Friday, 23 May 2014

శతకసౌరభాలు - 2 ధూర్జటి కాళహస్తీశ్వర శతకము - 1

       
శతక సౌరభాలు - 2
                                                       ధూర్జటి   శ్రీ కాళహస్తీశ్వర శతకము -1
                                        


                       మహాకవి ధూర్జటి   పాకనాటి నియోగి బ్రాహ్మణుడు. షట్కాల శివపూజా దురంధరుడు. శ్రీకాళహస్తీశ్వరునకు పరమభక్తుడు. సాహితీ సమరాంగణ  సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయల వారి  ఆస్ధానములోని అష్టదిగ్గజ కవులలో ఒకరు. అంతేకాదు .ఆ అష్టదిగ్గజాలలో ఈయన ఒక్కడే ఏకైక శైవకవి. శ్రీ వైష్ణవాన్ని స్వీకరించి , ఆదరించి , ఆముక్తమాల్యద వంటి ఆళ్వారు వృత్తాంత ప్రబంధాన్ని  రచించిన  శ్రీకృష్ణదేవరాయలు  తన ఆస్ధానం లో  వీరశైవ సంప్రదాయానుసారి  యైన ఈయనను ఆదరించడానికి కారణం  ఈయన కవిత్వం లోని మాధుర్యమే నని కొందరు  పరిశీలకులు భావిస్తున్నారు. అందుకు ఆధారంగా ఒక చాటువు ప్రసిద్ధంగా  లభిస్తోంది. 
      
       “  స్తుతమతి యైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల గల్గె నీ
        యతులిత మాధురీ మహిమ ..................................
       
                 అని ఒకనాడు శ్రీ రాయల వారు ధూర్జటి కవిత్వాన్ని కొనియాడుతూ సమస్య నివ్వగానే  , వెంటనే సభలో ఉన్న శ్రీ తెనాలి రామకృష్ణుడు లేచి .. ఇట్లు పూరించాడట.

           “..................................... హా తెలిసెన్  భువనైక మోహనో
        ద్ధత సుకుమార వారవనితాజనతాఘన తాపహార సం
        తత మధురాధరోదిత సుధారస ధారలఁ  గ్రోలుటం జుమీ ! “

                         ఇది యథార్ధ కధనమే యనడానికి ధూర్జటి మనుమడు కుమారధూర్జటి తన కృష్ణరాయవిజయము అనే కావ్యం లో  పద్యాన్ని ఉటంకించడమే సాక్ష్యము.

                 కొనియాడదగిన ఆంద్రకవి ధూర్జటి  పల్కులకు కవిత్వానికి ఇంతటి మాధుర్యం ఎలావచ్చింది అన్నది  శ్రీ రాయల వారి ప్రశ్న.

                         హా !  నాకు తెలిసింది. భువనైక మోహనులైన  వారకాంతల యొక్క తాపమును తీరుస్తూ , ఎల్లప్పుడు  వారి  మధురాధరములనుండి జాలువారు తీయని అధరామృతాన్ని   గ్రోలడం వలనే ధూర్జటి మహకవి కవిత్వం అంత మధురం గా ఉంది  “ అని చమత్కరించాడట శ్రీ తెనాలి రామకృష్ణుడు. ధూర్జటి కి వారకాంతల సంగతి ఉన్నట్లు , దానితో తాను విసిగిపోయినట్లు ఈ శతకం లో మనకు చాలాచోట్ల  కవి ప్రస్తావిస్తాడు.

                     శివపూజాతత్పరుడు , యోగశాస్త్ర విశారదుడు , పండిత కవి యైన శ్రీ ధూర్జటి  శ్రీ కాళహస్తి మహాత్మ్యము అనే కావ్యాన్ని , శ్రీ కాళహస్తీశ్వర శతకాన్ని రచించాడు.  శ్రీ కృష్ణరాయల వారి ఆస్ధానం లో, అష్టదిగ్గజాలలో ఒకడి గా  ఉండి కూడ ఈ రెండు  గ్రంథాలను శ్రీ కృష్ణదేవరాయలు వారికి అంకితం ఇవ్వకుండా శ్రీ కాళహస్తీశ్వరుని కే అంకితం చేశాడు.  ఇటువంటి  వీరశైవకవి ని ఆదరించడం శ్రీ రాయల వారి పరమత సహనానికి ఉదాహరణ గా భావించవచ్చు.
                           
