Wednesday, 20 June 2012

ఆ రోజుల్లో


                  ఆ రోజుల్లో వేసవికాలం ఎంత బాగుండేది. వయసు మీద కొచ్చాక ఎండలంటే భయమేస్తోంది కాని ఆరోజుల్లో వేసవి బాగుండేది. మాది కృష్ణాజిల్లా కురుమద్దాలి. అవును.విజయవాడ బందరు మార్గంలో రోడ్డుమీద కన్పించే ఊరే. రోడ్డుప్రక్కనే రెండు దేవాలయాలు వాటి మీద రంగులువేసిన పెద్దపెద్దబొమ్మలు ఆ దారిన వెళ్లిన వారందరికి గుర్తే . అదే మాఊరు. తాతగారు స్వాతంత్య్రసమరయోధులు.నాన్నగారు ఇంటికి పెద్దకొడుకు కావడం వల్ల తాతగారింట్లోనే కలిసుండేవాళ్లం.బాబాయి కుటుంబం వేరే ఊళ్లో ఉండేది.ఐదుగురు మేనత్తలు పెళ్లిళ్లై వాళ్ల వాళ్ల ఊళ్ళల్లోఉండేవారు.
                                         వేసవి సెలవలు వచ్చాయంటే బాబాయిగారి పిల్లలు, అత్తయ్యగారి పిల్లలు తాతగారింటికి వచ్చేవాళ్ళు. ఇంకేముంది.పిల్లలందరం కలిస్తే ముఫైఐదు నలభైమందిఅయ్యేవాళ్ళం. నిజం. ఉదయం పిల్లల చద్దన్నం కోసం అడ్డెడుగిన్నె దించేవాళ్ళు.ఆ రోజుల్లో ఇంట్లో పెద్దవాళ్లే కాఫీలు తాగేవారు.టిఫిన్ కల్చర్ అప్పటికింకా రాలేదు. తొమ్మిది గంటలకల్లా చద్దన్నాలు తినేసి పక్కనున్న గుళ్ళొకో ,పంచాయతీపార్కులోకో దూకేసేవాళ్లం పిల్లలందరం.మాతోపాటు ఎదురింటివాళ్ల  పిల్లలు,పక్కింటివాళ్ల పిల్లలు కలిస్తే మరోపదిమంది .అంటే యాభైమంది . ఎవరికొచ్చిన, నచ్చిన ఆటలు వాళ్ళు ఆడుకొనేవాళ్ళు. ఇంటిప్రక్కన విశాలమైన గుడి ఆవరణ, రోడ్డుదాటితే పంచాయతీ పార్కు,దాని ప్రక్కనే చెఱువు ,దాని ఒడ్డున తూర్పుగా గవర్నమెంటు బడి ,ఉత్తరంగా తాళ్ళతోపు,ఇవన్నీ మా ఆటస్దలాలే.
                               మధ్యాహ్నం బోజనాలవగానే పెద్దవాళ్ళందరూ ఎండలకి ఆపసోపాలు పడుతూ తాటాకు విసనకర్రల్నినీళ్లల్లో ముంచుకొని విసురుకొంటూ పడుకుంటే పిల్లలందరం గుళ్లోకి జారుకొని నెమ్మదిగా రోడ్డెక్కెసేవాళ్లం. కొందరు గడవాసం భుజానేసుకొని ఈతకాయలు, దొరికితే సీమతుమ్మకాయల కోసం బయలుదేరితే, మరికొంతమంది కొత్తఆవకాయ పచ్చడిని బాదంఆకులో చుట్టి జేబులో పెట్టుకొని.ముంజికాయలకోసం పొలంగట్లు పట్టేవాళ్లం.   ముంజికాయలు తింటూ ఆవకాయ నంజుకుంటే కడుపులోనెప్పి రాదని తోటివాళ్ళు చెపుతుండేవాళ్లు. ఆవకాయ కారం నిక్కరు జేబునిండాకారి మరకలవడం,ఇంట్లోవాళ్లు తిట్టడం అవన్నీ వేరేసంగతి. ఈతకాయగెలల్ని తెచ్చి పశువులపాక ప్రక్కనే గుంటతీసి పాతిపెడితే,మగ్గి,తెల్లారేసరికి పండేవి. ఆ ఎచ్చి పచ్చి కాయల్నిఅందరం పంచుకొని తినడం గొప్ప ఘనకార్యంలా భావించేవాళ్లం. సాయంత్రం చల్లబడే సమయానికి ఎండగట్టిన చెరువులోకి తామరగింజలకోసం జట్లుజట్లుగా బయలుదేరేవాళ్లం. చెఱువులోని తామరపూలు ముదిరి ఎండి తామరడిప్పల్లోంచి గింజలు పడిపోయేవి. చెఱువు ఎండిపోయినప్పడు ఆ నల్లమట్టిలోంచి తామరగింజల్నిఏరుకొచ్చి కొట్టుకొని తినడం ఒకఆటగాఉండేది.ఎవరు ఎక్కువ గింజలు ఏరితే వాళ్లు గొప్పగా ఫీలయేవాళ్లం.ఇంటికొచ్చి బావిదగ్గర బక్కెట్లకొద్దీ చల్లని స్నానాలు. స్నానాలు అయ్యే సరికి అన్నాలు సిద్ధం. ఎక్కడ. పురిగట్టుమీద.అదొక అందమైన దృశ్యం.మసకవెన్నెల్లో,సంధ్యాదీపపు కాంతుల్లో పురిగట్టుమీద పిల్లలందరూ గుండ్రంగా కూర్చుంటే మధ్యలో అత్తయ్య కూర్చొని అందరికీ అడిగి అడిగి వడ్డిస్తూంటే కబుర్లు చెప్పుకుంటూ మసకవెలుతుర్లో అన్నాలు తినడం తలుచుకుంటే గొప్ప అనుభూతి. ఈరోజుల్లో moon light dinner అంటారేమో దాన్ని. వడ్లు పురి కట్టడానికి సిమెంటుతో చేసే చప్టాని పురిగట్టు అంటారు.     
