Sunday 29 June 2014

శతకసౌరభాలు -3 మారన భాస్కర శతకము -3


శతక సౌరభము - 3
                       

                         మారన     భాస్కర శతకము - 3

                                          
                                                             आरोग्यं भास्करादिच्छेत्


చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా
చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చ రెచ్చటం
బదునుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా !

                           భాస్కరా ! ఎంత విద్యావంతుడైన  చదివిన విద్యయందలి సారమును తెలుసుకోలేనియెడల ఆ చదువు నిరర్ధకమే అవుతుంది. విద్యామర్మము నెరుగని విద్వాంసుడు వాసనలేని పూవు వంటి వాడే. అందుకే ప్రహ్లాదుడు  ‘చదువులలోని మర్మమెల్ల చదివితి తండ్రీ అంటాడు .  నిరర్ధకమైన చదువును గుణవంతులు మెచ్చుకోలేరు కదా. నలుని వంటివాడు వంటచేసినను ఆ వంటలో  ఇంచుక ఉప్పు వేయకపోతే రుచిఉండదు కదా !


దక్షుడు లేని ఇంటికిఁ బదార్ధము వేఱొక చోట నుండి వే
లక్షలు వచ్చుచుండినఁ పలాయనమై  చను గల్లగాదు , ప్ర
త్యక్షము వాగులున్ వఱద లన్నియు వచ్చిన నీరు నిల్చునే
యక్షయమైన గండి తెగినట్టి తటాకము లోన భాస్కరా !

                         భాస్కరా !  నిర్వహణా సామర్ధ్యం  లేని యజమాని  ఇంటికి ద్రవ్యము వేరొకచోటు నుంచి లక్షలు లక్షలు గా వచ్చినా కూడ వ్యర్ధంగా ఖర్చయి పోతుందే కాని  పైసా కూడ మిగలదు. ఏవిధంగానంటే గండి పడిన చెఱువులోకి ఎన్ని  వాగులు, వంకలు వచ్చి చేరినా ఒక్కచుక్క కూడ నీరు నిలవదు కదా !


దాన పరోపకార గుణ ధన్యత చిత్తములోన నెప్పుడున్
లేని వివేక శూన్యునకు లేములు వచ్చిన వేళ , సంపదల్
పూనినవేళ , నొక్క సరి పోలును , జీకున కర్ధరాత్రి యం
దైన నదేమి ,పట్టపగలైన నదేమియు లేదు భాస్కరా !


                 భాస్కరా !          పుట్టుగ్రుడ్డికి పగలు రాత్రి సమానమే కదా. అట్లాగే పరోపకార లక్షణమే లేని  మూర్ఖునికి ,  (ఇతరుల కొఱకు దానం చేయడం అలవాటు లేని పిసినారి కి )   పేదరికమున్నా , సంపదలు కలిసొచ్చినా వచ్చే పెద్దతేడా ఏముండదు కదా !


దానము సేయగోరిన వదాన్యున కీయఁగ శక్తి లేనిచో
నైనఁ బరోపకారమునకై యొక దిక్కున దెచ్చియైన నీఁ
బూనును ,మేఘుఁడంబుధికి బోయి జలంబులదెచ్చి యీయడే
వాని సమస్తజీవులకు వాంఛిత మింపెసలార భాస్కరా !

                        భాస్కరా ! దానం చేయడానికి అలవాటుపడిన దాత తన దగ్గర లేకపోయినా  ఇంకొకచోటు నుండి తెచ్చి మరీ  దానం చేస్తాడు . ఏ విధంగా నంటే  మేఘుడు సముద్రానికి వెళ్లి నీరు తీసుకొచ్చి వర్షాన్ని కురిపించి జీవులను ఆనందపరస్తున్నాడు కదా !


               దానము సేయనేరని యధార్మికు సంపద యుండి యుండియున్
         దానె పలాయనంబగుట తథ్యము , బూరుగు మ్రాను గాచినన్
దాని ఫలంబు లూరక వృథా పడిపోవవె యెండి గాలిచేఁ
గానలలోన నేమిటికిఁ గాక యభోజ్యములౌట భాస్కరా!