            ధూర్జటి  మనుమడైన కుమారధూర్జటి యొక్క కుమారుడు లింగరాజు  అనే కవి వ్రాసిన పెద కాళహస్తి మాహాత్మ్యాన్ని బట్టి ధూర్జటి శ్రీకృష్ణరాయల వారి ఆస్ధానం లో సత్కారాలు పొందినట్లు తెలుస్తోంది. అనగా ఇతని కాలము  క్రీ.శ 1480 -1530 . గా భావించ వచ్చు. శ్రీ రాయల మరణానంతరం కూడ ఈ జీవించి ఉండవచ్చు నని కొందరి భావన.   శ్రీ ధూర్జటి శ్రీ కాళహస్తి గ్రామం లోనే నివసించే వాడని , ఆయన అభ్యర్ధన మేరకే     వైష్ణవ మతాన్ని స్వీకరించిన శ్రీ కృష్ణదేవరాయలు ఒకటి , రెండు మారులు శ్రీ కాళహస్తీశ్వరుని దర్శనం చేసుకొని ఉండవచ్చని కొందరు పరిశోధకులు భావిస్తున్నారు. 
        
                ఈ శతకము లో ఎక్కడా ధూర్జటి పేరు లేకపోయినను క్రీ.శ  1740  ప్రాంతము వాడైన ప్రసిద్ధ లాక్షణికుడు శ్రీ కస్తూరి రంగకవి తన ఆనంద రంగ రాట్చందము నందు ఈ శతకము లోని పద్యము నుదాహరించి ఇది ధూర్జటి  కాళహస్తీశ్వర మహాత్మ్యము లోనిది గా పేర్కొనుట   ఈ శతకము ధూర్జటి ది గా చెపుతోంది.
  
                ఈ శతకము లో శివభక్త్యనుభవము , ఆత్మనివేదనమే కాకుండా  రాజనింద , వార వనితా  తిరస్కారం  , భవపరాజ్ముఖత స్పష్టంగా కన్పిస్తాయి. ప్రౌఢమైన శైలి  శతకానికి అందాన్నిచ్చింది.  కవి  శివుని తో మాట్లాడు తున్నట్టు గానే పద్య రచన సాగుతుంది. శివుడు గజ చర్మాంబర ధారి , వ్యాఘ్రాజిన ధారి  కాబట్టి ధూర్జటి ఈ శతకం లో మత్తేభ , శార్ధూల వృత్తాలను మాత్రమే వాడాడు.    తెలుగు భక్తి శతకాలలో శ్రీ కాళహస్తీశ్వర శతకానికి ఒక ప్రత్యేకత ఉంది.  ఈ శతకం లో కూడ  అవసరమైన తావుల తేజస్వినీ పేరుతో వ్యాఖ్యానాన్ని అందించాను . సహృదయంతో స్వీకరిస్తారని ఆశిస్తున్నా.

  
           శ్రీవిద్యుత్కలితాజవంజన మహా జీమూత పాపాంబుధా
       రా వేగంబున మన్మనోజ్ఞసముదీర్ణత్వంబు కోల్పోయితిన్
           దేవా మీ కరుణా శరత్సమయమింతే చాలు , చిద్భావనా
       సేవం దామరతంపరై మనియెదన్ ; శ్రీ కాళహస్తీశ్వరా !

                  శ్రీ కాళహస్తి పట్టణ మందు వెలసిన ఈశ్వరా   మెరుపు తీగవలే చంచలమై చావు పుట్టుకలతో కూడిన సంసారమనెడి కారు మేఘముచే ధారాపాతముగా కురిసెడి  పాపములనెడి వర్షధారల వలన  నామనస్సనెడి పద్మము  వికాసమును కోల్పోయినది. ఓ పరమేశ్వరా  ! మీ కరుణ యనెడి  శరత్సమయాన్ని నాపై కొంచెం గా ప్రసరింపచేయ  వేడుకొనుచున్నాను.  నీవు కరుణ చూపిన యెడల నామనస్సు ను తిరిగి పదిలపరచుకొని  నీ సేవకు పునరంకితమౌతాను దేవా  !

       వాణీవల్లభ దుర్లభంబగు భవద్వారంబున న్నిల్చి,ని
      ర్వాణశ్రీ  చెరపట్టచూచిన  విచారద్రోహమో ,నిత్య క
      ళ్యాణ క్రీడల బాసి , దురదశల పాలై , రాజలోకాధమ
       శ్రేణీ ద్వారము దూరజేసి దిపుడో ! శ్రీ కాళహస్తీశ్వరా !

