
ఈ
రామచంద్రకవి నిగ్రహానుగ్రహ సమర్థుడు, ధూర్తుడు.(?) అనుటయే కాక ఈతని కవిత నిరర్గళ ధారాశోభితమై
మనోజ్ఞము గా నుండునని కూడ శేషాద్రి రమణ
కవులు కితాబిచ్చారు. ఇచ్చట ధూర్తుడు అన్న పదానికి తిట్టుకవి అని చెప్పడం రమణ కవుల
భావనై ఉండవచ్చు.
దిట్టకవి రామచంద్రుఁడు
దిట్టిన ఱాయైనఁ బగులు దీవించిన యా
బెట్టైనఁ జిగురుఁ
బెట్టును
గట్టిగఁ దొల్లింటి భీమకవి కాఁబోలున్.
వేములవాడ భీమకవి వలెనే ఈ కవి ని గూర్చి కూడ
అనేక విచిత్ర కథలు వాడుకలో ఉన్నట్లు ప్రస్తావించారు శేషాద్రిరమణ కవులు. “రామచంద్రకవి సత్కారము జరుగని చోటులఁ
దిట్టుకవిత నుపయోగించి బెదిరించి బహూకృతలందిన గడుసరి” అని
కూడ వ్రాశారు. పై పద్యమే ఈ మాటలకు
ఊతమిచ్చి ఉండవచ్చు. శేషాద్రి రమణకవులు ముక్త్యాల ఆస్థానం లో ఉన్న కాలం లో నందిగామ
మకాం గా ఉన్న సమయం లో ఈ కవి వ్రాసిన మూడు శతకాలకు పీఠికలు వ్రాశారు. శేషాద్రిరమణ
కవులు ఉటంకించిన శ్రీ రామచంద్రకవి
గ్రంథావళి ఇది.
1. రాజగోపాల శతకము.
2. ఉద్దండరాయ శతకము.
3. మహిషాసురమర్థని శతకము.
4. రఘు (కుల) తిలక శతకము.
5.ప్రబంధము లోని కృత్యాది వాసిరెడ్డి వారి వంశచరిత్రము.
6. హేలావతీ దండకము.
7. చాటుపద్యములు
వీనిలో మొదటి మూడు శతకాలు మనకు లభిస్తున్నాయి. వీటి మూడింటిని వావిళ్ల వారే 1926 లో
ప్రచురించారు. శ్రీ శేషాద్రి రమణ కవులు వరుసగా మూడు శతకాలను సంస్కరించి 1925 లోనే శుద్ధప్రతులను తయారు చేసి పీఠికలు వ్రాశారు. అవి
వరుసగా --
గొట్టుముక్కల రాజగోపాల శతకము పీఠికా రచన కాలము (1-1-1925).
ఉద్దండ రాయశతకము
“ (5-2-1925).
మహిషాసురమర్థని శతకము “ (20-4 -1925).
1980 ప్రాంతం లో ఈ పుస్తకాలు నాకు లభించాయి .అప్పటికి నేను
కాలేజీలో ఉద్యోగానికి చేరి ఐదేళ్లు అవుతోంది. ఖాళీ సమయాన్ని ఎక్కువగా లైబ్రరీ లో
గడిపే రోజులవి. ముప్పాళ్ళ బాబుగారు కళాశాల లైబ్రరీకి తన గ్రంథాలయం లోని పుస్తకాలతో
పాటు బీరువాలను కూడ కళాశాలకు బహూకరించిన
వదాన్యులు. వారిచ్చిన పుస్తకాలలో ఎంతో
అత్యంత విలువైన తెలుగు సాహిత్యం ఇప్పటికీ
కాకాని వేంకటరత్నం కలాశాల లైబ్రరీ లో భద్రం గా ఉంది. ఆ పుస్తకాలను
సబ్జక్టువారీ గా విభజించేటప్పుడు బాగా చినిగిపోయి , ఎర్రబడి పట్టుకుంటే విరిగిపోయే పుస్తకాలను శిథిల
గ్రంథాలు గా కట్టకట్టి ప్రక్కనపెట్టే సమయం
లో గొట్టుముక్కల పేరు కనపడటం తో సహజమైన ఉత్సుకతతో
మా లైబ్రేరియన్ ఆ పుస్తకాలను నాకు
చూపించడం,ఆ శిథిల గ్రంథాలను నేను ఒక
శుభలేఖ కవరు లో పెట్టి జాగ్రత్త చేయడం జరిగింది . వాటిని అలా భద్రపరచడానికి
ప్రత్యేక కారణాలు మూడు.