                      భాస్కరా ! దానం చేయడానికి చెయ్యి రాని అధార్మికుని యొక్క సంపద ఎవ్వరికీ ఉపయోగ పడకుండా కొంతకాలానికి నశించిపోతుందనేది సత్యం . ఎందుకంటే బూరుగు చెట్టు కాయలు పండినను అవి తినకూడనివి అవడం వలన , ఎండి  గాలిలో కలిసి ఎగురు కుంటూ  పోవడం మనం చూస్తూనే న్నాం కదా !


నడవక చిక్కి లేమి యగు నాడు నిజోదర పోషణార్ధమై
             యడిగి భుజించుటల్ నరుల కారయ వ్యంగ్యము కాదు పాండవుల్
    గడు బలశాలు లేవురు నఖండ విభూతిఁ దొలంగి భైక్ష్యముల్
గుడువరె యేకచక్రపురిఁ గుంతియు దారొకచోట భాస్కరా !

                  భాస్కరా  ! జరుగుబాటు లేక పేదరికం  కమ్ముకున్నప్పుడు కడుపు నింపుకోవడానికి మానవులు పరులను యాచించడం లో  తప్పులేదు.ఎందుకంటే గొప్పబలవంతులైన పాండవులే సంపద అంతా కోల్పోయిన రోజుల్లో తల్లి కుంతీ దేవి తో కలిసి ఏకచక్రపురం లో ఉంటూ భిక్షాన్నం తోనే జీవించారు కదా!


 పండితులైన వారు దిగువందగ నుండగ నల్పుఁ డొక్కడు
నుద్దండతఁ బీఠమెక్కిన బుధప్రకరంబుల కేమి యెగ్గగున్ ,
గొండొక కోతి చెట్టుకొన కొమ్మల నుండగఁ గ్రింద గండ భే
రుండ మదేభ సింహ నికురంబము లుండవె చేరి భాస్కరా!

                    భాస్కరా ! పండితులైన వారందరు  క్రింద కూర్చొని ఉండగా ఒక అల్పుడొకడు అగ్రాసనం మీద కూర్చొన్నంత మాత్రాన పండితుల కొచ్చిన అవమాన మేమీ లేదు. ఎందుకంటే మదపు టేనుగులు , సింహాలు , గండభేరుండాది పక్షులు  చెట్లక్రింద డగా , చెట్ల కొన కొమ్మల మీద కోతి తిరుగుతూనే ఉంటుంది కదా!   


పరహితమైన కార్యమతి భారము తోడిది యైనఁ బూను స
            త్పురుషుడు లోకముల్పొగడ బూర్వము నందొక ఱాలవర్షమున్
గురియగఁ జొచ్చినన్ గదిసి గొబ్బున గోజన రక్షణార్ధమై
గిరి నొక కేల నెత్తెనట కృష్ణుడు ఛత్రము భాతి భాస్కరా!

                     భాస్కరా! పరులకు ప్రయోజనం కల్గించే పని ఎంత కష్టమైనాదైనా కాని మంచివాడు  లోకం మెచ్చేటట్లుగా  ఆపనిని పూర్తి చేస్తాడు. పూర్వము ఱాళ్ల వర్షం కురుస్తుంటే శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఒక చేతితో గొడుగు వలే ఎత్తి పట్టి , గోవులను , గోపాలకులను రక్షించాడు కదా!


పూనిన భాగ్యరేఖ చెడిపోయిన పిమ్మట నెట్టి మానవుం
డైనను వాని నెవ్వరుఁ బ్రియంబునఁ బల్కరు పిల్వ రెచ్చటం
దానది యెట్లొకో యనినఁ దథ్యము పుష్పము వాడి వాసనా
హీనత నొందియున్నయెడ నెవ్వరు ముట్టుదురయ్య భాస్కరా !

