Sunday, 20 May 2012

నాతో నేను



               
                               నాతో నేను

    కృష్ణాజిల్లా కురుమద్దాలి తాతగారి ఊరు .నాన్నగారు ఇంటికి పెద్దకొడుకు. ఉమ్మడికుటుంబం.అందువలన నా హైస్కూల్ చదువు ఫామర్రులో పూర్తయ్యింది .అనంతరం ఆగిరిపల్లి శ్రీమార్కండేయ సంస్కృత కళాశాలలో భాషాప్రవీణ పూర్తిచేసి, ఆంధ్ర విశ్వవిద్యాలయంనుండి తెలుగు మరియు సంస్కతంలో ఎం.ఏ.డిగ్రీ చేశాను. భాషాప్రవీణ చధివేటప్పుడు మహాపండితులు బ్రహ్మశ్రీ చాడ సుబ్రహ్మణ్య చయనులు,ఖండ్రిక శేషావధానులు,ధర్మాన సుబ్బరాయశాస్త్రి వంటి మహనీయుల శిష్యరికంలో సంస్కృతభాష పై అభిమానం, ప్రాచీన సాహి త్యం పై అభిలాష ,ఆద్యాత్మిక తత్త్వంపై ఒక అవగాహన ఏర్పడ్డాయి.  అనంతరకాలంలో రామాయణంపై పరిశోధన చేయడానికి కూడ వారి ప్రభావమే కారణమైనదనటంలో సందేహంలేదు.
             ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తం గారి పర్యవేక్షణలో" రామాయణ లఘుకావ్య రామణీయకము" అనే అంశపై సుమారు నూటయాభైమంది కవుల రామాయణ లఘుకావ్యాలను వాల్మీకి రామాయణంతో తులనాత్మక పరిశీలన చేస్తూ మధ్య మధ్య లో ఆనంద,ఆశ్చర్య,అద్బుత, తులసీ,కంబ రామాయణాలను సైతం ఆయా ప్రదేశాలలో స్పృశించడం జరిగింది. ఈ గ్రంధానికి ఆచార్య నాగార్జునవిశ్వవిద్యాలయం డాక్టరేట్ ను ప్రకటించింది. అనంతరం ఈ గ్రంథం తిరుమలతిరుపతిదేవస్థానం వారి ఆర్ధిక సహాయం తో 1995లో విజయిని ప్రచురణలు ద్వారా ప్రచురించబడి,తిరుమలవాసుని దివ్య చరణాలకు అంకితం చేయబడింది. 
             1975లో కృష్ణాజిల్లా నందిగామ కాకాని వేంకటరత్నం కళాశాలలో ఉద్యోగంలో చేరి ఆంధ్రభాషావిభాగం లో లెక్చరర్,రీడరు, శాఖానిర్వాహకునిగా వివిధ బాధ్యతలను నిర్వహించి జూలై 2011లో పదవీ విరమణ పొందాను. "గౌతమాశ్రమము" అనే వ్యాససంపుటి 1996లో ప్రచురించబడింది.ఈ గ్రంధాన్ని నా తల్లిదండ్రుల పాదపద్మాలకు అంకితమిచ్చాను.                 
                     వివిధ దిన, వార, మాసపత్రికల్లో కధలు, గేయాలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి.ఆంధ్రసచిత్రవారపత్రికలో ప్రచురితమైన "గోరింటాకు" నా మొదటికధ. భారతి మాసపత్రికలో ప్రచురితమైన "గుడిమెట్ట పంచముఖేశ్వరాలయం" అనే వ్యాసం పాఠకుల ప్రశంసలందుకొంది.ఆ ప్రోత్సాహమే ఆనంతర కాలంలో" గుడిమెట్ట శిధిలాల్లో తెలుగుసంస్కతి" అనే యు.జి.సి మైనర్ ప్రాజెక్ట్ చేయడానికి కారణమైంది. ఈప్రాజెక్ట్ కృష్ణాతీర ప్రాంతంలో కాకతీయ సామంతులుగా గుడిమెట్టనేలిన చాగివారిచరిత్ర ను  వెలుగులోకి తెచ్చింది.వేదాద్రి,ముక్త్యాల,పెనుగంచిప్రోలు,నవాబుపేట,కొనకంచి వంటి గ్రామాల చారిత్రక ప్రాధాన్యం వెలుగుచూసింది.
    ఆధునికులలో విశ్వనాధ, పుట్టపర్తి,శేషేంద్ర ఆరాధనీయులు.  బాపిరాజు,నండూరి,తిలక్ , శ్రీరంగంనారాయణబాబు అభిమానకవులు. వడ్డెర చండీదాస్,యండమూరి, వాసిరెడ్డిసీతాదేవి, యద్దనపూడి  నచ్చిన నవలాకారులు . లవకుశ ఇష్టమైన సినిమా.  విశాలనేత్రాలు నవల పై ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి నా రేడియో ప్రసంగం ప్రసారమైంది . సముద్రాల,పింగళి,వేటూరి,  సి.నా.రె., సిరివెన్నెల,చంద్రబోస్ ల     సినీసాహిత్యాన్ని తీరికవేళల్లో వింటుంటాను.పురాతన కట్టడాలు,చారిత్రక ప్రదేశాలు,పుణ్యతీర్ధాలు చూడటం ఇష్టం.   నేను చూసిన చారిత్రక ప్రదేశాల్లో హంపి, పుణ్యతీర్ధాల్లో రామేశ్వరం మరపురాని ప్రదేశాలు. ప్రాచీన నాణేలు సేకరించడం హాబి. 
          జీవితంలో ఉత్ధాన పతనాలను అనుభవించాను. మనసు నలిగి బాధ కలిగినపుడు, మనసులో భావాలు సుళ్ళు తిరిగినపుడు వ్రాస్తుంటాను.జీవితం మనది కాదు.అనుభవం మాత్రమే మనది అన్నది నా భావన.జీవితాన్ని శాసించేది భగవంతుడు.అనుభవించేది జీవుడు.


**************************************************