ఒకటి
. గొట్టుముక్కల గ్రామం లోని శ్రీ వసంత
వేణుగోపాలస్వామి ఆలయం లో అర్చకులు గా మా
తండ్రి గారు పదిహేడు,పద్దెనిమిది సంవత్సరాలు
పనిచేశారు. నేను ఉద్యోగం చేస్తున్న కాలం లో అప్పుడప్పుడూ అక్కడకు వెళ్ళడం
సంభవించేది.. ఆవిధం గా వేణుగోపాలుడి మీద నున్న అభిమానం తొలి కారణం.
రెండు. శేషాద్రి రమణ కవులు ముక్త్యాల సంస్ధానం తో
సత్సంబంధాలు కలిగి ఉంటూ మకాం నందిగామ లో ఉండటం. మరి నందిగామ మా ఊరు కావడం.
మూడు.
ఈ
రామచంద్రకవి వ్రాసిన ఉద్దండరాయ శతకం మా తాతగార్ల ఊరైన కురుమద్దాలి కి దగ్గరగా ఉన్న పెదమద్దాలి
లోని ఉద్దండరాయని గురించి వ్రాసిన దవ్వడం.
దిట్టకవి ఇంటి పేరు గల కుటుంబాలు అటు కురుమద్దాలి లోను , ఇటు గొట్టుముక్కల
లోను మా కుటుంబానికి స్నేహితులు గా ఉండటం
.
ఈ మూడు కారణాలు నన్ను ఈ మూడు పుస్తకాలను అలా
భద్రపరచేటట్లు చేశాయి. ఎప్పుడన్నా పుస్తకాలు దులిపేటప్పుడు కన్పించినా సర్ది మళ్లీ
అక్కడే పెట్టేయడం జరిగిపోయేది. ఇప్పుడు వాటికి ఈ అవకాశం వచ్చింది.
ఆనాడు శ్రీ
రాజగోపాలస్వామి గా పూజలందుకొన్న దైవమే అనంతర కాలం లో వసంత వేణుగోపాలుడి గా సేవ లందుకుంటున్నాడు. ఈమధ్య కాలం లో సంభవించిన కొన్ని పరిణామాల వల్ల
మా నాల్గో తమ్ముడు మళ్లీ గొట్టుముక్కల
ఆలయం లోకి అర్చకుడు గా రావడం, ఆ ఆలయం కూడ
పునర్నిర్మాణం జరిగి కొంత వెలుగును పుంజుకోవడం జరిగిపోయాయి. మా నాల్గో తమ్ముడు ఎప్పుడో
ఒకసారి నా దగ్గరకు వచ్చినప్పుడు ఉత్సాహం కొద్ది మన దేవుడి మీద వ్రాసిన శతకాన్ని ఎవరో
అచ్చు వేయిస్తామంటున్నారు ఇవ్వమని అడిగితే
నేను కూడ అంతకంటే కావల్సిందేముందని, ఆనందం గా ఆ శతకాన్ని వాడికివ్వడం జరిగింది.
ఆ యనంతరం ఈ మధ్యకాలం
లో మళ్ళీ నేను గొట్టుముక్కల వెళ్ళినప్పుడు ఆ పుస్తకాన్ని హైద్రాబాదు కు చెందిన
ఉదారులు శ్రీ దిట్టకవి వేంకటేశ్వర రావు గారు (అడ్వకేటు) ప్రింటు చేయించారని ఒక రెండు కాపీలు నాకిచ్చాడు మా తమ్ముడు. నాకు ఎంతో ఆనందం కల్గింది. ఈ
రోజుల్లో చక్కని ముద్రణ చేసి , అమూల్యం గా ఆ పుస్తకాలను అందించిన వారి వదాన్యతకు హృదయ పూర్వక అభినందనలు.
2011 లో ఈ ద్వితీయముద్రణ వెలుగు చూసింది.
ఈ
కవి కాలము సుమారు గా క్రీ.శ.1731 ప్రాంతము గా భావించబడుతోంది. దీనికి ఆధారం గా
కవివంశీయుల చెంత లభించిన ఒక సనదు కన్పిస్తోంది. ఇది నూజివీడు సంస్థానోద్యోగి
కవిమాన్యము ఫలసాయము విషయములో ఠాణేదారునకు వ్రాసిన ఆజ్ఞాపత్రము . దానికి నకలు ఇది.
