Saturday, 4 January 2014

శ్రీ భాగవత కల్పద్రుమ ఫలాలు - 5 శ్రీ పరశురాముని చరిత్రము

  
 శ్రీ   భాగవత కల్ప ద్రుమ ఫలాలు  -5
                                            

                                    శ్రీ  పరశు రాముని చరిత్రము

                                 
                      భృగువంశోద్భవుడు,  జమదగ్ని మహర్షి కుమారుడైన  భార్గవరాముడు  సహస్ర బాహుడైన కార్తవీర్యార్జునుని సంహరించిన మహావీరుడు.   తండ్రి ఆజ్ఞను పాటించి తల్లిని, సోదరులను సంహరించి,మరల తండ్రి  ఆశీస్సులతో పునరుజ్జీవితులు గా చేసుకున్న ధర్మ వీరుడు . భగవంతుడైన శ్రీహరియే భూ భారాన్ని తగ్గించడానికి పరశురాముడు గా జన్మించాడని భాగవతం చెపుతోంది. దశావతారాలలో భార్గవరాముడు ఆరవ అవతారం గా పూజలందుకుంటున్నాడు. ఈ వృత్తాంతం ఆంథ్ర మహా భాగవతం నవమస్కంధం లో మనకు  కన్పిస్తుంది.


                 
                      
                               భారతీయ భాషల్లో వెలసిన భాగవతాలన్నీ పోతన భాగవతం తరువాతవే నని విమర్శకుల అభిప్రాయం. కన్నడ భాగవత కాలం  క్రీ.శ 1530. కర్త విఠల నాథుడు. తమిళ భాగవత కర్త అరియప్ప పులవర్. కాలం క్రీ.శ 17 శతాబ్దము. మహారాష్ట్ర భాగవతాన్ని రచించిన ఏకనాథుడు 1580 ప్రాంతం వాడు. ఒరియాభాష లో భాగవతం వ్రాసిన జగన్నాథుడు 15 వ శతాబ్దం వాడు. మళయాళ భాగవతం రచించిన విజుతచ్చన్ కాలం 15 వ శతాబ్దం. వంగభాగవతం వ్రాసిన  మాలాధరదాసు 16 వ శతాబ్దం వాడు. అస్సాం లో భాగవతాన్ని నిర్మించిన శంకరదేవుడు క్రీ. శ 14 -15 శతాబ్దాల మథ్య కాలం వాడు. అంటే వీరందరిమీద కూడ పోతన భాగవత ప్రభావం పరోక్షం గానో, ప్రత్యక్షం గానో ఉందనేది చరిత్ర చెప్పిన సత్యం. అటువంటి మహాకవి తెలుగు వాడు కావడం తెలుగు జాతి అదృష్టం.
                         
                          హైహయవంశ రాజులలో కార్తవీర్యార్జునుడు మహావీరుడు .ఇతను శ్రీ దత్తాత్రేయుని ఆరాథించి ఆయన అనుగ్రహం తో శత్రువిజయాన్ని , సహస్రబాహువులను, అష్టసిద్ధులను , అఖండమైన ఇంద్రియ పటుత్వాన్ని పొందాడు. దానితో మదగర్వితుడై సంచరిస్తున్న ఆ రాజు ఒకనాడు రేవానదిలో తన భార్యలతో జలక్రీడలను ప్రారంభించాడు. ఆటలలో భాగం గా ఆ నదీజలాలను తన వేయి చేతులతో ఆపి ఆనందించ సాగాడు. కాని అదే సమయం లో  సంగ్రామాభిలాషియై శత్రువును  వెతుకుతూ  అక్కడకు వచ్చిన రావణుడు  ఎదురుతన్నిన ఆ నదీప్రవాహపు పోటుకు గురయ్యాడు. తనను ఎదిరించే వాడి కోసం వెతుకుతున్న రావణునికి మంచి అవకాశం దొరికింది.   పెల్లుబికిన కోపం తో, రణదాహం తో రావణుడు కార్తవీర్యార్జునుని పైకి యుద్ధానికి వెళ్లాడు.     
                        
                      కాని కార్తవీర్యార్జునుడు  రావణుని తన బాహుబలం తో ఓడించి, జుట్టు పట్టుకొని మోకాళ్ళ తో పొడిచి, కోతిని కట్టిపడేసినట్టు తన భటులచేత కట్టించి,చెఱసాల లో  పెట్టించి, అనంతరం దయ తలచి వదిలేశాడు.
          