                               ఆరోజుల్లో కుటుంబం అంటే తల్లిదండ్రులు ఏడెనిమిదిమందిపిల్లలు ఉండేవారు.ఉమ్మడికుటుంబవ్యవస్ధ పోయి కుటుంబనియంత్రణ పెరిగిన ఈకాలంలో ఇవన్నీ ఎక్కడ కన్పడతాయి కధల్లో తప్పితే.ఏదో నష్టపోతోందన్పిస్తోంది ఈతరం. ఇంట్లోఉన్నఒక్కపిల్లాడికి ఆడుకోవడానికి చెల్లినో,తమ్ముణ్ణో ఇవ్వడానికే లెక్కలు చూసుకుంటున్న దంపతులున్న కాలమిది.
                               అన్నాలు అయిపోగానే మళ్లీ ఆటల్లోకే. ఆడపిల్లలు దాగుడుమూతలు,వెన్నెలకుప్పలు ఆడుకుంటుంటే,మగపిల్లలు పక్కనే ఉన్నపార్కులే కోతికొమ్మచ్చులాడేవాళ్లం. వెన్నెలవెలుగులో కోతికొమ్మచ్చులు. రాత్రి తొమ్మిది పదింటిదాక ఆడి,అలిసి, అప్పుడు ఆ ప్రక్కనే ఉన్నచాకలి చెఱువులో ఒళ్లు, కాళ్లు కడుక్కొని వచ్చి, గుళ్లో మండపంలో పెట్టుకున్న పక్కబట్టలు తీసి దుప్పటి మడతకూడ విప్పకుండా పరచి పడుకంటే  సూరీడు బారెడు పైకొచ్చి చురుక్కు మనిపిస్తుంటే, ఉలిక్కిపడి లేచి కూర్చునేవాళ్లం .కొద్దితేడాతో వేసవి సెలవలన్నీ ఇలాగేగడిచిపోయేవి.కోతి కొమ్మచ్చిలాడే సమయంలో ఎక్కడో కొమ్మల్లోఉన్నతేనెపట్టు కదిలి తేనెటీగలు దాడి చేయడం,రాత్రిపూట చెఱువులో దిగేటప్పుడు కనపడక  బురదకొయ్యమీదో, బావురుకప్ప మీదో కాలేస్తే అది నెత్తురొచ్చ్చేటట్లు గీరి నీళ్లల్లోకి జారిపోతే,పాము కరిచింది చచ్పిపోతానేమోనని తెల్లవార్లు భయం భయంగా పడుకోవడం తలుచుకుంటుంటే ఇప్పుడు నవ్వువస్తుంది . విచిత్రమేమిటంటే అంతమందిఉన్నాకొట్టుకోవడాలు,పోట్టాడుకోవడాలు ఉండేవికావు.అందుకే పెద్దవాళ్లుకూడా ఆడుకుంటారులే అని వదిలేసేవాళ్లు .అప్పుడప్పుడు పిల్లలమధ్య కీచులాటలొస్తే  అలిగి దూరంగాపోయి, మళ్లీ కాసేపటికొచ్చి జట్టులో కలిసిపోయేవాళ్లు కాని కక్షలకు,కోపతాపాలకు తావుండేదేకాదు. అందుకే భాల్యమెంత మధురం అనిపిస్తుంది ఆరోజుల్ని తలుచుకుంటే.
          ------