                           భాస్కరా !  మానవుడు ఎంత గొప్పవాడైనను అదృష్టం ముఖం చాటు చేస్తే ఇక ఎవరు అతన్ని పల్కరించరు. ఎక్కడకు పిలవరు. ఏ విధంగా నంటే పువ్వు  వాడిపోయి , వాసన కోల్పోయిన తర్వాత దాని నెవరూ  ఆదరించరు కదా !

పూరిత సద్గుణంబు గల పుణ్యున కించుక రూప సంపదల్
దూరములైన  వాని యెడ దొడ్డగఁ జూతురు బుద్ధిమంతులె
ట్లారయ గొగ్గులైన మఱి యందలి మాధురిఁ జూచి కాదె ఖ
      ర్జూర ఫలంబులం బ్రియము చొప్పడ లోకులు గొంట భాస్కరా !

                   భాస్కరా ! సద్గుణ వంతునకు  అందము లేకపోయినను బుద్ధిమంతులు అతనిని గౌరవిస్తారు. ఖర్జూరకాయ మీద గొగ్గులున్నను (ముడతలుగా ఉన్నను )  దానికి గల మాధుర్యము చేతనే గదా దానిని అందరూ కొంటూ వుంటారు.                        

బంధుర సద్గుణాఢ్యుఁడొక పట్టున లంపట నొందియైన దు
    స్సంధిఁ దలంప డన్యులకుఁ జాల హితం బొనరించు గాక, శ్రీ
గంధపుఁ జెక్క రాగిలుచుఁ గాదె శరీరుల కుత్సవార్ధమై
          గంధము లాత్మఁబుట్టు దఱుగంబడి యుండుట లెల్ల భాస్కరా !

                 భాస్కరా !  గుణవంతుడు తాను కష్టాలను అనుభవిస్తున్నా, ఇతరులకు మేలు చేయడానికే చూస్తాడు కాని కీడు తలపెట్టడు. ఏ విధంగా నంటే గంధపు చెక్క తాను అరిగి, కరిగి పోతూ కూడ  పరిమళాలను వెదజల్లుతూ మానవులకు ఉత్సవ సమయాలలో  ఆనందాన్ని అందిస్తోంది కదా!


బలము దొలంగు కాలమునఁ బ్రాభవ సంపదలెంత ధన్యుడున్
నిలుపు కొనంగ నోపడది నిశ్చయ మర్జునుఁ డీశ్వరాదులం
గెలిచినవాడు బోయలకు గీడ్పడి చూచుచుఁ గృష్ణు భార్యలం
బలువుర నీయడే నిలువబట్ట సమర్ధుడు గాక భాస్కరా !

                    భాస్కరా ! దైవబలము తొలగిపోయిన కాలంలో ఎంత గొప్పవాడైనను వైభవ ప్రాభవాలను నిలుపు కోలేడు. ఎందుకంటే ఈశ్వరుడు మొదలైన  వాళ్లను కూడ గెలిచిన అర్జునుడు శ్రీకృష్ణుని మరణానంతరం అడవిలో అటకాయించిన బోయలను అడ్డుకోలేక , శ్రీకృష్ణుని అంతపురకాంతలను కాపాడలేక  అనేకమందిని బోయలకు అప్పగించాడు కదా !     

బలయుతుడైన వేళ నిజబంధుడు తోడ్పడు గాని యాత డే
 బలము తొలంగెనేని తన పాలిట శత్రు , వదెట్లు పూర్ణుడై,
జ్వలనుడు  కాన గాల్చుతరి సఖ్యము చూపును వాయుదేవుడా
బలియుడు సూక్ష్మదీపమగు పట్టున నార్పదె గాలి భాస్కరా !

