Sunday, 29 June 2014

శతకసౌరభాలు -3 మారన భాస్కర శతకము -3


శతక సౌరభము - 3
                       

                         మారన     భాస్కర శతకము - 3

                                          
                                                             आरोग्यं भास्करादिच्छेत्


చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా
చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చ రెచ్చటం
బదునుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా !

                           భాస్కరా ! ఎంత విద్యావంతుడైన  చదివిన విద్యయందలి సారమును తెలుసుకోలేనియెడల ఆ చదువు నిరర్ధకమే అవుతుంది. విద్యామర్మము నెరుగని విద్వాంసుడు వాసనలేని పూవు వంటి వాడే. అందుకే ప్రహ్లాదుడు  ‘చదువులలోని మర్మమెల్ల చదివితి తండ్రీ అంటాడు .  నిరర్ధకమైన చదువును గుణవంతులు మెచ్చుకోలేరు కదా. నలుని వంటివాడు వంటచేసినను ఆ వంటలో  ఇంచుక ఉప్పు వేయకపోతే రుచిఉండదు కదా !


దక్షుడు లేని ఇంటికిఁ బదార్ధము వేఱొక చోట నుండి వే
లక్షలు వచ్చుచుండినఁ పలాయనమై  చను గల్లగాదు , ప్ర
త్యక్షము వాగులున్ వఱద లన్నియు వచ్చిన నీరు నిల్చునే
యక్షయమైన గండి తెగినట్టి తటాకము లోన భాస్కరా !

                         భాస్కరా !  నిర్వహణా సామర్ధ్యం  లేని యజమాని  ఇంటికి ద్రవ్యము వేరొకచోటు నుంచి లక్షలు లక్షలు గా వచ్చినా కూడ వ్యర్ధంగా ఖర్చయి పోతుందే కాని  పైసా కూడ మిగలదు. ఏవిధంగానంటే గండి పడిన చెఱువులోకి ఎన్ని  వాగులు, వంకలు వచ్చి చేరినా ఒక్కచుక్క కూడ నీరు నిలవదు కదా !


దాన పరోపకార గుణ ధన్యత చిత్తములోన నెప్పుడున్
లేని వివేక శూన్యునకు లేములు వచ్చిన వేళ , సంపదల్
పూనినవేళ , నొక్క సరి పోలును , జీకున కర్ధరాత్రి యం
దైన నదేమి ,పట్టపగలైన నదేమియు లేదు భాస్కరా !


                 భాస్కరా !          పుట్టుగ్రుడ్డికి పగలు రాత్రి సమానమే కదా. అట్లాగే పరోపకార లక్షణమే లేని  మూర్ఖునికి ,  (ఇతరుల కొఱకు దానం చేయడం అలవాటు లేని పిసినారి కి )   పేదరికమున్నా , సంపదలు కలిసొచ్చినా వచ్చే పెద్దతేడా ఏముండదు కదా !


దానము సేయగోరిన వదాన్యున కీయఁగ శక్తి లేనిచో
నైనఁ బరోపకారమునకై యొక దిక్కున దెచ్చియైన నీఁ
బూనును ,మేఘుఁడంబుధికి బోయి జలంబులదెచ్చి యీయడే
వాని సమస్తజీవులకు వాంఛిత మింపెసలార భాస్కరా !

                        భాస్కరా ! దానం చేయడానికి అలవాటుపడిన దాత తన దగ్గర లేకపోయినా  ఇంకొకచోటు నుండి తెచ్చి మరీ  దానం చేస్తాడు . ఏ విధంగా నంటే  మేఘుడు సముద్రానికి వెళ్లి నీరు తీసుకొచ్చి వర్షాన్ని కురిపించి జీవులను ఆనందపరస్తున్నాడు కదా !


               దానము సేయనేరని యధార్మికు సంపద యుండి యుండియున్
         దానె పలాయనంబగుట తథ్యము , బూరుగు మ్రాను గాచినన్
దాని ఫలంబు లూరక వృథా పడిపోవవె యెండి గాలిచేఁ
గానలలోన నేమిటికిఁ గాక యభోజ్యములౌట భాస్కరా!

                      భాస్కరా ! దానం చేయడానికి చెయ్యి రాని అధార్మికుని యొక్క సంపద ఎవ్వరికీ ఉపయోగ పడకుండా కొంతకాలానికి నశించిపోతుందనేది సత్యం . ఎందుకంటే బూరుగు చెట్టు కాయలు పండినను అవి తినకూడనివి అవడం వలన , ఎండి  గాలిలో కలిసి ఎగురు కుంటూ  పోవడం మనం చూస్తూనే న్నాం కదా !


నడవక చిక్కి లేమి యగు నాడు నిజోదర పోషణార్ధమై
             యడిగి భుజించుటల్ నరుల కారయ వ్యంగ్యము కాదు పాండవుల్
    గడు బలశాలు లేవురు నఖండ విభూతిఁ దొలంగి భైక్ష్యముల్
గుడువరె యేకచక్రపురిఁ గుంతియు దారొకచోట భాస్కరా !

                  భాస్కరా  ! జరుగుబాటు లేక పేదరికం  కమ్ముకున్నప్పుడు కడుపు నింపుకోవడానికి మానవులు పరులను యాచించడం లో  తప్పులేదు.ఎందుకంటే గొప్పబలవంతులైన పాండవులే సంపద అంతా కోల్పోయిన రోజుల్లో తల్లి కుంతీ దేవి తో కలిసి ఏకచక్రపురం లో ఉంటూ భిక్షాన్నం తోనే జీవించారు కదా!


 పండితులైన వారు దిగువందగ నుండగ నల్పుఁ డొక్కడు
నుద్దండతఁ బీఠమెక్కిన బుధప్రకరంబుల కేమి యెగ్గగున్ ,
గొండొక కోతి చెట్టుకొన కొమ్మల నుండగఁ గ్రింద గండ భే
రుండ మదేభ సింహ నికురంబము లుండవె చేరి భాస్కరా!

                    భాస్కరా ! పండితులైన వారందరు  క్రింద కూర్చొని ఉండగా ఒక అల్పుడొకడు అగ్రాసనం మీద కూర్చొన్నంత మాత్రాన పండితుల కొచ్చిన అవమాన మేమీ లేదు. ఎందుకంటే మదపు టేనుగులు , సింహాలు , గండభేరుండాది పక్షులు  చెట్లక్రింద డగా , చెట్ల కొన కొమ్మల మీద కోతి తిరుగుతూనే ఉంటుంది కదా!   


పరహితమైన కార్యమతి భారము తోడిది యైనఁ బూను స
            త్పురుషుడు లోకముల్పొగడ బూర్వము నందొక ఱాలవర్షమున్
గురియగఁ జొచ్చినన్ గదిసి గొబ్బున గోజన రక్షణార్ధమై
గిరి నొక కేల నెత్తెనట కృష్ణుడు ఛత్రము భాతి భాస్కరా!

                     భాస్కరా! పరులకు ప్రయోజనం కల్గించే పని ఎంత కష్టమైనాదైనా కాని మంచివాడు  లోకం మెచ్చేటట్లుగా  ఆపనిని పూర్తి చేస్తాడు. పూర్వము ఱాళ్ల వర్షం కురుస్తుంటే శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఒక చేతితో గొడుగు వలే ఎత్తి పట్టి , గోవులను , గోపాలకులను రక్షించాడు కదా!


పూనిన భాగ్యరేఖ చెడిపోయిన పిమ్మట నెట్టి మానవుం
డైనను వాని నెవ్వరుఁ బ్రియంబునఁ బల్కరు పిల్వ రెచ్చటం
దానది యెట్లొకో యనినఁ దథ్యము పుష్పము వాడి వాసనా
హీనత నొందియున్నయెడ నెవ్వరు ముట్టుదురయ్య భాస్కరా !

                           భాస్కరా !  మానవుడు ఎంత గొప్పవాడైనను అదృష్టం ముఖం చాటు చేస్తే ఇక ఎవరు అతన్ని పల్కరించరు. ఎక్కడకు పిలవరు. ఏ విధంగా నంటే పువ్వు  వాడిపోయి , వాసన కోల్పోయిన తర్వాత దాని నెవరూ  ఆదరించరు కదా !

పూరిత సద్గుణంబు గల పుణ్యున కించుక రూప సంపదల్
దూరములైన  వాని యెడ దొడ్డగఁ జూతురు బుద్ధిమంతులె
ట్లారయ గొగ్గులైన మఱి యందలి మాధురిఁ జూచి కాదె ఖ
      ర్జూర ఫలంబులం బ్రియము చొప్పడ లోకులు గొంట భాస్కరా !

                   భాస్కరా ! సద్గుణ వంతునకు  అందము లేకపోయినను బుద్ధిమంతులు అతనిని గౌరవిస్తారు. ఖర్జూరకాయ మీద గొగ్గులున్నను (ముడతలుగా ఉన్నను )  దానికి గల మాధుర్యము చేతనే గదా దానిని అందరూ కొంటూ వుంటారు.                        