                        అటువంటి మహావీరుడైన కార్తవీర్యుడు ఒకసారి వేటకోసం అడవికి వెళ్ళి,అలసి పోయి, బాగా ఆకలితో జమదగ్ని ఆశ్రమానికి వెళ్లాడు. అతిథి గా వచ్చిన రాజును ఆదరించిన మహర్షి తన హోమధేనువు రప్పించి, దాని అనుగ్రహం తో, రాజుకు , రాజపరివారానికి సుష్ఠు గా భోజనం పెట్టాడు. కడుపు నిండుగా తిన్న రాజుకు కామధేనువు పైన కోరిక కలిగింది. తిన్న ఇంటి వాసాలనే  లెక్కపెట్టి నట్లు, తన భటులను పిలిచి ఆ ధేనువు ను తోలించుకొని  మాహిష్మతీ పురానికి వెళ్ళిపోయాడు కార్తవీర్యుడు.
                      
                     ఆ తరువాత ఆశ్రమానికి చేరిన పరశురామునికి విషయం తెలిసి ఆగ్రహోదగ్రుడయ్యాడు. అన్నం పెట్టిన చేతినే నరికినట్లు, కామధేనువు పెట్టిన అన్నాన్నే తిని దాన్నే బంథించి తీసుకెళ్లిన కార్తవీర్యుని అకృత్యాన్ని సహించలేకపోయాడు పరశురాముడు.

  అద్దిరయ్య యింట నశనంబుఁ గుడిచి మా యయ్య వలదనంగ నాక్రమించి
   కోరిమొదవు రాజు గొనిపోయినాఁ డట, యేను రాముడౌట యెఱుగఁ డొక్కొ. !” (9.442)
             
               అంటూ పరశువు.కోదండ విల్లంబులను దాల్చి, కవచావృత శరీరుడై, ప్రళయాగ్ని వలే ప్రజ్వరిల్లుతూ, ఏనుగు వెంట పడే సింహం లాగ పరశురాముడు  కార్తవీర్యర్జునుని వెంబడించాడు.   

కనియెన్ ముందటఁ గార్తవీర్యుడు సమిత్కాముం, బ్రకాముం, శరా
సన తూణీర కుఠారభీము, నతిరోష ప్రోచ్చల ద్భ్రూయుగా
నన నేత్రాంచల సీము ,నైణపట నానామాలికోద్దాము నూ
తన సంరంభ నరేంద్రదాన శుభసూత్రక్షామునిన్ రామునిన్.(9.446)

               మాహిష్మతీ పురం చేరిన కార్తవీర్యునకు  చలించే కనుబొమలతో, గండ్రగొడ్డలిని ధరించి ,మిడిసిపడే రాజుల మంగళ సూత్రాల్ని తొలగించేవాడైన పరశు రాముడు ఎదురుగా  వచ్చి కన్పించాడు.ఒక బ్రాహ్మణ బాలకుడు తనకు ఎదురుగా వచ్చి కయ్యానికి కాలుదువ్వడం అవమానం గా భావించిన అర్జునుడు ఈ బ్రాహ్మణుని పట్టి కొట్టి చంపుడని సేనాపతులను ఆజ్ఞాపించాడు.

                  పదిహేడు అక్షౌహిణుల సైన్యం తో దండనాయకులు కదలి పరశురాముని ఎదిరించారు. కాని తొలకరి వేళలో చేలోని దుబ్బులను పెళ్ళగించే  కృషీవలుని వలే పరశురాముడు ఆ సైన్యాన్నంతటిని తెగనరికి కార్తవీర్యార్జునుని వైపు మళ్లాడు. అప్పుడు జరిగిన ఘోరయుద్ధం లో పరశురాముడు పరశువుతో కార్తవీర్యుని చేతులను, శిరస్సును ఖండించి, నేలపడగొట్టాడు. భయంతో అతని పదివేల మంది కుమారులు ప్రాణ భయం తో పారిపోగా, దూడతో కూడిన ఆవును మరల ఆశ్రమానికి తోలుకొచ్చాడు. తన కుమారుని పరాక్రమాన్ని విన్న జమదగ్ని విష్ణ్వంశ కలిగిన రాజును సంహరించడాన్ని సమర్థించలేకపాయాడు.

      


          తాలిమి మనకును ధర్మము , తాలిమి మూలంబు ధర్మతత్త్వంబునకున్
          దాలిమి గలదని యీశుం, డేలించును బ్రహ్మపదము నెల్లన్ మనలన్ .”(9.462)
         
   క్షమ కలిగి ఉండటం వలనే  ఈశ్వరుడు మనలను బ్రహ్మ పదం లో కలిపాడు.మనకు క్షమ యే ధర్మము 
అన్నాడు .

           క్షమ కలిగిన సిరి గలుగును క్షమ గలిగిన వాణి గలుగు సౌఖ్యములెల్లన్
          క్షమ గలుగఁదోన కలుగును , క్షమ కలిగిన మెచ్చుశౌరి సదయుఁడు తండ్రీ.!” (9.463)

               రాజును చంపిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఒక సంవత్సర కాలం  పుణ్యతీర్థాలు  సేవించి రమ్మని ఆజ్ఞాపించాడు జమదగ్ని. తండ్రి ఆజ్ఞను శిరసావహించి , ఏడాది పాటు తీర్థ యాత్రలు చేసి వచ్చాడు పరశురాముడు.
                       
              ఒకరోజున జమదగ్ని ఇల్లాలు రేణుక గంగానదికి నీటికోసమై వెళ్ళింది. అదే సమయం లో  నీటిమధ్యలో అప్సరసలతో జలకాలాడుతున్న చిత్రరథుడనే గంధర్వుని చూస్తూ  ఉండిపోయి కాలయాపన చేసింది.  హోమానికి సమయం దాటిపోయింది. ఆలస్యం గా వచ్చి, తడబడుతూ నిలబడిన   ఇల్లాలిని చూసి, దివ్యదృష్టి తో  సర్వం తెలుసుకొన్నాడు మహర్షి.  మత్తం దీనిం జావగ మొత్తుండని జమదగ్ని తన కుమారులను ఆదేశించాడు.తండ్రి ఆజ్ఞను విన్న కుమారులు దుఖిస్తూ ఉండిపోయారే కాని తల్లి ని చంపలేకపోయారు.  దానితో కడపటి వాడైన పరశురాముని ఆజ్ఞాపించాడు మహర్షి.

కడుకొని పెండ్లముఁ జంపని , కొడుకులఁ బెండ్లాముఁ జంపఁ గురు డానతి యీ
నడుగులకు నెఱగిఁ రాముం ,డడుగిడకుండగఁ ద్రుంచె నన్నలఁ దల్లిన్. (9.471)
           
       తండ్రి మాటను వినకపోతే కోపం తో శపిస్తాడు. ఆజ్ఞ ను పాటిస్తే తపోధనుడైన తన తండ్రి అన్నలను తల్లిని  బ్రతికిస్తాడని  భావించిన పరశురాముడు తండ్రి ఆజ్ఞ ను శిరసావహించి, అన్నలను, తల్లిని ఖండించాడు. తన చిన్నకొడుకు తన యాజ్ఞ పాలించినందుకు  ఎద నిండుగా ఆనందించాడు జమదగ్ని.

మెచ్చిన తండ్రినిఁ గనుగొని, చెచ్చెర నీ పడిన వారి జీవంబులు నీ
విచ్చితి ననుమని మ్రొక్కిన , నిచ్చెన్ వారలును లేచి రెప్పటి భంగిన్.(9.475)

                   ఆ సమయం చూసి ఈ మరణించిన వారిని మరల బ్రతికించమని ప్రార్థించాడు రాముడు. ముని  అనుగ్రహించాడు. వారు ఎప్పటిలాగే  లేచి కూర్చున్నారు. అందుకే -

పడిన వారల మరల బ్రతికింపనోపును, జనకుఁ డనుచుఁ జంపె జామదగ్నుఁ
డతడు సంపె ననుచు నన్నలఁ దల్లిని జనకునాజ్ఞ నైనఁ జంపదగదు.( 9.476)

    పరశురాముడు చంపాడు కదా  అని తండ్రి చెప్పినా కూడ  లోకంలో ఎవరూ అన్నలను, తల్లిని చంపకూడదు. ఎందుకంటే చనిపోయిన వాళ్ల ను తన తండ్రి తపోబలం తో మరల బ్రతికించగలడని తెలుసు కాబట్టే  పరశురాముడు ఆ విధం గా ప్రవర్తించాడని మనం తెలుసుకోవాలి. 

                  ఆనాడు పరశురాముని కి భయపడి పారిపోయిన కార్తవీర్యార్జునుని కుమారులు పదివేలమంది పరశురాముని పై కక్ష కట్టి  అదనుకోసం ఎదురుచూస్తున్నారు. ఒకరోజు యజ్ఞశాలలో ధ్యానవృత్తి లో నున్న జమదగ్నిని  కదలనీయకుండా పొదివి పట్టుకొని, రేణుక అడ్డంపడినా  లెక్కచేయక జమదగ్ని తలను నరికి వెళ్లి పోయారు.

 “జనకుం జంపిన వైర మేమఱక రాజన్యాత్మజుల్ నేఁడు మీ
జనకుం జంపిరి రామ! రామ! రిపులన్ శాసింతు రమ్మంచు న
మ్ముని పై వ్రాలి లతాంగి మోఁది కొనియెన్ ముయ్యేడు మారుల్ రయం
బున రాముం డరుదెంచి యెన్నికొన నాపూర్ణాపదాక్రాంతయై.  ( 9.480)

                   రామా! నీతండ్రిని చంపిన పగను మనసులో పెట్టుకొని అర్జునుని కొడుకులు నీ తండ్రిని చంపారు. శత్రువులను శిక్షించడానికి వేగం గా రావలసిందని తల్లి రేణుక రాముడు లెక్కపెట్టుకొనేటట్లు గా  భర్త  మీద పడి ఇరువది ఒక్కసార్లు ఆక్రోశిస్తూ గుండెలు బాదుకున్నది.

               సమిథలు,కట్టెలకోసం సమీపారణ్యానికి వెళ్లిన జమదగ్ని కుమారులు పరుగు పరుగున ఆశ్రమానికి చేరారు.కొడుకులు తోడు లేకుండా గుమ్మం కూడ దాటని నీవు ఒంటరిగా స్వర్గానికి  వెళ్లడానికి కాళ్లు ఎలా వచ్చాయని తండ్రిని పట్టుకొని  దు:ఖిస్తున్న అన్నలను  చూచి క్రోధోద్విగ్నుడయ్యాడు పరశురాముడు. అన్నలారా ! దు:ఖించకండి. తండ్రి కళేబరాన్ని జాగ్రత్తగా  రక్షిస్తూ ఉండండి. పగ తీరుస్తానుఅంటూ  రాముడు పరశువు ను ధరించి   మాహిష్మతీ పురానికి వెళ్లి, బ్రహ్మహత్యాపాతకులైన కార్తవీర్యుని కుమారులను పదివేలమందిని వెంటపడి  రక్తపుటేరులు ప్రవహించేటట్లు గా చిద్రుప చిద్రుపలుగా నరికి పోగులుపెట్టాడు.

            అంతటితో ఆగకుండా పరశురాముడు తండ్రి పగను తీర్చుకోవడం కోసం భూమి పైన క్షత్రియ శబ్దం  వినబడనీయకుండా ఇరవై ఒక్క  మార్లు భూమంతా తిరిగి  రాజులను గాలించి సంహరించాడు. తండ్రి పగ తీర్చలేని కొడుకు కూడా ఒక కొడుకేనా “ ? అంటాడు మహాకవి.

అయ్య పగకు రాముఁ డలయక రాజుల , నిరువదొక్కమాఱు లరసి చంపె
జగతి మీఁద రాజశబ్దంబు లేకుండ సూడు దీర్పలేని సుతుడు సుతుడే”? ( 9.487 )

               పరశురాముడు శమంతక పంచకం లో  రాజుల రక్తం తో తొమ్మిది మడుగులను చేసి తండ్రి తలను తెచ్చి శరీరం తో చేర్చి సర్వదేవమయుడైన తానే దేవుడు కాబట్టి తన్నుఉద్దేశించి తానే యాగం చేశాడు.  సమస్త దిక్కులను  హోతకు ,బ్రహ్మ కు, అధ్వర్యునకు , ఉద్గాతకు మొదలైన వారందరికి దానం చేసి, సరస్వతీ నది లో అవబృథ స్నానం చేసి  సర్వపాపాలను పోగొట్టుకొని మబ్బు విడిచిన సూర్యుని వలే ప్రకాశించాడు.


                                                   గుడిమల్లం లోని అతి ప్రాచీన  పరశురామేశ్వర లింగం

  ( చూ.  divyakshetralu.blogspot.com  లో గుడిమల్లం శ్రీ పరశురామేశ్వరాలయం)
                           

                        వంశోద్దారకుడైన కుమారుని వలన జమదగ్ని సంకల్ప శరీరం పొంది తన తపోబలం తో సప్తర్షిమండలం లో ఏడవవాడై వెలుగుతున్నాడు. రాబోయే మన్వంతరం లో పరశురాముడు సప్తర్షులలో ఒకడు గా ప్రకాశిస్తాడు. అప్పటివరకూ గంధర్వులు , సిద్ధులు తన పవిత్ర చరిత్రను గానం చేస్తుండగా పరశురాముడు ఐహిక బంధ విముక్తుడై, ప్రశాంతచిత్తం తో మహేంద్రగిరి మీద  తపోనిష్టలో ఈ నాటికీ ప్రవర్తిల్లు తుంటాడు. అసలు ఇదంతా ఎందుకు జరిగిందంటే

భగవంతుడు హరి యీ క్రియ ,భృగుకులమునఁ బుట్టి యెల్ల పృథివీ పతులన్
జగతీభారము వాయగ ,బగఁగొని పలుమాఱు చంపె బవరమున నృపా .!”(9.492)
              
              అంటుంది భాగవతం. భగవంతుడైన శ్రీహరి భూభారం తొలగించడానికి భృగుకులం లో పుట్టి, క్షత్రియులను పలుమార్లు యుద్ధం లో పరిమార్చాడట.




*****************************************************