                    భాస్కరా ! మానవుడు  ఆర్ధికం గా, శారీరకంగా బలంగా ఉన్నప్పుడు బంధువులు సహాయంగా  అతని వెంటే ఉంటారు కాని బలహీనుడైతే అందరూ అతనికి శత్రువులు గా మారిపోతారు. ఎలాగంటే జాజ్వల్యమాన ప్రకాశంతో అగ్నిహోత్రుడు అడవిని  కాల్చేటప్పుడు వాయుదేవుడు  స్నేహితుడై సహకరిస్తాడు. కాని ఆ  అగ్నిహోత్రుడే చిన్న దీపం గా ఉన్నప్పుడు  వాయువే శత్రువై ఆ దీపాన్ని ఆర్పివేస్తాడు కదా !

భుజబల శౌర్యవంతులగు పుత్రులఁ గాంచిన వారి కెయ్యేడన్
నిజహృదయేప్సితార్ధములు నిక్కము చేకురుఁ గుంతి దేవికిన్
విజయబలాఢ్యుఁ డర్జునుడు  వీర పరాక్రమ మొప్ప దేవతా
              గజమునుఁ దెచ్చి తల్లి వ్రత కార్యము దీర్పఁడె తొల్లి భాస్కరా!    (76 )

                 భాస్కరా ! భుజ బల పరాక్రమవంతులైన కుమారులను గన్నవారికి అనుకున్న కోరికలు తీరిపోతాయి. ఇది నిజము . ఎందుకంటే కుంతీదేవి కి పరాక్రమ సంపన్నుడైన అర్జునుని వంటి కుమారుడు కలిగాడు కాబట్టే   దేవలోకం నుండి ఐరావతాన్ని తీసుకొచ్చి ,  తల్లి చేసే వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయించాడు కదా ! 




                                                                                           
                                                                                              నాల్గవ భాగం త్వరలో      ---
******************************///////////////***********************  *****************

Friday 20 June 2014

శతక సౌరభాలు - 3 మారన భాస్కర శతకము - 2


  శతక సౌరభాలు - 3                                  
                       
                                    మారన   భాస్కర శతకము -2


                                      
                                                                    ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్



ఎట్టుగ బాటుపడ్డ నొక యించుక ప్రాప్తము లేక వస్తువుల్
పట్టుపడంగ నేరవు ; నిబద్ధి సురావళిఁ గూడి రాక్షసుల్
గట్టుపెకల్చి పాల్కడలిఁ గవ్వము చేసి మధించి రంతయున్
వెట్టియె కాక యేమనుభవించిరి వారమృతంబు? భాస్కరా !
                      
                     భాస్కరా ! ఎంతగా ప్రయత్నించినా కూడ దాన్ని అనుభవించే ప్రాప్తం లేకపోతే ఆ ఫలితం మనకు దక్కదు. ఎలాగంటే దేవతలతో  కలిసి రాక్షసులు  మందర పర్వతాన్ని పెకలించి తెచ్చి దాన్ని కవ్వంగా చేసి పాలసముద్రాన్ని మధించారు. వీరు పడిన శ్రమంతా వెట్టిచాకిరీ అయిపోయింది కాని రాక్షసులు అమృతాన్ని ఒక్క చుక్క కూడ రుచి చూడలేక పోయారు గదా!

ఎడపక దుర్జనుం డొరుల కెంతయుఁ  గీడొనరించుఁ గాని యే
యెడలను మేలు సేయడొక యించుక యైనను జీడపుర్వు దా
జెడఁదిను నింతెకాక పుడిసెండు జలంబిడి పెంప నేర్చునే
పొడవగుచున్న పుష్పఫల భూరుహ మొక్కటి నైన భాస్కరా !

                         భాస్కరా ! ఈ లోకం లో చెడ్డవాడు పరులకు ఎప్పుడు హాని చేయడానికి ప్రయత్నిస్తాడే కొంచెమైనా ఉపకారం చెయ్యడు. ఏ విధంగా నంటే చీడపురుగు చక్కగా పూలు కాయలతో పెరుగుతున్న పచ్చని చెట్టును సర్వనాశనం చేస్తుందే కాని దానికి ఒక పుడిసెడు నీళ్లు పోసి పెరగడానికి  దోహదం చెయ్యదు కదా !

                        ఎడ్డె మనుష్యుఁడే మెఱుఁగు  నెన్ని దినంబులు గూడి యుండినన్
దొడ్డ గుణాఢ్యు నందుగల తోరపు వర్తన లెల్లఁ బ్రజ్ఞ బే
ర్వడ్డవివేకరీతి; రుచి పాకము నాలుకగా కెఱుంగునే
          తెడ్డది కూరలోఁ గలయ ద్రిమ్మరు చుండిననైన భాస్కరా !

                        భాస్కరా ! మూర్ఖుడైన వాడు ఒక  మంచివాని తో కలిసి ఎన్నిరోజులు తిరిగినా  ఆ మంచివాని లోని గొప్పతనాన్ని ఏ మమాత్రం గ్రహించలేడు. ఎందుకంటే  కూర యొక్క రుచిని నాలుకకు తెలుస్తుంది గాని  ఆ కూరను కలియపెట్టే తెడ్డు( గరిటె ) కు తెలియదు కదా.

ఎప్పుడదృష్టతా మహిమ యించుక పాటిలు నప్పుడింపు సొం
పొప్పుచు నుండుఁ గాక యది యొప్పని పిమ్మట రూపు మాయుఁగా
నిప్పున నంటియున్న యతి నిర్మలినాగ్ని గురుప్రకాశముల్
దప్పిన యట్టి బొగ్గునకుఁ దా నలుపెంతయుఁ  బుట్టు భాస్కరా!

                             భాస్కరా !ఎప్పుడు అదృష్టము కలిసి వస్తుందో అప్పుడు జీవితం లో వెలుగు వస్తుంది. అది పోతే చీకటే మిగులుతుంది. ఎలాగంటే నల్లగా ఉండే బొగ్గు  అగ్ని తో  కూడి ఉన్నప్పుడు  గొప్పగా ప్రకాశిస్తుంది.  అగ్ని సంబంధము ఆరిపోతే   పూర్వపు కాంతులు తగ్గి  నలుపు రంగే కదా మిగిలేది.

ఏ గతిఁ బాటువడ్డ గలదే భువి నల్పునకున్ సమగ్రతా
భోగము భాగ్యరేఖ గల పుణ్యునకుం బలె ; భూరి సత్వ సం
యోగ మదేభ కుంభ యుగళోత్థిత మాంసము నక్కకూన కే
      లాగు ఘటించు ?సింహము దలంచినఁ జేకుఱుఁ గాక ! భాస్కరా !

                              భాస్కరా ! ఈ భూమి మీద సంపూర్ణ సౌఖ్యము నందెడి భాగ్యరేఖ పుణ్యాత్మునకు లభించును గాని అల్పునకు ఉండదు . ఎందుకంటే మదపు టేనుగు కుంభస్థలము నందుండెడి మాంసమును సింహము  కోరుకున్న యెడల చేకూరును గాని నక్కపిల్ల ఎంత ప్రయత్నించినను  లాభము లేదు గదా !

ఏడ ననర్హుఁ డుండు నటకేగుఁ ననర్హుడు  నర్హుడున్నచో
జూడగఁ నొల్ల డెట్లన; నశుద్ధ గుణ స్థితి నీఁగ పూయముం
గూడిన పుండుపై నిలువ గోరిన యట్టులు నిల్వనేర్చునే
సూడిదఁ బెట్టు నెన్నుదుటి చొక్కపు గస్తురి మీఁద భాస్కరా!

                    భాస్కరా ! ఒక అయోగ్యుడు ఎక్కడ  అయోగ్యుడుంటే అక్కడికే చేరతాడు గాని యోగ్యుడు ఉన్న చోటుకు వెళ్ళడు.  ఈగ చీము పట్టిన పుండు మీద వాలుతుంది కాని నుదుటి మీద పెట్టుకున్న కస్తూరి బొట్టు మీద వ్రాలదు కదా !

ఏల సమస్త విద్యల నొకించుక భాగ్యము గల్గి యుండినన్
జాలు ననేక మార్గముల సన్నుతి కెక్క నదెట్లొకో యనన్
ఱాలకు నేడ విద్యలు తిరంబుగ దేవర రూపు చేసినన్
వ్రాలి నమస్కరించి ప్రసవంబులు వెట్టరె మీద భాస్కరా !

                     భాస్కరా !  సమాజం లో  ప్రసిద్ధి కెక్కాలంటే అదృష్టం కలిసి రావాలి గాని ఎన్ని విద్యలు నేర్చుకుంటే మాత్రం ఏం ప్రయోజనం. ఎచ్చటనో ఉన్న బండరాళ్లు ఏ విద్యలు నేర్చుకోక పోయినా  వాటి అదృష్టంచేత దేవతా ప్రతిమలు గా చెక్కబడగా ,జనం వాటికి పొర్లు దండాలు పెడుతూ , పూజలు చేస్తున్నారు కదా !

కట్టడ దప్పి తాము చెడుకార్యముఁ జేయుచు నుండి రేనిఁ దో
బుట్టిన వారినైన విడిపోవుట కార్యము ; దౌర్మదాంధ్యముం
దొట్టిన రావణాసురుని తో నెడబాసి విభీషణాఖ్యుఁ డా
పట్టున రాముఁజేరి చిరపట్టము గట్టుకొనండె భాస్కరా !

                   భాస్కరా ! నీతి తప్పి ప్రవర్తించేవాడు తోడబుట్టినవాడైనా వదలి వేయాలనేది నీతి. రావణాసురుడు మదం తో దుర్మార్గపు పనిచేస్తే అతని తమ్ముడైన విభీషణుడు అతన్ని వదిలివేసి రామచంద్రుని చేరి , లంకానగరానికి రాజైనాడు కదా !

కట్టడయైన యట్టి నిజకర్మము చుట్టుచు వచ్చి యేగతిం
బెట్టునొ పెట్టి నట్లనుభవింపక తీరదు; కాళ్ళు మీదుగాఁ
గిట్టక వ్రేలుఁడంచుఁ దలక్రిందుగఁ గట్టిరె యెవ్వరైన నా
చెట్టున గబ్బిలంబులకుఁ జేరిన కర్మము గాక భాస్కరా!

                           భాస్కరా ! జీవుడు  విధి విహితమైన పురాకృత కర్మాన్ని ననుసరించి వచ్చెడి ఎంతటి కష్ట నష్టాలనైనా అనుభవించక తీరదు. గబ్బిలాలు చూడండి . ఎవ్వరూ తమని తలక్రిందుగా చెట్లకు కట్టకపోయినా  పూర్వ జన్మ కర్మ వలన అవి తల క్రిందులుగా వ్రేలాడుతూనే ఉంటాయి కదా !

కట్టడ లేని కాలమునఁ గాదు శుభం బొరులెంత వారు చే
పట్టిననైన మర్త్యునకు భాగ్యము రాదను టెల్లఁ గల్ల,కా
దెట్టని పల్కినన్ ;దశరథేశ వశిష్టులు రామమూర్తికిన్
బట్టముగట్టగోరి రది పాయక చేకుఱె నోటు భాస్కరా!

          భాస్కరా ! మానవు లకు దైవానుగ్రహం లేనికాలంలో మానవ ప్రయత్నం ఎంత చేసినా అది ఫలించదు. ఎందుకంటే  దశరథమహారాజు , వసిష్టమహర్షి నిర్ణయించి శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం చేయాలని ఎంతో ప్రయత్నించారు. కాని దైవం వక్రించడంతో  ఆ కార్యక్రమం జరగలేదు కదా !

కానక చేరబోలఁ డతి కర్ముడు నమ్మిక లెన్ని చేసినం
దానది నమ్మి వానికడ డాయగ బోయిన హానివచ్చు న
చ్చో నదియెట్లనం ; గొఱఁకు చూపుచు నొడ్డిన బోను మేలుగాఁ
బోనని కాన కాసవడి పోవుచుఁ గూలదెఁ కొక్కు భాస్కరా !

                 భాస్కరా ! పందికొక్కు  తనను చంపడానికి ఏర్పాటు చేసిన బోనులోని మేతను చూసి  ఆశ పడి  వెళ్ళి,  అందులో చిక్కుకొని మరణిస్తోంది. అలాగే ఎన్ని నమ్మకాలను చూపించినా దుర్మార్గుడి వద్దకు వెళ్లి స్నేహం చేస్తే హాని సంభవింస్తుది .

కాని ప్రయోజనంబు సమ గట్టదు తా భువి నెంత విద్యవాఁ
డైనను దొడ్డరాజు కొడుకైన నదెట్లు ; మహేశు పట్టి వి
ద్యానిధి సర్వవిద్యలకుఁ దానె గురుండు వినాయకుండుఁ దా
నేనుగు రీతి నుండియు నదేమిటి కాడడు పెండ్లి భాస్కరా !

                  భాస్కరా ! ఈ భూమి మీద ఎంత విద్యావంతుడైన. మహారాజు కుమారుడైన కూడ  కాలం కలిసిరాకపోతే కాని పని ఏ నాడు కాదు . ఎందుకంటే పరమేశ్వరుని కుమారుడు , సమస్త విద్యలకు నెలవు , సకల విద్యలకు అధిపతి యైన వినాయకుడు ఏనుగంత బలవంతుడయ్యు ఎందుకు పెళ్ళి చేసుకోలేకపోయాడు. ?

కారణమైన కర్మములు కాక దిగంబడ వెన్ని గొందులం
దూఱిన నెంతవారలకు ; దొల్లి పరీక్షితు శాపభీతుడై
  వారధి నొప్పు నుప్పరిగపైఁ బదిలంబుగఁ దాగి యుండినం
        గ్రూర భుజంగ దంతహతి గూలఁడె లోకు లెరుంగ భాస్కరా !  

                      భాస్కరా ! అనుభవించాల్సిన కర్మ ను భూమి పై అనుభవించాల్సిందే. ఎంతటి గొప్పవారైనా,  ఏ సందుల్లో, గొందుల్లో దూరి దాక్కున్నా, పూర్వ జన్మ కర్మలు పూర్తి గా అనుభవించాల్సిందే. కాని ఏమీ మిగిలిపోవు. పూర్వము పరీక్షిన్మహారాజు  శాప భయం చేత పారిపోయి , సముద్ర మధ్యంలో మేడ మీద భద్రంగా దాక్కున్నా  భయంకర కాలనాగు కాటుకు బలై పోవడం లోకానికి తెలిసిన విషయమే కదా !

గిట్టుట కేడఁ గట్టడ లభించిన నచ్చటఁ గాని యొండుచోఁ
బుట్టదు చావు ? జానువుల పున్కల నూడిచి కాశిఁ జావఁ గా
లగట్టిన శూద్రకున్ భ్రమలఁ గప్పుచు దద్విధి గుఱ్ఱమౌచు నా
పట్టునఁ గొంచు మఱ్ఱి కడఁ బ్రాణముఁ దీసెగదయ్య భాస్కరా !

                 భాస్కరా ! మనిషి ఎప్పుడు ఎక్కడ ఎలా చావాలని రాసిపెట్టి ఉంటే అలానే చస్తాడు కాని తాను కోరుకున్న చోటున జీవునకు మరణము సంభవించదు. ఎలాగంటే పూర్వము శూద్రక మహారాజు కాశీలో మరణిస్తే ముక్తి కలుగుననే కోరికతో కాశీ కి చేరాడు. నడవడానికి వీలు లేకుండా మోకాలి చిప్పలు తొలగించుకొని మరీ కూర్చున్నాడు.  కాని ఈశ్వర మాయ వలన  ఒక గుఱ్ఱము అతన్ని తీసుకెళ్ళి ,ఒక మఱ్ఱిచెట్టు కు ఢీ కొనడం మూలంగా ఆమహారాజు మరణించాడు. విధి విలాసమంటే ఇదే నేమో !

