శ్రీమద్రామాయణం ఆది కావ్యం. అనాది ఆది యైన పురుషోత్తముని దివ్యగానం. నాన్యతో దర్శనీయమైన అపురూప పాత్రల అపూర్వ సంయోజనం రామాయణం. ఇది రామస్య> అయనం రామాయణం. అయనం అనగా గమనము లేక ప్రయాణము. రాముని యొక్క జీవన గమనాన్ని తెలిపేది కాబట్టి రామాయణం అయ్యింది . దీనిలోనే సీతాయనం కూడా ఉంది. సీతాయా :అయనం సీతాయనం అనవచ్చు కదా!. మరి ఎందుకు పిలవడంలేదు?. వాల్మీకి కూడ సీతాయా: చరితం అనే అన్నాడు కాని సీతాయనం అనలేదు. ఎందుకని?.
చంద్రుడు
లేనిదే చంద్రిక అంటే వెన్నెల లేదు. వాక్కు
లేనిదే అర్థము లేదు. రాముడు లేనిదే సీత లేదు. రాముడు సీతతో కలిసి నడిచినదే
రామాయణం. రామునితో కలిసి తిరిగిన
సీతాగమనమే సీతాయా: చరితం అవుతుంది. స్త్రీ పురుష యోగమే శక్తి.
స్త్రీ శక్తి విరహిత పురుషుడు పరిపూర్ణుడు
కాలేడు. నిస్తేజు డౌతాడు. నిర్వీర్యుడౌతాడు.
పురుష యోగము లేని స్త్రీ
మూర్తి పరిపూర్ణత పొంద లేదు. విరాగిని గా
ఉండి పోతుంది లేదా క్షుద్ర రూపిణి గా మారిపోతుంది. అందు కే మాతృత్వము పరిపూర్ణత కు ప్రతీక. అంబ,అమ్మ తల్లి, జనని, మాతా ఇవన్నీ పర దేవత ను మనం ఆర్తి గా ఆరా
థించే పేర్లు . ప్రేమ గా పిలుచుకునే పేర్లు.
అందుకే మహాకవి కాళిదాసు ----
“ వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థ: ప్రతిపత్తయే
జగత: పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ !! “
వాక్కు, అర్థముల వలే కలసిన ఆది
దంపతులు ఈ లోకానికే తల్లి దండ్రులు
అన్నాడు. దంపతులకున్న గౌరవం మనసంస్కృతిలో ఒంటరి జీవికి లేదు. మన భారతీయసంస్కృతి దంపతీపూజ కు ఉన్నత స్థానాన్ని కల్పించింది.
భర్త చాటు భార్య అనడం తప్పు. భర్త కు తగ్గ భార్య గా ఉండాలి
.ప్రకృతి పురుషుల కలయికయే శక్తి. అష్టాదశ పురాణాల్లోను వ్యాసభగవానుడు
స్థాపించింది అదే వాల్మీకి చెప్పింది . భార్యలేని భర్తకు పరిపూర్ణతలేదు. భర్త లేని
భార్యకు చరిత లేదు. “ శ్రీ శ్రీశ యో స్తు సంబంధశ్చంద్ర చంద్రికయో రివ “అన్నారు పౌరాణికులు. లక్ష్మీ నారాణుల సంబంధం చంద్ర చంద్రికల
వంటిదని అంటారు పౌరాణికులు. శివపార్వతులు, సీతారాములు. గౌరీశంకరులు, లక్ష్మీనారాయణులు, ఉమా శంకరులు అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలు గా
చెప్పుకుంటాము. స్త్రీ పురుషుల ఎక్కువ
తక్కువ ల ప్రసక్తే లేదు . స్త్రీ పురుషుల కలయికే జీవితం . జీవితాలు చెప్పేదే చరిత్ర. కలసి జీవించడమే మన కావ్యాలు మనకిచ్చే సందేశం.
కావుననే సీతాయనం కాదు సీతాయాశ్చరితం మహత్.