                   దేవా !     బ్రహ్మదేవునకు అసాధ్యమైన నీ వాకిటి లో నిలబడి , మోక్షలక్ష్మి ని  కోరుకోవడమే  నేను చేసిన నేరమా స్వామీ ?    లేకపోతే  నీకు యొనర్చెడి నిత్య కళ్యాణ అర్చనలకు దూరమై , దుర్దశల పాలై , ఇప్పుడు  నీచులైన రాజుల ముంగిళ్లలో   బతుకు సాగింప చేయుచున్నావు. 
     
       అంతా మిధ్య తలంచి చిన నరుండట్లౌ టెరంగిన్ సదా
       కాంతల్పుత్రులు నర్థముల్ తనువు నిక్కంబంచు  మోహార్ణవ
       భ్రాంతిం జెంది చరించు గాని పరమార్ధంబైన నీయందు దా
       చింతాకంతయు చింతనిల్పడు  కదా ! శ్రీ కాళహస్తీశ్వరా !
                          
               ఈశ్వరా !  ఈ లోకమంతా మిథ్య అని తెలిసి కూడ మానవుడు  భార్యా బిడ్డలు , ధనము దేహము అనే భ్రాంతిలో  పడి ప్రవర్తించునే కాని ముక్తి నిచ్చెడి నీయందు చింతాకంత యైనను మనస్సు ను లగ్నము చేయడు కదా స్వామీ ! 
     
     నీ నా సందొడబాటు మాట వినుమా  నీచేత జీతంబు నే
      గానిం బట్టక , సంతతంబు  మది వేడ్కన్గొల్తు , నంతస్సప
      త్నానీకంబున కొప్పగింపకుము నన్నా పాటియే చాలు , తే
      జీనొల్లం గరినొల్ల నొల్ల సిరులన్ శ్రీ కాళహస్తీశ్వరా !
  
                     ఓ దేవా ! మనిద్దరి మథ్య  ఒక ఒప్పందము చేసుకుందాము . విను.  నేను నీ నుండి దమ్మిడీ కూడ జీతం తీసుకోకుండా    నేను నిన్ను సేవిస్తాను.  అందుకు ప్రతిఫలంగా నీవు నన్ను ఆలుబిడ్డలు , రాగద్వేషములనే అంతశ్సత్రువులకు అప్పగించకుండా నన్ను కాపాడు.  ఇంతమాత్రం చాలు . గుఱ్ఱాలు , ఏనుగుల , సిరి సంపదలు నాకు వద్దు. నీ భక్తి యే చాలు  స్వామీ  !            

     భవకేళీ మదిరామదంబున మహాపాపాత్ముడై వీడు న
     న్ను వివేకింపడటంచు , నేను నరకార్ణోరాశిపాలైన బ
     ట్టవు , బాలుండొక చోట నాటతమితోడ న్నూతగూలంగ దం
     డ్రి విచారింపక యుండునా ? కటకటా  ! శ్రీ కాళహస్తీశ్వరా !

                                    ఓ శంకరా !   సంసారమనే మద్యపానపు మత్తులో ఈ మానవుడు  పాపాత్ముడై నన్ను తలంచడం లేదనే ఊహ తో నీవు  నేను నరకమనే సముద్రంలో పడిపోయినా పట్టనట్లు ఊరుకుంటున్నావు . కొడుకు  ఆడుకుంటూ  నూతిలో పడిపోతే తండ్రి పట్టించుకోకుండా ఊరుకుంటాడా ?

     స్వామి ద్రోహము చేసి ,వేరొకని కొల్వన్ బోతినే? కాక నే
     నీమాటల్విన నొల్లకుండితినో ? నిన్నే దిక్కుగా జూడనో ?
     యేమీ యిట్టి వృధాపరాధి నగు నన్నీ దు;ఖ వారాశి వీ
     చీ మధ్యంబున  ముంచి యుంపదగునా ? శ్రీ కాళహస్తీశ్వరా !

             శ్రీ కాళహస్తీశ్వరా!  నా ప్రభువు వైన నిన్ను కాదని నేను వేరే దైవాలను పూజించానా ? లేదు కదా ! పోనీ నేను నీ మాటలను ఎప్పుడైన వినలేదా? లేదు కదా ! నీవే నాకు దిక్కని ప్రార్ధిస్తూనే ఉన్నాను కదా ! మరి అటువంటప్పుడు ఏ నేరమూ చేయని నన్ను ఈ దు:ఖసముద్రం మధ్య లో  ముంచి వేయడం  న్యాయమా ప్రభూ  !
     దివిక్ష్మారుహ ధేనురత్న ఘనభూతిన్ ప్రస్ఫురద్రత్న సా
     నువు నీ విల్లు ,నిధీశ్వరుండు సఖుఁడర్ణోరాశి కన్యావిభుం
     డు విశేషార్చకుఁడింక నీకెన ఘనుండున్  గల్గునే ? నీవు చూ
     చి విచారింపవు లేమి నెవ్వడుఁడుపున్ ? శ్రీ కాళహస్తీశ్వరా !

