శతకసౌరభాలు - 4
వేమన శతకము - 3
కల్లలాడువాని
గ్రామకర్త యెఱుగు
సత్యమాడువాని స్వామి యెఱుగు
పెక్కు తిండిబోతుఁ బెండ్లామెఱుంగురా
విశ్వదాభిరామ వినురవేమ !
ఓ వేమా ! అబద్దాలు చెప్పేవాణ్ణి
గ్రామాధికారి గుర్తిస్తాడు. నిజం పలికేవాణ్ణి యజమాని గుర్తిస్తాడు.తిండిపోతు సంగతి
భార్యకు బాగా తెలుసు. ఇది లోకరీతి.
సాధన
అనగ ననగ రాగ మతిశయిల్లుచు నుండు
తినగ తినగ వేము తియ్య నగును
సాధనమున పనులు
సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినురవేమ !
ఓ వేమా ! పాడగా పాడగా రాగం రక్తి
కడుతుంది. రోజూ తింటుంటే వేపాకు కూడ తియ్యగా అనిపిస్తుంది. అదేవిధంగా ఏ పనినైనా
సాధన చేయడం వలన ఆ పని సత్ఫలితాన్ని
ఇస్తుంది.
తప్పులు
తప్పులెన్నువారు తండోపతండంబు
లుర్వి జనుల కెల్ల
నుండు తప్పు
తప్పులెన్నువారు తమ తప్పు లె ఱుగరు
విశ్వదాభిరామ వినురవేమ !
ఓ వేమా ! ఈలోకం లో తప్పులు పట్టుకునే వారు చాలమంది ఉంటారు. కాని ఈ
భూమిమీద తప్పు చేయని వాడు ఒక్కడు ఉండడు. కాని ఆ విషయాన్నిమనసారా అంగీకరించేవాళ్ళు ఎందరుంటారు. తప్పులెత్తి చూపే వారు తమ తప్పుల్నిమాత్రం
తెలుసుకోలేరు.
తనకు గల్గు పెక్కు తప్పులు నుండగా
ఓగు నోగులెంచు నొరుల గాంచి
చక్కిలంబుఁ గాంచి జంతిక నగినట్లు
విశ్వదాభిరామ వినురవేమ !
ఓ వేమా ! దుర్మార్గుడు ఎన్ని తప్పులు చేసినా వాటిని
మర్చిపోయి, చిన్నకంతలున్న చక్కిలాన్ని చూసి పెద్ద పెద్ద కంతలున్న జంతిక ఎగతాళి
చేసినట్లు ఎదుటివారి తప్పుల్ని ఎత్తి చూపుతూ ఉంటారు. ఇది దుర్మార్గుల నైజం.
ఇనుము విఱిగెనేని
యినుమారు ముమ్మారు
కాల్చి యతుకవచ్చుఁ గ్రమము గాను
మనసు విఱిగెనేని మఱి యంట నేర్చునా
విశ్వదాభిరామ వినురవేమ !
ఓ వేమా ! ఇనుప ముక్క విరిగితే ఒకటికి రెండుసార్లైనా కాల్చి అతికించవచ్చు. కాని మనసు విరిగి పోతే
మళ్లీ అంటించడం సాథ్యం కాదు. అందుకే ఎదుటివారి హృదయం గాయపడేటట్లు మాట్లాడదగదంటున్నాడు
మహాకవి వేమన.
ఒకనిఁ జెఱిచెదమని యుల్లమందెంతురు
తమదు చేటెఱుగరు ధరణి నరులు
తమ్ముఁ జూచు (చెరచు ) వాడు దైవంబు లేడొకో
విశ్వదాభిరామ వినురవేమ !
ఓవేమా !
కొందఱు దుర్మార్గులు ఇతరులను
చెడగొడదామని ప్రయత్నించి ఆనంద పడు తుంటారు.
కాని తమకు కూడ కాలం వస్తుందన్న సంగతి వారు తెలుసుకోలేరు. తమను దైవం చూస్తున్నాడనే
విషయాన్ని వారు గుర్తుంచుకోవాలి.
ఇక్కడ మూడో పాదం
లో “ తమ్ముఁ జెరచువాడు దైవంబు
లేడొకో ” అని ఉంది ముద్రణ లో. కాని
దైవమని చెపుతూ చెరచుట అని ప్రయోగించడం
మూలం లో ఉండదేమో నని “చూచు వాడు” అని మార్చాను. సహృదయులు గమనించగలరు.