  ఘనుఁడగు నట్టివాడు నిజకార్య సముద్ధరణార్ధమై మహిం
బనివడి యల్పమానవునిఁ బ్రార్ధనఁ చేయుట తప్పుగాదుగా ,
యనఘతఁ గృష్ణజన్మమున నా వసుదేవుఁడు  మీదుటెత్తుగా
గనుగొని గాలిగాని కడ కాళ్ళకు మ్రొక్కడె నాడు భాస్కరా !

                       భాస్కరా ! గొప్పవాడు తన కార్యసాధనకోసం ఒక నీచుని ప్రార్ధించడం లో తప్పులేదు. ఫూర్వము శ్రీ కృష్ణ భగవానుని జన్మసమయంలో ఆయన తండ్రియైన వసుదేవుడు కంసుని ఎత్తుకు పై ఎత్తుగా గాడిద వెనుక కాళ్లకు నమస్కరించి తన పనిని నెరవేర్చుకున్నాడు గదా!

ఘనుడొక వేళఁ గీడ్పడిన గ్రమ్మఱ నాతని లేమి బాపగా
గనుగొన నొక్క సత్ప్రభువు గాక నరాధము లోపరెందఱుం;
బెనుఁ జెఱువెండినట్టి తఱిఁ బెల్లున మేఘుడు గాక నీటితోఁ
దనుప దుషారముల్ శతశతంబులు చాలునటయ్య భాస్కరా!

                  భాస్కరా !  ఒక గొప్పవానికి కష్టాలు వస్తే వానిని తీర్చడానికి ఒక మహారాజు కావలసిందే కాని   అల్పులకెందరకైననూ అది సాధ్యంకాదు. ఎందుకంటే పెద్దచెఱువు ఎండిపోతే  తిరిగి దానిని నింపడానికి  మేఘుడు వర్షించాలి కాని  మంచుబిందువులు ఎన్ని కురిస్తే మాత్రం చెఱువు నిండుతుంది.


చంద్ర కళావతంసు కృప చాలనినాడు మహాత్ముడైనఁ దా
సాంద్ర విభూతిఁ బాసి యొక జాతి విహీనునిఁ గొల్చియుంట యో
గీంద్ర నుతాంఘ్రి పద్మ మతి హీనత నొందుట కాదుగా ; హరి
శ్చంద్రుడు వీరబాహుని నిజంబుగం గొల్వడె నాడు భాస్కరా ! (40 )

                         యోగీంద్రుల చేత స్తుతించబడెడి పాదపద్మములు గల భాస్కరా ! ఈశ్వరానుగ్రహము చాలని రోజున  ఎంత మహానుభావుడైన సకల సంపదలను పోగొట్టుకొని  అల్పుల వద్ద సేవ చేయవలసిందే కదా. అలనాడు మహారాజైన హరిశ్చంద్రుడు  కాలము కలిసి రాకయే కదా వీరబాహుని సేవించవలసి వచ్చినది. తెలివి తక్కువతనం వలన కాదు గదా !

చక్కఁ దలంపఁగా విధి వశంబున నల్పుని చేతనైనఁ  దా
జిక్కి యవస్ధలం బొరలుఁ జెప్పగరాని మహాబలాఢ్యుడున్
మిక్కిలి సత్త్వసంపదల మీఱిన గంధగజంబు మావటీఁ
డెక్కి యదల్చి కొట్టి కుదియించిన నుండదె యోర్చి భాస్కరా !

                        భాస్కరా !  ఆలోచిస్తుంటే ఎంత బలవంతుడైన దైవయోగం లేకపోతే బలహీనుని చేతిలో చిక్కి నానాకష్టాలు పడతాడనిపిస్తోంది. ఏ విధంగా నంటే మిక్కిలి బలముగల గజరాజు సైతం మావటివాడెక్కి, అదిలించి , అంకుశం తో కొట్టి కూర్చోపెడుతుంటే  సహిస్తోంది కదా !

                                                     చదువుతూ ...ఉండండి . మిగిలినవి త్వరలో........

*********************************************************************************