              ఓ దేవా ! కోరికలను తీర్చు కల్పవృక్షము , కామధేనువు , చింతామణి వంటి సంపదలతో ప్రకాశించు  మేరుపర్వతము నీ ధనుస్సు. కుబేరుడు నీకు స్నేహితుడు . లక్ష్మీదేవి భర్తయైన శ్రీ మహా విష్ణువు నీకు  విశేష భక్తుడు.  నీ సాటి దైవము లేడు కాని నీవు మాత్రం  దారిద్ర్యంలో మునిగిన మా బాధలను పోగొట్టడానికి యత్నించడం లేదు . నీవు కాక మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు  ప్రభూ ! 

     నీతో యుద్ధము చేయనోప , గవితానిర్మాణ శక్తిన్నిన్నుం
     బ్రీతుం చేయగలేను , నీకొరకు తండ్రిన్ చంపగాజాల నా
     చేతన్ రోకట నిన్ను మొత్తవెరతుం చీకాకు నా భక్తి యే
     రీతి న్నాకిక నిన్ను చూడగనగున్ ? శ్రీ కాళహస్తీశ్వరా !

                          శ్రీ కాళహస్తీశ్వరా ! అర్జునునిన వలే నేను నీతో యుద్దం చేయలేను . నత్కీరుని వలే నీపై కవిత్వం చెప్పి నిన్ను మెప్పించలేను. కాటకోటుని వలే  నీ కోసం తండ్రిని చంపలేను. బాలలింగన్న వలే నిన్ను రోకటి తో కొట్టలేను. నీ యెడల నాకున్న  భక్తియే నన్ను బాధల పాలు చేస్తోంది. మరి ఏ విధంగా నిన్ను చూడగలను స్వామీ  !

    ఆలున్ బిడ్డలు తల్లిదండ్రులు ధనంబంచు న్మహాబంధనం
    బేలా నామెడ గట్టినాడ విక నిన్నేవేళ జింతింతు ,ని
    ర్మూలంబైన  మనంబులో నెగడు దుర్మోహాబ్ది లో గ్రుంకి యీ
    శీలామాలపు జింత నెట్లుడిపెదో ? శ్రీ కాళహస్తీశ్వరా !

                      శ్రీ శంకరా ! భార్యాబిడ్డలు , తల్లిదండ్రులు , ధనము అనే ఈ బంధాలన్నింటినీ నామెడ కెందుకు కట్టావు . ఇక నేను నిన్ను ఏ విధంగా  స్మరించగలను .  నీ యెడల నశించి పోయిన మనస్సు లో  పెరుగుతున్న  మోహమనే సముద్రం లో మునిగిన  ఈ దుఖాన్ని ఎలా పోగొడతావో కదా ?
   
     నిప్పై పాతకఁదూలశైల మడచున్ నీ నామము న్మానవుల్
     దాపున్ దవ్వుల విన్ననంతక భుజాదర్పోద్ధత క్లేశముల్
     తప్పుం దీరును ముక్తలౌదురని శాస్త్రంబు ల్మహాపండితుల్
     చెప్పంగా దమకింక శంకలుండవలెనా ? శ్రీ కాళహస్తీశ్వరా !  ( 10 )

                                 శ్రీ కాళహస్తీశ్వరా !  పవిత్రమైన నీ నామమును మానవులు దగ్గరనుండైనా , దూరమునుండైనా విన్నంతనే   పుణ్యమనే అగ్ని పాపాలనే ప్రత్తి కొండలను  భస్మం చేస్తుందని , యమ ధర్మరాజు భుజ గర్వముచే  ఉత్పన్నమయ్యే చిక్కులన్నీ తొలగి పోయి ముక్తులౌతారని శాస్త్రాలు , మహా పండితులు చెపుతుంటే , ఈ మానవులకు ఇంకా  నీనామ మహాత్మ్యము పై అనుమాన మెందుకు శంకరా ?

                               -------------------------------------------------     రెండవభాగము        త్వరలో 


    ----- *********************************************************************************
           
        





No comments: