Monday, 17 September 2012

అశోకవని లో రాముడు


                                             


                     అశోకవని లో రాముడు
       
                             శ్రీ రామకధ  ప్రపంచంలోని ఎన్నో దేశాలలో ఎంతోమందిని మహాకవులుగా చేసింది. వాల్మీకి నాటికే లోకంలో శతాధిక రామాయణాలు ప్రచలితమౌతున్నట్లు  రామాయణమే చెపుతోంది.ఆధునిక పరిశోధనల్లో మూడువందలకు పైగా రామాయణాలున్నట్లు గుర్తించారు .
   “  As in many oral epics, multiple versions of the Ramayana survive. In particular, the Ramayana related in North India differs in important respects from that preserved in South India and the rest of South-East Asia. There is an extensive tradition of oral storytelling based on the Ramayana in Indonesia,Cambodia, Philippines, Thailand, Malaysia, Laos, Vietnam, and Maldives.[citation needed] Father Kamil Bulke, author of Ramakatha, has identified over 300 variants of Ramayana.[56]    “{ Wikipedia }
                                           
                                       రామకధలోని గుణశీలతలు అటువంటివి. అందుకే వ్రాసిన రామచంద్రు కధ వ్రాసితి నంచనిపించుకో వృధాయాసముగాక కట్టుకధ లైహికమా ? పరమా “? అన్నారు కవిసమ్రాట్ విశ్వనాధ రామాయణకల్పవృక్షంలో. హిందీకవి మైథిలీశరణ్ గుప్తా  -----
                              రామ్ తేరా వృత్త్ స్వయం హి కావ్య్ హై
                      కోయీ కవి బన్జాయా సహజ సంభావ్య్ హై  ||
               _____   రామా! నీకథే గొప్పకావ్యం.దాన్ని వ్రాయడానికి ప్రయత్నించిన ఎవరైనా కవి అవడంలో ఆశ్చర్యం లేదు గదా  “ –అంటాడు. రామకథ ను కొత్తకోణంలో దర్శించి నూతన ఆవిష్కరణ చేసిన ఆధునిక కవులెందరో ఉన్నారు.వారిలో బోయి భీమన్న ఒకరు.వీరి కావ్యమే అశోకవనిలో రాముడు.మన ఆత్మీయులు మనకు దూరంగా  కారణాంతరాలవల్ల నివసించినప్పుడు మనం ఆ ప్రదేశానికి వెళ్లడం సంభవిస్తే వారు అప్పుడు అక్కడ ఎలా, ఎటువంటి పరిసరాల్లో నివసించారో చూడాలనే ఉత్కంఠ కలగడం మానవసహజం. ఆత్మానం మానుషం మన్యే అని ప్రకటించుకున్న రామునిలో ఇటువంటి కుతూహలాన్నే దర్శించారు కవి.    
                              రామ రావణయుద్ధానంతరం రావణుని మరణం అనివార్యమైంది.లంకారాజ్యం విభీషణునికి అందించబడింది. అశోకవనంలోని సీత అలంకరణార్థం అంత :పురానికి తీసుకొనిపోబడింది. ఆ రాత్రి సమయంలో పదినెలలుగా సీత బంధించబడిన అశోకవనం ఎలా ఉందో చూడాలని---తన ఇల్లాలు ఇంతకాలం శోకించిన అశోకాన్ని చూడాలని శ్రీ రాముడు అశోకవనంలో  ప్రవేశించాడు.—అని కవి భావన. రాముడొక్కడే ఆ రాత్రి ఆ తోటలో  ఒంటరిగా తిరుగుతాడు.రకరకాల జ్ఞాపకాలతో భావాలతో బాధలతో సతమతమైనాడు. కన్నీరు కార్చాడు--------ఇది ఈకావ్యం.   అంటాడు  కవి.
                                       ఇది ఒక అధ్భుతమైన భావ ప్రధానకావ్యం. కవి  భావాలు రెక్కలు విదిల్చి విశాల విహాయసంలో స్వేచ్ఛగా విహరిస్తాయి. ముక్తకంగా సాగిన ఈ రచన ఏ పద్యానికి  ఆ పద్యమే బాగు అన్పిస్తుంది.  ఇది       అవాల్మీమని మనం ముందుగా గుర్తుచేసుకోవాలి.
    ఫ్రవిరళ భావవేగమున రాత్రికి రాత్రియె లేచివచ్చెనో ఎవరది?రాముడా వకుళవృక్షము క్రింద అశోకవాటికన్  “   అంటూ అశోకవనంలోని రాముని పాఠకులకు పరిచయం చేస్తాడు కవి.
                     ఒక్కడు, అర్ధరాత్రి, కనులుండియు లేని తమస్సు, చుట్టునున్
                     రక్కసి ప్రేతముల్ తమఉరమ్ముల నెత్తురు తామె త్రావుచున్  
                     క్రక్కుచు నుంట , కంట దశకంఠుని కాష్టము –ఔను రాముడే
                    ఒక్కడు  అర్ధరాత్రి ,  జ్వలితోహలతో  ఫలితాఖిలోహుడై  
                           జ్వలితోహలతో సంచరిస్తున్నాడు రాముడు. రావణుని మరణానికానందించి దేవతలు  చల్లిన పూలు చెట్ల కొమ్మల్లో చిక్కుకొని ఇప్పుడవి మరల రాముని పై రాలుతున్నాయి—ఆనాడు సీతమ్మ చల్లిన పూతలంబ్రాలను గుర్తు చేస్తూ. చిన్ననాడే శివధనుస్సును ఒక చేతితో ఆవలబెట్టిన అవనిజ లోని శక్తి ఏమైంది? రాముని కోసమని ఎదురు చూసిందే గాని ఒక్క మట్టిపెల్ల విసిరి లిప్తకొక లక్ష రావణులను చంపగల శక్తి సీత “   అన్నప్రతిపత్తి విశ్వాసం  జనకజ పై కవికుంది.
                     కంటిని బాలగా మిథిల, కంటి నయోథ్యాపురిన్ నవోఢగా  
                     కంటిని చిత్రకూటి సతిగా, ప్రియురాలుగ పర్ణశాలలో
                     కంటిని భద్రగా బగళగా భువనేశ్వరి గాగ లంకలో  
                     ఒంటరికాదు రామసతి ఉంటిమి మేము తత్పదాళిగా
              --అంటూ శిరసొగ్గుతాడు కవి.అశోకవనంలో  సీతమ్మను చూసిన ప్రతి తీగ ఇప్పుడు రాముని చూచి ఇద్దరిలో ఎవరు అందమైనవారో నిర్ణయించుకోవాలనే తపనతో తమలో తాము బాహుయుద్దాలకు తలపడుతున్నట్లు చిక్కువడి రాముని కడ్డుపడుతున్నాయి. హనుమంతునితో లంకను దాటించినవాడు, రావణుని సంహరించినవాడు నైన రాముడు మానవుడా ! అతనెంత ఒడ్డు పొడుగు ఉంటాడోనని రాక్షసాంగనలు తీగలు చాటుగా సంచరిస్తుంటే—రాముడు ఆలోచనలతో ముందుకు నడుస్తున్నాడు. ఒకచోట నిలువలేక అశోకవనమంతా కలియతిరుగుతున్నాడు. రావణుని మోహం సీతను బలాత్కరించలేదు గాని లేకపోతేయీ యశోకతరు వీరదళమ్ములు రామబాణపుం కథలనె మార్చి యుండెడివిగా సతి శోకపు థాటి చూపునన్  “  అంటున్న కవి భావన కడు రమణీయం. అశోకచెట్టు ఆకులు ఇరువైపులా వంకలు తిరిగి వాడిగా ఉంటాయి..అవి వీరదళాలై రావణుని హతమార్చి, రామబాణపు ఔన్నత్యాన్ని కూడ  త్రోసిరాజనేవన్నంత నమ్మకం కవికి సీతమ్మ మీద ఉంది. సీత లేని రాముడు శ్రీ  రాముడు కాలేడు గదా.
         ప్రమిదలో వెలిగే వత్తిని చూచి భాగుందని నెత్తిన పెట్టుకున్నట్లు, రామవిభుని ఇల్లాలిని తెచ్చుకున్నాడు రావణుడు.
                               శివధనుస్సు నెక్కిడుట , సేతువు కట్టుట, పంక్తికంథరా
                         ద్యవమతులన్ హరించుట మహాటవులన్ వ్యథలోర్చుటయ్యవి
                         య్యవియననేల రామచరితాద్భుత కాండములెల్ల సీతవే 