జానకి లేని రామచంద్రుడు “చంద్రిక లేని చంద్రుని వలె” కాంతి హీను
డయ్యాడు. సీతలేని రాముడు శక్తి ని
కోల్పోయి, కష్టాల పాలయ్యాడు. సీత చెంత నుండగా “గడ్డిపరక” సైతం రామబాణమై తుంటరుల పీచమడిస్తే,సీతాపహరణం తరువాత రాముడు సమస్తశక్తుల్ని కోల్పోయినవాడై, బేలయై విలపిస్తూ, కొండల్ని, కోనల్ని
కలయ తిరుగుతూ, గ్రద్దల్ని, కోతుల్ని
సహాయమడుక్కోవలసివచ్చింది. నలభై
వేలమంది ఖర దూషణాది రాక్షసులను ఒక్కడుగా
మట్టుపెట్టిన అసహాయ శూరుడైన రామచంద్రుడు
సీతాపహరణం జరిగిన తరువాత
ఎదుటివాడ్ని నమ్మించడానికి తన బలాన్ని ప్రదర్శించి చూపించవలసిన దుస్థితి కి వచ్చాడంటే అందుకు కారణం రాముడ శ్రీ
-రాముడు కాకపోవడమే.” శ్రీ “విరహితుడైన-సీత లేని - రాముడు నిస్తేజుడైపోయాడు.
“ శ్రీ “ అనేది లక్ష్మీ బీజం. సర్వశక్తి సమన్వితంగా ఆ
బీజాక్షరం భాసిస్తుంది.
“ మహాలక్ష్మర్థకశ్చస్యాత్ ధనార్థ రేఫ ఉచ్యతే.
{ఈ} తుష్యత్యర్ధో2పరో నాదో బిందు: దు:ఖ హారార్ధక: “ మం .పు.18
సర్వసంపత్కరము, సర్వదుఖ హరమునైన
శ్రీలేని రాముడు వియోగవ్వధా దుఖితుడై విలపించాడు. క్రోథించాడు .తపించాడు .పోరాడి
తుదకు శ్రీకరమైన సీతను పొంది సీతారాముడు
గా కీర్తి నందాడు.మైథిలీ పాణిగ్రహణం రాముని శ్రీరాముని చేసి గృహస్థుగా మార్చి పట్టాభి షేకానికి
సిద్ధం చేసింది. కాని కైకేయీరూప కాలవాహిని
రాముని గమనాన్ని మార్చి, రణంయలోని మునులచెంతకు చేర్చి,
రాక్షససంహారం చేయించింది.
క్షత్రియవీరుడుగా, యువరాజు గా జైత్రయాత్ర పూర్తి చేసుకొని ,సర్వ శక్తి సంపన్నుడై రాజ్యలక్ష్మి ని పరిగ్రహించి,
రామచంద్రుడు లోకారాధ్యుడై
ఆదర్శప్రాయుడైనాడు.సీతామహా సాధ్వి సీతామాత యై జగదారాథ్య యైంది.
రామాయణాన్ని రామ అయనం, రామా అయనం అని రెండు విధాలుగా విభజిస్తే – సీతారాములిద్దరికి
సమప్రాధాన్యాన్ని చేకూర్చవచ్చు.
“ బాలేవ రమతే సీతా బాలచంద్ర నిభాననా
రామా రామేవ్యాదీనాత్మా వజానే2పి వనేసతీ “
వా.2.60-10
మైథిలీ దాశరధులు
సత్యస్వరూపానికి ప్రతినిధులన్న భావం” రామా” “రామ” శబ్దాలలో మహాకవి వ్యంజితం
చేశారు. అశోకవనం లో సీతామాతను చూచిన
ఆంజనేయుడు ఆమెలో రాముని
పోలికలుండటం చూచి ఆశ్చర్యపోతాడు . తల్లీకూతుళ్ల మధ్య,అక్కాచెల్లెళ్ల
మధ్య, రక్తసంబంధీకులమధ్య
పోలికలుండవచ్చునేమో గాని భార్యాభర్తలమధ్య ఒకే పోలికలుండటం ఆశ్చర్యం
కలిగస్తుంది.- అందుకే ఇలా అనుకుంటాడు హనుమ.