గొట్టుముక్కల రాజగోపాల శతకము. --- ఈ
శతకము కంచికచర్ల మండలం లోని గొట్టుముక్కల గ్రామం లో వేంచేసి యున్న రాజగోపాలస్వామి ని స్తుతిస్తూ వ్రాసినది.
మొత్తం 102 పద్యాలు. గొట్టుముక్కల పురౌకా రాజగోపాలకా అనేది మకుటం. శతకమంతా మత్తేభ
శార్దూల వృత్తాలే వాడబడ్డాయి.
శ్రీ భద్రస్ధితు లాశ్రితావళుల కక్షీణానుకంపన్సదా,
లాభప్రాప్తులు గానొనర్చు నజులీలామోహనాకారమౌ,
యాభీరున్ నిను గూర్చి మ్రొక్కుదు ననల్పాకల్పతల్పాయిత
క్ష్మాభృత్పన్నగ గొట్టుముక్కలపురౌకా
రాజగోపాలకా !
( 1 ప )
శతకమంతా
శ్ర్రీకృష్ణలీలలు మధుర మనోజ్ఞం గా వర్ణించబడ్డాయి. శ్రీకృష్ణ కధామృత గానం తో కవి పులకించి పోతాడు. ఈ
మధుర దృశ్యాలను దర్శించడానికి ఆ నందవ్రజశ్రేణి ఎంత పుణ్యం చేసుకుందో కదా. ఆ
అదృష్టాన్ని తనకు కూడ కల్గించమని కవి పరి పరి విధాల నందనందనుణ్ణి వేడుకుంటాడు. భక్తి శతకాలలో
కన్పించే ఆవేశం ఇందులోను మనం దర్శించవచ్చు.
నీ సౌందర్య గుణంబు లెంతు మది లో నిన్నేనుతింతున్సదా
నీ సంకీర్తనలాచరింతు నను నీ నిత్యాను కంపాసుధా
కాసారంబునన్ దేల్పుమింక కమలాగండస్థలీ పత్రరే
ఖా
సంలేఖక గొట్టుముక్కలపురౌకా రాజగోపాలకా! (97 వ ప)
రాజగోపాలుడు “ కమలాగండస్థలీపత్రరేఖాసంలేఖకుడట” ఎంత మధురమైన భావనో చూడండి. మోహన రూపుని దివ్య లీలలు పరమానంద సంధాయకాలు కదా!
అల బృందావన వీధి ధేనువుల నెయ్యంబార బాలించవే
ళల నీవందొక గోవు గన్పడిన వెళ్లందోలితో నేను న
ట్టుల నజ్ఞానిని నన్ను బ్రోవు మిఁకఁదోడ్తోభఖ్తరక్షాసమా
కలితారంభక గొట్టుముక్కలపురౌకా రాజగోపాలకా! (94 వ ప )
రాజగోపాలుడు
భక్తపాలన కళా సంరంభకుడు కదా !
అందువలన ఆ స్వామి భక్తుడనైన తనను కూడ కాపాడవలసిందని , ఆనాడు బృందావన వీథులలో
ఆవులను కాచువేళ మరొక ఆవు మందలో కన్పిస్తే కాదని దూరంగా అదిలించలేదు కదా! అట్లే ఎంతమంది భక్తులున్నా నన్ను కూడ కాదనక కాపాడమని కవి ప్రార్ధిస్తాడు.
గొట్టుముక్కల రాజగోపాలస్వామి(వసంత వేణుగోపాలస్వామి) ఆలయ ప్రవేశద్వారము
ఈ విధమైన మధురమైన
పద్యరచన శతకమంతా కన్పిస్తుంది. వానిని పరిశీలించడానికి తగిన సమయాన్ని వేరే
తీసుకుంటాను.
2 .ఉద్దండరాయ
శతకము. నూజివీడు సంస్ధానం లోని పెదమద్దాలి గ్రామం
లో వేంచేసి ఉన్న ఉద్దండరాయస్వామి ని గూర్చి కవి ఈ శతకం రచించాడు. నూజివీడు
ప్రభువుల నుండి కవి యీనాము పొందినట్లుగా నున్న సనదు పైన పేర్కొనడం జరిగింది.