                          యవనిజ ఛుట్టు నల్లుకొని నట్టివి గాథలు వన్యవీథులన్.
            రాముని కృత్యాలన్నీ రామ ను అల్లుకొన్నవే. వాల్మీకి నిత్యనూతనుడైన ,నిత్యాధునికుడైన కవి. రాముడు సార్వకాలికుడైన విశ్వమానవుడు. ఇది కవి నమ్మకం.
                              ఆత్మరక్షణ చేసుకోలేని మానవుడికి – ఏజీవికి ప్రకృతి పురోగమన నిత్యసంరంభంలో స్థానంలేదు. ఆత్మరక్షణ ఫ్రధాన కర్తవ్యం.ఆత్మరక్షణ తర్వాత ఆత్మీయ రక్షణ. ఆ తర్వాతే శిష్టరక్షణ.అందువలనే కవికి రాముడంటే అభిమానం. రాముడు చేసిన ప్రతిపనిని కవి సమర్థించాడు. శూర్పణఖ నాసికాఖండనం నుండి వాలి వధ వరకు  అన్నీ రాముడు అనుసరించవలసిన మార్గాలే.  లోకంలోని శోకాన్నంతా తానే భరించి లోకానికి శోకోపశమనం కల్గించిన  పూర్ణస్త్రీ   సీత. సీత  చరిత్రే   లోకచరిత్ర. లోకచరిత్ర శోకచరిత్రే  కదా !” అన్న మాటలు కవి. ఇవన్నీ కలిసి కవిని ఈ కావ్యనిర్మాణానికి పురికొల్పాయి.
                 అశోకం  లో  స శోకుడై తిరుగుతున్న రాముణ్ణి  చూసి  ప్రకృతి విలపించింది.రాలుతున్న పూలు విరి కన్నెలకన్నీటి జాలు వలె కన్పిస్తోంది. అందుకే- కలగిన విశ్వమానసము కార్చెడి అశ్రువులవ్వి-అంటాడు కవి.సీతారాముల బాధల్ని చూసి కలగిన  విశ్వ మానసము కార్చే కన్నీరుగా  కవి భావించాడు. అందుకే ఏ2కోపి రస :కరుణ ఏవ “   అన్నాడు మహాకవి భవభూతి.
                            అర్ధరాత్రి అశోకవనంలో మెరిసే మిణుగురులు వనలక్ష్మి నిలువెల్ల కళ్ళుచేసుకొని రాముని చూస్తున్న కాంతిరేఖలా లేక సీతాదేవి చూపులా  అన్నట్లున్నాయట. ఈ లోకంలోకి  కరి-వేప, సీతాకోకచిలుకలు ఎలా వచ్చాయో ఈ సందర్భంలో కవి చక్కగా చమత్కరించారు . ఒకానొకరోజున వనభోజనాలవేళ పెద్దకోడలైన సీతమ్మ  స్వహస్త పాకాన్ని అందరికీ వడ్డించి సుగంధభరితమైన ఆ చేతిని సమీపమందలి ఓ చెట్టుకి ఆనించి నిలబడిందట. అది చల్లని వేపచెట్టు అయ్యుంటుంది.ఆమె చేతికున్న పరిమళము కొద్దిగ ఆ చెట్టుకు తగిలి సీత కరము తగిలిన ఆ వేప కరవేప > కరివేప అయ్యిందట. నిజమేనేమో మరి .    అలాగే   తెలతెలవారుతుండగానే  సీతమ్మ ఉషాకుమారిలా పూలతోటలో తిరిగేటప్పుడు సీతా సతి వల్కలాల వల్కములు చెట్ల కొమ్మల్లో చిక్కి సీత-కోక-చిల్క లై నాయని చెప్పడం కల్పనా మనోహరం.
                ఒకసతి ఒక్కమాట శరమొక్కటె ఇయ్యవి మూడొకట్లు,పొం
               దొకటియె చాలు మానవుని ఉన్నతు జేయగ ,మూడునొక్కటయై
                వికసనమందు మానవుడు విశ్వసమున్నతుడేల కాడు ---- అన్న విశ్వాసంతో సీతారాముల్ని ధ్యానించి రామాయణ ఔన్నత్యాన్ని  ప్రకటిస్తారు కవి.
               
              రామాయణ భారతాలవంటి మహాకావ్యాలు వ్రాయాలనే ఆరాటం ఉందిగాని ఆకలి,నిరుద్యోగం,తిండివేట , పనిరద్దీ పరమార్థంగా ఉన్న ఈ రోజుల్లో భక్తికి బ్రహ్మోపాసనకి టైమెక్కడిది  “ అంటూనే   భావ ప్రధానంగా  రామకధను ప్రస్తావించి రామాయణకవుల్లో చోటు దక్కించుకున్నారు.
                 ----     రఘునాధాయ నాథాయ సీతాయా : పతయే నమ :