బంధుర సద్గుణాఢ్యుఁడొక పట్టున లంపట నొందియైన దు
    స్సంధిఁ దలంప డన్యులకుఁ జాల హితం బొనరించు గాక, శ్రీ
గంధపుఁ జెక్క రాగిలుచుఁ గాదె శరీరుల కుత్సవార్ధమై
          గంధము లాత్మఁబుట్టు దఱుగంబడి యుండుట లెల్ల భాస్కరా !

                 భాస్కరా !  గుణవంతుడు తాను కష్టాలను అనుభవిస్తున్నా, ఇతరులకు మేలు చేయడానికే చూస్తాడు కాని కీడు తలపెట్టడు. ఏ విధంగా నంటే గంధపు చెక్క తాను అరిగి, కరిగి పోతూ కూడ  పరిమళాలను వెదజల్లుతూ మానవులకు ఉత్సవ సమయాలలో  ఆనందాన్ని అందిస్తోంది కదా!


బలము దొలంగు కాలమునఁ బ్రాభవ సంపదలెంత ధన్యుడున్
నిలుపు కొనంగ నోపడది నిశ్చయ మర్జునుఁ డీశ్వరాదులం
గెలిచినవాడు బోయలకు గీడ్పడి చూచుచుఁ గృష్ణు భార్యలం
బలువుర నీయడే నిలువబట్ట సమర్ధుడు గాక భాస్కరా !

                    భాస్కరా ! దైవబలము తొలగిపోయిన కాలంలో ఎంత గొప్పవాడైనను వైభవ ప్రాభవాలను నిలుపు కోలేడు. ఎందుకంటే ఈశ్వరుడు మొదలైన  వాళ్లను కూడ గెలిచిన అర్జునుడు శ్రీకృష్ణుని మరణానంతరం అడవిలో అటకాయించిన బోయలను అడ్డుకోలేక , శ్రీకృష్ణుని అంతపురకాంతలను కాపాడలేక  అనేకమందిని బోయలకు అప్పగించాడు కదా !     

బలయుతుడైన వేళ నిజబంధుడు తోడ్పడు గాని యాత డే
 బలము తొలంగెనేని తన పాలిట శత్రు , వదెట్లు పూర్ణుడై,
జ్వలనుడు  కాన గాల్చుతరి సఖ్యము చూపును వాయుదేవుడా
బలియుడు సూక్ష్మదీపమగు పట్టున నార్పదె గాలి భాస్కరా !

                    భాస్కరా ! మానవుడు  ఆర్ధికం గా, శారీరకంగా బలంగా ఉన్నప్పుడు బంధువులు సహాయంగా  అతని వెంటే ఉంటారు కాని బలహీనుడైతే అందరూ అతనికి శత్రువులు గా మారిపోతారు. ఎలాగంటే జాజ్వల్యమాన ప్రకాశంతో అగ్నిహోత్రుడు అడవిని  కాల్చేటప్పుడు వాయుదేవుడు  స్నేహితుడై సహకరిస్తాడు. కాని ఆ  అగ్నిహోత్రుడే చిన్న దీపం గా ఉన్నప్పుడు  వాయువే శత్రువై ఆ దీపాన్ని ఆర్పివేస్తాడు కదా !

భుజబల శౌర్యవంతులగు పుత్రులఁ గాంచిన వారి కెయ్యేడన్
నిజహృదయేప్సితార్ధములు నిక్కము చేకురుఁ గుంతి దేవికిన్
విజయబలాఢ్యుఁ డర్జునుడు  వీర పరాక్రమ మొప్ప దేవతా
              గజమునుఁ దెచ్చి తల్లి వ్రత కార్యము దీర్పఁడె తొల్లి భాస్కరా!    (76 )

                 భాస్కరా ! భుజ బల పరాక్రమవంతులైన కుమారులను గన్నవారికి అనుకున్న కోరికలు తీరిపోతాయి. ఇది నిజము . ఎందుకంటే కుంతీదేవి కి పరాక్రమ సంపన్నుడైన అర్జునుని వంటి కుమారుడు కలిగాడు కాబట్టే   దేవలోకం నుండి ఐరావతాన్ని తీసుకొచ్చి ,  తల్లి చేసే వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయించాడు కదా ! 




                                                                                           
                                                                                              నాల్గవ భాగం త్వరలో      ---
******************************///////////////***********************  *****************