చంపదగినయట్టి శత్రువు తనచేత
జిక్కెనేని కీడు సేయరాదు
పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు
విశ్వదాభిరామ వినురవేమ !
ఓ వేమా ! చంపదగినంత అపకారం
చేసిన శత్రువైనా యుద్ధరంగం లో చేతికి
చిక్కితే అతనిని చంపకుండా వదిలి వేయడమే అతనికి శిక్ష. అతనికి చేతనైనంత సహాయం చేసి
మరీ పంపించమంటాడు యోగివేమన. ఇది
మన సంస్కృతి.
అప్పు ఇవ్వడం
కాని వాని చేతఁ గాసు వీసం బిచ్చి
వెంటఁ దిరుగు వాడె వెఱ్ఱి వాడు
పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకునా
విశ్వదాభిరామ వినురవేమ !
ఓ వేమా ! తెలియని వాడికి , లేక ఒక హీనునికి డబ్బును అప్పుగా ఇచ్చి , తిరిగి ఆ
డబ్బును రాబట్టుకోవడానికి వాని వెంట తిరిగేవాడిని వెఱ్ఱివాడు నే అనాలి. ఎందుకంటే
పిల్లి గుట్టు చప్పుడు కాకుండా తిన్న
కోడిని పెద్దగా పిలిస్తే మాత్రం వస్తుందా. అలాగే
ఒక హీనుడైన వ్యక్తి చేతిలోకి పోయిన సొమ్ము తిరిగిరాదు సరికదా. దాని ఉనికి
కూడ తెలియదు.
మాటలాడ నేర్చి మనసు రంజిలఁ జేసి
పరగఁ బ్రియము
చెప్పి బడలకున్న
నొకరి చేతి సొమ్ము లూరక వచ్చునా
విశ్వదాభిరామ వినురవేమ !
ఓ వేమా ! మనసు మెచ్చే టట్లు మాటలు
చెప్పగలగాలి. వారి కిష్టమైన ఊసుల్ని చక్కగా సాగదీయాలి. అప్పుడే ఎదుటివారి జేబులో
డబ్బు మన చేతిలో కొస్తుంది. కాని ఊరకనే
ఒకరి చేతి లోని సొమ్ము మనకు
రమ్మంటే వస్తుందా ?
అందుకే అప్పుచేయడం కూడ ఒక కళే అన్నాడు ఒక మహానుభావుడు
వాన కురియ కున్న
వచ్చును క్షామంబు
వాన గురిసెనేని వరద పాఱు
వరద కఱువు రెండు వరుస తో నెఱుగుడి
విశ్వదాభిరామ వినురవేమ !
ఓ వేమా ! వానలు పడకపోతే కరువు తాండవిస్తుంది. వర్షాలు పడితే వరద లొస్తాయి. వరద ,కరువు ఒక దాని వెంట మరొకటి
వస్తాయనే ప్రకృతి సత్యాన్ని మనం
గ్రహించాలి.
ప్రాణము
పుట్టిన జనులెల్ల భూమిలో నుండిన
బట్టునా జగంబు పట్ట
దెపుడు
యముని లెక్క రీతి నరుగుచు నుందురు
విశ్వదాభిరామ వినురవేమ !
ఓ వేమా ! పుట్టిన వాళ్ళందరు ఈ భూమి మీదే ఉంటే ఈ భూలోకం సరిపోతుందా ? చాలదు గదా ! అందుమూలంగానే ఆ యమధర్మరాజు లెక్కప్రకారం
ప్రతివారు వారి కాలం రాగానే వెడుతూ ఉంటారు. ఈ ఇల లో శాశ్వతం గా ఎవరూ ఉండరు .
వాన రాకడయును బ్రాణంబు పోకడ
కానబడ దదెంత ఘనుని కైన
గానఁబడిన మీద గలి యెట్లు నడచురా
విశ్వదాభిరామ వినురవేమ !
ఓ వేమా !. వాన రావడం ప్రాణం
పోవడం ఎంత గొప్పవాడికైన తెలియదు. అది తెలిస్తే కలికాలం నడవదు కదా ! అందుమూలంగా ఈ కలియుగం లో జీవుడు ప్రతిక్షణం మృత్యువు వస్తుందని భావిస్తూ, ఉన్న కొద్ది సమయం లోనే ధర్మకార్య
తత్పరుడై జీవించాలి.
ప్రాప్తం
చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యంబాయె
నీటబడ్డ చినుకు నీటగలిసె
ప్రాప్తి గల్గుచోట ఫలమేల తప్పురా
విశ్వదాభిరామ వినురవేమ !
ఓ వేమా ! స్వాతి చినుకు ముత్యపు చిప్పలో పడితే ముత్యమౌతుంది. అదే చినుకు నీటి లో పడితే
నీటిప్రవాహం లోనే కలిసి పోతుంది. కాబట్టి ప్రాప్తముంటే ఫలితం దగ్గుతుంది. లేకపోతే ఎంత ప్రయత్నించినా
ప్రయోజనముండదు.
ఎన్నిచోట్లు తిరిగి యేపాట్లు బడినను
అంట నియ్యక శని వెంటఁ దిరుగు
భూమి క్రొత్తలైన భుక్తులు క్రొత్తలా
విశ్వదాభిరామ వినురవేమ !
ఓ వేమా ! ఎన్ని పుణ్యక్షేత్రాలు
సందర్శించినా , ఎన్నో పవిత్ర నదీ
నదాలలో గ్రుంకు లిడినా శని మన వెంట నంటే
ఉన్నప్పుడు ఎటువంటి ఫలితము ప్రాప్తించదు.
ప్రదేశాలు మారినంత మాత్రాన మన కర్మ ఫలం మారదు కదా !
అందు వలన ప్రతిక్షణం మన
పూర్వజన్మ కర్మానుసారం గానే మన
జీవితం నడుస్తుంటుంది కాని మంత్రాలు,
తంత్రాలతో మార్చుకుందా మను కుంటే కుదరదు. అందుకే పెద్దలు “బుద్ధి : కర్మానుసారిణీ “ అన్నారు. మన కర్మననుసరించే మనలో ఆలోచనలు కూడ కలుగుతూ ఉంటాయి. ఇది కాదనలేని సత్యం.
అనువు గానిచోట నథికుల మనరాదు
కొంచెమైన నదియు గొదువ గాదు
కొండ యద్దమందు గొంచెమై యుండదా
విశ్వదాభిరామ వినురవేమ !
ఓ వేమా ! అనువు కాని ప్రదేశం లో ఆధిక్యాన్ని ప్రదర్శించ కూడదు. ఒదిగి ఉన్నంత మాత్రాన మనకు పోయేదేమీ లేదు. అద్దం లో కొండ
చిన్నదిగానే కన్పిస్తుంది గదా !
కర్మ
ఇమ్ము
దప్పువేళ నెమ్మె లెన్నియు మాని
కాల మొక్క రీతి గడప వలయు
విజయు డిమ్ము దప్పి విరటుని కొల్వడా
విశ్వదాభిరామ వినురవేమ !
ఓవేమా ! కాలం మనది కానప్పుడు అనవసరమైన
ఆడంబరాలను వదిలివేసి , కాలం గడపాలి. కాని
లేనిపోని భేషజాలకు పోకూడదు. అర్జునుడంతటి వాడే కానికాలం వచ్చినప్పుడు పేడియై
విరటుని సేవించవలసివచ్చింది కదా !
కర్మ మధికమైన గడచి పోవగరాదు
ధర్మరాజు దెచ్చి దగని చోటఁ
గంకుభట్టుఁ జేసెఁ గటగటా దైవంబు
విశ్వదాభిరామ వినురవేమ !
ఓ
వేమా ! కర్మ బలవత్తరమైనప్పుడు
తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. ధర్మరాజు
వంటి వాణ్ణే లాక్కొచ్చి కంకుభట్టు గా
విరాటుని కొలువు లో పడేసిన విథి ని ఎవరు తప్పించు కోగలరు. అందుకే విథి బలీయమనే
విషయం గ్రహించండి.
లక్ష్మి యేలినట్టి లంకాథిపతి పురి
పిల్లకోతి పౌజు కొల్ల బెట్టె
జేటుకాలమయినఁ జెఱుప నల్పులె చాలు
విశ్వదాభిరామ వినురవేమ !
ఓ వేమా ! ఒకనాడు ఐశ్వర్య లక్ష్మికి నివాసం గా వెలిగిన లంకానగరం అల్పమైన కోతులచేత నాశనాన్ని పొందింది. అందుకే పోయేకాలం అంటే
చేటుకాలం వస్తే ఎంత బలవంతుడైన ఏమీ చేయలేక ఒక అల్పుని చేతిలోనే పరాజితుడౌతాడు.
చిక్కియున్న వేళ సింహంబు నైనను
బక్క కుక్క కఱచి బాధ చేయు
బలిమి లేని వేళఁ బంతంబు చెల్లదు
విశ్వదాభిరామ వినురవేమ !
ఓ వేమా ! బలం లేనప్పుడు పంతాలు
పనికిరావు. కాలం కలిసిరానప్పుడు తాడే పామై
కరుస్తుంది. కారణాంతరాలవల్ల చిక్కిపోయి ,
బలహీనం గా ఉన్న సింహాన్ని బక్కగా ఉన్న
కుక్క కూడ కరచి బాధ పెడుతుంది.
దాతృత్వము
ఇచ్చువాని యొద్ద నీని వాడుండె
జచ్చుగాని యీవి సాగ
నీడు
కల్పతరువు క్రింద
గచ్చపాదున్నట్లు
విశ్వదాభిరామ వినురవేమ !
ఓ వేమా ! దానగుణం గల్గిన మహానుభావుని
చెంత ఒక పిసినారి వాడుంటే వాడు చచ్చినా దానం మాత్రం చేయనివ్వడు. అన్నికోరికలను
తీర్చే కల్పవృక్షం మొదట్లో గచ్చపొద ఉంటే
అది ఎవరికీ పనికి రాదు సరి గదా. దాని ముళ్ళు గుచ్చుకుంటాయని దాని సమీపానికి కూడ
ఎవరూ వెళ్ళరు. ధర్మాత్ముని వద్ద పిసినారి ఉన్నా
అదే సంభవిస్తుంది.
దాత గాని వానిఁ దఱచుగా వేడిన
వాడు దాత యౌనె వసుధ లోన
అవురు దర్భయౌనె యబ్ది లో ముంచిన
విశ్వదాభిరామ వినురవేమ !
ఓవేమా ! దానగుణం లేని వాణ్ణి మనం
పలుమార్లు దాన మడిగినంత మాత్రాన వాడు దాత
కాడు. ఎందుకంటే గరికగడ్డి ని తీసుకెళ్ళి సముద్రం లో ముంచినా అది పవిత్రమైన దర్భ
అవ్వదు కదా !
కఠినచిత్తుడు
పరగ ఱాతిగుండు
పగులగొట్టగ వచ్చు
కొండలన్ని పిండి కొట్టవచ్చు
కఠినచిత్తు మనసు కరగింప రాదురా
విశ్వదాభిరామ వినురవేమ !
ఓ వేమా ! పెద్దబండఱాతి గుండునైనా ప్రయత్నం చేత పగుల కొట్టవచ్చు. పెద్దపెద్ద
కొండలనైన పిండి పిండి గా చేయవచ్చు. కాని కఠినహృదయుని మనస్సును మార్చి దయగలవాని
చేయడం మాత్రం అసాథ్యం.
వంపుకఱ్ఱ
కాల్చి వంపు దీర్పగ వచ్చు
కొండలన్ని పిండి గొట్టవచ్చు
కఠిన చిత్తు మనసు కరగింపగా రాదు
విశ్వదాభిరామ వినురవేమ !
ఓ
వేమా ! ప్రయత్నిస్తే వంకరగా ఉండే వెదురు కర్ర ను కాల్చి వంపును సరిచేయవచ్చును.
కొండలను పిండి చేయవచ్చును. కాని కఠిన హృదయుని మనస్సును మాత్రం ఎన్ని విధాల
ప్రయత్నించినా దయ గల హృదయం గా మార్చడం మాత్రం సాథ్యం కాదు.
ధన మహిమ
విత్తము గలవాని వీపున
పుండైన
వసుధ లోన చాల వార్త కెక్కు
పేదవాని నింట
పెళ్ళయిన నెఱుగరు
విశ్వదాభిరామ
వినురవేమ !
ఓ వేమా ! డబ్బున్న వాడి మీద పుండు పుడితే దేశమంతా ఒక
పెద్దవార్త గా చెప్పుకుంటారు. కాని ఒక పేదవాని ఇంట్లో పెండ్లి జరిగినా ఎవరు పట్టించుకోరు. ఇది డబ్బులో ఉన్న గొప్పతనం.
ఆపద గల వేళ నరసి
బంధువుఁ జూడు
భయము వేళ జూడు బంటుదనము
పేద వేళ జూడు పెండ్లాము గుణమును
విశ్వదాభిరామ వినురవేమ !
ఓ వేమా ! సాధారణ వేళల్లో అందరూ ఆత్మీయుల్లాగానే కన్పిస్తారు. కాని ఆపదలు
సంభవించినప్పుడే అసలు బంధువులు ఎవరో తెలుస్తారు. భయం వేసినపుడే మనిషి లోని ధైర్యం వెలుగు చూస్తుంది. దరిద్రం
చుట్టుముట్టినపుడే భార్యలోని అసలు గుణం
బయటపడుతుంది.
ఆలి మాట విని అన్నదమ్ములఁ విడిచి
వేఱె పోవు వాడు వెఱ్ఱివాడు
కుక్క తోక పట్టి గోదావరీదునా
విశ్వదాభిరామ వినురవేమ !
ఓ వేమా ! పెళ్ళాం చెప్పుడు మాటలు
విని అన్నదమ్ములను , ఉమ్మడి కుటుంబాన్ని
వదిలి వేసి వేరుకాపురం పెట్టేవాడు వెఱ్ఱివాడు. కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదటం
సాథ్యం కాదు గదా !
మగని కాలమందు మగువ కష్టించినా
సుతుల కాలమందు సుఖము నందు
కలిమి లేమి రెండు గల వెంత వారికి
విశ్వదాభిరామ వినురవేమ !
ఓ
వేమా ! భర్త ఉన్నప్పుడు ఇల్లాలు
ఆయనతో కలసి కష్టపడి ఇంటిని వద్ధిలోకి తీసుకువస్తే కొడుకుల కాలం లో వారికి ఇంటి
విషయాల్లో సలహాలను ఇస్తూ, మనవళ్ళను మనువరాళ్ళను చూసుకుంటూ సుఖంగా ఉండవచ్చు.
ఎంతవారికైనా కలిమిలేములు ఉంటాయి కాబట్టి
కష్టపడితే సుఖాలను పొందవచ్చు నంటాడు మహాకవి.
ఇంటి ఆలు విడిచి ఇల జాఱ కాంతల
వెంట తిరుగువాడు వెఱ్ఱివాడు
పంటచేను విడిచి పరిగ యేఱిన యట్లు
విశ్వదాభిరామ వినురవేమ !
ఓ వేమా ! ఇంట్లో ఉన్న ఇల్లాలిని కాదని
వేశ్యల వెంట తిరిగేవాడు వెఱ్ఱివాడు. పంట పొలం లోని పంటను వదిలేసి , ఇతరుల చేలల్లో
పరిగ కోసం వెతిక్కునేవాణ్ణి
పిచ్చివాడనక ఏమంటారు మరి.
రైతు వరిపంట కోయించి కుప్ప వేయించిన తరువాత చేలో అక్కడక్కడ మిగిలిపోయిన
వరికంకులను ఏరుకోవడాన్ని పరిగ ఏరుకోవడం
అంటారు.
దైవమదొక్కటే
పశులవన్నె
వేఱు పాలేక వర్ణమౌ
పుష్పజాతి వేఱు పూజ యొకటె
దర్శనంబు వేఱు దైవంబ దొక్కటే
విశ్వదాభిరామ వినురవేమ !
ఓవేమా ! పశువులు ఎన్ని రంగుల్లో ఉన్నా పాలరంగు మాత్రం ఒకటి గానే
ఉంటుంది కదా ! ఎన్ని రంగుల పువ్వులున్నా
చేసే పూజ మాత్రం ఒక్కటే. దేవుళ్లు ఎన్ని పేరులతో పిలువబడుతూ , దర్శించబడుతున్నా భగవంతుడు మాత్రం ఒక్కడే !
పలు తొడవులు వేఱు
బంగారు మొకటియ
పరగ ఘటము వేరు ప్రాణ
మొకటి
అరయ తిండ్లు వేఱు
ఆకలి ఒకటిరా
విశ్వదాభిరామ
వినురవేమ !
ఓ వేమా. ! ఆభరణాలు రకరకాలు ఉన్నా అందులోని
బంగారం ఒకటే కదా. జీవుల శరీరాలు వేరువేరు
రూపాల్లో ఉన్నా వాని లోని ప్రాణం ఒకటే కదా. అలాగే తినే పదార్థాలు వేరైనా అందరిలోను
ఉండే ఆకలి ఒక్కటే గదా !
******************************************************************************************************4 వ భాగం త్వరలో
**********************************************