“ అస్యా దేవ్యా యధారూపం అంగ ప్రత్యంగ సౌష్టవం
రామస్య యధా రూపం తస్యేయ
మసితేక్షణా” వా.5.15-51
ఈ పోలికల్లో దాగి వున్న రహస్యాన్ని " దేవమాయేవ నిర్మితా " అన్న పదంతో ఛేదించారు మహాకవి వాల్మీకి.
సీతారాముల దాంపత్యం జగతికి ఆరాథ్యం. శ్రీరామునకు తగిన ఇల్లాలు మైథిలి. పంకజముఖి సీత వంటి భామమామణియున్ అన్నఅభిమానం ప్రజల్లో నిలిచిపోయింది. మహావీరుడై, శివధనుష్కండనుడైన రఘుకులాన్వయుని పరిణయమాడిన వధువువమైథిలి.కష్టాల్లో భర్తకు తోడునీడగా నిలిచి అనుకూలవతి,అనురాగవతి, పుత్రవతియునై అభిమానవతిగా భూప్రవేశం చేసేవరకు సీతాపాత్ర అత్యుత్తమమైన , అత్యుత్కృష్టమైన రీతిలో మలచబడి" సీతాయా: చరితం మహత్" అని మహర్షి చేతనే కొనియాడబడిన పవిత్రశీల. జానకీ మాత సకల సద్గుణ సముపేత. తనకు కీడు చేసిన వారికైన హాని చేయ నంగీకరించని కరుణామృత మాతృహృదయమామెది.
“ ప్రణిపాత ప్రపన్నాహి మైథిలీ
జనకాత్మజా
పాపానాం వా
శుభానాం వా వధార్హాణాం ప్లవంగమ
కార్యం కరుణ
మాత్రేణ నకశ్చి న్నాపరాధ్యతి -- “
6. 119-44
పలుకే
బంగారంగా బాలకాండలో అసలు మాట్లాడక దర్శనమాత్రం చేతనే అలరించిన జానకీదేవి
సుందరకాండలో అతిమాత్రంగా సంభాషిస్తుంది. సీతారాముల కళ్యాణం లోకకళ్యాణంగా భావించే
భారతజాతి సీతారాముల దాంపత్యాన్ని ఆదర్శదాంపత్యం గా ఆరాధిస్తోంది. సీతమ్మ
లోకారాధ్య. మాతృస్వరూపిణి. శ్రీరాముని సైతం తన కాంతివలయం లో కప్పివేయగల కాంతిచ్ఛట.” ఏదేశ వాజ్ఞ్మయమునందైనా శ్రీరామచంద్రుని వంటి పురుషోత్తముడు లభించినా
లభించవచ్చునేమో గాని సీతవంటి ఆదర్శచరిత్ర యగు పతివ్రతాతిలకము లభించుట దుర్లభమని “
{ శ్రీమద్రా.వైభ. పు.523} పలికిన వివేకానందుని పల్కులు అక్షరసత్యాలు.
ఎన్ని ఇడుముల నెదుర్కొన్నా” భర్తా హి మమదైవతం”
{2.16.89} అని ప్రకటించిన నిశ్చల నిర్మల హృదయ
యీమె. లోకం కోసం అగ్నిప్రవేశం చేయించినా, అరణ్యంలో వదిలేసినా,
ఓర్పుతో సహనంతో భర్తగౌరవాన్ని కాపాడి రామచంద్రుని లోకారాథ్యుని గా నిలిపిన ఉత్తమ ఇల్లాలు.
రాముడు లోకం కోసం ప్రవర్తించినా “ నేదానీం త్వదృతే సీతే
స్వర్గో 2పి మమరోచతే. “ {2.42.30 ]నీవు లేక
స్వర్గమును కూడ అంగీకరించనన్న మధురభావనను భర్తలో కల్పించిన మహాసాథ్వి.
“ త్వద్వియోగేన మేరామత్యక్తవ్యమిహ జీవితమ్” { 2.5.29} అన్న పల్కులు రామవియోగాన్ని
సహింపలే మరణిస్తానంటున్న సీతవి. వారి వైవాహిక ప్రణయం జగదారాథ్యం కావడానికి ప్రథానకారణం వారిలోని
ఆరాథనా భావమే. అది వాల్మీకి అపూర్వ పాత్ర
చిత్ర కల్పనా చాతుర్యం.
“ ప్రియా తు సీతా రామస్య దారా పితృకృతా యితి
గుణాద్రూపా గుణాచ్ఛాసి ప్రీతి ర్భూయో2భి వర్థతే. “ వా.1-77-27
తండ్రిచే అంగీకరించబడిన భార్యగా సీతను స్వీకరించినను అనురూప గుణాన్విత, సౌందర్య సముపేత అగుటచే ఆమె యందు
అనురాగము వృద్ధిఛెందుచున్నది. మరి
జానకీదేవి విషయం చూస్తే------
“ తస్యాశ్చ భర్తా ద్విగుణం హృదయే
పరివర్తతే
అన్తర్గత
మపివ్యక్త మాఖ్యాతి హృదయం హృదా “
వా.1.77.29
“ సీతాహృదయంలో రామచంద్రుడు ద్విగుణుడై వర్తిస్తున్నాడు. ఆమె హృదయాతర్గతమైన
ప్రేమను ఆమె హృదయం అతని హృదయానికి
చెప్పుచుండెను.-“-- అని
వ్రాయడంలోనే సీతారాముల అన్యోన్యతను వర్ణించడం లో వాల్మీకి లేఖిని
పరవశించింది. అంతేకాక-—“మనస్వీ తద్గతమనా స్తస్యాహృది సమర్పిత: “ అంటాడు మహర్షి. సీతమ్మకు మహర్షి
వాడిన విశేషణం” మనస్వీ “ఎంత
తియ్యనిమాటో చూడండి.అమ్మ మనస్వి. నిండైన మనస్సుగలది. ఆమె నిండుమనసులో భర్త కు ఎంత ప్రేమను పంచగలదో
బిడ్డలకు అంత ప్రేమను అందించ గలదు. అందుకే మహాకవి లేఖిని ఆ కరుణాలవల్లి సీతమ్మ కు” మనస్వి” పదాన్ని వాడింది. వారిరువురి దాంపత్యం
అటువంటిది. అందువల్లనే అశోకవనంలో
సీతాదేవి ని చూచిన హనుమంతుడు- --“ యుక్తా రామస్య భవతీ ధర్మపత్నీ గుణాన్వితా” అంటూ
మెచ్చుకుంటాడు.
ప్రకృతి
ప్రేమస్వరూపిణి. కాని కోపగిస్తే ప్రళయాన్ని సృష్టిస్తుంది. అలాగే సీతామాత రాముని
చెంత ప్రేమస్వరూపిణి గా గోచరిస్తుందే కాని, శత్రువుల చెంత, రావణాదులను తిరస్కరించి అబిశంసించే టప్పుడు
మహా శక్తి గా రూపుదాలుస్తుంది . ఆ” శక్తి “పాతివ్రత్య ప్రభావమే. పతివ్రతాసాధ్వి శోక సంతాపాలు కార్చిచ్చులై కాలకూట విషం
గా మారి కాముకుల్ని కాల్చి వేస్తాయన్న
యదార్ధం రావణాదులు తెలుసుకోవడానికి ఆలస్యం పట్టింది. త్రిలోకవిజేతయైన రావణుడు సైతం” మహాశక్తి” ముందు కంపించి పోయాడు.
శక్తిస్వరూపిణి గాథలు కోకొల్లలు. విజయగాథలు ఎప్పుడు మథురంగానే ఉంటాయి.