నారయ్య దేవళ్రాజువెంకటాచలం కు వ్రాసిన
ఆజ్ఞాపత్రమిది.
మొదటి శతకానికంటే ఈ శతకం లో రచనాప్రౌఢిమ , పరిపక్వత కన్పిస్తున్నాయి. అంతేకాదు. శతకమంతా
జకారప్రాస తో వ్రాయబడటం విశేషం గా చెప్పవచ్చు. 102 పద్యాలు మత్తేభ విక్రీడితాలే. చదవడానికి
. వినడానికి కూడ మధురం గా ఉంటాయి.
మద్దాలి
యుద్దండరా,య! జయశ్రీ సువిధేయ! భక్తజనగేయా! నిత్యభాగ్యోదయా!
అనేది మకుటము. మకుటమే మంచి గాంభీర్యాన్ని
సంతరించుకొని ఉద్దండరాయని రారమ్మని నిలబెట్టి పిలుస్తున్నట్లుంది.
1926 నాటి తొలిముద్రణ ముఖపత్రం
కవి అద్వైత సిద్ధాంత మందు సైతం
జితశ్రముడని ఈ శతకం నిర్ద్వంద్వంగా ప్రకటిస్తుంది. మచ్చునకు కొన్ని రసగుళికలను ఆస్వాదిద్దాం.
అజకాంతం భజియించి, భాగవతులం బ్రార్ధించి, డెందంబునన్
గజవక్త్రుం బ్రణుతించి, తొంటికవులన్ గైవారముల్ చేసి ప్రే
మ జోహార్జోహరటంచు సాగిలియెదన్ మద్దాలి యుద్దండ రా
య జయశ్రీసువిధేయ భక్తజనగేయా నిత్యభాగ్యోదయా!
ఇది ఈ శతకానికి తొలి పద్యం.
భజనీయైక మహాచిదంబర పదాంభస్సిక్తహేమాద్రిధ
న్విజటాడంబరకాంచనాంబరసదావిశ్వంభరా గోపసా
మజయానాహృదయాబ్జబంభర నమో మద్దాలి యుద్దండ రా
య జయశ్రీ సువిధేయ భక్తజనగేయా
నిత్యభాగ్యోదయా! (6 వ ప)
వృజినంబుల్ హరియించి నన్నెపుడు సహృష్టాత్ము గావించి నిన్
భజియింపన్ మతి బుట్టం జేసి కృపచేఁ బాలింపవే చందమా
మ జిగిం జేకొని కల్వమొగ్గవలె శ్రీ మద్దాలి యుద్దండ రా
య జయశ్రీ సువిధేయ భక్తజనగేయా
నిత్యభాగ్యోదయా ! (17)
త్యజియింతున్
భవబంధముల్ మనములో నర్చింతు నీపాదముల్
విజయంబందుదుమోక్షలక్ష్మీ వలనన్వేమాఱు సంగ్రామక
ర్మ జరాసంధ మదాపహారీ నృహరీ మద్దాలి యుద్దండ రా
య
జయశ్రీసువిధేయ భక్తజనగేయా నిత్యభాగ్యోదయా ! ( 18 వ
ప)
రజనింబోలె యవిద్య నెమ్మదికి నిద్రంగూర్చు విద్యాసమృ
ద్ధిజగచ్చక్షుడ పోలె తెల్వి నిడుఁ దద్విజ్ఞానహైన్యత్రియా
మజనం జేయవె తెల్వి గైకొనియెద్ మద్దాలి యుద్దండ రా
య జయశ్రీసువిధేయ భక్తజనగేయా నిత్యభాగ్యోదయా! (52 వ ప)
యజమానత్వమొసంగి జ్ఞానశిఖియం దత్యంతమత్కిల్పిషం
బజరూపంబుగ వేల్వఁ జేయవె త్వదీయాంఘ్రిద్వయీభక్తిసో
మజలంబాని పవిత్రమూర్తినగుదున్ మద్దాలి యుద్దండ రా
య జయశ్రీసువిధేయ
భక్తజనగేయా నిత్యభాగ్యోదయా ! ( 26)
పై రెండు పద్యాలలో అద్వైత పరిమళాలతో పాటు యాగ దీక్షితుడై
సోమరసపానం చేయాలనే కోరిక దృఢంగా కన్పిస్తోంది. కవి
జీవితం లో సంభవిస్తున్న ఆధ్యాత్మిక పరిపక్వత కు నిదర్శనాలుగా కన్పిస్తున్నాయి. అందుకేనేమో
రాజగోపాల శతకము ద్వితీయ ముద్రణకు సమీక్ష
రాస్తూ శ్రీ తురిమెళ్ల రామకోటీశ్వరరావు “రామచంద్రకవి తురీయాశ్రమము
స్వీకరించి రామయోగియై కాంచీనగరమున శాస్త్రవాదము
చేసి జయము గాంచెను”.
అంటూ తెలుగు విజ్ఞాన సర్వస్వము -4 వ సం.1174
పుట నుండి ఉదాహరించియున్నారు.
గజపుష్పాంచిత దివ్య దామములతోఁ గళ్యాణ చేలంబుతో,
భుజకీర్తుల్ మొదలైన సొమ్ముగమి తోఁబొల్పారు నీలంపు బొ
మ్మ జిగిన్ గన్పడవయ్య మ్రొక్కులిడెదన్ మద్దాలి యుద్దండ రా
య జయశ్రీ సువిధేయ
భక్తజనగేయా నిత్యభాగ్యోదయా ! (47 )
ఉద్దండరాయుని దివ్యదర్శనం
కవి కోరిక. అందుకు యజ్ఞయాగాదులు కూడ ఆ దివ్యదర్శనాన్ని అందించలేవనే విషయం 26
వపద్యం నుండి 82 వపద్యం వ్రాసే మధ్య కాలం
లోనే కవికి తెలిసి వచ్చింది. ఆయన లో వికసిస్తున్న ఆథ్యాత్మికపరిణతికి ఇది ఒక పెను
ఉదాహరణ. 82 వ పద్యం చూడండి.
యజనంబుల్ పదివేలు చేసినను యనిత్యైంద్రాశ్రయంబింతెకా,
ని జనిన్ మాన్పెడు లోకమబ్బదు తదున్మేషంబు నిన్ గొల్వ బ్రే,
మఁ జిగుర్కొన్న యనంతరంబునఁ గదా మద్దాలి యుద్దండ రా
య జయశ్రీ సువిధేయ
భక్తజనగేయా నిత్యభాగ్యోదయా ! (82 )
యజ్ఞ యాగాదులు చేస్తే అనిత్యమైన ఇంద్ర లోకం ప్రాప్తిస్తుంది
గాని పునర్జన్మ లేని లోకము లభించదు కదా. అది నీదర్శనం వలననే సాథ్యమని కవి ఘంటాపథంగా ప్రకటిస్తున్నాడు. ఈ శతకం పూర్తి వ్యాఖ్యానంతో త్వరలో.
ద్విజరాడ్వాహన నేను దిట్టకవి సూతిన్ గశ్యపర్షీంద్ర గో
త్రజుఁడన్, నామము రామచంద్రుడు భవద్దాసుండ నాయందుఁ బ్రే
మ జిగుర్పన్ శతకంబు గైకొనుము శ్రీ మద్దాలి యుద్దండ రా
య జయశ్రీసువిధేయ
భక్తజనగేయా నిత్యభాగ్యోదయా! (102)
ఇది ఈ శతకంలోని చివరి పద్యం.
3. మహిషాసురమర్దని
శతకము
--- అమరావతి నేలిన శ్రీ వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు సంస్ధానం
లో ఆస్థానకవి గా ఉన్న సమయం లో అమరావతి లో
కొలువు దీరిన మహిషాసురమర్దని పై చెప్పిన
శతక మిది.
తొలిముద్రణ ముఖపత్రం- 1926
“మహిషాసురమర్ధని పుణ్యవర్ధనీ” అనేది
మకుటం. ఈ శతకం లో ఇంతకు పూర్వపు తన శతకాలలో వలే మత్తేభ ,శార్ధూలాలను కాకుం డా ఉత్పల , చంపక మాలలను వాడటం విశేషం.
మొత్తం పద్య సంఖ్య 101.
శ్రీ వనితా సరస్వతులు చిత్తమెలర్పగఁ గ్రేవలన్ భవ,
ద్భావ మెఱింగి సేవ నెఱపన్ సురపంక్తి భజింప లోకముల్,
వావిరి నేలు నీకు ననువారము మ్రొక్కుదు హృద్యపద్యగ
ద్యావళినామతించి
మహిషాసురమర్ధని పుణ్యవర్ధనీ! (1 వ ప )
శరణని వేడినాడ నుసాదుమటంచుఁదలంచినాడ నీ,
వరతనయుండనౌట ననువారము నెమ్మది నమ్మినాడ సుం
దరకరుణా కటాక్షకలితా లలితా లలితారి గర్భసం
హరవికటాట్టహాస మహిషాసురమర్ధని పుణ్యవర్ధనీ ! (11 వ ప )
అమ్మల యమ్మ నీవలరుటమ్ములవాడగు వాని బ్రేల్చురో
సమ్మలరారు వెండిమల సామికి నేలిక సానివమ్మ నా
యమ్మగు నీకు భక్తజనాతావన మోమలరాచపట్టినా
యమ్మవు
నీవు సుమ్ము మహిషాసురమర్ధని పుణ్యవర్ధనీ! (17 వ ప )
జయజయ దేవతామణి విశాల సమంచిత పీఠవాసినీ,
జయజయ గంధసారఘనసారసుధారసమంజుభాషిణీ,
జయజయ శంకరార్ధ తనుసంగ విలాసిన భాస్వరాప్సరో
హయముఖ సన్నుతాంగి
మహిషాసురమర్ధని పుణ్యవర్ధనీ! (42 ప )
జయజనయిత్రి శోభన విశాల సుగాత్రి తుషారవచ్ఛిలో
చ్ఛ్రయవరపుత్రి నిత్య జలజ ప్రసవాంచిత నేత్రి సత్కృపా
నయ రసపాత్రి నిన్నిక ననారతముం భజియింతు నన్ను న
వ్యయదయజూడవమ్మ మహిషాసురమర్ధని పుణ్యవర్ధనీ! (43 ప )
ఇటువంట ప్రాతస్మరణీయ ప్రార్ధనాగుళుచ్చాలు ఈ శతకం
లో కో కొల్లలు గా కన్పిస్తాయి. అంతేకాదు. ఈ శతక పరిసమాప్తి నాటికి కవి ఈప్సితం కూడ నెరవేరినట్టే కన్పిస్తోంది.
అందుకే--
నిరతము నీకథామృతము నిశ్చలతన్ భజియింప గంటి నీ
చరణ సరోరుహంబులకు సాగిలి మ్రొక్కులిడంగ గంటి నీ
పరమ దయారసప్లుతికిఁ
బాత్రుడనైతి నిఁకేమి శంక నా
కరయ ఫలించెఁ
గోర్కి మహిషాసురమర్ధని పుణ్యవర్ధనీ ! (98 ప)
అంటాడు కవి.
శ్రీ రమణీ విశేష గుణ చిహ్నిత వీవు భవత్కృపాప్తి చే
ధీరుడ కశ్యపాన్వయుడ దిట్టకవీంద్రుడ రామచంద్రుడన్
గారవమొప్ప వృత్త శతకంబు రచించితి దీని సన్మణీ
హారము గా గ్రహింపు మహిషాసురమర్ధని పుణ్యవర్ధనీ ! (101 వ ప)
అంటూ అత్యంత ఆత్మవిశ్వాసం తో
, ఆనందగంభీరం గా శతకాన్ని ముగిస్తాడు. ఉద్దండరాయ శతకనిర్మాణం తో నూజివీడు సంస్థానం లో యీనాము లభించగా , ఇక్కడ పుణ్యవర్ధని
మహిషాసురమర్ధని అనుగ్రహం తో అమరావతీ ఆస్థాన ప్రాపకం లభించి ఉండవచ్చు.
ఏమైనా ఈ మూడు శతకాలు
ప్రసిద్ధమైన భక్తి శతకాల సరసన నిలిచినవే యనడం లో ఇసుమంతయు అతిశయోక్తి లేదు. మొదటి
రెండు శతకాల్లో ముఖ్యంగా ధూర్జటి
కాళహస్తీశ్వర ,కంచెర్ల గోపన్న దాశరథీ శతక ప్రభావం స్పష్టం గా కన్పడుతోంది.
వాటిని ప్రత్యేకం గా వీక్షించవచ్చు.
1925
నాటికీ శతకాలు ప్రసిద్ధి లో
ఉన్నాయనడానికి 1926 ప్రాంతం లో వావిళ్ల
వారు ప్రకటించిన భక్తిరస శతక సంపుటము రెండవ వాల్యుము లో ప్రచురించిన ఇరవై శతకాల్లో 3,4,5,6, శతకాలు గా రామచంద్రకవి వ్రాసిన రఘు
కుల తిలక , మహిషాసురమర్ధని ,ఉద్దండ రాయ ,గొట్టిముక్కల రాజగోపాల శతకాలు ఉండటం వాటికి ఆనాడు ప్రజల్లో ఉన్న ఆదరణకు
తార్కాణం గా భావించవచ్చు. తదనంతర కాలం లో ఈ కవి గ్రంధములు ఏ కారణం వలననో ప్రచారములోకి రాలేదు. అందుకే “ఇంతవరకీ కవి గ్రంథములు గాని సుప్రసిద్ధమగు
నామము గాని యాంధ్రలోకము ఎఱుగకుండుట పరితాపము అంటారు “శేషాద్రిరమణ
కవులు. ఈ గ్రంథాలు కవివంశీయులైన దిట్టకవి సుందరరామయ్య శర్మ పాకయాజి గారి తమకు లభించినట్లు రమణ కవులు
వ్రాస్తూ, పాకయాజి గారికి ఆంధ్రుల తరపున కృతజ్ఞతలు కూడ తెలియజేశారు.
శ్రీ రామచంద్రకవి నాల్గవ శతకము రఘుతిలక
శతకము
అని వావిళ్ల వారి కేటలాగు లోను,
వావిళ్ళ వారి భక్తి రస శతకసంపుటము రెండవ భాగం లో రఘు కుల తిలక శతకము అనియు చెప్పబడింది.
వాసిరెడ్డి వారి చరిత్రము. దిట్టకవి
రామచంద్రకవి అమరావతి లోని శ్రీ వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు సంస్థానం లో
ఉండగానే ఈ గ్రంథాన్ని వ్రాయడానికి
ఉపక్రమించి ఉండవచ్చు . ఏదో కారణం
గా అది అసంపూర్తి గా మిగిలిపోయి
ఉండవచ్చు. అందు కే ఈయన గ్రంథ పట్టిక ను ప్రకటిస్తూ రాజగోపాల శతకం లో ఐదవ గ్రంథం గా “ వేంకటాద్రి నాయుడు చరిత్రము” అని వ్రాసిన శ్రీ శేషాద్రి రమణ
కవులు ,ఉద్దండరాయ శతక పీఠిక లో “వాసిరెడ్డి
వారి చరిత్రము”అని , మహిషాసురమర్ధని శతక పీఠిక లోని గ్రంధపట్టిక లో “ప్రబంధము
లోని కృత్యాది వాసిరెడ్డి వారి వంశ
చరిత్రము”అని ప్రకటించి అనంతరము ‘
కృత్యాది యే ప్రబంధము నకు ముందు భాగమో
నిరూపింప వీలుకాదయ్యెను.’ అంటూ సందేహాన్ని వెలిబుచ్చారు. వాసిరెడ్డి సుబ్బదాసు
వ్రాసిన “వాసిరెడ్డి వారి వంశ చరిత్రము ”అనే గ్రంధమొకటి గ్రంధాలయాల్లో కన్పిస్తోంది. ఈ కృత్యాది భాగం లభిస్తే కాని
ఈ సందేహాలు నివృత్తి కావు.
హేలావతీదండకము. -- ఈ కవి
వ్రాసిన హేలావతీ దండకము రెండవ భోగినీ దండకము వలే నున్నదని , రచయు,
కవితాధారయు హృదయంగమము గా నున్నదని శ్రీశేషాద్రి రమణకవులు ప్రశంసించియున్నారు.
భోగినీ దండకము బమ్మెర పోతనామాత్య
ప్రణీతమన్న విషయం విజ్ఞులకు తెలుసు.
“ఈ కవి చాటుపద్యములు, సమకాలికులను గూర్చిన ప్రశంసాపద్యములు కూడ మాకు కొన్ని
లభించియున్న వానిని వరుసగా ప్రచురించెదము.” అన్న జంటకవుల ప్రయత్నం
ఏమైందో తెలియదు. కాని ఇటువంటి మంచి కవిత్వము సమాజానికి దగ్గరగా లేకపోవడం మాత్రం
ఆంధ్రసరస్వతికి బాధ కల్గించే విషయమే.
***** కాలోహ్యయం నిరవథీ
విపులాచ పృథ్వీ.***************